19, జూన్ 2012, మంగళవారం

శుశ్రూష

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఆది మధ్యాంత రహితుడగు ఆ సర్వేశ్వరుండు
ఆది గురువై వేద విజ్ఞానమంతయు తెలిసి
     అదియు గురు ముఖతః తెలియగానెంచి
     కంసాది రాక్షస సంహార తదనంతరంబు
ఉగ్రసేనుని మధుర పట్టాభిషిక్తునింజేసి
తన అన్న బలరామునితో కూడి సాందీప ముని
     యొద్దకుంజనియె జ్ఞానాభిలాషియై.

అవ్విధంబుగ బలరామకృష్ణులు గురు సాందీపునియొద్ద విద్య గరపి
అరువదినాల్గువిధంబులగు కళలందు ఆరితేరి గురు మెప్పునొంది
     అద్వితీయంబగు కీర్తిబడసి గురుదక్షిణగా తమ కోరికేమిటని
     ఆ ద్విజుని ప్రశ్నింప, యాతన్డు సముద్ర స్నానమాచరించుటకేగిన
తనయు నీట మునిగి చనిపోయె గాన, ఎటులైన తన కుమారుని
సజీవునిగ జేసి తనకప్పగింపుమని కోరె!

అంత సర్వవ్యాపియగు ఆ పరమేశ్వరుండు తన మామ 
సముద్రుని తన గురు పుత్రునీయమని కోర,
     పాంచజన్యుడను రాక్షసుండు సముద్ర శంఖువై ఆ బాలునిన్ చేరదీసె
     నని విన్నవించె. నంత ఆ కృష్ణుండొక్కపరి సముద్రమున దూకి
ఆ రాక్షసున్ బరి మార్చి ఆ శంఖువునే పాంచజన్యమను
పేర తన ఆయుధంబుగ చేసికొనియె.

కృష్ణుడావిధంబుగ శంఖంబునొంది అది పూరించినపుడెల్ల
దేవతలకెల్లరకు శక్తి పెరిగి, దనుజులెల్లరు
     శక్తి హీనులై అసుర జాతి అంతమయ్యె!
     అంత సోదర ద్వయంబు యమపురికేగి
తమ గురు పుత్రు నాత్మ తమకొసగుమని యా యముని వేడ
యాతండటులనే యొసంగ ఆ గురు పుత్రుని వెంట గొనిపోయి
     తమ గురు సాందీపునకప్పగించి గురు ఆశీస్సులందె.

తమ గురు చెంతనున్నంత వరకు కృష్ణుండు ఏనాడు
     తాను భగవానునంశయని విన్నవించకపోయె. 

అదియె శిష్య శుశ్రూషయని తలచి గురునాధిక్యతను గౌరవించె.

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి