19, జూన్ 2012, మంగళవారం

ధృవ తార

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


సర్వ శక్తి స్వరూపుడగు నారాయణుని పూజింపలేని చేతులేల?
సర్వ విజ్ఞానవంతుడగు శ్రీహరిని మనమందు తలుపలేని మనసు యేల?
సర్వ చైతన్య వ్యాపకుడగు విష్ణు చర్యలు కానరాని కన్నులేల?
సర్వోన్నతుడగు ఆ పురుషోత్తముని భక్తితో ఆకట్టుకోని ఆత్మ ఏల?

భక్తవత్సలుడగు ఆ పరమాత్మ వాత్సల్యమెరుగలేనన్న
భక్తవరేణ్యులగు ముని పుంగవుల బోధలెల్ల వినవలె
భక్త సులభుడగు నారాయణ తత్త్వమెల్ల తెలిసి
భక్తి పాశముతో మనమున శ్రీహరిని బందీగ చేసుకొనవలయు.

అట్టి భక్తాగ్రేసరులలో ప్రధమునిగా ధృవుని తెలిసి
పట్టుదలతో భక్తి పెంపు చేసుకుని మన్ననలందవలె!
బాల్య దశ యందే ఐదేళ్ళ వయసు నాడు
అమూల్య కోరికతో తన తండ్రి అంకంబునందు
శయనింప తండ్రి దరికేగ యాతండు
నెయ్యముగ గారవింపక చెయ్యని త్రోసిరాజనియె.
ధృవుడు కినుక వహించి
ధృడచిత్తముతో తన మనమందు
నిలుపుకున్నట్టి గరుడ వాహనారూఢుండగు మహా విష్ణు
పూజ సల్ప కానలకున్ జని ఘోర తపమాచరింప
కాలమే ఆగి దేవ గణాన కలకలము చెలరేగ
స్వయంభువుయగు విష్ణువే ధృవుని కడకేగి తన
పాంచజన్యమును తాకించి తపము చాలింప జేయించి
తనదు కోరిక తెలుపుమనిన, యంత ధృవుండు తనదు
అసలు కోరిక మరచి తానెన్నటికి సద్భక్తిపరునిగా
తన ధ్యాన చింతనతో వుండు వరమీయమని కోర,
తని నిహలోక బంధములనుండి తప్పించి
నక్షత్ర మండలంబందు ధృవతారగా వెలుగొందునట్లు చేసి
భక్త సులభుడుగా విష్ణువు కీర్తి పొందినాడు.

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి