ఆది నుండి ఆదిత్యు వీక్షణాన భూవాసులకు
"విచిత్ర స్పురద్రత్న మాలా కిరీటం
కిరీటోజ్వలచ్చంద్ర రేఖా విభుషణం
విభూషైక భూషం భవధ్వంసహేతుం
గణాధీశ మీశాన సూనుం తమీడే!"
(ఇతి శంకరాచార్య విరచిత గణేశ భుజంగ స్తోత్రం)
దినకరుడై దినరాజుగా పూజింపబడుచుండ
ఆ నాడేనాడో దేవ రాక్షస గణములెల్ల
అమృత సముపార్జనకై క్షీరాబ్ధి చిలుకుటకు
ఆ మందర నగముతో మధన సమయాన
ఆది యందు అమ్మ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించగా
అమ్మ తోబుట్టువుగా అంద చందాల చంద్రునిగా
ఆవిర్భవించి గగన మండలాన రేరాజుగ మారి
అవనిజనులకందరకు చందమామ అయ్యాడు
అటుల భూమితో దగ్గరగా సూర్య ప్రదక్షణ
అనవరతము చేయుచూ అష్ట గ్రహ కూటమిలో చేరి
సూర్య కిరణ ప్రభావితుడై వివిధ కళలతో
మాసానికొక మారు పూర్ణ చంద్రునిగ మారి నెలరాజుగా
గగనాన పయనించి వుర్విజనులకు శీతల
కాంతి పుంజములు పంచి ఆనంద ఖేలనలకు
నాందియై, తండ్రి సాగరుజూచినంత
అమితోత్సాహభరితుడై ఆలింగనముజేయ
తన దీర్ఘ బాహు కెరటాల బందీగా చేయుటకు
ఉవ్వెత్తు తరంగ హోరుతో భూమండలము
కబళించి 'త్సునామి'ల ననాయాసంబుగా సృష్టించి
భూజనులు విభ్రమమునొంద క్షణకాలమందె
పచ్చటి ప్రకృతిని విలయాగ్ని కీలలతో
బడబాగ్ని పుట్టించి వొడ్డునున్న దుడ్డుబిడ్డ
లెల్లరను విగత జీవులుగాజేసి ఘోరకలిసల్పే
జగన్నియంతలవలె తండ్రి తనయుల దుష్కృత్యంబులు మాపి
తొలిసంధ్య వెలుగులు చూచు జపానుకిట్టి ఆపద
సంభవించుట గర్హనీయమైనదై అందరకు
వొజ్జయైన ఆ విఘ్నరాజుకు తనశిరమునందున్న
చంద్రుని మందలించి మమ్మందరను కాపాడి
నాటి కంసమామ వంటి చందమామ తుంటరి
తనముమాపుమని చరణ శరణ పూజితులు కావలె!
తిరిగి మానసిక ఉత్తేజితులు కావలె!
"విచిత్ర స్పురద్రత్న మాలా కిరీటం
కిరీటోజ్వలచ్చంద్ర రేఖా విభుషణం
విభూషైక భూషం భవధ్వంసహేతుం
గణాధీశ మీశాన సూనుం తమీడే!"
(ఇతి శంకరాచార్య విరచిత గణేశ భుజంగ స్తోత్రం)
పోలూరు బాబురావు, నూజివీడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి