11, జూన్ 2012, సోమవారం

ఆత్మ ఘోష

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ  నమః
 
హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి
కష్టాల కొలిమిలో కడవరకు కాలినాను
మెరుగుపడినంతనె సమ్మెటకు ఒరిగినాను
అంతలోనే హారమై సుమాలు కంఠాన అమరినాయి
పలువురి మన్ననలే మిన్ను ముట్టాయి
హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి
ఏడేడు జన్మలకు ఒక్కటిగా నున్చుమని
నిత్య పూజలు చేసి లక్ష్మీ తులసినే కోరాను
కోరినవి రాక కూడుకున్నవే యిచ్చి  నిధిగానున్చి
నింగి నిశీధిలో వెడలిపోయి మరునాటి
పసిడి కాంతులలో ఉషస్సుతో  కలగలిసినాను

హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి

బంగారానికి అన్వయంగ:

ప్రపంచంలో అత్యంత విలువైన, అందాన్నినుమడింపచేయు మిక్కిలి ప్రజాభీష్టము అయిన లోహము బంగారము. అట్టి లోహము కలిగియున్నవాడు సూర్యభగవానుడు . అందుననే ఆయనను హిరణ్యగర్భుడు అంటారు. హిరణ్యమనగా పసిడి.ఆ ఆదిత్య శక్తి వలననే బంగారము (హేమము) దివి నుండి భువికి వచ్చింది. భూవాసులన్దరకూ హేమాకర్షితమై ప్రేమి అయినది. అంతటి ప్రేమమయి యైనప్పటికి, దాని కష్టాలు దానికున్నాయి. సహజంగా ముడి లోహము మానవులు ముడువరు కదా! అందుకై అగ్నిపూజ్యము జేసి కొలిమిలో కాల్చి మెరుగు పడి పైడిఛాయ వచ్చినంతనే సమ్మెట దెబ్బల నోర్చుకొని సాగపడి అచేతన స్థితిలోనున్న తరుణాన వారి వారి కనుగుణ కంఠమాలలుగా ధరియించి, పలువురి మన్నన(మెప్పు)లు పొంది కీర్తి నొందుతున్నది. నిత్య తులసి మాత పూజ చేసే రుక్మిణి దేవి జన్మజన్మలకు శ్రీ కృష్ణుని పొందునే కోరినప్పుడు, సత్యా దేవి బంగారంతో తులతూచి స్వంతం చేసుకోలేక కడకు తులసిచేత కీర్తినొంది  పుణ్య స్త్రీలై ఆభరణభూషితులై అవతార పరిసమాప్తినాడు అగ్ని పునీతులై పసిడి కాంతులలో ప్రక్షాళితమై ఉషః కాంతిలో కలిసి హేమము నిష్క్రమించింది.

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి