18, జూన్ 2012, సోమవారం

పుండరీక భక్తి

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

తమ ప్రేమ గెలుచుకొమ్మనుచు బిడ్డలను శిక్షించు తలిదండ్రులు గలరె?
అటులనే ఆ భగవాను సదా అన్వేషకులగు తన భక్తులను దరికి చేర్చుకోడా?
వ్యాస దశకమను వేదాంత గ్రంధాన ఆత్మ పరమాత్మ అనుబంధంబు ఆ కృష్ణునెజామనివలె వర్ణించె.
తన భక్తులనుద్ధరింపబూని దివి నుండి భువికి దిగి
మానవాతీత కష్టాలకోర్చి గోకులాన్ని కాపాడి ఆ యశోద తల్లికి
విశ్వరూప సందర్శనము చెయగలేదె?
శాంతి కాముకతతో కురుక్షేత్ర యుద్ధ నివారణకు రాయబార దౌత్యంబు చేయలేదె?
తదనంతరమర్జునునకు రధ సారథిగా మారి యాతనికిం గీతాబోధ చేయగలేదె?
అటుల మానవాత్మతో మనసు పెంచుకుని
పరమాత్మ తనకు తానె ఎల్లప్పుడు మనతోనుండుట సత్యంబుగాదె?
కపటము లేని ప్రేమ భక్తి తత్పరుని
లంపటములనుండి తప్పింప జూచి ఆధ్యాత్మికానంద భావనలలో తేల్చి
తన భక్తులకనుక్షణము రక్ష
కూర్చి
భక్తిపరులేదొసంగిన అదియె స్వీకరించి
భక్త సులభునిగా పేర్గాంచిన ఆ ఆదిదేవు మహిమ తెలియలేరె?
ఆనాడు తలిదండ్రుల ఆనతితో భక్తి పారవశ్యమున
ఆ కృష్ణునిన్ భజన సేయ తలిదండ్రుల పాదాల
నొత్తుచు ఆ పుండరీకుండు తని పనిలో నిండియుండ
ఆ శ్రీహరి యాతని భక్తికి మెచ్చి అట నిల్చుండ
అది చూచి తన వారి నిద్రకు భంగము కల్గునని యెంచి
ఆ భగవానునికాసీనమీయక ఒక ఇటుక రాయినచట చూపి
నిలువమనియె ఆ పుండరీకుండు
అంతటా హరి పుండరీకుని పితృ భక్తి శ్రద్ధలను మెచ్చుకుని
ఏదేని వరము కోరుకొమ్మనగా, ఇపుడు వున్న యటులె
ఎల్లప్పుడుండుమని కోరినంత ఆ స్వామి అటులనే
కటాక్షించి నేటికిన్ పాండురంగడను పేర
అశేష ప్రజా భక్త దర్శనంబొసంగుచూ
మహారాష్ట్రమందున్న పంధారేపూర్ నందు వెలసె
అవ్విధంబుగ ఆ ఆది దేవుడు భక్త సులభుండని
దైవభక్తి కన్న మాతాపితృ భక్తి ముఖ్యమని చాటినాడు.
ఇది పరమ గురుడు చెప్పిన మాట తెలుసుకోరా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి