8, జూన్ 2012, శుక్రవారం

అంతర్ముఖం (కుశల ప్రశ్నలు)

ఆరు పదులు వయసు దాటి షితో షికారుకేగి
ఆరు బయట హుషారుగా నడుస్తున్న వేళ
అదిగో మా చిన్న నాటి వీధి బడి చూపి ముందుకేగ
ఆగాగుమంటూ ఒక గద్గదస్వరమే పిలువ
ఎవరోనని దగ్గరకేగి పరికించి పలుకరింప
పాడుబడ్డ వీధి బడి బావురుమని ఏడ్చి నిట్టూర్పుతో
నిలబడ్డ నన్ను చూచి పాత జ్ఞాపకాలే గురుతురాగ
చిన్ననాటి తలపులతో నాకానాటి పంతులేసిన
గోడకుర్చి శిక్షకు తానాలంబనమైనందుకు
వ్యధ చెంది కూలిన ఆ బడి గోడే కుశలమడిగి తెలుసుకొంది

విచలితుడై ముందుకేగ...

నేరేడు పండొకటి నా నెత్తి పై బడ
కనులెత్తి జూడ పాత జ్ఞాపకాలు గురుతురాగ
ఆ నాటి సెలవులలో నెలవులే వీడి
కలివిడిగా అందరము కొమ్మలే దులిపి
క్రింద పడిన నల్లని వేడి వేడి నేరేడులన్ని
ఊదుకుంటూ ఆత్రుతగా నోటికందించు
విషయమే గుర్తు రాగ నా కుశలమడిగి తెలుసుకొంది

ఆ వృక్ష రాజమునకు ఎంత ప్రేమో నాపై అని అనుకుంటూ ముందుకేగ...

మండు వేసవి సైతము నిరంతర ఊట
జలముతో మెండుగ నీరందించు
ఊరి బావి పరిశీలనకు ఉత్సుకతతో నేజూడ
పుష్కలముగ నీరుండి పులకించసాగ
పాత జ్ఞపకాలె మనసుపులుముకోగ
మడి బట్ట కట్టి బిందె భుజాన్నెట్టి వడివడిగ
హడావిడిగా వంటకై నీరు చేది
తెచ్చేటి మా తల్లి సేవలన్ని తలచి
అహర్నిశలు నీటికై పెదనాన్న తపన తలచి
విలపించు మనసుతో బావి గిలకల
బావురు చప్పుళ్ళ దాహార్తి కేకలల్లో
బొంగురు గొంతుకతో ఒక గిలక
నను జూచి పేరుపేర అందరి కుశలమడిగి
తెలుసుకొని చాన్నాళ్ళ తన బాధ వెళ్ళగక్కింది!
ఆహా! ప్రకృతి ఎంత కరుణామయమై నిరతము రసమయమగు
జీవనము గడిపేటి మా బోంట్ల మంచి చెడుల విచారించు
సృష్టి చిత్రమిదియెనేమొ!

అటుల ఆలోచనము చేసి నడుచుచున్నంతలో...

ఓ ఆడ మనిషిని చూచి పాత జ్ఞాపకాలే గురుతురాగ
మా అమ్మ మనసులో కదలాడ, వరుస గర్భాలతో
ఆరోగ్యమె క్షీణించి చివరి మూడు సంతుకు
క్షీర లభ్యతె లేని కారణాన గో క్షీరము కొరకు
ఇల్లిల్లు తిరిగి సేకరించి దెచ్చి పిల్లలకు పట్టివ్వ
అవియు సరిపడక మేక పాలు వాడుక చేయ సాగ
పరాయి పిల్లలనికూడ చూడక తన పిల్లలను
మరిపించి తన యజమాని పిల్లలకు తన స్తన్యమందించి
మా అమ్మనె మురిపించి ప్రాణ శక్తినందించి
జీవ శక్తినిచ్చి త్యాగనిరతి చూపినట్టి ఆ మనిషే
నన్ను జూచి కుశలమడిగి తెలుసుకొని
మురిసిపోయి ముందుకేగె

ప్రకృతి పంచ భూత శక్తులతో
మంత్ర తంత్ర యంత్రములతో
శిల్పి చెక్కిన గండశిలకే ప్రాణ ప్రతిష్ఠ చేసి
కొండ మీద గుడి కట్టి, గుండె నిండ మనిషి
నిల్పుకొని మనసార పూజించి ధన్యత చెంద
నిరతము విద్యా వినయ వివేకముల
నొసగి జ్ఞానవంతులుగా తీర్చి దిద్ది శ్రమయే
తమ పరమావధిగ జీవ శక్తినిచ్చి
నిరతము మనలను సేవించు ప్రకృతి
శక్తులగు బడి-బావి-బానిస వంటివి
శ్రమయేవ జయతియని తెలియవలయు
అట్టి శక్తులను విస్మరింపవలదు ఎన్నటికి
మానవతను చూపి నవ యువతకు దారి చూపు
ఎప్పటికీ ఇంకెప్పటికీ!

పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి