14, ఫిబ్రవరి 2021, ఆదివారం

శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్ర భావార్ధవిశ్లేషణమ్

                              శ్రీమాత్రే నమః.   

 ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమః            శ్రీఅపర్లాయైనమః                                     శ్రీలలితాంబికాయైనమః

 

 

ముందుమాట

                                మానవునకు ప్రశాంతిని ఆధ్యాత్మిక పుష్టిని కలిగించుటకు అపరవిష్ణ్వాoశసంభూతుడు జగద్గురువులు శ్రీ వేదవ్యాసులవారు అపౌరుషేయములైన వేదములను సంపుటీకరించి నాల్గు విభాగములైన ఋగ్, యజ్జు,  స్సామ  యథర్వణ వేదములను పేర క్రోడీకరించి ఒక పద్ధతిలో అమర్చిన మంత్ర రాజములు ఇవియన్నియు దేవనాగరి లిపిలో నుండి వివిద దేవతలకు చెందిన ఆరాధనామంత్రములు, యజ్ఞామంత్రములతో కూడి యుండును. ఇవికాక వేదాంగములను సుమారు రొండువందల వరకూ వుపనిషత్తులను, అష్టాదశపురాణములను (18) రచించెను.

 

                                ఈ పురాణములలో బ్రహ్మండపురాణము, ఉత్తరఖండము నందు జగన్మాతయగు

శ్రీలలిత త్రిపురసుందరీదేవిని కీర్తిస్తూ, సహస్ర రహస్యనామములుంచగా వాటిని హయగ్రీవులవారి ద్వారా

అగస్త్య మహాముని తెలిసికొని, వారి ద్వారా లోకమున వ్యాపించి జగత్ప్రసిద్ధమైనవి. అట్టి ఆదిగురువులు వ్యాసులవారికి సహస్రవందనాలు.

                                    అయితే ఈ అమ్మ నామములన్నియు సంస్కృతముననున్నందున సామాన్య జనబాహుళ్యంలో ఆభాష వాడుకలో లేనందన శబ్దరూపముగానే ప్రచారమై అందున్న నామార్థము గాని, అమ్మవారి తత్వార్థము గాని

తెలియటలేదు. అందుచేత సమస్త జనులకు అర్థమగుటకు వీలుగా తెలుగు భాషలో అమ్మవారి తత్వమును నామార్ధములను, అర్ధవైభవమును,సాహితీవిలువలు అక్షరపదవిన్యాసమును, వివిధ శాస్త్ర విజ్ఞాన కళాసంస్కృతీ సాంప్రదాయాలకాయువుపట్టైన భారతీయ ఔనత్యము తెలుపుతూ నన్ను వ్రాయుమని అమ్మవారు

నాకు ఓ సుదినమున స్ఫురణ కలిగించినందున,ఆ స్పూర్తి నాలో స్పందన రగిలి ఈ అపూర్వ సాహతీయజ్ఞమునకుఉపక్రమించినాను.

                                  నేను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఏకలవ్యశిష్యుడు వంటి వాడను వారి ప్రవచనా పటిమకు ముగ్గుడనై నేను వారిని అనుకరించితిని క్షంతవ్యుడను, వారు నాకు సదా గురుదేవులు.

                                 నేను నా తల్లిదండ్రుల దశ సంతతిలో నాల్గో వాడను , మాది ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబము. మా ఇంటి పేరు పోలూరు వారము మేము కౌండిన్య గోత్రీకులము మా ఋషులు- వశిష్ట ,మైత్రావర్ణ, కౌండిన్య.మాపితామహులు మంచి జ్యోతిష్యవేత్త వారి జాతకమువారే గణన చేసుకొని మరణ కాలము నిమిషాలతో సహా లెక్కించుకొని, నేలపై పరుండి జీవధార కట్టించుకొని ఆయన నిర్ధారించుకొన్న సమయానికి ముక్తి పొందెను. మా పూర్వీకుడైన పోలూరు గోవిందకవి భరతనాట్య గ్రంథకర్త, సాహితీవేత్త, తంజావూరు సంస్థానంలో నుండెడి వారు వారసత్వ వాసనాబలమేనేమో

నన్ను ఈ సాహితీ సేద్యమునకు ఉపక్రమించ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలతో, నా 72 సంవత్సరముల వయస్సులో చేతులు పనిచేయక ఆ అమ్మవారిని తలచి రెండు చేతులతో కలము పట్టి ఏడు మాసములు కాలములో 400 పుటల వ్రాత గ్రంథముగా రూపొందింప చేసినది. ఇందుకు సహకరించిన శ్రీ విఘ్నేశ్వరునకు, శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవార్లకు నా శతకోటి వందనములు.

                               శ్రీలలితా సహసృనామములందున్న రహాస్య

అర్థములు మరే దేవతా సహస్రనామములలో లేనందున ఆ భావార్థ విశ్లేషణోత్సాహియై తేటతెలుగులో వ్రాసి వివరించితినని భావిస్తున్నాను. ఎక్కడైనా పొరపాట్లుఉంటే నాదృషికి తెచ్చిన సవరించుకొన గలను.ఇదియంతయు అమ్మ అనుజ్ఞతో ఒక సాహితీ

యజ్ఞముగా చేసితిని.

 

                                                                              కృతికర్త

పోలూరు బాబురావు

29/01/2020

..

                                                    

 

          

                       శ్రీమాత్రేనమః

ఉపోద్ఘాతం:

                          శ్రీ మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సహస్ర నామాలు జగత్ప్రసిద్ధం . అనంతత్వమైన ఆ దేవి నామాలు ఆది గురువైన వ్యాసమహర్షి బ్రహ్మాండపురాణంలో సంస్కృత శ్లోకాలాల్లో వివరించారు.  దీనిని బ్రహ్మవిద్య అందురు. లలితా సహస్ర నామములు రెండు విధములుగా ఉన్నాయి. ఒకటి సూత్ర గ్రంథము రూపము మరియొకటి భాష్యగ్రo రూపము . మనము నిత్యమూ పూజా విధానము లో పటించేవి శ్లోక రూపములో ఉన్న సూత్ర గ్రంథము మాత్రమే. అగస్త్య మహర్షు వారు విష్ణ్వాంశసంభూతుడు, గురుతుల్యులైన శ్రీ హయగ్రీవ స్వామి వారి వద్ద తమ సందేహములు తీర్చు కొనునెపాన అమ్మ యందు మిక్కిలి అపార భక్తి కలిగి అమ్మ నామ విశేషముల గురించి వివరించమని అడగగా వారు వివరించారు. లలితా మాతా మంత్రములు మూల విద్యా రూపములుగా వారు తెలిపి శివాంశసంభూతుడైన శ్రీ దక్షిణామూర్తి కృతము గా శ్రీవిద్య గుణ విశేషములు వివరించారు అత్యంత భక్తిశ్రద్ధలు గల వారికి మాత్రమే వివరించ వలె.

టుులకు , ( అహంకారులకు) దుష్టులకు, అవిశ్వాసులకు వివరించ రాదు.

అమ్మ లలితాదేవి మొట్టమొదటి మూల ఆదిపరాశక్తి గా ఉండి తన నుంచి ఎనిమిది కిరణము లను ఉద్భవించు కొన్ని తన గుణ గణములు తెలియపరచు నిమిత్తము ఆ కిరణ సముదాయమును అష్ట విధ దేవతా రూపములుగా మార్చి కంఠము నుండి నోటి వరకు వివిధ వర్గ దేవతలుగా చేసినది. ఆ ఎనిమిది మంది దేవతల నామములు యివియే

·       శిని 2. కామేశ్వరి  3. మోహిని  4. అరుణ 5. విమల 6. సర్వేశ్వరీ 7. కౌముది  8. కౌళిని ఈ దేవతలందరూ వాగ్భవకూటమికి చెందిన వారు.  వీరే వశిన్యాది వాగ్దేవతలు. వీరే మంత్ర పూరకమైన అనుష్టుప్ ఛందస్సులో స్తోత్రము గా మనకందించారు.

దేవతలు అక్షరవర్ణమాలో గల కారము నుండి య కారము వరకు గల ఎనిమిది వర్గములలో నుండి వాశ్చక్తి  ప్రసాదించుటకు నోటిలో ఐదు స్థానములలో కొందరు, ప్రయత్న స్థానములో ఇద్దరు, వాక్ వ్యక్తీకరణ స్థానములో ఒకరు ఉండి పలికిస్తారు.

వర్గములు

·       ఆ నుండి అః వరకు వర్గము

·       నుండి జ్ఞా వరకు క వర్గము

·       చ నుండి వరకు చ వర్గము

·         నుండి  వరకు ట వర్గము

·       నుండి న వరకు వర్గము

·       నుండి వరకు వర్గమ

·       నుండి వరకు వర్గము

·       నుండి క్ష వరకు వర్గము

 

                   అమ్మవారు శ్రీచక్రం త్రికోణాకార మధ్యభాగమున బిందు స్వరూపిణిగా విరాజిల్లును . ఈమె మహోజ్వల మైన మణిపురమందున్న దివ్య  హర్మ్య నిర్మాణమైన చింతామణి గృహములో అంబికయను నామధేయము తో అత్యంత శోభాయమానంగా దేవ, ఋషులు, మానవోత్తములు, కిన్నెర , కింపురుష ,యక్షిణీ దేవతల సమూహముతో కొలువు తీరియుండ , త్రిమూర్తులు తమ భార్యలతో సభకు విచ్చేసి అమ్మను కీర్తిస్తూ ఉన్న వశిన్యాది వాగ్దేవతలు మిగుల శ్రధా భక్తులతో అత్యంత అంకిత భావముగా లలితా అమ్మవారి సహస్ర నామ శ్లోకములు పఠించుచుండ సభికులందరూ పరవశులైరి. ఈ శ్లోక నామములు ప్రతి నామము దివ్య మంత్ర సమానము . పవిత్ర ఉచ్ఛారణ వలననే అనేక రోగములు తగ్గి ఆరోగ్యవంతులగుదురు.

                     ఈ స్తోత్రములన్నియూ అపౌరుషేయములు .  అపౌరుషేయములు రెండు విధములు. బాహ్య విషయ పరిజ్ఞానము గూర్చి తెలిపేవి ప్రకటశాస్త్రమనియు,  అతీంద్రియ విషయముల గూర్చి తెలిపేవి గుహ్య(రహస్య) శాస్త్రమని పేరు. ఈ గుహ్య శాస్త్రము మానవాళి ఉపయోగించు అనేక ధర్మ, ఉపాసన, తత్వ, రహస్య శాస్త్రములు ఎన్నింటినో బోధించును.

                      శ్రీ మాత శ్రీ లలితా సహస్ర నామము లకు భాష్యము ప్రఖ్యాత పండిత శ్రేష్టులు దేశవ్యాప్తంగా ఒక ఎనిమిది మంది వ్రాయుట జరిగినది. వారిలో 18వ శతాబ్దంలో కన్నడ సీమలో జన్మించి భాగ్యనగరంలో జీవనము చేస్తూ అమ్మ యందు మిక్కుటంగా భక్తితత్పరతతో నిరంతర  తపస్సు చేసెను. ఆయనే భాస్కర రాయలవారు . వీరు కాశీ పట్టణము చేరి అచ్చట సౌభాగ్య భాస్కరం అను నామముతో భాష్య రచన చేసి తదనంతర కాలములో    భాసురానందనాయను యతీంద్ర నామముతో సిద్ది పొందినారు వీరి భాష్య గ్రంథం మిక్కిలి అనుసరణీయం అయినది.

                      శ్రీ లలితా సహస్ర నామ పఠనం శ్రద్ధాసక్తులతో శుచి శుభ్రత లకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రధమముగా ఉమా నామస్మరణ చేసి పఠనము చేయబోవు ముందు అమ్మ ప్రీత్యర్ధం ప్రారంభిస్తున్నట్లు చెప్పుకుని ఎలాంటి అంతరాయం కలుగకుండా దీవించమని వేడుకొనుచూ సాధన అవిచ్ఛిన్నంగా జరుగునట్లు చూసుకొనవలెను . ఈ స్తోత్ర విద్యయంతయు విశేష ఫలములనొసగు శ్రీవిద్య. ఈ విద్య అపార శక్తి కలిగి శరీర రుగ్మతలైయిన రోగములు అనగా భౌతిక ఫలములు నయమగుట యేకాక మోక్ష అర్హత కూడా లభించును. ఈ స్తోత్రము లోని ప్రతి నామమునకు  రహశ్యార్ధము లు కలిగి చక్ర మంత్ర దేవతా సంకేత నిగూఢ వివరములు  తెలుసు కొనవలెను.

                     అట్లు తెలిసి కొని నైతిక పారమార్ధిక విశ్లేషణ చింతనము చేసికొని జీవన యానం గావింప వలె . ఆర్యులు తెలిపినట్లుగ ఈ నామం మంత్ర ఫలిత శక్తి కోటి జన్మల నిత్య గంగాస్నానము, కాశీలో  కోటి శివలింగ  ప్రతిష్ట, అంటే అనేక యజ్ఞ యాగములు కంటే మిన్న అని తెలిపిరి . ఈ నామాలు కవిత్వభూషితముగాను, సంగీత పర్వము గా ఉండి వీనులవిందుగావించును.

                                 శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము శ్రీ హయగ్రీవుల వారు అగస్త్య మహా ముని వారికి విన్నవించగా , వశిన్యాది వాగ్దేవతలు అమ్మ వారి సమక్షంలో గానం చేశారు. ఈ స్తోత్రము వివిధములైన రహస్య వైభవముల తో కూడినది. ఇవి ఆరు విధములుగా విభజించ వచ్చును. 1 నామ వైభవము 2 రూప వైభవము 3 లీలా వైభవము 4 మంత్ర వైభవము 5 తత్వ వైభవము 6 యోగ వైభవము ఇందుగల నామములను మాలా మంత్రము లంరు. ఒక్కొక్క నామములో రహస్య పరము లైన వివిధ కథలు గా ఉండి వాటిని మనము చేసి అమ్మ దయతో గ్రహించవలెను . ఈ స్తోత్రము ఛందోబద్ధముగ నుండి ప్రతి శ్లోకము రెండు పాదములుగా నుండి ఒక్కొక్క పాదమునకు 16 అక్షరములు కలిగి మొత్తము 32 అక్షరములతో వుండున

                                                                          పోలూరు బాబురావు


..

 


  



శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |

చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1||


శ్రీ లలితా అమ్మవారు  సృష్టి స్థితి లయ కారిణి. ఈమె కాలాతీతురాలు. విశ్వవ్యాపియై   అందరనూ సదా  రక్షించును. ఈమె యే వేదమాత . శ్రీ అనగా వేదము . ఆమె యే గాయత్రి . అందుచే  ఈఉపాసన    బ్రహ్మ విద్య యని, శ్రీవిద్య యని అందరు .

  శ్రీమాతా  అనగా సృష్టికారణ దాయని . ఈమె జ్ఞానానంద శక్తి స్వరూపిణి . శ్రీం - అనునది మహా బీజమంత్రము. శుభసూచకంగా మొదటి మూడు నామములు ఈ పై మంత్రముతో నే ప్రారంభమగుచున్నవి. శ్రీమాత తన భక్తులకు ఆశ్రయం కల్పించ గలదు మరియు పరమేశ్వరుని ఆశ్రయించే శక్తి గలది .

  శ్రీమహారాజ్ఞీ యనగా సమస్త విశ్వమును   స్థిరముగా నుంచి సూర్య చంద్ర నక్షత్ర గ్రహ       సంచారము నియంత్రించి   విశ్వ  జనులను చైతన్య పరచి పరిపాలించు గొప్ప రాణి. ఈమె స్థితి కారిణి .

    శ్రీమత్సింహాసనేశ్వరీ : అనగా శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి. ఈ దేవి ప్రతి మానవ హృదయ పీఠమున స్థిరముగా నుండి చైతన్యవంతులను చేయుచూ ఆనదమయముగానుంచును. పంచప్రణవాసనారూఢయై నిత్య కాంతి స్వరూపిణిగా వెలుగొందును.

    చిదగ్నికుండసంభూతా: అత్యంత భక్తితో లలితా మంత్రము జపించుచూ మధనము చేసిన చో హృదయాగ్నికుండము లో సకల జన్మాంతర పాపాగ్నులను పారద్రోలి జ్ఞానాగ్ని స్వరూపిణియై సాక్షాత్కరించును.

    దేవకార్యసముద్యత:  అనేక రాక్షస సమూహముల దుష్కుృత్యముల బారినుండి దేవతలు అమ్మ రక్షణ కొరకు  ప్రాధేయ పడగా పరమేశ్వరుని ( శివుని) ఆమె ప్రార్ధించి శివాగ్ని రగులగొల్పమని కోరి అందుకు సమ్మతించి పాల భాగాగ్ని రగిల్చి దేవతలను పూర్ణాహుతిగావించ కైవల్యము పొందగా అందుండి అమ్మ ఉదయించింది.




ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |

రాగస్వరూపపాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||


  దేవతలందరూ పూర్ణాహుతి అయిన అనంతరం ఆ చిదగ్నికుండం నుండి గొప్ప కాంతి పుంజము వెలువడగా ఆ వెంటనే ఆహుతైన దేవతలందరూ మంచి పుష్టి కలిగి శక్తివంతమైన దేవతలు గా తిరిగి జన్మించారు. ఆ కుండము నుండి అత్యంత ప్రకాశవంతమైన జ్యోతి స్వరూపము గా అమ్మ ఆవిర్భావము జరుగుతున్నది. ఆ దివ్యమైన కాంతి స్వరూపము వేలవేల సూర్యకిరణ కాంతులకు మిన్నగా కళ్ళు మిరుమిట్లుగొల్ప నిరాకార స్థితి నుండి సాకార దశకు అమ్మ ఆవిష్కారం జరుగుతున్నది.  

   ఈ స్థితిలో  అమ్మవారు నాలుగు చేతులతో ఆ చేతుల యందు పాశము, అంకుశం, చెరకు విల్లు, పుష్ప బాణము కలిగి జేజీయమానము గా వెలుగొందుతున్నది. ఈ తల్లి నవావరణ శ్రీ చక్ర పీఠము నందు ఆసీనురాలై ఉన్నది. ఉజ్వలమైన ఎర్రని కాంతుల తో వెలుగొందుతున్నది .



మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్రసాయకా |

నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా || 3||


     పంచతన్మాత్రలైన శబ్ద ,స్పర్శ, రూప ,రస ,గంధాలు లకు అతీతమైన ఆరవ శక్తిగా   రూపొందిన మనసులోని రాగ ద్వేష భావాలకతీతంగా మానవులను చైతన్యపరిచే శక్తి కలిగి ఎర్రని కాంతులతో అనేక బ్రహ్మాండ మండలములలో చైతన్య ప్రవాహములో మునకలు వేస్తూ ఆ వెలుగులలో వోలలాడు ఆ తల్లిని జపతపాదులతో పూజించినవారికి అదృశ్య శక్తుల వరం చేకూరుతుంది . ప్రభాపూర అనగా వెలుగులలో మునక.









చంపకాశోకపున్నాగ సౌగన్ధిక లసత్కచా |

కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా || 4||


   సాహిత్య ఉపాసకులు సనాతన ఆచారము ప్రకారము పురుష దేవతలను పాదముల నుండి శిరో  భాగము వరకు వర్ణన చేయుట ఆచారము. ఇచ్చట అమ్మను శిరస్సు నుండి పాదముల వరకూ ఆమె అలంకారములను, అంద చందమును వర్ణించుట చూచెదము . అమ్మ శిరోభాగం వర్ణన విషయంలో శిరోజాలు సహజ గంధముతో నిండియుండి, దేవేంద్ర వనములో వున్న చంపక(సంపెంగ), అశోక, పున్నాగ ,సౌగంధిక మొదలైన పుష్పములు అలంకరణ గావించుకుని నిత్య ఆనందమయ రూపిణిగా అలరారును. చక్కటి మణులు పొదిగిన బంగారు కిరీటం తో తేజరిల్లు చుండును . ఈమె విరాట్ విశ్వరూపిణి గా, మంత్ర విశ్వరూపినిగా, దేవతా విశ్వరూపిణిగా గోచరించును.




అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా |

ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషకా || 5 ||




శ్రీలలితాంబికాదేవి ఆజ్ఞానుసారము వశిన్యాది దేవతలు అమ్మ వైభవం వర్ణిస్తూ కోటి కాంతులతో మెరుస్తున్న కిరీట వర్ణన తదనంతరం ఆ దేవి ఫాల భాగము నందున కనుబొమలు విల్లు ఆకారంలో నుండి అష్టమీ చంద్రకళ రూపంలో నుండి తిధి నిత్య దేవతలు ఆరాధించు చుందురు. శుక్లపక్ష చంద్రుడు గాని , కృష్ణపక్ష చంద్రుడు గాని ఒకే రూపంలో నుండును. మిగిలిన తిథులలో వేరు వేరు విధములుగా ఉండుటచే అష్టమి చాలా పవిత్రమైనది. ఈ తిథి నాటి దేవతను త్వరితాదేవి అందురు. తక్షణమే కోర్కెలు తీర్చు ఈ దేవిని వేదముననుసరించి ఆప్యాయతాదేవి అందురు. ఈ దేవి కనుబొమల మధ్య భాగములో ఆజ్ఞాచక్రం స్థానమున కస్తూరీ తిలకము తో అలంకరించుకొని శోభిల్లును.



వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా |

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా || 6 ||


ఈ అమ్మ కనుబొమలు ఇంటికి అనగా ముఖపద్మము యను ఇంటికి కట్టిన తోరణము వలె నుండి తేజోవంతమైన ముఖము మిక్కిలి  సౌందర్యవంతంగాను ,శుభములు చేకూర్చునదిగా నుండి వాక్ఛక్తి కి మూలమైన వదనము, బిందుస్థానమైన శివ శక్తి తో కూడి పై శ్లోక పాదములో  ఐo, క్లీం ,సౌ: , శ్రీం , హ్రీం అను బీజాక్షరములు రహస్యముగా దాగియున్నవి. ఈ బిందుశక్తి శివ స్పందన శక్తితో కూడి తరంగ రూపేణా నిరతము భక్తులను ఆశీర్వదించును.

          చిదగ్నికుండ సంభూతయైన శ్రీమాతను వశిన్యాది దేవతలు వర్ణిస్తూ శ్రీ చక్రము నందు బిందు స్వరూపం నుండి నవావరణ చక్ర ఆరంభము తెలియపరుస్తున్నారు. అమ్మ నేత్ర వర్ణన చేస్తూ ఆ కన్నులు చైతన్యం అనే ప్రవాహంలో చేపలు నది నీటి లో ఓలలాడుతున్నట్లు ప్రతిపాదిస్తున్నారు.







నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా |

తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసురా || 7 ||


అమ్మవారి నాసికా వర్ణన చేస్తూ, ఆమె నాసిక సుగంధ పరిమళాలతో నున్న అప్పుడే వికసిత మౌతున్న కొత్త సంపెంగ పువ్వు వలె నుండి ప్రాణశక్తికి ఆధార భూతమై యున్నది. నాసా (ముక్కుదూలం) సంపెంగ వలె ఉన్నది.

అమ్మ నాసిక కు మూడు విధములైన ఆభరణములను ధరించి మిక్కిలి ప్రకాశవంతముగా వెలుగొందుతున్నది. సూర్యనాడి ప్రభావితమైన కుడివైపు ముక్కుకు బంగారముతో పొదిగిన ఎర్రని పగడమును, చంద్రనాడి ప్రభావితమైన ఎడమవైపున వజ్రమును ఈ రెంటి కలయిక సుషుమ్న నాడి స్థానంలో  బులాకీ రూపములో వ్రేలాడుతూ ముత్యమును ధరించి మిరుమిట్లు గొలుపు కాంతితో నక్షత్ర కాంతి మించి యున్నది. ఆ కాంతి శుక్ర , గురు గ్రహ నక్షత్ర కాంతి మించి ప్రకాశిస్తున్నది. అమ్మ కన్నులలో సూర్య, చంద్ర దర్శన శక్తులకు అవి సాక్షి రూపముగా గోచరించును .





కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహరా |

తాటంకయుగళీభూత తపనోడుప మణ్డలా || 8 ||


శ్రీ లలితా దేవి కదంబ పుష్ప వన విహారి. ఈ కడిమి పూలు దండగా చేసి శిరస్సున ధరించుట ఇష్టము. అమ్మ చెవులకు ధరించిన ఆభరణములను తాటంకములు అందురు. సూర్య చంద్రులు తమ వెలుగులతో గమనించి ప్రోది చేసుకున్న సమాచారమును ఎప్పటికప్పుడు అమ్మ కర్ణపేయములకు అందించుచూ వారి ధర్మము నిర్వర్తింతురు.

  తపన= సూర్యుడు, ఉడుప = చంద్రుడు .



పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |

నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||


పద్మము వంటి ముఖము కలిగిన అమ్మవారిని వర్ణిస్తూ, ఎంతో నునుపు తేలిన పద్మరాగ శిలలు దర్పణము వలె నుండి ప్రతిబింబము అగుపడును. అమ్మ కపోలము (బుగ్గలు) ఆ శిలల నునుపు ధనము మించిపోయి ఉన్నవి. ఆమె కింద పెదవి ఎర్రని కాంతితో నుండి దొండపండు ఎరుపును మించి దానిని తిరస్కరించునదిగా ఒకవిధమైన వాతెర  వేసినట్టుగా ఉన్నది. 

పరిభావి= మించియుండు ,  న్యక్కారి = తిరస్కరించు,

 రదనచ్ఛద =వాతెర  ,పలుచటి తెర.



శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |

కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా || 10 ||


ఇచ్చట అమ్మ వాగ్భవ  కూటమును వర్ణించుట గమనించవలెను. ద్విజ పంక్తి అనగా అమ్మ పలువరుస . ఆ దంతములు చక్కని వరుసతో నుండి ప్రకాశవంతముగా మెరయుచున్నవి .

     అమ్మ పలువరుస పై దవడ యందు 16 గాను, క్రింది దవడ యందు 16 దంతములు కలిగి శుద్ధమైన వేదమంత్రములకు మూలములై యుండి , షోడశ మంత్రములకు నాందిగా నుండును. ఇదియే బ్రహ్మవిద్య , శ్రీవిద్య అందురు . సకల విజయాలకు మూలం దంతములే . వీటి నుండి అక్షర తేజస్సులు మంత్ర శక్తులుగా వెలువడును. శుద్ధ విద్య అనగా అద్వైత విద్య . అమ్మ ముఖము నుండి వచ్చు చిరునగవు మిక్కిలి ఆహ్లాదభరితంగా నుండును .

ద్విజపంక్తి అనగా మరియొక అర్థంలో , వేదము పఠనము చేయు విప్రులు తెల్లని వస్త్రములు ధరించి ఒక 16 మంది ఒక వరుసలో నుండి మరొక 16 మంది వారికి ఎదురుగా నిలబడి చదువుదురు. అమ్మ వేదమాత గనుక ఆమె పలువరుస ఆ విప్ర వరుసలతో పోల్చబడినది. అమ్మ వారికి తాంబూల సేవనము ప్రీతికరము. ఈ తాంబూలము లేత తమలపాకులతో యాలుకలు , వక్క , సున్నము లవంగాలు , పచ్చకర్పూరం , జాజి , జామ్ పత్రి కలిగి సువాసనాభరితంగా ఉండాలి . ఈ విధమైన తాంబూల సేవనం వల్ల అమ్మ వాక్కులు జ్ఞానానంద కరంగా వెలువడు సుగంధములు అష్ట దిక్కులందు వ్యాపించి అందరికీ ఆమోదయోగ్యమైనది. అందుచే అమ్మ మిగుల ఆకర్షితమై నది.


నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ |

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా || 11||


అమ్మ కామేశ్వరుని తో మాట్లాడుతున్నప్పుడు ఆ పలుకులు చక్కని అర్థవంతంగానూ, మాధుర్య పూరకముగా నుండి సరస్వతి దేవి తన కచ్ఛపి వీణ నుండి పలికించెడి రాగ సమ్మేళనంలోని అక్షర పలుకుబడులకు మించిన శ్రావ్యత కలిగియున్నది . ఆమె నవ్వు మందస్మితముగా (చిరునవ్వు) నుండి తేజోవంతంగా ఉండుటచే పరమేశ్వరుని మనసు చూరగొన్నది . 


అనాకలితసాదృశ్య చుబుక శ్రీ విరాజితా |

కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా || 12 ||


అమ్మవారి చుబుకము (గడ్డము) ను వర్ణిస్తూ ఆ చుబుకము మిక్కిలి శోభ కలిగి దేనితోనూ సాదృశ్యము చెయ్య లేని (పోల్చలేనట్టి) విధముగా నుండి , కంఠము నందు గల పవిత్ర మాంగల్యము సూత్ర శోభ సంతరించుకొని అలరారుచున్నది .




కనకాంగద కేయూర కమనీయభుజాన్వితా |

రత్నగ్రైవేయచింతాకలోల ముక్తాఫలాన్వితా || 13 ||


అమ్మవారు చతుర్భుజ ములు కలిగి కమనీయ శరీర ఛాయ కలిగి, రత్నములు వంటి వేద మంత్రములు తన గ్రీవము (కంఠము) నుండి వెలువడు మంత్ర శక్తులతో మమేకమై చూచుటకు కమనీయంగా యున్నది . ఆ దర్శనము మోక్ష ఫలమును ప్రసాదించును .


కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|

నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ || 14 ||


ఓంకార స్వరూపుడగు కామేశ్వరుని అనగా తన పతి ప్రేమ చూరగొని ఆయన ఒడిని చేరినట్లు భావించవలెను. అమ్మ కలయికతో ఓంకార బీజము రెండుగా ప్రతిఫలించి “హ్రీం,శ్రీం “గా విడివడి మణి ప్రభావితము గా వెలుగొందు చున్నది.

అంతరిక్ష సమన్వితమైన అమ్మ నాభికి ఆలవాలములై వివిధ కిరణ పుంజ  (రోమాళి)  వెలువడి సూర్య చంద్రమండలము లను తాకగా, అవి ఫల భరితము లైన లతకు వలె అమ్మ చనుదోయి కనబడుతున్నది . అనగా ఆ సూర్య చంద్ర ఫలప్రకాశము వలననే సకల జీవులకు ఆహారం సమకూర్చబడుచున్నది . అమ్మ తన ప్రేమతో భర్త ప్రేమ కలబోసుకుని సకల జీవ ఆహార ము సముపార్జించు  పోషణ నిమిత్తము కుజ ద్వయము కలిగియున్నది .



లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా |

స్తనభారదళన్మధ్య పట్టబన్ధ వళిత్రయా || 15 ||

శ్రీ లలితా అమ్మవారు విశ్వ విగ్రహ అనునట్లు ఆమె నాభి నుండి వెలువడిన కిరణ పుంజముల దివ్యకాంతుల వలన ఆమె నడుము భాగం ఊహకు అందనంత సన్నముగా నుండి, సర్వ సాముద్రిక లక్షణములు కలిగిన పతివ్రతామతల్లివలె  గోచరించుచున్నది. వక్షస్థల భారము వలన ఆమె నడుము మూడు ముడుతలతో కూడియున్నది.

సమున్నేయ= ఊహకందని ; వళిత్రయా= మూడు ముడుతలుగల


అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ |

రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా || 16 ||

అమ్మవారు ఎరుపు పసుపు కలిసి కాంతివంతముగా ప్రకాశిస్తున్న వస్త్రము ధరించి ఉన్నది . ఆమె అందమైన చిరుమువ్వల కు రత్నములు పొదిగిన బంగారు మొలనూలు ధరించినది .


కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా |

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా || 17 ||

అమ్మ అంగ సౌష్ఠవం వర్ణించు శ్లోకము గూఢార్థము . ఆది గురువైన పరమేశ్వరప్రణీతము  .అందుచే వీటిని గురుపాదుకా మంత్రులందురు . అమ్మ పృష్ట ద్వయము మిక్కిలి లావణ్యము (మెత్తదనం) గాను, కోమల ముగా నుండి పరమేశ్వరుని అంకసీమనలంకరించి కూర్చొనియుడెను . ఆమె జానువులు (మోకాళ్ళు) మాణిక్యములు పొదిగిన బంగారు కిరీటం

 పైభాగము వలె విరాజమాన మై యున్నది.




ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘికా |

గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా || 18

శ్రీ లలితా అమ్మవారి కాళ్ల పిక్కల భాగము ఎర్రని కాంతి తో మెరుస్తున్న మెత్తటి ఆరుద్ర పురుగు మెత్తదనంతో వుండి అమ్ములపొది వలె యున్నవి. మరియు అమృత లబ్ది కొరకు దేవదానవులు పాలసముద్ర మధనము సేయ , మంధర పర్వతం అడుగున శ్రీమహావిష్ణువు కూర్మావతారమున రహస్యముగా దాగి ఏ విధముగా కార్య సఫలత జరిగెనో , ఆ విధముగా అమ్మ ఆశ్రయము రక్షణ కలిగించును .



నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా || 19 ||

కాంతివంతమైన అమ్మ పాద ద్వయ గోళ్ళను వర్ణిస్తూ అవి అర్ధచంద్రాకృతిలో నుండి ముచ్చట గొలుపుతున్నవి . సంసారమనెడి సరోవరంలో పుట్టిన తామర  తూడుల వలె అనేక కష్టనష్టాలకు గురైన తమోగుణ జనులు అమ్మకు పాదాభివందనం చేసినంత ,పాపములు పోగొట్టి రక్షించును .

పరాకృత = పోగొట్టునది


శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా |

మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః || 20 ||

చిదగ్నికుండ సంభూత అయిన అమ్మ పరమేశ్వరుని దర్శనార్థం వచ్చువేళ అమ్మ పాదములు , నడక వివరించబడినది . ఆమె పాదములు మణులతో పొదిగిన సన్నని ధ్వనులతో శ్రావ్య భరితమై అలంకార హృతమైన మువ్వల పట్టీలు ధరించి ఉన్నది . ఆమె పాదములు పద్మము రేకలవలె ఉండి ఆ వొచ్చు మంజీర నాదం తొలి వేదమంత్ర ధ్వనులుగా భావించవలె .


శింజాన = మ్రోగుతున్న.       మండిత = అలంకరించుకున్న

ఆమె నడక తీరు ఆడ హంస నడక పోలియున్నది . హంస అనగా ఉశ్చ్వాస నిశ్వాసముల కలయిక . ఈ ఊపిరియే ముఖ్య ప్రాణశక్తి. ఇది మూలాధారము నుండి సాగుతున్న సుషుమ్న నాడి ద్వారా ఇడ , పింగళ నాడులతో అనుసంధానమై సహస్రారము వరకు ప్రాకి మరలమరల క్రియ జరుగును . దీనినే హంస జపము అందురు . ఇందు హ కారము శివస్వరూపం అయితే , స కారము శక్తి స్వరూపమై హంస మిధున క్రియగా మారి 72 వేల నాడులకూ శ్వాస రూప ప్రాణ శక్తిగా మారి అమ్మ చేయూతతో జీవకోటి మన కలుగుతున్నది . ఈమె మందగమన అనగా శ్వాస నియంత్రణ వలన అంటే జపతపాదులు వలన మనస్సు ప్రశాంతత కలిగి అమ్మను దర్శించవచ్చు .

ఈ తల్లి మహా లావణ్య స్వరూపిణి అనగా మిక్కిలి లలితమైనది , సుందరమైనది . అందుచే లోకాతీతమైన లావణ్య దేవతయై అందానికి తరగని నిధియై పరిమితి లేని ఆనందశేవధిగా సచ్చిదానంద స్వరూపిణి అయినది.

మరాళి =ఆడ హంస       శేవధిః = తరగనిది


సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా |

శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీనవల్లభా || 21 ||

లలితాదేవి శరీర స్వరూపము ఎర్రని కాంతివంతమై భాసిల్లును . మెత్తటి ఆమె పాద ద్వయము మరింత ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నవి . కారణము ఆమె పాదముల నుండి కాంతి కిరణములు ప్రసరించి సర్వ జగత్తును వెలుగులతో నింపి కాలగమనము కలిగించి ఋతువులను ఏర్పరచి సకల సంపదలకు మూలమగుచున్నది . ఈమె పాదముల నుండి సూర్య , చంద్ర , అగ్ని కిరణపుంజములు ఏర్పడును .


సూర్యకిరణములు = 116

చంద్ర కిరణములు = 136

అగ్ని  కిరణములు = 108

                       ___________

మొత్తము.              360

ఈ కారణముల వలన దినములు ఏర్పడి సంవత్సరమునకు మరల వచ్చుచూ కాలగమనం జరుగుతున్నది .

లలితా సహస్రనామ స్తోత్రము మంత్ర నామములతో కూడిన వివిధ రహస్య కథాసంకలనములు . భండాసుర వధ నిమిత్తము దేవతలందరూ యజ్ఞము చేయ తలుపగా  ఆ చిదగ్నికుండం నుండి అమ్మ ఆవిర్భావము అయినది , ఆమె సౌందర్య గుణ విశేష వర్ణన జరుగుచున్నది .

సర్వారుణా అనగా ఉభయ సంధ్యల యందు ఎర్రని కాంతితో ప్రకాశించు సూర్యుడు అమ్మ స్వరూపమే . ఈ ప్రకాశ జ్యోతి శివశక్తి అనగా అందుండి వెలువడు కాంతులు అమ్మ కిరణ ప్రభావాలు . కావున సూర్యుడు శివశక్త్యెకస్వరూపుడు . మానవ జీవులు అనేక దోషములను జనన మరణ క్రియానుభూతులతో ఉందురు . ఇలాంటి వాటికి అన్నింటికీ అతీతురాలు అయినందున అమ్మ అనవద్యాంగీ అనగా దోష రహితురాలు . ఈమె ఆపాదమస్తకము వివిధ అలంకార యుతమైన మణిమయోజ్వలమైన ఆభరణములు ఎల్లప్పుడూ ధరించుట చేత సర్వాభరణ భూషిత అయినది. ఇచ్చట అమ్మ ధరించిన ఆభరణాలన్నియు మంత్ర స్వరూపములే . అందుచే మంత్ర స్వరూపిణి . త్రిగుణాతీతమైన శివుడు కామేశ్వరుని గా మారినంతనే ఆ దేవి శివుని అంకభాగమునధిష్టించింది . బ్రహ్మాది దేవతలు అమ్మ కొరకు ఒక రాజధాని నిర్మించి రాజసౌధంలో మణిమయ సింహాసనం ఏర్పరచి అమ్మను రాణిగా చేయుదమని తలచి రాజైన శివుని రప్పించి ఇరువురనూ సింహాసనా రూఢులజేయ అమ్మ శివాంక స్థానము చేరినది . కామం అనగా సృష్టి సంకల్ప శక్తి  . అందుచే సకల సృష్టి కారకుడైన శివుడు కామేశ్వరుడు అవగా అమ్మ కామేశ్వరీదేవి అయినది . శివ సంకల్ప శక్తి సృష్టి శక్తి.


సుమేరు మధ్య శృంగస్థా, శ్రీమన్నగరనాయికా |

చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసన స్థితా || 22 ||

బ్రహ్మాది దేవతలందరూ కలిసి శివపార్వతుల కల్యాణం జరిపింప వారి పరస్పర అనురాగ ఆప్యాయత ఒకరినొకరు స్వాధీనములో నుండుట చూచి దేవ గణములు ఆనంద పరవశులైరి .

సర్వమంగళ దేవతా స్వరూపిణి అయిన అమ్మకు మూడు కొండల శిఖరములు కలిగిన మానససరోవరం మధ్య శిఖర కొన అనగా బిందు స్థానంలో బ్రహ్మ ఆజ్ఞానుసారం దేవశిల్పి విశ్వకర్మ ద్వారా మణిద్వీపము నందు ఒక మహా నగరము నిర్మింపజేసెను. అదియే శ్రీమన్ నగరం . అనగా చైతన్య నగరం

         ఈ నగరం మధ్య భాగములో పలు అంతస్తులతో కేవలం మణిమయములతో నిర్మించబడిన గృహమునందు బ్రహ్మ ప్రసాదితమైన పంచబ్రహ్మ సింహాసనం అమ్మ అధిష్టించినది . చింతామణి గృహ మణులన్నియు మంత్ర స్వరూపాలే .

          మరియొక అర్థములో పరిశీలన చేసిన మేరు అనగా సర్వ మానవులలో మూలాధార చక్రము నుండి శిరోభాగమునగల సహస్రారం వరకూ త్రి విధములైన ఇడా పింగళ మధ్య సుషుమ్ననాడీ త్రయము తో ఏర్పడిన వెన్ను దండమును మేరు అందురు. 

ఈ శిరోభాగ సుషుమ్న స్థానమే అమ్మ సింహాసన స్థాన మై సకల ఆజ్ఞా పూర్వక క్రియా శక్తులకు నిలయమై ఉన్నది .

      

మహాపద్మాటవీసంస్థా, కదంబవనవాసినీ |

సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ || 23 ||


    అమ్మ నివాసమైన చింతామణి గృహం చుట్టూ వివిధ ప్రాకారముల వలె అనేక వృక్ష సంపదతో మెట్ట తామర పూల వనం తో శ్యామలా దేవికి ష్టమైన కదంబ పూల వనము తో నిండినది. ఈ విధముగా అమృత సాగర మధ్యములో ఆవిర్భవించిన ఆ తల్లి రూపుగని సకల దేవతలూ జయజయధ్వానాలు చేయ బ్రహ్మ దేవుడు ఆమెకు కామాక్షి అను నామకరణము చేసి సకల దేవ మానవ కోరికలు తక్షణమే తీర్చు వరదాయిని అని వివరించెను . కామాక్షి అనగా త్రిమూర్తుల శక్తిస్వరూపిణి . ఈమె మూడు కన్నులు కలది ఈమె శాశ్వత ఆనంద స్వరూపు రాలు . అనగా సచ్చిదానంద స్వరూపిణి . ఈమె నామములో        ‘ క ‘అను అక్షరరూపములో బ్రహ్మ సరస్వతులునూ , ‘ఆ ‘అను అక్షరరూపంలో విష్ణు లక్ష్మి లుగాను , ‘ మా’ అను అక్షరరూపంలో శివ పార్వతులుగానూ ఏక నామముతో విరాజిల్లుచుండును . మణిద్వీపాంతర్గతయగు ఈమె స్వయం ప్రకాశం అయినది. సృష్టి స్థితి లయ కారకుల త్రిమూర్త్యాత్మక శక్తులు ముగ్గురమ్మల శక్తులు స్వీకరించి మూలపుటమ్మయై ప్రభవిల్లు చుండెను .



దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా |

భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితా || 24 ||


చింతామణి గృహ సింహాసన సుఖాసీన అయిన కామాక్షి దేవి కరుణాకటాక్ష వీక్షణాలకు దేవ , ఋషి గణ సమూహములు ఆనంద  పరవశులైన సమయాన నారదమహర్షి ఆమెను దర్శించి నమస్కరించి భండాసుర వధ విషయమై జ్ఞాపకము సేయ అందుకు తాను సంసిద్ధత వ్యక్తపరిచే .

ఈ విషయము మన అక్షర గణములకు వర్తింపజేసి కొన్న చో  అ కారము నుండి అః  వరకు దేవగణము లనియు , క నుండి హ వరకు గల అక్షరములు ఋషి గణమనియు, సంయుక్తాక్షరములుగా నుండును . ఈ అక్షరనామ దేవతలందరూ మానవుల శరీర అంతర్భాగంలో నుందురు . వీరంతా అమ్మ అనుచరగణములే .

           ఆత్మ వైభవోపేతంగా నున్న కామాక్షి దేవి భండాసుర యుద్ధానికి వుద్యుక్తురాలై తన శక్తి కిరణములతో అఖండ సేనా శక్తిని సమన్వయపర చెను . అంతట భండాసురుడు తన సోదరులు అయిన విష్oడుడు, విషంగుడు లతో సేనానాయకుడు కుటిలాక్షునితో అశేష రాక్షస సేనా వాహిని తో యుద్ధమునకు బయలు దేరును .


సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |

అశ్వారూఢా ధిష్ఠి తాశ్వ కోటి కోటిభి రావృతా || 25 ||

కామాక్షీ దేవి తన చేతనున్న అంకుశ ఆయుధము నుండి సంపత్కరీ దేవిని సృష్టించి తాను సృష్టి చేసిన గజ బల సేనకు అధికారిణి చేసి మదపుటేనుగు లను నియంత్రించేను . అటులనే మరియొక చేతనున్న పాశము ద్వారా అశ్వారూఢా దేవిని అశ్వ దళానికి అధిపతి చేయ ఆమె కుండుడు అను రాక్షసుని సంహరించెను .

        ఈ శ్లోక అర్థము మానవులకు ఆపాదించి చెప్పిన, సంపత్కరీ దేవి అనుగ్రహం వలన సకల సంపదలూ పొందుదురు .మదించిన మనిషిని అంకుశము తో లొంగదీయునని భావము . అదే విధముగా అశ్వములు ఇంద్రియ లోలతకు కారణములు . ఎవరైతే ఇంద్రియ నిగ్రహ శక్తిలేక పాశవికంగా ఉందురో అట్టివారిని అశ్వారూఢ దేవి తన పాశము తో బంధించును .


చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |

గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితా || 26 ||


అమ్మ శ్రీ చక్ర 9 ఆవరణలలో మధ్య బిందువు స్థానంలో నుండి ఆ శ్రీచక్రమునే చక్రరాజ రథము గా ఏర్పరుచుకొని అనేక విధములైన ఆయుధములు సమకూర్చుకున్నది .

       అమ్మకు ఒక పక్క రథచక్రము నాదచక్ర స్వరూపిణి అయిన శ్యామల దేవి ని తన మంత్రిని గా చేసుకొనొనది . ఈమెయే ఇచ్చా శక్తికి మూలము . కాళిదాసుకు కవితాశక్తి నొసగినది ఈ తల్లియే . ఈమె శ్రీ చక్రములోని 7 ఆవరణములు వరకూ విస్తరించి ఉండును .


కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||


 కామాక్షి అమ్మకు మరియొక ప్రక్క కిరి (వరాహము) యను దేవత రథంలో వారాహి అను నామముతో నుండి చేతుల యందు నాగలి , రోకలి ఆయుధములు కలిగి అన్నపూర్ణగా భాసిల్లగా ఈమెను అమ్మ తన సైన్యమునకు దండనాదిని గాచేసెను . ఈమె క్రియాశక్తి కి మూలము . అమ్మ జ్ఞాన శక్తి స్వరూపిణి .

    అనేక ఆవరణ రూపములతో నున్న అమ్మ శ్రీ చక్రము నందు అంతరావరణము , బహిరావరణము కల్గి యుద్ధ కౌశలము కొరకు  తన జ్ఞాన ప్రక్రియతో జ్వాలా మాలిని అను తిధిదేవతను సృష్టించి అంతర్ బహిర్ ప్రాకారము మధ్య 64 కోట్ల సైన్యముతో భండాసుర సైన్యమును ఎదుర్కొను ఏర్పాటు చేసి ప్రాకారం అంతయు అగ్ని మండలముగావించినది . ఈ జ్వాలా మాలిని దేవి ప్రతి మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్ద తిధికి అధిదేవతగా ఉండును .


భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమహర్షితా |

నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా || 28 ||

        

            భండాసుర సైన్యం రాత్రి సమయాన కూడా యుద్ధము చేయ తలంపులో నుండ అమ్మ తన కాంతి శక్తుల ద్వారా వెలుగును ప్రసరింపచేసే చీకటి శక్తి సైన్యమును దునుమాడెను . ఆ విధముగా అమ్మ శక్తి సేనలు పరాక్రమము తో పోరాడి ఎదుటి సైన్యము నిర్వీర్యం చేసెను .

        ఇచ్చట లౌకిక అర్ధ పరిశీలన చేసినచో మానవునికి అనేక దుష్ట శక్తుల ప్రభావముల వలన అనేక ఈతి బాధలు అనుభవిస్తూ అమ్మ మంత్ర స్తోత్రములు సరిగా పాటించక , తాను అజ్ఞాన దుష్టశక్తులకు లొంగి నాశము చెందుతున్నారు . కావున నిరంతర అభ్యాస చింతనతో ఉపాసనా దీక్షతో అమ్మను జాగృతము చేయమని ప్రార్థించ వలె . సృష్టి స్థితి లయా లను తన త్రినేత్రములతో నియంత్రణ చేయు కామాక్షి దేవి అత్యంత దయా స్వరూపిణి . కాంచీపురం కంపానది తీర మందుండి భక్తితో కొలచిన వారినెల్లరను అనుకంపా సముద్రురాలై సదా కాపాడును. అనుకంప అనగా దయ .


            


భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమనందితా ||

మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషితా || 29 ||

        అమ్మ తన శ్రీ చక్రము నుండి మరియొక రధమును సృష్టించి తన హృదయ పద్మము నుండి ప్రాణ ,శ్వాస శక్తులకు ఆధార స్వరూపిణి అయిన బీజమంత్రప్రభావితమైన బాలా త్రిపుర సుందరీ దేవిని సృష్టించగా ఆ బాలా కుమారిని  9వ ఆవరణకు  అధిపురాలను చేసెను .

         భండాసురుని తమ్ముళ్లు విషంగ , విశుక్రులు మిక్కిలి అహంకార గర్వంతో ఘోర యుద్ధము సలుపు చుండ బాలాదేవి నారాయణాస్త్రం ప్రయోగించి ఈ విషoగుని సంహరించగా, మంత్రిణి శ్యామలాదేవి చకితురాలై సంతసపడెను .


విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా || 30 ||

            విషంగుని వధతో రోసిల్లిన సోదర విశుక్రుడు భండాసురుని మంత్రి అయిన కుటిలాక్షుని సంప్రదించి ప్రత్యేక యుద్ధ వ్యూహ రచన తలపోసె .అంతట విఘ్నేశ్వర  అనుగ్రహముతో ఒక ఎనిమిది దుష్టశక్తుల “నిర్విఘ్నశిల “ ఒకదానిని సృష్టించి అందుండి 8 దృష్టశక్తులు అయిన పరివారము వివిధ పేర్లతో 1 .అలస  2 . కృపణ  3 . దీన 4 . నిద్ర 5 . సంద్ర  6 . ప్రవీలిక  7. క్లిబ

8 .కర్తవ్యవిముఖ  అను వారందరినీ మంత్రించి ఎనిమిది త్రిశూలములుగా చేసి అమ్మ సైన్యము మీద ప్రయోగించగా ఆ సైన్యం అంతయు నిస్తేజమైన వివిధ అవస్థల పాలై కునారిల్లగా వారాహీ శ్యామలా బాలాదేవి విషయమును అమ్మ లలితాదేవికి విన్నవించిరి . అప్పటికే దివ్యదృష్టితో పరికించిన అమ్మ అందుకు సమాధానం కొరకు పరమాత్ముని తలంచెను .

       శుభంకరి యగు లలితా మాత శుభకరుడు కామేశ్వరుని తలచి నంతనే శివ సాక్షాత్కారము కలుగగా అమ్మ దర్శనం మాత్రముచే శివుడు స్పందించగా ఆమె ప్రతిస్పందనకారణకల్పితము గా గజవదనుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై భండాసుర వధ కు తాను సాయపడుదునని యుద్ధభూమికేగెను .

       అచ్చట విశుక్రుడు , గజాసురులను గమనించి అత్యంత బలమైన సప్తకోటి గజబలమును తననుండి సృష్టించుకొని వారి మీదకు విజృంభింపజేసెను .

తదుపరి విశుక్రుడు నిర్మించి దాచిన నిర్విఘ్న శిలను వెలికి తీసి దానిని పిండి పిండిగా సేయ ఆశక్తులు నశింపగా విశుక్ర గజాసురులు మరణించిరి . వెంటనే అమ్మ సైన్యమునకు మరల చైతన్యశక్తి కలిగెను . విఘ్నేశ్వరుని యుద్ద తంత్రము , కౌశలము అమ్మ మెచ్చుకొని మిక్కిలి సంతసించెను .

 అందుకే  “ ఆనందాత్మాగణోశోయం “ అన్నారు దేవతలందరూ.


మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |

          భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ || 31 ||


అంతట భండాసురుడు పోరుకు తలపడి తనకున్న మంత్ర శక్తులు నిర్వీర్యం కాగా కేవలం భుజబల శక్తిపై ఆధారపడి బాహ్య ఆయుధములను , శస్త్రములను (చేతిఆయుధములు) అమ్మ పైకి విసరవేయుచుండ సకల మంత్ర స్వరూపిణి అయిన అమ్మతన ప్రత్యస్త్రములను మంత్రించి వానిపై ప్రయోగించి వాని ఆయుధములు తుత్తునియలు చేసెను . అమ్మ అనేక దివ్య మంత్రశక్తులు అయిన రెండు సూర్యాస్త్రమును , నారాయణాస్త్రమును ప్రయోగించెను .


కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః |

         మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా || 32 ||

అంతట లలితా దేవి తన చేతుల గోళ్ళ నుండి నారాయణుని దశావతారములు సృష్టించి యుద్ధము చేసెను . శంకరుడు తన పాశుపతాస్త్రం ఇచ్చి ఆ అగ్నికీలల్లో భండ సైన్యము రూపు మాపెను . పాశము అనగా కట్టుబాటు చేయునది . సకల జీవ జాతి పశుత్వముతో సమానములే . కావున ఐహిక విషయములలో నిమగ్నమయి భగవంతుని తెలియక జడత్వము లో నుండి కాల బద్ధులై  ఉన్నందున ఉపాసనా మార్గము ద్వారా ఆత్మానాత్మ విచారణ ద్వారా జ్ఞానసముపార్జనము కావించి జీవునికీ శివునికీ భేదము లేదను తత్వ చింతనయే మోక్షమార్గము అదియే పాశుపతాస్త్రము .


కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా || 33 ||

భండాసురుని తోపాటు అతని రాజధాని అయిన శూన్యకపట్టణము , సకల రాక్షస గణము లన్నియు కామేశ్వర మంత్రాస్త్ర  ప్రభావంతో భస్మీపటలం అయినది . ఆ వెంటనే బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు ప్రత్యక్షమై అమితానందము పొందిరి . ఎప్పటికైనా తమోగుణ జీవులు నాశము చెందుదురు . ఇంతటితో భండాసుర వధ సమాప్తం . 

అసలు ఈ భండాసురుడు ఎవరు ?

        ఒకప్పుడు దేవతలందరూ శివపార్వతుల అన్యోన్యతను వీక్షించు తలపున పరమశివుడు తపో నిష్ఠలో నున్న సమయాన మన్మధుని రావించి శివునిలో కామ ప్రకోపముద్భవింపజేసి , పార్వతియందనురక్తి కలిగించమని కోరగా , తన చేతనున్న పూల బాణములను శివుని పై వేసెను . అంతట పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై తన త్రినేత్రాగ్నితో మన్మధుని దహించెను . ఆ దహన భస్మము నుండే భండాసురుడు జన్మించెను .


హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా || 34 ||


దేవాత్మ భావనలో నున్న మన్మధుడు తన పంచ ప్రజ్ఞలు కామోపాసన ద్వారా వినియోగించి అజ్ఞానముతో  శివునిపై సంధించగా శివ నేత్రాగ్నికి దగ్ధము చేయ అంతట మన్మధసతి అమ్మను వేడుకొనగా తన కామ సంజీవనీ విద్య ద్వారా మన్మధుని తిరిగి బ్రతికించి యధా రూపంలో గోప్యంగా రతీదేవికి మాత్రమే అగు పడునట్లు సంపూర్ణ జ్ఞాన వంతుని చేసెను . అందుచే అమ్మ అమృతేశ్వరి అయినది . ఇప్పటివరకూ అమ్మ స్థూల రూపం వర్ణన చేసినాము . ఇప్పుడు మంత్ర వైభవము తో కూడిన సూక్ష్మ రూప వర్ణన తీరు చూద్దాం .

      శ్రీ లలితా దేవి త్రి విధములైన కూటస్వరూపములతో నుండును . మానవులందరూ ఈ త్రికూట బద్దులే . పురుషార్ధములు నాలుగు విధములు అవి 1  ధర్మ 2 అర్ధ  3 కామ 4 మోక్షము . ఈ నాలుగు పురుషార్థములు మూడు కూటములoదే నెరవేర్చు కొనవలెను .

1 . వాగ్భవకూటము :- మానవునకు వాక్కు ప్రధాన ఇంద్రియ శక్తి భాగము .   మాట్లాడు ప్రతీ మాటా లౌకిక వ్యవహారములకు ధర్మబద్ధంగా ఉండాలి . దానినుండి జ్ఞానము ఉద్భవించును . ఆ జ్ఞానము శాస్త్రముల నుండే లభించును . వాటి ద్వారా అమ్మ అనుగ్రహ ప్రాప్తి కలిగి ముక్తి పొందును .

2 .కామరాజకూటము :- ఈ కూటము కంఠము నుండి కటి ప్రదేశము వరకూ వ్యాపించి ఉండును .ఈ కూటము ద్వారా అర్ధ కామాదులను నెరవేర్చు కొనవలెను . ధర్మబద్ధమైన అర్థము ( ధన సంపాదన ) మాత్రమే సముపార్జన చేసుకొని ఆనందమయ జీవితం గడపాలి . అదే విధముగా పరిమిత కోర్కెలు కలిగి ధర్మబద్ధమైన కామవాంఛలు నెరవేర్చుకుంటూ సంసారం సాగించాలి .

3 . శక్తి కూటము :- అమ్మవారి మంత్రము 15 అక్షరములతో కూడిన పంచదశి మంత్రము . అమ్మ విగ్రహ మూడు భాగములే పంచదశ మంత్రము లోని మూడుభాగములు . ఈ మూడు భాగములే నాలుగు పురుషార్థములు తీర్చునదీ . అమ్మ శరీర భాగముల వలెనే మన శరీర అవయవాలు కలవు . నడుము కింది భాగం నుండి పాదముల వరకు మంచి దృఢమైన శరీర ఆకృతిని ధరించి నడిపించేది ఈ శక్తి కూట లక్షణము . ఇదియే అమ్మ పాదాశ్రయనికి మోక్షమార్గము . ఇదియంతయు శ్రీవిద్యయే . శ్రీమద్వాగ్భవ... మంత్రములో శ్రీ o అను బీజాక్షరము కలదు . ఈ త్రికూట మంత్రములలో పురుషార్థ సాధన , బీజమంత్రోపాసన  కలవు . నిత్య పారాయణకు అనుగుణమైనవి .


కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |

శక్తికూటైకతాపన్న కట్యథోభాగ ధారిణీ || 35 ||

పై మంత్ర వివరణ అర్థము 34 వ శ్లోకార్థముతో కూడి ఉన్నది 

కావున గమనించవలెను .


మూలమంత్రాత్మికా, మూలకూటత్రయ కళేబరా |

కుళామృతైకరసికా, కుళసంకేత పాలినీ || 36 ||


              మూడు కూటముల కలయికతో నున్న మంత్రమే అమ్మవారి మూల మంత్రము . కులము అనగా కుండలినీ స్వరూపము . షట్చక్ర ప్రధానమైన ఆజ్ఞాచక్రము నుండి మూలాధారము వరకూ కుండలిని అందురు .  అనగా కుల చక్ర సమూహము . మానవ శరీర భాగములలో నయినా , అమ్మ శరీర చక్రములలో నైనా వివిధ దేవతా సమూహములతో నుండి చైతన్యము కలుగుచున్నది . ఏడవ నెల గర్భస్థ శిశువుగా నుండగా శిరఃభాగము నందున బ్రహ్మరంధ్రము నుండి ప్రాణశక్తి యైన ఈశ్వర శక్తి శరీరంలో ప్రవేశించి సుషుమ్న నాడి (వెన్నుదండము లోని మధ్యనాడి ) ఇరుప్రక్కల ఇడ ,పింగళ నాడుల ద్వారా ఆజ్ఞా చక్రము నుండి మూలాధార చక్రము వరకు విస్తరించి సమస్త నాడీ మండలమునూ చైతన్య పరచు చున్నది .

              అమ్మ శ్రీచక్ర మంత్రోపాసన చేయువారు ఆ చక్ర ప్రతిమకు , పూజకు ముందు కలశమును ఏర్పాటు చేసి షోడశ మంత్రములతో అమ్మను కలశ జలము నందాహ్వానించి మంత్రానుష్టానంతరము ఆ జలము అమృత స్వరూపమవగా ఆ దేవి మిక్కిలి ఆనంద పడును . అది మనకు పరమ పవిత్ర తీర్థము .


కులాంగనా, కులాంతఃస్థా, కౌళినీ, కులయోగినీ |

అకులా సమయాంతఃస్థా, సమయాచార తత్పరా || 37 ||


కులము = సమూహము.        కులసంకేత = శ్రీచక్ర దేవతలు

కులాంగన = కుల స్త్రి.              కులాంతస్థా = చక్ర స్థానగమనము

అకులా  = సహస్రారము


            యోగులు  గాని , పరమ భక్తులు గాని తాదాత్మ్య దశలో కుండలిని స్వరూప మూలాధారము నుండి సహస్రారము వరకు ఒక్కక్క చక్రమునూ దాటి సుషుమ్ననాడి నందున్న అమృత జలమును ఆయా చక్ర స్థానమునకు చేర్చి అచట ఉన్న దేవతా సమూహములను పాలించు తల్లి లలితాంబికా దేవి . అందుచే ఆమె కులాంగన . కుండలినీ కులము లోనున్న పద్మ చక్ర స్థానంల నుండి పైపైకి చేర్చు ప్రక్రియకు మూలము ఆ తల్లియే కావున ఆమెకు కులాంతస్థా అను నామము .

                కుల సమూహ దేవతా శక్తులు కలుపుకొని ఆయా చక్రాది గమనము కలిగాక యోగి , మాత తో కలసి శివ స్థానమైన అకులము (అనగా సహస్రారము ) తో అచ్చట వేంచేసి ఉన్న శివశక్తి ఏక స్వరూపమైన అమ్మ పాదారవిందములకు  జేరుట యేమోక్షము . ఈ శక్తి సాధన మిక్కిలి కష్టతరమైన అఖండ భక్తి తో కూడినది .

            మానవశరీరం కుండలిని చక్ర సమూహ కులమైయితే , ఆత్మ స్వరూపము అకులంకు చెందినది . ఈ రెండింటిని సమన్వయస్థితికి తెచ్చి పై అంతస్తు ( సహస్రారం ) చేర్చి శివశక్తుల మమేకం చేయును . అదియే సర్వం బ్రహ్మ మయం .

 సమయాచార వివరణ :-

             వివిధ కులములు , జాతుల వారికి  వారి కులాచారములను బట్టి పరంపరానుగతముగా ఒక్కొక్క దేవతాపూజ వారి అభీష్టము గా జరుపుకుందురు . ఈ విధమైన ఆచారములు రెండు విధాలు . 

1 వామాచారం 2 దక్షిణాచారం . మన దేశమున మనము దక్షిణ  ప్రాంతవాసులమయినందున మనది దక్షిణాచారం . ఇది వేద మార్గాను సారము కొనసాగే సనాతన ధర్మ మార్గము .

 ఈ మార్గమున కొలవబడే దేవతా స్వరూపాలు పంచ సామ్యములుగా విభజించబడినవి .

1. రూప సామ్యము :- ఈ సామ్యము నందు శివుడు త్రినేత్రుడు . అమ్మ        కామాక్షి దేవి త్రినేత్రి . అదే విధముగా శివుని శిరస్సున చంద్రుణ్ణి ధరించి చంద్రశేఖరుడవగా అమ్మ దుర్గాదేవి చంద్రశేఖరి అయినది .

2 నామ సామ్యము :- ఇందు కొద్ది మార్పుతో ఒకే నామముతో భాసిల్లు చుందురు . శివ -శివాని , భవ – భవాని , రుద్ర – రుద్రాణి , శంకర – శంకరి ,

3 అధిష్టాన సామ్యము :- శంకరుడు లింగ స్వరూపుడు . ఆ లింగము పార్వతీ స్వరూపమైన పానవట్టము పై ఆధిష్ఠితమై యుండును .

4 అనుష్టాన సామ్యం :- ప్రకృతి శక్తుల  శివశక్త్యైక్య రూపము ఏకత్వము గా భావించి పంచ శక్తులను ఇరువురూ నిర్వహింతురు . అవి సృష్టిస్థితి అను రెంటినీ అమ్మ నిర్వహించగా శిరోధాన , అనుగ్రహ , సంహారములు శివుని నిర్వహణగా జరుగును .

5 అవస్థా సామ్యం :- సమయాచార పద్ధతిలోని అవస్థా స్వామ్యం లో శివ శక్తులు ఇరువురునూ తపోనిష్ఠతో హృదయంలో పరిపూర్ణ భావనాత్మక ముగా ఎవరు భక్తితో పూజింతు రో అట్టి వారల కోర్కెలు తీర్చుటకు పోటీ పడుదురు . వారే కామేశ్వరుడు కామేశ్వరి .






మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |

మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ || 38 ||


         వెన్ను దండము లో చివరనున్న మూలాధారచక్రంలో సుషుమ్నాoతర్గతమైన కుండలినీ శక్తి చుట్ట చుట్టుకొని ఉండి తపోనిష్ఠతో ఒక్కొక్క చక్రము దాటి పైపైకి పయనించు వేళ సుషుమ్న  నిట్ట నిలువుగా మారి అందున్న జీవామృతం ఒత్తిడితో బ్రహ్మ గ్రంధి విభేదన జరుగును . ఆ సమయాన శరీరము స్థూల సూ క్ష్మ  కారణములుగా మారి మిథ్యగా గోచరించును   .

               పిమ్మట అమృతధార మణిపూరక ( పది రేకలతో నిండిన పద్మము )                 నందు ప్రవేశము పొంది సూక్ష్మరూప మై విష్ణుగ్రంధి   ఛేదనము జరుగును .


ఆజ్ఞాచక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభివర్షిణీ || 39 ||


 సూక్ష్మ కారణ శరీరములుగా కూడా కాని ఆ స్థితిలో జాగ్రత్స్వప్నసుషుక్తిని మరచి అంతరతర ఉపాసకుడుగా మారి జీవన్ముక్త దశ లో ఆజ్ఞాచక్ర పద్మ స్థానముగా నున్న రుద్రగ్రంధి (ముడి ) ఛేదనము జరిగి సహస్రారపద్మాసనారూఢుడైనపరమేశ్వరు సాయుధ్యము చెంది ఐక్యమై జీవన్ముక్తుడగును . ఈ విధమైన తపశ్శక్తి మహామహులైన యోగి పుంగవులు కే సాధ్యము . ఆ సమయంలో యోగులు ఆనందామృతంలో తేలియాడుతూ మోక్ష ప్రాప్తి పొందెదరు .



తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా |

మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ || 40 ||


బిసతంతు = తామర తూడులా నున్న దారము

పై తెలిపిన గ్రంధి విభేదము లో యోగులలో ఎట్లు జరుగునో , అమ్మ మహా ఆసక్తి స్వరూపురాలై మూలాధార కుండలినిలో అచట నున్న పద్మ (తామర ) తూడులో ప్రవేశము కలిగి అందున్న దారమును విద్యుల్లేఖ (మెరుపుతీగ ) గా చేసుకొని మిక్కిలి ప్రకాశవంతమైన ఉత్సాహముతో సహస్రారము నందున పరమేశ్వరుని సన్నిధికి జేరి సంతసించును .

ఇదియే కుండలిని విద్యా స్వరూపము .



భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |

భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ || 41 ||


           పై 40 శ్లోకాలలో చిదగ్ని కుండము నుండి అమ్మవారి ఆవిర్భావము ,  అమ్మ దివ్య సుందర రూప వర్ణన , చింతామణి గృహవర్ణన , భండాసుర వధ కొరకు అనుచర దేవతాగణసమకూర్పు , అసుర సంహారం , కుండలిని విద్యా స్వరూపము మొదలగు అంశములపై 111 నామములలో మూల గ్రంథ నామాలుగా చెప్పబడినవి .

        ఇప్పుడు పై భవానీ నామము నుండి 131 వరకు ఉపాసన నామములు అందురు . ఈ ఇరవై నామములకు శాంభవీవిద్య అని పేరు . భవానీ భావనా గమ్య అనగా భావన చేత గమ్యము పొందబడినది అని అర్థము . ఈ భావన మనస్ఫూర్తితో భక్తిగా మంత్రము జపిస్తూ 1 శబ్ద భావన 2 అర్థ భావన 3 సచ్చిదానంద భావన కలిగి జ్ఞానేంద్రియ నియంత్రణతో తపించిన , నేను నాది అను  భవారణ్యమను చింతను నరికివైచి భక్తునకు అమ్మ ఉపయుక్తురాలగును . అందుకే అమ్మవారి ధ్యాన శ్లోకం అయిన

 “   అరుణా o ........భవానీమ్ “ అని ముగించడమయినది .

       భద్ర ప్రియ భద్ర మూర్తి యనగా మంగళ స్వరూపిణి అయిన అమ్మవారు తన భక్తులను నిరంతరము కాపాడి , మూర్తీభవించిన శ్రద్ధతో తన భక్తులకు సకల సౌభాగ్యములు కలుగ చేయును .


భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |

శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ || 42 ||

         భక్తి అనగా అమ్మ యందు అనురాగము కలిగి భగవద్ధర్మముల యందు మనస్సు నిలుపుట . అలాంటి భక్తులoటే అమ్మవారికి మిక్కిలి ఇష్టము . భక్తులకు వారి గమ్యము నిర్దేశించి వారి భయాలను తొలగించి , నిగూఢమైన వారి భక్తికి మెచ్చి లొంగిపోవునది . ద్వైత భావన భయకంపితము .  అద్వైతమేవ భయం నాస్తి .

     శాంభవి అనగా సకల శుభములకు మూలమైనది . వేదమంత్రం ప్రకారము శంకరుడు శుభ స్వరూపుడు 

ఓం నమః శంభవేచ మయో భవేచ

నమః శంకరాయచ మయస్కరాయచ

నమః శివాయచ శివతరాయచ ఓం |

    ఆ శంభుని రాణియే శాంభవి .

     శారదారాధ్య అనగా తపశ్శక్తి సంపన్నులైన జ్ఞానులచే ఆరాధింపబడునది . బహిర్ దృష్టి విడనాడి అంతర్లక్ష్యసాధనలో నిమగ్నమై ప్రసన్న భావ భక్తితో అమ్మ ఆరాధకులు ఉండవలె .

   శర్వాణి అనగా సకల సుఖములనొసగు శర్వుని భార్య . ఈమెనే సుఖిచి అందురు .

శర్మ యనగా జ్ఞానానందము పొందిన వాడు . నిరంతర భక్తిపారవశ్యంలో నుండు మునులు , రుషితుల్యులు అంటే అమ్మ ఇష్టపడును . ఎల్లప్పుడూ అమ్మని కీర్తించు వశిన్యాది వాగ్దేవతలు అమ్మదయా పాత్రులు .

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్ర నిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా || 43 ||


అమ్మవారు శంకరుని అర్థనారీశ్వర స్వరూపిణి కావున ఆ శంకరతత్వ స్వరూపము వలెనే మిక్కిలి శాంత స్వభావు రాలై శుభంకరి అయినది . అమ్మ పతివ్రతలకందరకూ ఆదర్శవంత సాద్వీమతల్లియై తన భక్తులకు సదా సిరి సంపదలను ఇచ్చి కాపాడును . శ్రీకరీ యనగా అమృత స్వరూపిణి మరియు శ్రీ విద్యా స్వరూపిణి . సాధ్వి అనగా వేదమాత . మేలైన గుణములు కలది .

శరచ్చంద్ర నిభాననా యనగా శరత్కాలంలో పరిపూర్ణ తేట దనము తో కూడిన నిండు చంద్రుని వదనము కలది యని అమ్మ ముఖవర్చస్సు కీర్తించుట . ఇచ్చట అమ్మ రూప సౌందర్య స్మరణ చేస్తూ ఆమె ముఖ పద్మము లోనే ఆమె లోనున్న ప్రసన్నత , జ్ఞాన , ఆనందమయ దృష్టి గా భావించవలెను .

శాతోదరీ :- అనగా అనేక ఉదర గుహలు కలిగిన హిమవంతుని కూతురు . ఈమె యే గౌరీ , హైమవతి అందురు .ఈమెను వనదుర్గా నామ మంత్రముగా, హిమవత్పర్వత   రాజపుత్రి అని కూడా అందురు .

శాంతిమతీ :-  శాంభవీ విద్యా మంత్ర పూజలో చివరగా అమ్మ శ్రీ చక్ర ఆవరణలో నవావరణముగా ఈమెను  చెప్పబడినది . శాంభవి విద్యకు అధి దేవతగా భవానీ ఉండగా ఆమె అంగ దేవతలుగా శాంభవీ , శర్వాణీ ,శాంకరీ , శ్రీకరీ , శాతోదరీ , శాంతిమతీ  ఈ ఆరుగురూ ఉందురు . శాంతి మతి అనగా శాంతము గలది అని అర్థము . అసలు శాంతం అనగా అంతర్ బాహ్య కరణములలో అనగా శమదమాదుల యందు ఒకే విధమైన మానసిక ప్రసన్నత కలిగి ఉండుట . లౌక్య వ్యవహారములలో మనము వేరుగా నుందుము . అమ్మవారు మాత్రము లోకాతీత శాంత మృదుస్వభావిగా నుండును .

నిరాధారా నిరంజనా :- అమ్మవారి ఆరాధన విషయంలో రెండు విధములైన ఉపాసనా పద్ధతులు కలవు 1  సగుణ బ్రహ్మోపాసన 2 నిర్గుణ బ్రహ్మోపాసన . సగుణ ఉపాసనలో మనము ఆరాధించు దేవతాస్వరూప  నామ , గుణ , స్తోత్రములతో పూజిస్తాము ఇదియే మెడిటేషన్ (meditation ) . అదే నిర్గుణ ఉపాసన లో నామ స్తోత్ర సంబంధం లేక  అవ్యక్త రూపమైన పరబ్రహ్మస్వరూపం తలచుట . అదియే రియలైజేషన్ (  realisation ) రెండు పద్ధతుల్లోనూ భగవంతుని వెదుకుటే ముఖ్యము . అయితే ఆ భగవత్స్వరూపము మన హృదయ కుహరము నందే గలదని గ్రహించాలి .

        నిరాకార నామం సగుణోపాసన తో రుషులు అమ్మను సాక్షాత్కరింప చేసుకొని వారు ఆ దివ్య స్వరూప అనుభవములను వెల్లడించటం వలన మనము విశ్వసించి శ్రద్ధగా ఆచరించుటచే ముక్తి కలుగుచున్నది . అయితే అమ్మ పరతత్వ పరమార్థ స్వరూపు రాలు కావున సృష్టిలో ఆకాశము ఏ ఆధారమూ లేకుండా ఉందో అమ్మ కూడా ఆధారము లేనిది . శాశ్వతురాలు .

నిరంజనా :- ఉపాధి లక్షణం కలిగిన అవిద్యతో సంబంధం లేనిది . 


నిర్లేపా, నిర్మలా, నిత్యా నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా నిష్కామా, నిరుపప్లవా || 44 ||

ఇచ్చట ఈ శ్లోకము నందు అమ్మవారి నామ గుణ విశేషములను వివరణగా చెప్పుట జరుగుతున్నది .

నిర్లేపా :- ఎలాంటి వికారములకు లొంగనిది

నిర్మలా :- మాలిన్యము లేనిది

నిత్యా :- ఆది , మధ్య , అంతము లేనిది . నాశము లేనిది .

నిరాకారా :- ఆకారము లేనిది

నిరాకులా :- కలతలేనిది .

నిర్గుణా  :-  గుణ వివక్ష లేని సర్వ వేద పరతత్వ సార స్వరూపిణి .

నిష్కళా  :-  తత్వ నిష్కలతత్వము కలది . 

శాంతా    :- ప్రశాంత వదనం కలది

నిష్కామా :- కోరికలు లేనిది . కోరికలనగా అనుభవంలో కొరత కలిగిన కోరిక          ఉదయించుట .

నిరుపప్లవా :- ప్లవము అనగా నాశనము కనుక నాశనము లేనిది .





నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా నిరంతరా || 45 ||


నిత్యముక్తా :- నిత్యము ముక్తి పొందినది.

నిర్వికారా  :-  ఏ వికారములు లేనిది .

నిష్ప్రపంచా  :- ప్రాపంచిక విషయములు పట్టనిది

నిరాశ్రయా    :-  ఎవరి ప్రాపకం అక్కర్లేనిది .

నిత్యశుద్ధా   :-  ఎల్లప్పుడూ శుద్ధముగా నుండునది

నిత్యబుద్ధా     :-  ఏ నామ స్తోత్రము ద్వారా మనకు సద్బుద్ధి ప్రబోధము చేయు నో వాటి యందు ఆసక్తి కలది . నిత్య సత్య బోధన చేయు తల్లి .

నిరవద్యా     :-   అవధులు , పరిమితులు లేనిది . అనగా వ్యాప్తి చెందినది .

నిరంతరా      :-   తన భక్తుల కోర్కెలు ఎల్లప్పుడూ తీర్చునది .



నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |

నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ || 46 ||


      వశిన్యాది వాగ్దేవతలు లలితాదేవి ఆత్మస్వరూపం వర్ణన చేస్తూ , అమ్మ తన అద్భుతమైన యోగ శక్తి రూపం ప్రకటితము చేయుచున్నది .

నిష్కారణా    :-   తన ఉనికికి ఎలాంటి కారణమూ లేనిది .

నిష్కళంకా   :-    కళంకము , వంకలు లేనిది .

నిరుపాధి     :-    ఉపాధి లేనిది .

నిర్నిరీశ్వరా :-    సర్వ స్వతంత్ర రాలు అనగా ఎవరి నియంత్రణ లేనిది . మానవుడు వాని జీవనగమనం 17 విధములైన దోషములు కలిగి జీవ యాత్ర సాగిస్తుంటాడు . ఎల్లప్పుడూ అజ్ఞానాంధకార చీకటిలో జ్ఞాన దీపం అను వెలుగును ప్రసాదించమని త్రికరణశుద్ధిగా అమ్మను భజించిన వారికి వారి దోషములు పోగొట్టును .

నీరాగా         :-    ప్రీతికర విషయములందు ఆసక్తి .

రాగమథనీ   :-     ఆ కోరికలు కలగకుండా మధనము చేసి పోగొట్టుకున్నది

నిర్మదా        :-      అహము , మదము కలిగి ఉండుట

మదనాశినీ  :-      అహంకారము అణచివేయు తల్లి .



నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |

నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ || 47 ||


నిశ్చింతా            :- నిరంతరము ఏదో ఒక చింత మనసునందు ఉంచుకుని బాధ పడుట .

నిరహంకారా       :- సజీవ చింతాక్రాంతులైన వారిని కాపాడునది .

నిర్మోహా              :- ఇతరుల వ్యామోహంలో పడుట .

మోహనాశినీ      :-  ఆత్మశక్తి క్షీణత పొందినవారి మోహమును పోగొట్టి జాగృత పరచును .

నిర్మమా             :-  నేను నాది అను భావనలో నుండుట .

మమతాహంత్రీ    :- మమతాను బంధములను హరించి ధీరత నొసంగు నది .

నిష్పాపా             :-  చేయొద్దు అన్న పనులు చేయుట .

పాపనాశినీ         :-  అలాంటి వారి యందు కారుణ్యము వహించి సమూలంగా నాశనము చేయునది .


నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |

నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ || 48 ||


నిష్క్రోధా         :- అకారణ కోపము కలుగుట .

క్రోధశమనీ      :- అలాంటి వారి కోపమును దహించు తల్లి .

నిర్లోభా            :-  ధనవంతుడు అయ్యుండి దానము చేయక లోభిగా నుండుట .

లోభనాశినీ     :- లోభత్వము నాశనం చేయునది .

నిఃసంశయా    :-  అవిద్య వలన ఏకాగ్రత లేనందువలన ప్రతి విషయంలో అనుమానము ( సంశయము ) కలుగుట .

సంశయఘ్నీ  :-  సంశయములను దహించునది .

నిర్భవా          :-  పుట్టుక చావు వలయంలో కొట్టుమిట్టాడుట

భవనాశినీ     :-  జీవన చక్ర బంధములను ఛేదించి ముక్తి కలుగజేయు తల్లి . ఇందు కొరకు అమ్మకు ప్రీతి కరమగు శరన్నవరాత్రి పూజలు తప్పక చేయవలయును .


నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |

నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా || 49 ||


నిర్వికల్పా          :-  అమ్మ గుణ విశేషములు తెలుపుతూ అందరినీ సమానంగా చూస్తూ ఎవరి యందూ కల్పిత ఉద్దేశ్యము లేనిది .

నిరాబాధా          :-   లౌకికంగా మానవులు ఇతర విషయాశక్తులపై ఆసక్తిగా నుండి వారి వలన బాధలు అనుభవిస్తూ ఉంటారు . అలాంటి వారు సభక్తిగా అమ్మ నామస్మరణ చేసిన తక్షణమే ఆ బాధల నుండి విముక్తి చేయును .

నిర్భేదా.             :-   సజాతి , విజాతి భేదము లేనిది .

భేదనాశినీ          :-   వసుదైక కుటుంబం అను నానుడికి వ్యతిరేక భావన కలిగి ఉన్న వారిని నాశనము చేయును  .

నిర్నాశా             :-   నాశనము లేనిది సదా ఉండునది .

మృత్యుమథనీ.  :-   కొందరి ఏమరుపాటు వలన చేయు పనులలో ముందు చూపు లేక అమృత మయమైన జీవితం మృత్యువు పాలు చేసుకుంటున్నారు . అలాంటి ఆపదలను మధనము ( తప్పించి ) చేసి కాపాడు తల్లి .

నిష్క్రియా.          :-   ఏ విధమైన క్రియ లేనిది . కానీ క్రియా రూపము కనిపించకుండా నిత్య చైతన్య ఉనికిగా నుండును . మనిషి పుట్టుక , శిశువుగా నుండి ఎదుగుట , సూర్య శక్తి వలన మొగ్గ వికసించి పుష్పము గా మారు చందము వలే ఆ చైతన్య శక్తి ప్రభావమునకు అమ్మే కారణము .

నిష్పరిగ్రహా         :-   ప్రకృతి యందoతా విస్తరించి ఉండు అమ్మ మనకు అనేక ప్రయోజనములు కలుగజేస్తూ లాభాపేక్ష లేక మన నుండి ఏమీ తీసుకోనిది .





నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |

దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా || 50 || 

ఈ శ్లోకము నుండి దుర్గా నామములు వాటి విశిష్టత రుషులు తెలుపుతున్నారు .


నిస్తులా          :-    అమ్మవారు సాటిలేనిది . ఎవరితోనూ పోల్చదగినది కాదు . సకల సద్గుణ కళా రాశి అయిన నిత్య యవ్వనవతి అయిన అమ్మ తుల లేనిది . పోల్చలేనిది .

నీలచికురా.     :-  అమ్మ వారి ముఖ పద్మము నల్లని ముంగురులు తో మిక్కిలి శోభ కలిగి వసంత రుతువులో నుండు చిగురుటాకుల చెట్టు వలె కళ కలిగియుండును .

నిరపాయా       :-  తనకు ఏ విధమైన అపాయము కలుగని తల్లి . తన ప్రియ భక్తులకు ఎలాంటి అపాయము కలుగకుండా సర్వదా రక్షించును .

నిరత్యయా      :-   జగన్మాత తన భక్తుల అర్హత ననుసరించి ఎవరికి ఎంత వరకు తన సహకారం అవసరమో అతిక్రమణ లేక అందించునది .

దుర్లభా           :-   దుర్గామాత అనుగ్రహము పొందుట సాధ్యము కానిది . అమ్మ దయ పొందవలెనన్న అత్యంత మనో నిగ్రహ శక్తితో క్రమంతప్పక కఠోర తపస్సాధనతోనే లభించును . మాత అనగా కొలుచు నది .

దుర్గమా         :-   అనేక కష్ట తరమైన మార్గములు అనుసరించి ఏకాగ్ర మనసుతో పరతత్వ భావనతో చక్కని సంకల్ప నిష్టతో అమ్మ అనుగ్రహ ప్రాప్తి కలుగును . మామూలు మాటలకు అందనిది .

దుర్గా.            :-   ఈ నామము చాలా విశిష్టమైనది . దుర్గతులను తొలగించునది . సకల దుః శబ్ద నామ గుణ దోషములు నాశనము చేయునది  - దుఃఖము ,  దుస్సాధ్యము , దురహంకారము . దుస్సాహసం మొదలగునవి . దుర్గాదేవి యజ్ఞ స్వరూపిణి . అమ్మ లలితాదేవికి ప్రతి రూపంగా భావించ తగును . ఆమె కూడా చిదగ్నికుండము నుండే వెలువడినది . పరతత్వ సాధనలో యజ్ఞం ద్వారా అగ్నిదేవుని సహాయము వలననే పరమేశ్వరుని సాక్షాత్కారము లభింప చేసుకొని అమ్మను జ్ఞానమార్గం ద్వారా పొందవచ్చును . అమ్మ  ఆశ్రయ శక్తిస్వరూపిణి . సామాన్య నిర్వచన అర్థము దుర్గము అనగా కోట . కోటలో ఉన్నవారికి రక్షణకు  కొదవుండదు . అదే విధముగా దుర్గ ను ఆశ్రయించిన వారికి సకల ఈతిబాధలు తొలగి పోవును . దుర్గముడు  అను రాక్షసుని సంహారము చేసి నందున ఆ తల్లి దుర్గ అయినది ..

దుఃఖహంత్రీ    :- అనగా దారిద్య దుఃఖ భయ హారిణి . లోకములో మానవులకు అనేక విధములైన దుఃఖములు కలుగుచుండును . ఐదు విధములైన భయాలకు మనిషి దుఃఖ భాజనుడగుచున్నాడు . ఈ భయాలను ‘ప ‘ వర్గ భయములు అందురు .ప = పాపము ,ఫ = ఫలాపేక్ష ,బ =  బతుకుతెరువు , భ = భరింపరాని ఆందోళన , 

మ =మరణము . అమ్మవారు అనుగ్రహించి వీటిని దూరము చేయును .

సుఖప్రదా       :-   సుఖములు రెండు విధాలు . ఒకటి విషయ సుఖం రెండు పర సుఖం . లౌకిక విషయ సుఖ సంతోష ము అనుభవిస్తూ ఆనందమయ జీవన యాత్ర కు అమ్మ తోడ్పాటు సర్వదా లభిస్తుంది . కానీ , ఆ సుఖ లోలతలో నుండక , పరమాత్మ యందాదరభావన పెంపు చేసుకుని ఆధ్యాత్మిక సాధన ద్వారా కైవల్య సుఖప్రాప్తి పొందవచ్చు . ఈ శ్లోక రెండవ పాదములో దుర్గా నామము మధ్యలో నుంచి ముందు రెండు నామములలో దుర్గా తత్వమును వివరించి తరువాత రెండు నామముల ద్వారా నామ ఉచ్చారణ ద్వారా ప్రయోజన ఫలశృతి చెప్పినట్లయినది .



దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |

సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా || 51 ||


దుష్టదూరా             :- అమ్మ వారి గుణతత్వం ప్రకారం దుష్టులకు దూరంగా ఉండునది . దృగ్గోచరియై బహిర్ముఖ దుష్టులను దరికి చేరనీయనిది .

మనుషులలో స్వాభావిక దుష్టులు , ప్రభావిత చెడ్డవారు అను రెండు విధములుగా నుందురు . దుర్గా నామము మనము నందుచ్ఛరించిన వారిని ఆ దుష్ట శక్తుల నుండి దూరము చేయును .

దురాచార శమనీ.     :- శాస్త్ర విరుద్ధమైన ఆచారము పాటించు వారు కర్మాచరణ ప్రకారము అహము వీడక కొందరూ  , జ్ఞానవంతులు అయ్యుండి నాకన్నీ తెలియునని పాటించే ఆచార ప్రభావముతో ఆ దురాచార పరులకు అమ్మ అనుగ్రహం కలుగదు . కేవలం శరణాగత భక్తి మార్గము వలన మాత్రమే అమ్మ దయకు పాత్రు లై అట్టి వారిని దురాచారములు నుండి కాపాడి సదాచార మార్గమున నడిపించును . సాధనా  మాధుర్యభక్తి వలననే దురాచారములు పోగొట్టును .

దోషవర్జితా                 :- అమ్మ కు ఎటువంటి దోషములు అంటవు . తన్ను శరణుజొచ్చిన తన భక్తుల దోషములను తొలగించును .

ఇంత తో దుర్గాదేవి నవావర్ణ నామ తత్వము ఆ నామజపము వలన కలుగు 3 ప్రయోజనములు తెలుపుట జరిగినది .


సర్వజ్ఞా.                      :- అమ్మ శ్రీమాతయై సర్వ వ్యాప్తమై యుండి సర్వస్వతంత్రురాలై సంపూర్ణత కలిగి , అనాది బోధకురాలై సర్వము తెలిసిన తల్లి .

సాంద్రకరుణా               :- అమ్మవారు ఘనమైన దయగల తల్లి . అమ్మ ప్రబోధము లు జ్ఞాన మార్గముచే గుర్తెరిగినవారిని , ఆమె మిక్కిలి దయాసముద్రురాలు కావున అనుగ్రహ పాత్రులగుదురు  .

సమానాధికవర్జితా      :- ఆ తల్లికి సమానమైన దేవతలు ఎవరూ లేరు . అందరిలో అధికురాలు కావున సాటిలేనిది .


సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |

సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ || 52 ||


సర్వశక్తిమయీ :- ఒక్కొక్క దేవతా వారి వారి ప్రత్యేక శక్తులతో నుందురు . ఇంద్రు నకు ఉన్న శక్తి అగ్ని దేవునకు లేదు . అదే విధముగా వరుణునకున్న శక్తి అగ్నికి లేదు . లలిత అమ్మవారి విషయంలో సర్వ దేవతా శక్తి స్వరూపిణి . పదార్థ శక్తులన్నిటి యందూ అమ్మ ప్రతిరూప శక్తి అయిన గౌరీ దేవి ఉండును .


ఉదాహరణకు సూర్యుని వెలుగు లో కాంతి శక్తిగానూ , చంద్రుని వెన్నెలలో ఔషధీయ శక్తిగానూ , నదీజలములందు ప్రాణశక్తి గాను తన చైతన్య శక్తిచే ప్రభావితము చేయుచున్నది . అమ్మ శ్రీ చక్ర నిలయమైన బిందు స్థానములో నుండి నవావరణ క్షేత్రములలో  అకారము నుండి క్ష కారము వరకు గల దేవతలంతా ఆమె నియంత్రణ యందే వుందురు . కావున అమ్మ సర్వశక్తి మయి.


సర్వమంగళా  :- అమ్మ మేలుచేసెడి సంపూర్ణ మంగళ మయ స్వరూపిణి . అమ్మ పరబ్రహ్మస్వరూపిణి అయినందున పూర్తి భగవచ్ఛక్తి కలిగి యుండి భక్తుల ఆర్తి ననుసరించి ఎలాంటి అమంగళములు కలుగ జేయనీయదు .

సూర్యోదయ వేళ ఉషోదయ సమయాన కనిపించు అరుణకాంతి అమ్మ స్వరూపమే . ధ్యాన శ్లోకము నందే “ అరుణాం కరుణాతరంగితాక్షీo “ అని ప్రత్యక్ష దైవము సూర్యభగవానుని రూపముగా తలంచి ప్రార్ధించి సకల జీవులకు అన్న ప్రదాతగా భావించవలె . ఉషోదయ ఉష:కాంతిని సుమంగళి అందురు . లౌకిక లోకంలో మానవాళి అనేక కోరికలు కలిగి ఉందురు . అట్లుకాక హృదయ సంకల్పములు శుద్ధమై ఉంటే అమ్మ స్పందన కూడా వేగవంతమై శుభములు కలుగును . మనము నిత్యమూ చూసే సూర్యుడు ,తులసి , మారేడు చెట్టు , ఆవు ,పాలు , నెయ్యి , ప్రకృతి ,పాలించు రాజు మొదలగువన్నియు మంగళకర అమ్మ స్వరూపాలే .


సద్గతిప్రదా  :- ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుటయే సద్గతి . దుర్గతి అనగా అధోగతి . సద్గతి లో రెండు మార్గములు 1 సాపేక్ష మార్గము 2 నిరపేక్ష మార్గము .

       1  సాపేక్ష విధానము   జీవ ఆవిర్భావ సిద్దాంతం ప్రకారం మన ఉపాసన ననుసరించి శిలా ,వృక్ష , పక్షి , జంతు జన్మలు అనంతరం మనిషిగా జన్మ పొంది తను చేయు యజ్ఞ , దైవ కార్యముల వలన మోక్షప్రాప్తి కలుగును . 2 నిర పేక్ష విధానంలో అంచెల జీవనము కాక మరణానంతరము మరల మనుష్య జన్మ ప్రాప్తి కలిగి అమ్మ నామ జపతపాదులతో ముక్తినొoదుదురు .

అసలు గతులు  అనగానేమి ?   గతులు అనగా మానవులు చేసుకొను పుణ్య కార్యముల వలన మరల జన్మ  కొందరూ , జన్మరాహిత్యముగా కొందరూ వుందురు . వారు ఆయా జన్మలలో చేయు పుణ్య పాప కార్యముల ననుసరించి మోక్ష ప్రాప్తి కలుగును .

గతి మార్గాలు మూడు విధములుగా ఉన్నవి 1 ధూమ మార్గము 2 ఆచ్ఛిరాజ మార్గము 3 పరా మార్గము

ఇందు మొదటి మార్గంలో ఉన్న వ్యక్తి ధనవంతుడైయుండియూ లోభిగా నుండి తన ఇష్టానుసారం బ్రతుకుతూ ఏ రకమైన దైవ ఉపాసనలు చేయకుండుటచే మంచివారు అయినప్పటికీ తిరిగి జన్మలు పొందుదురు .

ఇందు రెండవ మార్గం లో ఉన్న వ్యక్తి యజ్ఞయాగాదులు చేస్తూ క్రమ జీవనం చేస్తూ ముక్తి కొరకు ఆరాటపడుతూ జన్మాంతర సుకృతము తో దేవలోక ప్రాప్తి మాత్రమే కలిగి తక్కువ జన్మలతో జీవన్ముక్తులగుదురు .

 ఇక మూడవ మార్గంలో ఉన్న వ్యక్తి తన జీవితకాలమంతా నిరంతర భగవదాన్వేషణాసక్తుడై , దైవ చింతనామృతము గ్రోలుతూ అమ్మ ఆరాధన లో నిమగ్నమై పరతత్వ ఆలోచనలో నుండువారు శాశ్వత జీవన్ముక్తులై బ్రహ్మపధం చేరుదురు .

ఈ విధముగా మానవులు తమ బుద్ధి శక్తులను సద్గతి మార్గములో నిర్ధారించుకుని అమ్మ అనుగ్రహపాత్రత సాధించు కొనవలె .


సర్వేశ్వరీ  :-  విశ్వమాత అయిన అమ్మ ఈశ్వర శక్తి సముపార్జిత  అయిన కారణాన ఆమే స్వతంత్రురాలై విశ్వ నియంత్రణ చేయుచున్నది .

సర్వమయీ.  :-  వివిధ నామ స్తోత్రాదులతో సాధనాబలం తో ప్రకృతి యందు అంతటా విస్తరించి అమ్మ మయమై యుండును . శ్రీ రామదాసు రామ భక్తి పారవశ్యంలో “ అంతా రామమయం ఈ జగమంతా రామమయం “ అని కీర్తనతో  స్తోత్రించి నట్లు .

సర్వమంత్ర స్వరూపిణీ  :-  సర్వ వేద మంత్రములకూ అధిదేవత జగన్మాతయే . అందుకే ఆమె వేదమాత అయినది . ఆమె శ్రీవిద్యా స్వరూపిణి కావున సకల మంత్ర విద్యలకూ ఆమెయే మూల విరాట్టు . మనము పలుకు అన్ని అక్షరములు అమ్మ స్వరూపాలే  . అకారము నుండి క్ష కారము వరకు వర్ణమాల లోని ప్రతి అక్షరం తో ఆయా దేవతల నామములతో నుండి వేరు వేరు మంత్రములతో పూజించ బడుతున్నారు . ఆ దేవతలకు ,     ఆ మంత్రాలకు అధిదేవత అమ్మయే .

నాద శబ్ద రూపము లే అక్షర రూపములు .  ఒక్కొక్కరూ వేరువేరు దేవతా శక్తులను ఆరాధించు నప్పుడు ఆయా దేవతలకు వేరు అక్షరాలతో మంత్రాలు ఉంటాయి . ఆ దేవతలు  వారికి శక్తినిస్తాయి .

ఇవి మూడు విధాలైన మంత్ర రూపాలు . 1 తారక మంత్రములు.... సాత్వికులు అయిన జనులు వారి ఇష్టదేవతను మననం చేస్తూ మోక్షము పొందుదురు 2 అభీష్ట కారక మంత్రములు.... రాజులు మున్నగువారు ప్రజల కొరకు , విజయం కొరకు రుత్విక్కుల చేత యజ్ఞయాగాదులు జరిపించుట . 3 అభిచారిక మంత్రములు... తాంత్రిక మైన విద్యకు సంబంధించిన పాము మంత్రము , చేతబడులు మొదలగునవి .


సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |

మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా || 53 ||


o సర్వయంత్రాత్మికా  :- శ్రీ లలితా దేవి స్వరూపమును యంత్రము నందు నిక్షిప్తము చేయుటనే యంత్రము అందురు . అమ్మ శ్రీ చక్ర బిందు స్వరూపములో ఉండును . నవావరణ లో ఉన్న దేవతా స్వరూపాలకు యంత్రములుoడు కావున అవి అన్నియు శక్తి సమ్మిళితములై యుండి శక్తి కూటమిగా శ్రీ చక్రంలో అమ్మ అధీనమందు ఉండుట చేత సర్వ యంత్రాత్మికాయయినది . యంత్రము అనగా ఒక దేవతా విగ్రహము శిల్ప స్థపతి తను నిర్మింపబోవు విగ్రహ స్వరూపము మనసు నందు  ఉంచుకుని చెక్కి తదనంతరము ప్రతిష్టకు సిద్ధ పరచును .అప్పుడు ఋత్విక్కులు ఆ దేవత కు చెందిన వేద మంత్రములు పఠించి , జపించి తదనుగుణ హోమము నిర్వహించి ఒక యంత్రం పై బీజాక్షరములు లిఖించి ఆ విగ్రహము నందు ఆవాహన చేసి ప్రతిష్టింతురు . ఆ విధముగా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయుదురు .


o సర్వతంత్రరూపా :- అనగా రూపొందించబడునది . ఇది శ్రీ విద్య గురించి జ్ఞాన బోధ చేయునది . అఖoడ దీక్షా నిమగ్నమై ఉండి మంత్ర , యంత్ర విద్యలను ఉపాసించిన , అదే తంత్రవిద్యా స్వరూపము . ఈ విద్యాధి దేవత అమ్మయే . పై తెలిపిన మూడు విధములైన విద్యలు అభ్యసించుటనే ఉపాసన అందురు .


o మనోన్మనీ   :-  పరమేశ్వరునకు గల 10 నామ శక్తులైన వామదేవ మొదలు మనోన్మ: అను నామము వరకూ సృష్టి , స్థితి , లయాదులను సూచించును . అమ్మ ఆ పరమేశ్వరతత్వ అనుసంధాత గావున స్త్రీ లింగ రూపములో మనోన్మనీ అయినది .


                       సృష్టిలో ఏ విషయం తీసుకున్నా మూడు విధాలుగా ఉంటుంది . మానవజన్మ విషయంలో పుట్టుక , పెరుగుట , చనిపోవుట వల్లనే సత్వ,రజ: , తమో అను త్రిగుణములెట్లో భగవదుపాసన విషయంలో ధ్యాన , ధ్యేయ ,ధ్యాత అను మూడింటి పై ఆధారపడి ఉంటుంది . అమ్మను ధ్యానించు సిద్ధు డు ఏకాగ్రతతో మన: సంకల్పముతో భక్తిలో తాదాప్య o చెంది , ఇహం మరచి వికల్పము చెంది సహస్రారము  ప్రక్కనున్న పర బ్రహ్మ స్థానమైన చంద్రమండల స్థానము చేరుదురో అదే మోక్ష ప్రాప్తి . ఇదియే త్రిపురసుందరీ తత్వము . ఆ తత్వ స్వరూపమే మనోన్మనీ .


o మాహేశ్వరీ  :- ప్రకృతి అంతా పరమేశ్వరుని మాయాశక్తి ప్రభావితమై అనేక విధముల మార్పులు జరుగుచున్నవి . మాయాశక్తిని అమ్మ తన ఆధీనంలో ఉంచుకుని నియంత్రించు చుండును .


o మహాదేవీ. :-  అనగా అందరి కంటే గొప్పదైనది . సనాతన సర్వకాల సర్వావస్థలయందు వుండు ఆ మహా దేవుని భార్యయై ఉన్నది . చంద్ర రూప శివుని సతి శివాని .


o మహాలక్ష్మీ. :-  అనగా మిక్కిలి కరుణతో చూచు తల్లి . ఏ సంపద సౌఖ్యములు లక్షించి పూజింతుమో అలాంటి భక్తుల ఆర్తిని లక్ష్య పెట్టి దయాసముద్రురాలై ప్రసాదించు తల్లి మహాలక్ష్మి .


o మృడప్రియా  :-  మృడ యనగా ఆనందము అని అర్థము . మృడుడు అనగా శివుడు . మహారాష్ట్రలో మృడేశ్వరాలయము అను మహిమాన్విత శివాలయము కలదు . అచట నున్న పరాశక్తి శివ ప్రియ గానున్నది . ఈమె అత్యంత ప్రేమానంద శక్తిస్వరూపిణి .


మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |

మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః || 54 ||

ఈ పైశ్లోకము నుండి 14 మహా నామ పుంజము దుర్గా సప్తశతి యందు ప్రతిక్షేపిoపబడినది .ఈ నామములు శ్రద్ధగా పారాయణ చేసి సకల సౌభాగ్యములు  పొందవచ్చును .

o మహారూపా. :-  అమ్మ రూపమే పరబ్రహ్మ స్వరూపము . అమ్మ భూమ్యాకాశములు విస్తరించి అత్యంత తేజోమయురాలై విరాజిల్లును . ఈమె చాలా గొప్పదై , తాత్విక రూపము ఇంతయని చెప్పనలవి కానిది .

o మహాపూజ్య. :-  అమ్మయంతటి మహా శక్తి స్వరూపురాలు దేవలోకంలో ఎవరూ సాటి లేరు కావున ఈమెయే సకల దేవ మర్త్య లోక వాసులకు సదా పూజ్యురాలై సేవింపబడుతున్నది .


o మహాపాతక నాశినీ  :-  లోకంలో మనుష్యజాతి నిరతము సాంసారిక కృత్యములు తెలిసి కొన్ని , పాపకార్యములు తెలియక కొన్ని, తెలిసీ తెలియని అమాయకత్వం లో మరికొన్ని పాప కార్యములు చేసి వ్యధ చెందుతున్నారు . అలాంటివారు అమ్మ ప్రేరణతోనే తగిన ప్రాయశ్చిత్త మంత్రము జపించిన , ఆయా పాతకము నుండి దూరము చేసి వాటిని నాశనము చేయును .


o మహామాయా  :-  ఈ విశ్వమంతా మాయా మోహిత మై సమస్త లోకములకు విస్తరించి ఉన్నది . విద్య అవిద్య అను రెండు కారణములచే తనే పరమేశ్వరు కల్పిత నియంత్రిత మాయాశక్తి ప్రభావానికి గురై , ప్రజలు విచక్షణ జ్ఞానం కోల్పోయి కష్టాల పాలవుతున్నారు అనేక గ్రంథములు శాస్త్ర విషయములు తెలిసికొని అహంకారంతో ప్రవర్తించి నా అంత వారు లేరు అనుకొను వారు పరోక్ష జ్ఞానులందురు . అపరోక్ష జ్ఞానులనగా శాస్త్ర విషయములు తెలిసి యధాశక్తి పాటిస్తూ నిరంతర భక్తి చింతనలో నుండి అమ్మనాశ్రయించిన వారికి ఎంతటి మాయా ప్రభావమూ దరిచేరదు .



o మహాసత్త్వా. :-  ఈ చరాచర జగత్తులో సర్వభూత శక్తులకూ ప్రాణ ప్రదానము చేసి వాటి ఉనికిని సదా కాపాడుతూ విశ్వ కర్తగా అందరికీ చేయూత నొసగు తల్లి జగన్మాతయే .

              సత్  =  ఉనికి

o మహాశక్తి. :-  అనగా సమర్థవంతమైన బలము కలది . అమ్మ అందరు దేవతల కంటే గొప్ప సమర్థురాలు శక్తితో పాటు యుక్తి సమర్ధత కలిగి యుండుట వలననే  భండాసుర , మహిషాసురుల వధ జరిపి దేవ మానవ లోకములకు ముదము కలిగించినది . అమ్మ తన అధీనంలో ఉన్న దేవతల శక్తులను కలుపుకుని సంఘటిత సమ్మోహన శక్తి గా ఏర్పడి కాపాడుతూ మర్త్యు లైన మనకూ ఆ శక్తుల నోసగుచున్నది .

o మహారతిః   :- అనగా ఆసక్తి  - ఆనంద క్షణ అనుభవము కోరికగా కలిగియుండుట . అమ్మ నిరంతర శివుని దర్శించుకునే కోరిక కలిగి , ఆ పరబ్రహ్మ రతి (సహవాసం ) యందాశక్తి కలిగి  శివైక్యానుభూతి పొందుతూ ఆనందాబ్దిలో ఓలలాడుటకు ఇష్టపడునది .

        ఎంతో తపస్సు శక్తులతో అమ్మ దర్శన సౌభాగ్యము కాంక్షించి మునులు , ఋషులు , మహానుభావుల తపన యందు ఆసక్తి   కలది .


మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |

మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ || 55 ||


o మహాభోగా. :- అమ్మవారు వివిధ దేవతల , మానవుల , తాపసుల నుండి పలు విధములగు కైంకర్యము లతో ఆనందకర భోగములు అనుభవించును .


o మహైశ్వర్యా. :-  అమ్మ మణిమయోజ్వల సింహాసనారూఢియై గొప్ప ఐశ్వర్యవంతురాలు . అటులనే మనకు కూడా కర్మ పరిమిత కాల ఐశ్వర్య భోగములను ప్రాప్తించు తల్లి .

o మహావీర్యా :-  అనగా ఉత్పత్తి కారణ శక్తి . ఏదైనా కష్టసాధ్యమైన విషయాన్ని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ధైర్యమూ సాహసమూ కావలెను . అంతర్గత చైతన్య శక్తిగా ఉన్న ఉత్పత్తి కారణ శక్తి జ్వలింపజేసి అమ్మ కష్టములను ఎదుర్కొను నట్లు చేయును .

o మహాబలా   :- అమ్మ గొప్ప  సంకల్ప బలము కలిగి ఉండి విశ్వ నియంత్రణ చేయుచున్నది .

o మహాబుద్ధి. :-  మానవులందరి వారి కర్మాను గతముననుసరించి బుద్ధి శక్తినిచ్చే తల్లి .


o మహాసిద్ధి. :-  అమ్మవారు అన్ని సిద్ధులకు మూలమైన మహా విద్యా స్వరూపిణి . అష్ట సిద్ధులనూ ప్రసాదించు అధిదేవత . నిరంతరము అమ్మవారిని స్తుతిస్తూ సాధనలో ఉత్కృష్ట దశకు చేరి రసోల్లాసము అనుభవిస్తూ ఆనంద సిద్ధి పొందిన వారికి మోక్ష సిద్ధి కలిగించు తల్లి .

o మహాయోగేశ్వరేశ్వరీ   :-  అనేకమంది భక్తులు  యోగి పుంగవులచే ఆరాధింపబడు లోకారాధ్యదేవత . త్రిమూర్త్యాత్మకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమ యోగు లై అమ్మను ఆధి దేవతగా ఆరాధిస్తారు . ఈమె ముగ్గురమ్మల మూలపుటమ్మ కావున , సింహాసనరూఢ యైన ఈ తల్లికి ఇరుపక్కలా లక్ష్మీ సరస్వతులు నిలబడి చామరములు వీతురు .


మహాతంత్రా,మహామంత్రా,మహాయంత్రా,మహాసనా|

మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా || 56 ||


o మహాతంత్రా. :-  గొప్పవైన తాంత్రిక విద్య లకు మూలమైన తల్లి . అనగా శ్రీవిద్యకు అధి దేవతయై పూజింపబడుతున్న ది .

o మహామంత్రా  :-  శ్రీవిద్యోపాసన లోనున్న మంత్ర శక్తులు అమ్మ స్వరూపాలే .

o మహాయంత్రా. :- ఒక దేవతను మంత్ర తంత్రాలతో యంత్రము నందు నిక్షేపించినపుడు గొప్ప శక్తిగా మారి ఆయా విగ్రహములకు అమిత శక్తులు కల్గును .  ఈ యంత్ర అతీత శక్తులే మానవులను యాతనల నుండి కాపాడును .

o మహాసనా  :-  అమ్మ చింతామణి గృహంలో మణి మహోజ్వల మై రత్న ఖచిత బంగారు సింహాసనారూఢయై యుండును . అదే విధముగా శ్రీ చక్ర మధ్య మందు బిందు స్థానములో నవావరణ దేవత పరివారంతో కీర్తింప బడుచున్నది . ప్రతి మానవుని యందూ అగ్ని చోదిత మూలాధార చక్రము నుండి గ్రంధి విభజన జరిగి మోక్ష స్థానమైన చంద్రమండలం శిరస్సు నందున సహస్రార చక్రము చేరి పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుని చేరుట . ఈ స్థితిని పంచ బ్రహ్మాసనా స్థితి అందురు

మహాయాగ క్రమారాధ్యా. :-  అమ్మ  ఆరాధన అయిన శ్రీ విద్యా స్వరూపాల పద్ధతులను గురుముఖతః నేర్చి క్రమానుగతంగా పలు మంత్ర తంత్రముల తో మోక్ష మార్గాన్వేషక స్పృహతో యాగము చేయు సంకల్ప చైతన్యశక్తి ఆమెయే నొసంగును .

o మహాభైరవ పూజితా  :-  లలితా పరమేశ్వరీ దేవి నిరంతరం భర్త అయిన శివుని సముఖమoదే ఉండుటకు ఇష్టపడును . నిరతము ఆయననే ధ్యానించును .


మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |

మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ || 57 ||


o 1 . మహా కల్పాంత వేళలో పరమేశ్వరుడు మహా ఈశ్వర స్వరూపము ధరించి మహేశ్వరుడు గొప్ప తాండవము చేయుట యందు లీనమగును . ఆ స్వభావమును అమ్మ దర్శించి శివతాండవ తత్వము గ్రహించును .

o 2 అమ్మవారు మహా కామేశ్వరు నకు  ప్రీతిపాత్రమైన పపట్టమహిషగా నుండునది . లోకంలో మూడు కు ప్రాధాన్యత కలదు . ధ్యాన , ధ్యేయ ,ధ్యాత ఈ మూడే సర్వజీవులకు అనుభవము . దీనినే త్రిపుటి అందురు . అమ్మను ఆరాధించు విషయంలో నిరంతర సుఖ సంతోషములు కలుగజేయును .


చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |

మహా చతుష్షష్టి కోటియోగినీ గణసేవితా || 58 ||

                            

o 1. లోకంలో అనేక విధములైన కళా రూపములు వాటియందు ప్రావీణ్యం కలవారు ఉందురు . అయితే అన్ని కళల యందు ఒకే వ్యక్తికి అనుభవం ఉండక పోవచ్చు . ఒకరికి చిత్రకళ ఒకరికి శిల్పకళ , నాట్యకళ , సంగీత సాహిత్య కళలు ఇలా అరవై నాలుగు విధములు ఉండును ఈ కళలు నేర్చిన వారందరి భావనాసంకల్పశక్తి అమ్మ దయ వల్లనే కలుగుతున్నది . ఇలా కళా హృదయుల స్పృహచే అమ్మ ఆరాధించ బడుచున్నది . అన్ని రకముల కళలు నేర్చుటకు వలయు స్పందనా చైతన్య శక్తులు అంతర్గత ప్రేరణతో కలుగజేయుట చేత అమ్మ చతుష్షష్టి కళామయి అయినది .

o 2. దేవ మర్త్య లోకాలలో అమ్మ భక్తులు సకల కళల యందు ప్రావీణ్యత పొంది నవారు కోట్లాదిమంది చేత అనేక ఋషులు , యోగులు చేత సేవింపబడు తల్లి .


మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా |

చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా || 59 ||


o మనువిద్యా,  :- ప్రస్తుత కలియుగ ప్రధమ పాదం మన్వంతరాల లో స్వాయంభువ మన్వంతర కాలగమనం జరుగుతున్నది . స్వాయంభువ మనువు శివాంశ సంభూత అయిన శక్తి ఉపాసన భక్తి తత్పరుడు . ఈయన శ్రీవిద్య రహస్య మంత్ర ములను అభ్యసించి అమ్మ ఆదరణ పొందిన వాడగుటచే , అమ్మకు మను విద్యాస్వరూపిణి అను నామం ఏర్పడినది .

o చంద్రవిద్యా. :-  యోగులు , తప:శ్శక్తి సంపన్నులు జ్ఞాన కాంక్షతో శ్రీ చక్ర విద్యాoతర్భాగ సహస్రార విద్యయందు సిద్ధి పొంది రసోల్లాస ఆహ్లాద ఆనంద తత్వంలో అమృతపానం చేసి ముక్తి నొందుదురు  .

o చంద్రమండలమధ్యగా   :-  పై విద్యాభ్యసనలతో సహస్రారము చేరినవారు చంద్రమండల శోభితమై , మధ్యగా నున్న శివశక్త్యైక రూపము గాంచి కైవల్య ప్రాప్తి పొందుతున్నారు . శ్రీ చక్రము నందు బిందు స్వరూపములో పద్మాసనము నందు కూర్చుని యుండును . ఆజ్ఞా చక్రము నుండి సహస్రారము వరకు గల కుండలినీ మండలమును చంద్రమండలము అందురు . ఇచ్చట సోమపానము చేసినవారు మోక్షార్హులు .

                   శ్రీ చక్ర విద్య అభ్యసించిన పరమ భక్తులు 12 మంది కలరు 1 మనువు 2 చంద్రుడు 3 స్కందుడు 4 ఇంద్రుడు 5 హయగ్రీవుడు 6 అగస్త్యుడు 7 దూర్వాసుడు 8 కుబేరుడు  9.అగ్నిదేవుడు 10 లోపాముద్ర 11 మన్మధుడు 12 శివుడు . వీరంతా బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం అమ్మ ఆరాధ్యకు లే . ఉపలక్షికన్యాయము ననుసరించి ఒక మను విద్యయే అనక చంద్ర విద్య అని కూడా ప్రస్తావించిరి .

o చారురూపా   :-  మిక్కిలి మనోహర ఆహ్లాదకరమైనదని అమ్మముఖ పద్మమును వర్ణించిరి . అమ్మ దుఃఖ స్పర్శలేని ఆనందమయ స్వరూపిణి .


o చారుహాసా  :-    అమ్మవారు నిరంతర చిరునగవుతో అలరారు చుండును .

o చారుచంద్ర కళాధరా   :-   చంద్రమండల మధ్యస్థ అయిన అమ్మ చంద్రకళను ధరించి శివారాధన లో తాదాప్యము చెంది విశుద్ధ జ్ఞాన ఆనంద స్వరూపుడు అయిన చంద్రశేఖరుని దర్శించిన తల్లి .


చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా |

పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా || 60 ||


     పరమేశ్వరుడు మనలోని వివిధ శక్తి రూపములకు చైతన్యము కలిగించి ఈ చలనా అచలన జీవులను జగత్ పాలకుడిగా సంరక్షించు చున్నాడు . అనేక మంది శాశ్వత స్వరూపుడైన ఆ శివ తత్వమును శ్రద్ధతో పఠనం చేసి , శ్రీ చక్ర బిందు స్థాన రూపములో నున్న శివశక్తి ఐక్యతతో నున్న అమ్మ దర్శన ప్రాప్తి కి తపించవలెను . అమ్మవారు ఈ చరాచర జగత్తులో ప్రతి మనిషి యందును నిగూఢంగా నుండి మన జీవన విధానమునకు తోడ్పడుతూ ఉన్నది .

o పార్వతి. :- పర్వత రాజయిన హిమవంతుని పుత్రి . అమ్మ శ్రీ చక్ర బిందు స్థానంలో నుండి బ్రహ్మవిద్య అభ్యసనము వలన ఆ విద్యాధిదేవత అయినది .

               సాధారణంగా పర్వతములు ఒకే శిఖరాగ్రంగా ఉండక వివిధ  ( చెరకు లోని కణుపుల వలే ) శిఖర సమ్మిళితమై యున్నట్లు కూటముగా ఏర్పడి యుండును . “ కూటస్థ మచలం ధృవం “ అన్నట్లు అమ్మ  శరీరములోని కుండలినీ శక్తి కూడా మూలాధార చక్రము నుండి షట్చక్రోపరితలము వరకు చక్ర గ్రంధులు ( పర్వములు ) కలిగి ఒక గొలుసు గా ఏర్పడి చివరకు  సహస్రారమున ఇచ్చా , జ్ఞాన , క్రియా శక్తులకు ప్రేరణ యగుచున్నది . అందుచేత కుండలినీ పరంగా పార్వతిగా భావించబడుతున్నది . పార్వతి నామము శ్రీ చక్రమునకు అన్వయము చేయగా అమ్మ బిందు స్థానములో నుండి శ్రీ చక్రములో నున్న నవావరణములనూ నవ పర్వములుగా ఒక భావన చేయగా ఆ తొమ్మిది పర్వతములలో అమ్మ  వ్యాపన శక్తి ఉన్నందున ఆమె పార్వతి అయినది . ఈమె శివుని భార్య .


o పద్మనయనా. :- అమ్మవారు పద్మములవంటి నేత్రములు కలది .  అమ్మ నేత్రముల లో ఒక కన్ను సూర్య శక్తి ఒక కన్ను చంద్ర శక్తికి ప్రతి రూపాలు . ఈ సూర్యచంద్రులకు ఇరువురకూ వికసన శక్తీ గమన శక్తి కలిగి , సూర్య శక్తి తో పద్మములు వికసించుట , చంద్ర శక్తితో కలువలు వికసించుట జరుగుతున్నట్లే అమ్మ నేత్రములు కూడా పద్మముల వలె కలువల వలెనే వికాస గమన శక్తి కలిగి అందముగా విరాజమానమై వెలుగొందుచున్నవి .


o పద్మరాగ సమప్రభా. :-  అమ్మవారి నేత్రములు ఎర్రని పద్మరాగ మణుల వలె కాంతివంతముగా ప్రకాశించును .




పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ |

చిన్మయీ, పరమానంద, విజ్ఞాన ఘనరూపిణీ || 61 ||


o ప్రేత యనగా మనము సాధారణముగా అనుకునే భూత ప్రేతములు కావు . ప్రేత యనగా చలనము లేనిది . నిశ్చలముగా ఉన్నది అని అర్థము .  అటులనే బ్రహ్మ మనగా చలనము గలిగినది . ఈ రెండిటి యందు అమ్మ స్వరూపము ద్విగుణీకృత మవుతున్నది .

           సృష్టి స్థితి లయ కారకులు ఐదుగురు దేవతా స్వరూపాలు . అమ్మ ఆధీనత   నందుండే వారివారి కార్యాలు నిర్వర్తింతురు . కార్యానంతరము వారు నిశ్చలముగా నుందురు . ఈ ఐదుగురు ఎవరన బ్రహ్మ , విష్ణు , శివ , రుద్రుడు , సదాశివుడు . వీరు అందరూ అమ్మ రాజరాజేశ్వరీ దేవి సింహాసనారూఢ అయినప్పుడు , మొదటి నలుగురూ అమ్మ సింహాసన ఆధారము లైన కోళ్లకు అంటి పెట్టుకొని యుందురు . ఐదవ వారైన సదాశివుడు అమ్మ పీఠభాగంగా నున్న బల్ల యందు ఉండును. అందుచే పంచ ప్రేతములతో ఉన్న సింహాసనము నందు ఆసీనురాలై ఉన్నందున ఈ నామము కూర్చబడినది .


మరియొక విధముగా అన్వయించుకొనిన ఎడల దేవతలు గాని మానవులు గాని పంచకోశ చైతన్య శక్తులతో జీవింతురు . పంచ శక్తులు ఏవన  1 అన్నమయ కోశము 2 ప్రాణ మయ కోశము 3 విజ్ఞానమయ కోశం 4 మనోమయ కోశం 5 ఆనందమయ కోశము ఈ ఐదు కోశములు చలనము లేక పనిచేయనప్పుడు వాటి శక్తి తో లోపలనుండిననూ ప్రయోజన రహితమై యుండుటను ప్రేతము అందురు .

మనిషి పుట్టిన వెంటనే అమ్మ చైతన్య స్పందన కలుగనంతవరకు ప్రేతము గానే యుండును .. అమ్మ శరీరమునందు చైతన్యము కలుగ చేసినంతనే కదలికలు జరిగి శరీరంలో 72 నాడులకు చలనము జరుగును . ఈ విధముగా ప్రతి మానవుని యoదుండి జీవ ప్రకాశం కలుగ చేయుచున్నది .



o పంచబ్రహ్మ స్వరూపిణీ   :-  ప్రేత స్థితి నుండి అమ్మ దివ్య శక్త్యానుభూతి పొంది ఉండి  చలనశక్తి రాగానే ఆ పంచ మయ కోశము లే బ్రహ్మ మయ కోశము లై పని చేయును . ఆ స్థితి ప్రేరణ కలిగిన ప్రతి వ్యక్తి అమ్మ స్వరూపమే . అందుకే మానవుడే మహనీయుడు . అన్నమయ కోశము నుండి ఆనందమయ ఏకోసము వరకూ సాధకుడు దాగియున్న చైతన్య స్థితిలో ఒక్కొక్క కోశ పుచ్చము  (ఆధారము) ద్వారా అన్వేషణ చేస్తూ అసలైన పరబ్రహ్మ స్వరూపాన్ని సాధన వల్లనే గ్రహించాలి . అనగా పంచ ప్రేతముల లో అమ్మ చైతన్య శక్తి జడత్వము లోనుండి పంచ బ్రహ్మ కోశముల యందు బ్రహ్మమున్నప్పటికీ అది కేవలము మానవులకే గాని అమ్మకు లేదు . అయితే పంచబ్రహ్మ కోశము లలో చైతన్య రూపములో నుండి  ఆవల ఆరవ రూపంలో ఉన్నది .


o చిన్మయీ. :-  బుద్ధి పూర్వక నిరంతర సాధనతో అతీత శక్తిగా యున్న అమ్మ చిత్ శక్తిగా వ్యాపించి ఆనందమయ రూపిణిగా నుండును .


o పరమానంద. :-  విజ్ఞానమయ కోశ బ్రహ్మమునందు అతీత శక్తిగా నుండి జ్ఞాన స్వరూపిణిగా నున్న అమ్మ పరమానంద ఏకత్వము తో జ్ఞానానంద స్వరూపిణిగా విజ్ఞాన ఘన రూపిణిగా గోచరమగును .


ధ్యానధ్యాతృధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా |

విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా || 62 ||

                      

 ప్రపంచమంతా మూడు విషయముల తోనే ముడిపడి ఉన్నది . ఉపాసకుడు , ఉపాసన , ఉపాధ్యo అను మూడింటిని త్రిపుటి అందురు . ఉపాసకుడు బుద్ధి పూర్వక సాధన చేయగా అనంత చిన్మయానంద రూపణి ఏకత్వము గా నుండి అఖండ జ్ఞానానందమయ రూపముగా ద్యోతకమగును . ఈ స్థితి రెండు పంచ శక్తులకూ అతీత శక్తిగా యుండి ఆ స్థితిలో ధర్మాధర్మములకు సంబంధము లేకుండును . పంచబ్రహ్మ కోశ స్థితిలో మానవులకు మాత్రమే ధర్మాధర్మ ప్రమేయం ఉండును.

చైతన్య మెలకువ స్థితి నందున్న అమ్మ యే విశ్వరూపిణి యై ప్రపంచమంతా వ్యాప్తి చెందినది . సాధకుడు జాగృదావస్థలో నున్నప్పుడు సాధకుని శరీరము ,మనస్సు  రెండిటి యందు మెలకువగా ఉన్న చైతన్యశక్తిని విశ్వరూపా అందురు . సాధకుల కలలను మూడు విధములుగా వివరించారు . జాగత్స్వప్నసుషుప్త్యావస్థలలో అమ్మను వేరువేరు రూపాలలో దర్శింతురు . ఆ విధముగా స్వప్నావస్థ దశలో ఆ సాధకుని మనస్సు మాత్రమే చైతన్యం కలిగి అన్య రూపము లేక అమ్మవారు ఆ దశలో తేజస అను రూపముతో ప్రకాశించుచున్నది .


సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా |

సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ || 63 ||


స్వప్నావస్థ దాటిన సాధకుడు మూడవదైన సుప్తావస్థ లోనున్నప్పుడు శరీరము , మనస్సు చైతన్యముతో సంబంధము లేక ఒక విధమైన తృప్తికరమైన హాయిని అనుభవించును . ఆ స్థితిలో అమ్మ ప్రజ్ఞా చైతన్య శక్తిగా ఉన్న దేవిని  ప్రాజ్ఞాత్మికా అందురు .

ఈ పైన పేర్కొన్న త్రిపుటి  (మూడు దశలు ) దాటిన ఆ తల్లి స్వరూపమే త్రిపుర సుందరీ స్వరూపము . అయితే త్రిపుటి అవస్థ దాటాక యోగులు మాత్రమే నాల్గవ స్థాయి కి చేరుకుందురు .ఈ స్థాయికి చేరుకున్నప్పుడు దీనిని తుర్యావస్థ అందురు . ఈ దశావస్థకు ఎలాంటి పేరు లేదు . తుర్యా అనగా నాల్గవది అని అర్థము . ఈ దశలో యోగి సమాధి స్థితిలో నుండి ఈ అవస్థలు అనగా పంచప్రేత ,పంచబ్రహ్మ ,మూడు త్రిపుటీ శక్త్యా స్థితుల నుండి విడివడిన అతీత శక్తిగా గోచరించిన తల్లియే సర్వావస్థావివర్జితాయై ప్రకాశిస్తున్నది  .ఇలా పలు విధముల విచారణ చేయవలసియున్నది .

ఓంకారము మూడు అక్షరములు అయిన అ ఉ మ  అను సంపుటి చే ఏర్పడి , నాద రూపముగా ఉచ్ఛరించినపుడు చివరి  ‘మ ‘కారము ఘంటానాదం చివరి శబ్దము ప్రతిధ్వని రూపంలో వినుచుందుము . ఇదియే తురీయ దశ . అందుచే ఓంకారము పవిత్రము .


సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ |

సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా || 64 ||


బాహ్య ప్రపంచంలో మనకు ఏమి జరుగుతున్నదో ప్రళయావస్థ యందు సృష్టి ప్రారంభంలో నూ మరల మరల అదే జరుగుతున్నది . ప్రళయానంతరము తిరిగి సృష్టి ప్రారంభించు వేళ పంచ ప్రేతలుగానున్న బ్రహ్మ , విష్ణు , రుద్ర , ఈశ్వరసదాశివ రూపములను తానే వారి కార్యములను నిర్వహిస్తూ , సృష్టికర్త్రీయై బ్రహ్మ రూపిణి గానూ , రక్షణ స్థితి కారిణ్యై విష్ణు రూపిణి గా గోవింద నామ రూప ధారిణిగానూ ,  సృష్ట్యనుభవకారులైన మానవులకు సమకూర్చు నదిగా రుద్ర రూపిణిగానూ , తిరోధానాయనగా మరుగు పరచి బాధ్యురాలిగా ఈశ్వరి శక్తిగానూ , అందరికీ అనుగ్రహం ప్రసాదించు సదాశివ కర్తరి గా అనుగ్రహదా రూపిణిగా నుండి పంచకృత్య ములనూ తానే నిర్వహిస్తూ , పరాయణత్వం పొందుతున్నది . అనుగ్రహ దేవతయే మోక్షప్రాప్తిని కలిగిస్తున్నది .


భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ |

పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ || 65 ||


అమ్మవారు చంద్రమండల మధ్యస్థ అను నామముతో విరాజితురాలైనట్లే సూర్య మండల మధ్యము నందుండి ప్రతి దినము మనకు ఉదయాన వీక్షణానుగ్రహము కలుగ చేయుచున్నది . ప్రత్యక్ష సాక్షిగా సూర్యారాధన అమ్మ ఆలంబన కొరకు ప్రతి మానవుడు త్రి విధములైన ఉపాసన మార్గములైన  శ్రీ చక్ర పూజ , కలశము , స్తోత్ర పారాయణ ఆరాధనలతో ఆదిత్యుని యందే అమ్మను పరబ్రహ్మస్వరూపిణి గా భావించవలెను .

ఉదయాన సూర్యభగవానునికి ఎదురుగా నిలబడి 

అరుణాం కరుణాతరంగితాక్షీం

ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం

శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ

దేవి ధ్యాయేత్ సుసాధకం నమోనమః

అను  మంత్రమును ముమ్మారు పఠించి హృదయాకాశమునందు అమ్మను ప్రతిష్ఠించు కొనవలె .

   మన హృదయమే  భానుమండల స్థానము  . ఆ స్థానము నందు 12 దళములతో వికసించు పద్మ క్షేత్రము అనాహత చక్రము . దీనినే దహర చక్రము అందురు . మానవ శరీర మందు మూడు ఆకాశములు కలిగి అనాహత మందు హృదయాకాశం  , ఆజ్ఞా చక్రము నందు చిత్తాకాశం , సహస్రార ముందు చిదాకాశం కలిగియుండును .

  అయితే ఈ హృదయ ఆకాశమందున్న అమ్మ స్వరూపము భైరవి  అను నామముతో నుండును . భైరవి అనగా రవము ( శబ్దము ) చేయునది . ఈమెకు పుంలింగ స్వరూపమే మార్తాండ భైరవుడు . ఆయన శివ స్వరూపమే .

  భగమాలిని అనగా నిరతము ఐశ్వర్యములు , కాంతుల నొసంగునది . మాలిని అనగా సంపదలు మాలలుగా యిచ్చునది . భగ యనగా సూర్యుడు అని అర్థము . విశ్వాంతరాళంలో ద్వాదశాదిత్యులు అను పన్నెండు మంది సూర్యులు కలరని వేద పురాణ ఉపనిషత్తుల ద్వారా తెలియబడుచున్నది . ప్రతి సూర్య స్వరూపము నందు అమ్మవారు అంతర్లీనయై యుండును . ఆ విధముగా ఈ ద్వాదశాదిత్యులు మాలాహారముగా నేర్పడి యుండుటచేత అమ్మకు భగమాలినీ అను నామం ఏర్పడినది. ద్వాదశాదిత్యులు పేర్లు ఇవి :- 1 ఇంద్ర 2 ధాత 3 పర్జన్య 4 తవస్థ 5 పూష 6 ఆర్యమా 7 భగ 8 వైశ్వానర 9 విష్ణు 10 వరుణ 11 మిత్ర 12 అన్షుమాన్ ఈ పన్నెండు మంది ఆదిత్యులోకొక్కరూ  ఒక్కొక్క మాసములoదు ఉండుటవలన మనకు సంవత్సరములు ఆయా రుతువులు ఏర్పడుచున్నవి . ఆధునిక శాస్త్రజ్ఞులు ఇటీవల కాలంలో కనిపెట్టిన విషయాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితమే మన ఋషులు గ్రంథస్తం చేశారు .

o పద్మాసనా. :-  అమ్మవారు పద్మము ఆసనముగా చేసుకుని కూర్చొని ఉండేది తల్లి కంచి కామాక్షి అమ్మవారు యోగాసన స్థితిలో పద్మము నందు ఆసీనురాలై యుండును . మనలో హృదయ పద్మములో నున్న 12 దళముల మధ్యలో అమ్మవారు కూర్చుని యుండును .

o భగవతీ   :- ఎవరైతే విశ్వమును తమ మాయాశక్తి తో నడిపించు రో వారు లింగ రూపం లో భగవంతుడు అనియు స్త్రీ లింగ రూపంలో భగవతి అనియు అందురు . ఈ విశ్వాన్నంతటినీ ఆరు విధములైన మాయా శక్తులతో మన యెరుక లేకుండా గానే జరిగి పోవును . 1 ఉత్పత్తి 2 లయo 3 రాక నాలుగు పోక 5 బంధం 6 మోక్షం పై ఆరు విషయములలో ఏ ఒక్కటి మనకి తెలియకుండానే జరిగిపోతాయి ఎంతటి యోధులైన జనన , స్థితి , మరణ విషయములు , పునర్జన్మ బాంధవ్యాలు ఎవరికెరుక ? వీటన్నిటి క్రమానుగతంగా నడిపించు భగవత్తత్వం రూపిణీ అమ్మాయే గావున ఈమె భగవతి అయినది .

o పద్మనాభ సహోదరీ  :- పద్మనాభుడు అనగా పద్మము నాభియందు గల విష్ణుమూర్తి ఆయన సహోదరి యే పార్వతీదేవి సహోదరీ అనగా ఏక లక్షణములు గల వారు .

            ఒకప్పుడు బ్రహ్మదేవుడు దేవలోక వాసులను రాక్షసుల బారినుండి కాపాడుకొనుటకు యజ్ఞం తల పెట్టి చేస్తున్నాడు ఆ మహా కార్యమునకు దేవతలు ఋషులు అందరూ హాజరైనారు ఆ యజ్ఞం జరుగుతుండగా విష్ణుమూర్తి సోదరి పార్వతీ సమేతంగా వారందరికీ సాక్షాత్కారము జరిగినది ఆ సంఘటనకు ప్రతిఫలంగా మానవ వీక్షణ కొరకు పూరి పట్టణంలో సుభద్ర జగన్నాథుడు గా వెలిసి  పూజలందుకొని చున్నారు




ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః |

సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ || 66 ||


ఉన్మేష = కనురెప్పలు తెరచుట

నిమిషోత్పన్న = కనురెప్పలు మూయుట 

  అనిమిషులైన దేవతల కన్నులు ఎల్లప్పుడూ తెరిచే ఉండును . కనులు మూయుట తెరచుట ఉండదు .

 స్థితికారకుడైన పద్మనాభుని సహోదరి కావున అమ్మ కూడా బ్రహ్మాండ మండల మంతయూ తన వక్షము తో సకల భువనావళిని నిరంతరమూ పర్యవేక్షిస్తూ నే ఉంటుంది . విష్ణువు అవతార సమయములలో విశ్వరూప సందర్శనము చేసినప్పుడు సహస్రాధి తలలతో, ముఖములతో, కన్నులతో , పాదములతో ఏ విధముగా గోచరించునో సహోదరి అయిన అమ్మ కూడా రాక్షస సంహార వేళ గోచరమగును .



ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ |

నిజాజ్ఞారూపనిగమా, పుణ్య పుణ్య ఫలప్రదా || 67 ||

ఈ చరాచర జగత్తులో త్రిమూర్తుల కే అధిదేవత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి బ్రహ్మాండము నుండి  పిండాండము వరకూ సకల జీవజాలంలను అమ్మాయే రక్షించి పోషించును . ఆమె ఆది పరాశక్తి అయి మూలపుటమ్మ గా భావింతురు . మనుష్య లోకము అంతా వివిధ వర్ణములు , కుల సమూహములుగా ఏర్పడి ఉన్నది  . వీరిలో వారివారి సనాతన ఆచారము ప్రకారము భిన్న దేవతా స్వరూపములను ఏర్పరుచుకుని ఆయా కట్టుబాట్లకు లోబడి యుండుదురు . ఈ విధమైన వర్ణాశ్రమ విధానమంతా క్రమ పద్ధతిలో ఏర్పరచుకునే ప్రేరణ పొంది ఆ ప్రేరణకు నాంది  ఆ తల్లియే .

సకల వేద మంత్రముల కు అమ్మయే మూలము . ఆమెను వేదమాతగా ఆరాధించి పూజింతురు . ప్రతి మనిషి ధర్మాచరణకు లోబడి చిత్తశుద్ధితో ఆజ్ఞ రూపములో ఉన్న వేదాల ప్రకారం నడుచుకొని పరతత్వము జీర్ణించుకుని , నిర్మించుకుని ఇహలోక సుఖము పొందవచ్చును .అట్లు వేదాలలో ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారము హృదయమునందు అమ్మను నిలుపుకొని సద్బుద్ధి తో స్మరించిన వారు పుణ్యాత్ములు గా ఉందురు.

 ఈశ్వరుడు కర్మ ఫల ప్రదాత . మన ఆలోచన మంచిగానే ఉంటే అంతయు మేలే జరుగును . లేనియెడల దుఃఖములు కలిగి అపుణ్యులమై   (పాపుల మై  ) ఆమె ప్రసాదించు మంచి ఫలితములకు దూరమౌదుము .


శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా |

సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా || 68 ||

వేదమాత అయిన అమ్మను హృదయ పీఠము నందు స్థిరపరచుకుని  ధ్యానించి పూజించు మానవులు దేవతలు పద్మముల వంటి ఆమె పాదములకు సింధూరంతో నిత్య పూజలు సల్పుదురు . ఆమె పాద ధూళి మిక్కిలి కాంతివంతమై ప్రకాశించును . ఆ కాంతులను జ్ఞాన కిరణ కాంతులు గా భావించి పరతత్వ ఆలోచనతో పరబ్రహ్మ స్వరూప కాంతి పుంజము లే అని తలుప వలయును .

వేదముల అంత్య (చివరి ) భాగములను ఉపనిషత్తులు అందురు . వివిధ ఉపనిషత్తులలో కొన్ని వేల మంత్రములతో వివిధ రూపాలలో అమ్మవారి స్తుతులు  గోచరమగును . వేదములకు తల్లిగా అమ్మవారే కనుక ఉపనిషత్తులన్నియూ అమ్మ కూతుర్లనుకుంటే , వారు అమ్మ పాదపద్మములకు తలలు ఆనించి నమస్కరించు వేళ అమ్మ పాదములయందున్న సింధూర దూళి కుమార్తెల శిరము పాపిట (సీమంతం ) నందు అంటుకొని ఎర్రని కాంతితో మెరయు చున్నారు . అది వారి ఐదవతనంనకు గుర్తు . మరొక విధముగా చూచినచో వేద వేదాంగములు గురుముఖత : మాత్రమే సాధన చేసి వేద ఉపనిషత్తులలో రహస్య భావనలు తెలిసి యోగులు కాంతివంతమైన అమ్మ పాదపద్మములు దర్శింతురు .

సముద్రము అనేక రకములైన జీవులకు ఆలవాలమై ఉన్నది . అందు నత్తగుల్లలు ,శంఖములు , ముత్యపు చిప్పలు పెరుగును . ముత్యపు చిప్పలు సముద్ర నీటి పైభాగానికి వచ్చి మేఘుడు వర్షించిన నీటి బిందువులను తనలో ఉంచుకొని మూసుకు పోవును . అటుల కొంత కాల వ్యవధి అనంతరము ఒడ్డుకు చేరినప్పుడు ముత్యపు చిప్పను తెరచి చూడగా మెరుస్తున్న ముత్యములు ద్యోతకమగును .

అదే విధముగా సకల ఆగమశాస్త్రముల సారము అనగా వేదవేదాంగ సారము కలిపి ఒక ముత్యపుచిప్ప అనుకుంటే అలాంటి చిప్పలో నున్న ఆణిముత్యం  ( శ్రేష్ట మైనది ) అమ్మ  శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి మాత్రమే . వశిన్యాది వాగ్దేవతలు అనేక విధములుగా అమ్మను వర్ణిoచిరి .

కేనోపనిషత్తు దాని ఉపనిషత్తులలో అమ్మ లలితాదేవి ప్రతిపాదన గోచరించును . అమ్మ లావణ్య రూపిణి అమ్మ లావణ్యము ముత్యము తో పోల్చ బడినది . మౌక్తికం అనగా ముక్తి , మోక్షము అని అర్థము . అదియే శ్రీవిద్య . ఒక ముత్యము తయారగుటకు కాలవ్యవధి ఉన్నట్లే శ్రీవిద్యోపాసన ద్వారా చివరకు ముక్తి సాధించవచ్చును . ఉపాసన కర్మ తో కూడి త్రికరణశుద్ధిగా ఏ దేవతను ఉపాసిస్తారో ఆ దేవతాతత్వ , మంత్ర , రహస్యార్ధము లు గ్రహించి తగిన జ్ఞానార్జన చేసి రసోల్లాసము అనుభవించు వారు మోక్షార్హులు .

పై శ్లోకములలో ఆగమములు నిగమములు ప్రస్తావన ఉన్నది . ఆగమములు అనగా అనేక శాస్త్రములలో చెప్పిన మంత్రములు . ఈ మంత్రము లన్నియు శివుడు ఆదిగురువు గా నుండి అమ్మ పార్వతికి చెప్పిన మంత్ర రాజము లు . శివ వాక్కు ద్వారా ఆగమనము జరిగెను గనుక  ఆగమములు అయినవి .

నిగమములు అనగా వేదములు అని అర్థము . ఇవి బ్రహ్మ వాక్కు నుండి వెలువడిన మంత్రములు . నిర్గమించునవి కనుక నిగమములు .

శుక్తి సంపుట. = ముత్యపు చిప్ప .


పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ |

అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా || 69 ||


o పురుషార్థప్రదా. :-  ధర్మ , అర్ధ , కామ , మోక్ష ములు అను ఈ నాలుగూ పురుషార్థములు . శివుడు పురుషార్థముల నొసగు ఆదిగురువు . మానవులను సన్మార్గులుగా మార్పు చేయుట ఎటుల అని పార్వతి శివుని ప్రశ్నించగా ఆయన దక్షిణామూర్తి స్వరూప మైన గురువు గా మారి జీవులలో భక్తిభావన రగిల్చి , చక్కని ఆరోగ్యంతో  జీవించ వలెనన్న సూర్యారాధన అనునిత్యము చేయవలయునని ధర్మ మోక్షములకు విష్ణ్వారాధన ముఖ్యమనీ నాలుగు పురుషార్థాలను ఇవ్వగల వాడు శంకరుడు అని ఆ శివతత్వ అంతర్భాగిని అమ్మాయే గనుక ఆమెను  ఉపాసించి బ్రహ్మ విద్యా సాధన ద్వారా అమ్మ అనుగ్రహం తో అన్నియూ ప్రసాదించును . పురుషార్థ సాధనలో పరిపూర్ణత సాధించిన వారు పూర్ణ దీక్షాపరు లగుదురు పూర్ణత్వమోసగునది కావున పూర్ణా అయినది . సకల భోగములను జనులకు ప్రసాదించు తల్లి కావున భోగినీ అయినది .

o భువనేశ్వరీ. :– సమస్త భువనాలకు తల్లి వంటిది . ఈ విశ్వము నందు చతుర్దశ భువనములు గలవు . భూమి నుండి దిగువనున్న ఏడు లోకము లను అనగా 1 అతల 2 వితల 3 సుతల 4 తలాతల 5 మహాతల 6 రసాతల 7 పాతాళ ము లను ఏడింటిని అధో లోకములు అందురు . 

అదే విధముగా భూమితో ఎగువకు ఉన్న ఏడు లోకములు ఊర్ధ్వ లోకములoదురు . అవి 1 భూలోక 2.భువర్లోక 3 సువర్లోక 4 మహర్లోక  5 తపోలోక 6 తమోలోక 7 సత్యలోక – అను మొత్తము పద్నాలుగు లోకములను పాలించు తల్లి

భువనేశ్వరి దేవి అత్యంత ఫలప్రదం అయినది . ఈమె పైనున్న రెండు చేతులతో పాశము , అంకుశము ధరించి కింది రెండు చేతులు వరద , అభయ హస్తములు గా నుండి శివుని తో కలిసి యే నుండును . ఈమె ఇరువురు మాత లైన భైరవీ మాత పార్వతీ మాత ఏకత్వ తత్వ రూపిణిగా ఉండును . ఉదయాన అమ్మని పూజించు నప్పుడు భయమును పోగొట్టి బైరవీ మాతను హృదయాన భావన చేసి కొనవలయును . సాయంత్ర పూజా వేళలో పార్వతీ నామోచ్ఛరణ తో మనస్సున స్మరిస్తూ జ్ఞానార్జన చేయవలె  . శివ గురు స్వరూపమును భువనానందనాధ యను పేర సమస్త భువన జీవులకూ ఆనంద కారకు డై యుండును . అందుచేత అమ్మవారు స్త్రీలింగ రూపిణిగా భువనేశ్వరీ అయినది .


o అంబికా. :-  అంబికా యనగా అమ్మలగన్నయమ్మ . ఈమె జగత్కారణ శక్తి . శివుని తో కలసి యోగనిద్రలో ఉన్న ఈ తల్లిని అంబికా యందురు  . క్లుప్త ప్రీతికరమైన ఈ నామము అమ్మకు చాలా ఇష్టం .

o అనాది నిధనా:-  ఆది , అంతము లేని తల్లి .

o హరి బ్రహ్మేంద్ర సేవితా. :-  సర్వ దేవతలతో సహా విష్ణువు , బ్రహ్మ , ఇంద్రుని చేత సేవింపబడుతల్లి. .



నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా |

హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా || 70 ||

o నారాయణీ   :-  నారాయణునకు స్త్రీలింగ రూపము నారాయణి అను నామముతో లలితాంబను సేవింతురు . ఈమె విష్ణు సహోదరీ . నర అనగా పరమాత్మ అని అర్థము మరియొక అర్థములో పనులు చేయువాడు స్థితికారకుడు లేక కారకురాలు  . అమ్మ పరంగా ఆపాదిస్తే జీవుల సమూహమును రక్షణ చేయు తల్లి . “ నారాయణాయ నమః “ అను మంత్రముతో విష్ణువును ఆరాధించునట్లే అమ్మను “ నారాయణీ నమోస్తుతే  “ యని స్తోత్రించ వచ్చును . ఆది స్వరూపుడైన పరమశివుడు అహం నారాయణాయ : అని తన  స్వరూపము నుండే విష్ణువునూ , అమ్మనూ సృష్టించుకొనెను .

o నాదరూపా. :-  సృష్టికి ప్రారంభానికి ముందే పరమేశ్వరుడు చిత్ శక్తి స్వరూపములో శబ్ద రూపుడు గా శివుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు . ఆయన ఢమరుకం నాద శక్తి వలననే తెలుగు అక్షరమాల ఏర్పడినది కదా  ! మనము పలుకు ప్రతి అక్షరమూ శివ స్వరూపమే .

o నామరూప వివర్జితా   :-  వ్యవహార తత్వం  పరతత్వం అని రెండు విధాలు మనమంతా వ్యవహార తత్వానికి చెందిన వారము .  ఈ లౌకిక ప్రపంచంలో మనము ప్రతి దానికి ఒక పేరు , ఒక రూపమును భావించుకుని ఏదో ఒక నామంతో ఆయా రూపాలతో ఉంటాము . పరతత్వ విచారణలో అమ్మ నామ రూపములతో సంబంధము లేక అస్తి ,భాసి ,ప్రియ రూపిణిగా నుండును . అనగా అమ్మకు ఒక రూపము గాని ఒక నామము గాని యుండదు . ఇదియని చెప్పేందుకు కనపడనిది . అస్తి అనగా సత్ , భాసి అనగా చిత్ ,ప్రియ అనగా ఆనందము  . అదే నామరూపములను విడనాడితే అమ్మ రూపం చిన్ముద్ర గా నున్న సచ్చిదానంద రూపిణి . అందువలన ఋషులు  అమ్మ లలితాంబిక ను నామ రూప వివర్జితా అన్నారు .

o హ్రీంకారీ. :-  చతుర్దశ భువనాలను తన కనుసన్నలలో నుంచుకొని పాలించు తల్లి శ్రీ భువనేశ్వరీ దేవి . ఆ తల్లి బీజాక్షర స్వరూపం హ్రీo అనగా ప్రకంపనల తో కూడిన అమ్మ స్వరూపం . ఆస్తి , భాసి , ప్రియ స్వరూపములుగా ఉన్నా , అమ్మ నామరూప వివర్జిత యై చిన్ముద్ర లో ఆనందమయమైన సచ్చిదానంద రూపణి , మంత్ర బీజాక్షర రూపిణి అయినది .

హ్రీo  మంత్రాక్షరం ఓంకారముతో మిళితమై ‘హ్రీ’ అను అక్షరము శక్తి మయమై , ‘మ్’ అను అక్షరము ఓంకార మై పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరునితో కలసి ‘హ్రీo’ అయి శివశక్తి ఏక రూపిణి అయినది . హ కారము లోని హ ‘అ’ శబ్ద అక్షరము హ్రీ కారము లోని ‘ర’ కార శబ్దము ఈమ్ అయి ఓంకార శబ్దం తో కలిసి శివ శక్తి గా మారి నాద రూపుడైన శివుడు ఓంకార పుట్టుకకు కేంద్రము ఆకాశం అయినందున , అనంత విశ్వాంతరాళంలో శివుడు నిండి యున్నాడు .

పరమాత్ముడు చిత్ శక్తి స్వరూపుడై వ్యాపనం చెంది చిదాకాశములో సర్వత్రా నుండి వీక్షించును . అమ్మ శక్తి రూపిణి గా శివుడి లో ఐక్యత చెంది ఏకత్వమై సకల భువన పర్యవేక్షణ చేయును . ఈ విద్యాతత్వమును ఆకాశ విద్య యందురు  .  ఇందు ‘హ్రీo’ ను మూడు శబ్దాలుగా విడదీసిన                ‘హ కారము ‘ ను ఆకాశ తత్వముగా , ‘రకారము’ ను తేజో తత్వముగా , ‘ఈమ్ కారము’ను వాయు తత్వముగా భావించవలెను . ఆకాశము ఆదిజనని .  ఈ చిదాకాశ మే చిదంబరం .

ఈ’హ్రీo’ ను మంత్ర స్వరూపిణిగా మన హృదయ ఆకాశమందున్న అమ్మను భావన చేసినపుడు ,మన స్థూల సూక్ష్మ కారణములైన మన శరీరమునకు వర్తించి , నాలుగు పురుషార్థములు అయిన ధర్మ ,అర్ధ , కామ ,మోక్షములను నిర్వర్తించి , నెరవేర్చు కొను శక్తియుక్తులు మనలో ఉన్న అమ్మ ప్రసాదిస్తూనే ఉండును . ఇప్పుడు ‘హ్రీo’ బీజము మనశరీరానికీ , అది సాధించు పురుషార్ధములకూ ఎలా మంత్రాక్షరములు ఉపయోగపడినవో ఈ క్రింది విధముగా తెలియదగును .


  స్థూలదేహం               సూక్ష్మదేహం            కారణదేహం         తురీయం

              శరీరం.                          ఆత్మ.                        పని.               మోక్షం

‘హ’కారం                     ‘ర ‘కారం.                  ‘ఈ’కారం          ‘o’బిందువు

ధర్మ.                        అర్ధ.                          కామ.                 మోక్షం


దీనినిబట్టి సాలోచన చేయ అమ్మ మంత్రజపము చిత్తశుద్ధితో ఉపాసించిన మన సకల ఐచ్ఛికము లు తీరి అంత్యకాల మందు ఆత్మ ,హృదయ ఆకాశమునుండి ఆజ్ఞా చక్రము దాటి సహస్రార పీఠ మoదున్న అమ్మ పాదపద్మములకు చేరి మోక్షము బడయ వచ్చును .



o హ్రీమతీ  :- అమ్మ భువనేశ్వరి మాత సర్వోత్తమ జన్మ కలదై పతివ్రతా శిరోమణిగా నుండు మిగుల లజ్జా స్వరూపిణి . ఎవరి యందు అధర్మము చేయకుం డు నదియై అంతర్ముఖము నందుండి పరతత్వ సాధనకు ప్రేరణనిచ్చి అంత్య మందు లయ కారిణి గా నుండును .

o హృద్యా. :-  అమ్మవారు మనోహరమైన వర్చస్సు గలది  .అందరి హృదయముల యందు భాసిల్లుచున్నది .

o హేయోపాదేయ వర్జితా :-  ఒకరి యందు హేయము ( అనగా అయిష్టము ) మరి యొకరి యందు మమత లేక అందరినీ సమానంగా భావించి వ్యతిరేక భావములను విడిచిపెట్టు నది ( వర్జిoపబడునది )

రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా |

రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా || 71 ||


వశిన్యాది వాగ్దేవతలు ముగ్ధమనోహర మైన అందమైన అమ్మ వైభవమును అగ్ని బీజాక్షరము          ర కార  ప్రారంభ అక్షరముతో వేర్వేరు నామాలతో ఈ శ్లోకము లందు ప్రతిక్షేపిస్తున్నారు .

o రాజరాజార్చితా   :- సృష్టి ,స్థితి ,లయ కారకులై  విశ్వ పరిపాలకులగు బ్రహ్మ , విష్ణు ,రుద్రులు చే అర్చించబడు తల్లి జగదాంబ . మరియు ఒక అర్థంలో  దిక్పాలకుడైన కుబేరుడు అమ్మను భక్తితో ఆరాధన చేయును . అతనికి రాజరాజు అని పేరు కలదు .అమ్మ రంజనత్వము కలిగి ప్రకాశించు ఆనందమయ స్వరూపిణి .

o రాజ్ఞీ   :-  ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ గావున అమ్మ లలితాంబ మణిపుర శ్రీచక్రపీఠ సింహాసనం అధిష్టించిన రాణి .

o రమ్య   :-  అమ్మవారు బహు చక్కని అందమైన తల్లి .

o రాజీవలోచనా  :-  అమ్మవారు పద్మముల వంటి కన్నులు గలది .

o రంజనీ   :-  అమ్మ ఆనందమయ రూపిణి . అమ్మ తన యందు భక్తి కలిగిన తన భక్తులకు ఎల్లరకు ఉత్సాహం ఇచ్చి వారిని ఆనంద పరచి సంతోష పడునది .

o రమణీ   :-  నిత్యనూతన అందంతో నిరంతరమూ క్రొత్తగా దర్శనమొసంగు ఆనంద స్వరూపిణి .

o రస్యా   :-  ఎల్లప్పుడూ ఎవరైతే అమ్మ స్తోత్రములను పఠిస్తూ , వాటి అర్థములు గ్రహిస్తూ రసాస్వాదన లో ఓలలాడి  రసోల్లాస ఆనందమయులగుదురో వారి ఆస్వాదన శక్తిని పెంచి ఉల్లాసము  రేకెత్తించునది . 

o రణత్కింకిణి మేఖలా   :-  అమ్మ లలితాంబ నడుమునకు ధ్వని చేయుచున్న మువ్వల వడ్డాణము కలది . అమ్మ ధరించిన వడ్డాణం ధ్వనులు సంపూర్ణ అమ్మ స్తుతి వేద మంత్రములు గానే భావించవలెను .


రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా |

రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా || 72 ||


o రమా.  :-  అమ్మవారు లక్ష్మీస్వరూపురాలై సకల సంపదల నొసగే తన భక్తులను ఆదుకొను తల్లి . ఈ నామము నందు శ్రీ బీజ మంత్రము దాగి ఉన్నది .


o రాకేందువదనా  :-  రాకేందు అనగా పున్నమి చంద్రుడు . వదనం అనగా ముఖము కలది . అంటే పున్నమినాటి పూర్ణచంద్ర వదనంతో విరాజిల్లు తల్లి . చంద్రుని షోడశ  (16)  కళలను ఇముడ్చుకున్న పూర్ణ రూపంతో ఉన్న షోడశ కళల రూపిణి . ఈ పరిపూర్ణ వదనము లక్ష్మీ స్వరూపము .


o రతిరూపా   :-  రతి యనగా ఆసక్తిగలది . అనగా పరమాత్మను మిక్కుటముగా ప్రేమించు నది .

o రతిప్రియా    :- రతము అనగా భక్తి అని అర్థము . అంటే తనను భక్తితో సేవించు వారియెడల ప్రియత్వం కలిగి ఉండునది . మరొక విధముగా వివరించ వలెనన్న శివుని తపోనిష్ట ను భగ్న పరచి పార్వతియందాతని ప్రేమ జనించునట్లు జేయు సంకల్పముతో మన్మధుడు పూలబాణం శివునిపై ప్రయోగించగా ఆ ముక్కంటి తన మూడవ నేత్రాగ్ని తో కాముని దగ్ధము చేయ అతని భార్య రతీదేవి విలపించి అమ్మను పతిభిక్ష కొరకు అభ్యర్థిoచగా అమ్మ కనికరించి మన్మధుని మన్మధుని పూర్ణ యవ్వనవంతునిగా తిరిగి బ్రతికించినది . రతీదేవి ఆ విధముగా అమ్మ భక్తురాలై నందున అమ్మకు ఆమె యందు ప్రియత్వం కలిగి రతి ప్రియ అయినది .


o రక్షాకరీ  :-  తనను ఉపాసించువారు అందరికీ ఏ విధమైన కష్టములు కలుగ కుండునట్లు రక్షించు తల్లి .

o రాక్షసఘ్నీ.  :-  లోకమంతా రాక్షసులు చెలరేగి సాత్విక జనులను హింసించు వారిని అగ్ని వలె ఆ రాక్షసులను దహించి లోకములను రక్షించును .


o రామారమణలంపటా  :-  ప్రజల ఈతి బాధల నుండి తాపత్రయాలు నుండి వేరుపరచి రక్షణ చేకూర్చు తల్లి .



కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా |

కల్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా || 73 ||


o కామ్యా.     :- భారతదేశ ఉత్తరాది నందున్న మేరుపర్వత స్థానము నుండి కామేశ్వరుడు తపస్సు కొరకు దక్షిణాదిలో ఉన్న నీలగిరులను స్థావరముగా ఏర్పాటు చేసి కొనెను . అప్పుడు అమ్మ పార్వతి కూడా విహారము సల్పు నిమిత్తము ఆ నీలగిరు లకు చేరి పరమాత్ముని తో ఆ ప్రదేశంలో ఒక ప్రాంతమందు స్థిరంగా నుండునట్లు అనుగ్రహించమని కోరిక కోరినది .అందుకు కాముడు అనుగ్రహించి అమ్మను కామాక్షి అను నామముతోనూ , తాను ఏకాంబరేశ్వరుడు గా కాంచీపురమందు ఉండిరి . అప్పటినుండి అమ్మ కామాంగదాయిని యై కామాక్షీదేవిగా భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుతున్నది .

o కామకళారూపా. :-  అనగా ఆనంద కళా రూపిణి అని అర్థము .కామము అనగా కోరిక ,పేరు , మంత్ర శక్తి అను అర్ధములు కలవు . ఈ కామములు అనేక విధములుగా విస్తరించి యుండుటవలన కామ కోటి అను నామము ఏర్పడగా తదనంతర కాలంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి  అచట ప్రతిష్ఠాత్మకమైన గురు పరంపరగా కంచి కామకోటి పీఠం ఏర్పాటు చేయగా నేటికీ కొనసాగుతూ ఉండుట విశేషము . ఈ కామాక్షి దేవికి  కామేశ్వరీ యను శివ శక్తి రూపిణిగా ఉండి కాముని ( మన్మధుని ) సంహరించి శివుడు దహించి నప్పటికీ శక్తి అమ్మదే కనుక తిరిగి మన్మధుని జ్ఞానవంతుని  చేయగా అతడు పూర్ణ యవ్వన వంతుడయ్యెను .

కామము అనగా కోరిక కలుగుట . ఆ కోరిక తీరగానే తృప్తి కలుగును . అలా కలిగిన వెంటనే ఆనందము లభించును .ఈ ఆనంద కళలు అన్నియు విద్యా స్వరూపము లే . ఏలన ఇష్టంతో కూడిన సంతోషము లేకున్నా ఏ పనులు ఎలా చేయగలము ?

పరబ్రహ్మ స్వరూపుడు శివుడు సాక్షాత్ ఇచ్చా స్వరూపుడు . ఆయన ప్రళయానంతరము తిరిగి సృష్టి చేయవలెనను సంకల్పము తన మనము నందు ఉదయించగా అప్పుడు శక్తి రూపంలో అమ్మ సంకల్ప శక్తి గా మారి , కమనీయత నొ oది సత్యకాముడై సృష్టి ప్రారంభించెను .

శక్తితో కూడిన పరమాత్ముడు సమస్త కళలకూ  ఆద్యుడు అయినందున కళాతృష్ణ తో సకల కళా వల్లభుడై మొదట తానే బిందు రూపముగా మారి ,దహనఇందువిగ్రహరూపముగా మారి మొదటి మానవ జన్మకు అంకురార్పణ జరిగినది . అది  ఎట్లన దహన యనగా అగ్ని రూపాత్మక ఎరుపు వర్ణము కలిగిన రక్తము గాను , ఇందు అనగా సోమాత్మకమైన (చంద్ర ) తెలుపు వర్ణము శుక్ల రూపములో ఏర్పడి అగ్ని సోమాత్మకంగా మారి సూర్యుని తపన శక్తి వలన కళా రూపుడగు పరమాత్మ ఆవిర్భావం జరిగినది . అనగా సూర్యుడు తన కాంతి కళను రాత్రివేళ యందు అగ్ని ,చంద్రులకు పైన తానుండి క్రింద ఉన్న అగ్ని సోమాదులకు జ్వలనము అనగా .....’ therefore' అను ఆకారములో వేడిని అందించును . ఇదియే పరమశివకళ . ఈ కళారూపం అంతయూ ఆదిపరాశక్తి వలననే జరుగును కావున దీనిని శక్తి విలాసం అందురు .ఈ విషయములు అన్నియు కామ కళావిలాసం అను ఉద్గ్రంధము నందు వివరముగా చెప్పబడినవి .

క                     ళ                ఈo            క్లీం

స్థూల సూక్ష్మ కారణ శరీరాన్వయము చేసినచో ఇంతకుముందు హ్రీ o బీజాక్షర వివరణలో చెప్పినట్లు ఈo బీజము కామకళా రూపము . సూర్య అగ్ని  చంద్ర కామ కళలే అక్షర నాద రూపాలు  . వేరు రూపాలలో వేరు నామాలతో పలువిధ నాదము లతో పిలవబడుతున్నాయి .

కామ కళారూప అను నామము చాలా ముఖ్యమైనది . ఈ నామము నందు అనేక రహస్యములు దాగి ఉన్నవి . అవి తెలుసు కోన దగినవి .

ప్రళయానంతర తన సంకల్ప శక్తి తో పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాలి అని తలంపు రాగా ‘ఏకోహం బహుస్యా o ‘  అనగా ‘ ఒక్క నేను  ఎన్నో అవుతాను ‘ అని అనుకున్నాడు . ఇందు నేను అనునది అహం ను సూచిస్తున్నది . నేను అనునది సగుణ బ్రహ్మ రూపం  .అహం అనే వ్యక్తి సగుణ బ్రహ్మమును ఆశ్రయించి నపుడు ‘ అహం  బ్రహ్మాస్మి ‘ అయినది . ఈ అహం అమ్మ రూపమే . అందుచేత అహం లో ఉన్న అమ్మ ,బ్రహ్మం గానున్న శివ రూపముతో కలిసి పరా రూపిణి అయినది . అహం , నేను కలిసిన దే కామకళ అయినది . శివశక్తి ఏక స్వరూపము అమ్మయే కావున కామకళా రూపిణి అయినది .

ఇప్పుడు కామ కళ అను పదములు విడిగా లోతైన అర్ధం పరిశీలిద్దాం .

    కామ  = క , ఆ ,అ అను 3 అక్షరముల కలయిక

ఇందు క కారము మాయా స్వరూపము .

           ఆ కారము ఆకాశ తత్వం ఈశ్వర స్వరూపము.

           అ కారము అమ్మదైన చైతన్య రూపము .

క ఆ కలిసినప్పుడు సగుణ బ్రహ్మముగా నుండి అందు తో కూడిన చైతన్య శక్తి వలన సృష్టి జరుగుతున్నది .

కామ పద మందు ‘మ’ కారమును విభజించిన చో మ కారము నందు రెండు అక్షరములు కలవు

మ్ +అ

ఇందు మ కారము ఈశ్వరుడు అయిన శివస్వరూపము కాగా నిర్గుణ స్వరూపముగా నున్న అకారము అవిద్య అయినందువల్ల చైతన్య o ఉన్నప్పటికీ దైవత్వము లేక జీవుడు అయినాడు . మాయ తో కూడిన శివ ప్లస్ చైతన్యము కలిస్తే పరమాత్మ మాయా శక్తి లేని చైతన్య రూపమైన జీవ స్వరూపమే శుద్ధ చైతన్య స్వరూపము .

ఇప్పుడు కల అనగా సూర్యుడు తన శక్తిని అగ్ని చంద్రులకు పంచ గా అగ్ని స్వరూపంలో అమ్మ సైన్యాధి కారిణిగా వారాసీ దేవి , చంద్ర స్వరూపములో అమ్మవారి మంత్రినణిగా జ్ఞాన స్వరూపిణిగా నున్న శ్యామలా దేవి గాను భావించవలెను . కళ అను పదము విభజన చేయగా క  కారము అనగా ఆకాశము , మాయ అని అర్ధములు కలవు

ళ కారము అనగా భూమి అని అర్థము . చైతన్యవంతమైన ఆకారమును లకారము నుండి విడిచిన భూమ్యాకాశాల మద్యము శూన్యం అనుకుంటే బ్రహ్మవిద్య అగును .ఈ చైతన్యమే అహం అందురు .  పైన చెప్పిన విధముగా సూర్యుడు లలిత అమ్మవారి బిందు స్వరూపము కాగా అగ్ని చంద్ర బిందువులు అమ్మ   స్థన యుగ్మము కాగా పై రెండు బిందువుల కు దిగువ వేలాడు బిందు స్వరూపము అమ్మ కటి ప్రదేశము నందున్న మేఖల గా బావించవలెను .

సూర్యుడు , లలితా దేవి

ఎడమ అగ్ని , వారాసీ

కుడి చంద్రుడు , శ్యామలా దేవి

మేఖల

ఈ పై మొత్తము ఆ కృతమైన తల్లిని నాదబిందు స్వరూపిణి అనగా సమ్యక్ బిందువు అందురు .ఇది కుండలినీ వ్యవస్థలో సుషుమ్న నాడి ద్వారా ఒక్కొక్క చక్రము దాటి అoత్యములో సాధన కల ఉపాసనతో అమ్మ పాదపద్మములు చేరుట .



కదంబ కుసుమప్రియా  :- కామకళా రూపిణి అయిన అమ్మవారు కడిమి పూలతో కూర్చిన దండలు చాలా ఇష్టపడునది .

కల్యాణీ    :-   కల్యా అనగా మాట అని అర్థము .ణీ అక్షరము చేరినప్పుడు మాట్లాడునది అని భావన . కల్యాణీ అనగా మంగళ స్వరూపిణి . శబ్ద సంపద ఉత్పాదన చేయు తల్లి అమ్మవారు .

o జగతీకందా   :-  ప్రపంచానికే ఆది మూలమైన తల్లి .

o , కరుణారస సాగరా   :- సాగరము అనగా అనంతమైన నీరు కలది . అపార మైన జలనిధి వలె అమితమైన దయ కలిగిన ఆనంద స్వరూపిణీ అమ్మవారే .


కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా |

వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా || 74 ||

o కళావతీ   :- అమ్మవారు షో డశ కళా రూపిణి . అమ్మ సకల విద్యలకు అధిదేవత .

o కళాలాపా.  :-   అలాపము అనగా మాట్లాడు నది . అమ్మవారు మృదువుగా పలుకు స్వభావము కలది 

సమస్త వెలుగులకు కారణభూతులైన అగ్ని ,సూర్య ,చంద్ర మరియు సృష్టి స్థితి లయ కారకులగు  బ్రహ్మ, విష్ణు , రుద్రులులతో ఎనిమిది మంది దేవతా స్వరూపాలకు తానే వెలుగులను అందిస్తూ వివిధ కళా రూపాలతో విరాజిల్లుచున్నది .

o కాంతా   :-   అనగా అంతము సిద్ధింప చేయునది . బ్రహ్మమయ  సిద్ధాంతము ద్వారా పరమార్థము తెలుపునది . బ్రహ్మ దేవుని జీవిత కాలపరిమితిని కూడా తానే నిర్ధారించి అంతమొందించునది .

o కాదంబరీప్రియా   :-  కల్లు యందు ప్రీతిపాత్రమైనది . కాదంబరీ అనగా కడిమి పువ్వుల మకరందము గ్రోలుట యందు ఇష్టపడు నది .

మరియొక అర్థంలో మనము భక్తి భావ పూర్వకముగా పూజానంతరం నైవేద్యముగా క్షీరామృత సమర్పణము మిక్కిలి ఇష్టపడును .

o కాదంబరి అనగా సర్వ విద్యా ధి దేవత అయిన సరస్వతి మాత అనిన అమ్మ లలితాదేవికి అత్యంత ప్రీతికరం . ఏలయన సరస్వతీ దేవి విద్య  ద్వారా జ్ఞానం పెంపొందించు జ్ఞాన ప్రదాత . ఆ  జ్ఞాన ప్రకాశంతో జ్ఞానామృత పానము చేసిన తన భక్తుల యందు ప్రియత్వం కలిగియుండును .

o వరదా   :-  ‘వ’ యను అక్షరము అమృత బీజాక్షరం . మోక్ష , జ్ఞానమును ప్రసాదించు తల్లి . సర్వజీవుల కోరికలను వెనువెంటనే తీర్చి ఆనందమయులను చేయు తల్లి . ఎవరైనా యజ్ఞము చేయ తలపెట్టిన సందర్భంలో ఋత్విక్కులు యజ్ఞము పరిసమాప్త మనంతరము ఆ ఋత్విక్కులకు తగినంత దక్షిణగా కానుక యజ్ఞకర్త ఇచ్చి తీరాలి  . ఆ ఇచ్చే దక్షిణనే వరద అందురు . అప్పుడే యజ్ఞకర్త కు పూర్తి యాగ ఫలము లభించును . దసరా ఉత్సవ సమయంలో అమ్మకు మహర్నవమి రోజున కడిమి పూలతో పంచామృత నైవేద్యములతో ఏకాగ్ర భక్తితో పూజలందు కొనుటకు ఇష్టపడును .

o వామనయనా   :-  అర్ధనారీశ్వర తత్వం లో విచారణ చేసినచో వామ దేవుడైన శివుని శరీర అర్ధ భాగం తాను ఆక్రమించి నందున అమ్మ త్రినేత్రములతో విరాజిల్లుతూనే ముక్తి ప్రదురాలు అగుచున్నది .

o వారుణీమదవిహ్వలా    :-   తన భక్తులు తనయందు సంపూర్ణ భక్తి కలిగి రసో ల్లాసభరితులై ఎవరు జ్ఞానామృతము సేవింతురో వారి యందు అమ్మవారు ప్రీతిపాత్రంగా నుందురు. .


విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ |

విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ || 75 ||

o విశ్వాధికా   :- సృష్టి స్థితి లయము లకు కారకురాలైన సమస్త భువన ములనూ క్రమపద్ధతిలో నడుపుతూ విశ్వమంతా వ్యాపించి ఉన్న తల్లి కావున జగన్మాత అయినది . ఆమెయే అధికురాలు .

o వేదవేద్యా   :-   చతుర్వేద మంత్రములు మృదుమధురమగు అమ్మవారి వాక్కు ద్వారా వెలువడి నందున సకల శాస్త్ర వేద్యురాలై ఉన్నది .

o వింధ్యాచల నివాసినీ   :-   వింధ్య పర్వతము స్థావరం గా నివసించు తల్లి అందుచే అమ్మవారికి విoధ్యాయావతి అను నామము కలదు . చలనం లేని కొండపై తా నుండి సమస్త విశ్వమానవ స్థితిగతులను వీక్షించు తల్లి .

o విధాత్రీ   :-   త్రి విధానము లైన సృష్టి స్థితి లయములు ఒకే విధాన క్రమంలో నడిపిస్తూ పోషణ చేస్తూ ఫల ప్రదాయక శక్తి నొసగి ధర్మ రూపిణిగా నుండు తల్లి .

o వేదజననీ   :-  మానవులలో పరతత్వ శ్వాస రగిలించు చతుర్విధ వేదమంత్రములకు వివిధ దేవతా స్వరూపాలకు చెందిన ఉపనిషత్ మంత్రములకు కారణ భూతురాలు అమ్మయే కావున వేదమాత అయినది .

o విష్ణుమాయా    :- విష్ణువు వివిధ అవతార స్వరూపం లలో అనేక మాయలు ప్రదర్శించి రాక్షస సంహారము గావించినాడు . ఆయా మాయా శక్తులకు మూలము ఆది పరాశక్తి అయిన అమ్మ గావున వ్యాపించిన మాయా స్వరూపిణి అయినది .

o విలాసినీ   :-   అనగా ప్రకటనము . ముఖ్యముగా నాట్య శాస్త్రము నందు ఈ  పద ప్రయోగము కలదు . ఒక నర్తకి తన హావభావ ములచేత తాను ధరించిన పాత్ర ఔన్నత్యము ఏ విధముగా కాపాడుకొనునో  ,తన సమ్మోహన శక్తితో అశేష జనవాహినినీ మోహ పరచి తన భక్తులుగా చేసుకునే తల్లి .

మరో విధముగా చెప్పవలెనన్న అత్యంత శ్రద్ధాసక్తులతో అమ్మను సేవించిన భక్తులు కుండలినీ విద్య ద్వారా పరమేశ్వరుని చేరు తరుణాన సహస్రార చక్ర ద్వారము నందు ఆ భక్తునకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు చేయు తల్లి ఈ విలాసినీ రూపిణే . అందుకే ఈమెను కష్టతరాధిగమ్య అందురు .


క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ |

క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా || 76 ||


.    :-  ఋషుల చేత వేద మంత్ర యంత్రములతో ప్రతిష్టించబడి దేవతా ఆవరణము లన్నియు పుణ్య క్షేత్రము లే . ఆయా క్షేత్రము లoదు పరమేశ్వర శక్తి వ్యాప్తమై ఉండును . పుణ్య కాలములలో పుణ్య ప్రదేశములందు పుణ్యాత్ముల చే ప్రతిష్టించిన క్షేత్రముల యందు అమ్మ భగవత్ శక్తి కేంద్రీకృతమై వుండును .

ఇదే మానవాళికి అన్వయించిన కోరిక ,ద్వేషము , సుఖదుఃఖాదులు , చైతన్యము , ధైర్యము మొదలగు వికార రస సహితముగా నుoడునవే  క్షేత్రము . అనగా మన శరీరము . ఈ శరీరమునందు మనోబుద్ధుల ప్రకృతి వికారములయిన సత్వ రజ తమో గుణములు మూల ప్రకృతి వలననే కలుగుచున్నవని తెలుసుకొనుట జ్ఞానము . ఈ జ్ఞానము పొందిన వారిని అమ్మ అనుగ్రహించి ముక్తి ప్రసాదించును .

o క్షేత్రేశీ   :-  ప్రకృతి శక్తులను ( మాయ శక్తులను ) నియంత్రించు తల్లి

o క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ  :-  స్థావర జంగమ రూపము లన్నియు క్షేత్రక్షేత్రజ్ఞు ల సంయోగము వల్లనే పుట్టుచున్నవి .  క్షేత్రక్షేత్రజ్ఞ  (ప్రకృతి -పురుష ) విలక్షణ తత్వమును జ్ఞాన దృష్టితో ఎవరైతే తెలుసుకొను చున్నాడో వారిని అమ్మ అనుగ్రహించి పరబ్రహ్మము చేర్చు చున్నది .

o క్షయవృద్ధి వినిర్ముక్తా  :- అమ్మవారికి నిరుపేదల యందూ , సంపదలు బాగా అభివృద్ధి చేసుకున్న వారూ  అను భేద భావము లేక అందరినీ సమభావము తో చూసుకొనెడి  తల్లి . ఎవరి విషయము నందునూ అనుకూల విముఖత లేక అందరకూ వారి కర్మానుసారం ముక్తి ప్రాప్తము కలుగ జేయును .

o క్షేత్రపాల సమర్చితా   :- క్షేత్రపాలకులనగా భూమియందు పరిపాలకులుగా ఉన్న రాజులు మరియు కుబేరుడు , అశ్వినీ దేవతలు , ఇంద్రాది దేవతల సమూహములచే అర్చన పొందు తల్లి .

విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా |

వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ || 77 ||

వశిన్యాది వాగ్దేవతలు వకార బీజాక్షర నామము లైన వరదా తో ప్రారంభించి కొన్ని నామాలు పొందుపరచి మరిన్ని నామాలతో అమ్మను కీర్తిస్తున్నారు .

విజయా, విమలా   :-సమలోష్ట కాశ్మకాంచనయగు అమ్మ అందరియందు సమభావము కలిగి తనను ఆశ్రయించు వారికి విజయం చేకూర్చి వారిని సంతోష పరచు తల్లి .

వంద్యా   :-   ఏ దేవతారాధన చేయునప్పుడు అయినా ఆ దేవతా తత్వమును మనస్సునందు గుర్తెరిగి ముందుగా హృదయపూర్వకముగా నమస్కారము  (వందనము) తో ప్రారంభించాలి . ఈ వందనములు అనేక విధాలు . ఒక్కొక్కరు వారి కోర్కెలు తీర్చు కొనుటకు ఆరోగ్య వందనము , ధనము కొరకు ఐశ్వర్య వందనము , విజయాల కొరకు  విజయ వందనము , ముక్తి కొరకు జ్ఞాన వందనము మొదలైనవి . ఈ వందన సమర్పణ వలన ఇంద్రియ పుష్టి కలిగిoచి ఆరోగ్యవంతులను చేయును .

వందారు జనవత్సలా   :-  అమ్మవారు మిక్కిలి వాత్సల్య స్వరూపిణి  . ఆమె సులభ ప్రసన్నురాలగుటచే సర్వజన వంద్యయై ప్రజలను కాచుకొను చున్నది . ఈమెను పూజించుట వలన ఆయుర్విద్యాయశోధనప్రాప్తి కలిగి క్షేమముగా ఉందురు .

వాగ్వాదినీ  :-  వ్యక్తీకరించబడు మాటను వాక్కు అందురు . మనము మాట్లాడుకునే మాటలు అన్నియు వివిధ అక్షర కూర్పులే . అక్షరమాల అక్షరాలన్ని దేవతా మంత్ర స్వరూపములే . ఈ వాక్కులకు అన్నింటికీ మూల శక్తి సరస్వతి దేవియే . ఈమె జ్ఞానదాయిని . సకల వాగ్మంత్రశక్తులకూ ఈమెయే కారణభూతురాలు . ఈమె అనుచర దేవతా స్వరూపాలే శ్యామల దేవీ , వాగేశ్వరీ దేవీ ,శారద , వాగ్వాదినీదేవీ . వీరందరూ స్వయం శక్తి దేవతలుగా ఉండి భక్తులకు సకల విద్యలను అనుగ్రహించి పాటవులుగా చేయును . కాళిదాసు మహాకవి అమ్మ శ్యామలా దేవి ని స్తోత్రించి అపార సాహితీ సంపన్నుడై ప్రసిద్ధి చెందాడు . అమ్మ బీజాక్షరములు అతని నాలుక పై వ్రాసినది . వాగ్వాదిని దేవి స్వచ్ఛమైన కర్పూరపు తెలుపుదనము గా నుండి పై రెండు చేతుల యందు విద్య , జ్ఞాన రూప చిహ్నములైన పుస్తకము , జపమాల కలిగియుండి క్రింది రెండు చేతులు అభయ ,వరద హస్త ముద్రతో విరాజిల్లు శ్రీవిద్యా దేవత  .

వాక్చ్ఛక్తి గూర్చి మార్కండేయుని గురించి తెలియాలి . పూర్వం మృకండ మహర్షి పరమేశ్వర వరంతో అల్పాయుష్మంతుడు జ్ఞానవంతుడు అయిన మార్కండేయుడు అను కుమారుని పొందెను . దినదిన ప్రవర్ధమానుడగుచున్న కుమారుని చూచి అతని ఆయుక్షీణం జ్ఞప్తి యందుoచుకుని అనేకమంది రుషుల ఆశీర్వచనముల కొరకు తన కుమారుని చే వారికి వందనములు చేయించుచుండ , వారిలో ఎవ్వరూ ఆయుష్మాన్ భవ అను దీవెనలు ఇయ్యలేదు. 

కొంతకాలానికి సప్త ఋషులు మృకండముని వద్దకు రాగా కుమారుని దీవించమని వేడగా , వారు ముక్తకంఠంతో ఆయుష్మంతు ని గా దీవించి వెళ్ళు సమయాన నారదుడు తారసపడి వారితో మార్కండేయుని జన్మ వృత్తాంతము తెలిపి ఋషి వాక్కు అసత్యము కారాదు కదా యనగా వారు బ్రహ్మ దేవుని వద్ద కేగ ఆయన శివుని ప్రార్థించ మనగా రుషుల కోరిక మేర మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు .

వామకేశీ   :-  అమృత బీజ వ కార అక్షరంతో వాక్ శక్తి నొసగి సంగీత సాహిత్య సమలంకృతయైన భువనేశ్వరరీ దేవి సుందరమైన కేశములు కలిగి ఉన్నది .

కేశములు అనగా కిరణములు అని అర్థము . శివుని వామదేవుడు అందురు . వామ భాగమున నున్న అమ్మ శివశక్తి కిరణములతో బాసిల్లి వామకేసి అయినది .

మరియొక అర్థములో అమ్మ కేశములు మూడు పాయలతో జడ కలిగి సూర్య , చంద్ర , అగ్ని కిరణ కాంతులు కలగలిసి సుందర తత్వము కలిగి యున్నది . నవగ్రహముల ను , ఏకాదశరుద్రులను కూడా వామ కేసులు అందురు . వారికున్న శక్తులు అమ్మ ప్రసాదించినవే .

వహ్నిమండల వాసినీ    :- మణిపుర  శ్రీ చక్రం నివాసిని అయిన అమ్మ సూర్య చంద్ర అగ్ని త్రికోణాకారపు ప్రాకారము మధ్య లో కాంతులీనుతూ ఆ మండల మందు వసించునది .

కుండలిని విద్యాపరంగా భావన చేసినచో మూలాధార సహస్రార చక్రము లు అగ్ని మండల స్థావరములు . వీటియందు నివాసముండు తల్లి లలితాంబిక వహ్ని మండల వాసినీ .

మరో విధముగా విచారణ చేసిన సృష్టిలో ఒక్క మానవాళికి మాత్రమే భగవంతుడు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు . సరస్వతియే వాగ్వాది నీ శక్తిగా మన అగ్ని ద్యోతకమగు నోటి ద్వారా వాక్కులు పలుకు ముఖ మండలమే అమ్మ నివాస స్థలము . మన సద్బుద్దులతో ఆ స్థానమును శుద్ధి గా ఉంచుకొనవలెను . అచట నుండు దేవత వాగ్వాదినీ దేవి .

జగజ్జేగీయమానం అయి  ప్రత్యక్ష దైవమై సూర్య భగవానుడు నిత్య అగ్నిహోత్రము గా తన రశ్ములను (కిరణములు) ప్రసరింపజేసి విశ్వానికే ఆరోగ్య ప్రదాత అయినాడు . ఆ సూర్యమండల బిందు స్వరూపిణిగా అమ్మవారు ఉండి నిత్యపూజలందుకొను చున్నది .







భక్తిమత్కల్పలతికా, పశుపాశ విమోచనీ |

సంహృతాశేష పాషండా సదాచార ప్రవర్తికా  || 78 ||


భక్తిమత్కల్పలతికా   :- సూర్యమండల నివాసి అయిన అమ్మ మనకు ప్రతిదినము దర్శన సౌభాగ్యము కలిగిస్తూ మానవాళికి తనను నిత్యం నమస్కరించుకును ప్రేరణ కలిగించుచున్నది . ఆ విధముగా అమ్మను భక్తితో సేవించిన వారికి కల్పతరువు వలె కల్పలత గా ఆనందమైన భక్తుల కోర్కెలు తీర్చి దయాస్వరూపిణిగా  ,మోక్షదాయిని గా  భాసిల్లుచున్నది .

పశుపాశ విమోచనీ   :-  పాశము  (బంధనము ) చేత కట్టబడినవి పశువులు (జంతువులు ) . మానవులంతా ఏదో ఒక పాశమునకు అనగా బంధు పాశం ,ప్రేమ పాశం , ధనవృద్ధి పాశం , అను అనే క  విధ పాశబద్దులై కొట్టుమిట్టాడుచునన్నారు . ఎవరైతే నేను వేరు , నేను ఆరాధించు దేవత వేరు అనే భావనతో అనగా ద్వైత భావనతో పూజింతురో వారంతా అజ్ఞానులే  . కేవలము మనముచే ననుకొను కర్మఫలములే అజ్ఞానానికి మూలము . అది తొలగ వలెనన్న పశుపతి శివుని శరణు వేడిన పాశమనెడి అస్వతంత్రత తొలగి , ఆపాశ బంధముల నుండి విమోచన  కలిగించు తల్లి లలితాంబ . అప్పుడు స్వతంత్రేచ్చతో భగవత్తత్వ విచారణ చేస్తూ కల్పలత వోలె అమ్మ పాద కాంతులు దర్శించవచ్చు .

సంహృతాశేష పాషండా  :- పాషండుడు అనగా మన సనాతన ధర్మము ప్రకారము తరతరాలుగా వస్తున్న విహిత కర్మలను ఆచరించ క వ్యతిరేక భావన తో నుండి విమర్శింతురో అట్టి వారలు పాషoడులు . అనగా వేద విరుద్ధ భావనతో కర్మలను ఆచరిస్తూ నే ధర్మానికి స్వస్తి చెప్పి అధర్మానికి కొత్త అర్థాలు ధర్మంతో ముడిపెట్టి ప్రవర్తించు వారు . వారి అధర్మ ప్రవర్తనను ఎక్కువ వ్యాపితంగా చేయుటకు ప్రయత్నింతురు . అట్టివారి   పాప కార్యములను సమూలముగా కఠినంగా సంహరించు తల్లి .

సదాచార ప్రవర్తికా   :-  ఆచరించదగినది ఆచారము . పాషండ సంహారానంతరం మంచి ఆచార విధానములు ఆచరించు మార్పు తీసుకు వచ్చేది ఆ తల్లి యే . అప్పుడు శాస్త్రములలో చెప్పిన పద్ధతులు గురుతుల్యులు అయిన  పెద్దల ద్వారా తెలిసి నడుచుకొనవలెను . దురాచారము  ప్రబలుతున్న ఈ కలికాలంలో సదాచారము పాటించు వారిని హేళన చేయుటయూ  కద్దు .

ఒకప్పుడు అగస్త్య మహర్షులవారు దక్షిణాపథ ముందు ప్రయాణం చేస్తూ కంచి పట్టణము  చేరి లోకంలో దురాచారములు పెరుగుతున్న తీరు అమ్మ కామాక్షీ దేవికి వివరించుటకు ఆలయ ప్రవేశము గావించి వివరింప గా అమ్మ కృపతో ఆయనకు గురువు హయగ్రీవుల వారు సాక్షాత్కరించి సదాచార పరులకు అమ్మ సత్వరం ఫలములను ప్రాప్తించును అని వివిధ సదాచారములు బోధ  పరిచెను .



తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |

తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా || 79 ||


o తాపత్రయాగ్ని:-   త్రి విధములైన తాపములనెడు అగ్ని చేత దహింపబడువారు . ఆది భౌతిక , ఆది దైవిక ,ఆది అంతిక అను మూడు విధములైన  తాపము ( బాధలు )లకు ప్రపంచ జనులు కష్టాల పాలవుతున్నారు . భౌతిక తాపం లందు విపరీతమైన కోరికలు పెంచుకొని  అవి నెరవేరక అనేక ఈతి బాధలకు లోనై ఉందఉందురు. వీరు ఆ బాధాగ్నియందు దహింతురు .

దైవిక తాపములు అంటే  ప్రకృతి పరంగా సంభవించు భూకంపములు , తుఫానుల వల్ల వచ్చు కష్టనష్టములు మొదలైనవి .

ఆదిఅంతిక తాపములు అనగా వయసు వుడుగు సమయము ఆసన్నమగు కొద్దీ శరీర ఆరోగ్యం సరిగా లేక ఇబ్బందులు పాలగుట .

పై మూడు విధములైన తాపములు దరిచేరకుండా నిరంతర అమ్మ ఉపాసనా భక్తితో పూజించిన అమ్మ చంద్రకళాధరి చల్లని చూపుతో శాంతి చేకూర్చును . అందుకే స్తోత్ర పఠనానంతరము  త్రి విధములైన తాపముల నుండి రక్షణ కోరుతూ ముమ్మారు శాంతి శాంతి శాంతి అని వేడుకొనుట సదాచారము .

o సంతప్త.  :-  అనగా తపించు అని అర్థము . బంగారము శుద్ధి పరచవలెనన్న అగ్ని తాపము కలిగించి ఎట్లు మెరుపు తెప్పింతురో అదే విధముగా తాపత్రయాల బారినుండి బయట పడవలెనన్న అత్యంత భక్తితో అమ్మ ను గూర్చి తపస్సు చేయుట ద్వారా ఆరాధన చేసిన ఉపాసన ఫలము పొందవచ్చును .

o సమాహ్లాదన చంద్రికా   :-  చల్లని చంద్రకాంతి ద్వారా ఆనందం కలిగించేతల్లి . శాంతి కారకురాలైన అమ్మ ఈశ్వరుని వలెనే చంద్రకళాధరి అయినది .

అంతరార్థ ప్రకారము కుండలిని పరంగా విచారణ చేసినప్పుడు తపము చేయు వ్యక్తి లౌకిక విషయాలను విస్మరించి నప్పుడు మూలాధారమున ఉన్న అగ్ని స్వరూపమైన అమ్మ సుషుమ్న నాడి ద్వారా గ్రంధి ఛేదన  చేస్తూ సూర్య చక్ర స్థానము దాటి సహస్రారము నందున్న చంద్రమండలంలో ఉన్న బిందు స్వరూపిణిని ఆనందనిలయంలో ఐక్య మగుట . చంద్రిక అనగా అమృత భావము .

o తరుణీ   :-  అనగా యవ్వనవతి – వికసన దశ . అమ్మవారు నిత్య యవ్వన వతిగా నుండు ముగ్ధా స్వరూపిణి  , కాలాతీతురాలు . తన భక్తుల బాగు పరచు తరుణం కొరకు చూచునది . 16 అక్షరములతో కూడిన శ్రీ విద్యా మంత్రమును తరుణీ అందురు . మరియొక అర్థము పరిశీలించిన కుండలిని విద్య యందు మూలాధారము నుండి సుషుమ్ననాడి ద్వారా ఊర్ధ్వ ముఖంగా పయనించు అగ్ని స్వరూపం  తరుణీ అందురు .

o తాపసారాధ్యా   :-  ఎవరైతే ఇతరులను హింసించక స్వధర్మ సిద్ధాంతములకు కట్టుబడి శాస్త్రములు చెప్పిన విధముగా నియమబద్ధ ఉపాసన ద్వారా మనసా వాచా కర్మణా అమ్మను ఆరాధిస్తూ శరీరమును శుష్కించునట్లు చేయు ఏక భక్తిని తపస్సు అందురు . ఈ తాపసా శక్తితో జగన్మాతను ఆరాధించ వలెను .

o తనుమధ్యా   :-  సూక్ష్మ రూపము గానుండు బిందు స్వరూపము . ఈ స్వరూపమును తనుమధ్యా దేవి అందురు .

కుండలినీ లో మూలాధారము న సుషుమ్న నాడి నుండి పై చక్ర స్థానమునకు చేరుకొని ఉన్న అగ్ని, అమృత బిందువు కూడలి నందు ఉన్నప్పుడు దానిని తనుమధ్యా అందురు .

o తమోఽపహా   :- ఎవరైతే నిశ్చల భక్తితో శ్రద్ధ ఆసక్తులను మేళవించి నిరంతర చింతనలో నుందురో అట్టి వారిని సాత్విక గుణవంతులు గా చేసి అంతకుముందున్న తామస రజోగుణము లను పోగొట్టును .



చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ |

స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః || 80 |


           తాపత్రయాదులనుండి ఉద్ధరింప బడిన అమ్మ భక్తులు ఇంద్రియములను నిగ్రహించి అమ్మ యందు మనస్సు కేంద్రీకరించి ప్రత్యేక భక్తితో తాపసు లై తమోగుణ పరిహారము చెంది చిద్రూపీ అయిన అమ్మ ధ్యానము తో రసోల్లాసము నందు ఓలలాడుతూ వారి లక్ష్యార్థమైన  చిదాకాశమును అనగా ఏడవ చక్రం అయిన సహస్రారము నందు ఉన్న ఆ లలితాంబికా దేవి పాద స్పర్శ లక్ష్యము నెరవేరునట్లు చేయు తల్లి .

                      అమ్మ భక్తి తత్పరులు వారి లక్ష్యం నెరవేరే క్రమంలో సంపూర్ణ ఆత్మానందం పొంది మరుజన్మములు లేక దుష్కర సాధ్యము అగు బ్రహ్మలోక ఆనందం అనుభవిస్తూ అంతకుముందే ఆ స్థాయికి చేరిన వారి సంతతిలో చేరు కొందురు . ఈ విధముగా అమ్మ 16 అక్షరాలతో కూడిన తరుణీ విద్య అయిన శ్రీ చక్ర ఉపాసన విద్యతోనే సాధ్యము .

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |

మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా || 81 ||


              మనిషికి ప్రాణశక్తి వాక్కు . మొదట మాట్లాడాలి అనే తపన తలంపుతో సహస్రార చక్రము నందున్న మనసులో ప్రారంభం అవ్వగానే తత్ క్షణమే విద్యుత్ తీగ నందున్నవిద్యుత్తు వలె సుషుమ్ననాడి ద్వారా మూలాధార చక్రము నందు ప్రవేశించి మాట్లాడవలసిన విషయము నందు భావం ఏర్పరచుకొనుటను పరా అందురు . శ్రీచక్రములో బిందు రూపముగా నుండి నాదమై మంత్ర మగును .

 వాక్కు నాలుగు అంచెలైన పరా ,పశ్యoతి ,మధ్యమా ,వైఖరీ  (మాట లేక మంత్రము) పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాలనే సంకల్పం కలగగానే శక్తి తోడై చైతన్య స్థితిలో తన మనోబలంతో మనసున భావ నిక్షేపణ చేసుకొనుటను  పశ్యంతీ అందురు . వెనువెంటనే మంత్రోపాసన  ( మద్యమా ) ద్వారా ఫలితము చెంది సృష్టి కార్యము జరిగినది . అదే విధముగా మనిషిలో మూలాధార మందు భావ ప్రజ్వలన కలిగి ఏ భాషలో ( పశ్యంతీ ) మాట్లాడాలో (మధ్యమా ) ఎందుచేతనంటే అక్షర రూపము లన్నీ దైవ మంత్రాలే కనుక మాటే మంత్రము అనునట్లు ఆ మాటే నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు వైఖరీ అనబడును . అయితే భావము మంత్ర రూపం (మధ్యమా) లో స్వాధిస్టానము చేరి తరువాతే అనాహత చక్ర స్థానమందు బుద్ధిని చేరి వాగ్ రూపంలో వైఖరీగా బయటకు వచ్చుచున్నది . మానవులలో ఈ వాగ్రూప శక్తి నాలుగు అంచెల ద్వారా వాక్కు పూర్ణ స్వరూపం సంతరించు కొనుట  చేత పూర్ణ త్వము లభించుట వలన పురుషుడు అయినాడు .

o ప్రత్యక్చితీ రూపా  :- అమ్మవారిని బాహ్య రూపంలోనూ పూజా మంత్రములతోను అలాగే అమ్మ రూపము జ్ఞాన రూపిణిగా అంతర్ముఖంగా మనసున భావించి ఆ పరాశక్తి తత్వ చైతన్యము నెరిగి మూల శక్తి ని ఆత్మతో విచారణ ద్వారా జ్ఞాన రూపణి అని తెలుసుకొనుట .

o పశ్యంతీ   :-   భావనాత్మక అమ్మ ఉపాసన చేస్తూ 16 అక్షరాల అమ్మ మంత్రము బుద్ధ్యాత్మకంగా భాషా నిర్ణయం చేస్తూ వాక్కు ద్వారా మంత్రోచ్ఛారణ చేసి ప్రత్యగాత్మయై పరదేవతను ఆరాధించుట .

o పరదేవతా  :-  పరావిద్య అపర విద్య అను రెండు విధములైన అర్చన విధములు ఉన్నాయి . అపర భక్తి యందు సంసార సుఖ భోగములు అనుభవిస్తూ  ,అనేక కోరికలతో అమ్మను ఆరాధిస్తూ ఉంటారు  .పరభక్తి విషయంలో వేదమంత్ర స్వరూప అర్థములు గురూపదేశం తో ఏ విధమైన కోరికలు మనసున రానీయక తాపసులు వలె ఆరాధన చేసి అమ్మ సాయుద్యము పొందుట .


o భక్తమానస హంసికా   :-  అమ్మ మంత్రములు నిరంతరము పటిస్తూ పరదేవత విద్యలో మునిగిన వారి మనసులలో తా నుండి ఆ భక్తుల భక్తికి మెచ్చి అమ్మ మానససరోవరంలో హంసవలె ఆనంద విహారం చేయును .

o వైఖరీరూపా   :-   అనగా మధ్యమున తయారైన విశేష భావము కర్ణరంధ్రo ప్రవేశించుట వైఖరీ అందురు . అప్పుడు వెలువడు స్ఫుటమైన శక్తి రూపమే శ్రీ రాజరాజేశ్వరీ దేవి . హంస        ( ఊపిరి ) మనసు తో కలిసి మంత్ర శబ్దముతో చేరి పరిపూర్ణ వాక్కుకు సంతసించు తల్లి . ఈ పూర్తి ప్రక్రియ మూలాధారము నందు ప్రారంభమగునట్లు చేయు తల్లి జ్ఞాన దాత శ్రీ సరస్వతీ మాతయే .

కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా |

శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా || 82 ||


మానవ శరీరము 108 నాడులతో నిర్మించబడినది . ఈనాడుల లో ముఖ్యమైన ఇడ , పింగళ సుషుమ్నా అను మూడు నాడులు వెన్నెముక మధ్యభాగమున మూలాధారము నుండి శిరో భాగమునందున్న సహస్రారము వరకు ఇడా పింగళకు మధ్యగా సుషుమ్న నాడి ఉండి అదే ప్రాణ శక్తిగా ఉన్నది .

o కామేశ్వర ప్రాణనాడీ  :- కామేశ్వరుడు అనగా శివుడు . శివుడు జ్ఞానస్వరూపుడు . నిరంతర తపో నిష్ఠలో నుండువాడు . ఆనందమయ స్వరూపిణి అయిన అమ్మవారు తన చైతన్య శక్తితో శివుని చైతన్య రూపునిగా చేసి సృష్టికార్యమునకుపక్రమిoప జేయును . అందుచే అమ్మ కామేశ్వరుని కి ప్రాణ నాడీయై శివ చైతన్య రూపణి అయినది .

కృతజ్ఞా   :-   అనగా చేసినది తెలుసుకునేది . విశ్వము నందు జరుగు ప్రతి విషయము గమనించు నది . భక్తితో మనం ఆచరించు పూజలకు సంతసిల్లి ప్రత్యుపకారము చేయునది . కృతము అనగా కార్యము జ్ఞ అనగా జ్ఞానమునకు కారణమైనది .

o కామపూజితా   :- అమ్మవారు మన్మధుడు ( అనగా కాముడు) మరియు కామేశ్వరుని చే పూజింపబడినది .

మన దేశమంతటా అమ్మవారి పీఠములు ముఖ్యమైనవి 108 వరకు వివిధ ప్రదేశములందు విస్తరించి ఉన్నవి . వాటిలో ఒక నాలుగింటిని ప్రస్తావిస్తున్నారు .1 కామకోటి పీఠం  (తమిళనాడు కాంచీ పురము )  2 జాలంధర పీఠము ( పంజాబ్ జలంధర్ సిటీ ) 3 ఓడ్యానపీఠము ( ఒడిస్సా భువనేశ్వరం ) 4 పూర్ణ గిరి పీఠము ( హిమాలయముల యందు ) గలవు .

 పవిత్ర భారత దేశాన ఉత్తరాన కాశ్మీర వాసవీదేవి గాను , మధ్యభాగమున విoధ్యా దేవి గా వింధ్య పర్వతశ్రేణులలో స్వాయంభువ మనువు చే ప్రతిష్ట చేయబడిన ఆ వింధ్యాచల వాసిని గాను దక్షిణమున మలయ పర్వతశ్రేణులలో మలయా చల వాసినిగా దేశ ప్రజలను సదా రక్షిస్తూ ప్రతినోటా అమ్మ వందేమాతరం అని  స్తుతించబడి గౌరవింపబడు చున్నది . ఇదే మన సనాతన భక్తికి నిదర్శనము .

శృంగార రససంపూర్ణా  :-  అమ్మ లలితాంబికా దేవి మిక్కిలి అలంకార ప్రియురాలు . ఆమె సదా సర్వాలంకరణ భూషితురాలై నిరంతరం భర్త సమక్షంలో నుండుటకు ఇష్టపడును .

o శృంగము అనగా శ్రీ చక్ర మధ్య త్రికోణమును అందురు . ఆ మధ్య బిందువే అమ్మ నివాసము . ఆ వలయము నవరసములలో మొదటిది శృంగార రసము కాగా మధ్యనున్న బిందు స్వరూపం శాంత రసస్వరూపము . శ్రీచక్రము మొత్తము బిందు స్థానము నుండి 9 ఆవరణములతో కూడిన నవావరణ చక్రము . మొదటి నాలుగు త్రికోణ ఆవరణములు కాగా , వెలుపలి ఐదు ఆవరణములు వృత్తాకార ఆవరణలు .ఈ ఆవరణలో వివిధ అరలతో ( పద్మ దళములు ) పద్మములతో యుండి శృంగార రసావరణ తరువాత మిగిలిన ఏడు రసములు ఆయా చక్ర స్థానముల తో వీర , రౌద్ర , బీభత్స , భయానక తదితర రసస్పోర కములై సంపూర్ణత్వం సంతరించుకుని రససంపూర్ణా అయినది . పూర్ణ గిరి పీట వాసిని అన్నపూర్ణాదేవి . 

o జయా   :-   వివిధ భక్తి పద్ధతులతో సేవించు తన సాధకులకు సర్వదా విజయం చేకూర్చి

 సంసార లంపటము నుండి నెట్టుకొని రావడానికి సహకరించు తల్లి  . ఈ తల్లిని అత్యంత ఆర్ద్రత కలిగిన జలతత్వ రూపిణి అందురు .





o జాలంధరస్థితా   :-  జలతత్వ రూపిణిగా నున్న జయ దేవి ఆర్ద్రత కలిగియుండి స్థిర పీఠము గా పంజాబ్ రాష్ట్ర మందు జలంధర నగరంలో నున్నది . ఈ తల్లి , మన కంఠ స్థానము నందు 16 దళాల విశుద్ధ చక్రము నందుండి  నిరంతర ప్రాణాధారమైన జలము (లాలాజలం ) సమకూర్చుతూ మానవాళిని బ్రతికించు చున్నది .


                            

                                    మానవాళికి మాట జనించు విధము


        పరా           పశ్యంతీ            మధ్యమా            వైఖరీ

        తలంపు           భావము         మంత్రము       స్ఫుటమైనవాక్కు

        మనసు              భాష         విధానము           కంఠము

     సహస్రారచక్రం    బాలాత్రిపురసుందరీ        హృదయము         ఆజ్ఞాచక్రము

          శిరస్సు        విశుద్దచక్రం   శ్రీ రాజరాజేస్వరీదేవి

    సుషుమ్ననాడి

    మూలధారచక్రం

         సరస్వతీ






ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ |

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా || 83 ||           


o ఓడ్యాణ పీఠనిలయా బిందుమండల వాసినీ   :-  అమ్మవారి ఈ శక్తి పీఠము అస్సాం రాష్ట్రంలో కామరూపా  యను ప్రాంతమందు కామాఖ్యాదేవి అను పేర మహా శక్తివంతమైన దేవతగా ఆరాధింపబడుచున్నది . ఈమె ఆజ్ఞాచక్రం స్థానంలో నుండును .  శ్రీ చక్రము నందు త్రికోణాకారపు మధ్యలో బిందు మండల వాసినిగా , బిందు రూపిణిగా విరాజిల్లుచుండును .

o రహోయాగ క్రమారాధ్యా.  :-   రహో యాగం అనగా అమ్మను అంతర్ముఖ ఆరాధనతో నిశ్చలత్వ మనసుతో ధ్యానించుటను అంతర్యాగం అందురు . ఈ విధమైన ధ్యాన ఉపాసన యందు బాహ్య విషయ సంబంధము లేక గురువు వద్ద మంత్రోపాసన పొంది మూలాధార చక్రము నుండి సుషుమ్న ద్వారా ఒక క్రమపద్ధతిలో చక్ర బేధనము  చేసుకుంటూ ధ్యానించుట .

o రహస్తర్పణ తర్పితా  :-  రహస్యముగా రహో యాగానంతరం ప్రాణ శక్తిని సమర్పణ చేయుట . మానవ శరీర చక్రములో ఏమి జరుగునో విశ్వ చక్రము నందు అదే జరుగును . ఏదైనా ఒక కోరిక సఫలము కావాలంటే యాగము పూర్తిచేసిన తదనంతరము సంతర్పణ ఎట్లు చేయుదురు అదే విధముగా అంతర్యాగం ద్వారా ప్రాణశక్తి సమర్పించి అమ్మ అనుగ్రహము పొందుట .


సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా |

షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా || 84 ||


o సద్యః ప్రసాదినీ       :-  అంతర్ముఖ భక్తితో ఏ సాధకుడు అయితే ప్రాణశక్తి సమర్పణ గావించునో అట్టి వారి సర్వ దుఃఖములు నాశనమొనర్చి ముక్తి చేకూర్చును . ఈ క్రియ అమ్మ వారు వెంటనే జరుగునట్లు చేయును  .

o విశ్వసాక్షిణీ   :-  విశ్వరూపిణి అయినా అమ్మ ఈ విశాల విశ్వం లో ఏ విషయం అయినా పరిశీలన చేయుశక్తి కలది . అనగా సమగ్ర ఈక్షణ శక్తి కలది . ఈమెకు ఆరుగురు అనుచర దేవతలు ప్రపంచ సమాచారం నందిoతురు . 1 సూర్యుడు 2 చంద్రుడు 3 అగ్ని 4 శివుడు 5 యముడు 6 కాలుడు .

o సాక్షివర్జితా   :- తానే తెలుసుకునే విధాన పరిస్థితి ఉన్నందున ఇతరములైన సాక్ష్య ములు అవసరం లేనిది .

o షడంగదేవతా యుక్తా   :-  6 అక్షరముల తో కూడిన మంత్రములు . ఈమె తన అంగ దేవతల చేత పూజించ బడును . 

మరియొక అర్థం లో షడంగములు అనగా మనో నిశ్చయంతో అమ్మను పూజించే భక్తులు అంగన్యాస కరన్యాస ధ్యానము చేయుదురు . ఏ దేవతా పూజ సల్పినా అమ్మయే స్వీకరించును . సడoగములు 6 అవి ఏవన 1 హృదయము 2 శిరస్సు 3 శిఖ 4 హస్తం 5 నేత్రాలు 6 అంగాలు .

o షాడ్గుణ్య పరిపూరితా  :-  అమ్మవారు ఆరు ముఖ్య గుణములు సంతరించుకొని పరిపూర్ణ దేవతా శక్తి స్వరూపిణి గా ఉండునది . సర్వ జనులను ఆదరణగా వీక్షించి కష్టములు తొలగించునది . నిత్య తృప్తిగా ఉండి భక్తులు సమర్పించినవి స్వీకరించునది . పత్రము – పుష్పము – ఫలము – తోయము వంటివి స్వీకరించి పూర్తి స్వతంత్రత కలిగి ఎవరి సహాయ సహకారములు అక్కరలేనిది . అనంత ఐశ్వర్యము కలిగినది . ఏ విషయము నందు లోటు లేనిది . అనాధలను జ్ఞానార్జనకు బోధ చేయునది. 


నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ |

నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ || 85 ||


o నిత్యక్లిన్నా   :-  లలితాoబికా దేవి అనునిత్యం తాజాదనంతో ప్రసన్నవదనఅయ్యుండి మిక్కిలి ఆర్ద్రత కలిగిన కరుణామూర్తి  . మనము శ్రీ సూక్తం లో ”ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిo పింగళామ్ పద్మమాలినీమ్ “ అని ఆ తల్లిని కీర్తిస్తున్నాము . ఆ దయాసముద్రురాలు తన భక్తులకు సమస్తము  చేకూర్చును .

o నిరుపమా  :-  అమ్మవారు గుణగణాధిక్యత కలిగి ఉండి ఇతర దేవతలతో పోల్చదగినది కాదు సాటి లేనిది .

o నిర్వాణ సుఖదాయినీ   :- అమ్మ తన భక్తులకు మరణ సమయము నందు అనాయాస మరణం కలగజేసి కైవల్యము సుఖముగా పొందునట్లు చేయు తల్లి .

o నిత్యాషోడశికారూపా   :- అమ్మవారు చంద్రకళాధరి ఈశ్వరీ . చంద్రుడు వృద్ధి దినములలోనూ లేదా క్షీణ దినములలో వేరు వేరు కళలు కలిగి సూర్యకాంతి కిరణముల నుండి గ్రహించుటచే కళారూపం మారు చుండును . అలా నిత్యము మారుతున్న పదహారు కళలతో విరాజిల్లుతూ కాలగమనం కలిగించుచున్నది .

o శ్రీకంఠార్ధ శరీరిణీ   :-  శ్రీకాంతుడు శ్రీకంఠుడు అనగా ఈశ్వరుడు . అమ్మ ఆ ఈశ్వరుని శరీర అర్ధభాగ స్వరూపిణి .

ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ |

మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ || 86 ||

o ప్రభావతీ   :- చిదగ్ని కుండ సంభూతా అయిన అమ్మవారు సూర్యచంద్రాగ్ని కిరణములతో ప్రకాశమానమైన తేజో రూపం తో విలసిల్లు చుండును .

o ప్రభారూపా  :-  సాధకులైన అమ్మ భక్తులు గురు అనుగ్రహము వలన మంత్రసిద్ధి సముపార్జన చేసినవారు చక్కటి చైతన్య రూపముతో ఉండి చైతన్యవంతులుగా కనిపింతురు . అమ్మ తన శక్తి నిరూపణ ద్వారా ప్రకటింపబడిన కీర్తితో వెలుగొందు రూపిణి .

o ప్రసిద్ధా   :-   అమ్మ తనను నమ్మిన భక్తులకు ఏ లోటూ రానీయకుండా వారిని  కాపాడుట యందు మిక్కిలి ప్రసిద్ధురాలు .

o పరమేశ్వరీ    :- ఈశ్వరత్త్వము తో కూడిన అమ్మకు ఇంకొకరు సాటి లేరు .

o మూలప్రకృతి    :-   మూలము అనగా విశ్వ నిర్మాణ విజ్ఞానము . ఈ విశ్వమంతయు విష్ణు స్వరూపమే . సృష్టి ప్రారంభించుటకు పరమేశ్వర తలపు నందు కలిగిన సంకల్పమే మూలము . అనగా పరమేశ్వరుని ఆత్మ  అవ్యక్తమై కార్య రూపంలో సృష్టి జరిగినది .

ఈ నిర్వహణకు ప్రకృతి సహకారం అవసరము . ఆత్మ నుండి ఉద్భవించిన మాయే ప్రకృతి . ఈ మాయ కు శక్తినిచ్చి ప్రపంచం నడిపించునది అమ్మయే . పృథ్వి , జల , అగ్ని , వాయు ఆకాశములు ఐదు విధ తత్వగుణములతో నుండి  అవ్యక్త రూపమగు ఆత్మ ఆకాశము ఆవలి భాగమున నున్న పరబ్రహ్మ స్వరూపమే ఆత్మ . ఈ ఆత్మ చైతన్యం  తో కలసి మాయగా పరిణామం చెoదు చున్నది . సూర్యుని నుండి వేడి వలె ఆత్మ స్వరూపము నుండి మాయ జనించు చున్నది  . ఇదియే జగత్తుకు నిమిత్త కారణం . దీనినే అవిద్య అందురు . జ్ఞానము ఆత్మ గాని ధర్మము కాదు . ఇదియే పరతత్వము . ఈ పరతత్వ జ్ఞానము కర్మానుసారముగా పాశుబద్దులగుట చేత సృష్టి జరుగును .


o అవ్యక్తా   :-   అనగా మాయ కనిపించనిది . వ్యక్తము అనగా కనిపించునది . శరీరములో ఆత్మ ఉన్నా కనిపించదు . అందుచేత అవ్యక్తము . ఈ అవ్యక్తము మహత్తు ,అహం అని రెండు విధాలుగా ఉండిననూ , నేను సమిష్టిగా ఉండి చేయు కర్మలు అన్నియు వ్యక్త రూపం అవుతున్నవి ఇవి నిమిత్త , ఉపాదాన కారణము లై ప్రపంచము నడుస్తున్నది .

o వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ  :-  ఒక పని చేయాలంటే సంకల్పం కావాలి . ఆ సంకల్పానికి తగిన కార్యము చేస్తే అది క్రియా రూపం . ఆ కార్యమే వ్యక్తము . ఆ సఫలత అమ్మ శక్తియే . కారణభూతమైన అవ్యక్తము ఈ రెంటి స్వరూపము అమ్మయే .

వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ |

మహాకామేశ నయనా, కుముదాహ్లాద కౌముదీ || 87 ||

o వ్యాపినీ   :- పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మ సృష్టి యందు ఉన్న సర్వ జీవుల యందూ సమస్త ప్రకృతి శక్తుల యందు పృద్వి , జల , అగ్ని , వాయువు , ఆకాశము ల లో నుండి మానవాళి హృదయ కుహరము నందుండి అన్నింటా వ్యాపించి ఉన్నది .

o వివిధాకారా   :-   అంతటా వ్యాపించి ఉన్న అమ్మ మనలోనే ఉన్నప్పటికీ గమనించలేక పోతున్నాము. దీనికి కారణం అజ్ఞానమే . అందుచే నిరంతర అమ్మ ధ్యానము తో దివ్య  జ్ఞాన శక్తి కలిగి సర్వవ్యాపితమైన అమ్మను ప్రకృతిలో జగత్తంతటా వివిధ ఆకారాలలో దృశ్యమాన మగును .

o విద్యాఽవిద్యా స్వరూపిణీ  :-  విద్య అనగా అమృతత్వం  . అంతా నేనే అనుకోవటం తో అసలైన జ్ఞానం లేకపోవుటచే తన ఆత్మ ప్రబోధం చేతనే ఉపాసనా మార్గము ద్వారా రకరకాల కోరికలతో లౌకిక ప్రపంచ విద్య యందు ఆసక్తి చూపుతూ అంత్యకాలములో బ్రహ్మజ్ఞానము పొందవలెను అనే తపనతో ఉందురు .

అవిద్య అనగా తాను కానిది తాను అనుకోవడం . సనాతన పద్ధతులను ఆచరిస్తూ ఉపనిషత్ జ్ఞానము నందు ఆసక్తి కలిగి అంతర్ముఖ జ్ఞానముతో అమ్మను ఆరాధిస్తూ యజ్ఞయాగాది విహిత కర్మలు చేస్తూ అపర విద్య ద్వారా మోక్ష మార్గ అన్వేషణ తో బ్రహ్మ జ్ఞానము పొందుట .

అయితే లౌకిక జీవన క్రియ కు విద్య , మోక్ష మార్గమునకు అవిద్య ( అపర విద్య ) రెండును అమ్మ చైతన్య స్వరూపాలే . ఈ విద్య అవిద్య రూపాలు అమ్మ మాయా స్వరూపిణి కావున వాటి తేడాలు కనిపించీ కనిపించనట్లు గోచరమగును . కర్మ బంధంనుండి విడివడుట యే అపరావిద్య .

o మహాకామేశ నయనా  కుముదాహ్లాద కౌముదీ  :- మహా అనగా పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు . సమస్త విద్యాస్వరూపిణి అయిన అమ్మ , అప్పటివరకూ మూసుకున్న కన్నులతో ధ్యాన నిష్ట లో ఉన్న కామేశ్వరుడు అమ్మను చూడగానే అప్పటివరకూ ముకుళిత మైన కలువలు చంద్రుని వెన్నెల కాంతికి ఎలా వికసించునో అలా అమ్మ దర్శనంతో త్రినేత్రుని కన్నులు తెరుచుకోనెను . బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు ఈశ్వరుడు కన్నులు మూసి నిష్ట గా ఉన్నప్పుడు ఆయన కన్ను లు ముకుళించిన కలువల వోలె ఉండగా అదే సమయాన అమ్మ ప్రేమ తో కార్తీకపున్నమి వెలుగు వలె ఆయన దరిచేరి నంతనే కుడి ఎడమ నేత్రములు విచ్చుకున్న తెల్లకలువలు గానూ ఫాల నేత్రము ఎర్ర కలువ గానూ  మారి మిక్కిలి ఆహ్లాదభరితుడాయెను .

మరియొక భావనలో లోకం అనగా భూమి . ముదము అనగా ఆనందము . అనగా తపోనిష్ట లోనున్న మునీశ్వరులు శ్రీ చక్ర విద్యోపాసన తో  వారి కన్నులు మూసుకొని ఉన్నప్పుడు అమ్మ అనుగ్రహం అను చల్లని కార్తీక పున్నమి వెన్నెల వారిని తాకగా ఆ రుషులు జ్ఞానానందభరితులై ఆహ్లాదులైరి . అమ్మకు అంతరంగ భక్తుల ఎడ  అంత ప్రేమ కలదని నిదర్శనము .


భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః |

శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ || 88 ||


o భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః   :-   అమ్మవారు మానవాళి ప్రతి వారి హృదయ కుహరమందు అనగా అనాహత చక్రస్థానము నందు ఉండును . అయితే తను వారి శరీర మందే యుండి ప్రాణాధార రూపములో ఉన్నప్పటికీ అజ్ఞానాంధకారంలో నుండి అమ్మను గుర్తించలేకపోతున్నారు . అమ్మను నిరంతర భక్తి చింతనలో అంతఃకరణ బుద్ధి తో సేవించిన , పెనుచీకటి లో మగ్గు తున్నవారి ఎడల వారిని కమ్ముకున్న చీకట్లను ఛేదించును .

అమ్మ ఉదయభాను మండల స్వరూపిణి వలె అట్టి వారి యందు ఆత్మచైతన్యము రగుల్గొల్పి , సూర్య కాంతి కిరణ సంతతితో చీకట్లను ఎలా పోగొట్టునో  అలా తన చైతన్య కాంతి పుంజము లతో వారిలో నున్న తమోగుణము లను హరించును .

o శివదూతీ   :-   ఈ నామము నుండి 64 నామములు శివదూతీ విద్య అందురు . పాతాళలోక వాసులగు శుంభ నిశుంభూ అను రాక్షసులు తరచుగా ప్రజలను మునులను భూలోకమునకు వచ్చి హింసిస్తునందున రుషులు దేవతలను ప్రార్థింపగా వారి మొరను ఆలకించి ,అమ్మ తన నుండి ఒక మహత్తర శక్తి స్వరూపిణిని సృష్టించి , పరమాత్మను ఆ రాక్షసులతో సంప్రదించుటకు దూతగా పంపనెంచెను . చివరకు వారు యుద్ధమునకే సిద్ధపడి నందున చండిక గా కాళిక గా యుద్ధ మొనర్చి వారిని సంహరించెను . శివుడు స్వాధీనవల్లబడు అయినందున ఆయనను దూతగా చేసుకొని తాను శివ దూతీ దేవి యై సప్తమి తిథి దేవతగా భక్తులచే ఆరాధింపబడుతుంది .

మరియొక భావన లో చూసిన అమ్మ సరస్వతి దేవి జ్ఞాన స్వరూపిణి . శివ పరమాత్మ బ్రహ్మ జ్ఞానస్వరూపుడు . అందరికీ ఆదిగురువు పరమేశ్వరుడే . గురుస్వరూపులు అంతా అమ్మ దూత లే . ప్రపంచం లోని గురువులైన జ్ఞాన బోధకులoదరూ దూతగా అమ్మ నియామకులే . అదే విధముగా తన భక్తుల యందు శివ జ్ఞానతృష్ణ ప్రేరణ చేయునది కావున శివదూతీ దేవి అయినది . ఈమె సకల విద్యలందు ఆసక్తి పెంచును . దొడ్డ వారలకు జ్ఞానమునిచ్చును .

o శివారాధ్యా    :-   అమ్మవారు శివునిచే ఆరాధింపబడు తల్లి . శ్రీ చక్ర విద్య , వేదవేదాంగ పారంగతులు పరమేశ్వరుడు కావున , ఆ ఈశ్వరుడు గురు స్వరూపుడైన దక్షిణామూర్తయే  .ఈయన అమ్మ ఆరాధకుడే .

o శివమూర్తి శ్శివంకరీ   :-  అమ్మవారు  మంగళ స్వరూపిణి . ప్రతి వ్యక్తి ఆత్మయందు చైతన్య శక్తిగా ఉండును . శివుడు శుభ కారకుడు . శివం అనగా శుభము . శివుడు అవ్యక్త రూపుడు అమ్మ వ్యక్తమయి . శివ జ్ఞాన తత్వము తెలిసిన అమ్మ శివoకరియై భక్తులు ఎల్లరకు శుభము కలిగించి మంగళకర ఆనందమొసగును .

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా |

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా || 89 ||

o శివప్రియా   :- అమ్మవారు నిరంతరం పరమేశ్వరుని సాన్నిహిత్యంగా నుండి ఆయన ప్రియత్వం కొరకు నిర్మలారాధన యందు ఉండును . అదే విధముగా పరమేశ్వరుడు శ్రీవిద్యా స్వరూపిణి అయిన అమ్మను ధ్యా నిస్తూ పరస్పర అనురాగ ప్రేమతో నుందురు .

o శివపరా   :-  అమ్మవారు శివునికి బద్ధురాలై  ఉండి ఉత్కృష్టమైన ప్రేమాస్పద యై ఆయన అనుయాయిగా ఉండును .

o శిష్టేష్టా   :-  ధర్మశాస్త్ర సంప్రదాయక పూర్వకంగా పరంపరానుగత ఆచారములను పాటిస్తూ అంతరంగ ఆరాధనతో అమ్మను ధ్యానింతురో అట్టి వారలు శిష్టులు . వారి యందు అమ్మ ఇష్టత కలిగి యుండును . ఇస్ట యనగా యజ్ఞ కుండము నందు అగ్నిహోత్రునికి ఆహుతిగానిచ్చు ద్రవ్యము . శాస్త్ర సమ్మత ఆరాధన అని భావము .

o శిష్టపూజితా  :-  పై తెలిపిన విధముగా ఎవరైతే ఉందురో వారి పూజలందుకొను తల్లి .

o అప్రమేయా    :-  ప్రమేయము అనగా కొలత అని అర్థము . అప్రమేయ అనగా కొలతకు అందనిది . అనగా పరమార్ధ స్వరూపిణి .మనము అమ్మను పూజించుటకు ఒక కలశమునో విగ్రహము నో  ఉంచి అమ్మను కొలుచుకుంటూ ఉన్నామని భావిస్తాము . కానీ విశ్వ వ్యాపిత అయిన అమ్మను కొలుచుట ఎవరికి  సాధ్యము ? అందుకే మా యదాశక్తి పూజిస్తామని చెప్పుకుంటాము . అపరిమితమైన శక్తిని పరిమితి గా భావించి ఆరాధిస్తాము .

మరియొక భావనలో మన కుండలినీ వ్యవస్థ యందు అక్షరమాల లోని అ కారం మొదలు క్ష కారము వరకు అక్షరక్రమణిక గా వివిధ అమ్మ యొక్క  అనుచర దేవతలు మనలోనే కొలువై ఉండి ప్రాణశక్తి చైతన్యము ద్వారా ఆరాధింపబడుతున్నారు . వేరే విధంగా చూసినా అకారాది వర్ణము లన్నియు దేవతా స్వరూపాలే . వాటికి అధిష్టాన దేవత సరస్వతి దేవి , శ్యామలా దేవి . సంగీత సాహిత్య సంపద కొలతకు  అందదు . అందుకే అమ్మ అప్రమేయురాలు .

o స్వప్రకాశా   :-  అమ్మ లలితా త్రిపుర సుందరీ దేవి స్వయం ప్రకాశిని . సూర్య చంద్రులకు వెలుగు ప్రకాశించు శక్తి అమ్మయే చేకూర్చుచున్నది . మనకు ప్రాణశక్తి నొసగి చైతన్య మొసగి ఆత్మజ్యోతి రూపిణిగా వెలుగొందుతున్నది అమ్మయే .

o మనోవాచామ గోచరా  :-  మన వాక్కు , మనస్సు అమ్మ చైతన్యము వలననే జరుగుతున్నవి . మనము చూస్తున్నవి జడత్వములు . కంటితో చూడబడునవి . అమ్మ ఆధారిత చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉండుట గమనించవలెను .

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా |

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా || 90 ||

o చిచ్ఛక్తిశ్చేతనారూపా   :-  చిచ్చక్తి అనగా మన కంటికి గోచరము కాని మన యందే దాగి ఉండు చైతన్య శక్తి . ఈ శక్తి సూక్ష్మ జ్ఞాన శక్తి . ఒక వస్తువును చూస్తున్న నేను తో అనుసంధానమగు స్వయం ప్రకాశం .

చేతనం అనగా కదలిక . అచేతనం అనగా కదలిక లేనిది అనగా జడము . ఏ వస్తువు చేతనత్వమై చైతన్యముతో కదలిక కలుగునో  వాటి రూపంలో అమ్మ చిచ్చక్తి దాగి ఉన్నట్లే .

o జడశక్తి ర్జడాత్మికా   :-  మన శరీరము చేతన , అచేతన అను రెండు విషయములతో కూడి ఉన్నది . శరీరములో ఎముకలు గోళ్ళు శరీరంలో ఉన్నప్పుడు చేతనములు . అవి బయటకు తీస్తే అచేతనములు . అనగా జడత్వములు . ఏది పోతే శరీరము శవము అవుతుందో అప్పుడు శరీరమే జడము . ప్రాణశక్తి చేతనము . ఆ చేస్ట కలిగించేదే అమ్మ చైతన్యశక్తి . కనుక ఆత్మ , చైతన్యము రెంటి యందు ఉండి చేతనా రూపిని గాను ,జడత్వ రూపిని గాను ఆయా ఉపాదులలో గోచరమగుచున్నది . ఓకే చిచ్చక్తి లయాత్మక కదలికలలో గోచరమగుటయే శివుని లయo అవుతున్నది .

ఆదిభట్ల నారాయణ దాసు గారు అమ్మ చైతన్యముతో మనకిచ్చిన ప్రాణశక్తిని ‘అలగునఊసురుసేవ ‘అని చిచ్చక్తిని ప్రస్తావించారు . అదే విధముగా జడము అంటే సత్యాసత్యములు . వీటియందు చలనశక్తి ఉండనూ వచ్చు ఉండకపోవచ్చు .

o గాయత్రీ వ్యాహృతి  స్సంధ్యా   :-  గాతరంగాయతే జపేగాయాత్రి . కనుక ఎవరు ఏ మంత్రము మనస్సు కేంద్రీకరించి మననము చేస్తూ, జపిస్తూ యుందురో వారికదే గాయత్రి . గాయత్రీ అనగా ప్రాణ రక్షణ శక్తి . గాయత్రి అనగా అమ్మ లలిత మాత జ్ఞాన స్వరూపమే . సమస్త జనులు వారి కుటుంబ సాంప్రదాయాలను అనుసరిస్తూ చేసుకొనవచ్చును . అయితే క్రమము తప్పక త్రి సంధ్య కాలవేళ ల యందు చేయవలయును .  

పరమేశ్వర అనుగ్రహ జనితము లైన వేద మంత్రములు యుగయుగాలుగా ఉచ్చారణ ద్వారా నే పరంపరగా వ్యాప్తి చెందుతున్నవి . ఈ వేదములకు శక్తి , అధిష్టాన శక్తి వేదమాత గాయత్రి దేవి . ఈమెకు వ్యాహృతి అని పేరు .

మన గురువులు చెప్పిన విధముగా ఏకాగ్రతతో సమగ్ర ధ్యానము చేయుటయే సంధ్య . గాయత్రీ జపము చేయునప్పుడు మన ప్రాణ శక్తిని అనగా ఊపిరిని మంత్ర ఉచ్చారణ తో అనుసంధానం చేసి మననము  ద్వారా చేయ వలెను .ఇది కొంచెం ఉత్కృష్టమైన ప్రక్రియ . కొంత సాధన ద్వారా అలవరచుకొన వచ్చును . రెండు ఆలోచనల మధ్య అనగా పరమేశ్వర చైతన్యశక్తి స్థావరం పై ఉన్న ఆజ్ఞా చక్రము నందు (భృకుటి ,కనుబొమల మధ్య ) సూర్య చంద్ర నాడుల మధ్య సుషుమ్న నాడి కలిసిన కేంద్ర స్థానము నందు దృష్టి కేంద్రీకరించి జపించిన ఆలోచనల మధ్య ఏర్పడిన అతి సూక్ష్మమైన ఖాళీయే (gap) గాయత్రీ మాత స్థావరము . ఈ స్థితిలో సాధకుడు ఇహము మరచి ఉండును . ఈ సమాధి స్థితిని తురీయము అందురు . ఇదియే తురీయ గాయత్రి .

o ద్విజబృంద నిషేవితా   :-   ద్విజులు అనగా రెండు జన్మ సంస్కారములను పొందెడి వారు . అనగా ఉపనయనము నకు ముందు దశ తరువాతి దశ . వీరిని బ్రాహ్మణులు అందురు . వీరు మంచి సంస్కారవంతు లై అమ్మ గాయత్రి మాతను ఉపనయనం అనంతరం త్రికాల సంధ్యావేళల యందు వేద పఠనము తో గాయత్రి మంత్రం జపిస్తారు . అలా యధా ప్రకారము చేయు భక్తులు అమ్మను  సదా సేవిస్తూ , నియమాలను పాటిస్తూ లోక క్షేమము కాంక్షిస్తూ ఉంటారు . వీరికి అమ్మ శక్తులు , ఆశీస్సులు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటాయి .

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా |

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ || 91 ||


o తత్త్వాసనా   :- చిచ్చక్తి స్వరూపిణి అయిన అమ్మవారు 24 తత్వములను ఆసనముగా చేసుకుని కూర్చొని యుండును . ఈ 24 తత్వములు తోనే ప్రపంచమంతా నడుచుచున్నది . ఈ తత్వములకు పైన నుండి సర్వ కార్య ములు నెరవేర్చు చున్నది . గాయత్రి మంత్ర అక్షరములు కూడా 24 . ప్రతి అక్షరము లోనూ అమ్మ మూర్తీభవించి ఉండును .

o తత్త్వమయీ   :-  అమ్మ ఆసనమే తత్వములు . పంచ ప్రాణముల యందు , పంచకోశముల యందు , పంచ భూతముల యందు సర్వము నందు తానే ఉండి ప్రపంచం నడిపిస్తూ తత్వం అయినది . అందుచేతనే పెద్దలు కేశవ నామాలను 24 సంఖ్యగా , వీణకు మెట్లు 24 గా అదే విధముగా మన వెన్నుపాము నందు పూసలు కూడా 24  ఉండి  కుండలినీ వ్యవస్థకు తోడ్పడు చున్నవి  . మన కాలగణన కూడా రోజుకు 24 గంటలే .

o పంచకోశాంతరస్థితా   :-   పంచకోశములు అనగా 1 అన్నమయ కోశము 2 ప్రాణ మయ కోశము 3 మనోమయ కోశం 4 విజ్ఞానమయ కోశం 5 ఆనందమయ కోశము . అమ్మ ఈ కోశములలో అంతఃశక్తిగా ఉండి మనిషిలో చైతన్యము కలిగించును . ఈ అయిదు కోశములలో మధ్యదగు మనోమయ కోశము నందు మనసు నిల్పి సంస్కార యుక్తముగా అమ్మను ధ్యానించి బిందు రూపమున ఉన్న సహస్రారము నందు అమ్మ పాదపద్మములు చేరవచ్చును .


o నిస్సీమమహిమా   :-  అపరాజిత అయిన అమ్మ హద్దు లెరుగని లోకపాలినీ దేవి . ఆమె పద్నాలుగు లోకములను పాలించు భువనేశ్వరి దేవి . హద్దులు లేని ఈమె మహిమలు అపారము .

o నిత్యయౌవనా.  :-  సర్వకాల సర్వావస్థలయందు కాల దోష రహిత గా యుండి నిత్య యవ్వనవతి గా తేజస్సుతో నుండు తల్లి .

o మదశాలినీ   :-   అమ్మవారు ఎల్లప్పుడూ నిగారింపుగా నుండి ఆనంద లక్షణములు కలిగి ఉండును .

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః |

చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా || 92 ||

o మదఘూర్ణిత.  :-  అమ్మవారు యవ్వనవతి గా ఉన్న ఆనంద పారవశ్య స్వరూపిణి .

o రక్తాక్షీ     :-  జగచ్ఛక్షులైన సూర్య చంద్ర అగ్ని స్వరూపములు గా రక్త వర్ణముతో కూడిన ఎర్రని కన్నులు కలది . బాహ్య విషయ విముఖత గానుండు ఆనంద స్వరూపిణి .

o మదపాటల గండభూః   :-  అమ్మ  కపోలము లు ( చెక్కిళ్ళు ) కస్తూరి లేపనంతో ఉండి ఆహ్లాదకరమైన అందంతో అలరారును .

o చందన ద్రవదిగ్ధాంగీ   :-  చల్లని తల్లి అగు అమ్మవారు తన శరీరమంతటికీ చక్కని సువాసనలు వెదజల్లు మంచి గంధపు లేపనంతో ఆహ్లాదకరముగా నుండును .

o చాంపేయ కుసుమ ప్రియా   :-  సువర్ణ కాంతులు వెలువరించు సంపెంగ పూలవాసన అమ్మ ఎక్కువగా ఇష్టపడును . వికసనము చెందిన భక్తి జ్ఞానామృతాక్షర సేవ యనిన అమ్మకు ఎనలేని    ప్రీతి . కుసుమములు అనగా వేదమంత్ర అక్షరములు .

కుశలా, కోమలాకారా, కురుకుల్లా, కులేశ్వరీ |

కుళకుండాలయా కౌళ మార్గతత్పర సేవితా || 93 ||

o కుశలా    :-  అనగా క్షేమంకరి అని నామార్థము  . ఈ నామము నుండి  కులేశ్వరీ  విద్య ప్రారంభమగును . గొప్ప యోగ విద్య  సాధనను కుశలము అందురు .

ఒకానొక కర్మ చేయవలసి వచ్చినప్పుడు ఆ పని ఎలా చేయాలి అనే భావన మనసునందు ఏర్పరచుకొని ఆ పనిని జ్ఞాన వంతము గా ఎంత నైపుణ్యము గా చేయగలమో బుద్ధిని ఉపయోగించి అనుకూల భావనతో ఫలాపేక్ష లేక నిర్వర్తించి కౌశలము గా చేయుట . ఈ విషయమునే వివేకానందుడు “  embodiment of positive thoughts and deeds “ అని చెప్పి యున్నారు . అమ్మ లలితాంబికా దేవి సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి . మానవాళికి జ్ఞాన ప్రదాత గావున జగన్నిర్మాణ కౌశలత్వం తో జగత్తును నిర్మించి మనం అనుభవించునట్లు చేసినది .

o కోమలాకారా.  :-  కోమల స్వరూపిణి అయిన అమ్మను సదా ధ్యానిస్తూ , మన నిపుణత , పని బంధములు వీడి కర్మ భారము అమ్మ యందు ఉంచి అహము వీడి యోగిలా మార్పు పొంది ముక్తి పొందవలెను . అమ్మ సాత్విక గుణములు కలిగిన మృదు మధుర స్వభావ ఆనంద రూపిణీ .

o కురుకుల్లా    :-   అమ్మ నివాసస్థలమైన మణిద్వీపము నందున శ్రీమన్నగరము ఇరువది అయిదు ప్రాకారములు కలిగి చుట్టూ అమృత సముద్రమున యుండును . అందులో ఒక ప్రాకారమునకు అధిదేవతగా యున్న ఆమెను  కురుకుల్లా దేవి అందురు .

మానవ శరీరంలో బుద్ధి ,మనస్సు ,అహం అను మూడు విషయములు మన శరీరాంతర్గతమున యుండి మనకు తెలియకుండానే పని చేస్తుంటాయి . ఈ బుద్ధికి  అహం ( నేను )కు మధ్య దారిలో మూలాధార చక్రము నుండి శిరస్సు వరకు పద్మ నాళము వలె వెన్నుపూసల మధ్యగా నుండు సుషుమ్న నాడి యందు నామాoతర్గతముగా ఈ  కురుకుల్లా దేవి  యుండును  .సుషుమ్న నాడి కి అధిదేవతగా ఈమె నామోచ్చారణము ఉత్కృష్టమైనది .

o కులేశ్వరీ   :-   కుండలినీ వ్యవస్థ యందున్న షట్చక్రములలో ఒక  సమూహము ( అనగా కులము ) గావున ఆయా చక్రముల ద్వారా సుషుమ్న ప్రయాణిస్తుంది గనక ఆ కులమునకు ఈశ్వరాధిపత్యము తానే కావున కురుకుల్లా  దేవియే కులేశ్వరీ అయినది .

o కుళకుండాలయా   :-  కుండలిని విద్య ఉపాసకులు అమ్మ ఆరాధన  తపోనిష్ఠతో చేయు సాధకులు దేహమే దేవాలయభావనతో సేవించి యోగ స్థితిలో నుండి తన్మయత్వం లో ఉన్నప్పుడు మనో వికాసం చెంది అమ్మ కులే శ్వరి  దేవిని దర్శించి ముక్తి మార్గమును పొందుదురు . ఇది సిద్ధ యోగులకు మాత్రమే సాధ్యమగును .

o కౌళ మార్గతత్పర సేవితా    :-    కుండలినీ మార్గ ఉపాసన ద్వారా మోక్ష కాంక్ష కలిగిన సాధకులను కౌళులు అందురు . వీరు ఓకే విషయమందు ఏకాగ్ర దృష్టితో , అంకితభావంతో  ,అంతర్యాగ అర్చనతో అమ్మను సేవింతురో  వీరి సేవలను అందుకొను తల్లియే కురుకుల్లా దేవి . ఆమెయే లలితాంబికా దేవి .

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః |

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ || 94 ||

o కుమార గణనాథాంబా   :- అమ్మ లలితాంబ చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యంను పెద్ద కుమారుడైన గణపతిని మిక్కిలి లాలన గా చూసుకను  తల్లి . లోక సహజముగా పిల్లలు కలిగి ఉన్న తల్లి పిల్లలు కోరిన కోరికలు సాత్విక భావనతో వెంటనే తీర్చునట్లు లలితా దేవి మన అందరికీ అమ్మయే గావున ఆమె అనుగ్రహము వలన మన కోరికలను కూడా తొందరగా ఫలవంతము చేసుకొనవచ్చును .

   కుమార అనగా ఐదు ముఖములు కలిగిన శివుని స్వరూపము .ఆయనకే చైతన్యం కలిగించు ఒక ముఖము అమ్మతో కలిసి శివశక్తి మేలు కలయిక తో కూడి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరు తలలు కలిగిన షణ్ముఖుడై మిక్కిలి శక్తివంతుడై  నాలుగు దిక్కులు , భూమ్యాకాశములను నిరంతరమూ చైతన్య వంతము చేయును .ఈయన దేవతలందరికీ సర్వ సైన్యాధ్యక్షుడు గా నుండి దుష్టశక్తులను సంహరించును . అసురుల నుండి దేవతలను కాపాడును . ఈయనను మానవులు పూజించగా సకల విధములైన పూజలు స్వీకరించి తక్షణ ఫల ప్రదాతగా యుండును .

     గణపతి ప్రణవ స్వరూపుడు . ఈయన సమస్త విధములైన విఘ్నములు తన భక్తులకు కలుగకుండా కాపాడును . ఈయన కుండలిని వ్యవస్థ యందు మూలాధార చక్ర అధిపతి గా నుండి శివ శక్తి స్వరూప సహస్రార చక్రము వరకు తన తేజో ప్రభావంతో షణ్ముఖ  స్థావరములైన షట్చక్రముల గ్రంధులను దాటి కుండలిని లత దేవసేన సహకారముతో పైకి శిరస్సు వరకు ప్రజ్వలనము కలిగించు కుదురు గల బుద్ధి సిద్ధి ప్రదాత . జ్ఞాన విద్యా కారకుడు . దేవసేన అమ్మ స్వరూపమే .

o తుష్టిః   :-  అనగా లక్ష్మీ స్వరూపము సంతోషము అని అర్థము . సకల జనుల యందు దైవ గుణములతో ఆదరిస్తూ ధర్మాచరణ ముతో ఎవరైతే లలితా దేవి ఉపాసన గావించి ఉన్న దానితో సంతృప్తి చెంది ఆనందమయ జీవనం  సాగింతురో వారే దివ్య గుణ సంపన్నులు .

o పుష్టి.  :-   పుష్టి అనగా పోషణ శక్తి కలిగి నిండుదనముతో వ్యవహరించుట లోకంలో జనులు తొమ్మిది రకాల పుష్ట లు కోరుకుంటారు అవి ఏవన 1 వాక్ పుష్టి 2  సంపద పుష్టి 3 శరీరపుష్టి 4 ప్రజా పుష్టి 5 ధనధాన్య పుష్టి 6 పశు పుష్టి 7 గ్రామ పుష్టి  8  భూమి పుష్టి  9 వీర్యపుష్టి ఈ తొమ్మిది రకాల విభూతులు అమ్మ దయ వల్లనే కలుగును .

o మతి   :-   అమ్మవారు వేదమాత . అందరినీ ఆదరణ దృష్టితో చూచు తల్లి . మంచి బుద్ధి కలిగియుండి పేదల యందు ధర్మనిరతి కలిగి శుభ కరమగు మనసుతో నిశ్చయాత్మక చిత్తము కలిగి అమ్మను పారమార్థిక చింతన తో ఎవరు ఆరాధింతురో వారికి తగినంత బుద్ధి శక్తి నొసగి అనుగ్రహించును .

o ధృతిః   :-   మనము ఏ పని చేయాలన్నా ఆ పని యందు ఆసక్తి కలిగి మనసు ఆ పని యందు లీనమై విజయ సాధన తపనతో పూర్తి చేయుటకు కావలసిన ధైర్యము నిచ్చి మన బారము నంతటిని మ్రోయు తల్లి ధృతి దేవి . ధృతి అనగా మనసు నిలకడగా నుంచు తల్లి . మనదేశంలో ఉత్తరాదిన పింగారక క్షేత్రము అను పేర ధృతి దేవి కి ఒక దేవాలయము కలదు .

o శాంతిః   :-   త్రిగుణాల లో ముఖ్యమైన మొదటి గుణము సత్వగుణము . ఈ ప్రధాన గుణ విశేషము ప్రసన్నతా భావముతో మనసునందు ఏ విధమైన అలజడి లేకుండుట . అనగా మన మాయా               వికార గుణము తొలగినంతనే శాంతి కలుగును . అమ్మ శాంతి స్వరూపి కావున కరుణ గుణంతో మనము పొరపాటున చేయు కార్యములు అపరాధ క్షమస్తత్వంతో క్షమించి ఊరట కలిగించును . ఇతరులు చిన్న తప్పులు చేసిన వారి ఎడల అపరాధ సహిష్ణుత కలిగిన గుణము ఉన్నవారికి శాంతి లభించును . గోవా నగరంలో శాంతాదేవి దేవాలయము కలదు . బ్రతుకు సార్ధకతకు ఆధ్యాత్మికత అవసరము .

o స్వస్తిమతీ   :-    సు + ఆస్తి స్వస్తి = మంచి ఉంది . అమ్మ స్వస్తి మతి దేవి ఎల్లప్పుడూ మంచినే కోరుకునేది . స్వస్తి అనగా ఉన్నది ఒకే బ్రహ్మం . అది అవినాశ మైనది . శుభత్వము కలిగించునది . స్వస్తి అనగా సత్యము , యదార్థము . ప్రాణానికి ప్రాణము సత్యము కావున ప్రాణములు స్వస్తి .

o కాంతి ర్నందినీ   :-   చిచ్ఛక్తిస్వరూపిణి అయిన అమ్మవారు ఎవరిని అయితే  అనుగ్రహించి భక్తులకు తుష్టి ,పుష్టి , మతి , ధృతి , శాంతి , స్వస్తి అను ఈ ఆరు గుణములతో ఉందురో వారి ముఖ వర్చస్సు కాంతివంతముగా నుండునట్లు జీవకళ ప్రసాదించును . అనగా ఆనంద స్వరూపుడైన పరమశివ దర్శనార్థం మనము ఏ శివాలయమునకు వెళ్లినా మూలవిరాట్టుకు ఎదురుగా నందీశ్వరుడు పరవశంతో నిరంతరము శివుని దర్శిస్తూ ఆనంద స్వరూపుడుగా కనపడును . అమ్మ కూడా శివుని ధ్యానించి వీక్షించుట యందు ఆసక్తి గా ఉండి నందినిని తన ప్రతిరూపముగా రుషులు గోచరించింరీ .

o విఘ్ననాశినీ    :-   అమ్మవారిని సేవించుకొనుట లో ఆకస్మికముగా కలుగు సర్వ విధములైన విఘ్నములనూ నాశనము చేసి ఆటంకములను తొలగించు తల్లి .

తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ |

మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ || 95 ||

o తేజోవతీ   :-   అనగా ఆసూరీ గుణ శక్తులను ఎదుర్కొను శక్తి గల పరాక్రమశాలి . ప్రతిఘటించు బలము కలిగిన తేజ:శాలి . తేజస్సు అనగా కిరణములు అనే అర్థము . సూర్య చంద్రులను అమ్మ తన కిరణ శక్తితోనే కాలగమనం సాగించు చున్నది . శ్రీ లలితా సహస్రనామ శ్లోకములు మొత్తం 182 ½ ఈ సంఖ్యను రెట్టింపు చేసిన 365 వచ్చును . అనగా మొత్తం సంఖ్య పాదముల సంఖ్యకు సమానము . ఒక సంవత్సర కాలం నకు రోజులు కూడా అంతే మొత్తము . అమ్మ తేజస్సు వలననే రుతువులు కాల మార్పులు జరుగుతున్నవి .శ్రీ చక్ర కిరణ సంఖ్య కూడా 365 . తుష్టి ,పుష్టి , మతి , ధృతి , శాంతి , స్వస్తిమతి , కాంతినందిని ,విఘ్ననాసిని అను ఈ నవవిధ విభూతులు ఉన్నవారు అమ్మ అనుగ్రహము నకు పాత్రులు కాగల రో అట్టివారు అమ్మ దశ రూప తేజ:శక్తికి ప్రతీకగా నిలిచి మిక్కిలి పరిపూర్ణ తేజోవంతులు అగుదురు .

o త్రినయనా   :-   త్రికరణములనుండి వ్యాపించు వెలుగులు . అమ్మ మూడు కన్నులుగల జ్ఞాన స్వరూపిణి . అనగా మనోవాక్కాయ కర్మల ( త్రి కరణములు ) ద్వారా వెలుగులు కల్పించి సూర్యుని వలన పగలు , చంద్రుని వలన రాత్రి ఈ రెండిటి మధ్య తన భృకుటి స్థానమందున్న ఎర్రటి సంధ్యా కాంతులను సృష్టించు చున్నది . ఇందుకు సంకేతముగా శ్రీ చక్రము నందు మూడు మండలములు కలిగియున్నది . అమ్మ నయనములందు ఐశ్వర్య , సౌమ్య , జ్ఞాన శక్తులు కలిగియుండును .

o లోలాక్షీ   :-   శుభంకరి యగు అమ్మ ఎల్లప్పుడూ శుభుడు గా నుం డు శివుని దర్శించుటకై ఆసక్తి చూపును . లోలత అనగా చలనము వలన గమన తేజస్సు కలది . అదే విధముగా తన భక్తుల యెడల ఆర్ద్రతతో ఆసక్తితో వాత్సల్యము గా చూసుకొను తల్లి .

o కామరూపిణీ    :-   కమనీయత్వం కామo . అనగా తన ఇచ్చాశక్తి తో కోరికను నెరవేర్చు కొను తల్లి . అమ్మ అ భక్తులైన ఉపాసకుల కోరికమేరకు తన రూపమును మార్చుకొను శక్తి కలది . ఇచ్ఛాశక్తి కి మూల కారకుడైన పరమేశ్వరుని నుండి తన సంకల్ప బలంతో తన భక్తులను అనుగ్రహించి తగిన రక్షణ కలిగించు మాత .

o మాలినీ   :-  అనగా సువర్ణ పుష్పమాలలు ధరించునది . శివుని డమరుకo నుండి 14 శబ్దములు ఉద్భవించగా అవి శబ్దాక్షర మంత్రము లై అకారము నుండి క్ష కారము వరకు గల అక్షరమాల యందున్న 50 అక్షరములు అమ్మ మాతృకా స్వరూపములే . అ నుండి క్ష వరకు ఉన్న అక్షరములనే మాలినీ మంత్రములు అందురు . దీనిని పరావిద్య అందురు . ఈ విద్యను గురుముఖతః అభ్యసించ వలయును .

అమ్మను అజపా  మంత్ర స్వరూపిణి అందురు . అజపా గాయత్రీ అనే ఈ మంత్రము శ్వాస ఆరాధన జపం ద్వారా జపమాలతో అక్షరమాల మంత్రములతో జపించవలెను . ఈ మంత్రములు మంత్ర శక్తులై ప్రాణశక్తికి విస్తరించి ఆత్మ ప్రబోధం సల్పి మూలాధారము నుండి ప్రారంభమైన శక్తి చివరకు సహస్రారము చేరి లయమగును . కాంచీపురం వాసి మూగ వాడైన వాడు అమ్మ కామాక్షి కటాక్షం తో వాక్ శక్తి లభించి అతడు మూక కవియై అమ్మ కామాక్షి దేవిని ప్రస్తుతిస్తూ ‘  మూకపంచశతీ ‘ అని 500 లు సంస్కృత శ్లోకములతో స్తుతించి ప్రసిద్ధి చెందెను . అ నుండి క్ష వరకు గల అక్షర విద్య ద్వారానే సాధ్యమైనది . ఆయన కామకోటి పీఠ మునకు పీఠాధిపతిగా కూడా పనిచేసిరి .

o హంసినీ   :-   ప్రతి  మానవుని శరీరమందు అమ్మ  చైతన్య రూపంలో ప్రాణ శక్తిగా నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసశక్తి నొసగి ఆ ప్రక్రియ ద్వారా తాదాప్య భావనతో అజపా శ్వాస మంత్రం జపించుటను హంస జపం అందురు . ఈ మంత్ర జపం మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు వివిధ చక్ర స్థానముల యందు వేరు వేరు అక్షరములతో మొత్తం 50 అక్షరములతో పూర్తి అగును .

   మూలాధారం    :   4 అక్షరాలు              స్వాధిష్ఠాన  :   6 అక్షరాలు                మణిపూర  : 10 అక్షరాలు                                                                          

అలా  అన్ని స్థానములలో హంస జపము జరుగును .

హంస అనగా సూర్యుడు , ప్రాణశక్తి .

మన శ్వాస ప్రక్రియ సూర్యుని వలననే జరుగును . 

అహం  +   సహ   = మనకు ఇహలోక సంసార భయం పోగొట్టునది . అందుచేత తాదాప్య భావనతో హంస జపం చేయాలి .

o మాతా    :-   అమ్మవారిని జగన్మాతృభావన గా భావించాలి .

o మలయాచల వాసినీ    :-   కేరళ ప్రాంతంలో అమ్మవారిని భగవతి దేవి అందురు .

       ఓం  = అ ఉ మ్  - అను అక్షర సముదాయం . మ కారము తురీయము . ఆజ్ఞా చక్రము దాటి సహస్రారము చేరి అచట లయ మగుటయే   మ    లయము అగును .

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా |

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ || 96 ||

o సుముఖీ   :-   అమ్మవారు మంచి ముఖము కలది అనగా బ్రహ్మజ్ఞాన ఆనంద స్వరూపిణి .

o నళినీ    :-   పద్మము వలె వికసిత వదనంతో కలది .

o సుభ్రూః   :-   మంచి భ్రుకుటి కలది . మంచి కనుబొమలు కలది . సంధ్యా కాలపు తేజస్సు కలది .

o శోభనా   :-   అమ్మవారు ఏ వికార స్థితి లేని నిర్వికార స్థితిలో  ఉన్న మహా దేవి స్వరూపము .

o సురనాయికా  :-   అమ్మ లలితాంబికా దేవి సకల దేవతలకు నాయికగా నుండును .

o కాలకంఠీ   :-   అమ్మవారి వాక్కు అవ్యక్త మధుర ధ్వని కలిగియుండును . మన కంఠ స్థానము నందు విశుద్ధ చక్రము కలదు . అదే ప్రాణోదేవీ నిలయము . అత్యుత్తమ మధుర నాదము గలది . అదియే అర్ధనారీశ్వర తత్వం రూపిణి గా నుండును .

o కాంతిమతీ   :-   కాంతిమతీ అనగా ఇచ్చా శక్తి కలది . అనగా ప్రధమ స్పందన శక్తిగల క్షోభిణీ .

o క్షోభిణీ    :-   పరమాత్మ మొదటి అంతరాయ సృష్టి క్షోభము . దానికి కారణ భూతియే  క్షోభిణీ .

o సూక్ష్మరూపిణీ    :-  అమ్మవారు సర్వవ్యాపక శక్తి కలిగి సప్త ధాతువుల యందు మానవ శరీర నిర్మాణంలో నుండును . సప్తధాతువులు  = చర్మము , ఎముక , మాంసము , మజ్జ , మేధ ,శుక్లము , రక్తము  . మానవ శరీరము సప్త ధాతువులతో నిండి యున్నది మూలాధార చక్రము నుండి సహస్ర దళ పద్మం వరకు శరీరమంతయు విస్తరించి ఒక్కొక్క ధాతువు అమ్మ శక్తి మయమై వివిధ నామాలతో విరాజిత మై 70 స్థానముల యందు వశించి సదా మనిషి ఆరోగ్యం కాపాడు చూ నిరతము రక్షించు  చున్నది  .

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా |

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ || 97 ||


o వజ్రేశ్వరీ.  :-   శరీర సప్తధాతువుల యందు వసించు సప్తమాతృక దేవి స్వరూపాలు షట్చక్రము లందు వివిధ నామాలతో ప్రతి చక్ర స్థానం లో 9 లేక పదిమంది అమ్మవారి అంశలుగా ఉందురు .

 వజ్రేశ్వరి దేవి స్థానము విశుద్ధ చక్ర నిలయము . ఈమె వాక్చక్తి రూపం లో నుండి వజ్రాయుధ సమాన శక్తి పదునైన వాక్కు ప్రసాదించు తల్లి . ఈ మాత దేవాలయము మహారాష్ట్ర లో కలదు . ఒకప్పుడు ఇంద్రుడు ఒక రాక్షసునితో పోరాడుతుండగా అతడు ఇంద్రుని వజ్రాయుధం మ్రింగి వేసెను . అంతట ఇంద్రుడు ఖిన్నుడై అమ్మను ప్రార్ధింప ఆమె ఆ రాక్షస సంహారము చేసి వజ్రాయుధమును తిరిగి ఇంద్రునికి ఇప్పించెనని కథనం . త్రికోణ చక్రములో గల ముగ్గురు దేవతలలో ఈ వజ్రేశ్వరి దేవి ఒకతి .

o వామదేవీ   :-    పంచముఖ ఆకృతి కలిగిన శివ స్వరూపమును వామదేవుడు అందురు . ఆ పంచముఖాల లో  ఉత్తర వైపు నున్న అందమైన ముఖము వామదేవుడు . అందుచే అమ్మవారు వామ దేవి అయినది . వామ దేవి అనాహత చక్ర స్థానము నందు ఉండును .

o వయోఽవస్థా వివర్జితా   :-  అమ్మ నిత్య యవ్వన వతి  వయోవస్తలు లేనిది . కాలాతీత శక్తి కలది కావున ఈ దేవి మణి పూర చక్ర స్థానము నందు ఉన్నది .

o సిద్ధేశ్వరీ   :-   అమ్మవారి మంత్రములను శ్రద్ధగా పఠించిన వారికి పఠ నానంతరము సిద్ధించునది . ఈమె సకల సిద్ధి ప్రదాతయై స్వాధిష్ఠాన చక్ర దేవతగా వెలుగొందు చుండును .

o సిద్ధవిద్యా   :-   అమ్మవారు తన ఉపాసన మంత్రములను , శ్రీదేవి విద్యలను, దశ మహా విద్యలను ఉపాసిం చు టకు తగినంత చిత్తశుద్ధి  నొసగి తన భక్తులుగా చేసుకోనును . ఈ దేవి మూలాధార చక్ర దేవతగా ఆరాధింపబడును .

o సిద్ధమాతా   :-  సిద్ది ప్రదాతయైన అమ్మవారు ఉపాసకులకు మాతృ స్వరూపిణి . సాధకుడు తన మనో నిశ్చయ సాధన ద్వారా ఉపాసించి తన జ్ఞాన తృష్ణ ను సాధ్యము చేసుకొనుటకు సిద్ధముగా నుంచు తల్లి .

o యశస్వినీ   :-  మన:పూర్వకముగా అమ్మను ఆరాధించు భక్తుల కీర్తిప్రతిష్టలు పెంపొందింప చేయునట్లు చూచు తల్లి .

విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా |

ఖట్వాంగాది ప్రేరణా, వదనైక సమన్వితా || 98 ||

o విశుద్ధి చక్రనిలయా  :-  మానవుల కంఠ స్థానము నందు ఉన్న చక్రము విశుద్ధ చక్రము . ఇచ్చట 16 దళములతో తెల్లని పద్మం వికసితమై యుండును . ఈ విశుద్ధ చక్రానికి వజ్రేశ్వరి దేవి అధిదేవతగా యుండి మూలాధార చక్రము వరకు గల పంచచక్రాకృతులలో ప్రకృతి శక్తులు అయిన ఆకాశం , వాయువు ,అగ్ని, జల , పృథ్వి శక్తులు వరుసగా విశుద్ధ , అనాహత , మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రము లలో వివిధ అమ్మ స్వరూపాలైన కాళీ -తారా దేవి – షోడశి – చిన్నమస్తా -భువనేశ్వరీ అను పంచ దేవతాగణముల తో  నిండి ఉండి మనిషిని సదా సoరక్షించును .

o రక్తవర్ణా   :-   అమ్మవారు ఎర్రని రూపము కలిగి మాతృ గర్భస్థ శిశువు అండము తయారు కు సహాయ పడునది .

o త్రిలోచనా   :-   అమ్మవారు సూర్య చంద్ర అగ్ని నేత్రములు కలది కావున త్రీ లోచన అయినది . ఈమె అర్ధనారీశ్వ రీ తత్వ స్వరూపిణి .

o ఖట్వాంగాది ప్రహరణా   :-   అమ్మవారి చేతియందు కత్తి మరియొక చేతియందు డాలు వేరొక చేతియందు త్రిశూలము నాలుగవ చేతియందు ఖట్వాంగము అనగా కపాల కర్ర కలిగి యుoడును .


o వదనైక సమన్వితా   :-   అమ్మవారు వివిధ చక్ర స్థానములో ఉన్న దేవతల నందరిని సమన్వితముగా చేసుకొని తన ఆజ్ఞానుసారం వ్యవహరించునట్లు చేయునది .


పాయసాన్నప్రియా, త్వక్/స్థా, పశులోక భయంకరీ |

అమృతాది మహాశక్తి సంవృతా ఢాకినీశ్వరీ || 99 ||

o పాయసాన్నప్రియా   :-  విశుద్ధ చక్ర స్థానము నందు గల అమ్మవారిని ఢాకినీ దేవి అందురు. ఈ తల్లి 16 దళముల పద్మముతో 16 మంది అనుంగు దేవతా స్వరూపాలతో విరాజిల్లును . ఈ ఢాకినీ దేవతకు పాయసాన్నం మిక్కిలి ప్రియమైనది . ఈ నైవేద్యము గోక్షీరము , గోఘృతం , గుడాన్నముతో చేసి  అమ్మవారికి నివేదించాలి . ఈ స్థానములోను ఉన్న 16 మంది అమృతాది మహాశక్తి దేవతలను పొందుపరచడమైనది . 

1 అమృత  2 ఆకర్షణీ  3 ఇంద్రాణి  4 ఈశాని  5 ఉష:కెశి  6 ఊర్ధ్వ 7 ఋచ్చిక  8 ఋూ కారీ  9  ఌకార  10 ౡష. 11 ఏకపద  12 ఐశ్వర్య  13 ఔషధీ  14 ఓంకారి  15 అంబికా 16 అక్షర  .

ఈ అక్షరక్రమం లోని అక్షర నామము లన్నియు అమ్మ దేవతా స్వరూపములే .

అక్షరమాల. :-   అ, ఆ, ఇ ,ఈ ,ఉ, ఊ ,ఋ,ౠ,ఌ, ౡ,ఎ, ఏ, ఐ ,ఒ ,ఓ,ఔ , అం, అః .




o త్వక్/స్థా   :- త్వక్ అనగా చర్మము అని అర్థము . మనిషి చర్మసౌందర్య మునకు తోడ్పడు తల్లి .

o పశులోక భయంకరీ   :-  మానవాళిలో పశు బుద్ధిగా ప్రవర్తించు వారికి అనగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వారికి మిక్కిలి భయంకరి గా నుండునది .

o అమృతాది మహాశక్తి సంవృతా :- పైన పేర్కొన్న అమృతాది దేవతల శక్తి స్వరూపములు .

o ఢాకినీశ్వరీ  :- ఢాకినీ దేవియే ఈశ్వర స్వరూపముతో కలిసినప్పుడు ఢాకినీశ్వరీ అయినది 


అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |

దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||

o అనాహతాబ్జ నిలయా   :-   మానవ శరీర ముఖ్యభాగము లలో హృదయము అతి ముఖ్యమైనది . ఈ భాగములో గల అనాహత చక్రము 12 దళాల వికసిత పద్మము వలె నుండును . ఈ స్థానము నందున్న అమ్మవారిని వామదేవి అందురు . ఈ దేవత రక్తప్రసరణకు రక్త పోషణకు తన పరివార దేవతా స్వరూపాలతో కూడి యుండును . ఈ అమ్మ నల్లని ఆకారము కలిగి రెండు ముఖములతో ఉజ్వల కోరలతో నాలుగు చేతులు కలిగి అక్షమాల ,త్రిశూలం , కపాలం , డమరుకం ధరించి ఉండును .

o శ్యామాభా  :-  ఈ అమ్మవారు శ్యామల వర్ణములో ఉండును అనగా నల్లని శరీరము కలది .

o వదనద్వయా  :-   వామదేవి అమ్మవారు 2 ముఖములు నాలుగు చేతులు కలిగి యుండును .

o దంష్ట్రోజ్జ్వలా   :-   ఉజ్వలమైన కోరలు కలిగిన వామదేవి .

o అక్షమాలాధిధరా   :-   వామదేవి అమ్మవారి నాలుగు చేతులలో ఒక చేతి యందు అక్షమాల ధరించి ఉన్నది .

o రుధిర సంస్థితా   :-  రక్తధాతుపుష్టి కలుగజేయు తల్లి .

కాళరాత్ర్యాది   శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ || 101 ||

o కాళరాత్ర్యాది   శక్త్యోఘవృతా   :-  అనాహత చక్రం అధిదేవతగా 12 శక్తి దేవతల సమూహం తో కూడిన దేవతను రాకిణ్యంబా దేవి అందురు . మానవుల శరీరంలో ఈ రాకిణ్యంబా దేవి రక్త నియంత్రణ చేయును . ఈమె అనుచర దేవతల పేర్లు మొదటి అక్షర ములు మన తెలుగు అక్షరమాల హల్లులతో కూడి యుండునని గ్రహించవలెను . ఆ దేవతా శక్తుల పేర్లు 1  కాళరాత్రి 2 ఖా తీత 3 గాయత్రి 4 ఘంటా కారిణి 5 జ్ఞమిని 6 చంద్ర 7 ఛాయాదేవి 8 జయ 9 ఝoకారిణీ 10 జ్ఞాన రూపాళి 11 టహస్త   12ఢంకారిణి .

a. హల్లులు : - క, ఖ, గ, ఘ, ఙ      

                             - చ, ఛ, జ, ఝ, ఞ 

                  - ట, ఠ, డ, ఢ, ణ

3×5= 15=12దేవతలు

  

            

o   స్నిగ్ధౌదనప్రియా  :-      రాకిణ్యంబా దేవి అమ్మవారి కి నైవేద్యముగా స్వచ్చమైన ఆవు నెయ్యి ఎక్కువగా కలిపిన  తెల్లని అన్నమును నివేదన చేయాలి .

o మహావీరేంద్ర వరదా    :-   రక్త వర్ణం లో నున్న రాకిణ్యంబా దేవి తన భక్తులకు వీరత్వము ప్రసాదించును .ఈ రాకిణీ దేవత 12 మంది అనుచర ధాతు దేవతలతో మానవులను మిక్కిలి వీర్యవంతుల చేయును .

        పూర్వము ప్రహ్లాదుడు ,ఇంద్రుడు అమ్మ ను గూర్చి తపస్సు చేయగా ఆమె ఇరువురనూ ఆశీర్వదించి బలపరాక్రమముల నొసఁగుటచే ఈ తల్లికి ఆ పేరు వచ్చినది . యజ్ఞములు చేయు ఉపాసక శ్రేష్ఠులు సోమ యాగములో వారు వాడే యజ్ఞ పాత్ర పేరు మహావీర .


మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |

వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||


o                             మణిపూరక చక్రము నాభియందు రెండు దళములతో మిక్కిలి ప్రకాశవంతమై యుండును . ఇచ్చట నున్న తల్లి   డామరీ దేవి తన సహచర పదిమంది దేవతలతో 3 ముఖ అవయవములు కలిగివుండును . ఈ తల్లి నాలుగు చేతులు కలిగి వజ్రాయుధము ,శక్తి ,దండము , అభయము కలిగియుండును . ఈ చక్రము నందు ఉన్న తల్లి రక్త వర్ణములో నుండి రక్త మాంస ములకు పుష్టి చేకూర్చి వృద్ధి చేయును .


                    డ కార దేవతా సమూహము  :- 1 డామరీ. 2 ఢoకారిణి 3 దాక్షాయని  4 ధాశ్వా  5 ధాత్రి  6 నామరి  7 నందా  8 పార్వతి. 9 ఢక్ఖారి  10 తామసి  .



రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||

o                మణిపూరక చక్రము నందున్నలాకిన్యoబాదేవి మానవులలో రక్త మాంసాలను అభివృద్ధి చేసి పుష్టి చేకూర్చు తల్లి . ఈమె బెల్లము , ఆవుపాలు , మిరియాలతో కూడిన ఉడికించిన అన్నం నైవేద్యముగా ఇష్టపడను . ఈ తల్లి తన భక్తుల అందరకూ సమస్త శుభములు ప్రసాదించును . ఈ తల్లి ఉగ్ర స్వరూపము గా ఉండును .

స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |

శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా || 104 ||


o      ఈ స్వాధిష్ఠాన చక్రము ఆరు దళముల పసుపు వర్ణ ప్రకాశమానమైన పద్మము గా విరాజిల్లును . ఇక్కడ అ దేవతా స్వరూపము నాలుగు ముఖములు కలిగి మిక్కిలి మనోహరముగా నుండును . ఈ తల్లి చేత త్రిశూలము ,పాశము , కపాలము ధరించి ఉండును ఒక చేయి అభయహస్తం గా చూపును .

o పీతవర్ణా అనగా పసుపు వర్ణము .


మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |

దధ్యన్నాసక్త హృదయా, డాకినీ రూపధారిణీ || 105 ||


o     స్వాధిష్ఠాన చక్రము నందున్న ఈ అమ్మవారు మానవులకు మంచి మేధస్సు వృద్ధి చేయును . ఇచ్చట నున్న దేవత కాకినీ దేవి తన అనుచర గణ ము లైన ఆరుగురు దేవతలతో బందిని అను పేర మిగతా దేవతలతో నుండును . ఈ తల్లికి పెరుగుతో మిరియాలు కొబ్బరి తో కలిసిన దద్ద్యోదనం అల్లము తో కలిపి నివేదించవలెను లవణము చే కూర్చ వలెను .

o బందిని దేవతా సమూహము   1  బందిని  2 భద్రకాళి. 3 మహామాయ. 4 యశశ్విని.  5 రమ. 6 లంబోష్టి. .




మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా |

అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||

o     మూలాధారము నందున్న ఈ పద్మ దళ చక్రము పృష్ఠ స్థానము నందు నాలుగు దళములతో పంచ ముఖ ములు కలిగి విద్యాధి దేవతగా భాసిల్లును . మిక్కిలి దయా స్వరూప స్వభావం కలది . ఈ తల్లి నాలుగు చేతులతో నుండి ఈ క్రింది ఆయుధములు ధరించియుండును

o 1 అంకుశము  2 కమలం. 3 పుస్తకము. 4 జ్ఞానముద్ర.


ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |

ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||


o      ఇచ్చట నున్న తల్లిని  స కార వర్ణముతో నున్న సాకిన్యoబాదేవి అందురు . ఈ తల్లి ఆజ్ఞాచక్ర నివాసిని . ఈ అమ్మవారికి పెసరపప్పు , అల్లం , కొబ్బరి , జీలకర్ర , మిరియాలతో కలిపి ఉడికించిన అన్నం నివేదన చేయవలెను . గర్భిణీ స్త్రీలకు అయిదవ మాసములో ఈ ఆహారం సమకూర్చిన లోనున్న శిశువుకు ఎముక పుష్టి కలిగించును . ఈమె అనుంగు దేవతలు 1 వరద 2 శ్రీ 3 సరస్వతి  4 క్షంజా .

      మానవ శరీర ఆకృతిలో కంఠ స్థానము అనగా విశుద్ధ చక్రము నుండి దిగువ మూలాధారము వరకు అక్షరమాల అక్షరక్రమంలో వరుసగా పంచేంద్రియ , కర్మేంద్రియ  క్రమంలో అమర్చబడినవి . ఆ ప్రకారo భృగు మధ్య అనగా ఫాల భాగ   నుదుటి మధ్యలో ఆజ్ఞాచక్ర స్థానము నందు రెండు దళముల పద్మము గా ఉండును . దీనిని త్రిపురాచక్రము అని కూడా అందురు . ఇది  మనసు అంతఃకరణ నిర్ణయంతో ఆరవ ఇంద్రియం గా (6th sense) పని చేస్తుంది . ఈ సాకిన్యంబాదేవికి నాలుగు చేతులలో అక్షమాల ,ఢమరుకం , కపాలం , జ్ఞాన ముద్ర కలిగియుండును . ఆజ్ఞా చక్రము శుక్ల వర్ణ శోభితమై 6 ముఖములతో యుండును .



మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||


o    ఈ ఆజ్ఞాచక్రము లోనే ఉన్న ఒక్క అనుంగు దేవతను హాకినీ దేవి అందురు . ఈ తల్లి ఇద్దరు ధాతు దేవతలైన హంసవతి , క్షేమావతి అను నామములతో రెండు దళముల పద్మము నందు ఆ చక్ర అధిదేవత సిద్ధ మాతకు అనుంగు గా పనిచేస్తూ జ్ఞానేంద్రియాలను నియంత్రించును . గర్భవతులకు ఆరవనెల పిండమునకు తగినంత శక్తి చేయుటకు , ఎముకలలో గల మజ్జ ధాతువును పెంపొందించి తగిన పుష్టి చేకూర్చును .

        ఇచ్చట నున్న హాకినీ దేవతకు పసుపు , మిరియాలు , జీలకర్ర ఆవునెయ్యితో కలిపిన అన్నము ( పులిహోర ) వంటిది నివేదన చేయవలయును . ఈ తల్లి సరస్వతి స్వరూపముగా విరాజిల్లును . ఈమెయే సిద్ధ మాతగా మిక్కిలి సాత్విక  ఆలోచనా  భావములు కలుగజేస్తూ  ప్రాణికోటిని నడుపును .

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||


o    సహస్రదళ పద్మం తో శిరో మధ్య భాగమైన బ్రహ్మరంధ్రము నందు వివిధ వర్ణ శోభితం గా నుండి అక్షరమాలలో గల అన్ని అక్షర సముదాయంతో కూడి సర్వ ధాతు దేవతలతో అనేక ముఖములు కలిగి విశ్వవ్యాపితయై యుండును . ఇచ్చట దేవత అనేక బాహువులు కలిగి ఆయా హస్తముల లో వివిధ ఆయుధాలు కలిగిన ఈమెను యాకిన్యoబా దేవి అందురు . ఈమెయే యశస్విని దేవికి ప్రతి రూపము . వీరంతా లలితాదేవి స్వరూపాలే . యోగిని దేవత లే . ఈ తల్లి స్త్రీ పురుషులలో శుక్ల వీర్య స్థితులను వృద్ధి పరచి నియంత్రణ శక్తి పెంచును . ఈ తల్లికి సాత్వికమైన పలు విధములైన ఆహారము నైవేద్యముగా నొసగవచ్చును .


సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |

స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||

o   ఈ సహస్ర నామము మొత్తము శ్లోకములలో  ఓకే శ్లోక పాదములో ఏడు మంత్ర నామములు 

ఉండుట విశేషము . అవి ఏవనగా 1 స్వాహా 2 స్వధా 3 మతి 4 మేధా 5శ్రుతి 6 స్మృతి 7అనుత్తమా

ఈ పైన తెలిపిన 7 చక్రాధి దేవతలను  మంత్ర పూర్వకముగా చెప్తూ స్వాహా తో ముగించ వలెను .

ఉదాహరణకు విశుద్ధ చక్రం స్థానాధిపతి అయిన ఢాకినీ దేవిని మంత్ర జపానుసారముగా

              ఓం ఢాకినీ దేవ్యై నమః స్వాహా

            ఓం ఢాకినీ దేవ్యై నమః స్వధా స్వాహా

అలా అందరు దేవతా స్వరూపాలతో మంత్రోచ్ఛారణ చేయాలి .


పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |

పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా || 111 ||      


o పుణ్యకీర్తిః   :-   పుణ్యాత్ములు , పవిత్రులు అయిన మునులు ఋషులు నిరంతరము అమ్మను జపించుచూ వేదాధ్యయనం చేస్తూ శ్రీవిద్యయే పరమావధిగా తలచి అమ్మను కీర్తించుట .

o పుణ్యలభ్యా   :-   ఎవరైతే పవిత్ర భావనతో తపోనిష్ఠతో అమ్మను కొలుతురో వారు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తి కి అర్హు లై మోక్షమును పొందెదరు .

o పుణ్యశ్రవణ కీర్తనా  :-  ఎవరు పుణ్యాత్ము లో అట్టివారు నిరంతరం అమ్మను మిక్కిలి పొగడ్తలతో కీర్తిస్తా రో వారిని తప్పక అనుగ్రహించి కాపాడును .

o పులోమజార్చితా   :-   ఈ నామము ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఇంద్రాణి భక్తి గూర్చి వివరించబడినది . ఒకప్పుడు దేవేంద్రుడు వృత్తాసురుని తో యుద్ధం చేయవలసి వచ్చినది .                ఆ పోరాటంలో అసుర సంహారం జరుగగా అందుకు ప్రాయశ్చిత్తము గా  గురుని ఆజ్ఞ ప్రకారము పరకాయ విద్యతో కమల నాళంలో ప్రవేశించి బ్రహ్మ విద్య తపస్సు చేసుకొను చుండగా ,  శచీదేవి కి తన భర్త జాడ కానరాక ముని పుంగవుడు అయిన తన తండ్రి పులోమ  మునిని  వేడుకొనగా అతడు దేవగురువైన బృహస్పతిని వేడు మనియే  .అంతట దేవ గురువుని వేడగా వారు అమ్మ త్రిపురసుందరీదేవి మంత్రమును ఉపదేశించి భక్తిశ్రద్ధలతో పూజింపమనెను . ఈలోగా ఇంద్ర పీఠము ఖాళీగా నుండుటచే ఆ లోటు భర్తీ చేయు నిమిత్తము దేవతలు నహుషుడు అను వానిని అధిష్టింప చేశారు . అంతట అతడు అహంకారి గా మారి పదవీ లాలస తో దుర్బుద్ధితో ఇంద్రాణిని కోరగా ఆమె గురునాజ్ఞ ప్రకారము లలితా త్రిపుర సుందరి మంత్ర జపంతో నుండి మునులు మ్రోయు పల్లకిలో తన వద్దకు రమ్మని నహుషు నకు కబురంప ఆతడు అటులనే చేయ , ముని శాప కారణంగా పడవీత్యుతుడై ఇంద్ర పదవి కోల్పోయెను . అటుపిమ్మట అమ్మవారి అనుగ్రహం వలన ఇంద్రుని పదవి , తన కోరికనూ శచీదేవి సిద్ధింపజేసుకుని అమ్మకు ప్రీతిపాత్రమైనది . త్రిపుర విద్య గొప్పతనం అది .

o బంధమోచనీ   :-   ప్రకృతి సిద్ధముగా మానవులంతా అమృత బంధము తో సంబంధము ఉన్నవారే . కానీ లౌకిక కార్యములలో ఎక్కువగా మునిగితేలుతూ భగవత్స్వరూపాలను మరచి అమ్మ భక్తి విడనాడి దైనందిన కర్మ బంధాలు పెంచుకొని అమ్మ అనుగ్రహానికి దూరమవుతున్నారు . అట్లుకాక నిరంతర భక్తి చింతన వల్ల బంధవిముక్తులై మోక్ష ప్రాప్తిని పొందెదరు . నారద ఉపదేశంతో అనిరుద్ధుడు ఉషాపరిణయ ఘట్టములో బాణాసురుడు విధించిన నాగ బంధ పాశమును దుర్గా దేవి అనుగ్రహంతో  చేదించుకొనేను . ఈ విధముగా అతడు బంధ విమోచను డాయెను .

o బంధురాలకా   :-    అమ్మవారు మృదువైన పొడవుగా ఉన్న కురులతో నొక్కు జుట్టు గల వెంట్రుకలతో చక్కని అందమైన ముంగురులతో  (అలకలతో ) చక్కటి వాలు జడతో  నిడుపు గా నుండును . ఇలాంటి నొక్కు జుట్టు గల వారిని బర్బరాలక అందురు .


విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ || 112 ||

             వశిన్యాది వాగ్దేవతలు అమ్మ ముంగురులను ఒత్తయిన శిరోజాల జడతో నున్న అమ్మను వర్ణించి ఆమె తత్వమును మహిమలను విశద పరుస్తున్నారు

o విమర్శరూపిణీ   :-  పరమాత్మ స్వరూపమైన జ్యోతి ప్రకాశము సత్యం , యదార్థము కాగా అందుండి వెలువడు వెలుగులే విమర్శ . ఆ వెలుగులే చిదానంద స్వరూపమైన అమ్మ. అనగా జ్యోతి సత్ అయితే , అమ్మ అనే వెలుగు చిత్ అయి  సత్ చిత్ అనగా బ్రహ్మ విద్య అని గ్రహించి ఏకత్వ భావన తో దేనినైనా  ఆలోచన విచారణతో భావించి విమర్శనాత్మకంగా విశ్లేషించి అంతా బ్రహ్మ మయం అని తెలుసుకునే జ్ఞానము నిచ్చునది అమ్మయే .

           అదే విధముగా వాక్యము , వాచకము ఈ రెండును వేర్వేరుగా ఉన్నప్పటికీ వాక్యము చెప్పబడేది కాగా , వాచకము చెప్పునది కావున పరస్పర అనుసంధానత కలిగి ఏకత్వ భావన ఉంటేనే పరమార్థము . ఈ భావననే చరాచర జగత్తు అఖిలం అయి అమ్మ కనుసన్నలలో నడుచుచున్నది . ప్రకాశము , విమర్శ ఈ రెండూ శ్రీవిద్య స్వరూపము లే .

o విద్యా   :-   అందరికీ విచక్షణతో కూడిన విమర్శనాత్మక జ్ఞానము నిచ్చి తెలియజేయునది అమ్మయే . అందుచే అమ్మవారు విద్యా రూపిణి . మనలో చైతన్యం కలిగించి వేద విజ్ఞాన శాస్త్ర వేత్తలుగా విద్యావేత్తలుగా రూపొందుట అమ్మ తోడ్పాటు వలననే జరుగుతున్నది .

o వియదాది జగత్ప్రసూః   :-  వియద అనగా ఆకాశము . ఈ సృష్టిలో ప్రధమముగా సృష్టించబడినది ఆకాశమే . దాని నుండి అగ్ని, వాయువు ,జలము ,సకల జీవరాశి పరిణామ వాతావరణ మార్పుల వల్ల ఏర్పడినవి . ఈ విశాల జగత్తుకు అన్నీయూ ప్రసాదించినది అమ్మయే .

o సర్వవ్యాధి ప్రశమనీ   :-   వృద్ధాప్య దశ లో సంక్రమించు అనేక శారీరక మానసిక రోగములను హరించి ఉపశమనము  కలిగించి కాపాడును . సంసార తాపత్రయాలు నుండి భవ  రోగముల నుండి మానసికముగా విముక్తులను చేయు తల్లి . ఏ రకమైన వ్యాధిగ్రస్తు లైన వారైనా అమ్మను ఈ క్రింద తెలిపిన మంత్రము మననము చేసుకున్న ఉపశమనం కలుగును .

   ఓం  ఐo హ్రీo శ్రీo శ్రీమాత్రే నమః

సర్వరోగ ప్రశమనీ , సర్వ మృత్యు నివారిణియై నమః 

       పై మంత్రమును అమ్మ యందు భక్తితో రోజుకు 108 సార్లు 40 రోజులు చేయాలి .


o సర్వమృత్యు నివారిణీ  :- కాల మృత్యువు , అపమృత్యువు అను రెండు విధాల మృత్యువులు మానవుని నిరంతరము అంటిపెట్టుకునే యుండును . మృత్యు రాకకు ఎవ్వరూ అతీతులు కారు . వృద్ధాప్యము వలన సంక్రమించు మృత్యువు కాలానుగుణంగా వచ్చునది . అప మృత్యువు అనుకోని ప్రమాదాల కారణంగా వచ్చును . ఔషధ సేవనము ద్వారా పరిహారము లభించును . మృత్యువు వార్ధక్యము ,ఇంద్రియ క్షీణత , కంటి లోపం ఇలా అనేక విధాలు . అమ్మ మంత్రములు మననము చేస్తూ ఉపన్యాస తత్వము వింటూ ఆనందమయ జీవనయానం సాగించాలి .

o    ఒక్కొక్కప్పుడు అమ్మ అనుగ్రహంతో మృత్యువు కూడా ఎదుర్కొనవచ్చు. పూర్వం మహాపతివ్రత అమ్మ భక్తురాలైన సావిత్రి యముని ఎదిరించి తన భర్త సత్యవంతుని ప్రాణాలు దక్కించుకున్నది . అమ్మ ఉపాసనా బలం వల్లనే ఇది సాధ్యపడినది .

అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ |

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా || 113 ||


o అగ్రగణ్యా  :- మానవాళికి ఎన్నో మేళ్ళు చేసే తల్లి లెక్కించటానికి వీలులేని అగ్రగణ్య తత్వంలో ప్రప్రధమురాలు .

o అచింత్యరూపా.  :-  చింతనకు అందని రూపము కలది . ఎవరైతే తత్వాన్ని ఎరిగి జ్ఞానాపేక్ష కలిగి పరమార్థ చింతనతో తాదాప్య భక్తి కలిగి ఉందురో అట్టి వారలకు  మందస్మితయై  కటాక్ష రూపిణిగా గోచరించును .

o కలికల్మష నాశినీ  :-  ప్రస్తుతం మనము ఉన్న యుగము కలియుగము . నాలుగు పాదాల నడవవలసిన ధర్మము ఒంటి పాదము తో నడుచుచున్నది . మిగతా మూడు పాదములు పూర్తి అధర్మ ప్రవర్తకులతో నిండి యున్నవి .ఇలాంటి పరిస్థితులను అగస్త్యులవారు గమనించి గురువులైన హయగ్రీవుల వారిని సంప్రదించగా వారు లోకంలో కేవలం ధార్మిక లోపం వల్లనే అధర్మము పెరిగి కలహాలు , దురాచారాలు  పెచ్చుమీరుతుటాయి . కావున అమ్మను ఎవరైతే పరాశక్తి నామ , పాద పూజలు చేస్తూ సత్కర్మల ద్వారా ఈ యుగ ప్రభావముచే ఏర్పడిన కల్మషము లను తొలగించు కొనవచ్చును .

ఈ యుగ కాలము మిక్కిలి పిదప కాలము . ఈ కాలమునందు ద్రవ్య ,దేహ ఆత్మలతో అనేక దోషాలు చేస్తూ జనమంతా తప్పుల కుప్ప లై బ్రతుకుతూ ఉంటారు . అందుకే ఒప్పులకుప్ప అయిన తల్లిని ఆరాధించి మన కల్మషములు నాశన పరచుకోవాలి .

o కాత్యాయినీ  :-  ఒకప్పుడు  కతుడు అను మహర్షి హిమాలయముల యందుండి, శివసాయుద్యము కొరకు తపస్సు చేయ , అతని దీక్షకు శివుడు ప్రత్యక్షమై కోరిక తెలుపు మన . అంతట కతుడు పార్వతి దేవి నాకు కూతురుగా యుండునట్లు అనుగ్రహించమని అడుగగా వల్లే అని వరమిచ్చెను . అప్పుడు శివుడు అమ్మ చెంతకేగి ఒక్క నిమిషం మాత్రమే ప్రళయం సృష్టించగా , అదేమని ఆమె అడుగగా కతుని కోరిక ప్రకారము ఆమె ఇష్టత చెంది కతుని ఆశ్రమంలో జన్మించి కాత్యాయని అను నామముతో దినదిన ప్రవర్ధమానమై యుండెను . కతుని కోరికమేరకు ఆమె వారణాసి జేరి విశాలాక్షి గా మారి విశ్వేశ్వరుని వివాహమాడెను . తదనంతరం ఆమెయే భక్తుల కోరిక తీర్చుటకై కాంచీపురం నందు కామాక్షిదేవిగా ఆమ్ర ఫలవృక్షము చెంత సాక్షాత్కరించిన ఏకామ్ర నాధుని కళ్యాణమాడెను . అచట నేటికిని ఆమ్ర ( మామిడి ) వృక్షము కలదు .

      కాత్యాయని అనగా  జ్ఞానానందమయ కాంతి  స్వరూపిణీ . ఈమె బ్రహ్మమునందు  అనగా వేదము నందు నివసించునది . అనగా మానవ బుద్ధి వేదము నందు ఆధారపడ్డునది . ఈమె సర్వ మానవులను ఆధారము చేసుకొను జ్ఞాన స్వరూపిణి అగుటచే అందరి శిరస్సు ,వాక్కు నందు ఉండును . ఈమె వజ్రము నందుండి దానిని ధరించును . కతులు అనగా బ్రహ్మ జ్ఞానులు .  వీరిచే అమ్మవారు ఆరాధింపబడుతుంది .

    కతి అనగా మరియెక అర్థంలో అయనము అని భావన . ఉత్తర దక్షిణాయనముల కాల విభజన సృష్టి ఈ కాత్యాయనిదే .


o కాలహంత్రీ.  :-   అనగా కష్టముల నుండి దాటించునది . కాలుడు అనగా మృత్యువు . హంత్రీ అనగా సంసార బంధ నాశిని . మార్కండేయుని చరిత్ర నందు శివుడు ప్రత్యక్షమై న సందర్భంలో తన భక్తుని శిరస్సుపై కుడిచేయి నుంచి అభయము నిచ్చి యముడిని తన ఎడమ కాలుతో తన్ని  తన భక్తుల జోలికి రావద్దని హెచ్చరించారు .శివుని ఎడమభాగమున ఉన్నది అమ్మయే కదా . అందువలన కాలహంత్రీ యై మార్కండేయుని మృత్యువు నుండి కాపాడినది .

o కమలాక్ష నిషేవితా    :-   కమలాక్షుడు అయిన నారాయణునిచే ఆరాధింపబడు తల్లి . కాలము అనగా వికసిత జ్ఞానులైన తన భక్తుల సేవలoదుకొను తల్లి  కాత్యాయని దేవి . ఇంకా విమర్శనాత్మకంగా చూచినచో ప్రతి భక్తుని హృదయ స్థానము నందు పద్మ చక్ర స్థానం లో నుండి భక్తుల ఆరాధన స్వీకరించును .


తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |

మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ || 114 ||


o తాంబూల పూరిత ముఖీ   :-  కమలాక్షునిచే అర్చింపబడే కాత్యాయని దేవి ముఖ సౌందర్యమును వర్ణిస్తూ ఆమెకు తాంబూల సేవనము అత్యంత ప్రియమైనదని , అగ్ని వాక్కులకు ఆధారమైన నోటి భాగము ఎర్రని ఎరుపు కాంతితో ప్రకాశించు తాంబూలం అనిన ఇష్టము . తాంబూలంలో ముఖ్యము 3 పదార్థముల మిశ్రమము అనగా తమలపాకు ,పచ్చకర్పూరం , సుగంధ ద్రవ్యములు కలిపిన వీటిలో దేనికీ ఎరుపు రంగు గుణము లేనట్లే త్రిగుణాతీతమైన తురీయ శక్తి ఎలా దాగియున్నదో , జ్ఞాన ప్రదాత అయిన అమ్మ తన ఎర్రని ముఖ కాంతులతో జ్ఞానము నొసగుతున్నది .

o దాడిమీ కుసుమప్రభా    :- తాంబూల సేవిత అయిన అమ్మ ముఖము వికసించిన దానిమ్మ పువ్వు వలే ఎర్రని కాంతుల తో శోభిల్లు చున్నది .

o మృగాక్షీ   :-  అనగా విశాలమైన లేడి కన్నుల వంటి కన్నులు కలది . అమ్మవారి కన్నుల లో మువ్విధములైన తత్వము గోచరమగును . విశాల నేత్రములు కలిగి జగత్తునంతటిని ఆ నేత్ర చంచలత్వంతో పరిశీలనాసక్తి తో జాగృతతత్వము కలిగి యుండి మనను అజ్ఞానాంధకారం నుండి మేలుకొలుపు  త్రీశక్తులనూ కంటి చూపుతో నిర్వహించు జగన్మాత .

o మోహినీ   :-   మోహిని అనగా మోహపరచునది . లోకంలో మానవులను మోహ పరిస్తే  జగన్మోహినియై ప్రజలు వ్యామోహాలలో చిక్కువడు చున్నారు . అదే దేవతలు జ్ఞానవంతులు కావున వారికి అమృతం పంచి నందున వారికి జగన్మాత అయినది . అమ్మవారు మోహినీ రూపిణిగా మొదట ప్రకృతి యందు రెండవ సారి గా  పాలసముద్రం మధన వేళ అమృత ఉద్భవ కాలమందు మోహినీ అవతార రూపిణి గానూ మూడవ పర్యాయము భండాసుర వధ కు చిదగ్నికుండ సంభూత గాను సాక్షాత్కరించింది .

o ముఖ్యా   :-   అమ్మవారు ప్రధాన మూలమైన ఆది పరాశక్తి గా సర్వమునూ శాసించునది . ఈమె వాగ్దేవతా స్వరూపము .

o మృడానీ   :-   శివుని నామములలో మృడేశ్వరుడు అను నామము కలదు . ఈ మృడేశ్వర ఆలయం దక్షణ భారత దేశము నందు కలదు . మృడేశ్వర్ అనగా శుభములు కలుగజేయు మంగళకరమగు తనువుకలవాడు . స్త్రీ తత్వం రూపములో అమ్మవారు మృడానీ అయినది .

o మిత్రరూపిణీ    :-   మిత్రుడు అనగా లోకహితం కోరువాడు . సూర్య భగవానుని మిత్రుడు అందురు . ఆదిత్యుడైన  సూర్యుడు సర్వ లోకమునకు వెలుగులు పంచి మనకు మిత్రుడైనాడు . ద్వాదశ ఆదిత్యులు అమ్మ లక్షణములు కలిగి అమ్మవారే ఆ రూపంలో వెలుగొందుతున్నారు .

భతృహరి తన నీతి శతకంలో ఆరు విధములైన మంచి మిత్రులను కలిగి ఉండవలె నని చెప్పిరి 1 పాపము చేయువానిని నివారకుడు 2 హితమును బోధించు వాడు 3 మిత్రుని సొంత విషయములు రహస్యముగా నుంచువాడు 4 చెడు గుణములను ప్రచారము చేయనివాడు 5 మిత్రుని ఎడల దయకలిగి యుండువాడు 6 ఆపదలందు తక్షణమే ఆదుకొను వాడు .ఈ పై తెలిపిన గుణములు అన్నియు ఎవరు కలిగియుందురో వారే సన్మిత్రులు అని పిలువ బడుదురు .అందుకే అమ్మవారు సర్వ క్షేమంకరీ అగు సుహృద్రూపిణి .


నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ || 115 ||

o నిత్యతృప్తా.  :-   అమ్మవారు త్రిగుణా తీతురాలు అయినందున ఆమెకు ఏ విధమైన అసంతృప్తులు లేక ఎల్లప్పుడూ సంతృప్తి ఆనందమయి గా నుండును . అనగా పరబ్రహ్మస్వరూపిణి .

o భక్తనిధి ర్నియంత్రీ.  :-   భక్తి అనగా అన్ని సంపదలు కలిగిన వాడు అని అర్థము . సామవేదము నందు గల భాగములను భక్తములు అందురు . నియంత్రి అనగా నియామకురాలు . ప్రకృతి శక్తులగు పంచభూతముల ను తన ఆజ్ఞ చే నియంత్రించును .

o నిఖిలేశ్వరీ   :-   తన ఈశ్వర శక్తి మహిమలతో అన్నింటినీ కాలానుగుణంగా కాపాడుచుండు తల్లి .

o మైత్ర్యాది వాసనాలభ్యా.  :-    మైత్ర్యాదులు అనగా అమ్మ భక్తి యందు ఎవరైతే ప్రీతిపాత్రుడు గా నుండి మంచి సంస్కారవంతులుగా ఉండి చిత్త ప్రసన్న రూపులై ఉండి అమ్మ ఆశీస్సులు పొందిన , వారి ఎడల ఆమె మిక్కిలి కరుణ కలిగి ఉండును . మైత్ర్యాది గుణములు నాలుగు విధములు 1 మైత్రి 2 కరుణ 3  ఉపేక్ష 4 ముదిత .

1. మైత్రి : ఎవరైతే తన మిత్రులందరినీ సమభావంతో చూస్తారో వారు సిసలైన మిత్రులు .

2. కరుణ : ఎవరైతే తన మిత్రులలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అహం చెందక వారి ఎడల కరుణ కలిగి ఉండవలెను .

3. ఉపేక్ష : ఎవరైతే తనతో స్నేహం గా నుండి కొన్ని తప్పులు చేస్తూ ఉండి తన పరిశీలనకు వచ్చినప్పటికీ వారిని దూషిoపక క్షమాగుణం తో ఉపేక్షించ వలెను .

4. ముదిత : ఎవరైతే తన కంటే కొంచెం ఆధిక్యంలో ఉన్నవారు అయినచో అట్టి వారి యందు ఈసు చెందక సంతోషము కలిగి ముదిమి  (ముదము)  గల గుణ తత్వంతో ఉండాలి .                               అమ్మ పై లక్షణములు కలిగి ఉన్నవారి యందు ప్రీతి గా నుండును .

o మహాప్రళయ సాక్షిని   :-  కల్పాంతమందు సృష్టి అంతయూ లయమగు వేళ అప్పుడు సంభవించిన ప్రళయము నకు ఆత్మ స్వరూపిణి అయిన అమ్మ నిర్భయముగా నుండి ‘ సుమంగళీయoవధూరివా ‘ యన్నటుల తోటి దేవతా స్త్రీలకు అభయము నిచ్చి ఆ ప్రళయానికి సాక్షిగా నుండి శాశ్వతురాలు అయినది..

మనమంతా నిత్యము రాత్రుల యందు నిద్రిస్తూ నిత్య ప్రళయము అనుభవిస్తూ ఉన్నాము . అయినప్పటికీ మర్నాడు ఉదయం వేళ మనలోనే ఉన్న అమ్మ సాక్షిగా నుండి చైతన్య జ్ఞానము రగిల్చి మేలుకొలుపు చున్నది .

పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ |

మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ || 116 ||

o పరాశక్తిః   :-      సర్వ సృష్టి కారకులైన పరమాత్మ శక్తి కలిసిన స్వరూపమే పరాశక్తి . మానవ శరీర నిర్మాణ మంతయు నవ విధములైన ధాతువులు అనగా చర్మము , మాంసము , రక్తము , ఎముకలు , మజ్జా , మూలగ  మొదలగు 9 దాతువు లతో ఏర్పడుతున్నది . ఈ తొమ్మిది ధాతువులలో ఐదు శక్తి మూల ధాతువులు గానూ , 4 శివ మూల ధాతువులుగా నుండి , పదవ ధాతువు గా చిత్ శక్తి రూపిణిగా అమ్మ ప్రాణ ము నోసగి 72 నాడులకు ప్రాణ శక్తిని ప్రసాదించి శరీరమంతయు వ్యాపించి యుండును . ఈ పదవ ధాతువు నామము గౌరీ దేవి .

o పరానిష్ఠా   :-   అమ్మను సేవించు భక్తులు శ్రద్ధాసక్తులతో నిష్ఠగా వేద తత్వ జ్ఞాన పరిశీలనము చేసి ఎవరు పూజింతురో వారు ఆచార్యులనబడుదురు . అట్టివారు అమ్మను పరబ్రహ్మస్వరూపిణి గా దృష్టిలో ఉంచుకొని వారు బ్రహ్మవిద్య ద్వారా శుద్ధ బ్రహ్మమును తెలిసి కొందురు . అనగా వారు తురీయ దశ అయిన సమాధి స్థితికి చేరి యోగులగుదురు .

ప్రజ్ఞాన ఘనరూపిణీ  :-   మనము కలలో కొన్ని సంఘటనలు జరిగినట్లు కలగంటున్న సమయములో మెలకువ రాగానే కూర్పు ద్వారా ఆ జ్ఞానమునకు ఘనరూపము ఇచ్చు సంకల్పము కలుగజేయు తల్లి . ఈ పూర్ణ జ్ఞాన స్వరూపిణి లలిత మాతయే .

o మాధ్వీపానాలసా   :-   అమ్మవారు మత్తు కలిగించే ద్రాక్షారసము సేవనము చేయునది . కానీ సమయా చార ప్రమాణములను అనుసరించి ఇది సరియగు నిర్వచనము కాదు . మధ్వి అనగా బ్రహ్మానందము అని అర్థము . అమ్మ నిరంతరము పరమేశ్వర తలపుతో నుండి ఆ దివ్య మంగళ స్వరూపుని దర్శించి బ్రహ్మానందభరితురాలై చిదానంద రూపిణి అగును .

o మత్తా     :-   మత్ అనగా నేనే బ్రహ్మను అను అహం రూపణి. అహం అనగా అకారము నుండి హ కారము వరకు తెలుగు అక్షర మాల లోని అక్షరములు అన్నియు అమ్మ స్వరూపములే . మనము నిత్యము ధ్యానించు  ధ్యాన శ్లోకమైన   “  అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |

                                             అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ “

      పై శ్లోకంలో తానే అహం రూపిణి అయినందున 50 అక్షరము లకు అధిదేవత అమ్మయే . అక్షర దేవత విద్య అనగా శ్రీవిద్య యే . అందుకే  చదువు భగవత్స్వరూపము . ఆ చదువు యందు కపటము లేని భక్తితో చదివి ప్రజ్ఞావంతులు అవ్వాలని ఆకాంక్ష .

o మాతృకా వర్ణ రూపిణీ   :-    అక్షరము లే అమ్మ . అమ్మ అక్షర స్వరూపిణి . మాతృ కా స్వరూప ములైన ఆ అక్షర కూర్పు వలననే అమ్మ మంత్రములు , సకల సారస్వత రచనలు ఏర్పడినవి .

                వర్ణ.   ---- అనగా రెండు అర్ధములు కలవు . ఒకటి రంగు . రెండు అక్షరములు . అయితే ఈ రెండు అర్థములు అక్షరములకే వర్తించును . అది ఎలానో చూద్దాం . పెద్దలు ఋషులు మన తెలుగు 50 అక్షరాలను విభజించి వాటి గుణ రంగులను విశ్లేషించారు . అ నుండి అం వరకు గల 16 అక్షరములను అచ్చులు అనగా స్వరములు అందురు . ఇవి అన్నియు స్పటికము వలె ఉండును .

                               ఇక హల్లుల విషయానికి వస్తే క నుండి క్ష వరకు గల అక్షరములు అన్నియు అచ్చు అక్షరముల స్పర్శ కలిగి వేరు రంగులలో నుండును . క వర్గము నుండి ప వర్గము వరకు గల హల్లు లన్నియు పగడపు రంగు లో నుండును .య ,ర ,ల ,వ నుండి హ వరకు పసుపు రంగులో నుండును . ఒక్క క్ష అను అక్షరము మాత్రము అరుణ వర్ణము లో నుండును .

      మన సనాతనులు మన తెలుగు భాష ఎంత గొప్పదో ఆనాడే విశ్లేషించి గ్రంథస్తం చేశారు . మరొక విశేషం మన తెలుగు భాషలో గల అక్షరమలన్నియూ గుండ్రముగా నుండి పొందికగా శివలింగాకారం సంతరించుకుని యుండునని ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పియున్నారు . నిజానికి మన హల్లులు అన్నియు శివ స్వరూపములు . అచ్చులు శక్తి (అమ్మ) స్వరూపములు . అందుకే మన  భాషను శివశక్తాయుక్తా బాష అని అందురు . ఇంతటి గౌరవము ఏ భారతీయ భాషలకు లేదు . ఉపమన్యు మహర్షి మన తెలుగు అక్షరాలను , వాటి రంగులను , వాటి యందున్న దేవతా స్వరూపాలను వివరిస్తూ పెద్ద గ్రంధమే రాశారు .

     ఇందుకు సాక్షీభూతంగా  ఒక పట్టణంలో గుజరాత్ రాష్ట్రంలో అమ్మ కామాక్షి ఆలయంలో 50 అక్షర దేవత విగ్రహాలతో పెద్ద దేవాలయం కలదు . అదేవిధంగా తమిళదేశంలో  తిరువారూరు నందు ఒక శివాలయ ప్రాంగణంలో 50 శివలింగ రూపములూ వేర్వేరు పేర్లతో నున్నవి . ఈ రెండు దేవళములే తెలుగు భాషోన్నతికి సాక్ష్యము . అచ్చు అక్షరములతో హల్లులు కలిస్తేనే పదములు ఏర్పడి అర్థవంతమగును . అదే శివ శక్తుల కలయిక స్వభావము . అచ్చులు అంటే శక్తి రూపాలు హల్లులతో కలవకపోతే హల్లులు పలుకుటయే కష్టమగును . అందుకే అమ్మ మాతృకా వర్ణ రూపిణీ .


మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |

మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||

o మహాకైలాస నిలయా   :-   అమ్మ నిరంతరం శివుని వీక్షిస్తూ శివుని తో కలిసి ఉండుటకు ఇష్టపడును . అటుల వారిద్దరూ కలిసి ఉండు ప్రదేశం గొప్ప కైలాసము . ఆ సందర్భమున శివుని నుండి ఆనందకరమైన వెలుగులు విరాజిల్లును . ఆ వెలుగులలో కేళీ సమయము నందు విజృంభించిన ఆనందతత్వంలో ఓలలాడుచుండుటనే శాశ్వత ఆనందం అందురు . అదియే శివానందలహరి .

    కైలాసము అను పదము నందున్న కె అక్షరమునకు శిరస్సు , బ్రహ్మము అని అర్థము . లాసం  అనగా ఉల్లాసం , లాస్యం అని అర్థము . లాస్యం అనగా ఇద్దరు కలిసి చేయు నృత్యము . అలా నృత్యము చేయుటకు శివ శక్తులు ఇరువురూ ఆసక్తిగా నుందురు . నాట్యము నందు ఆసక్తి ఉంటేనే ఉల్లాసము కలుగును . యోగులు అయినవారు అమ్మ ఆరాధనలో లీనమై సహస్రారము నందున్న లాస్య రూపాలైన పరమేశ్వరి పరమశివులను  దర్శించి ఆనందమయులై పరబ్రహ్మము చేరుదురు . శ్రీచక్రము లో వివిధ అక్షర శక్తులను లిఖించి నిక్షిప్తము చేయుదురు . అట్లు చేయుటను మహా కైలాసం అందురు .

o మృణాల మృదుదోర్లతా    :-   అమ్మవారు తన భక్తులను ఆదరించు విషయములో ఏవిధమైన కఠినత్వమూ లేక అతి సుతి మెత్తనైన తామరతూడుల వంటి తన చేతులతో సహాయపడు తల్లి .

మరియొక భావనలో మన శరీరంలో కుండలినీ వ్యవస్థ యందు ఇడా , పింగళ నాడులు సుషుమ్న తో కలిసి మూలాధార పద్మము నుండి పైకి పద్మ చక్ర ముడులు ఛేదించుతూ షట్చక్రములు దాటి శిరస్సు నందున్న సుతిమెత్తని సహస్రారము నందున అమ్మ పాదపద్మములకు లతల వంటి ఇడా పింగళ నాడులు చేరి అమ్మ అనుగ్రహము పొందుట .

o మహనీయా   :-   సహస్రారము చేరిన భక్తులు తమ పూజల ద్వారా అమ్మను మహనీయురాలుగా దర్శించుకున్నారు .

o దయామూర్తీ   :-   అమ్మవారు మూర్తిభవించిన దయగల తల్లి . తన ఆయుధ సంపత్తితో శత్రువుల మరణానికి కారణం అయినప్పటికీ , తన దయాకర ఆయుధ దాటికి వారికి మోక్షమనే కలిగించుచున్నది . దయా గుణము నకు మూలస్థానం మన హృదయము . ప్రతి శరీరమునందు అమ్మ వసించు స్థానం అదియే నని గుర్తెరిగి అమ్మను భజింపవలెను .

o మహాసామ్రాజ్యశాలినీ     :-   త్రిలోక పూజిత , త్రిమూర్తులచే ఆరాధించబడు తల్లి . సర్వ ప్రకృతి శక్తులను సమస్త లోకములను పాలించు తల్లి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు . శివుని తో కలసి యుండు కైలాసమే మహా సామ్రాజ్యము .

     మన శరీరంలో శిరస్సున అమ్మ విహరించు సహస్రారము మహాసామ్రాజ్య మే .                              


ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా |

శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా కామకోటికా || 118 ||

           ఆత్మ విద్య అను నామము నుండి త్రికోణాoతర దీపికా అను నామం వరకూ మధ్యనున్న నామము లన్నియు శ్రీవిద్యా మూల మంత్రములు .

o ఆత్మవిద్యా   :-   అమ్మ ఆత్మ జ్ఞాన స్వరూపిణి . లాలనగా ఉండాలన్నా కఠినత్వం ప్రదర్శించాలన్నా దండనీతి అవలంబించవలెనన్న అమ్మకే సాధ్యం . నేనే ఆత్మ అను పంచ కార్య స్థితులను నిర్వహించు తల్లి . ఆత్మ విద్య అనగా సహస్రార విద్య .

o మహావిద్యా   :-   మహా విద్య అనగా బ్రహ్మ విద్యయే .

o శ్రీవిద్యా   :-   శ్రీ విద్య అనగా జ్ఞానానందమయ విద్య .

o కామసేవితా :-   ఉపాసించి అమ్మ తత్వమును ఆకళింపు చేసుకున్న వాడు కాముడు అగు మన్మధుడు . కామ అనగా ఈo బీజ రూపము . శ్రీవిద్య మూలకారకుడు ఈశ్వరుడే . కామేశ్వర రూప విద్యయే శ్రీవిద్య .

o శ్రీషోడశాక్షరీ విద్యా   :-  శ్రీ విద్య శ్రీకారము తో కలిస్తే 16 అక్షరముల వేద మంత్రములు . కొందరు ఉపాసకులు ఆరు అక్షరముల బాలా మంత్రోపాసన ద్వారా తరింతురు .

       పంచదశ అక్షరములు శ్రీకారం తో కలిసిన అమ్మ మంత్రములను  15 రుక్కులతో  ,15 అక్షరములతో   అమ్మ లక్ష్మీదేవి ముగ్గురు మానస పుత్రులైన  ఆనంద ,కర్దమ ,చిక్లీతులు శ్రీసూక్తము గా రచించినారు . .వీరు ముగ్గురను త్రి కూటము అందురు . ఈ చిక్లీత డే కాముడు అనబడు  మన్మధుడు . శివానుగ్రహమున మన్మధుడు శ్రీవిద్యను ఉపాసించుట  వలన అమ్మకు సేవితుడాయను .

o త్రికూటా కామకోటికా   :-.  అమ్మవారి ఆత్మ విద్యయే శ్రీవిద్య . ముగ్గురు రూపముల కలయికయే త్రికూటము  అనబడును . అదే విధముగా అమ్మవారు త్రిమూర్తులచే ఆరాధింపబడుతుంది . కామ అనగా ఆనంద రూపిణీ . కామకోటి అనగా శివశక్త్యైక్యరూపము . వీరు ఉభయులకూ సామరస్య సాధన తో ఆరాధన చేయవలెను .

    ఏ వ్యక్తికైనా నాలుగు విధములైన కోరికలు ఉండును . అవి  ధర్మ, అర్ధ ,కామ , మోక్షము .  లౌకిక జీవనంలో సమాజములో మంచిగా ప్రవర్తిస్తూ మొదటి మూడు మనము సాధించుకో గలం . చివరిదైన మోక్షసాధన మాత్రమూ అమ్మ యందు సంపూర్ణ భక్తి విశ్వాసము కలిగి , తాత్విక చింతనతో ఉపాసన మార్గం ద్వారా అమ్మ దయ వలన మాత్రమే సాధ్యమగును .



కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా |

శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా || 119 ||

       శ్రీ విద్యా స్వరూపిణి అయిన అమ్మ అన్ని త్రిమూర్త్యాత్మక  శక్తిగా వ్యాపించి ఉండి వాగ్భవ , కామరాజ , శక్తి కూటముల యందుండి ఆరాధింపబడుతున్నది .

కామకోటి అనగా  వేద ప్రతిపాదిత కామాక్షీ మంత్రము . కాంచీపురం కామాక్షి అమ్మవారి సన్నిధిలో మన ఇష్ట దేవతా మంత్రము జపిస్తే కోటి సార్లు జపించిన ఫలము సిద్ధించునని శ్రీ మూక కవి చెప్పినారు . కాంచీపురము 3 కూటములతో అలరారుతున్నది . 1 రుద్రకోటి 2 విష్ణు కోటి 3 కామకోటి అను త్రికూటములు .

 

o కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా  :-  అనేక విధ విద్యా స్వరూపిణి అయిన అమ్మ స్వభావ విశేషములు తెలుపగా అమ్మను ఆరాధించిన వారి యందు ఆమె కడగంటి చూపుతోనే తన ఆజ్ఞలను అనుసరించి యుండు సర్వదేవతా శక్తుల ద్వారా లెక్కలేనన్ని సంపదలు ప్రసాదించి ఐశ్వర్య దాయులను చేయును .

మరియొక భావనలో కటాక్ష అనగా వికసిత మైన , విచ్చు కొను అను అర్థము లో శ్రీ చక్రము నందు బిందు స్వరూపముగా అమ్మ సంకల్ప శక్తి తో బిందువు విచ్చుకొని త్రికోణం గా ఏర్పడి పద్మపు రేకలవలే నవావరణములు ఏర్పడును . అట్లేర్పడిన అష్టావరణ స్థానములందూ అమ్మ ఆయా స్థానముల ఉండు దేవతలను నిక్షిప్తము చేయగా వారు బిందు రూపిణిగా నున్న అమ్మను ఆరాధింతురు . పరమేశ్వర ప్రసాదితములైన  విభూతులు (సంపదలు) అంతు లేనివి గా యుండు కావున అమ్మను   కమలా కోటి అందురు .

o శిరఃస్థితా   :-  మానవాళిలో అమ్మ భక్తులైన వారు పంచకృత్యములైన జపము , ధ్యానము , పూజ , యజ్ఞము , ఆహుతి ద్వారా ఆరాధించవలెను . ఈ క్రియలకు మూల స్పందన స్థానము శిరస్సే గనక శిరస్సు నందున్న సహస్రార పద్మము నందు స్థిరముగా నుండు ఆ దేవతను శిరో  దేవతా శక్తి అందురు . ఈ దేవతను సాయంకాల సమయమున ధ్యానించిన అమ్మ తృప్తి చెంది నిత్యతృప్తా యగును .

o చంద్రనిభా.  :-   శిరస్థిత అయిన అమ్మవారు సకల కళా వల్లభి యై చంద్రకిరణ శోభతో 16 కళల రూపితయై చంద్రకళ అను నామముతో అమృత కిరణ్మయి అగుచున్నది . మానవ శరీరము మూడు ముఖ్య భాగము లుగా విభజించిన అందు మొదటిది అగు  శిరస్థానమందున్న నిత్య తృప్తగా నున్న అమ్మవారు చంద్రునిభా  గా ఆరాధింపబడుతోంది .

o ఫాలస్థేంద్ర ధనుఃప్రభా  :-  అమ్మవారు ఆజ్ఞాచక్రం స్థానమైన ఫాల భాగము అనగా నుదురు లేక లలాట భాగము నందు దీపాకార లేక అర్ధచంద్రాకృతిలో ఉండి అగ్ని స్థానం అయినందున సప్తవర్ణ కాంతులను వెదజల్లు ఇంద్రధనస్సు వలెనున్న అమ్మను నేత్రాదేవిగా , అలక్షిత గా భావించి ఆరాధించాలి . ఈమెను ఉదయ సమయాన ధ్యానిoచాలి .

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ || 120 ||

o హృదయస్థా రవిప్రఖ్యా.  :- మన శరీరంలో మూడవ ముఖ్య స్థానము అనాహత చక్ర స్థానమైన హృదయ స్థానము . ఈ స్థానము నందున్న అమ్మవారు అరుణ కిరణ కాంతులతో సూర్య స్థానం నందు ఉన్న oదున ఎరుపు వర్ణంలో నుండి సర్వవ్యాపక శక్తిగా యుండి సర్వజ్ఞ రూపణి గానూ , కిరణ్మయి గాను ప్రకాశించును  . ఈమెను మధ్యాహ్న కాల సమయమందు ఆరాధించవలెను .

o త్రికోణాంతర దీపికా  :-   పైన పేర్కొన్నట్లుగా వరుసగా సోమ (చంద్ర ) అగ్ని , సూర్య శక్తులను సమన్వయ బిందు రూపములుగా భావన చేసినచో సోమ , అగ్నులకు శక్తినిచ్చునది సూర్యుడని గ్రహించవలెను . ఆ విధముగా బిందు నిక్షేపణ చేసిన , ఒక త్రికోణము ఏర్పడును . ఆ త్రికోణము మధ్య బిందువును అమ్మ గా భావించి సోమ ,అగ్ని, సూర్యుల కు  వెలుగులను ఇచ్చే తల్లి లలితాంబిక యే .

       అంతర్ ఆరాధనతో సూర్యుని ఆరాధించిన సూర్య బిందు స్థానమందు తేజస్సుతో జ్వాజ్వల్యమానమైన ప్రకాశము తో వెలుగొందు చుండును .

       ఇంకొక భావనలో పరిశీలించిన మనలో మూలాధార చక్రము త్రికోణాకారము గా వుండి కుండలినీ వ్యవస్థ మధ్య సుషుమ్న రూపంలో అమ్మవారు యుండి సహస్రారము వరకు వ్యాపించి యుండు మహా చిత్ శక్తి స్వరూపిణి మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే . ఈమె అనంత త్రిశక్తి స్వరూపిణి .

        ఈ విధముగా అమ్మ వారి ఆత్మ విద్య శివశ క్త్యాయుక్తమై శివుని ప్రబోధంతో మన్మధుడు శ్రీషోడశాక్షరీ విద్య అయిన శ్రీ విద్య ఉపాసన ద్వారా అమ్మ వారిని సేవించి త్రికూట అధిపతులైన త్రిమూర్త్యాదులచే సేవించ బడి , మానవాళి కొరకు వాగ్భవ కూటము , కామరాజ కూటము , శక్తి పీఠము నందు స్వయంభువుగా  వెలిసి ప్రతి మానవునిలో జ్ఞాన కాంతులు నింపుటకు అమ్మ శిరస్థితయై చంద్రనిభాగా , లలాట స్థానమందు ఇంద్రధనస్సు గా హృదయ స్థానము నందు అరుణ వర్ణ రూపిణీ గా ఆదిత్య స్వరూపిణిగా అంతర్లీనయైకరుణా కటాక్ష వీక్షణాలతో  తన ఆజ్ఞాబధులైన అనుచర దేవతల ద్వారా మన కోరికలు తీర్చు చున్నది .


o దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ    :-   ఒకప్పుడు హిమాలయ ప్రాంత వాసుడైన రాక్షస రాజు దక్ష ప్రజాపతి తనకు సంతానం లేని కారణముగా బ్రహ్మ దేవుని గూర్చి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించి వరము కోరుకొమ్మనగా శివుని భార్య అయిన పార్వతి తన కుమార్తెగా సంతానముగా కలుగున ట్లు వరముగా కోరెను . అందుకు బ్రహ్మ నిరాకరించి శివుని ప్రార్థించమని సలహా ఇచ్చి అంతర్దానం అవ్వగా , దక్షుడు అహంభావి కనుక శివుడు లయకారకుడు అగుటచే తనకు సంతు కలుగనీయెడని భావించి అమ్మ పార్వతీదేవిని గూర్చి తపమాచరించగా ఆమె వరం కోరుకొమ్మని అడుగగా నీవే నాకు కుమార్తెగా జన్మించమని కోరగా ఆమె శివుని అనుమతితో వానికి వరములనోసగే . కొంతకాలం అనంతరం దక్షుని కుమార్తె గా జన్మించి దాక్షాయణీ యై దినదిన ప్రవర్ధమానమై యవ్వన వయస్సు రాసాగెను .

     దాక్షాయణీ కి వివాహము చేయు తలంపుతో స్వయంవరం ఏర్పాటు చేయ అమ్మ అందుకు పాల్గొనుటకు ఇష్టపడనప్పటికీ బలవంతముగా ఒప్పించ గా తాను పాల్గొని  మనము నందు శివుని స్మరించి చేతనున్న పూలహారం గాలిలోకి వేయగా అది శివుని కంఠమునందు అలంకరించబడినది . ఈ సంఘటనకు దక్షుడు కుపితు డాయను . అప్పటినుండి  దక్షునకు కోపము ఎక్కువై శివుని యందు ద్వేషం పెంచుకుని ఈశ్వర ద్రోహం నకు వేచి యుండెను . మనశ్శాంతి కొరకు ఒక యజ్ఞము తలపెట్టి అందరు దేవతలనూ ఆహ్వానించి సొంత కూతురును ఆహ్వానించక అవమానపరచెను . అయినప్పటికీ లోకఆచారం ప్రకారం ఆడపిల్లను పుట్టింటివారు పిలవనప్పటికీ సంప్రదాయానుసారం దాక్షాయణీ వెళ్లగా అచట ఎవ్వరూ పలకరించ క పోవుటచే వ్యధ చెంది తనకు తాను అగ్ని ప్రజ్వలన చేసుకొని ఆహుతి కాగా విషయము శివునికి తెలిసి కోపోద్రిక్తుడై అమ్మ పార్వతి అనుమతితో యజ్ఞ నాశనమునకు , దక్షుని సంహరించుటకు నందీశ్వరుని ప్రేరేపించి విధ్వంసం చేసి దక్షుని హతమార్చెను . శివ  ద్రోహము ప్రకృతి వినాశనమునకు దారితీయును .

         దాక్షాయణి అనగా దక్షత గల సకల యజ్ఞ స్వరూపిణి . లోకంలో ఈ రోజుల్లో సరైన శాస్త్ర పరిజ్ఞానం లేకనే సంప్రదాయ విహిత మైన సనాతన ధర్మము నాచరించ అశాస్త్రీయ యజ్ఞ యాగములు చేసిన ప్రకృతి వినాశనము జరుగును .


దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |

గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః || 121 ||


o దరాందోళిత దీర్ఘాక్షీ.  :-   అత్యంత శ్రద్దాసక్తితో అమ్మను ఆరాధించు భక్తులు అమ్మ కు ఎంత దూరము గానున్న వారైనప్పటికీ ఆమె అరవిరిసిన తన క్రీగంటి చూపుతో కరుణా కటాక్షములు తేజరిల్లు దయా వర్షం కురిపించి కాపాడును . అంత దూరాన నున్ననూ అమ్మవారి అంశా స్వరూపుడగు సూర్యుడు ప్రపంచానికంతటికీ వెలుగులు ప్రసాదిస్తున్నాడు కదా .

o దరహాసోజ్జ్వలన్ముఖీ   :-   మన కోరికలు అన్నింటిని అమ్మవారు చిరునవ్వుతో పరవశురా లై తీర్చును . ఆ స్వభావము గల తల్లిని జ్వాలాముఖీ దేవి అందురు .

o గురుమూర్తి   :-   బ్రహ్మ విద్యాస్వరూపిణి అయిన అమ్మవారు అందరికీ ప్రథమ గురువు . లోకంలో  సకల వేద శాస్త్ర పారంగతులు ఎల్లరునూ  మనకు గురువులైనా , అమ్మకు వారంతా శిష్యులే . అందుకే అమ్మ  మూర్తీభవించిన గురు స్వరూపిణి . దేవి సూక్తము అమ్మవారి ముఖతః వెలువడింది . దేవతా గురువైన దక్షిణామూర్తి స్వరూపం ఈశ్వర అంతర్భాగమైన అమ్మ వారే కదా .

         సద్గురువులు అనువారలకు అమ్మ యందు అచంచల విశ్వాసము కలిగి అపారమైన గౌరవభావం కలిగి ఉండి సకల వేద శాస్త్ర పారంగులై సంప్రదాయ సత్పరంపరగా వచ్చి తత్వ సాధకు లై శిష్యుల సందేహాలను నివృత్తి చేయువారు గురువులు .

o గుణనిధి  :-   అమ్మవారు సంపూర్ణ జ్ఞాననిధి . ఈమె అనంత కళ్యాణ రూపిణి గురుస్వరూపు లు క్క్ ఎలా ఉండాలో వారి స్వభావము ఏ రీతిగా నుండవలె నో మన పెద్దలు వివరించారు . 1 సుందరమైన రూపము గల వారై ఉండాలి 2 సుమనస్కులు – మంచి మనసులు కలవారు 3 స్వచ్ఛ ముగా కపటం లేకుండు వారు 4 బహు విద్యల యందు ప్రావీణ్యత కలవారు 5 సులభంగా శిష్యులు గ్రహింసిచునట్లు బోధించు వారు .

o గోమాతా   :-   అనగా కామధేనువు . సృష్టిలో జంతు జాతులను సృష్టించి నప్పుడు గోవు సురభి అను నామముతో ఉద్భవించెను . అది అమ్మ ప్రతిరూపమైన సురభి మాత . ఈ మాతయే మానవాళి సకల కోర్కెలను తీర్చే కామధేనువు . దీని సంతతి ద్వారా ప్రస్తుత భారతావని యందున్న ప్రతి గోవు అమ్మ రూపమే . అందుకే గోవు కలిగియుండుట ఐశ్వర్యము గా మనము భావించి పూజిస్తాము .

    గోవు అనగా వేద విద్య . ఈ వేదములకు మూలము అమ్మయే గావున వేదమాత యే గోమాత అయినది . మరియొక అర్థంలో  గోవు అనగా తల్లి , రస్మి , బాణము , మంత్రములు , భూమి, సత్యము , గురువు అను నానా అర్థములు కలవు . గోవు యొక్క ప్రతి అంగ భాగము సకల దేవతా స్థానములు కావున పూజనీయమైనది .

o గుహజన్మభూః    :-    సుబ్రహ్మణ్య స్వామి కి జన్మనిచ్చిన తల్లి . తన చిన్న కుమారుని ఒడి యందు ఉంచుకుని లాలనగా మిక్కిలి వాత్సల్యము గా ఆదరించు తల్లి . జ్ఞానస్వరూపుడు గురు స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి అమ్మను నిత్యము ఆరాధించును .

          మరియొక భావములో పరిశీలించిన గుహ అనగా హృదయ స్థానము . చిత్ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మన హృదయాంతరాళం అయిన  చిదాఆకాశంలో నుండి మనకు మంచి చెడుల విశ్లేషించి సదా మనలను నడిపించు తల్లి . హృదయ గుహ యందుండి సదా గురుతత్వమును ఆలోచనగా అందించు తల్లి .

         మరియొక భావములో  వినాయకుని బీజాక్షరమంత్రం – గ కారము గం అనునది గ వర్గమైనందున గణపతి మంత్ర గ కార అక్షర కూర్పుతో అమ్మ నామములను గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ అను నామములు గకార అక్షరములతో ప్రారంభించుట విశేషము . గోమాత నామము నందున గ కారము గణపతి సంకేతము కనుక ఆ గణపతి మాత అని భావన . ఆ వెంటనే సుబ్రహ్మణ్యం నామము కూర్చుట మంచి ఔచిత్యము కాననగును .


దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |

ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా || 122 ||

           గ కార అక్షర మంత్ర స్వరూపుడగు గణపతికి , గుహునికి   జన్మనిచ్చిన అమ్మవారు వేద విద్యా స్వరూపిణి గా సకల సద్గుణ నిధిగా యుండి గురువులందరికి గురుమూర్తిగా ఉన్న తల్లి .


o దేవేశీ దండనీతిస్థా   :-   దివ్యకాంతులతో ప్రకాశ స్వరూపులైన మిగిలిన దేవతలందరికీ ఈశ్వరి స్వరూపురాలై ఆరాధించ బడుతున్నది .అమ్మవారు చిత్ శక్తి మయి కావున దేవతలకు చైతన్యమును ఇచ్చి వారు శాస్త్ర ప్రకారముగా ప్రవర్తించునట్లు నియంత్రిస్తూ నయానయ బోధ విద్య ఉపదేశిస్తూ , పాటించని వారిని దండించే తల్లి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు .

o దహరాకాశ రూపిణీ   :-   చిత్ శక్తి స్వరూపముగా నున్న అమ్మ అటు దేవతలకు ఇటు మానవులకు హృదయా (దహర )కాశము నందే ఉండి నిత్య చైతన్యవంతులుగా ప్రకాశించునట్లు చేస్తూ మనలోనే ఉన్న సమస్త అంగాంగ దేవతా గణాలను నిర్దేశిస్తూ , పూర్వ జన్మ పాప కృత్యముల వలన ఔ చిత్యము విడనాడి దుష్ప్రవర్తన గల వారిని తన రాజదండము తో శిక్షించు తల్లి . ఈ అమ్మవారు నిరంతరము వెలుగుల నిచ్చుచూ మన హృదయాకాశము నందే గురుమూర్తిగా ఉండి తన ఆజ్ఞ లద్వారా మంచి-చెడు హెచ్చరికలను పాటిస్తూ అమ్మను నియమబద్ధంగా ఆరాధించాలి .


o ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా   :-   మన సహస్రార చక్ర స్థానమైన శిరో భాగమును చంద్రమండలం అందురు . సృష్టి స్థితి లయ కారకుడు ఆగు పరమేశ్వరుని ఇచ్ఛా జ్ఞాన శక్తిదాయిని అయిన అమ్మవారు సచ్చిదానంద స్వరూ పిణిగా ఈశ్వర దర్శనం గావించు అమ్మ గా భావిస్తూ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు తిధి దేవతలను శాస్త్ర విహితము గా విశేష విధులతో పూజింపదగిన మాత యైన లలితాదేవికి ప్రణతులు .


కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |

సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా || 123 ||

o కళాత్మికా   :-   అమ్మవారికి ధర్మ రామణీయకత తో ఉన్న కళలన్న మిక్కిలి ఇష్టత  . కళలు అంటే చిత్రకళ , కవిత్వం , నాట్యకళ ,శిల్పకళ మొదలైనవి .

o కళానాథా   :-   సర్వ కళా రూపములకు ఆద్యుడు పరమేశ్వరుడే . ముఖ్యముగా కవిత్వము , నాట్యకళలన్న శివపార్వతులకు ప్రీతిపాత్రం .

o కావ్యాలాప వినోదినీ   :-   అమ్మవారికి పురాణ గ్రంథ పఠనము వినుట యందూ , ధర్మ , భక్తి , జ్ఞాన యుతమైన వాల్మీకి వ్యాస రచన లైన రామాయణ భారత భాగవత ములు వినుట యందు ఆసక్తి చూపును . కవులకే కవులైన వారు , వాగీశ్వర లైన వశిన్యాది వాగ్దేవతా స్వరూపులు,. వీరు వేదమంత్రాలపములే గాక నిత్యము అమ్మవారి సహస్ర నామ స్తోత్ర పఠనము గావిస్తున్న వాటి యందు ఆసక్తి గా విని వినోదిoచును . ఏడు కోట్ల వేదమంత్రములు అన్నియూ పవిత్ర కవిత్వమే . ఆ మంత్రములు సస్వరముగా ఆలాపించిన వినుటకు వీనులవిందగును  . కాళిదాసు ,భవభూతి లాంటి వారి కావ్య కళా విశేష్యతను అమ్మ కళారాధనతో వినోదిస్తుంది . కావ్యములు రెండు విధములుగా అసత్ కావ్యములు అని సత్ కావ్యములు అని ఉండును . సత్ కావ్యములను కావ్య అమృత రసాస్వాదన చేస్తూ పఠించాలి .

       కళా నాథుడయిన శివుడు కొన్ని శిల్ప ,చిత్ర కళ లను ఆస్వాదించి ముగ్ధుడై వీక్షిస్తున్న సన్నివేశము ఒక కవి చమత్కారముగా శివుని రెండు కన్నులు ఆనంద పరవశము  చెంద , ఆజ్ఞాచక్రస్థాన నయనము విషాదము చెందిందట  తాను దర్శించ భాగ్యము  లేనందుకు . ఇది గొప్ప కావ్యాలాపము .

o సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా  :-   కావ్యా లా ప వినోదినిగా నున్న అమ్మవారు సింహాసనారూఢయై ఉండ ఆమెకు కుడిప్రక్కన సరస్వతి దేవి ఎడమ ప్రక్కన మహాలక్ష్మీదేవి నిలబడి చామరము లతో  వీచు చుందురు . ఈ విధమైన సేవలు అమ్మవారు  అందు కొనుటలో ఆంతర్యమేమి యన సరస్వతి దేవి వాక్ప్రాణ విద్యా జ్ఞాన స్వరూపిణియై ఉండ , అమ్మ శ్రీ మహాలక్ష్మి సకల ఐశ్వర్య ప్రదాయిని కాగా మధ్య ఆసీనురాలైన అమ్మవారు చైతన్య సర్వశక్తి మయి కాగా వీరు ముగ్గురను శ్రద్ధగా ఆరాధించిన ,వారు ప్రసాదించు ప్రసాదములు  మనకు సిద్ధించినవే అను భావనలో కృతజ్ఞతగా నుండవలెను . ఈ భావన యందు కుండలిని మంత్రమైన  ఐo, శ్రీo ఇరుపక్కలా నున్న అమ్మవార్ల బీజాక్షరములు కాగా , మధ్యనున్న అమ్మ లలితాదేవి  హ్రీ o కార స్వరూపిణి . మూడు బీజాక్షర సమాహారము వరుసగా        ---    --         ఐo హ్రీ o శ్రీ o లు  ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆది శక్తి , శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి మూల మంత్రము .

ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః |

అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా || 124 ||

o ఆదిశక్తి   :-   సకల వేద మంత్ర స్వరూపిణి , వేదమాత , సృష్టికి ముందే మొదటిదైన మూలశక్తి విశ్వసృష్టికి కారణ భూతురాలు  . సర్వం శక్తిమయం అన్నట్లు ఈ సువిశాల ప్రపంచం అంతా తానై ఉండి త్రిగుణాతీత , కాలాతీత గా ఉన్న అమ్మ లలితాంబికాయే ,ఆది పరాశక్తి .

o అమేయా   :-   ఈ జగత్తు అంతటా విస్తరించి ఉండు అమ్మ వ్యాపకత్వము కలిగిన చైతన్య శక్తిగా నుండి ఏ కొలతకు అందని తల్లి . ప్రపంచంలో దేశ , కాల ,వస్తువులను మూడు విధములైన కొలతలు మాత్రమే యుండును . అమ్మవారు ఈ ప్రదేశంలో మాత్రమే ఉండునని ఎలా చెప్పగలము ? ఆమె సర్వాంతర్యామి . అదే విధముగా ఒక కాలమునకు చెందినది కాక ఎల్లప్పుడూ ఉండి సమస్త జీవుల యందుండి నడిపించుచున్నది . అమ్మవారు అమేయ స్వరూపిణి అనుటకు చాలా పర్యాయపదములు గలవు . ఆమె నిత్యము ,సత్యము ,సిద్ధము ,జ్ఞానము ,అజరము ,అమరము ,అప్రమేయము ,స్వాతంత్రం మొదలగునవి .

o   ఆత్మా   :-   అమ్మవారు అందరి ఆత్మయందు ఉండు ఆత్మ స్వరూపిణి . మన ఆత్మ శరీరమంతయు విస్తరించి ఉండును . మన శరీరము ఆత్మ అనునది ఉపాదులు మాత్రమే . శరీరము కాలము వలన విచ్ఛిన్న మగును . ఆత్మ మరల జన్మ పొందుతూ ఉండును . అట్లుగాక నేను నాది అను అహం వీడి అహంబ్రహ్మాస్మి అని అమ్మను ఆరాధిస్తే బ్రహ్మానంద భరితు లై ముక్తి పొందెదరు . అమ్మవారు ఉపా దు లకు అతీతురాలుగా వుండును .

o పరమా   :-   అమ్మవారు క్షరాక్షరా తీతురాలై ఉండి  ఉత్కృష్ట రూపిణిగా నుండును . అన్నింటా ఉండి గొప్పది గా ఉండును . ఆ పరతత్వం మే నాలుగు విధాలుగా ప్రధాన , పురుష ,అవ్యక్త ,కాలం అను వాటికి మన శరీరం లొంగి యుండును . అమ్మవారు ఈ పై విధాలకు అతీతురాలై అయిదవది అయిన పరతత్వ రూపంలో పరమ (అతీతు) రాలై ఉన్నది . మానవ శరీరదహారాకాశ స్వరూపిణిగా నున్న అమ్మను పరతత్వ విచారణ చేసినచో  ఆమెను  పరమేశ్వరి గా గ్రహించ వలెను .

o పావనాకృతిః   :-   పావనము అనగా పవిత్రమైనది . అమ్మ ఆకారమే పావనమైనది . మన కోరికలు తక్షణమే తీర్చు తల్లి . ఆమె ఆకృతి , నామ  రూప లీలా వైభవము లన్నియు పావనములే . అయితే మన శరీర ఆత్మయందు కూడా అమ్మ అంతర్లీనంగా ఉన్నది కనుక ఆ అమ్మ పవిత్రత కాపాడాలి గనుక మనము శారీరక , బుద్ధి పూర్వక ,మానసిక అను 3 విధముల పరతత్వసారము విచారణ గావిస్తూ పవిత్రత సాధించాలి . అయితే శరీరం పవిత్రత , విద్య ద్వారా మంచి ఆధ్యాత్మిక పుస్తక పఠనం ద్వారా సుచి, శుభ్రత తో కూడిన జపతపాదులు వలన పవిత్రత సాధించుకోన వచ్చును . బుద్ధితో  భగవత్తత్వం విచారణ కావిస్తూ అమ్మ యందు నమ్మకంతో నిష్కల్మష హృదయముతో ఆరాధన చేయు వారు పవిత్రులగుదురు . ఏ విధముగా మన శరీరము , అమ్మవారు వేరు కాదో అందరియందు పరమేశ్వర చైతన్యము నివిడీకృతమైన భావనతో శుద్ధ తత్వ మనసుతో పరిశీలించిన మనమే మన హృదయాకాశమునందు సాధన , ధారణ, ద్వారా పావనాకృతి అయిన  అమ్మను దర్శించవచ్చును .

o అనేకకోటి బ్రహ్మాండ జననీ   :-   ఒక బ్రహ్మాండం అనగా 14 లోకములు కలిగి ఉండును . ఇలాంటి అనేక సమస్త బ్రహ్మాండాలకు మూలమై అమ్మవారు నడిపించు చున్నది . మనం మనం ఉండేదే ఒక లోకమని వేరు లోకాలు ఏవీ లేవని భావిస్తున్నాము ఉదాహరణకు మేడిపండు ఒకే వృక్షమునకు అనేక కాయలoడి ప్రతి దాని యందు అనేక పురుగులుoడి ఆ  కాయలో  తిరుగుతూ అదే వాటి లోకమని ఎలా బ్రమ పడు నో వాటికి ఆధారమైన మూల వృక్షము ఎట్లో అటులనే సమస్త లోకాలకు మూలాధారమై నడిపించే మహాతల్లి లలితాంబికాయె .

o దివ్యవిగ్రహా   :-   అమ్మవారు భౌతిక తత్వములేవీ  అంటని దివ్య మంగళ స్వరూపిణి . అంతర తత్వ విచారణ వల్లనే అమ్మ పవిత్ర విగ్రహ రూపం దర్శనీయము  . అమ్మవారు జ్యోతుల కే జ్యోతి స్వరూపిణి .

క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |

త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ || 125 ||

o క్లీంకారీ   :-   అమ్మ మోక్ష కారిణి అగు క్లీoబీజాక్షర క్లీo కార స్వరూపిణి . ఈమె ఆకర్షణ శక్తి కలిగి యుండును . మన్మధుడు ఈ బీజమంత్రం ఉపాసన ద్వారానే ఆకర్షణ శక్తి కారకుడైనాడు . ఈ క్లీo కారి అమ్మవారు అనేక బ్రహ్మాండములను తన ఆకర్షణ శక్తితో తన నియంత్రణలో ఉంచు కొని  పట్టి నడుపుచున్నది .

o కేవలా   :-   అనగా సమస్త లోకాలను ఏకాకిగా ఒంటరిగా పరిపాలించు తల్లి కేవలా దేవి . ఈమె త్రికూట దేవతా స్వరూపా లలో మధ్య కూటమునకు చెందిన అమ్మవారు .

o గుహ్యా   :-   అనగా రహస్యముగా ఉండునది . ఈమె హృదయ కుహరము నందు అంతర్ముఖం గా  యుండును .

o   కైవల్య పదదాయినీ   :-   క్లీo అను బీజాక్షర మంత్రములో  అనేకత్వ  శక్తి బీజము లైన క ,ల అను వాటియందు గుహ్య రూపములో కేవలాదేవి బీజాక్షర మైన ‘ ఈo ‘ బీజము దాగి ఉండి క్లీo కార  మంత్ర జపంతో  సర్వులకూ మోక్ష ప్రదాయిని గానుండు జగజ్జనని . మన శరీరము స్థూల , సూక్ష్మ దేహములు గా  విభజించబడి నందున అమ్మ ఆరాధన లో  లీనం అయినప్పుడు ఒక్కొక్క శరీరము నశింపజేసి అనగా దేహ త్రయ నాశినిగా లయ కారిణి యై మారు జన్మ లేక కైవల్యము ప్రసాదించునది .


o త్రిపురా   :-   అనగా  అన్ని వస్తువుల యందు ఉండు తల్లి . ఈమె అందమైన సుందర స్వరూపముగా నుండి త్రిపుర సుందరి గాను , భయ కారక రూపములో ఉండు త్రిపుర భైరవి మాత గాను రెండు విధములుగా ఉండును . మనలను మెప్పుకోలు గా భావించు వారికి సుందరత్వ రూపంతోనూ , ధర్మ విరుద్ధంగా మనలను భాదించేవారి ఎడల కఠినముగా నుండి  భయపెట్టు ఉభయ తత్వ రూపంలో ఉండు భైరవి మాత గాను మనలను రక్షించుటకు ఇరు స్వరూపములను ఆరాధించవలెను . దత్తాత్రేయులవారు త్రిపుర రహస్యమను ఒక గ్రంథము రచించినారు .


    త్రిపుర అనగా ఉండు చోటు . అమ్మవారు సర్వాంతర్యామియై ఉండు కావున ఈ ప్రపంచంలో అన్నియును మూడు విధములుగా ఉండును అందుకు కొన్ని ఉదాహరణలు.   -  

 త్రిమూర్తులు  : బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు .

త్రి మాతలు   : సరస్వతి ,లక్ష్మి , పార్వతి .

త్రి పుష్కరములు : గంగా , యమునా , సరస్వతి

 త్రిశక్తులు   :  ఇచ్చా జ్ఞాన చైతన్య శక్తులు

త్రి జ్యోతిర్మండలాలు  : సూర్య అగ్ని చంద్ర మండలములు

త్రి వర్ణములు   :  అ ఉ మ కలిపి ఓంకారము .

త్రిగుణములు  :  సత్వ రజ : తమో గుణములు .

త్రి  శరీరాలు   :  స్థూల సూక్ష్మ కారణ దేహాలు .

త్రివిధ శరీరం  :  మనసు బుద్ధి అహంకారం .

త్రి తత్వములు  :  జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థ .

త్రి గ్రంధి   :  బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధి  ( కుండలిని యందు )

త్రి లోకములు  :  భూలోక భువర్లోక సువర్లోక ములు .

త్రికాలములు  : నిన్న నేడు రేపు

త్రి నాడులు  : సూర్య సుషుమ్నా చంద్ర . ( శరీరములో పృష్ఠము నుండి శిరస్సు వరకు )

త్రి కారకములు  : సృష్టి స్థితి లయలు .

త్రి వేదములు  :  ఋగ్వేద యజుర్వేద సామవేదములు

ఈ పై విధముగా అన్నింటి యందు అమ్మవారు యుండి సర్వకాలాల్లోనూ ఉంటూ త్రిపుటి గా నున్న అమ్మ ఏకత్వ స్వరూపమే లలితా మహా త్రిపుర సుందరీ దేవి . ఈమె శ్రీచక్రము లో చంద్ర మండల స్థానము నందు ఉండి వెలుపలి ఆవరణ మైన అగ్ని మండలము , దానికి వెలుపల సూర్యమండల స్థానముగా ఉండును .

o త్రిజగద్వంద్యా   :-  త్రిపుర సుందరి దేవి అయిన అమ్మను  ముల్లోకముల యందుండు యోగులు త్రికోణ అంతర్గత త్రిపుటి ని ఏకత్వ సంకల్ప భావనతో హృదయ ఆజ్ఞా సహస్రార చక్రము నందున్న ఆమెను ఆరాధించగా వారి వందనములు (పూజలు) అందుకునే తల్లి .

o త్రిమూర్తి స్త్రిదశేశ్వరీ   :-   అమ్మ త్రిపుర సుందరీ దేవియే లోక ప్రయోజనార్థం  దుర్గ లక్ష్మి పార్వతులు గాను మరొక సందర్భావసరముల కు గానూ శాంభవి శ్యామల బాలా రూపిణిగా , వేర్వేరు నామములతో త్రిమూర్తి గా బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులనందుoడి లోక హితము గూర్చి అవతరించు తల్లి త్రిమూర్తి .

బాల్య ,కౌమార ,యవ్వన దశలలోమూడవ దశ అయిన యవ్వన దశ యందు ఉండు తల్లి అమ్మవారు కాలాతీత గా ఉన్ననూ ఎల్లప్పుడూ యవ్వనవతి గానే యుండును .


త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |

ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా || 126 ||

o త్ర్యక్షరీ    :-.  అ ఉ మ అను మూడు అక్షర శక్తులతో కూడిన ఓంకార శక్తిస్వరూపిణి . ఈ అమ్మవారు కామకూట ,పూర్ణగిరిపీఠ , వాగ్భవకూటములయిన  త్రికూట పీఠములoదుండి ఇచ్చాశక్తి , పరాశక్తి , కామశక్తులతో శ్రీ విద్యా దేవత అయి జ్ఞాన విజ్ఞాన ప్రదాయినిగా నుండు తల్లి . బాలా అమ్మవారిని త్ర్యక్షరీదేవి అందురు .

o దివ్యగంధాఢ్యా   :-   అమ్మవారు దివ్యమంగళ స్వరూపురాలుగా యుండి దేవలోకంలో నుండు మంచి వ్యాపకతతో కూడిన పరిమళ గంధములతో ప్రకాశమానమైన తల్లి . అనంత కల్యాణ గుణ రూపిణిగా ఆరాధించ బడుతున్నది .

o సింధూర తిలకాంచితా    :-   అమ్మవారి పాపిట సింధూర తిలకము ధరించి భానోదయ వేళ నవీన అర్క కిరణ సంజాతయై కళ్యాణ రూపిణిగా పూజింపబడుతున్నది .

o ఉమా శైలేంద్రతనయా   :-   హిమవత్పర్వత రాజపుత్రిక అయిన పార్వతియే ఉమాదేవి . ఈమె సర్వదోష హరిణి .

     కాముని దహనం అనంతరం హిమవంతుని తపస్సు మేరకు శక్తి అయిన అమ్మ పర్వత రాజుకు కుమార్తెగా జన్మించగా దినదిన ప్రవర్ధమానమైన ఆమెకు వివాహము చేయ తలపుతో తండ్రి కూతుర్ని సంప్రదించగా తాను శంకరుని తప్ప అన్యులను పెండ్లి చేసుకోనని చెప్పగా అతడు చింతించెను . ఒక నాడు నారదుడు వచ్చి శివ మంత్రం చెప్పి పార్వతిని తపస్సు చేయమనగా అందుకు సిద్ధపడి తపోభూమికి యేగు తుండ ,తండ్రి వారించిననూ వినక తల్లి మీనా దేవి కడకేగి తపమునకు వెళుతున్నట్లు చెప్పగా తల్లి వెంటనే ‘ ఓయ్ ‘అని పిలిచి వద్దని చెప్పెను  . అప్పుడు పార్వతీదేవి తల్లితో నీవిప్పుడు పిలిచిన పిలుపు   ‘ఉమా’ అని  అర్థము . ఈ ఉమా నామము నాకు కొత్తది కాదు . ఏనాటి నుండో వేదముల యందు నా ఉమా నామము నిక్షిప్తమై ఉన్నదని చెప్పి ,ఆ విధముగా అమ్మ నామము  త్ర్యక్షాక్షర ప్రణవ వర్ణ విద్యా స్వరూపముగా మారి అమ్మ ఓంకార శక్తి స్వరూపిణియై భుక్తి భక్తి ముక్తి ప్రదాయని అయినది .           అ   ఉ.  మ – అను మూడు వర్ణముల కలయికయే ఓంకారము .

ఉమా అనగా ఉత్తమ చిత్తవృత్తి ని పెంపొందించు తల్లి . చిత్త వృత్తి అనగా ఒక పని చేయుటకు భావనతో కూడిన సంకల్ప శక్తి  ( అమ్మను పూజించాలనే తపన ) సాధన శక్తి తో కలిసి తపశ్శక్తి ద్వారా ఉత్తమ ధర్మ యుతులు గా ముక్తి పొందగలరు . అజ్ఞానము లో ఉన్నవారిని జాగృతపరిచే ఓంకార సర్వశక్తి రూపం అమ్మయే , షోడశ విద్యా రూపిణి , భవ రూప నాశిని .

అమ్మవారు తన తపోనిష్ఠతో శివుని సాక్షాత్కారము పొంది కళ్యాణ రూపణి అయినదో మనము యధాశక్తి అమ్మ నారాధించి పరానుభూతి సాధనతో భవ ,పాప నాశనము జరిగి   సాయుద్యము పొందవచ్చును . ఉమా అనగా సహస్రార చంద్రమండలము నందు ఇందుకళ సంతరించుకుని తన ఇచ్చాశక్తి తో శివ సంకల్పానికి ప్రేరణనిచ్చే సృష్టి గావించు తల్లి .

శ్రీ చక్రమునకు అన్వయిస్తూ అమ్మవారు మేరు పర్వత శిఖరం స్థానములో శ్రీ చక్ర మధ్య భాగాన బిందు రూపములో నుండు కావున మేరు పర్వత తనయ అయినది .

o గౌరీ, గంధర్వ సేవితా    :-   గౌరీ అనగా తేటతెల్లని స్వరూపముతో ప్రకాశించు తల్లి . ఈమె ఉమాదేవి గా శివుని వివాహము చేసుకున్నప్పుడు సహోదరుడైన విష్ణువు వలె నల్లగానే యుండెడిదట . శంకరుడు తరచూ నల్ల పిల్ల అని అనుట తో తన శరీర ఛాయ మార్పు చేయుమని బ్రహ్మదేవుని ప్రార్ధింప ఆయన సంతోషించి తెల్లని శరీరఛాయ నొసగగా తన నల్లని శరీర కోశము విడువ గా ఆ కోశము కౌశికి గా మారి రాక్షసులైన శుoభునిశుoభు లను సంహరించెను . అంతట తాను తెల్లని శరీరము గలదై గౌరీ నామమును పొందెను .

గౌరీ అనగా సోమ , అగ్ని తత్వముతో సూర్య ప్రభావిత వెలుగొందు జ్యోతి స్వరూపిణి . ఈమె శబ్ద బ్రహ్మ విద్యా సంపన్నమైన అఖండ జ్ఞాన స్వరూపిణి . గౌరీ అనగా వాక్ శక్తి ప్రదాత . అనంత దూరాన ఉన్న సూర్య ప్రభావిత జ్యోతి , పరతత్వ శక్తి వ్యాపక ప్రభావము వలన ఏక కిరణము ద్విపద కిరణము లై భూమికి చేరునoతలో బహుళములై   సహస్రము లైనవి .

  అమ్మ గౌరీ నాద బ్రహ్మ స్వరూపిణి కావున ద్విపద కిరణముల నుండి ముందు ఉమా నామ రూపమైన ఓంకారం , తదుపరి వేదములు జన్మించినవి . తిరిగి ఓంకారము నుండి వ్యాహృతి , గాయత్రి , అను మంత్రశక్తుల నుండి వేదమంత్రాలు , వేదాంగాలు , పురాణాలు , షఢంగాలు , ఉపనిషత్తులు ,ధర్మశాస్త్రములు మొదలగు అనేక శాస్త్ర సాహితీ సంపదలు వెలువడినవి  . ఇంతటి సనాతన సాహిత్య సంపద ప్రపంచంలో ఏ దేశానికీ లేదు . ఈ నాద విద్య నే గంధర్వ విద్య అందురు . ఈ విధముగా అనేక మంత్రములతో అమ్మ గౌరీ దేవి సేవింప బడుచున్నది .


విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ |

ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా || 127 ||

o విశ్వగర్భా   :-   వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి నామము లైన ఉమా గౌరీ నామ విశిష్ఠత తెలిపి రూప వైభవముగా విశ్వ గర్భ అనగా సమస్త విశ్వమును తన గర్భమున ఉంచుకున్న తల్లి  అటులనే విశ్వమంతటా తానే వ్యాపించి ఉండు తల్లి . ఉదాహరణకు సముద్రములోని కెరటముల వలె ఒకదానియందు ఒకటి అంతర్లీనమై ఎట్లుండునో అదే విధముగా అమ్మ విశ్వమంతా వ్యాపకత పొంది యుండెను . విశ్వము అనగా మనము నివసించే భూమి . ఈ భూమి గర్భమునందే సమస్త లోహములు ధాతువులు నిక్షిప్తమై ఉన్నవి . ఈ భూమిని వసుంధర , రత్నగర్భ అని అందురు .

o స్వర్ణగర్భా   :-   స్వర్ణ అనగా శుభ వర్ణములు . వర్ణములు  అనగా వేద వేదాంగముల యందు ఉన్న మంత్రములు . ఈ సకల మంత్రములు అమ్మ గర్భమునుండి వెలువడినవి కావున వేదమాతయై స్వర్ణగర్భ అయినది .

o వరదా   :-   శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయిన ఉమా గౌరీ నామము నందు విశ్లేషణ ద్వారా ఓంకార ఆవిర్భావము , గౌరీ నామము ద్వారా సర్వ వేద మంత్ర వాగ్రూప విద్యను , గురునాశ్రయము పొంది ఉపాసనతో మంత్ర అనుష్టానము సిద్ధి సాధన చేసిన వారి కోరికలు అమ్మవారు తీర్చుటయే కాక మోక్షము నొసగును . ఎవరైతే మంత్ర జ్ఞానార్జన చేసి వాక్కుతో మంత్ర పఠనం ద్వారా అమ్మ ఆశ్రయము సాధింతురో వారి వాక్కుకు అనుసంధాన దేవత అయిన సరస్వతి కటాక్షం లభించును .

o వాగధీశ్వరీ   :-   బుద్ధి సక్రమమార్గంలో నుంచి రక్షించు తల్లి . వాక్కుకు అధిదేవత అయిన సరస్వతి దేవి వాక్కు ఏర్పడుటకు కావలసిన నాలుగు దశలు అయిన పర ,పశ్యంతి ,మధ్యమా , వైఖరి దాటి ఐదవ దశ వాక్కుగా పరిణామము కలిగించు జ్ఞాన స్వరూపిణి .

o ధ్యానగమ్యా   :-   ఓంకార జనిత వేద మంత్రములను గురూపదేశ ఆశీస్సులతో ఏకాగ్ర చిత్తముతో సకలేంద్రియ నిగ్రహశక్తి తో మనసు నిలిపి నిగూఢంగా నున్న అమ్మను ఎవరు ధ్యానింతురో వారు జ్ఞాన వంతులు అగుదురు .

o అపరిచ్ఛేద్యా   :-   అమ్మవారి ధ్యానము వలన అనుభూతులు , ఉపాదులను పరిచ్ఛేదనము (తెగగొట్టబడి ) చేసి అపరిచ్చేద్య మైన (పరిమితి లేని ) జ్ఞానము నిచ్చు తల్లి .

o జ్ఞానదా, జ్ఞానవిగ్రహా    :-   అమ్మవారిని ఎవరైతే నిశ్చల భక్తితో ఆరాధింతురో అప్పుడు కరుణ , అనుగ్రహ , జ్ఞాన కిరణములు వారిపై ప్రస రించి జ్ఞానవిగ్రహ స్వరూపిణి అయిన అమ్మను మనోఫలకంపై దర్శించవచ్చును .


సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |

లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా || 128 ||

o సర్వవేదాంత సంవేద్యా   :-   ఓంకార  స్వరూపిణి అయిన ఉమ  , వేదమంత్ర గర్భ అయినా గౌరినీ నామ మంత్ర ధ్యానముతో  సర్వేంద్రియములకూ  ఏ తల్లి తెలుసుకొను  జ్ఞానము  మనకు కలిగించు చున్నదో ఆ తల్లి మన శరీర మoదే వ్యాపించి యుండును . ఆ విధముగా సముపార్జించిన ఇంద్రియ జ్ఞానము వలన వేద స్వరూపిణి అయిన అమ్మను వేదాంగములు అయిన ఉపనిషత్తుల యందు స్పష్టముగా తెలుసుకొనవచ్చును . అమ్మ వారి ఆత్మ స్వరూపము ఉపనిషత్తుల యందు తేటతెల్లంగా విశదీకరించబడినది .

o సత్యానంద స్వరూపిణీ   :-   బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మ నిరతిశయ ఆనంద స్వరూపిణి . సత్యములు అనగా వేద మంత్రములు . నిరంతర వేద గానము పఠించుట అమ్మకు మహదానంద కరము . .

o లోపాముద్రార్చితా   :-   ఆగస్త్యుని ధర్మపత్ని అయిన  లోపాముద్రా దేవిచే అర్చింపబడు తల్లి . ఈమె శ్రీవిద్య మంత్రము సహజం గానే నేర్చుకొని ప్రత్యేక మంత్రం ముద్రలతో అమ్మవారిని ఆరాధించి మెప్పు పొందిన ద్రష్ట .

      లోపాముద్రా దేవి వివాహము కాకముందు అమ్మ ఉమాదేవి శివుని వివాహమాడ నెంచి ఎలా తపమాచరించి తన కోర్కె నెరవేర్చుకొని శివుని పతిగా పొందినదో అదే విధముగా వారిని ఆదర్శంగా తీసుకుని తాను ఇష్టపడిన  ఆగస్త్యులవారితో వివాహము కావలయునను కోరికతో గౌరీదేవిని ఆరాధించగా ఆమె ప్రత్యక్షమై లోపాముద్రకు ప్రత్యేక మంత్రము ప్రసాదించగా ఆ మంత్ర ప్రభావం వలన అగస్త్యునితో వివాహము జరిగెను . అమ్మవారు తనను ఆరాధించే ఋషి పుంగవులతో లోపాముద్ర పేరును తన నామార్చనా వరుసలో నుండునట్లు ఆదేశించినది . ఈ విధముగా అమ్మ మెప్పు పొందిన మహా పతివ్రత , స్త్రీ మూర్తి , జ్ఞాన మూర్తి . అందుచే ఈమె రుషిక అయినది . ఆ విధముగా మన భారతీయ ఔన్నత్యాన్ని చాటి నది . ఇంతటి పాతివ్రత్య శిరోమణి నీకు ధర్మపత్ని అవుట వలననే మీకు ( అగస్త్యులవారికి  ) హయగ్రీవుల వారు ఈ లలితా రహస్య సహస్రనామ స్తోత్రము బోధ చేయుట జరిగెననెను . లోపాముద్ర విద్య అను ఒక విద్యా స్వరూపము కూడా కలదు .

o లీలాక్లుప్త బ్రహ్మాండమండలా    :-   అమ్మవారు బ్రహ్మాండము లోని సర్వజీవుల అవసరములను సమగ్రముగా సవరించుకొను అనిర్వచనీయమైన మహత్తర శక్తి కలది . ఆ శక్తితో లోకములను ప్రతిఫలింప చేస్తుంది . ఇదియే అమ్మవారి లీల . ఈ లీలలు అనేకములు గనుక ఇతమిద్దము గా చెప్పలేని అర్థము కానీ ఈశ్వర కృత్యము . అమ్మ వారి నుండి ఎకాయెకి మంత్రోపాసన పొందినవారిని ద్రష్ట లందురు . అ ద్రష్ట యే లోపాముద్రా దేవి . అమ్మవారు ఈ బ్రహ్మాండ మండలంలో ఉండు అన్ని లోకాలను నేర్పుగా అమర్చి ఆయా లోకవాసుల అవసరములను అనాయాసంగా తీర్చుతూ జీవులను కాపాడుతున్నది .

అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా |

యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా || 129 ||

o అదృశ్యా   :-   అనగా  కనపడనిది . అమ్మవారు లోకంలో ఉండే జీవులు అందరకూ చైతన్యశక్తి ప్రసాదించిననూ ఆమె ఎవరికీ కనిపించని మహత్తర శక్తి . అయితే ఆమె నామ రూప గుణ రహితురాలు . ఈమె శాశ్వితురాలు . నిర్గుణ దుర్గమమై కనిపించని శక్తి .

o దృశ్యరహితా   :-   దృశ్యం అనగా చూసేది – కనపడునది . దృక్ అనగా చూడబడునది . మనం మన కన్నుతో మనకు కనిపించే వాటినన్నిటిని చూస్తూనే ఉంటాము . దేనివలన మనం  చూస్తున్నామో దానిని ( అంటే మన కంటిని ) మనము చూడలేక పోతున్నాము . అయితే అమ్మ చైతన్య శక్తి వలన మన ఇంద్రియములన్నీ పనిచేసి అన్నీ తెలుసుకుంటూనే ఉంటాము . కానీ  దేనివలన తెలుసుకోగలుగుతున్నామో  భావిస్తే అది అమ్మ చైతన్యము వలననే . ఇన్ని చేస్తున్నా ఆమెను మాత్రము చూడలేము .

o విజ్ఞాత్రీ, వేద్యవర్జితా    :-   దేవతలలోనూ , మనుషుల్లోనూ ఐదు అంశాలు కూడి  యుండును అవి 1 ఆస్తి 2 భాసి 3 ప్రియం 4 నామం 5 రూపం . 1,2, 3  దేవతలకు సంబంధించినవి . వారికి నామరూపాలు ఉండవు . మానవులకు నామ రూపములు కనిపించును కానీ శరీర లోపలి భాగములు చూడలేము . దేవతలు సత్ చిత్ ఆనంద స్వరూపులు . అస్తి భా సి ప్రియం అను లక్షణమే పైన తెలిపిన ఆనందము . ఆ మూడింటి కలయికే ఏకత్వ మైన సచ్చిదానంద స్వరూపిణి అమ్మవారు . అదియే అద్వైతము . అనగా బహుళము కాదు ఏకత్వము .

o యోగినీ   :-   అమ్మవారు పరిపూర్ణురాలు . సర్వ లోకాల యందున్న జీవుల అందరికీ సమస్త అవసరమును తీర్చు తల్లి . యోగం అనగా పొందవలసినది , పొందాక అనుభవించేది .ఈ రెండిటి కలయిక యోగము .

o యోగదా   :-   అమ్మవారు తన చైతన్య శక్తి వలన జీవులు అందరికీ అనుభవించు యోగము కలుగజేయు చున్నది .

o యోగ్యా   :-   సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మకు అన్ని శాస్త్ర సంబంధిత విషయములు తెలుసు కావున ఎవరు పొందవలసిన వారో ఎవరు అనుభవించదగినవారో వారికి ఇచ్చి సంతోష పరచుచున్నది .

o యోగానందా   :-    అమ్మను ఆరాధించు భక్తులకు కేవలము ఐహిక సంపదలే గాక , భక్తులైన వారు జ్ఞానమును పొంది తద్వారా ఆనందానుభూతి అనుభవిస్తూ మోక్షము పొంది జ్ఞానానందం అనుభవించుటయే యోగానందము .

o యుగంధరా   :-   జీవులను, ప్రపంచమును రెంటిని సమ దృష్టితో చూస్తూ భారము వహించు తల్లి అమ్మవారే . పిండాoడము నుండి బ్రహ్మాండము వరకూ జీవ జగత్తు నంతటినీ కాపాడు చున్నది . సంపూర్ణ జ్ఞానవంతురాలు అయిన అమ్మ యోగిని దేవి యై యోగ్యులైన వారికి వారి కర్మ ఫలాను సారము వారి కోరికలను తీర్చి యోగానందము పొందును .

         యుగము అనగా కాలము . అమ్మవారు కాల స్వరూపిణీ . పగలు రాత్రి కలిసిన ఒక దినము ను యుగము అందురు . అటులనే ఉత్తరాయణము ,దక్షిణాయణము పూర్తయిన ఒక సంవత్సరము గావున అప్పుడు యుగాది అందురు . ఈ కాలచక్రము ధరించుటచే అమ్మ యుగంధర అయినది .

        శ్రీ చక్రము నందు బిందు స్వరూపిణిగా నున్న అమ్మవారిని పరాత్పర యోగిని దేవి అందురు . మన శరీరములో నున్న షట్చక్ర కుండలినీ వ్యవస్థ యందు ఆజ్ఞాచక్రము నందు 16 మంది అక్షర నామ దేవతలు , ఆ దిగువ చక్రము నందు 12 మంది , ఆ తరువాత 10  మంది , ఇంకా దిగువన ఆరుగురు , ఐదవ చక్రమున నలుగురు , చివరి మూలాధార చక్రము నందు ఇద్దరూ మొత్తము 50 మంది అక్షర ధాతు దేవతలను యోగినీ దేవతలు అందురు .

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |

సర్వధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ || 130 ||

o ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ   :-   కాల రూపములో యుగంధరాదేవి గా నున్న అమ్మవారు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు కలిగి పరమేశ్వరుడు ప్రళయానంతర సృష్టి ప్రారంభించుటకు కావలసిన ప్రేరణ శక్తి అమ్మ చైతన్య స్వరూపము వలననే పరమేశ్వరుడు సృష్టి సాగించి లోకాలన్నీ నడుపబడుచున్నవి . అయితే  మూలకారణ శక్తి అమ్మవారే గావున ఆమె పరాశక్తి స్వరూపిణి . ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులకు చైతన్య శక్తి తోడగుటచే అమ్మవారు శివశక్తి ఐక్య రూపిణిగా ఉండి ప్రపంచం నడుస్తున్నది .

           శ్రీ చక్ర పరంగా భావన చేసినచో శ్రీచక్రంలో త్రికోణాకారపు మధ్య లో బిందువు శివశక్త్యాత్మకం కాగా త్రికోణం , పూర్ణముగా శక్తిమయం . శక్తి ఆధారంగానే బిందు స్వరూపము ఏర్పడినది .

       అమ్మవారిని విగ్రహ రూపముగా భావించిన శిరస్సు నుండి కంఠము వరకు ఇచ్ఛాశక్తి , కంఠము నుండి కటి ప్రదేశము వరకు జ్ఞాన శక్తిగానూ , అచటి నుండి ప్రపంచము నడిపే క్రియాశక్తి పాదముల వరకూ వ్యాపించిన త్రిశక్తిరూపిణీ .

o సర్వధారా   :-   సకల లోకములకూ ,సర్వజీవులకూ ఆధారమై సక్రమముగా నడిపించు అమ్మవారు .

o సుప్రతిష్ఠా   :-   బండి చక్రము నడుచుటకు  ఇరుసుకు గల ప్రాధాన్యం ఎట్టిదో అదేవిధంగా అమ్మవారు ప్రకృష్టం  గా ఉండి బాగా సజావుగా ఉండునట్లుగా ప్రపంచమును నడిపించు చున్నది  

       ఉదాహరణకు సముద్రము ఉండుటవలన కెరటాలు ఏర్పడుచున్నవి .          

                                         కెరటము వలన సముద్రము    ప్రతిష్ఠితము కాదు కదా !

o సదసద్-రూపధారిణీ  :-   సత్ అనగా కార్యము . ఒక పని ఉనికి కలిగినది . అసత్ అనగా ఆ పనికి కారణమైన ప్రేరణ శక్తి . సత్ అనగా మనకు కనిపించునది . అసత్ కనబడనిది . అయితే ఈ సత్ మరియు అసత్ అను కార్యకారణ రూపిణిగా నుండి ప్రపంచము నడిపించు చున్నది  . అమ్మవారు దృశ్య రహిత గా యుండి సత్ చిదానంద రూపిని యున్నది . రెండు స్వరూపములు ఆమెవియే .

అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ |

ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా || 131 ||

o అష్టమూర్తి   :-   వేదాంతతత్వ ప్రకారము ఈశ్వరుడు అష్టవిధమూర్తిగా ఉండి  ప్రపంచమును నడిపించు చున్నాడు . అందుకే జగమంతా శివమయం అంటారు . శివుని అష్ట మూర్తుల పేర్లు 8 ఈ విధముగా ఉన్నాయి . అలాగే ప్రకృతిలో కూడా అష్టవిధ శక్తులను నిత్యము ప్రజలు దర్శించి తద్వారా లబ్ధి పొందుతూనే ఉన్నారు .అయితే ఈ ప్రకృతి శక్తులన్నింటినీ శివుని అష్టమూర్తి శక్తులు నియంత్రించు చున్నవి .

   శివుని అష్ట మూర్తులు    - ప్రకృతి శక్తులు

 1 శర్వుడు      -             భూమి

2 భవుడు.       -             జలము

3 రుద్రుడు.      -              అగ్ని

4 ఉగ్రుడు.       -              వాయువు

5 భీముడు.     –              ఆకాశం

6 పశుపతి.     -               యాజమాన

7 మహాదేవ.     -             చంద్ర

8 ఈశాన.         -             సూర్యుడు

           అయితే శివ స్వరూపాలైన అష్ట శక్తులు అమ్మవారి చైతన్యశక్తి ప్రేరణ వల్లనే వాటికి స్పందన జనించి కార్య కారకములగును . మనలో కూడా పంచ ప్రకృతి శక్తులతో పాటు మనో బుద్ధి అహంకారములు కలిసి అష్టమూర్తి తత్వము గోచరము కాగా దీనిని బట్టి జీవ ఈశ్వరు లకు అభేదము అని తెలియ దగును . మనసు – చంద్రుని , బుద్ధి – సూర్యుని ,  అహం – జీవ చైతన్యము నూ ప్రతిఫలింప జేసి అమ్మవారే దయాంతరంగయై మనలను నడిపించుచున్నది .

       శ్రీవిద్యోపాసకులు అయిన  కాళిదాసు మహాకవి అమ్మవారి యొక్క 8 స్వరూపాలను అష్ట మూర్తులు గా ప్రతిక్షే పించారు . అవే ఇవి 1 లక్ష్మి 2 మేధ 3 పుష్టి 4 ధర 5 గౌరీ 6 తుష్టి 7 ప్రభా 8 సరస్వతి ( ప్రాణశక్తి ) .

o అజా   :-   అమ్మవారు ఆదిశక్తి గనుక ఆమెకు పుట్టుక లేదు . ప్రపంచము నంతటిని ఆమెయే నిర్వహిస్తున్నందున ఆమెకు కాల ప్రమాణము లేదు . మానవులకు ఎన్నో యుగాలు గడిచినప్పటికీ అసలు ఈ జగత్తు పుట్టుక ఎవరికీ తెలియదు . అమ్మవారు భూమి జల అగ్ని వరుసగా నలుపు తెలుపు ఎరుపు త్రివర్ణ తత్వముతో తేజో రూపిణిగా ఉండునని ఉపనిషత్తుల యందు వర్ణించారు  .

o జైత్రీ    :-   అమ్మవారు అపరాజితాదేవి కావున ఎల్లప్పుడూ జయమునే పొందును . అజ్ఞానాన్ని జయిచునది .

o లోకయాత్రా విధాయినీ    :-   అమ్మవారు లోకంలోని మానవులందరినీ వారి జీవన యాత్రను ఒక విధాన పద్ధతి ప్రకారం నడిపించు చున్న ది .

o ఏకాకినీ   :-   అష్టమూర్తి తత్వ రూపిణి అయిన అమ్మవారు ఈ ప్రపంచంలోని మానవాళి జీవనయాత్ర ఒక క్రమపద్ధతిలో తాను ఏకాకిగా యుండి అందరి అవసరములను తీర్చు చున్నది .

o నిర్ద్వైతా   :-   అనగా రెండవది లేనిది . మాయా జనితమైన ప్రపంచమును చూస్తూ అజ్ఞాన భావనతో నుండి ఈ జీవితమే సర్వస్వం అనుకొని భగవంతుని విస్మరించి తాను అనుభవిస్తున్న సంపదను తన ప్రతాపం అనుకొని మురిసిపోవు వారంతా ఒక విధమైన భ్రాంతిలో జీవిస్తారు . అమ్మను ఆరాధించు భక్తులు అమ్మ శక్తి ప్రభావంతో కించిత్ జ్ఞానముతో ఆలోచన చేసిన వారికి సత్యం బోధపడి బ్రహ్మసత్యం జగన్మిద్యా అని అర్థమై బ్రహ్మ తత్వం ఒక్కటే యదార్థమని తెలుసుకుంటారు .

o ద్వైతవర్జితా  :- ఎవరైతే ఉపాధులు , సచ్చిదానంద స్వరూపం వేరు అను ద్వైత భావనతో ఉందురో వారు అమ్మతత్వము గ్రహించలేరు . అట్లుగాక జీవ  శివ ఏక రూపము లేనన్న భావన కలగాలంటే ఉపాదులను విడనాడి ఏకత్వ రూపిణి అయిన అమ్మ ఆరాధనే శరణ్యం . ఏలన పూల చెట్టుకు పూసిన మొగ్గ , మొగ్గ  పువ్వు వేరు కాదు కదా  ? మొగ్గ వికసించి పుష్పం అయినట్లు జ్ఞానోదయం అయితే ఏకత్వము బోధ పడును . ఈ విధముగా అమ్మవారు భక్తులలో  ద్వైత భావం పోగొట్టి అద్వైత వర్జిత అయినది .


అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ |

బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా || 132 ||

o అన్నదా   :-  లోకంలో సర్వజీవులకు అన్నమును ఇచ్చు అన్నదాత సూర్య భగవానుడే . అయితే ఆ సూర్యునికి ఆకర్షణ శక్తి ప్రకాశ శక్తి సవితా దేవి రూపంలో అమ్మవారే ఇచ్చుచున్నది . ఎవరైతే నిత్యము సూర్యుని ఆరాధింతురో వారికి సకల సంపదలు ప్రాప్తించి మృష్టాన్న భోజనం లభించును . మహాభారతంలో వనవాసం వేళ ధర్మ రాజు సూర్యుని ప్రార్థించి అక్షయపాత్ర సాధించి ముని గణాల ఆకలిదప్పులు తీర్చెను కదా !

o        సిద్ధమైన అన్నము నిష్ఠ పూర్వకముగా భుజించిన స్థూలముగా కొన్ని మాలిన్యములు విసర్జించబడి సూక్ష్మ శక్తులు మనశ్శక్తి పెంచి జ్ఞానాభివృద్ధి చేయును . అయితే అన్నము నందు మూడు విధాలైన దోషములు ఉండును 1 జాతి దోషము : సహజముగా శుచి శుభ్రతలు లేక వండు ఆహారము . ఆహారములో ఉల్లి ముల్లంగి వాడుట నిషేధము . నిలబడి తినుట పనికిరాదు .                                                    2  అపాత్రియాదోషము :  పాలు తదితర పదార్థములు రాగి పాత్రలు వాడినా విషతుల్యం అగును .                         3 నిమిత్త దోషము  : మనము ఉపయోగించు కూరగాయలు మరుభూములలో  పండించినవి దోష కారకములు . ఈ దోష నివారణ కు మనము బుజించుటకు ముందే  ఆహారము భగవంతునికి నివేదించిన దోషము పోవును .

o వసుదా   :-   అమ్మవారు ఐశ్వర్య ప్రదాయిని . అమ్మ సమకూర్చిన ఆహారం  తిని సంపదలు అనుభవిస్తూ అమ్మ దయ వల్లనే కలిమి కలిగి సంతృప్తి చెంది ఎవరైతే అమ్మను ఆరాధింతు రో వారికి మోక్షమును ఇచ్చు తల్లి .

o వృద్ధా   :-  అమ్మవారు సృష్టికి పూర్వము నుండి సనాతనము గా ఉంటున్న పెద్ద ముత్తయిదువ .            ఈ భూమి నందుండు నర మానవాళికి అన్నము ఐశ్వర్యము ఇచ్చి వారిని వృద్ధి కారకులుగా చేయు తల్లి . తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుకొంటూ వారి అభివృద్ధి కాంక్షించు తల్లి .

            పూర్వం ఆంధ్రదేశము ను పరిపాలిస్తున్న ఒక రాజు ఆస్థానము నందు సకల వేద విద్యా పండితుడు బ్రాహ్మణుడు రాజుకు ముఖ్య సలహాదారుగా యుండి రాజు అభిమాన పాత్రుడిగా ఉండేవారు . అలా కొంతకాలం గడవగా ఆస్థానంలో ఉన్న ఇతరులు పండితుని ఎడల అసూయ చెంది రాజుకు అతనిపై ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పగా రాజు అవి నిజమని నమ్మి ఆ పండితుని పై రాజద్రోహం నేరం మోపి రాజ్య బహిష్కరణకాదేశించగా ఆయన మిక్కిలి ఖిన్నుడై తన గృహమున కే గి ఆయన నిత్యము పూజించు అమ్మవారి చిత్తరువు పూజా సామాగ్రి తీసుకొని భార్యతో పాటు రాజ్య సరిహద్దులు దాటి అడవి లో ప్రవేశించెను . అంతట అలసట చెందిన వారు దూరముగా ఒక కుటీరము వుండుట గమనించి అచటకేగు నంతలో ఒక వృద్ధ ముత్తయిదువ వారికి ఎదురేగి మావారు అతిథులు లేకుండగా భోజనము స్వీకరించరు . గనుక మీ దంపతులు అతిధులుగా విచ్చేయ మన అంతట సంతసించి కుటీరమునకేగ  అందున్న ఆమె భర్త విషయమేమని అడుగగా , యదార్థ మంతయు వివరించి ప్రక్కనే ఉన్న సువర్ణముఖి నది యందు స్నానమాచరించి సూర్యునికి అర్గ్య ప్రధానము గావించి భోజనము పూర్తి చేసుకొని విశ్రాంతులవగా ఆ ముసలి దంపతులు మీకు వీలైనంత కాలము ఉండమనిరి .

    కొంతకాలమునకు రాజు తన తప్పు తెలుసుకొని పండితుని తిరిగి రావిoప తలచి తానే వెతుకుటకు బయలుదేర చారుల వలన ఆచూకీ తెలిసి వెళ్లి ఆహ్వానించి తీసుకొని వెళుతుండగా వెనుదిరిగి చూచినంత లో కుటీరము మాయమైనది . ఆశ్రయమిచ్చిన వృద్ధ దంపతులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా పండిత దంపతులు భావించి నారు . రాజు తదనంతరము ఆ దంపతులను సత్కరించి పండితుని కొలువు లోనే ఉంచుకుని తగిన సంబారములు సమర్పించెను . ఈ కథ భువనవిజయ కవులలో ఒకరైన దూర్జటి శ్రీకృష్ణదేవరాయలు వారికి విన్నవించిన ట్లు ప్రతీతి . ఆ కుటీరము నందున వృద్ధ దంపతులు జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామి అని చెప్పినారు .

o బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ  :-  అమ్మ ఆరాధన చేస్తూ అహం బ్రహ్మాస్మి అను తత్వచింతనలో లీనమై సోహo జపంతో నిమగ్నమై హంస మంత్రం పఠిస్తూ అనగా అజపా గాయత్రీ మంత్ర సాధనతో జీవుడు బ్రహ్మతో ఐక్యము చెందినపుడు అమ్మవారి సోహం మంత్రం ప్రభావమే అగుటచే అమ్మ బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ అయినది . అనగా అమ్మవారు సోహoమంత్ర స్వరూపిణి .

o బృహతీ   :-   అనగా అతి పెద్దదైనది . అనగా బృహత్ జృంభణము. జీవాత్మ పరమాత్మతో కలియుట .

          పలువిధములైన వైదిక చందో రూపములలో తొమ్మిది అక్షరములతో ప్రతి పాదమునందు ఉండి 4 పాదములు కలిగిన కవితా రూపమును బృహ తీ ఛందస్సు అందురు . మరొక భావన లో విశ్వావసు విద్యా వేది హస్తమందున్న వీణ పేరు బృహతీ .

o బ్రాహ్మణీ   :-   బ్రాహ్మణుని సతీమణి బ్రాహ్మణి . బ్రాహ్మణుడు అనగా నిరంతరము తపో నిష్ఠలో నుండువాడు . బ్రాహ్మణుడు ఐదు లక్షణాలు కలిగి ఉండవలెను . ఒకటి ధర్మము రెండు వేదము మూడు జ్ఞానము నాలుగు తపస్సు ఐదు పరమాత్మ అందుచే అమ్మవారు బ్రాహ్మణి గా తపోధర్మవేదజ్ఞాన స్వరూపిణి అయినది .

o బ్రాహ్మీ  :-   అనగా పరబ్రహ్మస్వరూపిణి . బ్రహ్మ దేవుని సతీమణి సరస్వతి దేవి కాగా మాతృకా దేవతలను కూడా బ్రాహ్మీ  దేవతలు అందరు .

o బ్రహ్మానందా   :-   పరబ్రహ్మ ఆత్మయందు లీనమై ఆత్మానందం పొందు తల్లి .

o బలిప్రియా     :-   త్యాగమును నివేదనగా ఇష్టపడు తల్లి . ఎవరైతే అహం వీడి మమకారము వీడి అమ్మను శ్రద్ధగా ఆరాధింతురో వారి ఎడల ప్రియముగా ఉండు తల్లి . బలి చక్రవర్తి  తన సర్వస్వం దానము చేయుటకు ఇష్టపడి త్యాగశీలి అనిపించుకొనెను .

     మరియొక భావనలో పరిశీలించినచో దేవతార్చన తదనంతరము మనము తయారు చేసుకున్న ఆహారము అమ్మవారికి నివేదన చేసి అందుండి కొంతభాగము తీసి మనకు దుష్టత్వము కలుగజేయు పాప శక్తులను తృప్తిపరచి మన జోలికి రాకుండా ఉండుటకు కాకులు కుక్కలు అను జంతువులకు బలి  బుక్కులకు ఆహారము ఇచ్చిన తరువాతనే మనము భుజించాలి .

     సత్కర్మలు చేయు తలంపుతో కొందరు చండీయాగము చేయుదురు .ఆ యాగాన్ని కుండములందు దేవతలకు ఇచ్చు హవిస్సు కాక భూత కోటిని తృప్తి పరచుటకు కుష్మాండ ము ( గుమ్మడికాయ ) మారేడు , కాయలు , చెరకు ,కొబ్బరి కాయలు అగ్నికి ఆహుతి చేసిన దుష్టశక్తుల బారి నుండి తప్పించుకునవచ్చును .


భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా |

సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః || 133 ||

o భాషారూపా   :- అనగా వైఖరి రూపము మాత్రికా రూపిణి . ఈ విశాల విశ్వంలో జనులు అనేక అనేక భాషలలో సంభాషించుట లిపి కలిగిన భాషలలో అక్షర రూపంలో వ్రాసుకొని గ్రంథస్థము చేసుకుంటున్నారు . ప్రపంచ ప్రజలంతా ఉపయోగించు భాషలకు మూలము దేవనాగరి లిపి అయినసంస్కృతమే . సనాతన కాలం నుండి ఈ భాషలోనే అనేక శాస్త్ర సాంకేతిక తాళపత్ర గ్రంథాలు వెలువడినాయి . విభిన్న భాషా రూపములు ఉండుట చేత ఎవరి మాతృ క ల తో వారు మాట్లాడుకుంటూ భిన్న వైఖరులు అవలంబిస్తున్నారు ఏ భాషకైనా మూల దేవత లలిత మాత యే . లక్షలాది వేదమంత్రములు దేవనాగరి లిపిలో అమ్మను కీర్తించుట వలన ఆమె వేదమాత అయినది . మన తెలుగు భాషలో నున్న యాభై అక్షరములు అమ్మ శ్రీచక్ర ఆవరణలోని దేవతా స్వరూపాల నామా అక్షరము లే .

o బృహత్సేనా   :-   పెద్ద సైన్యము కలది . భండాసుర వధ ప్రస్థానం మందు అమ్మ అమ్మ అనుచరగణ ములకు 64 కోట్ల సైన్యముతో యుద్ధము చేసినది శ్రీవిద్య వేదముల యందు చాలా ఎక్కువగా మంత్ర శక్తులు కలవు . వాటి యందు అపూర్వ శక్తులు దాగియున్న వి . ఈ మంత్రము లన్నియు అక్షర శక్తులు అయినందున ఎవరు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసించిన ఆయా దేవతల మంత్ర శక్తులు అన్నింటికీ అధినాయకురాలు అమ్మయే ఆ మంత్ర శక్తులు అన్నియు అమ్మ సైన్య శక్తులుగా భావన .

o భావాభావ వివర్జితా   :- ప్రపంచములో అనేక భాషలలో శాస్త్ర గ్రంథాలు మత గ్రంథాలు కలవు ఎవరు ఏ భాషా శాస్త్రమును అనుసరించి నా అమ్మకు ఆ భాష యందు గాని దానిని అనుసరించి వారి యందు గాని ఎలాంటి అనుకూల వ్యతిరేక భావనలు లేక అందరిని సమన్వయ దృష్టితో చూస్తూ వారికి ప్రతి ఫలాలు అందించు కరుణామయు రాలు . అమ్మకు ఏ భాష యందు నిర్దేశత్వం స్వభావము లేదు  . అమ్మకు కలిమిగల వారు లేనివారు అని తను తేడా లేక కేవలము వారి ప్రజ్ఞ పాఠ వములను జ్ఞానమును పరిగణించి సహకరించు ను . అందుకే అమ్మ శూన్య స్థితి నందుండు ప్రజ్ఞను బ్రహ్మ స్వరూపిణి అను ఆలోచనాత్మక నామముతో సంభవింతురు .

o సుఖారాధ్యా   :-   సుఖముగా ఆరాధన చేసుకొనుట కు అనుకూలమైన అమ్మ లలితాదేవి . ఎవరికి వారు ఆడంబరము లేక యధాశక్తి అమ్మను హృదయమందు నిలుపుకొని ప్రేమ భావనతో తృప్తిగా సుఖవంతమైన సంతోషముతో పూజించు వారి యందు అపారమైన దయ కలిగియుండును పూర్వకముగా పూజించవలెను అని చింత కలిగియుండుట ముఖ్యము . అది ఎట్లన రాముడు సముద్రంలో వారధి నిర్మించ తలపులో నుండా ఒక విడత కూడా సాయపడు నెపాన ఇసుకలో పొర్లి శరీరానికి అంటిన ఇసుకను సముద్రాన దులిపి రామచంద్రుని అభినందన వేలి గుర్తులను వెన్నుపై నుంచుకుని యుగాలుగా చూపిస్తున్నది అది ఏ ఉడుతాభక్తి అంటే .

o శుభకరీ   :-   ఎవరైతే పరతత్త్వ చింతనతో సకల ప్రజలకు శుభములు ప్రాప్తించాలని మంగళకర మనసుతో మంచి స్వభావముతో ఉన్నవారికి ఎల్లప్పుడూ శుభములు చేకూర్చు తల్లి .

o శోభనా సులభాగతిః   :-  అందరికీ అమ్మ అందరికీ మేలు చేయు శుభ స్వభావి . భక్తుల పరంగా చూసినచో ఎవరైతే అమ్మ అనుష్టాన నిమగ్నులై  పరతత్వ చింత కలిగి ప్రజలందరూ రూ శుభ శోభలతో ఉండాలని అని కోరుకుందురో అట్టి మంగళ కారులకు సులభముగా అమ్మ అనుగ్రహ ప్రాప్తి కలుగును .

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా |

రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||

o రాజరాజేశ్వరీ.  :-   అమ్మ భువనేశ్వరి దేవియై ఊర్ధ్వ అధో లోకము లైన 14 లోకములకు లోక పాలిని అయి సమస్త రాజులు ఆయా లోకాధి పతులు దేవతల రాజైన ఇంద్రుడు పతులు దేవతల రాజైన ఇంద్రుడు దిన రాజు సూర్యుడు నెలరాజు చంద్రుడు ఐశ్వర్య రాజు కుబేరుడు మొదలగువారు అమ్మను పూజిస్తూ త్రిమూర్తుల పూజలందుకొని రాజులకే రాజై ఆమె ఆజ్ఞానుసారము అందరూ ఉందురు కావున రాజరాజేశ్వరి అయినది

o రాజ్యదాయినీ   :- సర్వ మంగళ రూపిణి అయిన అమ్మను రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన రాజులు సమరమునకేగున్నప్పుడు ముందు ఎవరైతే భక్తితో సేవింతురో వారికి విజయం చేకూర్చి రాజ్య విస్తరణకు తోడ్పడు తల్లి .

o రాజ్యవల్లభా :-  సకల లోక పాలకురాలు అయిన తల్లి అయ్యా లోకాలనేలే రాజులకు వల్లబురాలై (రాణియై ) భాసించు చుoడును .

o రాజత్కృపా :-   గురు అనుగ్రహంతో రాజ్యలక్ష్మి మంత్రోపాసన చేస్తూ అమ్మ అనుగ్రహం కొరకు షోడశ విద్యలతో ఆరాధించినవారికి రాజకలతో భోగ మోక్ష కర్రీ విద్య ద్వారా అమ్మ కృపా కటాక్షములు ప్రసరింప చేయును . ఆ విధముగా రంజకత్వము కలిగించి అందరినీ ఆనందమయుల చేయును .

o రాజపీఠ నివేశిత నిజాశ్రితాః :-   సత్యసంధత తో కల్మష రహి తులు గా అమ్మ ను ఆశ్రయించు శ్రద్ధా శక్తులు గల భక్తులు ఎవరైతే మణిపుర సింహాసనాదీశ్వరి ని కొలుతురో వారికి సకల సౌభాగ్యములు కలిగించును .


రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ |

సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా || 135 ||

o రాజ్యలక్ష్మీః  కోశనాథా  :-  రాజ్యలక్ష్మి మంత్రోపాసన ప్రాబల్యంతో రాజులు రాజ కళ సంతరించుకుని ప్రజలందరి యందు సమ భావన కలిగి ఉండి సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ నిరంతర అమ్మ చింతన కలిగినవారికి సకల శక్తుల నోసగును .

o చతురంగ బలేశ్వరీ :-   రాజులకు రాజ్యమును ఐశ్వర్యమును వారి కోశాగారమును యుద్ధరంగమున ఉండు సైనిక పాటవమునకు సర్వ శక్తులను ప్రసాదించి వారికి బలము చేకూర్చే తల్లి .

o సామ్రాజ్యదాయినీ   :-  త్రైలోక్య అధినేత అమ్మ భువనేశ్వరీదేవి హద్దులు లేని అపరిమిత అఖండ భూమండలానికి అవధిలేని అధినేత . ఈ విధమైన సామ్రాజ్యానికి పరమేశ్వరుని పరమేశ్వరి నీ మాత్రమే మే సామ్రాట్ అందురు . శ్రీమహావిష్ణు స్వరూపాన్ని ఈ విశ్వమంతా వ్యాపించి నందున విరాట్ రూపము అందురు అలాగే భక్తి సామ్రాజ్య పరంగా తపోనిష్టాగరిష్టులను వారి మంత్రబలం తో స్వయం ప్రకాశంగా ఉన్నవారిని స్వరాట్ పురుషులు అందురు .

            అదే విధముగా సకల ఐశ్వర్య సంపద చతురంగ బల సన్నద్దులు రాజులు గా నున్నవారు గురువు ద్వారా అమ్మవారి కి సంబంధించి సకల మంత్ర విద్యలు అభ్యసించి దీక్షతో పరిపూర్ణులైన రాజులను కూడా సామ్రాట్ లందురు . అమ్మ రాజ్యలక్ష్మి కృపా కటాక్షములు లతో అఖండ భూమండలానికి సముద్రమే సరిహద్దుగా గల సామ్రాజ్యానికి చక్రవర్తి కాగలరు వీరికి బోధ చేసిన గురువులు ఆత్మ సామ్రాజ్యాధి యోగులై బ్రహ్మవేత్త లగుదురు వారే స్వరాట్ ప్రకాశకులు .

o సత్యసంధా   :-  సంకల్ప బలముతో సత్యవాక్కు కు లోబడి ఉండుట . సత్యవాక్కు వ్యర్ధము కాక రామాయణ మందు శ్రీరామచంద్రుడు ఉత్తమ సత్యవాక్య పరిపాలకుడు గా ప్రసిద్ధి చెందెను . అందుకే రాము ని శ్రీరామో లలితాంబికె అని కీర్తి . అలా సత్యమునకు కట్టుబడు వారికి అమ్మ సదా రక్షణ నొసగి సత్యసంధ స్వరూపిణి అయినది .

o సాగరమేఖలా   :-   అమ్మ భువనేశ్వరి దేవి భూమిపైనున్న, క్రిందనున్న సమస్త లోకములను పరిపాలన చేయు మహా రాజ్ఞి కావున పై లోకములకు అదో లోకములకు మధ్య భూమండలం ఉండి చుట్టూ సముద్రం ఆవరించి అమ్మ కటి స్థానమునకు వడ్డాణము వలె నుండి తన భక్తి సామ్రాజ్యం విస్తరించుకున్నది .

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ |

సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ || 136 ||


o దీక్షితా   :-   సత్య సాంగ్ సత్యసంధ స్వరూపిణి అయిన అమ్మ తనను ఆశ్రయించిన వారిని బద్ధ కంకణురాలై వెంటనే రక్షించునది . ఎవరైతే గురూపదేశం తో శ్రీ విద్య మంత్రోపదేశం దీక్ష తీసుకుని నిరంతర ధ్యానము  లో ఉందురో వారిని దీక్షితులు అందురు . అమ్మ తన మంత్ర కిరణ శక్తితో వారిని ప్రకాశవంతులుగా చేయుటచే వారు మంత్ర మహా స్వరూపముతో ఉన్న వారై అమ్మను ఆవహించి ఉందురు . అట్టివారు బవ బంధ విమోచన కలిగి ముక్తిని పొందెదరు .

ధీ అనగా జ్ఞాన ప్రవేశము క్షితా అనగా పాప నాశనము . అనగా అమ్మ ఆరాధనతో జ్ఞాన ప్రవేశము కలిగి పాప రాశిని ధ్వంసము చేయు తల్లి దీక్షిత .

o దైత్యశమనీ   :-   సర్వలోక పాలకురాలు అయినా భువనేశ్వరి దేవి క్రూరులైన అనేకమంది రాక్షసులను సంహరించి అటు దేవతలను ఇటు మానవులను రుషులను కాపాడి వారికి ఏర్పడిన కష్టములను తొలగించినది

o సర్వలోక వశంకరీ   :-   14 ఊర్ధ్వ అధో లోకములను తన వశం చేసుకొని ఆయా లోక అధినేతలు తన ఆజ్ఞలకు లోబడి ఉండునట్లు చేసుకొని తల్లి .

o సర్వార్థదాత్రీ సావిత్రీ.  :-    సృష్టి ప్రారంభ సమయంలో అమ్మ ఆత్మ ఒక్కటే ఉన్నది అదియే చిత్ అనియు బ్రహ్మ మనీ యు జ్ఞాన మనియు అందురు . ఆత్మ యొక్క సహజ శక్తిని మాయ అందురు . ఈ మాయ చైతన్యముతో కలిసినప్పుడు ఈ జగత్తు ఏర్పడుతున్నది . అప్పుడు సూర్య చంద్ర సూర్య చంద్రాదులు కూడా ఏర్పడి వారి కార్యనిర్వహణ చేయుదురు . సూర్యారాధన అంటే అమ్మ ఆరాధనయె . ఆ సూర్యుని పుత్రిక యే సావిత్రి దేవి .

సచ్చిదానంద రూపిణీ  :-  ఆత్మ నుండియే జ్ఞానము ఉద్భవించును ఈ జ్ఞానము మాయా శక్తి వలన పూర్వకర్మ పాశముల వలన సృష్టి కోరును అది ఏ పరతత్వము . ఆ చిదానంద తత్వం రూపిని యే అమ్మవారు . ఆమె పరబ్రహ్మస్వరూపిణి . అనగా ప్రపంచాన్ని సృష్టించగలదు మరియు లయము చేయనుసావిత్రి దేవిని మధ్యాహ్న సంధ్యాకాలంలో స్తోత్రములతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలెను . ఈ తల్లి అందంగా బంగారు వర్ణముతో ఉండి వేద స్వరూపిణియై బ్రహ్మ బ్రహ్మ తేజముతో వెలుగొందుతూ భక్తుల కోరికలు వెనువెంటనే తీర్చును .


దేశకాలాఽపరిచ్ఛిన్నా, సర్వగా, సర్వమోహినీ |

సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ || 137 ||

o దేశకాలాఽపరిచ్ఛిన్నా.  :- సచ్చిదానంద  స్వరూపిణి అయిన అమ్మవారు సకల భువనములకూ ఆధిపత్యం వహిస్తున్నందున ఆమె స్థానమునకు ఎల్లలు లేనిదై అన్ని ప్రదేశములందు, అన్ని కాలాదులు యందు వ్యాపించి ఉండును . సర్వం దేవి మయం జగత్ అన్నట్లు కాలావధి లేనిదై ఉండును .

o సర్వగా   :- ఎల్లప్పుడూ ప్రతిచోటా సర్వలోకముల యందు ఉండునది . అమ్మను శ్రీ చక్ర విద్యారాధన ద్వారా నిర్మల మనసుతో ప్రయత్న పూర్వక సాధన ఒక క్రమపద్ధతిలో సిద్దాంత శాస్త్రయుక్తంగా ఆచరించు భక్తులను తనలో లీనం చేసుకొనును . అమ్మను ఏ దినము ,ఏ తిధి కలదో ఆ తిధి ప్రకారము అమ్మ స్వరూపాలైన ఆయాతిధిదేవతలను ఆరాధింప వలయును .ముఖ్యముగా వసంత నవరాత్రుల యందు , శరన్నవరాత్రుల యందు ప్రతి శుక్రవారముల యందు అమ్మను ధూప దీప నైవేద్యములతో యధాశక్తి పూజలోనర్చి అమ్మ కృపకు పాత్రులగుదురు .

o సర్వమోహినీ   :-  ఈ జగత్తంతా అమ్మ మాయ తోనే వ్యాపించి ఉన్నది . మానవాళిలో పరమార్ధ జ్ఞానము లేక మాయా జనితమైన మోహము లో చిక్కుకొని భవబంధాలు వీడలేక బుద్ధి ప్రచోదనం లేక అనేక దురవస్థల పాలు అవుతున్నారు . మోహ యతి అఖిలం జగత్ అన్నట్లు శ్రీ చక్రము నందు త్రైలోక్య మోహన చక్రము నందు సదా సంచరించు అమ్మ ఆరాధన గావించిన వారు సహస్రారము నందున్న బిందు స్వరూపిణి పాదపద్మములు చేరి బ్రహ్మ ఐక్యము పొందెదరు .

o సరస్వతీ   :- మన బుద్ధిని సక్రమముగాను ,వక్రము గాను మన కర్మానుసారముగా మోహము కలిగించు తల్లి మోహ రూపిణి సరస్వతి . సరస అనగా ప్రసరించుట . సరస్వతీ మాత ప్రాణ శక్తి ప్రదాతయే గాక జ్ఞానప్రదాత కూడా . ఋగ్వేదములో సరస్వతీ దేవిని మంచి వాక్శక్తి కొరకు ఈ దేవిని క్రింది మంత్రముతో పఠించాలి

     “ ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ  ధీనామవిత్య్రవతు |ఓం

    తా  :- మనలో జ్ఞానశక్తిని ప్రసరింపజేసి మంచి వాక్ శక్తినిచ్చి జాగృత పరపుమని వేడుకొనుట .

                   అమ్మ సరస్వతి దేవి వాహనము హంస . ఈ హంస పాలను నీటిని వేరుపరచు సామర్థ్యము కలది .ఈ హంస రూపమే సరస్వతీ మాతగా మనలో అంతర్వాహినిగా ప్రసరిస్తూ కుండలిని విద్య యందు అమ్మ స్థావర చక్రం అయిన మూలాధారమున నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస నిబద్ధతతో హంస జపము ఆచరింప చేస్తూ మన ప్రాణ శక్తిని నిరంతరం కాపాడుతున్నది . సకల శాస్త్రముల నుండి అమ్మ దయా ప్రసరణ వల్ల విద్యలు పొందినవారే గురువు లై తమలో ఉన్న నిక్షిప్త ప్రసరణ శక్తిచే తిరిగి శిష్య బోధకులు ఆగు చున్నారు . ఇదియే జ్ఞాన ప్రసరణము .

o శాస్త్రమయీ  :-  సకల వేద ఉపనిషత్తులు ,మంత్ర , తంత్ర , వైద్యం ,శరీర , ఆయుర్వేద ,ఆర్థిక ,సాంఘిక, విజ్ఞాన , భాష మొదలగు విద్యలకు సంబంధించిన శాస్త్రము లన్నియు అమ్మ సరస్వతీ రూపములే . అందుకే అమ్మ శరీరమే శాస్త్రమయము .

                         శాస్త్ర ద్రష్టులు అమ్మ కరుణారస సామర్ధ్యశక్తి సోకి సాధారణ ఇంద్రియ శక్తులతో ఉన్నవారైనప్పటికీ ఎన్నో రహస్య శక్తులతో కూడిన గ్రంథ రచన తన ఊహా శక్తి తో లిఖించు చున్నారంటే అది అమ్మ ప్రమేయం అయిన  అమ్మ శక్తికి నిదర్శనం . వాల్మీకి ,వ్యాస , కాళిదాస ,తెనాలి రామకృష్ణుడు ఈ కోవలోని వారే . అమ్మ కటాక్షమే వీరి అభివృద్ధికి కారణం .

o   గుహాంబా  :-   గుహుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి .ఈయన కొన్ని కోట్ల దేవతాసైన్యమునకు అధిపతియే కాక సకల వేద శాస్త్ర పారంగతుడు . సంపూర్ణ జ్ఞానస్వరూపుడు .ఈయనను గురుగుహ అని కూడా అందురు .గుహ అనగా కప్పబడుట అని అర్థము .అనగా జ్ఞానముతో కప్పబడిన వారు . అంటే బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుడు .

                     ఒకప్పు డు బ్రహ్మకు వేద విద్య నేర్చుకొనుటకు గురువు అవసరం కాగా ఈశ్వరుడి సలహామేరకు సుబ్రహ్మణ్యుని  కోరి గురువుగానే ఎంచుకొని తాను అదో స్థానములో క్రింద కూర్చుని ఉండ, ఉపదేశకుడు ఎత్తయిన ఊర్ధ్వ స్థానము నందుoడి గురోపదేశము చేయవలయునను నియమానుసారం సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రి అయిన శంకరుని ఒడిలో కూర్చుని బ్రహ్మకు ఓంకార మంత్రోపాసన చేసెను. అంతటి మహానుభావుడి తల్లి లలితాంబిక . అందుకే కొన్ని చిత్రపటములలో  శ్రీ స్వామి శివుని అంకము అధిష్టించి ఉండుట కనపడును .

o గుహ్యరూపిణీ :-  సర్వాంతర్యామి అయిన అమ్మవారు ప్రకృతి శక్తుల అంతట నూ రహస్యముగా దాగియుండి చైతన్య ము రగుల్గొల్పుతున్నది . సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష సాక్షి . ప్రతి దినము అరుణోదయవేళ హిరణ్య వర్ణముతో గోచరించుచున్నది అమ్మ స్వరూపమే . అందుకే త్రికాల సంధ్య , అమ్మ ముగ్గురు దేవతా రూపములలో  ఆరాధన చేయుట రివాజు . ఉష: కాలమందు గాయత్రీ దేవిని , మధ్యాహ్న సంధ్యా కాలమందు సావిత్రి దేవిని , సాయంసంధ్య కాలమందు సరస్వతీ దేవిని పూజింతురు .

                   అమ్మ తన భక్తుల హృదయ కుహరము నందు గోప్యము గా నుండి రహస్య భక్తి ప్రేరణ కలిగిస్తూ ఉపాసన చేయించు కొనుచున్నది . అమ్మ తన భక్తులతో అనుబంధం ప్రేమ చేత పెంచుకొని ఆరాధించ బడుచున్నది  . అమ్మకు అంతఃకరణ భక్తి యన ఇష్టతగలది . అదియే గుహ్య భక్తిఅయినందున ఆమెను భక్తజనప్రియ అందురు .

              ఈమె శ్రీ చక్ర విద్యోపాసన చేయు గురుస్వరూపులoదరియందు గుహ్యము గా నుండి వ్యవహార దృష్టికి గోచరము కానిది . అందుచే అమ్మ భువనేశ్వరీదేవి బీజ మంత్ర మైన హ్రీo కారము హృదయము నందే రహస్యముగా ధ్యానించుటచే  హృల్లేఖా మంత్రమను పేర గురువులు సదా ధ్యానింతురు .అందుచే అమ్మను గురుగుహ్య  స్వరూపిణి అందురు .

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా |

సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ || 138 ||

o సర్వోపాధి వినిర్ముక్తా   :-  పరమేశ్వరుడే గురు స్వరూపుడై పంచకృత ఉపాసన  విద్య లన్నింటినీ అందరు దేవతలకూ బోధనా గురువుగా నుండి  ప్రతి భక్తుని అనుగ్రహిస్తూ యున్నాడు .  ఎవరు ఏ ఉపాధి యందు  ఉన్నప్పటికీ ఈశ్వరుడు శ్రీవిద్యోపాసకుడైనందున సర్వ భక్తజనులను ఆయన అనుగ్రహం పొందిన వారిని సహచరి అగుటచే విభేదము లేక అందరకూ ముక్తి నొసగు తల్లి .

o సదాశివ పతివ్రతా   :-  సదాశివుడు అనగా ఎల్లరకు ఎల్లప్పుడూ శుభములు కలిగించువాడు . ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు .శ్రీవిద్య మోక్ష విద్యా కారకుడు . సర్వశాస్త్ర ధురీణుడైన గురు దక్షిణామూర్తి ఈ సదాశివ రూపమే . అమ్మ పతివ్రతామతల్లి గావున గొప్ప సాధు స్వరూపురాలు , సాత్విక గుణము కలిగినది . సదా శివుని అనుచరిగా ఉండు పతివ్రతా శిరోమణి .

o సంప్రదాయేశ్వరీ   :-    సకల విధ సంప్రదాయములకూ , సనాతన ధర్మాచరణములకూ మూలములు వేదములు ,వేదాంగములు మాత్రమే . మన ఋషులు అనేక ఆచారములు , సంప్రదాయములను పరంపరానుగతముగా ప్రపంచానికి వ్యాపితము అగునట్లు చేసి మార్గదర్శకులైరీ . ప్రదాయము అనగా ఇవ్వబడినది . సంప్రదాయము అంటే మంచిగా ఇవ్వబడినది .అనగా ఆచరణ యుక్తమైనది . శ్రీవిద్యకు మూలకారకుడు ఈశ్వరుడు అమ్మచే నియమించబడిన శివ గురువులైన రుషులు అందువలన సంప్రదాయము లను ఏర్పరిచి వాటి నియామకురాలు కూడా అమ్మయే యై ఉన్నది .

o సాధ్వీ  :-   సాధుస్వభావము తో సాత్విక లక్షణములతో సంప్రదాయబద్ధమైన తల్లి జగదాంబ . ఆధ్వ అనగా మార్గము అని అర్థము . ప్రపంచములో అనేక విధములైన సంప్రదాయములు ఉండును .

 పరంపరానుగత సంప్రదాయాలను పాటిస్తూ , ఇతర సంప్రదాయాలను గౌరవిస్తూ, మసలుకొనుటే సత్సాంప్రదాయము . వేద వేదాంగములలో అనేక సంప్రదాయ పద్ధతులకు అమ్మ సంప్రదాయేశ్వరి గనుక ఆమె అన్ని సంప్రదాయములకూ మార్గదర్శియై సాద్వీ  అయినది . సాద్వీ పదములో ఈ బీజము తురీయ సంకేతము గావున మోక్ష కారకురాలు . అమ్మ శుద్ధ తత్వ స్వరూపిణి .

o గురుమండల రూపిణీ   :-  విద్య  నేర్పెడి వారంతా గురువులే . వీరు మూడు రకముల గురువులు 1 గురువు  2 పరమగురువు  3 పరమేశ్వరుడు . ఈ పై ముగ్గురు గురువులను శ్రీనాథ గురువులందరూ . వీరు గురు మండల స్వరూపులే . “ వందే గురోర్మoడలం” అన్నట్లు ఇంకా కొంతమంది విడిగా సంఘటితంగా ఉన్నారు .వీరు మువ్విధములు . 1దివ్యౌఘ  2సిద్దౌఘ 3మానవౌఘ 

      ఈ క్రింద తెలిపిన  వారంతా గురువులే వీరు 15 విధములుగా ఉందురు 1 శ్రీనాథ గురువులు – ముగ్గురు 2 శ్రీ  గణపతి – ఒక్కరూ  3పీఠములు – మూడు ( కామకోటి , పూర్ణ గిరి , జాలంధర పీఠము ) 4 భైరవ దేవతలు – ఎనిమిది మంది 5 సిద్ధ దేవతలు – తొమ్మిది మంది 6 స్కంద వటుక దేవతలు  - ముగ్గురు 7  పాదదేవతలు – ఇద్దరూ 8 ధూతి దేవతలు – పదిమంది 9 వ్యస్టదేవతలు – పదిమంది 10 – ఎనిమిది నుండి పది మంది 11 సిద్ధ దేవతలు – 64 మంది 12 ముద్రా దేవతలు – తొమ్మిది మంది 13 మండల  - ముగ్గురు ( సూర్య అగ్ని చంద్ర ) 14 మాలినీ దేవి – ఒకటి ( మాతృకా వర్ణ మంత్ర విద్య దేవత ) 15 మంత్ర రాజా విద్య – గురూపదేశ విద్య .

    అమ్మ ఆనతితో ఈ విద్యా రూపాలు అన్నింటినీ పరమేశ్వరుడు తన హృదయము నందే గురు మండలముగా ఉంచుకొనును .

కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ |

గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా || 139 ||

o కులోత్తీర్ణా  :-  నవావరణ శ్రీ చక్రము నందు దశ దళ పద్మ చక్ర స్థానముల  యందున్న యోగిణులను కులోత్తీర్ణా  దేవతలు అందరు . ప్రజలు అనేక వైషమ్యాలకు గురై వీరు నా వారు , వారు పరాయివారు అను విభజనతో ఉండి అనేక దుష్ట సంప్రదాయములు ఏర్పరచుకుని సమానత్వ భావన విడివడి కొట్టుమిట్టాడుతున్నారు . ఈ విధమైన అజ్ఞాన భావము నుండి అలాంటి వారిని దాటించి వారిలో  ఆవహించిన బహుముఖ తత్వము నశింపజేసి కులాతీతులుగా ఏకత్వ భావన రగులగొల్పు  వారే యోగినీ దేవతలు .

                కుండలిని వ్యవస్థ యందున్న షట్చక్రములను కులములు అని అందురు యోగులు శ్రీ చక్ర ఉపాసన ద్వారా శ్రీ విద్యా అభిలాషు లై  తపో నిష్ఠలో ఉన్నవారు అంతఃకరణ శక్తితో సుషుమ్న నాడి ద్వారా మూలాధార చక్రము నుండి  అగ్ని సమన్విత అమృత బిందువులను ఒక్కొక్క చక్రము నందున్న గ్రంధి ఛేదనము చేసుకొనుచూ అనగా ఒక చక్రమునుండి మరియొక చక్రము లోనికి ప్రాకి ఉత్తీర్ణత సాధించి చివరకు సహస్రారము నందున్న అమ్మ లలితాంబ పాదపద్మముల జేరి మోక్షమును పొందెదరు . ఈ విద్యా రహస్యము అంతయును జ్ఞాన సరస్వతి మాత అనుగ్రహ ప్రకారమే జరుగును .

o భగారాధ్యా  :-  భగుడు అనగా సూర్యభగవానుడు . అమ్మ లలితాంబికా దేవి సూర్యుని చే  ఆరాధింపబడు తల్లి  . మనము ప్రతి నిత్యము సూర్యమండలాంతర్గత అరుణాదేవికి నమస్కరిస్తూనే ఉంటాము .

          మరియొక భావములో విశ్లేషించిన లలితాదేవి అనుచర దేవతలలో భగమాలిని అను నామము కలదు .ఈమె సూర్యమండలావర్తితయై యుండును . హిరణ్యగర్భుడు అయిన సూర్యుని వలె ఈ తల్లి ఐశ్వర్య ప్రదాయిని .

o   మాయా  :-   అనగా అంతుచిక్కని ఒక విలక్షణ శక్తి . విష్ణువు మాయా కారకుడు . అమ్మ వారి అధికారకత్వము నకు లోబడి అనేక మాయలు ప్రకృతిలో జరుగును . ఉదాహరణకు  అతివృష్టి ,అనావృష్టి కి ఆయన మాయా ప్రభావాలే కారణము . చండ్ర నిప్పులు కురిపించు సూర్య తాపాలకు ,చల్లని వెలుగులు విరజిమ్ముతూ చంద్రకళ మార్పుకు మాయే కారణం . అంతెందుకు మనలోనే అంతర్గతంగా ఉన్న ఆత్మ చైతన్య శక్తి మనకు తెలియకపోవడమే మాయ . ఉంది ,లేదు అనే అవ్యక్త స్వరూపమే మాయ .కేవలం అవిద్య వలననే ఈ విచిత్ర భావం తెలియటం లేదు . పాము విషము దాని శరీరములో ఉండిననూ దానికి హాని లేక మనం తాకినంత మనకు హాని కలుగును .ఇది మాయా ప్రభావమే .

o మధుమతీ. :- అనగా ఆనందముగా యుండుట . అమ్మవారు అఖండ ఆనంద స్వరూపిణి , నిత్యసంతోషిణి . యోగులు తమ తపస్సు ద్వారా అమ్మ శ్రీ విద్యనభ్యసించి జ్ఞాన మధువు సాధనలో నిమగ్నమగుదురు . ఒక్కొక్కసారి మనము అజ్ఞానము వలన ఆనందము పొందలేక పోతాము అది సంతృప్తి లేకపోవడమే  కారణం . ఉదాహరణకు పువ్వులను మనము చూడగలము గాని వాటి యందున్న మధువు ( మకరందం ) మనము చూచుట లేదు . తుమ్మెద తన జ్ఞానముతో మధువు గ్రోలి ఆనందము చెందుచున్నది .

o మహీ   :-  మహి అనగా భూమండలము దీనినే వసుంధర ,రత్నగర్భ అందురు  .ఈ భూమిపైన గాని భూమి లోపల యందు గాని లభించు సమస్త విషయముల కూ మూల కారణశక్తి  సూర్యకిరణ ప్రవాహ ప్రభావమే . మనకు దొరకు చమురు ఖనిజములు పెరుగు వృక్షములు రత్నములు భూమి నుండి పొందుతున్నాము . అందుకే భూమిని భూదేవిగా ,భూమాత గా గొప్ప మహత్తు గల మహిమాన్విత గా కొలుచు కొను చున్నాము .

o గణాంబా  :-   అనగా సర్వదేవతా గణములకు అధిపతి అయిన గణపతి తల్లి . ఒకే విధమైన లక్షణములు కలిగియున్న సమూహమును గణములు అందురు . దేవతాగణములు , గురుగణములు , ఋషిగణములు , సిద్ధ గణములు మొదలైనవి .

            గణములు అనగా మంత్రములు .అనేక విద్యలకు సంబంధించిన వేదోపనిషత్తుల మంత్రములు అన్నియూ గణములే  . వీటన్నిటి విద్యా మంత్ర స్వరూపిణి అమ్మయే . పోతనగారు దుర్గ మాయమ్మ అన్నట్లు సమస్త మానవాళికి అమ్మయే . అమ్మను స్తుతించు మంత్ర స్తోత్రములన్నియు అక్షరరూపం లోనే ఉండును కావున మన అక్షరమాల యందున్న అక్షరము లన్నియు దేవతాగణము లే  .వాటి మూల స్వరూపము సరస్వతీ మాతయే .

o గుహ్యకారాధ్యా   :-   యక్షులు గుహ్యకులు అను కొంతమంది యక్ష జాతి గణాలు కుబేరుని రాజ్యములో ఉందురు . వీరు కుబేర రాజు వలె అత్యంత భక్తితో అంతర ఇంద్రియ విద్యగా నిరంతరం అమ్మను ఆరాధింతురు . అంతర్ముఖారాధన లలితా త్రిపుర సుందరీ దేవికి చాలా ఇష్టం .ఇది రహస్య (  గుహ్య ) ఆరాధన .

o కోమలాంగీ   :-   దివ్య మంగళ స్వరూపిణీ అయిన అమ్మవారు  కోమలత్వంతో సౌందర్య రూప లావణ్య గుణశీల .

o గురుప్రియా  :-   పరమేశ్వరుడే జగత్తుకు ఆది గురువై విద్యా మంత్రోపాసన పద్ధతులు పరంపరానుగత గురువులకు బోధించి జగద్గురువైన గురు రూపుడు  దక్షిణామూర్తి . దక్షిణామూర్తి అనగా సహజంగా వామ భాగము నందు ఉండు అమ్మ రూపము కనిపించక అమ్మ తేజస్సు ఆ గురు రూపునిలో అంతర్లీనంగా కలిసే ఉండును .ఈ విధమైన స్వరూపమును గుంటూరు జిల్లా కోటప్పకొండ యందు దర్శించవచ్చును . ఈ విధమైన ఐక్య తత్వ రూపము అమ్మకు ప్రియమైనది . గురువులందరూ అమ్మ ప్రీతికరులే .

స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ |

సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ || 140 ||

o స్వతంత్రా.  :-   భోగ మోక్ష కరీ అయిన అమ్మవారు సంపూర్ణ శ్రీ విద్య .అనేక తంత్ర విద్యలకు సంప్రదాయా పద్ధతుల నేర్పరుచు మూలశక్తి తానే అయినందున ఇతర దేవతా ప్రమేయములు అవసరము లేని సర్వతంత్ర స్వతంత్రు రాలు .

o సర్వతంత్రేశీ   :-   అన్ని విధములైన మంత్ర తంత్రము లకు నియామకం ఈశ్వరియే .

o దక్షిణామూర్తి రూపిణీ :-   పరమశివుడు గురు తత్వ స్వరూపుడు . ఈయన సగుణ నిర్గుణ ఏకమూర్తి . దక్షిణ అనగా బుద్ధిశక్తి , దక్షత , సమర్ధత మూర్తీభవించిన బ్రహ్మవిద్యా స్వరూపుడు . ఈయన ఆరాధనా మంత్రము ‘ ఓం శ్రీ దక్షిణామూర్తే నమః ‘ అని పఠించవలెను .

     ఒకప్పు డు సనక సనాదులను మునులు పరమశివుని దర్శనార్థం కైలాసమునకేగ ఆ సమయమున శివపార్వతులు ఇరువురు నృత్య కేళీ విలాసము లో ఉండుట గమనించి వెనుదిరిగి వచ్చుచున్నoతలో ఒక వటవృక్షం కింద ఒక ముదుసలి తపమాచరిస్తూ ఉండుట చూచినారు .అప్పుడు ఆయన అత్యంత తేజోమయ  జ్ఞాన స్వరూపుడుగా గోచరించ గా బ్రహ్మవిద్య మూర్తులైన మునులు గుర్తించి శివ పార్వతుల ఏకత్వ స్వరూపమే దక్షిణామూర్తి అని అఖండ బ్రహ్మ విద్యాపారంగతుడు అని గుర్తించిరి . ఈయన సకలదేవతా గురుస్వరూపుడు .

o సనకాది సమారాధ్యా   :- సనకసనందనాదులు మిక్కిలి శ్రీవిద్య ఆరాధన యందు సంపూర్ణ మనస్కులైన బ్రహ్మ విద్యా స్వరూపులు . సుగుణాకర బ్రహ్మముగా ఉన్న దక్షిణామూర్తిని , నిర్గుణ స్వరూపిణిగా ఉన్న అమ్మను బహుళత్వ భావన లేక ఏక స్వరూపులుగా భావించారు . ఏలయన కుడి కర్ణ భాగము కుండలముల తోనూ వామభాగం కర్ణములకు తాటంక ము ఉండుట గమనించి అమ్మ , అయ్యా = అమ్మయ్య అని నిర్ధారించుకుని రీ . వీరు శ్రీవిద్యా ప్రదాతలు .

o శివజ్ఞాన ప్రదాయినీ :-   మహామహులైన ముని పుంగవులు , గురువుల చేత ఆరాధింపబడే తల్లిని koమనము అనునిత్యం ఆరాధించు త్రిపురతీత జ్ఞానస్వరూపుడైన శివ జ్ఞాన తత్వమును అమ్మవారు మనకు లభించినట్లు చేయును  .శివ జ్ఞానము అనగా జ్ఞానము , శాంతము కలిసిన జ్ఞానబోధ .

చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ |

నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ || 141 ||

o చిత్కళా,ఽనందకలికా.  :- చిత్కళా అనగా శోభ తో కూడిన జీవకళ . మానవాళి అందరి శరీరములలో అమ్మవారు చిద్రూపిణి గా చిత్ శక్తి చైతన్యం రగులగొల్పి వారికి జీవకళ కలుగునట్లు చేసి పరమాత్మను ఆకాశమున దర్శన భావన కలిగించి , ఆనంద మయులను చేసి  సచ్చిదానంద స్థాయి కల్పించుట పరమార్థము . మనలను జాగృత పరచి తాను ఆనందించును .

              జాగృతి చెందిన చైతన్యమే కళికా అందురు . మనము భక్తితో పూజ చేసుకొను నిమిత్తము ఏదో ఒక ఆసన్న పీఠం ఏర్పాటు చేసుకుని కూర్చున్న వేళ స్థిరముగా మన మూలాధారము పీఠమునకు తగిలి అక్కడ జాగృతమైన చైతన్యశక్తి యే కళిక అందురు .

o ప్రేమరూపా.  :-   సనకాది సమారాధ్య ,చిత్కళా రూపిణి అయిన  అమ్మ  తన ప్రేమను దీపకళిక వలె చిన్నది అయిననూ తన కాంతిని ఎలా వ్యాప్తి పొందునో అదే విధముగా గా తన ప్రేమను విశ్వవ్యాపితం చేసి సృష్టికి ప్రేమ రూపిణి అయినది .

       శివ ప్రేమానురాగ రూపిణి అయిన అమ్మవారు తన ప్రేమను నిరంతరము లగ్నము చేసి పరస్పర అనురాగ మూర్తు లై  భక్తుల నిష్కపట ప్రేమతో కరుణామయు లై ఉందురు .

o ప్రియంకరీ  :-  మనం ఏ పని చేసినా మనమే సంతృప్తి పొంది ప్రీతిగా చేసి ఆనందిస్తాము . ఆ ఆనందమునకు కారణం నేను చేసిన పని వల్లే అని తలచినంతనే ,నేను అనగా ఆత్మ అని ఆ ఆత్మ యందు అంతర్లీనంగా అమ్మ ఉన్నదని గ్రహించిన భక్తులనిన అమ్మకు అత్యంత ప్రీతికరం .

o నామపారాయణ ప్రీతా   :-  ఇచ్చా స్వరూపిణి అయిన అమ్మ లలితాంబ తన నామములను ఎవరు నిరంతరము  స్మరిస్తూ ఆ నామ తత్వార్థమునెరిగి మనసున మననం చేసుకుంటూ అమ్మ ను సేవించుటను నామ పారాయణ అందురు . అటుల చేసుకునేవారు ఎల్లరునూ అమ్మ ప్రీతి పాత్రులే . ఏలననగా మనము ఉచ్చరించు మంత్రము లన్నియు మూల గురువులకు తాను ఉపదేశము చేసినవే .

                    మరియొక అర్థముతో పరిశీలించిన అక్షరమాలలో అకారము నుండి క్ష కారము వరకు గల అక్షరములు అన్నియు అమ్మ నామ అక్షరము లే . కాళిదాసు మహాకవి వ్రాసిన ఒక స్తోత్రములో స్వరూప అచ్చు అక్షరాలతో వ్యంజన రూప హల్లులతో అనుసంధానించి 20 వేల 736 అమ్మ నామముల కూర్పు సాధ్యమవును అని చెప్పినారు . అలా అక్షర సముదాయ సమన్వయ విద్యయే నంది విద్య . ఇది కేవలం జ్ఞానరూపణి శ్యామల దేవి అనుగ్రహము .

o నందివిద్యా   :-   నిరంతర శివ దర్శనము తో అమితానందము పొందువాడు నందీశ్వరుడు .

o నటేశ్వరీ   :-   నటరాజు శివునకు అభిన్నురాలు అమ్మ నటేశ్వరీ . శివ – శివాని ,                    పరమేశ్వరుడు – పరమేశ్వరి  ఎటులనో అట్లే నటేశ్వరీ అయినది . నాట్యము చేయువాడు నటుడు శివుడు అయితే నాట్యము అమ్మయే కదా . గురు స్వభావుడైన దక్షిణామూర్తి  అమ్మ అంశయే .

            నటరాజ విగ్రహములు తయారుచేయు శిల్పి శిల్ప శాస్త్ర ఆధారముగా షట్కోణ యంత్రము అనగా రెండు త్రికోణములు ఒకదానితో మరొకటి ఎట్లు మేళవించి యుండునో ఆ చక్ర మధ్య అమరిక శ్రీచక్రయంత్ర బిందు స్వరూపము కాగా ఈ రెంటి ఐక్యతారూపమే నటరాజ -నటేశ్వరీ  విగ్రహ రూపాలు . ఇవి దక్షిణాది యందున్న చిదంబర క్షేత్రము నందు కలవు .

                 శివుని నాట్యం సందర్భముగా వెలువడిన 14 సూత్రముల నుండి ( ఢమరుక శబ్దము  ననుసరించి ) నంది తన జ్ఞానము అమ్మ నామావళి బృహత్వము గా ఇరువది వేల 736 నామములు కూర్చెను . ఇదియే నంది విద్య .

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ |

లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా || 142 ||

o మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ   :-    బ్రహ్మ నిత్యం జగత్ మిధ్య అను వాక్యము ప్రకారము మనకు కనిపించే ఈ జగత్తు అంతాయు మిథ్యయే . జీవుడు మాత్రమే బ్రహ్మము . ఈ మిధ్యా ప్రపంచమంతయు అమ్మ కల్పితము వల్లనే సృష్టి జరిగినది . అప్పుడు మనిషిలో నేను నాది  అను భావన ఏర్పడి తనది కానిదానిని తనదే అనుకొని మిధ్యలో బ్రతుకుతూ భ్రాంతికి లోనై జీవిస్తున్నాడు . దీనికంతటికీ కారణ శక్తి ఒకటి ఉన్నదని తెలియుటలేదు  .

                ఒక ఇంద్రజాల ప్రదర్శనకు వెళ్ళినప్పుడు అతని విద్యా ప్రభావానికి లోనై అందరూ కొద్ది కాలము భ్రాంతిలో ఉండి తరువాత పూర్వ స్థితికి వచ్చి ఆ కల్పిత విద్యా శక్తికి అధినాయకుడు ఇంద్రజాలికుడు ఎట్లా అగునో ప్రపంచ మిధ్యా రూపానికి అమ్మయే అధిష్టానం వహించిన పరబ్రహ్మస్వరూపిణి . అదే సాధకులైన ఉపాసకులు అమ్మ తత్వచింతన తో నుండి భక్తులు నటేశ్వరీ అయిన అమ్మ తత్వ జ్ఞానమును పొంది ముక్తు లగుదురు . సాధకులు వారి అనుభవం వలన వ్యవహార కల్పితమని గ్రహించి అమ్మ అనుగ్రహముతో ముక్తి సాధకులు అవుతున్నారు . అమ్మ కరుణామయి , మోక్షప్రదాయిని .

o లాస్యప్రియా   :-  లాస్యము అనగా కోమలమైన నాట్యము . అమ్మవారికి నాట్యము నందు ఆసక్తి మెండు . అమ్మ భక్తురాoడ్రైన  రంభ , ఊర్వశి లు మంచి నాట్య ప్రవీణులు కావున వారి భక్తిప్రపత్తుల చాటుకొనుటకు అమ్మ ముంగిట నాట్యము సల్పి వందనములు అర్పింతురు .

       నాట్యములు రెండు విధములుగా చెప్పబడినవి . అమ్మకు ఇష్టమైన అమ్మ చేయు నాట్యము కోమలంగా సౌకుమార్యము గా ఉండును . శివుడు చేయు నాట్యమును ఆర్ధతీ నృత్యము లేక తాండవము అందురు . ఇది లయ కారక నృత్యము గా ఉండి కొంత రౌద్ర రూపం గా ఉండును . రెండిటి కలయిక  సమన్వయమే స్థితి ,లయలు .

o లయకరీ.  :-  నాట్య ప్రదర్శన యందు ఒకరు గీతము ఆలాపిస్తుండగా నర్తకి ఆ గీత భావాన్ని అర్థం చేసుకుంటూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత కాలంలో నృత్యము తాళానుగుణముగా హావ భావములతో లయాత్మకంగా లీనమై చేయుటయే .

          అదే విధముగా లాస్యప్రియ అయిన అమ్మవారు ఈ జగన్మాయా నాట్య ప్రదర్శన లో  క్రమం తప్పక కాలావధి లో తన అనుగ్రహ సాధకులకు లయాత్మకంగా మోక్షము నొసగి తనలో లీనం అగునట్లు చేసుకొను తల్లి . అందుచే లయకరీ అయినది .

o లజ్జా   :-   అమ్మ  లలితాంబ సకల సద్గుణ రూప లావణ్య శీల అయినందున అందుకు సహజత్వం గానే మిగుల లజ్జా రూపిణిగా ఉండును . మంచి  గుణసంపన్నులు  ,పొగడ్తలకు లోబడక కొంచెము సిగ్గుపడుతూ లజ్జ కలిగి ఉందురు . లజ్జ అనగా మనోలయoతో ముడుచు కొనుట అని అర్థము . అమ్మయే లయ కారిణి గనుక తాను కల్పించిన మోక్ష కాములను తనయందే ముడుచు ( ఇముడ్చు ) కొనునట్లు చేయును . అనగా లీనము చేసుకోనును . అధర్మ వర్తనము లేనివారు ఎల్లరును అమ్మ అనుగ్రహ పాత్రులే.

భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా |

దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా || 143 ||

o భవదావ సుధావృష్టిః.  :-    మానవాళి అనేక సంసార ఈతి బాధలతో కష్టనష్టాలతో బంధుజనుల ప్రీతితో నానావిధ లంపటములతో మరల మరల జన్మలతో కరువుకాటకాల లో చిక్కుకొని యున్న వారలకు వారు చిక్కుకున్న దావాగ్ని నుండి అమ్మ అమృతవర్షిణి కావున అట్టివారి యందు దయ కలిగి అమృత వర్షం కురిపించి కాపాడును .

o పాపారణ్య దవానలా   :-  ఎవరైతే అధర్మ ప్రవర్తకులై పాపములనెడి కీకారణ్యంలో చిక్కుకొని దారీ తెన్నూ తెలియక ఆ పాప రాశి నుండి విడివడ లేక యుందురో అలా దావానలం లో చిక్కుకొని దహనమైన వారిని దవానలం అనగా నీటి రూపులో ఉన్న నిప్పు నార్పవేయగలదు .

o దౌర్భాగ్యతూల వాతూలా   :-    వశిన్యాది వాగ్దేవతలు మానవులకు కలుగు ఎనిమిది విధములైన దోషములను గుర్తించి వాటి నుండి అనుగ్రహంతో ఏ విధముగా కాపాడుతుందో కవితాత్మకంగా వివరిస్తున్నారు . ఇంతకుముందు శ్లోకంలో భవ దావాగ్ని దోషమున చిక్కిన వారిని అమృత వృష్టి ద్వారా కాపాడు నని పాపారణ్యదవానలoలో చిక్కుకున్నవారిని నీటి రూపంలో ఆ దహనము ఆర్పి వేయును అనియు వివరముగా చెప్పి ఉన్నాము .

     కొంతమంది దురదృష్టవంతులైన దౌర్భాగ్యులు ఎంత శ్రమించినా సౌభాగ్యం కానరాక అనేక విధములుగా చింతాక్రాంతులగుతూ జీవనయానం చేస్తుంటారు . కాలం కలిసి రాగా అమ్మ దయ వలన వారి కష్టాలు తీరి దూదిపింజల వంటి  దురదృష్టము పెనుగాలికి ఎలా ఎగిరిపోవునో అలా  అదృష్టము కలుగును . 

             తూల =దూది.  ; వాతూ లా = పెనుగాలి

o జరాధ్వాంత రవిప్రభా  :-  జరా అనగా ముసలితనము  .జీవితము జీర్ణం ఆగుట . కొంతమంది యవ్వన వయస్సులో ఏమాత్రం దైవ శక్తి లేక పెను చీకటిలో చిక్కుకుని ముదిమి వయసులో తాపత్రయపడి దైవారాధన చేయాలనుకుందురు . కానీ ఆరోగ్యము అనుకూలించక బాధ పడుదురు . అలాంటి వారికి కూడా తన దయా కిరణములు ప్రసరింపజేసి అమ్మవారు సంస్కరించును .

భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా |

రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా || 144 ||

o భాగ్యాబ్ధిచంద్రికా.   :-     పున్నమి చంద్రుడు ఆకాశమున కనిపించినంతనే సముద్రము ఏవిధముగా ఉప్పొంగునో అదే విధముగా కొందరు ఆకస్మికముగా సంపదలు వనగూడినప్పుడు అమితానందము పొందెదరు . అట్లుకాక సంపద ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండి చంద్రికానందము కలుగజేసి అమ్మవారు వారిని స్థితప్రజ్ఞు లను చేయును . అందుకు నిరంతరము అమ్మను ఆరాధించుట మేలైనది .

o భక్తచిత్తకేకి ఘనాఘనా :-   మానసిక వైకల్యం పొందినవారు బిత్తరచూపుల తో రకరకాల ప్రవర్తనతో ఎట్లుoదురో అట్టివారిలో దోషమును ఆకాశము నందు కనపడు నల్లని మేఘము కొరకు ఎదురుచూచు నెమలి వలె అమ్మ మేఘము వలె దోష పరిహార మొనర్చి నెమలి వలె ఆనందాతిశయము కలిగించును .

o రోగపర్వత దంభోళి   :-   పర్వత సమానమైన అతిపెద్ద రోగములు సంప్రాప్తించినప్పుడు ఒక వజ్రాయుధము లాంటి పిడుగు పర్వతము మీద పడి ఎలా ధ్వంసము చేయునో  ఆదే విధముగా అమ్మ అనుగ్రహించిన ఎంత పెద్ద రోగమైన తగ్గించి ఆరోగ్యాన్ని చేకూర్చే తల్లి .

             దంభోళి. = పిడుగు



o మృత్యుదారు కుఠారికా   :-   ఈ నామము నందు మానవులకు సంక్రమించు అకస్మాత్తుగా మృత్యువును నేలకూలిన ఒక పెద్ద వృక్షపు మొద్దు తో (దారు ) పోల్చి అలా ప్రాప్తము కాబోతున్న మృత్యువును అడ్డుకుని ఒక మొద్దు నరుకుట కు ఉపయోగపడు గండ్రగొడ్డలి వలె మృత్యు ముఖము నుండి తప్పించి రక్షణ నొసగును . అమ్మను ఆరాధించు భక్తులకు మృత్యు భయము లేక పునర్జన్మ లేకుండా కాపాడును .

         కుఠారికా = గండ్రగొడ్డలి


మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా |

అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ || 145 ||

o మహేశ్వరీ.  :- అమ్మ తన మాయ చేతనే సృష్టి స్థితి లయములను ఏర్పరిచి ప్రళయానంతరము  తిరిగి అన్నింటినీ సమకూర్చు అనుగ్రహ స్వరూపిణి .ఈ నామము నుండి మంగళ చండి విద్య ప్రారంభమగును .

o మహాకాళీ   :-   ఈమె లయ కారిణి . అనంత ఆకాశమును భావన చేసిన ప్రళయ కాలమందు సూర్యుడు, చంద్రుడు ,నక్షత్రా లన్నింటిని లయమోoదించును . గౌరీ వెలుగును ప్రసాదించు జ్యోతి స్వరూపిణి .

o మహాగ్రాసా   :-   ఆహారము – మ్రింగుట అనబడును . ప్రళయము సంభవించినపుడు సమస్త భూమండలమును సముద్రమున ముంచి సర్వ జనులను వారి బుద్ధి బలములను మ్రింగి వేయును .

o మహాఽశనా  :-   అమాంతం సమస్తము మ్రింగివేయ గలది . మృత్యు దేవతను , యమధర్మరాజును సమస్త దిక్పాలకులను లయము గావించి కొత్త సృష్టికి మార్గము సుగమము చేయు తల్లి .

ప్రళయము – స్థితి – జ్ఞానము లను ప్రసాదించు ఈ మూడు స్వరూపములను మనము నిత్యమూ పఠించు ఈ అమ్మవారి ఈ క్రింది మంత్రము నందు గమనించవలెను .

                 “ ఓం శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ శ్రీరాజరాజేశ్వరీ బ్రహ్మవిద్యా 

                    మహాత్రిపురసుందరీ శ్రీలలితాపరాభట్టరికాoబా పరదేవతా నమో నమః “

ఈ పై మంత్ర రాజము నందు ముందుగా కాళికాదేవిని ,తరువాత పోషక స్థితి కారిణి అయిన లక్ష్మీదేవిని , అనంతరం జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవి ప్రసాదించు జ్ఞానము తో అమ్మను ఆరాధించ వలెననుటే ఔచిత్యము .

        అమ్మను ఆరాధించవలెను అన్న ప్రతి మానవునిలో భక్తి , అమ్మతత్వం , ధర్మం, జ్ఞానం ఈ నాలుగు ఎవరి యందు ఉండునో వారే సాత్విక గుణస్వభావులు అనబడుదురు . ఇవి అందరూ అలవరచుకొనవలసినవి .


o అపర్ణా   :-    అమ్మ శివసాయుజ్యము పొందుటకు తపస్సు చేయు సందర్భంలో ఆమె ఆహారముగా ఆకులను మాత్రమే సేవించినది . పర్ణములు అనగా ఆకులు .

    మరియొక అర్థంలో ఏ గుణములు లేని తల్లి . రుణ విమోచన కలిగించు కరుణామయి . ఒకప్పుడు పాండ్యరాజు దక్షిణాది ప్రాంత పరిపాలన సమయంలో సోమదేవుడు అను బ్రాహ్మణుడు ఒక ఊరిలో నివసిస్తుండెను . కరువు కాటకము ల వలన కుటుంబ పోషణార్థం కొంతమంది ఊరి వాళ్ళ వద్ద హామీ పత్రం వ్రాసి కొంత ధనము అప్పుగా తీసుకుని ఎన్నాళ్లైనా రుణము తీర్చలేక పోయెను . ఆయన మంచి భక్తి తత్పరుడు నిత్యం లలితా అమ్మవారి ఉపాసకుడు .

       ఎన్నటికి అప్పు తీర్చలేదని రుణదాతలoదరూ కూడబలుక్కొని గట్టిగా నిలదీసి అడుగు ఉద్దేశంతో అందరూ కలిసి ఆ బ్రాహ్మణుని ఇంటికి రాగా ఆ సమయమున ఆయన లలితా సహస్రనామ పూజ సల్పుచుండగా అప్పు ఇచ్చిన వారు వచ్చి ఉన్నారని భార్య తెలుపగా వారిని లోనికి ఆహ్వానించి కూర్చుండు నట్లు చేయుమని పురమాయించెను . వారును ఆయన మంత్ర పఠనము వినుచుండిరి .

       సరిగ్గా రుణ విమోచన అయిన అపర్ణ నామము రాగా ఆ నామ ప్రభావము తెలిసిన వాడై అమ్మను సహాయము కొరకు ప్రార్థించగా ఈ లోగా ఒక బాలిక ఒక పెట్టె చేతిలో పట్టుకొని వారితో నాన్నగారి పూజ ముగింపుకు మరి కొంచెం ఆలస్యం అవును కావున ఈ ధనము తీసుకొని ఆ పత్రములను ఇవ్వమని అడుగగా వారు అప్పు మొత్తము ముట్టినదని రాస్తున్న తరుణంలో పంతులుగారు పూజ ముగించి బయటకు రాగా ఆ రుణదాతలు ముక్తకంఠంతో మీ అమ్మాయి మా నాన్న గారు మీకు ధనమును ఇవ్వమని చెప్పి ఇచ్చి లోనికి వెళ్ళినది అని చెప్పి వారు మరలి పోయిరి . అంతట బ్రాహ్మణుడు విచలితుడై పూజామందిరము వద్దకేగి బోరున ఏడ్చి అమ్మకు సాష్టాంగ పడి అమ్మ దయామయియైన లలితాంబికయైన అపర్ణాదేవి తనకు కుమార్తెగా వచ్చి తనను రుణ విముక్తుణ్ని గావించి నందుకు సంతసించెను . ఈ విషయం పాండ్యరాజు కు తెలిసి ఆ బ్రాహ్మణుని భక్తికి మెచ్చి అతనిని రప్పించుకుని తన మంత్రిగా నియమించి తగిన సంబారములనొసగి గౌరవించెను .

       ఈ కథను చదివిన విన్న వారందరూ అమ్మ అపర్ణాదేవి కృపకు పాత్రులై వారి వారి రుణములు తీరి సుఖింతురుగాక . అపర్ణ అనగా ఆకులు లేని లత అని అర్థము .కుండలినీ వ్యవస్థ యందు ఉన్న సుషుమ్న నాడి మూలాధారము నుండి ఒక లత వలె పైకి ఆజ్ఞాచక్రము వరకు ఎగ ప్రాకును గనుక అపర్ణ అయినది .


o చండికా   :-   చండిక అనగా ఒక దేవతా స్వరూపిణి . ఈమె రాక్షస సంహార వేళ  కోప స్వరూపిణిగా మిగతా వేళల యందు సౌమ్య వంతముగా నుండును . అసుర సంహారిణిగా , లోకరక్షక కారిణిగా నుండి సృష్టి సమయములందు మంగళకర రూపములో నూ సంహార వేళ చండ ప్రచండ రూపణి గానూ అమ్మ లలితాంబికాయే రెండు విధములుగా గోచరించును . ఈమె సమర నిష్టురత్వంతో చండ ప్రకాశంతో వెలుగొందుతూ ఉండును . ఈమె పూర్ణ అఖండ జ్ఞాన స్వరూపిణి మరియు శాసనకర్త గా నుండి ఆజ్ఞలు జారీ చేయును .

o చండముండాఽసుర నిషూదినీ   :-   చండ ముండ అను ఇరువురు రాక్షసులు హింసకు పాల్పడు తరుణంలో చండుడు రజోగుణము తోనూ , ముండుడు తమోగుణము తోనూ ఉండి అమ్మవారి పై విజృంభించగా ఆ తల్లి ద్వంద్వ భావనలలో  ఉన్నవారిని సంహరించి ఏకత్వము సాధించుటయే పరమార్థము . సమూహ హింసాత్ములను సంహరించి శాంతి లోకములో కలుగునట్లు చేయుటచే ఈమె దుర్గా సప్తశతి లో మంత్ర అధిష్టాన దేవతగా చాముండేశ్వరి అని పిలవబడుతున్నది . ఈ చాముండేశ్వరి దేవాలయం మైసూరు ప్రాంత కొండలపై వెలసి పెద్ద గాలి గోపురము కలిగి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించి సేవిస్తున్నారు . ఈమె ద్వంద్వ భావములైన సుఖదుఃఖాలు ,లాభనష్టాలు అను భావములను తొలగించి తన భక్తులకు అనుకూలత సిద్ధింప చేసి ఏకత్వ భావుకత కలిగించి జ్ఞానవంతుల చేయు తల్లి . ఈమె బ్రహ్మ విద్యాస్వరూపిణి .ఏకత్వం పరబ్రహ్మ స్వరూపం .

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ |

త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా || 146 ||

o క్షరాక్షరాత్మికా   :-  క్షరము అనగా కొంతకాలము ఉండి తరువాత నశించునది  .లోకంలో మనము చూచు సకల జీవులు , వస్తు సముదాయము అన్నియు క్షరములే . ఇవి అన్నియు ఉపాదులు వీటి జీవన కాలపరిమితి అమ్మవారి చైతన్యము వలననే ఆయా ఉపాధులు మన గలుగుతున్నాయి .

         ఇక  అక్షరాలు అనగా నాశనము లేనిది . అక్షర స్వరూపం అమ్మయే కావున ఉదాహరణకు జీవులలో మనకు కనిపించని ఆత్మ అక్షరమే . జీవులలో బాల్య ,కౌమార ,యవ్వన ,ముదిమి అను మార్పులు జరుగుతూనే ఉండి శరీరము శిథిలమయి క్షరమగును . కానీ అందులో ఉన్న ఆత్మ అక్షరమై కర్మానుసారం గా మరల జన్మలను ఎత్తుచున్నది . అందు ఉపాది ద్వారా మంచి గుణములు కలిగిన వారు కైవల్యము పొందుతున్నారు . ఇదంతా జరిపించే ఒక ఉత్తమ శక్తి స్వరూపుడు పరమాత్మయే .అతడే పురుషోత్తముడు అని అందురు . ఈ పరమాత్మను నియంత్రించు నది అమ్మవారే గనుక ఆమె క్షరాక్షరాత్మికా అయినది .

o సర్వలోకేశీ   :-  అన్ని లోకములకు నియామకురాలై ఆయా లోకాధిపతులను నియమించి నియంత్రణతో పాలించు తల్లి . అందుచే అన్ని లోక వాసులకు అమ్మవారు ఈశ్వరీ స్వరూపురాలు .

o విశ్వధారిణీ   :-  ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవుల పోషణ భారం వహించు తల్లి . ధారిణీ అనగా భరించునది . భూమి , గోవు అని అర్థము లు కలవు ధేనువు నుండి పాలు ఎలాగు పితుకుదుమో అదే విధముగా భూమి నుండి సకల పంటలు విలువైన బంగారం పొందుతూ ఉన్నాము .

o త్రివర్గదాత్రీ   :-   ధర్మ ,అర్థ , కామములు అను మూడు వర్గములనూ త్రివర్గములు అందురు . ప్రపంచ మానవాళికి అందరికీ ధర్మార్థ కామముల ప్రసాదించి తన దాతృత్వం నిరూపించుకొను తల్లి .

      పురుషార్ధములు నాలుగు భాగములు పై మూడు వర్గములతో పాటు మోక్షము అను వర్గము కలిసి ఉండును . అమ్మవారు  కామ్య బుద్ధితో మూడు భాగములుగా మనకు ఇచ్చుచున్నది .

o సుభగా.  :-  అనగా అమ్మవారు సౌభాగ్య దేవత ఐశ్వర్య ప్రదాయిని .ఎవరైతే ధర్మబుద్ధి కలిగి సాటి మానవులoదు దయాగుణం కలిగి యుందురో  అట్టి వారలకు సకల సంపదలను చేకూర్చుతల్లి . భగా అనగా భగవంతుడు , ధర్మబుద్ధి ,మహాత్మ్యం , జ్ఞానము ,మోక్షము ,సూర్యుడు , ప్రకాశము , వీరత్వము అనేక నానా అర్థములు కలవు .ఇన్ని విధాలుగా ఇచ్చినది గావున అమ్మను భగవతి అందురు . అందుచేతనే సర్వ జనావళిచే పూజలందుకొను తల్లి . ఈ తల్లి స్వరూపము మనము అనునిత్యం వాడు కొను వస్తువుల యందు కూడా ప్రతిక్షేపిoచబడినది . ఆయా వస్తువుల యందు దైవ భావన చూపవలెను . ఉదాహరణకు పాలు , పెరుగు , నెయ్యి , పసుపు , పూలు ,కుంకుమ ,బంగారం , జీలకర్ర మొదలగునవి .

o త్ర్యంబకా త్రిగుణాత్మికా :-  అంబకం అనగా నేత్రములు అని అర్థము . త్రయంబకం అనగా మూడు నేత్రములు కలది . అమ్మకు త్రయంబకుడు అయిన శివుని వలెనే మూడు కన్నులుగా సూర్య చంద్ర అగ్ని రూప శక్తులు కలిగి మిక్కిలి తేజోమయముగా ఉండును .త్య్ర + అంబికా = త్రయంబికా అని పద విభజన చేసినచో ముగ్గురమ్మల మూలపుటమ్మ లలితాంబయే .ఆమెయే ఆది పరాశక్తి .

        ఇచ్చా జ్ఞాన మోక్షప్రదాయిని త్రిగుణములు కలిగి ఉండుటచే ముగ్గురమ్మల గుణములకు ఏకత్వ రూపణి తానే అయినందున త్రిగుణాత్మిక అయినది . ఈమెయే త్రిగుణ బ్రహ్మ అనబడును .

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః |

ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా || 147 ||

o స్వర్గా.  :-   స్వర్గము అనగా దుఃఖ స్పర్శ లేని ఆనందము కలిగించు ఉత్తమ లోక ప్రాప్తి పొందు చోటు . ఈ స్వర్గప్రాప్తి లభించ వలెనన్న త్రివర్గములైన ధర్మఅర్ధ కామాదులందు బుద్ధిపూర్వకంగా పుణ్య కార్యములు ఆచరిస్తూ పాప రహిత జీవనం చేస్తూ ధర్మబద్ధమైన సంపాదనతో ధర్మానుగుణమైన కామముతో వ్యవహరించిన పుడు ఆజన్మలో ఆర్జిత పుణ్యం ద్వారా స్వర్గము ప్రాప్తించును . అయితే గత జన్మల పుణ్యా పుణ్యముల వల్ల నరకము గాని మరు జన్మ గాని కలుగవచ్చును .అందుచే ప్రతి జన్మము నందు దైవీ భావము కలిగి పవిత్ర జీవనము ఆచరించవలెను .స +వర్గము – స అనగా మంచి ,సత్యం , స్వచ్చo . వర్గము అనగా గుంపు , సమూహము . అనగా ధర్మ అర్థ కామములు మంచితనంతో ఆనందము పొందవలెను .


o అపవర్గము  :-   అనగా అమ్మ లలితాంబికా దేవి యందు ఆరాధనా భావంతో భక్తితో అమ్మ తత్వార్ధ జ్ఞానముతో పూజించిన స్వర్గమునకు ఆవల ఉన్న మోక్షప్రాప్తి అర్హత కలిగియుండుటయే . అప్పుడు మరుజన్మలు ఉండవు . మన శరీరము నందు అమ్మ చైతన్య శక్తి అంతఃకరణముఆగా సర్వేంద్రియములకూ బలిమి చేకూర్చి నడిపించుచున్నది కావున ఇక్కడే ఈ జన్మలో భక్తిప్రియత్వసాధనతో మోక్షగామి కావచ్చును .


       మరియొక అర్థంలో ప వర్గముకు చెందిన కొన్ని అనుబంధములను విడనాడి మనసునందు తొలగించుటయే అపవర్గము  మన అక్షరమాల యందు ప అను వర్గము నందు పంచాక్షరములైన ప ,ఫ ,బ ,భ ,మ , అను ఐదు అక్షరములు కలవు . ఆ అక్షర పదాలు ఇవి .1 – పాపము , పుణ్యము 2 ఫ -ఫలము 3 బ – బంధము 4 భ – భయము 5 మ – మరణము .

ఎవరైతే మరణ భయం లేకుండా , బంధములు విడనాడి పాపపుణ్యముల ప్రస్తావన లేక ఏ ఫలమును ఆశించక నిశ్చల భక్తితో అమ్మను సేవించిన , ఆమె చైతన్యశక్తి మనలో ద్విగుణీకృతమై అతీత శక్తి ఆవాహన మై ఆనందాబ్దిలో ఓలలాడేదరు  .అప్పుడు చిచ్చక్తి రూపణి స్థావరమైన మణిపురం చేరుదురు .

o శుద్ధా   :- ఏ పాపమూ లేనిది . త్రిగుణ వికారములు లేని అమ్మ మన శరీర అంతర్భాగమున ఉండి ఆత్మకు చైతన్యశక్తిని ఇచ్చి మన చేత మంచి పనులు చేయించి శుద్ధత చేకూర్చును . అదే విధముగా ప్రకృతి యందు అనాత్మగా యుండి కాలానుగుణంగా తన చైతన్యశక్తి ప్రభావం చూపుతున్నది . అందువలన అమ్మ శుద్ధ బ్రహ్మ స్వరూపిణి .

o జపాపుష్ప నిభాకృతిః    :-   జపా పుష్పములు అనగా అరుణ వర్ణము కలిగిన మంకెన పుష్పాలు . అమ్మకు ఇష్టత కలిగిన పుష్పములు .

    మన శరీరమునకు చైతన్య శక్తినిచ్చి, శుద్ధచైతన్యత్వము కలిగిన అమ్మ ను పలు విధములుగా స్తోత్రములతో , మంత్రములతో ,అరుణ వర్ణ పువ్వులతో నిరంతరము జపించిన ఆ మంత్ర శక్తుల వలన రూపంలో ఉన్న జ్ఞానము పుష్పము వలె వికసిత మగును . ‘ జపతో నాస్తి పాతకం ‘ అని పెద్దలు అనిరి . జప సాధన అనునది అమ్మ దయవలన గురుకృప వలన సాధ్య పడును . మంత్ర జపం చేయగా చేయగా ఆ మంత్రాక్షర వెలుగులు మన మనోఫలకంపై పడి ఆకృతులు దృగ్గోచరమగును . ఈ స్థితినే సమాధిస్థితి అందురు .

    ఒకప్పుడు సంకీర్తనాచార్యుడు అయిన శ్రీ త్యాగరాజస్వామి వారు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ప్రసిద్ధి చెందిన శివాలయం పుత్తూరు గ్రామమున ఉన్నట్లుగా గమనించి దర్శించుటకు ప్రయత్నిస్తుండగా గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ఒక బాలుడు బావిలో పడి మరణించెను . బాలుని శవాన్నిచూచి  దుఃఖితులు అయిన వారిని చూచి స్వామి వారు మిక్కిలి వ్యధ చెంది అప్పటికప్పుడు జప మాచరించి నాలో ఉన్న ప్రాణమే బాలుని లోను ఉంది కదా అని భగవానుని ప్రార్ధించి సమాధి స్థితి కి చేరి మరల కొంచెము వ్యవధిలో యధాస్థితికి రాగా బాలుడు బ్రతికెను . ఆ సమయాన పుట్టిన కీర్తనయే ‘ నా జీవధార యనునది ‘ కేవలము సమాధి స్థితిలో వారు చేసిన మంత్ర జప చైతన్య శక్తి ప్రభావముచే మృతుడు మరల జీవము పొందెను .

o ఓజోవతీ  :-  మనకు జీవన వీర్య బలము నిచ్చు భగవత్ శక్తి స్వరూపిణియే ఓజోవతి . సప్తధాతువులు పుష్టిని కలిగించు తల్లి . దాని వలన తేజస్సు ,ప్రకాశము కలుగును . ప్రాణము ,జీవము అను ఈ రెండిటి కలయిక ఓజస్సు . సప్తధాతువుల తరువాత అదే ఎనిమిదవ ది ఓజస్సు .ఓజస్ శుక్ల ,ప్రాణ ,జీవ , ఈ నాలుగు దాతువులు శివ శక్తులు కావున సర్వ ఇంద్రియ శక్తులను పట్టి నడిపించు నది ఈ ఓజో శక్తియే . అమ్మవారి ఓజో శక్తి ప్రభావము వలననే ప్రపంచము నడుచుచున్నది . అమ్మని దోషములు అంటని కామరాజదోషవివర్జితా అందురు .

o ద్యుతిధరా.  :-   ఓజో వతి అయిన అమ్మవారు తానే వెలుగై సప్త ధాతువులను ప్రకాశించునట్లు మన శరీరమునకు వెలుగులు ఇచ్చుచున్నది .

o యజ్ఞరూపా  :-  యజ్ఞము అనగా త్యాగనిరతితో ఇచ్చు ఏదేని వస్తువు . యజ్ఞము చేయునపుడు అత్యంత భక్తి శ్రద్ధ శక్తులతో ఏకాగ్రత చిత్త ప్రవృత్తి కలిగి నిస్వార్థ చింతనతో అగ్ని పురుషుని ప్రార్థిస్తూ ఆహుతులు సమర్పించవలెను . అప్పుడు అగ్ని అందరూ దేవతలకూ యజ్ఞ ఫలము అందించును . నిష్కపటముగా చేయు యజ్ఞంను ఆదానప్రధాన యజ్ఞము అందురు .

      పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మ రూపమే యజ్ఞ రూపము . ఈ సకల సృష్టిని ఏర్పరచి అనేక ప్రకృతి శక్తుల ద్వారా మనకు త్యాగ శీలతతో సర్వ సౌకర్యములు ,నిరంతరము ప్రేమతో కలుగజేయు చున్నది . అదే విధముగ పంచోపచార విధముగా అమ్మ మనలోనే ఉన్న భావనతో ఏకాగ్ర చిత్తముతో ప్రీతిపాత్రంగా సేవించిన ఎడల మన పూజ ఫలప్రదము అవుటయే కాక తగిన ప్రతిఫలం లభించును .

o ప్రియవ్రతా   :-   సృష్టి చేసి తగిన నిర్వహణా సామర్ధ్యము కలిగి చేయు వ్రతము గా భావించిన ఆ వ్రతమును ప్రీతిగా చేయు తల్లి ఆ అమ్మయే . మరియొక భావములో అమ్మకు ప్రియుడు శివుడే గనక ప్రియ శివుడే వ్రతముగా కలది . అమ్మ శివుని యందు మిక్కిలి పాతివ్రత్య ప్రియత్వము కలది .


దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా |

మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా || 148 ||


o దురారాధ్యా   :-   అమ్మ ను ఆరాధించుట మిగుల కష్టమైనది అయితే ధర్మ ప్రవర్తన కలిగి మంచి మనసుతో అమ్మ యందు ప్రేమాస్పద భక్తితో తాదాప్యత చెందుతూ ఇంద్రియ నిగ్రహంతో ఆరాధించిన అమ్మవారు ప్రీతి చెందును .

o దురాదర్షా   :-   అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేయునప్పుడు ఎంతో కఠినముగా ఉండి  వారికి ఏమాత్రమూ లొంగని దాని వలె ఉండి వారిని సంహరించి చివరకు ముక్తి ప్రసాదించును .

          తన భక్తుల విషయంలో చపలత్వం లేక ఇంద్రియ నిగ్రహ శక్తితో అమ్మ యందు విశ్వాసముంచి ఆమె తత్వము ఆకళింపు చేసుకొని ఆరాధించు వారు సులభముగా ఆమె దయ పొందవచ్చును .

o పాటలీ కుసుమప్రియా  :-   అమ్మవారికి పూజా ద్రవ్యములతో పాటు తెలుపు ఎరుపు రంగులు కలగలిసిన గులాబీ పుష్పములనిన ప్రీతికరము .

          అమ్మవారిని వివిధములైన స్తోత్రములు ,వేద మంత్రములు ,దండకములు  అను సమూహ శక్తి మంత్రముల  (పాటలము ) తో ఆరాధించిన ప్రియము చెంది మన యందు ప్రేమ చూపును . అట్లు చూపు ప్రేమయే దయ , కరుణ . మనము అమ్మ యందు చూపు ప్రేమ భక్తిగా ఆరాధనగా యుండవలెను .

o మహతీ,   :-   అనగా నాదస్వర రూపమైన పరబ్రహ్మస్వరూపిణి మంగళ స్వరూపంగా నుండు అమ్మ , నారదుడు ఉపయోగించు మహతి అను వీణ నామము కలిగియున్నది .

o మేరునిలయా   :-   అమ్మవారు మేరు పర్వత శిఖర నిలయము నందు సింహాసనారూడయై ఆ శిఖరాగ్రం కేంద్రస్థానంగా ఉండి ఇరుసు వలె విశ్వ చక్రము నడిపించు చున్నది .

         మరియొక భావములో మూలాధారము నుండి మానవశరీరంలో విస్తరించి ఉండు వెన్ను దండము సహస్రార కేంద్రక స్థానము వరకూ వ్యాపించిన దాని యందు ఉండు స్థానము అమ్మవారి మేరు నిలయము . మంగళకరమైన అన్ని మంత్రములకు మూలమంత్ర మైన అమ్మవారి మంత్రము మేరువు . సర్వ మంత్ర తంత్రములకూ ఆ తల్లియే మూల కారణము . అందుకే వేదపండితులు పఠన సమయము నందు కుడి చేతి మధ్య వ్రేలి ద్వారా అభ్యసనము చేయుదురు . ఆ వ్రేలి కణుపుల శక్తి మేరువు అందురు .

o మందార కుసుమప్రియా  :-   అమ్మవారికి తెల్ల జిల్లేడు పువ్వులు అనిన మిక్కిలి ఇష్టము .


వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ |

ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ || 149 ||

o వీరారాధ్యా.  :-   అమ్మవారు వీరులచే ఆరాధింపబడును . వీరులు అనగా అమ్మవారి నిత్య పూజలు చేస్తూ జీవితమంతా అలాగే కొనసాగిస్తామని దీక్ష వహించి సమయపాలన పాటిస్తూ నిష్ఠగా ఉండి  ఇంద్రియనిగ్రహము తో నియమబద్ధంగా ఆరాధించు వారిని దీక్షితులు అందురు వీరే వీరులు అనబడుదురు .

o విరాడ్రూపా   :-   అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉండు మహత్తర శక్తి కలది కావున సర్వ జీవుల అవసరములు తీర్చు నట్టి తన విరాట్ దృశ్య శక్తి తో అందరినీ వీక్షించగలదు .

o విరజా    :-   అనగా రజోగుణము లేనిది .  ఏ గుణములు అంటనిదిగా ఉన్న త్రిగుణాతీతగా శుద్ధ తాత్విక స్వరూపిణిగా ఉపాసింతురు . సూర్య భగవానుడు సముద్రముల యందు ప్రకాశించుచున్న ప్పటికీ అందున్న జలతత్వం అంటకుండునట్లు అమ్మ కూడా ప్రకృతి శక్తులకు అతీతముగా ఉండును .

            బీజాక్షర శక్తులను విరజములు అందురు . మన శరీరంలోని మూలకణాలను విరజములు అందురు . బ్రహ్మదేవునిచే ప్రతిష్టించబడిన విరజాదేవి ఆలయం అతి పురాతన క్షేత్ర మై ఒరిస్సా రాష్ట్రము నందు కలిగి ఉండి నేటికీ పూజలందుకుంటూ ఉన్నది .

o విశ్వతోముఖీ  :-   ఈ విశ్వాన్నంతటినీ అమ్మ ఆక్రమించి ఉండి అనేక ముఖములతో ప్రపంచమంతయు పర్యవేక్షిస్తూ తన చైతన్య శక్తితో అన్ని వైపులకూ చూచు తల్లి . విశ్వములో జరుగు ఎలాంటి వికారములకు లోను కాని తల్లి అమ్మవారు త్రిగుణాతీత గా ఉండి సర్వజ్ఞ రూపునిగా సర్వతోముఖ జ్ఞాన రూపిణిగా సమస్త లోకములను పర్యవేక్షిస్తున్నది . అందుచే శుద్ధచైతన్య తత్వముగా ఉండును .

o ప్రత్యగ్రూపా   :-   పరమేశ్వరుడే ప్రత్యగాత్మ స్వరూపుడు . ఎవరైతే అంతరంగ దృష్టితో అమ్మవారిని భక్తిగా ఆరాధింతురో  వారు ప్రత్యన్ముఖులని , విషయ పరాన్ముఖులై ప్రత్యదుల్లాసముతో చేయు ఆరాధన అమ్మకు తృప్తి కరము .

        ఎవరైతే బాహ్య విషయాశక్తుల పరాకుగా యధాలాప భావనతో బహున్ము ఖులై ఉండి పూజలు గావింతురో వారు పరాన్ముఖులు అనబడుదురు .

o పరాకాశా   :-  ఆకాశమే అమ్మ స్వరూపము . ఉపాధి కారకములగు సమస్తము ఆకాశము నందు కలవు . సూర్య ,చంద్ర , నక్షత్రాది ,మేఘ , మెరుపు , అగ్ని ,వాయువు తదితర ప్రకృతి శక్తులన్నింటికీ ఆకాశమే మూలమై అమ్మ నియంత్రణతో ఆమె చైతన్య శక్తి తో నిత్యము జరుగుతున్నవి . ఆకాశము అన్నింటా ఉండును .మనము నిత్యమూ దర్శించు ఆకాశమును భూతాకాశము అందురు . అదే విధముగా ఒక ఘఠము నందున ఉన్న ఆకాశమును ఘటాకాశము అనియు సమస్త మానవులందరి హృదయముల యందు ఉండు ఆకాశమును హృదయాకాశం లేదా దహరాకాశము అందురు . ఆకాశ స్వరూపమైన అమ్మ బాహ్య శక్తులను ఎలా నడిపించు నో మనలోని అంతర్గత చైతన్యశక్తి గా ఉండు మన నాడీ మండలానికి శక్తి నొసగి ప్రాణ శక్తిని ఇచ్చి సమస్త కార్యనిర్వహణ చేయుచున్నది .

         అయితే మనకు కనిపించే ఈ ఆకాశమునకు అతీతముగా ఉండునదే పరాకాశము . ఈ పరాకాశమునందు అమ్మ చిత్ శక్తిరూపిణీయై చిదానంద మయురాలై యుండును . అదే చిదాకాశ ము .

      ఆకాశము అనగా  - ఆ = సంపూర్ణమైన ; కాశము = వెలుగునిచ్చేది . ఉపనిషత్తులలో చెప్పిన విధముగా కం అనగా బ్రహ్మ కాశం , ఖం అనగా ఆకాశం అని అర్థం .

       పరాకాశ అనగా మరో భావన లో ప్రతి మానవ శరీర కుండలిని వ్యవస్థలో భృకుటి యందున్న అజ్ఞాచక్ర స్థానం నుండి సహస్రారము వరకు గల ప్రాంతము నందు పరమేశ్వర స్థానమైన చిదాకాశము నందు అమ్మ సంపూర్ణ సచ్చిదానంద స్వరూపిణిగా లలితామాతగా ఉండును .

o ప్రాణదా  :-   ఎవరైతే వీరారాధకులై గురూపదేశ ముతో విరాట్ రూప సకల చైతన్యస్వరూపిణిగా ఈ విశ్వ వీక్షణం చేయు విరజా దేవిని ప్రత్యక్ శక్తి గా భావించి మనలోనే సహస్రార పరాకాశ రూపిణి , చిత్ శక్తితో ప్రాణ శక్తి నొసగి తానే ప్రాణరూపిణిగా ఉన్న అమ్మను భగవత్ ప్రసాదిత సద్బుద్ధితో నిరంతర ఆరాధనతో ఉపాసించిన అమ్మ కరుణ కు పాత్రులగుదురు . 

o ప్రాణరూపిణీ   :-     పరాకాశమందున్న చిద్రూపిణి మనలో చైతన్యం రగిలించి ప్రాణ దాయి గానే కాక ప్రాణానికి ప్రాణమైన మూల ప్రాణ రూపిణిగా  ఉండి నడిపించు చున్నది .


మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః |

త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా || 150 ||

o మార్తాండ భైరవారాధ్యా.  :-    మార్తాండుడు అనగా మృతమైన అండము నుండి జన్మించిన వాడు, సూర్యుడు  . భైరవుడు అనగా నాదస్వరూపుడు అయిన శివుడు అనగా శివ స్వరూపుడైన సూర్యుని చే ఆరాధింపబడే అమ్మవారు అనగా శివుడే సూర్య రూపంలో అమ్మను ఆరాధించును ఇంతకుముందే శివరాధ్యా అను నామము కలదు .

           ఒకప్పుడు అదితి కశ్యపునిభార్య గర్భము దాల్చి ఆ అండము పెరుగుతున్న సమయంలో కశ్యపుడు చెప్పిననూ వినక అదితి ఆహారము సేవింపక ఉపవాసము ఉండుట వలన గర్భవిచ్ఛిత్తి జరిగి ఆ మృతమైన అండము బయటపడగా కశ్యపుడు తపశ్శక్తితో బ్రతికించి మార్తాండుడు అని నామకరణము చేసి సూర్య మండలమునకు చేర్చగా ఆయన ఈ విశ్వమానవాళికి ఆరోగ్య ప్రదాతయై సకల జీవ రక్షణ గావించుచున్నాడు .

        మరో భావనలో పరిశీలించిన చిత్శక్తిస్వరూపిణిగా పరాకాశమందున్న అమ్మవారు తన హృదయ ఆకాశమునుండి తన ఇచ్ఛాశక్తి తో శివశక్యైక రూపుణిగా సూర్యుని సృష్టించి ప్రాణదాయియై ఆప్రాణనికే ప్రాణ రూపిణి అయి సూర్య మండల మందు ప్రతిష్టింపగా మనము ప్రతి దినము పూర్వ సంధ్యాంగ నా పాలభాగమునందు సింధూర తిలకంగా ఆకాశాన అందమైన అమ్మను దర్శించుకుo టున్నాము . సూర్యునికి ప్రాణ ప్రతిష్ట చేసినది అమ్మయే కావున  ఆయన తన తల్లిని ఆరాధిస్తున్నాడు .

        అమ్మవారి స్థావరమైన శ్రీమన్నగరము నందు ఈ మార్తాండ స్వరూపుడైన సూర్యుడు అమ్మవారి  అనుచర తిథి  దేవతలైన 14 మందితో కూడి 22 , 23 ప్రాకారముల  మధ్యలో సంచరిస్తూ దిన మార్పిడికి తోడ్పడుతూ ఉన్నాడు .

o మంత్రిణీ న్యస్తరాజ్యధూః   :-   అమ్మవారు తన రాజ్య భారమును నిర్వహించుటకు సహాయకులుగా ఉండునట్లు మంత్రిణిలుగా తన అనుచర దేవతలను నియమించు కొనును . భండాసుర వధ సమయములో వారాహి శ్యామలదేవులను  మంత్రిణులుగా నియమించుకొనేను వీరిలో శ్యామలదేవి ని ముఖ్య సలహాదారుగా నియమించుకొని ,వారాహి దేవి తన సైన్యమునకు దండ నాయకిగా నియమించుకొ నెను .

o త్రిపురేశీ

o జయత్సేనా

o నిస్త్రైగుణ్యా పరాపరా 

సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా |

కపర్దినీ, కలామాలా, కామధుక్కామరూపిణీ || 151 ||

o సత్యజ్ఞానాఽనందరూపా. :-   అమ్మవారు నిజమైన జ్ఞానానంద స్వరూపిణి .సత్యము అనగా వేదమంత్రములు దేవతలను ఉద్దేశించి చేయు వ్రతములు ,నోములు ,పూజలు వగైరా ఎవరైతే అమ్మ వారి యందు స్థిరమైన నమ్మకము కలిగి ధర్మ యుక్తముగా కపట బుద్ధి లేకుండా ఆరాధింతురో అట్టి వారి యెడల దయతో జ్ఞానము పంచు తల్లి . నిత్య జ్ఞానానంద స్వరూపిణి .

o సామరస్య పరాయణా  :-   అందరినీ సమతాభావనతో చూచుటయందు ప్రీతి కలది . పరమాత్మ మానవులలో వివక్షత చూపక అందరిని సమంగానే ఆదరించును . రసం అనగా అనుభూతి . మానవులు ఏ వస్తువు యందు అనుభవించి అనుభూతి పొంది తద్వారా ఆనందము పొందునో అదే సామరస్యము . ప్రకాశము – విమర్శల అనుసంధానమే సామరస్యము . అమ్మ ఉపాసకులు తోటి వారి యందు సమభావము కలిగి ఉపాసించిన వారికి మోక్షప్రాప్తి కలుగజేయును . శివపార్వతులు సమత్వ భావనతో శివశక్తి అను ఏకత్వ లక్షణం వల్లనే సనాతనంగా ప్రపంచం ఒకేలా నడుచుచున్నది .అర్ధనారీశ్వరతత్వమే  ఇందుకు ఉదాహరణ .

o కపర్దినీ   :-   శివుని జటాజూటం కపర్థము అందురు . అయితే ఒత్తయిన శిరోజాలు అమ్మ వారు కలిగి ఉన్నందున అమ్మ కపర్దిని అయినది . కాళిదాసు దర్శించిన అమ్మవారిని తన స్తోత్రములో కపర్దిని గా వర్ణించారు . అదేవిధముగా మహిషాసుర మర్దని స్తోత్రం లో  రమ్యకపర్దిని శైలసుతే అని  శంకరాచార్యులవారు కీర్తించారు . శంకరుని జటాజూటము సకల విద్యలకు నిలయము . అమ్మ కూడా విద్యాస్వరూపిణియే .

       మరియొక భావనలో కమ్ అనగా జలములు శివుని  శిరస్సు నందు గంగా జలము జటాజూటము వలన నియంత్రించుటచే కపర్ధుడు అయినాడు . కపర్దిని అనగా అమ్మవారు దేవతల చేత భక్తుల చేత ప్రశంసలందుకును తల్లి . గవ్వల దండ అను మరియొక అర్థము కలదు .అమ్మవారు ఒక అంశ రూపంలో గవ్వల దండ ధరించి ఉండును .

o కలామాలా.  :-   చంద్రకళ లైన పదునైదు తిధి కళలను వరుసలో హారము ధరించి కాలగమనం జరుపు తల్లి . సమస్త విద్య వివిధ కళలను వరుసగా పొందుపరచి మనకు అందించిన తల్లి .

o కామధుక్   :-   అనగా కామధేనువు . అమ్మవారు తన భక్తుల కోరికలను వెనువెంటనే తీర్చు కామధేనువు వంటిది . అమ్మవారు మొదటగా సురభి నామముతో  గోలోకంలో అవతరించెనని ,ఆ అంశ స్వరూపములే నేటి మన భారతీయ గోసంతతి అని తెలియదగును . కామదుక్ అనగా వేదమంత్ర రూపిణి . మానవులు వారి కోరికలు తీరుటకు యజ్ఞయాగాదులు వ్రతాలు స్తోత్రములతో వివిధ మంత్రములతో ధర్మబద్ధముగా చేయు వారికి వెంటనే ధర్మ ఫలము పొందునట్లు అనుగ్రహించు తల్లి .

o కామరూపిణీ :-   అమ్మవారు స్వేచ్ఛ రూపిణి . తన ఇచ్ఛాశక్తి ప్రభావము వలన ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన రూపంలోనైనా ఉండగల తల్లి .

కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః |

పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా || 152 ||

o కళానిధిః.  :-   చంద్రకళ శోభిత అయిన అమ్మవారు చంద్రుని పంచదశ కళనూ తనయందు నిధి గా నిక్షిప్తం చేసుకున్న తల్లి . చతుష్షష్టి కళలను తనలోని ఇముడ్చుకున్న తల్లి ఈమె షోడశ మంత్రముఖి .

o కావ్యకళా   :-   అమ్మవారి అనుగ్రహము లేనిదే ఎవరూ ఏ రూపమైన కవిత్వమును రాయలేరు . తెనాలి రామకృష్ణ కవికి శారదా మాత అనుగ్రహము వలన నే అంతటి పటిమ కలిగి పాండురంగ మహత్యం అను గ్రంథమును వ్రాసెను .

o రసజ్ఞా   :-   కావ్య సంపుటము లను సమకూర్చుకుని వాటిని శ్రద్ధగా పట్టిస్తూ వాటియందు గల లోతైన భావజాలపు అర్థము చేసుకొని ఆనందించు వారు రసజ్ఞులు అందురు .

o రసశేవధిః    :-   కవిత్వం కవులు వారి కవిత్వము లలో చేయు నవరసములనూ అమ్మవారు ఆస్వాదిస్తూ ఆనందము చెందును . వివిధ కళారూపాలకు సంకల్పశక్తి గా అమ్మ కవుల లో లో ప్రేరణ కలిగించి ఆ కవుల లో వారిచ్చిన కవిత్వ మునకు సంతోషించి అనుభవించు రసజ్ఞ రూపిణి .

o పుష్టా   :-   సకల కళానిధి అయిన పరమేశ్వరుడు తనకు vallabudu అయినందున అమ్మవారికి ఏ లోటు లేక నిత్య ఆనందమయి గా ఉండును .

o పురాతనాపూజ్య   :-   అమ్మవారు అందరు దేవతల కంటే సనాతనంగా ఆదిశక్తిగా ముగ్గురమ్మల మూలపుటమ్మ గా ఉన్న తల్లి . అందుచేతనే ఆమెను మునులు దేవతలు మానవులు సర్వుల చే పూజలందు కొను  తల్లి .

o పుష్కరా   :-  పుష్కరుడు అనగా సూర్యుడు అతనికి ప్రకాశించు శక్తి  నొసగినది కావున జగదాంబ యే పుష్క రా అయినది .

o పుష్కరేక్షణా   :-    అనగా పద్మముల వంటి కన్నులు కలిగి అందముగా వీక్షించు తల్లి . అనంతత్వం స్వరూపిణి అయిన అమ్మవారు సూర్యుని కిరణాల శక్తి తో విశ్వమంతటి ని ఎలా దర్శించు నో అమ్మవారు తన అనంత శక్తితో సర్వలోకాలను వీక్షించు చున్నది .

పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా |

పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ || 153 ||

o పరంజ్యోతిః   :-   దేవతలందరూ జ్యోతి  ప్రకాశ స్వరూపులే . అమ్మవారు తన చైతన్య శక్తితో ప్రపంచమంతటకి వెలుగు ప్రసాదిస్తూ అఖండ జ్యోతి స్వరూపిణిగా దేవతలు మానవులు ఆమెను ఆరాధించుట చేత  అమ్మవారు జ్యోతుల కే జ్యోతి అయినా పరంజ్యోతి .

o పరంధామ   :-   దామము అనగా ఉండు స్థానము . సర్వలోక ములు ప్రళయ కాలము నందు నశించి బ్రహ్మ తో సహా బ్రహ్మ ప్రళయం సంభవించి అనుసరించినప్పటికీ పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మ నాశము లేక సర్వోత్కృష్ట స్థానమైన పరలోకంలో సూర్య చంద్రాదులు వెలుగులతో నిమిత్తము లేకయే స్వయంప్రకాశ శక్తితో వెలుగొందు చుండును .

         మానవులలో  జాగృత్ స్వప్న సుషుప్తులు కలిగి ఉందురు . అమ్మవారు ఈ మూడు శక్తుల కు అతీతురాలై తురీయము నందే ఉండును . శివునకు లభించిన సర్వశక్తులూ అమ్మ గౌరీ దేవి వలన సంక్రమించే నని రుషితుల్యుల  ఉవాచా .

o పరమాణుః.   :-   అనగా అత్యంత సూక్ష్మమైనది . అమ్మవారు సూక్ష్మతమమైన వ్యాపక శక్తి కలిగి ఉండి సర్వత్రా వ్యాపించి ఉండును . మానవ శరీర ఇంద్రియములకు గోచరము కాని తల్లి .

o పరాత్పరా   :-   పర అనగా గొప్పది అని అర్థము . పరాత్పర అనగా గొప్ప దాని కన్నా గొప్పది . మన శరీరము కొన్ని ప్రాపంచిక విషయముల యందు ఇంద్రియ బలహీనతతో అనవసర ఆసక్తి కలిగి ఉందురు . తాత్కాలిక అనుభవాలే  గొప్పవని భావిస్తారు . కానీ ఆ ఇంద్రియ లోలతలో మనసుతో ఆలోచన చేయరు . ఇంద్రియముల కంటే మనసు గొప్పది . మనసు కంటే బుద్ధికి గొప్పది . దానికంటే పరము దీనికంటే పరాత్పరం గొప్పది . ఆ పరాత్పర స్వరూపమే అమ్మవారు ,కాలపరిమితి లేనిది .

     శ్రీ చక్రము నందు వివిధ ఆభరణముల యందు పర దేవతా స్వరూపములు గా వేరు వేరు నామములతో ఉందురు . శ్రీ చక్ర మధ్యలో ఉన్న బిందు స్వరూపిణియే పరాత్పర స్వరూపమైన శ్రీ మాత లలితా పరాభట్టారికాoబాదేవి .

o పాశహస్తా  :-   అమ్మవారి ఒక హస్తమునందు పాశము కలిగి ఉండును . మన జీవన యానంలో భవబంధ పాశము లతోనే గాక మన ఎదుగుదలకు ఓర్వలేని అజ్ఞాత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు ధైర్యముగా అమ్మను తలచి శరణు వేడిన ఏదో ఒక రూపంలో అజ్ఞాత శక్తిగా ఆ పాశ  బంధము మనకు తొలగించి మనకు అన్యాయం చేసిన వారిపై విసిరి వారిని శిక్షంచును . కనుక పాశము తగిలించు నది తీసివేసి కాపాడుతున్నది అమ్మయే .

o పాశహంత్రీ   :-    అమ్మ చేతి యందు ఉన్న పాశము తో అనేక దుష్టశక్తులను ఎదిరించి పాశము ఝడిపించి వారిని సంహరించి లోకం నిర్వహణ గావించుచున్నది . ఎవరైనా శత్రువులు మంత్రశక్తితో ప్రయోగాలు చేసిన తృప్తి గొట్టను .

o పరమంత్ర విభేదినీ   :-   మానవులకు సాధారణంగా నాలుగు విధములైన కష్టములు ప్రాప్తించును అవి 1 దారిద్ర్యము రెండు అనారోగ్యము 3 శత్రు బాధ నాలుగు అపకీర్తి . కొంతమంది రుద్ర మంత్రాలతో ఇతరుల ఉన్నతికి ఈర్ష చెంది ప్రయోగాలు చేసి బాధింతురు . అట్టి బాధ అనుభవించిన వారు అమ్మవారి నామస్మరణ చేసిన వెంటనే అమ్మ ఆసక్తులను ఛేదించి కాపాడును .

      పూర్వము దక్షిణ భారతదేశంలో ఒక గాయకుడు అమ్మవారి పై అనేక పాటలు పాడుతూ ప్రఖ్యాతి పొందిన . ఒక నాడు ఆ ప్రాంత పాలక రాజు గాయకుని పిలిపించుకుని కచేరీ ఏర్పాటు చేశను గాయకుడు పాడుతుండగా సభలో అసూయ చెందిన వ్యక్తి ఒకరు లేచి వెళ్ళి దుష్ట మంత్ర శక్తులతో గాయకుని పై ప్రయోగించి అతని వాక్ శక్తి హరించగా గాయకుడు తత్తరపడి అమ్మను మన ముందే ప్రార్ధించు కొన్నను . మంత్రగాడు తన మంత్ర ఫలితం ఏమగునో అని అచటనే తచ్చాడుతూ ఉండా అకస్మాత్తుగా ఒక గుర్రము ఆ మంత్ర గాని పై దుమికి వానిని చంపి వేసెను . ఆ వెంటనే గాయకుడు పాట ప్రారంభించెను . కేవలం అమ్మ ఉపాసన వలన అమ్మవారు హయగ్రీవుడు గా వచ్చి మంత్రగాడి ని చంపి గాయకునికి అపకీర్తి రాకుండా కాపాడిన ది .

        ఎవరైతే ధార్మికత సాత్వికత నిస్వార్ధత తో శివ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ని నమ్మి అన్య ఆలోచన లేక మనసులోనే ఏకాగ్రతతో పరమాత్మను మననము చేసు కుందూ రో వారికి ఇతరుల తాంత్రిక మంత్ర ప్రభావం వల్ల ఏర్పడు చతుర్విధ కష్టములు దరికి రానీయక అమ్మ అనుంగు దేవత శ్రీ ప్రత్యంగిరా దేవి

మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా |

సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ || 154 ||

o మూర్తా,ఽమూర్తా   :-   మూర్త అనగా అమ్మవారి సగుణ స్వరూపము అనగా ప్రకటితమైన చిత్ర రూపము గాని లేక శిలా విగ్రహం రూపము గాని . ఎవరైతే ఆ రూపమును హృదయ పీఠము నందు సుప్రతిష్ఠితం చేసుకొని మన : పూర్వకంగా ఆరాధించు వారికి అమ్మవారు చేరుఏవగును .

         అమూర్త అనగా పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు ఆకారము లేని నిర్గుణ తత్వ స్వరూపిణి . నిర్గుణ ఉపాసన యందు ముఖ్యముగా మంత్రముల ద్వారా ఆరాధన జరుగును . అయితే ఉపాసకుల అనుకూలతను అనుసరించి పూజా విధాన మార్పు మాత్రమే . అమ్మవారు మూర్తా రూపము   అమూర్త రూపము ఆమెయే .

o నిత్యతృప్తా   :-   అనునిత్యము తృప్తిగా నుండు అమ్మవారు అఖండ ఆనంద స్వరూపిణి .

o ముని మానస హంసికా   :-   మునులు ప్రశాంత చిత్తముతో నిష్కల్మష హృదయముతో అమ్మవారిని మనసునందు మననము  చేస్తూ ధ్యానింతురు . అట్టి నిరంతర ధ్యాన సమాధి స్థితిలో నున్న మునుల మనసులో అమ్మవారు హంసరూపంలో ఓలలాడుతూ ఉండును 

ముని శ్రేష్టులు అమ్మవారిని ఆవిధముగా దర్శి స్తారు . మునుల యందు అమ్మవారు ముఖ్యప్రాణ శక్తిగా ఉండును .

o సత్యవ్రతా   :-   అమ్మవారిని ఉద్దేశించి చేయు వ్రతములు ,నోములు ,పూజలు అన్నియు సత్య వ్రతము లే . అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి కావున ఆ పరబ్రహ్మ తత్త్వమే సత్ . మనము నిత్యమూ పూజలు చేయునపుడు ఓం తత్సత్ అని సంకల్పించి మన పూజ భగవంతునికి  ఆర్పిస్తున్నాము . 

      కొంతమంది అసంబద్ధమైన నియమాలను ఏర్పరచుకొని శరీరమును క్షోభకు గురి చేస్తూ పూజలు వ్రతాలు చేసిననూ అవి ఫలించవు .అదే విధముగా అమ్మ యందు నమ్మకముతో చేయు వ్రతాలు సత్కర్మలై అవి సత్య వ్రతములగును . అమ్మవారు ప్రకృతిలో నిర్వహించు కర్మలు అన్నియు సత్యములే .

o సత్యరూపా   : -   అమ్మవారు ఈ విశాల విశ్వం అంతటినీ నడిపించు నియామకురాలు . సర్వజనులకు అన్నము , ప్రాణములను ఇచ్చి ఆదిత్య స్వరూపిణిగా ఉండి సమస్త ప్రకృతి శక్తుల యందు వివిధ రూపాలలో ఉండి ప్రజలను కాపాడు చున్నది .

o సర్వాంతర్యామినీ   :-   అన్నింటి యందు వ్యాపించి ఉన్నది . మనందరిలోనూ అంతర్యామిగా ఉండి చైతన్యము రగిలించి నడిపించు తల్లి .

o సతీ   :-   వివిధ లక్షణములు కలిగిన అమ్మవారు మహాపతివ్రత . ఆమె పరబ్రహ్మస్వరూపిణి . నిరంతరమూ పరమాత్మతో కలిసి ఉండుటకు ఇష్టపడును .

బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా |

ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః || 155 ||

                   సతీ అను పదమునకు మరొక భావన గా  శ్రీ చక్రము నందు సప్త సతులైన అమ్మవారి అనుచర దేవతలు ఉందురు . వారు బ్రాహ్మీ , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి ,వారాహి ,ఇంద్రాణి  ,చాముండి వీరినే సప్తమాతృకలు అందురు . ఈ విధముగా ప్రధమ చతురస్రము యందు ఏడుగురు ,మధ్యమము నందు ఏడుగురు , ఉత్తమమునందు ఏడుగురు మొత్తము 28 మంది దేవతా సతులచే ఆరాధింపబడుతుంది .కావున అమ్మవారు సతీదేవి .

o బ్రహ్మాణీ   :-  బ్రహ్మదేవుని సతీమణి సరస్వతి దేవి  ,పుచ్చ భాగము అందరి కంటే పైన అనగా ఆనందనిలయమునకు ఆవలి లోకములో ఉండు తల్లి .

       మరొక భావన లో అగ్ని భట్టారకుని బ్రహ్మణి అందురు . రుత్విక్కులు యజ్ఞము చేయునపుడు యజ్ఞగుండం నుండి అగ్ని శిఖ ఉద్భవించును . అట్లు పైకి వచ్చిన అగ్ని నాలుకలతో ఎక్కువ ఎత్తుగా వచ్చిన దానిని  ‘అణి ‘ అందురు . బ్రహ్మములైన వేద మంత్ర పఠనముతో యజ్ఞము జరుగును కావున అమ్మవారే వేద మంత్ర స్వరూపిణి కనుక బ్రహ్మాణీ అను నామము . శ్రీవిద్యను కూడా  బ్రహ్మాణీ అందురు . బ్రహ్మ విద్యా స్వరూపాలు ఆయా దేవతల పేర్లతో దశ మహా విద్యలు గలవు . 1 పాశాంకుశేశ్వరీ 

2 భువనేశ్వరి  3భైరవి 4 త్రిపుట  5 అశ్వారూఢ 6 నిత్యక్లిన్న7 అన్నపూర్ణ 8 త్వరితరాజకాళి 9 తారాషోడశి 10  మాతంగి

o బ్రహ్మజననీ   :- అనగా బ్రహ్మ దేవుని జననమునకు కారణమైన తల్లి . బ్రహ్మము అనగా వేదమంత్రములు . వేదములకు జనని గాయత్రి దేవి .

o బహురూపా  :-  అన్ని రూపములు అమ్మవియే .  దుర్గా ,లక్ష్మి, సరస్వతి , అన్నపూర్ణ మొదలగునవి . అయితే పరతత్వ భాషణము చేయునపుడు నిర్గుణ రూపములలో ఏ రూపము లేనిది . సగుణ రూపములో అనేక రూపాలలో ఆరాధిస్తాము .

o బుధార్చితా  :-   వేద మంత్ర స్వరూపిణి బ్రహ్మాణీ దేవిగా , యజ్ఞ రూపిణి అయిన అమ్మను ఋత్విక్కులు జ్ఞానులైనందున వారిచే ఆరాధించబడే తల్లి లలితాంబికా .

o ప్రసవిత్రీ   :-  త్రిలోక జనని అయిన అమ్మ వారు ఈ ప్రపంచంలో మన అందరినీ కన్నతల్లి .

o ప్రచండాఽజ్ఞా  :-   అమ్మవారి ఆజ్ఞలకు శాసనములకు ఎవరు ఎదురు చెప్పలేని క్రియా శక్తి కలది . అవసరమగు  వేళ కోప తాపములు ప్రదర్శితం చేయు తల్లి . చండీ కాళికాదేవి స్వరూపములు అట్టివియే .

o ప్రతిష్ఠా ప్రకటాకృతిః  :-   ప్రకటింపబడు ఆకృతి గల తల్లి అమ్మవారు శివశక్త్యైక్య రూపిణి గావున శివుని మూర్తి స్వరూపాలు అన్నింటికీ మూల చైతన్యశక్తి రూపిణి అమ్మయే . శ్రీచక్రము నందున త్రైలోక్య మోహన చక్రమందు ప్రకట యోగినులను యోగినీ దేవతలందరు . కెరటాలకు సముద్రము ఎలా ఆధారమైనదో సమస్త విశ్వమునకు  అమ్మయే ఆధారము .

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ |

విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః || 156 ||

o ప్రాణేశ్వరీ   :-   సర్వ మానవులకు  ప్రసవిత్ర దేవి అయిన అమ్మవారు ప్రాణ నియామకురాలుగా ఉండి తన చైతన్య శక్తి తో మనలోనే దాగి ఉన్న ఈశ్వర స్వరూపిణీ .

o ప్రాణదాత్రీ   :-   అమ్మవారు కేవలం ప్రాణ ప్రదాతయే కాక మనకు తగిన బుద్ధి శక్తులను ఇచ్చి బ్రతికించుచున్నది . అందుకే పండుగల యందు అమ్మవారిని చిత్తశుద్ధితో ఆరాధిస్తూ మనకు బ్రతుకునిచ్చిన బతుకమ్మను నిరంతరమూ మననము చేసుకొనవలెను .

o పంచాశత్-పీఠరూపిణీ  :-   సర్వేంద్రియ శక్తికి ప్రాణదాత అయిన అమ్మవారు వివిధ  ప్రకటఆకృతులలో నున్న అమ్మ 51 శక్తి పీఠములు యందు ప్రతిష్టించబడి దేశమంతటా వ్యాపించి ఉన్నది . ఈ 51  శక్తి పీఠములు మన తెలుగు అక్షర మాతృకావర్ణ రూపములే . కుండలిని వ్యవస్థ యందు పైనుండి దిగువకు భృగు మధ్యమున ఉన్న ఆజ్ఞా చక్రము నందు రెండు అక్షరముల తోనూ ,కంఠము నందు ఉన్న విశుద్ధ చక్రమునందు 16 అక్షరములతో  ,హృదయము నందు ఉన్న అనాహత చక్రము నందు 12 అక్షరములతోను ,నాభి నందున మణిపూరక చక్రము నందు 10 అక్షరములతో ,అండాశయము నందు  ఉన్న స్వాధిష్ఠాన చక్రము నందు 6 అక్షరములతో , పృష్ఠము నందున్న మూలాధార చక్రము నందు 4 అక్షరముల తోనూ , మొత్తం 50 అక్షరములతో ను, శిరస్సులో బ్రహ్మరంధ్రము నందున సహస్రార చక్రము నందు ఏక రూపములో  ‘ర ‘ కార అక్షర రూపిణిగా నున్న అమ్మవారే అఖండ ఆనంద స్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి దేవి పీఠం .

       51  దేవి పీఠములు వివిధ ప్రదేశములలో ఉన్న కొన్నింటిని ఇవ్వడమైనది . 1 కాశీలో విశాలాక్షి 2 నైమిశారణ్యం లో  లింగ ధారిణీ 3 ప్రయాగలో లలితా దేవి 4  గోమంతము నందు విశ్వ కామ 5 హస్తినాపురంలో జయంతి 6 పుష్కరము నందు పురుహూతి  7 శ్రీశైలం మాధవి 8 గయలో మంగళాదేవి 9 గోదావరిలో త్రి సంధ్య దేవి 10 ద్వారకలో రుక్మిణి 11 బృందావనమున రాధాదేవి 12 వింధ్యపర్వతమున వింధ్యవాసిని 13 జలంధరమున విశ్వ ముఖి  14 కాశ్మీర మున మేధా దేవి  15 కాంచీపురమున కామాక్షి 16 త్రిపురలో ఓడ్యాన  పీఠము 17 మలయాచలమున కళ్యాణి దేవి 18 మందర పర్వతముపై కామ చారిణి 19 కన్యకుడ్యము నందు గౌరీ దేవి  20 త్రికూట మున రుద్ర సుందరి .... మొదలగునవి . ఇవికాక అనేకము కలవు .

o విశృంఖలా   :-   శృంఖలములు లేనిది అనగా  ఎలాంటి సంకెళ్లు లేనిది . మానవుల వలె అనుగుణమైన సంసార బంధములు అమ్మవారికి ఉండవు .

o వివిక్తస్థా   :-   అమ్మవారు ఏకాంతముగా ఏకాకిగా ఒంటరిగా నుండుటకు ఇష్టపడు తల్లి . అదే విధముగా అమ్మవారి భక్తులైన రుషితుల్యులు తపోనిష్ఠతో లోక సంబంధాలు లేని నిర్జన ప్రదేశముల యందు అమ్మను ఏకాంత సేవ చేసికొందురు . పవిత్ర ప్రదేశముల యందు చేయు సేవలను అమ్మ స్వీకరించును.

o వీరమాతా  :-   వీరులు అనగా భక్త్యుపాసక శ్రేష్టులు  .శ్రద్ధా శక్తులతో అమ్మవారిని ఆరాధించు భక్తులందరూ వీరులే .అట్టి వీరుల అందరకు మాతయై ఉన్నది .

        మరియొక భావనలో చూచినచో కుమారస్వామి జన్మ సంబంధిత విషయంలో శివుని వీర్య శక్తి శరవణము ( రెల్లుగడ్డి ) యందు పడి అది అగ్నికి ఆహుతి అవుతుండగా అమ్మ తన చల్లని చూపుతో అగ్నిని అర్పగా అందుండి అందమైన బాలుడు ఉద్భవించ అమ్మ ఆ బాలుని కడకేగి కుమార అని పిలుచుటచే కుమార స్వామి , శరవణ భవుఁడు అయినాడు  . అప్పుడు అమ్మవారు స్కందమాతయైనది . అయితే సర్వజ్ఞులైన గణపతి ,వీరభద్రస్వామి లను కూడా వీరులందురు . అందువలన అమ్మవారు కుమార గణ వీరభద్ర స్వరూపిణి . అంతర్యాగ సిద్ది పొందుటకు అమ్మవారిని హృదయ చక్రమునందు ఆరాధించు భక్తులు ఎల్లరునూ వీరులే .

o వియత్ప్రసూః   :-   మానవులందరికీ  ప్రాణ శక్తి నొసగిన తల్లి . అనేక శక్తి పీఠములలో అనేక ప్రకట ఆకృతులతో ప్రతిష్టించబడి వీరమాతఅయి భక్తుల సేవలను అందుకున్న తల్లి .

ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ |

భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ || 157 ||

o ముకుందా   :-   అనగా పరమ భాగవతోత్తములు జగద్గురువు శ్రీకృష్ణుడు . ఆయన అవతార కాలమునందు అటు తనచే సంహరించబడిన రాక్షసులకు ,తనను ఆరాధించిన సమస్త గోపికా స్త్రీలకు దయతో ముక్తినొసగిన ఆనంద స్వరూపుడు . అదే విధముగా అమ్మవారు మిక్కిలి సమ్మోహన శక్తి     కలది . కావున భక్తులందరూ ఆకర్షితులై అమ్మను సేవించుటవలన ముక్తి ప్రసాదించు తల్లి .

o ముక్తి నిలయా   :-  ముక్తికి నిలయమైన తల్లి .

o మూలవిగ్రహ రూపిణీ   :-   సాధారణముగా దేవాలయము నందు రెండు విధములైన విగ్రహరూపములలో నుండును . మూలవిరాట్  స్వరూప విగ్రహము ఒకసారి ప్రతిష్టించిన తరువాత కదిలించరు . ఉత్సవ విగ్రహములు పర్వ దినములయందు బయటకు తెచ్చి ఊరేగింపు చేసెదరు . మూలవిరాట్ విగ్రహము ప్రతిష్టించినప్పుడే అనేక మూల మంత్రములు వేదమంత్రముల నుండి గ్రహించి మంత్రోచ్చారణతో ప్రతిష్ట జరుగును కావున ఆ విగ్రహములు మంత్ర గ్రహణశక్తి పొంది ప్రకాశితమగును . అసలు విగ్రహము అనగా విశిష్టముగా గ్రహించేది అని అర్థము .

       మరొక భావన లో  నవావరణ శ్రీ చక్రము నందు బిందు స్వరూపిణిగా నున్న అమ్మవారు మూలవిరాట్ స్వరూపిణి . ఆమెయే శ్రీ రాజరాజేశ్వరి దేవి జగన్మాత , లలితా పరమేశ్వరి అమ్మవారు .

o భావజ్ఞా   :-   అందరి మనోభావాలు తెలిసిన తల్లి .భావము అనగా స్వరూపము .

o భవరోగఘ్నీ.   :-   ప్రజలందరూ అనేక విధములైన బంధు ప్రియత్వం కలిగి వారి సంసారములో అనేక ఈతి బాధలు అనుభవిస్తూ ఉంటారు . అట్లు ఏర్పడు కష్టనష్టములే భవ రోగములు అందురు . మానవులకు కలుగు భవ చింతన రోగములను అమ్మవారిని సేవించిన పోగొట్టును .

o భవచక్ర ప్రవర్తినీ  :-   భవము అనగా లోకంలో మానవజన్మమునకు సహజముగా జరుగుతుంది ఒక సృష్టిచక్ర విధానమైన పుట్టుట , పెరుగుట , చనిపోవుట ఈ మూడు ప్రక్రియలు సృష్టి స్థితి లయలనే చక్ర బంధము నందు ఇమిడ్చి మనలను అందరినీ నడిపిస్తున్న తల్లి అమ్మవా రే . అందుకే ఆ మరుజన్మలు లేని విధముగా చేయుమని యథాశక్తి అమ్మవారిని పూజించిన మన కోరిక తీరవచ్చు .

        ఉదాహరణకు  మనము ఒక విత్తనము నాటినపుడు ముందు మొలకగా వచ్చి తదనంతరము చెట్టు గా మారి వృక్షమై ఫలముల నందించును . అయితే  మనము వేసిన విత్తనం మొలక రాగానే లయమైపోయి ఒకదాని తరువాత పూర్వ పరిణామము మార్పు చెంది సృష్టి నుండి లయమగుచున్నవి . అలా లయము కానిచో మొలక వృక్షము కాజాలదు . ఇదే పరమేశ్వరుని సంహార ప్రక్రియ . సంయక్ + హారము అనగా ఒకదానితో మరొకటి అను సంధానం చుట . మనము ఈ లోకంలో ఏం చేస్తున్నామో మానవ సృష్టి విషయంలో త్రిమూర్తుల వలన అదే జరుగుతున్నది . ఆ త్రిమూర్తులు అమ్మవారి నియామకులే కావున అమ్మవారే భవ చక్ర ప్రవర్తిని అయి నడిపించు చున్నది .

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ |

ఉదారకీర్తి, రుద్దామవైభవా వర్ణరూపిణీ || 158 ||

o ఛందస్సారా  :-   సర్వ వేద మంత్రములు గాయత్రి స్వరూపములే . వేద మంత్రము లన్నియు శ్రీవిద్య యే . ఈ మంత్రము లన్నియు అమ్మవారి తత్వసారము తెలుపునవే . ఛందస్సు అనగా వేదమంత్ర గమనమును తెలిపేది . 7 కోట్ల వేద మంత్రములు వివిధ ఛందో రూపములలో ఉండును . కావున ఛందస్సు వేదమే .

o శాస్త్రసారా  :-  శాస్త్రములు అనగా శృతులు, శాస్త్రములు , ఉపనిషత్తులు ,ఆగమ మంత్రములు , పురాణములు వీటియందు ఉన్న అన్ని మంత్రములు అమ్మ రూపములే . మనసునందు మననము చేసి కొన్నవే మంత్రములు . ఉపనిషత్తు లందు అమ్మవారి గురించి మంత్ర పూర్వక వివరణము ఎక్కువగా కలదు . అమ్మవారు సర్వశాస్త్రసారస్వతస్వరూపిణీ .

o మంత్రసారా   :-  సారము అనగా ఉద్దేశ్యము , తాత్పర్యము , హృదయము . కావున ఏ మంత్రం అయినా జపించవలెనన్న గురూపదేశముతో మంత్రార్ధము గ్రహించి వాచకం మానసిక అనుష్ఠానము మనస్సు నిలకడగా ఉంచుకుని అభ్యసించిన శీఘ్ర ఫలితము పొందవచ్చును . సకల మంత్ర సార స్వరూపిణి అమ్మవారు . అసలు మంత్రములు అంటేనే బలము అని అర్థము . ఎవరైతే ఇంద్రియ నియంత్రితముగా  పరాశక్తిని ఆరాధింతురో వారికి తగిన శక్తి యుక్తులు ప్రసాదించును .

o తలోదరీ   :-  పైన తెలిపిన విషయములు వేదము , మంత్ర స్వభావము తెలిపి అమ్మవారి రూపవర్ణన చేయుట గమనార్హం . తలోదరి అనగా సమయం ఉత్తమమైన తలము గల ఉదరము కలది . మరియొక భావనలో పరిశీలించిన తలము అనగా చోటు . కావున అమ్మ ఉదరమునందే సర్వలోకములను కలిగి  ఉన్నది . ఉదాహరణకు భూతలమునకు దిగువ అతల ,వితల ,సుతల ఇలా సప్త లోకములు  కాక పై లోకములను కూడా  తన ఉదరమునందే ఉంచుకుని అన్ని లోకములకు అగ్ర లోకమునందు తానుండి పాలించుచున్నది .

      శ్రీ చక్ర పరంగా భావించిన త అను వర్ణము ఆరు సంకేతము కాగా ల అను వర్ణము మూడు సంకేతము కాగా మొత్తం 9 నవావరణములకూ ఉదరము ( అనగా లోపలి ) భాగము బిందు రూపిణి అమ్మవారే .

o ఉదారకీర్తి  :-  దాపరికం లేక విస్తరించిన కీర్తి కలది అమ్మవారు . సర్వ చైతన్య శక్తి స్వరూపిణి అయిన అమ్మ అనంత కీర్తివంతురాలు .

o రుద్దామవైభవా    :-   మిక్కిలి ప్రకాశవంతoగా ఉండి ఉన్నతంగా ఉన్న అధికారిణి .సర్వాధికారిగా అన్ని లోకములను పాలించు తల్లి .

    మరియొక భావనలో పరిశీలించిన ఉత్ అనగా గొప్పది అని అర్థము . ఆదిత్య మండలాంతర్వర్తి అయిన అమ్మవారు సూర్య భగవానునకు తన  ప్రకాశచైతన్య శక్తినిచ్చి వైభవోపేతంగా ఈ సర్వ జగత్తును వెలుగులతో నింపుచున్నది . అమ్మవారు  పరంజ్యోతియై కాంతులు వెదజల్లు చున్నది .

o వర్ణరూపిణీ   :-   వివిధ  వర్ణము (రంగులు ) లతో వేరువేరు స్వరూపాలతో విలసిల్లు తల్లి . సరస్వతీ రూపిణిగా శుద్ధ ధవళకాంతులతో ప్రకాశించును . లక్ష్మీ లలితా రూపిణిగా ఎర్రని అరుణ కాంతులతో తేజోమయ రూపంలో నుందురు . కాళికాదేవి గా ఆవిర్భవించినపుడు నల్లని మేని ఛాయ లో ఆ తల్లి మెరయు చుండును . ఆదిత్యుని పరంగా ఆకాశాన వానవిల్లు సంభవించినప్పుడు అమ్మ సప్తవర్ణ శోభితయై కనువిందు చేయుచున్నది .

       మరొక విధముగా విచారణ చేసినచో వర్ణములనిన అక్షర రూపములు . వర్ణములనగా ఆశ్రమములు , మరియు సంస్కారయుతంగా మానవులలో ఏర్పడిన చాతుర్వర్ణ రూప జాతులు . అక్షర రూపిణిగా అమ్మవారు మాతృకావర్ణరూపిణి .


జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ |

సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా || 159 ||

           గురూపదేశం తో అమ్మవారి మంత్ర జపం సాధన  చేయాలనుకుంటే గురువు ద్వారా ఆ మంత్ర స్వరూపము , స్వభావము , ప్రభావం తప్పక తెలుసుకొనుట ముఖ్యము . అయితే  ప్రతి మంత్రమునకు ఆ మంత్రాధి దేవత యొక్క రూప వర్ణన ధ్యాన శ్లోకoతో ధ్యానించి వివిధ వర్ణముల లో నున్న దేవి త్రిలోక జననిని ఆరాధించాలి .

o జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ   :-  ఇది అంతయూ ఒకే నామము మానవ శరీరము మూడు విధములైన తపన శక్తి భయాందోళితముగా ఉoడును . 1 జన్మము 2 మృత్యుభయం 3 జరా భయం . జర అనగా శరీరము క్షీణించి ఇంద్రియ పటుత్వము కోల్పోవుట .  మృత్యువు ఏ దశలోనైనా రావచ్చును . ఆత్మ మాత్రము అమ్మ స్వరూపం అయినందున ఏ దశనందైనా అమ్మవారి నాశ్రయించి ఎవరు ధ్యానింతు రో అట్టివారికి మరుజన్మ లేక మోక్ష ప్రాప్తి కలిగించి విశ్రాంతి కలుగజేయును . విశ్రాంతి అనగా స్థూల ,సూక్ష్మ, కారణ మైన శరీరము ఆత్మ ను విడిచి నప్పుడు విశ్రాంతి పొందును .

o సర్వోపనిష దుద్ఘుష్టా. :- ఉద్ఘుష్టా అనగా ఘోషించు ట , చాటుట , ఎలుగెత్తి చెప్పుట . వేదములు నాలుగు కాగా వాటి ఉపాంగములుగ వేదాంగములు 200 వరకు ఉన్నప్పటికీ అందు 108 మాత్రము వాటి నామములతో ఉపనిషత్తులు గా పిలవబడుతున్నవి . ఉపనిషత్ మంత్రము లన్నియు అమ్మవారిని వర్ణిస్తూ కీర్తిస్తూ స్వరూప ప్రభావములను సత్యములుగా నిరూపిస్తూ ఘోషింపబడుచున్నవి . అందుచే అమ్మవారు ఉపనిషత్ ప్రతిపాదిత రూపిణి అయినది .

     అయితే అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి ? బ్రహ్మ తత్వ చింతనకు దగ్గరగా చేర్చుట . గురూపదేశం తో ఉపనిషద్విద్య నేర్చి నేను , నాది అను అహం తొలగించుకుని సంసారకూప సంబంధ వాసనలు లేక అజ్ఞానము వీడి భేద భావము లేక జీవాత్మ పరమాత్మ ఒకటేనని జీవ బ్రహ్మ స్వరూపిణి అమ్మవారేనని తెలిపేది ఉపనిషత్తులే .

o శాంత్యతీత కళాత్మికా   :-   శాంతి అనగా ఓంకార వర్ణ రూపమైన అమ్మ పరమార్థము గ్రహించి సన్యాసిని అయి అన్నీ విడిచాను గదా ఇక నాకు మోక్షప్రాప్తి తప్పనిసరి అని ఒక విధమైన బ్రాంతిలో నుం1దురు . కాన వారిలో మోక్ష కాంక్ష అను కోరిక అలానే లౌకికంగా పీడిస్తూనే ఉంటుంది . తంత్ర శాస్త్ర ప్రకారము స్థూల సూక్ష్మ కారణ శరీరము వీడి ఎవరైతే సంసార స్పృహ లేక భ్రాంతి పోగొట్టుకొని మళ్లీ వెనక్కి రాని స్థితికి చేరుదు రో ఆ అతీత శక్తిని తురియాతీత స్థితి అందురు .ఈ స్థితి యందు సాధకుని ఆత్మ అమ్మ యందు లీనమై సిద్ది పొందును .

       మరొక విధముగా భావన చేసినచో శాంతి అనగా ఆకాశము అను అర్థము కలదు . శాంత్యాతీత అనగా ఆకాశానికి అతీతమైన పరతత్వ స్వరూపము . స్థూల రూపమైన భూమి జలము నుండి ఉద్భవిoపగా , జలము అగ్ని నుండి , అగ్ని సూక్ష్మ రూపమైన ( కనపడని వాయువు నుండి ) , వాయువు కారణభూతమైన ఆకాశమునుండి జనించును . ఈ ఆకాశమునకు అతీతమైనది తురీయాతీత మైన  పరాకాశము . అదియే అమ్మవారి పరతత్వ స్వరూపము .  అందుచే అమ్మవారు శాంత్యాతీతకళాత్మికా అయినది . కళాత్మక అనగా అద్వైత జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మ సర్వోపనిషత్తుల ప్రబోధము వలన ప్రకాశవంతమైన రూపముతో వెలుగొందుతున్నది . 

కళ = ప్రకాశము. ఆత్మికా. =రూపము

గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా |

కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా || 160 ||

o గంభీరా   :-   జగన్మాత అయిన అమ్మవారు తలోదరియై సర్వ లోకములను తన ఉదరమునందే ఇముడ్చుకున్న అనంతత్వ రూపిణ్యై మిక్కిలి సర్వోత్కృష్టమైనది . అమ్మ తత్వం చాలా లోతైనది . అమ్మ పరతత్వ అనుభవము తెలుసుకొనుట చాలా కష్టము ,నిరంతర తత్వ విచారణ తోనే సాధ్యము . జగద్వ్యాపిణి అయిన అమ్మవారిని అత్యంత లోతైన మడుగు తో పోల్చుట వలన ఆమెకు మహాహ్రాధ అను నామము ఏర్పడును .

       గo అను బీజాక్షరము గణపతి  మంత్ర స్వరూపము . ఆయన పరబ్రహ్మ స్వరూపుడు . ఆ పరతత్వం గ్రహించుట కొరకే గ కార శబ్దం తో నాలుగు నామములు కూర్చబడినవి . గంభీరముగా అనగా లోతైన అర్థముతో కూడిన వేద మంత్రములు . అమ్మయే వేదమాత సర్వ ఉపనిషత్తులు ప్రబోధించుట చేత ఆమె గంభీర అయినది . ఎవరైతే అమ్మ మంత్ర వీర్య అనుభవము పొందుదురో వారు అమ్మ కృపకు పాత్రులగుదురు .

o గగనాంతఃస్థా   :-   గగనం అనగా ఆకాశం అంతస్థా అనగా లోపల . ఆకాశం అనంతమైనది దాని లోతు ఇoత అని చెప్పనలవి కాదు .ఆకాశపు అంచులకు ఆవలి పైన పరమాత్మ స్థానము . ఆ పరమాత్మ రూపము అమ్మయే కావున గగనాంతస్థ . ఆకాశమును ఖగోళము అందురు . ఖ అనగా లోతైనదని అర్థము . స్థూల రూపమైన భూమి నుండి పైకి జలము , అగ్ని ,సూక్ష్మ వాయువు ,  కారణరూపఆకాశము ఆపైన పరతత్వ స్వరూపిణిగా అమ్మవారు యుండును .

o గర్వితా.  :-   అన్ని లోకముల కంటే ఎత్తయిన స్థానములో నుండి గర్వముగా పరిపాలించు తల్లి . అయితే అమ్మ ఎప్పుడూ ఒకేలా ఉండి ఒక ఫల వృక్షముతో పోల్చబడింది . వృక్షమునకు పుష్పములు పూసి కొన్ని రాలి నేల రాలిన నూ నిర్వికారంగా ఉండి మిగిలినవి మాత్రమే ఫలములుగా ఎట్లు మారు నో  అదే నిర్వికార స్థితిలో అసాధారణ రీతిలో ఏకాకిగా నుండును . బహుళము లేక ఏకత్వం గర్వకారణమే గదా !

     దేవతలందరితో సమానంగా ఉంటూనే అధికారిణిగా  ఉండుటచే ఆమెను అహం కలిగిన పరాహంత అందరు . జీవునకు అహం ఉంటే అభివృద్ధి శూన్యం అవుతుంది . పరమాత్మకు అహం ఉండి నేను అనుకున్న వెంటనే అమ్మ చైతన్యం దోహదపడి సృష్టి జరిగి ఏకత్వము గా నున్న స్థితి బహుళ మై విరాజిల్లుట గర్వమే కదా ! 

o గానలోలుపా    :-   ఎవరైతే ఆనందానుభూతి అనుభవింతురో వారి సంతోషాన్ని గానములో కీర్తిస్తూ వెలువరించెదరు . భక్తులకు అమ్మ దర్శనభాగ్యం లభించి నప్పుడు వారి కీర్తనలకు అమ్మ స్పందించి ఆ గానామృతము స్వీకరించును . అమ్మవారు సంగీత సరస్వతి రూపిణి కావున ఇతరుల గానం ఆలకించుటకు ఇష్టపడును . వశిన్యాది వాగ్దేవతలు కూర్పు చేసి అమ్మవారి ఎదుట ఆలపించిన ఈ లలితా సహస్ర నామము లన్నియు నాదస్వరూపు ముతో నుండి  కర్ణపేయములే గదా !

o కల్పనారహితా. :- కల్పనా అనగా తయారుచేయుట . ఈ ప్రపంచము నంతటిని సృష్టించినది అమ్మ వారే . అయితే సృష్టి వలన ప్రపంచములో ఏర్పడు కష్టములకు ఆమెకు ఎలాంటి వికార స్వభావము లేక నిర్వికారంగా ఉండును . కానీ మానవుల జన్మాంతర సుకృత ప్రభావము వాసన రూపంలో తరంగముల వలె జన్మజన్మలకు వ్యాపించును .

o కాష్ఠా   :-   కల్పనా రహితమైన అమ్మవారు ఏక స్థితి యందు అవ్యక్త రూపిణిగా పరబ్రహ్మమునకు పైన పరాగతిగా ఉండునది . మరొక భావన లో పరిశీలించిన శివుని అష్టమూర్తి తత్వరూపములలో ఆకాశQమూర్తికి భీమా అను నామము కలదు . ఆ పేరుతో ఉన్న ఆ మూర్తి భార్యను కాష్టా  దేవి     అందురు . ఈమె పది దిక్కుల యందు వ్యాపించి ఉండును .

        మరో భావములో విచారించినచో వేద వేదాంగములు లోని మంత్రములను నిశ్చల భక్తితో మనో బుద్ధులను నిగ్రహించుకొని నిష్ఠగా ఆరాధించు వారిని కాష్టా అందురు . అటులనే కాలగణన చేయువారు 18సార్లు చేసే రెప్పపాటు కాలమును కాష్టా అందురు . జ్యోతిష పరిభాషలో ఈ పదము కలదు .

o కాంతా   :-  సలక్షణ స్వరూపమైన అమ్మవారి రూపం మిక్కిలి కమనీయమైనది . క అనగా వేద పరిభాషలో బ్రహ్మ కావున క అంతా అనగా బ్రహ్మ లోకమునకు పైన ఉండునది . సంధి విడమరిచి అకాంతా  అను భావన చేసినచో దుఃఖనాసిని అని అర్థము .

o కాంతార్ధ విగ్రహా  :-   పరతత్వ రూపిణీ అయిన అమ్మవారు పరమేశ్వరుని లో అర్ధభాగం అయినందున అర్ధనారీశ్వరి విగ్రహ స్వరూపిణి అయినది ..


కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా |

కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ || 161 ||

o కార్యకారణ నిర్ముక్తా   :-   సృష్టి చేయుట యందు మాత్రమే నిమిత్తమైన అమ్మవారు కల్పనా రహితయై ప్రాపంచిక విషయ కర్మ కారణములతో సంబంధము లేనట్టుగా ఉండు తల్లి .

o కామకేళి తరంగితా    :-   అమ్మవారు నిరంతరం ఆనందడోలికల యందు పరవశించును . మరొక భావనలో వ్యక్తీకరణ భావంగా పరిశీలించిన కామా అనగా కామేశ్వరుడు కావున సృష్టి స్థితి సంహారము ఆయన ఆడే ఈ జగన్నాటకం మరల మరల ఆడించు ఆట యందు భాగస్వామిగా ఉన్న అమ్మవారు .

         శ్రీచక్ర పరంగా విచారించినచో బిందు స్వరూపిణిగా ఉన్న అమ్మవారు తన అంతరంగ ఆనంద తరంగాలతో బిందు స్థానము నుండి ఒక ఆవరణమునకు విస్తరించి నవావరణము జరిగినది .

o కనత్-కనకతాటంకా.   :-  ప్రకాశవంతమైన బంగారు తాటంకములు గలది . దీర్ఘ అక్షరమైన ఓంకారమును తాటంక మందు దరిoచిన అమ్మవారు బీజాక్షర స్వరూపిణి .

o లీలావిగ్రహ ధారిణీ     :-  లీల అనగా అమ్మవారు అవసర సమయము లో అనాయాసంగా స్వతంత్రముగా తన లీలలు ప్రకటించు కొనును . ఆయా లీలలందు వివిధ విగ్రహ రూపమును ధరించి ఉన్నది అయితే అమ్మవారి ఉపాసకులకు సగుణ రూపమున సాక్షాత్కరించును .

అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ |

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా || 162 ||

o అజా   :-   లీలా విగ్రహ దారిని అయిన అమ్మవారు శాశ్వతురాలు కావున ఆమెకు జన్మము లేనిది . మానవులకు వలె పుట్టుట గిట్టుట ఉండవు .

o క్షయ వినిర్ముక్తా  :-  నశింపు లేనిది ఎల్లప్పుడూ ఉండునది .

o ముగ్ధా   :-   అమ్మవారు జ్ఞాన రూపిణ్యై నిత్య యవ్వనంగా ఉండును . అంకురిత యవ్వనంలో పరిపూర్ణత కలిగి ఉండును .

o క్షిప్రప్రసాదినీ   :-   ఈ పై నామములతో కలిపి నాలుగింటిని క్షిప్ర ప్రసాద జగదంబ మంత్రము అందురు . వెంటనే మోక్షమును ఇచ్చునది . క్షిప్ర.  = వెంటనే

o అంతర్ముఖ సమారాధ్యా   :-   అమ్మవారి  వేద మంత్రములను అభ్యసించేవారు గురువు ఉపదేశానుసారం శాస్త్ర పద్ధతి ప్రకారం అమ్మ యందు అఖండ విశ్వాసముతో గురువు ద్వారా మంత్రార్ధము శ్రవణము చేసి ఆ పిదప నిర్మల మనస్సుతో మననము చేసి మనసునందు నిలుపుకొన వలెను . ఎవరైతే మంత్రములను భావనా మాత్రము గా మననెస్ము చేయుదురో వారిని భావనా యోగులు అందురు . ఆ యోగము సాధించవలెనన్న అంతఃకరణము లో అమ్మ తత్వజ్ఞానం సంపూర్ణంగా గ్రహించి ఆ జ్ఞానమునే ఆర్ఘ్యముగా అమ్మవారికి సమర్పించి , అదియే హవిస్సుగా భావించి , నిత్య జ్ఞాన యజ్ఞం ఆచరించు వారిని అంతర్ముఖఆరాధకులు అందురు . అలా అంతర్ముఖులు చే ఆరాధింపబడుతుంది కావున అంతర్ముఖ సమారాధ్యా అయినది .

    మరొక భావన లో  ఉపాదులకతీతంగా జీవాత్మ , పరమాత్మ వేరు కాదని ఒక్కటేనని మనసులో భావన చేసి పరమేశ్వరరాధనతో అంతరంగమున అభేద స్థితిలో నిద్రా సమాధి స్థితికి చేరుదురో వారు భావనలోనే పరమాత్మ సిద్ధి పొంది శివైక్యం చందుదురు . ఈ విషయము భావనోపనిషత్తు నందు విపులీకరించ బడినది .

o బహిర్ముఖ సుదుర్లభా   :- అమ్మవారి యందు నిశ్చిత విశ్వాసము లేక మనసు నిలకడ లేని స్థితిలో ఎంతో గొప్పగా ఆడంబర బాహ్య పూజతో అమ్మదయ పొందుట మిక్కిలి మహా కష్టము . అందరి హృదయాలలో నే అమ్మ ఉండగా గ్రహించకపోవడం దురదృష్టము .

త్రయీ త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ |

నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః || 163 ||

o త్రయీ   :-   త్రయి అనగా మూడు వేదములు . ఋగ్వేదము ,యజుర్వేదము , సామవేదము ఈ మూడు వేదములు మంత్ర స్వరూపములు . అమ్మవారు వేద మంత్ర స్వరూపిణి కావున ఈ మంత్రములు అన్నిటి యందు తానే ఉండును . ఈ వేదములు 3 ఆది భౌతిక ,ఆది ఆధ్యాత్మిక , ఆది దైవిక అను త్రి శక్తుల గూర్చి బోధించుచున్నవి . ఇహపర సుఖముల సాధన వీటి అధ్యయనము వలన లభించును .

o త్రివర్గ నిలయా   :-   ధర్మ అర్ధ కామ ములను ఈ మూడింటిని పురుషార్ధములు అందురు . కొంతమంది సంపన్నులు సంపద ఉండిననూ దాన ధర్మములకు దూరం గా నుందురు . మరికొంతమందికి ధర్మాచరణ యందు కోరిక ఉన్నప్పటికీ తగిన ఆర్థిక స్తోమత లేక మిన్నకుందురు . అయితే ఈ మూడు వర్గముల అందు తానే నిలయమై ఉండి నడుపుతున్నది . అమ్మవారు ధర్మార్థ కామములను నెరవేర్చుటకు తగిన ప్రేరణ శక్తినిచ్చి సంకల్పము కలిగించును .

      మరొక భావన లో చూసినచో అ ఉ మ అను త్రయీ అక్షర సమ్మేళనము ఓంకారం అయినందున అమ్మవారే ఓంకార స్వరూపిణీ కావున ఆమె వర్గ నిలయ అయినది .

o త్రిస్థా   :-  మూడు లోకములను ముగ్గురు త్రిమూర్తులను తానే సృష్టించిన అమ్మవారు .

o త్రిపురమాలినీ :-   మూడు లోకములందు చైతన్యవంతంగా వ్యాపించి ఉండు తల్లి . మనసు , బుద్ధి ,చిత్తము అను మూడింటి యందు చైతన్య రూపంలో తానే ఉండును . శ్రీ చక్ర అంతర్గత చక్రమందున్న అమ్మవారిని త్రిపుర మాలిని అందురు .

      మూడు దాతు వ్యవస్థ లైన జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థ లందున్న అమ్మవారు త్రిపుర మాలిని దేవి . జాగ్రదావస్థలో ని అనుభవాలకు కారణం జాగరణి  .ఇక్కడ జీవాత్మ విశ్వుడు . స్వప్నావస్థలో జీవుడు సూక్ష్మరూప ఇచ్చట ప్రేరేపించు వాడు తైజసుడు . గాఢనిద్ర అనుభవించు జీవుడు సుఖ జీవిని ప్రాజ్ఞుడు అందురు . అమ్మవారికి ప్రాజ్ఞ అను నామము కలదు .

o నిరామయా   :- అమ్మ వారు ఎలాంటి వ్యాధులు లేని తల్లి .

o నిరాలంబా   :-   ఎలాంటి ఆధారము అవసరం లేనిది . ఆలంబము అనగా ఆసరా లేక భరోసా  . ఈ ప్రపంచమంతయు అమ్మ ఆలంబన తోనే గమనము జరుగుతున్నది . మనకు ఇతరుల ఆలంబన కావలయును గాని సర్వ నియామకురాలు తానే అయినందున ఆమె నిరాలంబా .

o స్వాత్మారామా  :-  అమ్మవారు  నిరాలంబనగా ఉండి ఈ జగత్తును పాలిస్తూ పరిపూర్ణమైన ఆత్మానందం అనుభవించు తల్లి . అదే విధముగా ఎవరైతే అమ్మను ఆరాధించు విషయములో అమ్మవారి తత్వము హృదయమునందు నిలుపుకొని ప్రాపంచిక జ్ఞానము విడిచి సమాధి స్థితి కి జేరి ఎలాంటి సాంసారిక అభిలాషలు లేని స్థితిలో మనస్సు , బుద్ధి శూన్య స్థితికి చేరినప్పుడు ఆత్మానందం అనుభవించును . అయితే మానవులు ఇంద్రియ కాముకులై బహిర్ముఖ ఆరాధనల తో బాహ్య సుఖములు పరిత్యజించకపోవుటచే అమ్మవారి ప్రాపకం పొందలేకపోతున్నారు .

o సుధాసృతిః  :-   అనగా అమృత ప్రవాహము . ప్రపంచము అంతా సర్వవ్యాపకమైన అమ్మవారు తానే ప్రపంచమై ఆత్మానందం అనుభవిస్తూ అమృతవాహిని గా ఉండి అందరికీ ఆరోగ్య ప్రదాతగా అమృతేశ్వరీ నామముతో విరాజిల్లుతున్నది . తానే బ్రహ్మమై అందరియందు తానే ఉండి ప్రపంచమంతా ఆత్మీయ ఆనందం పంచుతున్న తల్లి .

      భూమండలమంతా  సుఖముగా భరించు తల్లి అమృతోపమాన మైన చైతన్య స్వరూపిణి . ఆమెను చంద్రకాంత శిలలతో పోల్చబడింది . ఆ శిలలపై చంద్ర కాంతి ప్రసరించినప్పుడు కొంత తడి కాంతి వెలువడును .ఆ వెలువడిన ఆర్ద్రత దయా కాంతియే జ్ఞానము . అమ్మవారు దయనూ , జ్ఞానమును రెంటిని తన చల్లని చూపులతో మనపై ప్రవహింప చేయును .


సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా |

యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ || 164 ||

o సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా   :-   ఈ శ్లోక పాదము అంతయు ఒకే నామముగా బావించవలెను .

      సుధా స్తుతి అగు అమ్మవారు మన యందు దయతో  సంసార లంపట బురద మడుగులో పూర్తిగా మునిగి పోయిన వారిని ఆ పంకము నుండి  వారిని పూర్తిగా నిశ్చయాత్మకముగా పైకి లాగి కాపాడుట యందు ఉద్యుక్తురాలు .

        మరొక  భావనలో ఎవరైతే అనన్య యోగంతో అమ్మని ధ్యానించు వారిని అలనాడు భూమండలము సముద్రమునుండి తన కోరలతో వరాహ స్వామి ఎట్లు పైకి తీసెనో  అదేవిధముగా వారాహిదేవి అగు అమ్మవారు సంసార కూపము నుండి  మనలను ఉద్ధరించునని భావించవలెను .

o యజ్ఞప్రియా   :-   వేదశాస్త్ర విహిత కర్మాచరణమును యజ్ఞమందురు . మనసు నందే సంకల్ప మంత్రశక్తితో చేసుకోను యజ్ఞం రూపమును అంతర్యాగ మని బాహ్యముగా వేద మంత్రోచ్ఛారణలతో చేయునది బాహ్య యాగమ నీ  అందురు .

            అర్హత గల వారు వేద మంత్ర పఠనము విడిచిపెట్టక నిరంతరము అభ్యసించవలయును . ఏలనన అమ్మవారే వేద స్వరూపిణి అయినందున ఆ వేద మంత్రములతోనే యజ్ఞము జరుగును గాన అమ్మకు యజ్ఞము నందు మెండైన ప్రియత్వము గలది . యజ్ఞము నందు ఉపయోగించు హవిస్సు , అగ్ని, ఋత్విక్కులు , సమస్తము అమ్మ రూపమే . కావుననే అమ్మ యజ్ఞ రూపిణి .

o యజ్ఞకర్త్రీ   :-   యజ్ఞమును చేయవలెనన్న తపన కలిగించి ఆ దిశగా చైతన్యము నిచ్చి ఆ కర్మాచరణకు ప్రేరణనిచ్చే  తల్లి కావున ఆమెయే యజ్ఞకర్త మరియు భోక్త అయినది .

            యజ్ఞము చేయువానిని యాజి అందురు . ఆ చేయువాడు సహధర్మచారిణి తో కలిసి  . అట్లు చేయునపుడు ఆ దంపతుల యందు శివపార్వతుల ప్రకాశము ద్యోతకమగును . యజ్ఞము చేయువానిని యాజిదీక్షితుడు అందురు .

o యజమాన స్వరూపిణీ  :-   ఎవరైతే యజ్ఞము నిర్వహించు తలంపుతో ఉండి ఆ కర్మాచరణకు పూనుకుందురో వారి యందు అమ్మవారు విద్యుల్లత వలే ప్రవేశించి ఆ కార్యనిర్వహణకు వలయు సంబారములు అన్నీయు సమకూర్చి నిర్విఘ్నముగా పూర్తి కావించు తల్లి . యజ్ఞము నందు యజ్ఞకర్త గా ఉండి యజమాని రూపంలో తానై ఉండు తల్లి .

ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ |

విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ || 165 ||

o ధర్మాధారా   :-   ఎవరైతే యజ్ఞ ధర్మములను పాటించి పూర్తి చేయుదురో వారికి అమ్మయే ధర్మము కావున ఆ ధర్మమునకు ఆలంబనగా ఆధారమగు తల్లి . ధర్మం అంటేనే ఆధారం . అదియే వేదము .

         మనము ఈ దేశ నివాసితులము కావున ఇతర దేశ వాసులతో పోల్చుకొనక మన దేశ ఆచార పద్ధతులను గౌరవిస్తూ విహిత కర్మలు చేసి అమ్మ ఆశీస్సులు పొందాలి . అదే విధముగా ప్రతి కుటుంబం పారంపర్యముగా సంక్రమించు ఆచారములను క్రమానుగతంగా ఆచరించు వారియందు కరుణ కలిగి యుండును .

o ధనాధ్యక్షా   :-   ధనము అనగా ధన్యతను ఇచ్చేది . ఏ వ్యక్తి తనకు లభించిన ధనముతో మంచి మంచి కార్యములు చేయునో ఆ పనుల వలన ఆ వ్యక్తికి ధన్యత చేకూరును . అట్లు ధన్యులయిన వారికి జ్ఞాన ధనము నిచ్చి మంచి పనులు చేయుటకు బుద్ధి పుట్టించి వలసినంత ధనమును తన భక్తుడైన కుబేరుని ద్వారా తానే ధనాదక్షురాలు అయినందున సమకూర్చు తల్లి అమ్మవారు .

o ధనధాన్య వివర్ధినీ   :-   భారతదేశంలో యజ్ఞ సంకల్పము కలిగిన వారికి అందుకు కావలస ధనము , ధాన్యము ,ఇతరములు మొదలగు సంబారములు సమకూర్చు తల్లి . ఇన్ని విషయములందు యజ్ఞ అభిలాష కలిగిన యజమానికి ఆ యజ్ఞ మంత్ర నందు ప్రావీణ్యత కలిగిన విప్రుడు అవసరం  .

o విప్రప్రియా   :-   యజ్ఞ నిర్వహణ మంత్రపఠనం నందు మంచి పాండిత్యము కలిగి చక్కని ఆచారవంతుడై సనాతన సాంప్రదాయ సదాచార వర్తనులైన బ్రాహ్మణుల యందు అమ్మవారు ప్రియత్వం కలిగి ఉండును . అట్టివారు గురుస్థానములో ఉండి వేద ధర్మములను వారు ఆచరించి శిష్యులకు మార్గదర్శులు అగుదురు .

o విప్రరూపా   :-  విప్ర ప్రియమైన అమ్మవారు యజ్ఞ సమయమందు విప్రులు వేదమంత్రములు చదువుతున్నప్పుడు కేవలం ప్రాణశక్తిని ఆ మంత్రము లందు ఇమిడ్చి పఠించు వారియందు విప్ర రూపిణిగా ఉండును .

o విశ్వభ్రమణ కారిణీ  :-   సర్వవ్యాపకమైన అమ్మవారు ఈ విశ్వములో జరుగు యజ్ఞ ప్రభావము వలననే ధర్మము ఆధారపడి ఉన్నందున ఆ ధర్మమునకు ఆధారము అమ్మయే గనుక ఈ విశ్వమునంతటినీ ధర్మయుతముగా నడిపించు విశ్వచక్రభ్రమణ రూపిణి .

విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ |

అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ || 166 ||

o విశ్వగ్రాస   :-      ఈ సమస్త విశ్వమునకు మనము అనునిత్యము దేవుని పేర జరుపుకొను కార్యక్రమములు అన్నియు క్రతు సంబంధమైనవే .ముఖ్యముగా యజ్ఞయాగాదులకు ఉపయోగించు ద్రవ్యములనన్నింటిని అమ్మవారు ఆహారంగా స్వీకరింతురు .

o విద్రుమాభా.  :-   యజ్ఞ స్వరూపిణి అయిన అమ్మవారు అగ్ని రూపంలో పగడపు కాంతుల మెరుపులతో విరాజిల్లుతున్నది .

             మరియొక భావనలో పరిశీలించిన విత్ అనగా వేద జ్ఞానము . ధ్రుమ అనగా ఫల వృక్షము . ఒక వృక్షమునకు కాండ భాగము వేదములు అనుకుంటే శాఖలు ప్రాణములు కాగా పుష్పములు క్రతువులు కాగా అందుండి వచ్చు ఫలములు మోక్షము . అందుచే అమ్మవారు చెట్టువలె సంపూర్ణ జ్ఞాన స్వరూపిణిగా విరాజిల్లు కాంతి స్వరూపిణి .

o వైష్ణవ విష్ణురూపిణీ :-  విశ్వాంతరాళం అంతటా వ్యాపించి ఉండు తల్లి .అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం గావించినప్పుడు సర్వం సృష్టించు వాడను ,లయము చేసేడి వాడను తానే అని చెపుతూ నేనే పురుష రూపంలో విష్ణువు గాను , స్త్రీ రూపంలో అమ్మ లలితా దేవి వైష్ణవి గా నుండి తాను మా ఇరువురకు తేడా లేక అభిన్నురాలై అలరారును .అందుచే అమ్మ విష్ణు రూపిణీ .

అయోనిర్యోనినిలయా :-  అయోనీ అనగా కారణము లేనిది అమ్మవారికి జనన మరణములు ఉండని శాశ్వతురాలు ప్రపంచమునకు మాత్రమే కారణం ఉండును . ఈ ప్రపంచానికి అతీతంగా ఒకచోట యుండును .

             యోని అనగా జన్మ కారణము కలిగి ఉండునది . ఇది ప్రపంచ జీవులకు సహజము .

       మరొక భావనలో శ్రీ చక్ర అర్థములో పరిశీలించిన అయో అనగా బిందువు . యోని అనగా త్రికోణ రూపము . కావున ఈ రెంటికీ అవినాభావ సంబంధము కలదు కనుక త్రికోణ మధ్యమున ఉన్న బిందు నిలయ అయినది .

       నిలయ అనగా అమ్మవారు లయ కారిణి .మరియు ప్రకృతిపరంగా జన్మ కారిణి కూడా . ప్రకృతిని యోని గా భావించిన చో అమ్మవారి చైతన్య ప్రకాశమే వీర్య రూపమై ప్రకృతి విస్తరించుచున్నది .

o కూటస్థా   :-  ఈ ప్రపంచమంతయు మాయా జనితమైనది  కావున అమ్మయే అధిష్టించిన మాయా స్వరూపిణీ .

కూటస్థ అనగా సమూహము . మానవ శరీర నిర్మాణం అంతయు వివిధ ఇంద్రియ సమూహము  వలననే ఏర్పడి అమ్మ ఇచ్చిన ప్రాణ శక్తి పై ఆధారపడి ఆ చైతన్య ప్రభావమే సకలేంద్రియములకు విస్తరిoచుట చేతనే జీవనము సాగుతున్నది .

       మరొక భావములో చూసిన మనదేశంలో అమ్మవారి పీఠములు అనేకములు కలవు . వాటినే కూటములు అందురు . ముఖ్యమైనవి కామరాజ కూటము , ఓడ్యాన కూటము  ,పూర్ణగిరి కూటము , జాలంధర కూటము . మనము ఆయా కూటముల యందున్న అమ్మలను దర్శించి ఆశ్రయము పొందవచ్చును .

o కులరూపిణీ  :-  ఎవరైతే సనాతన ధర్మానుసారము పరంపరాగత సంప్రదాయాలు పాటిస్తూ నిరంతర అమ్మవారి తత్వచింతనతో ఆరాధింతురో వారి హృదయము నందు అమ్మవారు నిలిచియుండును .

        యజ్ఞ ప్రియమైన అమ్మవారు యజ్ఞ క్రియా సంకల్పములకు నాంది యై తానే యజమాన రూపమై ధర్మ రక్షా భారము వహించి వలయు ధనధాన్య సంబారములు చేకూరునట్లు చేసి తగిన వేద మంత్ర ఋత్విక్కులుచే ఫలప్రదం గావించి యజ్ఞ హవిస్సును ఆరగించు విష్ణు స్వరూపిణి .


వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ |

విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా || 167 ||

o వీరగోష్ఠీప్రియా   :- సకల శాస్త్ర పారంగతులు అయిన పండితులను వీరులు అందురు . వారు నిత్యమూ అనేక మంత్రశాస్త్ర విషయములందు సాహిత్యవిద్య విషయములలో చర్చోప చర్చలు జరుపుతూ అనేక  గోష్టులు నిర్వహింతురు . విప్ర ప్రియ అయిన అమ్మవారు ఆ పండిత గోష్టులు వీనులవిందుగా నుండుటచే వాటి యందు ప్రియత్వం చూపును .

o వీరా. :-  అమ్మవారు అనేకమంది రాక్షసులను సంహరించినప్పుడు తన వీరత్వము ప్రదర్శించినది . ఉదాహరణకు కాళికాదేవిగా భండాసురవధ సందర్భము నందు , మహిషాసుర వధ సమయములో దుర్గాదేవి , చాముండేశ్వరి , వారాహిదేవి మొదలగు అవతార రూపము లందు అమ్మవారి వీరత్వము గోచర మగును .

     మరొక భావన లో పరిశీలించిన భర్త పిల్లలు కలిగిన స్త్రీ స్వరూపురాలును వీర అందురు . ఆనంద రూపిణీ అయిన అమ్మవారికి గణపతి ,సుబ్రహ్మణ్యుడు అను ఇరువురు సంతానము కలిగి భర్త ఈశ్వరునితో ఇష్టా గోష్టి గా ఉండుట యందు ఆసక్తి చూపును .

o నైష్కర్మ్యా   :-  అమ్మవారు తానే వేదమాత సకల మంత్ర స్వరూపిణి అయిననూ ఉపాదుల వలన ఏ కర్మలు లేనిది . ప్రపంచ వాసులగు మనకు మాత్రమే కర్మాను బంధములు గాని అమ్మవారు వాటికి అతీతురాలు .

      వేద హిత జ్ఞాన సంపన్నులైన యోగులు పరమేశ్వరుని ధ్యానములో నిమగ్నం అయినప్పుడు ఇహము మరచి సమాధి స్థితిలో చేరినప్పుడు ఆ యోగి తామరాకుపై నీటిబొట్టు వలె ఏమియు అంటక ఉండును . అటువంటప్పుడు పరమేశ్వరునికి గాని పరమేశ్వరికి గాని ఏ క్లేశములు కర్మలు అంటవు . అందుచే నిష్కర్మ్యరాలు అయినది .

o నాదరూపిణీ  :-  అమ్మవారు మాతృకావర్ణ రూపిణి . మనము మాట్లాడు మాటలన్నియు వ్యక్తము లైన శబ్ద రూపములు . అయితే ఈ వ్యక్త రూపమునకు ముందు సూక్ష్మ రూపముగా అవ్యక్తానికి వ్యక్తా నికి మధ్య నాద రూపమై అమ్మయే శబ్ద రూపిణిగా మారి మనచేత పలికించు చున్నది .

      మరొక విధముగా పరిశీలన చేసినచో త్య్రక్షాక్షర సమ్మిళితమైన ఓంకారము నాద రూపము గల అమ్మవారిని ఓంకార రూపిని అందురు . అయితే యోగులు ఓంకార నాదం జపించునపుడు మూలాధార చక్రము నుండి ప్రారంభమై అనాహత చక్ర స్థానము ( హృదయము )  చేరు సరికి ఓంకారము మూడు దశలు దాటి తురీయ దశ అయిన  ఓంకారము పైన అనగా నాద శిరస్సు అనాహతము చేరిన వినపడని ఆ నిశబ్దరూపమే నాద రూపిణి అయిన అమ్మవారు . అనాహతం అనగా వినపడనిది  . నాహతం అనగా వినునది అని అర్థము .

      మరొక భావములో యోగులు గురు మధ్యమున ఆజ్ఞా చక్రము నందు పరమేశ్వరుని ధ్యానించు నప్పుడు నాద అనుభూతి కలిగి సహస్రారము చేరి అమ్మ యందు విలీన మగుదురు .

o విజ్ఞాన కలనా   :-    చతుర్వేదములు , షడంగములు ,ఉపనిషత్తులు ,అష్టాదశ పురాణములు , న్యాయశాస్త్రము మొదలగు చతుర్దశ ( 14 ) శాస్త్ర కలయికయే విజ్ఞాన కలన . ఇలా కూర్చిన సమస్త శాస్త్ర విద్య లందున జ్ఞాన స్వరూపిణి యే అమ్మవారు . అనగా బ్రహ్మ విద్యాస్వరూపిణి .

       సకల శాస్త్ర విద్యలు అభ్యసించిన వారు వారి పాండిత్యాన్ని అనుభవానికి తెచ్చి తెలివితేటల నిచ్చే తల్లి . శాస్త్ర విజ్ఞానము కేవలము పదార్థ జ్ఞానం మాత్రమే . ఎవరైతే శాస్త్ర శబ్ద ముందు జ్యోతి స్వరూపము గా ఉన్న అమ్మను భావింతురో వారు పరమార్థ జ్ఞాన సాధకులు .

o కల్యా   :-  సర్వ కళలకు నిలయం సమస్త విద్యల యందు నేర్పరులైన అమ్మవారు సర్వ శాస్త్ర విజ్ఞానము లను సంకలనము చేసి ఏర్పాటు చేసినది . ఎవరైతే ఆ శాస్త్ర ప్రకారము గ్రహించి అమ్మ తత్వజిజ్ఞాస యందు అనురక్తి కలిగి ఆ దైవము నే ధ్యానము గా ధ్యానింతురో వారికి శాస్త్ర యోగ్యత కలిగించు తల్లిని కల్యా అందురు .

       ఇంత ప్రపంచం నిర్మాణము ఒక క్రమపద్ధతిలో కలనము చేసిన నేర్పరిని కల్యా అందరు  . ప్రతి దినము సూర్యుని ఉష కాలమును కల్యా అందురు . ఆరోగ్య ప్రదాత యగు సూర్య దర్శనం మంగళకరము . అట్టివారి నిరోగ స్థితి కల్యా అందురు . ప్రభాత సూర్య దర్శనము శుభప్రదము .

వేరు వేరు కళలయందు మానవాళికి కలుగు ఆసక్తికి తగిన విధంగా జ్ఞానము పెంపొందింప చేయును . అలా చైతన్యం కలిగించిన అమ్మవారిని కల్యా అందురు . మంగళకరమగు కళ్యాణములను కల్యా అందరు .

o విదగ్ధా  :-  అనగా విశేషమైన నేర్పరితనము గలది . అనగా మిక్కిలి చాతుర్య శీల . ఏ ప్రాణికి ఎలాంటి శక్తి అవసరమో అందుకు అను గుణ  జ్ఞానము సమకూర్చు తల్లి . ఉదాహరణకు పక్షికి రెక్కలు , సాలీడు గూడు మొదలగునవి . విజ్ఞాన శాస్త్ర విషయ అధ్యయనము వలన అనేక విషయములను తమ  పరిశోధనలతో ఆ శాస్త్ర పరిణితి పొందుతారు . అదే విధముగా ఆధ్యాత్మిక తత్వచింతన బోధ పడవలెనన్న కేవలం సాధన వలననే అమ్మ తత్వం సుబోధకము అగును . ఆ చింతన వల్లనే అమ్మ ఆశ్రయము లభించును .

o బైందవాసనా :-  పరమాత్మ  స్పందన శక్తి వలన అమ్మవారు శివశక్త్యైక్య రూపిణీగా శ్రీ చక్రము నందు త్రికోణ మధ్యములో బిందువు నే ఆసనముగా చేసుకొను తల్లి . బిందు సంబంధముగా నున్న ఆవరణ లలోని 42 త్రికోణ బిందువుల యందును అమ్మ ఆసీనురాలే . త్రికోణ ఆవరణ వెలుపల బిందువే వృత్తాకారం గా విస్తరించి ఉండి అంతటా తానే ఉండును .

            మరొక భావన లో ప్రతి త్రికోణము మూడు బిందువుల కలయికతో ఏర్పడినది . ఆ త్రికోణ మధ్యమున చైతన్య రూపిణిగా అమ్మ ఉండి త్రికోణ 3బిందువులూ జాగ్రత్ ,స్వప్న ,సుషుప్తులకు కారణ చైతన్య మగుతున్నది .

         అదే విధముగా మన లో మూడు విధములైన ఇచ్ఛా ,జ్ఞాన ,క్రియా శక్తుల కలయిక త్రికోణా oతర్గత అయిన త్రిపుర సుందరి చైతన్యము వలననే జరుగుతున్నది . మనము పుట్టుక నుండి మరణము వరకు శ్వాసించుటను ఆధ్యాత్మిక పరిభాషలో హంస జపం అందురు  .ఈ హంసను విశ్లేషణ చేసినచో మన తెలుగు అక్షరములలోని అచ్చుల అంత్య అక్షరాలైన అం అః లతో పోల్చబడినవి . మనము లోనికి గాలి తీసుకున్నప్పుడు శ్వాస నాళములు తెరుచుకుని హo గా క్షణ మాత్రం ఉండి సహా అను రూపములో గాలి బయటికి వచ్చి లయమై నాళము మూసుకోనును . సః అనునది విసర్గ కావున తాత్కాలిక లయముగా నుండి ఆ ప్రక్రియ నిరంతరము కొనసాగును . ఈ ప్రక్రియలో హo నది పురుష సంకేతము కాగా ,సః అనునది స్త్రీ సంకేతముగా యుండి ఆంగ్ల పదము లైన he ,she లు గా ప్రతిపాదిత పదములు ఏర్పడినవి . ఈశ్వాస కలయికే శివశక్తి ఏకరూపమైన అర్ధనారీశ్వర తత్వం . ఈ హంస జపమును బిందు మంత్రము అందరు .శిరస్సు నందున సహస్రార చక్ర స్థానము నందున్న బిందు స్వరూపము అమ్మవారే .

         వశిన్యాది వాగ్దేవతలు అనేక విధాలుగా అమ్మవారిని స్తుతిస్తూ ఒక క్రమణిక గా అమ్మ నామముల కూర్పు గొప్పగా జరిగినది . వివిధ కూటములoదు గురువర్యా కుల రూపిణిగా ఉండి ఆ పండిత గోష్టులను ఇష్టపడి వీరురాలై తన కుటుంబంతో ఆనందముగా ఉండి నైష్కర్మ్యగా నాద రూపిణిగా  సకల శాస్త్ర విజ్ఞానము సమకూర్చి ఎంతో చతురతతో ప్రపంచమంతా వ్యాప్తి చెంది ప్రతి వారి యందు జ్ఞాన స్వరూపిణిగా సహస్రార బిందువు లో  ఆసీనురాలై యుండును .

           బైందవాసన అను నామమును త్రికోణానాత్మకముగా పరిశీలించిన మన శ్వాస యందు నిరంతరం ప్రాణశక్తి గా ఉంటూ శ్వాస జరుగుచున్నది . ఇచ్చట హంస అను రెండు అక్షరములలో హ అనునది పరబ్రహ్మము .ఈ హకారము సున్నాతో కలిసినపుడు నాదస్వర రూపమైన బిందువు అమ్మ శక్తి స్వరూపము గనుక హ కారము తో బిందువు చేరి హం అయి పరబ్రహ్మ స్వరూపిణి అయి సృష్టి ప్రారంభమగును .హం అనునది  ఉచ్ఛ్వాస కాగా స:అను అక్షరము విసర్గ తో కూడిన హకారం వలన.   స కారముతో కలిసి సహా అయినది . స కారము శివశక్తి ఏకాత్మకం కావున శివస్వరూపం లయాత్మక మైనందున విసర్గ హ కారము విష్ణు స్వరూపముగా భావించ , అమ్మ వైష్ణవియే కావున అవినాభావ సంబంధంతో శివ కేశవులు అభేదులని గ్రాహకము కాగా లయమైన సృష్టి వెంటనే ప్రారంభమగును . ఇచ్చట హం లో వున్న బిందువు సః లో ఉన్న విసర్గ  రెండు బిందువులు కావున మొత్తం మూడు బిందువులు కలిసి సృష్టి స్థితి లయలకు సంకేతముగా త్రికోణము ఏర్పడగా అంతర్గతముగా అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా బైందవాసనగా ఉన్నది .

తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ |

సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ || 168 ||

o తత్త్వాధికా   :-   ప్రపంచము మౌలికంగా 24 తత్వముల తో కూడి ఉన్నది . అది ప్రకృతి శక్తులగు పంచభూతములు , పంచ కర్మేంద్రియములు , పంచ జ్ఞానేంద్రియములు , సత్వ రజ తమో గుణములు ఇలా ఇవి అన్నియు పదార్థ ఉపాధులే కానీ కాలంలో ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవును . శాశ్వతము కావు . అమ్మవారు మాత్రమూ ఈ పంచకోశ  శక్తులకు అతీతురాలై ప్రాపంచిక విషయములకు సంబంధము లేక ఉండును . ఈ పంచ తత్వాలు అన్నింటిపైనా అధికురాలుగా తానుండి పరతత్వ స్వరూపము గా నిలిచి శాశ్వతురాలైనది .

o తత్త్వమయీ.  :-  ప్రాపంచిక అనుభూతులకు లోనుకాని పరతత్వ రూపిణిగా ఉంటూనే అన్ని తత్వముల యందు తానే వ్యాపించి ఉండి ఆ ప్రాపంచిక తత్వములు జడత్వం కానీయక తన చైతన్య శక్తి తో ప్రేరణ పొంది  ప్రపంచ గమనం సాగునట్లు చేయుచున్నది .

      ఉదాహరణకు అనంత ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు . మన వద్దనున్న ఘటాకాశ నీటి యందు సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది . ఆ ఘటము  పగిలినప్పుడు సూర్యుడు లేకపోలేదు . అటులనే ప్రపంచ తత్వములు అన్నింటి యందు తత్వమయి గా ఉండి ఆ తత్వములు లయమైనప్పటికీ తాను సూర్యుని వలె పరతత్వ స్వరూపమై శాశ్వతరాలుగా అమ్మవారు ఉండును .

o తత్త్వమర్థ స్వరూపిణీ   :-   పరతత్వ స్వరూపిణిగా ఉన్నప్పటికీ తాను ఆత్మ రూప తత్వము గా మనలోనే ఉంటున్నది . అది ఎట్లన అసలు తత్వం అంటే ఏమిటి ? తత్వం అనే పదంలో తత్ అనగా నేను అని అర్థము  . త్వం అనగా నీవు అని అర్థము . నీవు అనేది ఉండుట చేతనే అదియే ప్రాణశక్తియై సర్వ శరీరము యందు వ్యాపించి ప్రాణ చక్ర జీవనము జరిపించు చున్నది . ఎప్పుడైతే నేను లయమైనదో అప్పుడు అర్థ భాగమైన  త్వం అను అమ్మ రూపము మహా తత్వము జేరి తత్వమసి అయినది . ఆత్మ నాశనము లేనిది 

o సామగానప్రియా   :-  బిందు రూపముతో కూడిన శబ్దము లన్నియు నాద రూపముగా ఉండి ఏదో ఒక రాగం తో పాటగా మారును . వేద మంత్రములు ,పద్యములు , స్తోత్రములు మొదలగు అన్నియు రాగయుక్తంగా ఉండి పాడుతున్నప్పుడు అవి వీనులవిందుగా ఉండును . అమ్మవారు వేదపండితులు గానయుతముగా సామవేదము ఆలపించు నప్పుడు ఆ గానము వినుటకు ప్రియత్వమ గా ఉందురు . సాత్విక స్వభావులైన దేవతలు అందరూ సామగాన  ప్రియులే .

        సామము అనగా లొంగదీసుకొనుట అని అర్థము . సాధారణముగా యజ్ఞములు నిర్వహించు వారు ఆయా దేవతల ప్రీత్యర్ధం హవిస్సు తో పాటు అవసర సంబరములు యజ్ఞగుండము నకు ఆహుతిగా నిచ్చి యజ్ఞ పరిపూరణానంతరమున వేద పండితులు సామ వేద గానము చేయుదురు . ఆ గానము విని దేవతలు ప్రియత్వం చెందెదరు . అట్లు దేవతలు సంతృప్తులై యజ్ఞ కర్తకు  యజ్ఞఫలము ప్రాప్తించెదరు.

       సామవేదము లయాత్మకంగా గానము చేయువారిని ఛాoదోగ్యులు అందురు . చాందోగ్యోపనిషత్తు యందు సామగాన ప్రాముఖ్యం చెప్పబడినది . ఋగ్వేదపఠనం వలన మంచి ఆలోచనలు కలుగునని యజుర్వేదము వలన కలిగిన ఆలోచనలు ఆచరణీయము లగునని , సామగాన శృతము వలన ప్రాణశక్తి పెరుగునని ఆసక్తితో ప్రాణోదేవీ అయిన అమ్మను ముఖ్యప్రాణ ఉపాసన ద్వారా ధ్యానించిన సంతృప్తి చెందును .

o సౌమ్యా   :-   దీక్షగా సాత్వికముగా గానము చేయుట . సోమ అనగా చంద్ర సంబంధమైనది . అమ్మవారు చంద్రమండల రూపిణి .సోమ అని కొన్ని గ్రంథములలో ఉన్నప్పటికీ సౌమ్య అయినా అర్థము ఒక్కటే .

         సోమలత అను ఒక విధమైన వృక్షము హిమాలయ పర్వత సానువులలో పెరిగే ఒక ఔషధీ  సంబంధమైన వృక్షలత . యజ్ఞ స్వరూపిణి అయిన అమ్మ ప్రీత్యర్థం ఈ సోమలత నుండి తీసిన రసమును గుండము నందు ఆహుతి చేయుదురు . దీనిని సోమరసం అందురు .

       ఒకప్పుడు నార్త్ కరోలినా కి చెందిన ఒక అమెరికా శాస్త్రవేత్త మనదేశ ఆధ్యాత్మికతకు ముచ్చటపడి దర్శనార్థం ఈ దేశము వచ్చి హిమాలయముల లో సంచరించు సమయాన ఒక రుషి కనిపించి ఆయనకు ఒక శివలింగము బహుమతిగా ఇచ్చి నచ్చిన చోట ప్రతిష్టించుకొనమనెను . ఆయన కొంతకాలం భారతదేశంలో ఉండి సంస్కృతభాషను నేర్చి అనంతరం తిరిగి తన ప్రాంతం చేరి  ఒక పర్వతముపై లింగ ప్రతిష్ట చేసి ఆ పర్వతంపై గుడి కట్టి నిత్యం పూజలు జరుపుతున్నారు . పర్వతమునకు సోమ మౌంటెన్ అని పేరు పెట్టారు .

       సోమ అనగా మరో భావనలో స +ఉమ = సోమ అనగా సదాశివుని తో కూడిన ఉమాదేవి . ఆమె సౌమ్యు రాలు . ఈ శివశక్త్యైక్య రస రూపిణి రస ద్రవస్థితిలో మనలో కుండలినీ వ్యవస్థ యందు చేరి తద్వారా సంచరిస్తూ ప్రాణ శక్తిని ఇచ్చి చైతన్యవంతం చేయుచున్నది .అట్లు నిరంతర అమ్మ ఆరాధన తో తాదాత్మ్య స్థితికి చేరి భగవద్ ఆనంద స్థితి అనుభవించు వారిని సౌమ్యులు అందరు .

o సదాశివ కుటుంబినీ   :-   ఈ సర్వజగత్తు నందున మానవాళి ఒకే కుటుంబం అనుకుంటే దానికి గృహస్థుగా సదాశివుడు , గృహిణిగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సర్వదా మంగళకరంగా పాలించుచున్నారు .

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ |

స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా || 169 ||

o సవ్యాపసవ్య మార్గస్థ   :- సవ్య అనగా ఎడమ అపసవ్య అనగా కుడి . ఆమె కుడి ఎడమలoదు సంచరించు అమ్మవారు మార్గము అనగా సుషుమ్న నాడి కుడి ఎడమల నాడులు ఇడా పింగళ అనునవి . ఈడ పింగళ నాడులు ద్వారా మూలాధార చక్రము నుండి సహస్రారము వరకు సవ్య అపసవ్య దాసలందురు . శివశక్త్యైక్యరూపిణీగా సదా సంచరిస్తూ ఉండును . కుండలిని వ్యవస్థ ద్వారా అమ్మను ఆశ్రయించిన వారు మార్గమున సహస్రారము జేరి మరుజన్మలు లేక ఉందురు 

      మరొక భావములో పరిశీలించిన మార్గస్థ అనగా వెతుకు నది అని అర్థము . అమ్మవారి ఆశ్రయము పొందుటకు ఉపనిషత్తుల యందు రెండు మార్గములను నిర్దేశించి ఉన్నారు . ఒకటి ప్రేమ మార్గము రెండు శ్రేయో మార్గము . 1 ప్రేమో మార్గము  : ఈ మార్గము ప్రకారము అమ్మను ఆశ్రయించు ఆరాధకులు వామాచార పద్ధతిలో తాత్కాలిక ఐహిక సుఖసంపదలు కొరకు అనేక పూజలు , యజ్ఞములు చేయుదురు . ఇవి అన్నియు ప్రతిఫలం ఆశించి తమ కోరికలు తీర్చుకొనుటకు చేయునవి . అయితే వీరియందు కూడా అమ్మవారు దయ చూపేదరు . ఈ విధమైన మార్గము సవ్య ఆరాధన అందురు . 2 శ్రేయో మార్గము  : ఈ మార్గము ఆచరించు భక్తులు నిరంతరం అమ్మ తత్వజ్ఞాన చింతనతో ఉంటూ కేవలం పరమార్థ ధ్యాస లో ఉండి ఏ కోరికలు లేక అమ్మను జపించు చుందురు . వీరు దక్షిణాచార పరులు  .వీరు అపసవ్య మార్గీకులు . వీరు త్వరగా మోక్షప్రాప్తి పొందెదరు . ఎడమ కంటే కుడి శ్రేష్ఠము గావున ఈ ఆచారము ఆచరించ తగినది అని పెద్దల ఉవాచ .

o సర్వాపద్వి నివారిణీ :-  పరమేశ్వరునకు ఎలాంటి సంకటములు లేవు . మానవులు సహస్రారము అనగా బ్రహ్మపురి చేరుటకు రెండు విధాలుగా దేవయానం అని పితృయానం  అనే రెండు గతులు కలవు . దేవయాని గతి సాధించవలెనన్న అమ్మను నిరంతర శ్రవణ ,కీర్తన ,ఆరాధన , పఠన , పారాయణ , ద్వారా రుషిత్వముగా ఆరాధించు వారలకు మరుజన్మలు లేక సద్గతి లో మోక్షము సిద్ధించును .

పితృయాన విషయంలో ఉపాసనా పరులు లౌకిక ధర్మములకు లోబడి పితృ కార్యములు నిర్వహిస్తూ అమ్మ ఆరాధన ఆసక్తిగా చేస్తూ ఎవరు ఆశ్రయింతురో అట్టి వారికి వారి కర్మ అనుగుణముగా అనేక పునర్జన్మల తదనంతరము మోక్షము లభించును .అందువలన ఆశ్రయము సాధించవలెనను మానసిక శక్తితో మననము ద్వారా హృదయమున నిలిపి ధ్యానించాలి . ఈ క్రమములో సాధకులకు ఏ విధములైన ఆపదలు కలుగకుండా ఆతల్లి నివారించును .

o స్వస్థా  :-  అనగా సంపూర్ణ ఆరోగ్య ఆనందమయ రూపిణి . ఆది వ్యాధులు లేనిది . ఆది అనగా మానసిక వ్యాధి అనగా శారీరకమైనది .

      మరొక భావములో విచారణ చేసినచో స్వ అనగా నేను (అమ్మ ) ఆస్తా అనగా హృదయ స్థానము . ఎవరైతే అహం వీడి అమ్మయే ప్రపంచమంతా వ్యాపించి సర్వమానవాళి హృదయాంతరంగము నందు శివశక్తి గా ఏకే రూపిణి గా నేను అను నాద రూపిణిగా మన ఆత్మ నందే చైతన్య రూపంలో అంతర్గతముగా యుండినదని భావించిన ఆ హృదయ స్థానము నుండి వచ్చు నాదము భ్రామరీ నాదము కాగా అచట ఉన్నది భ్రమరాంబ మల్లికార్జునులు గా గుర్తెరగాలి . ఈ తల్లి ప్రతి వాని యందు స్వాత్మానంద లవీభూత గా అందరి హృదయాలలోనూ ఆనందమయి గా ఉన్నది .

o స్వభావమధురా  :-  అమ్మ వారి స్వభావము కారుణ్యము తో కూడిన మకరందము కంటే ఎక్కువ తీపి కలిగి ఉండును .

       మరో విధముగా అన్వయించుకున్నచో  పై నామము స్వభ +వమా +ధురా అని విడిగా ఆ పదముల అర్దములు తెలిసికొందము .

స్వభా అనగా స్వయంప్రకాశ శక్తితో ,వమా అనగా తాను సృష్టించిన ఈ ప్రపంచమును ,ధురా అనగా ధైర్యముగా పాలించు తల్లి .

o ధీరా   :-   అమ్మవారు ఏ విధములైన వికారములకు లోనుకాని ధైర్యముతో కూడిన జ్ఞాన స్వరూపిణి .అదే విధముగా మనము కూడా ఒక సమస్య అధిగమించ వలెనన్న అందుకు తగిన శారీరక బలము తో పాటు మానసిక శక్తి కూడా అవసరము .భీరత్వం పనికిరాదు . మనలో దీరత్వం కలగాలంటే అమ్మ  ను ఉపాసించుట వలన పెరుగును . దానివలన జ్ఞానము లభించును . జ్ఞానము మన శరీర బలం చేకూర్చును . కనుక మనము ధీరులమని అనుకోవాలన్న నామ రూపా లీలా తత్వ మాధుర్యములు స్వభావ సిద్ధంగా ఉన్న అమ్మవారిని తప్పక ఆరాధించాలి . లౌకిక జీవనయానంలో కష్టముల యందును సుఖములందు ను సమభావము కలిగి ఉపాసనా మార్గం వీడక ఆరాధించు వారిని ధీరులు అందురు .

o ధీర సమర్చితా  :-   అమ్మవారి ఆత్మజ్ఞాన తత్వము నెరిగిన మునులు , తాపసుల చేత ఆరాధించబడే తల్లి . వీరు లోక సహజమైన శోక మోహములు లేని వారు . అమ్మవారు సామాన్య ప్రజలు చేయు అర్చనలు , మునిజనార్చనలు సమభావము తోనే స్వీకరించును .

         మరొక భావములో విచారణ చేసినచో పై రెండు నామములు కలిపి ధీర ధీర సమర్చితా అయినప్పుడు సంధి కార్యము విడదీసిన ధీర + అధీర అర్చితా అనగా ఆత్మ జ్ఞాన తత్వ మెరిగిన రుషులు నిరంతర సోహo జపంతోనే  తన ఆత్మలోనే అమ్మను ప్రతిక్షేపిoచుకుని అమ్మను అర్చించు ధీరులు , సామాన్య అర్చనలతో పూజించే అధీరుల అర్చనలు సమముగా స్వీకరించే తల్లి . అధీరులకు అమ్మవారి ధీరత్వం ఇచ్చి ఆ ధైర్యంతో అమ్మ అర్చనలు విడువక చేయుదురు .

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా |

సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా || 170 ||

              ఏ మార్గంలో అమ్మవారిని ఆరాధించినప్పటికీ నిశ్చల ,నిష్కపట భక్తితో అమ్మ తత్వము తెలిసి ఉపాసించిన వారి యందు అమ్మకు గల సహజ స్వరూప సిద్ధమైన మధురిమతో వారికి ఏ ఆపదలు వచ్చిననూ నివారించును .

o చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా  :-   చైతన్యమనగా జ్ఞానము . అమ్మవారు సంపూర్ణ జ్ఞాన స్వరూపిణిగావున ఆమెను అర్చించునప్పుడు సాధారణ జలము కాక జ్ఞానార్ఘ్యము తో పూజించవలెను . అదే విధముగా సాధారణ జడత్వ పుష్పములతో కాక జ్ఞాన కుసుమాలతో ఆరాధన గావించిన ప్రీతికరము . భువనేశ్వరీ దేవి ఉపాసకులు ఉపాసించు మంత్రములను చైతన్య మంత్రములు అందురు   . . సంవిత్ఏవగరీయసీ అనునట్లు చైతన్యవంతమైన జ్ఞాన ఆరాధన పరమ శ్రేష్ఠము . సoవిత్ అనగా జ్ఞానము .

o సదోదితా  :- సదా + ఉదిత అనగా ఎల్లప్పుడూ ఉదయిoచునది . అమ్మవారు స్వయంప్రకాశ శక్తి  గలది . కావున సూర్యుని వలె అస్తమయం లేదు .

       ఉదిత అనగా అమ్మవారు ఆదిత్య మండల అంతర్వర్తి అని అర్థము . తన భక్తులకు ఆపద సంభవించిన ,వారు ఆర్తితో అమ్మను స్మరించినంతనే స్పందించి వెంటనే ఆదుకొను తల్లి .

      సత్ + ఉదిత మరో భావన లో ముని పుంగవులకూ , ధీరులైన సత్పురుషులకూ హృదయమునందు జ్ఞానానంద స్వరూపిణిగా ఉండు తల్లి .

o సదాతుష్టా   :-   ఎల్లప్పుడూ సంతృప్తిగా నుండి ఆనందముగా ఉండు తల్లి .

o తరుణాదిత్య పాటలా   :-    చిత్ అనే ఆదిత్యుడు అమ్మవారి హృదయమునందు బాల సూర్యుని వలె తెలుపు ఎరుపు కలిసిన వర్ణములతో గులాబీ పుష్పం వలె ఉండును .

దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా |

కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ || 171 ||

o దక్షిణా.   :-    అనగా సర్వ సమర్ధత కలిగి ఉండి అమ్మవారు అందరి దుఃఖములను నాశనము చేయు తల్లి  . బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి ఆగు అమ్మవారు అత్యంత సమర్థవంతముగా సృష్టి స్థితి లయలు నిర్వహించునది . శివ స్వరూపుడైన దక్షిణామూర్తి కూడా అమ్మవారి గురు స్వరూపమే . నిష్కపట భక్తితో అమ్మవారి ఆరాధన ఎవరు చేయుదురో వారికి సరళ ఉదారస్వభావిగా ఉండి సహాయపడును .

      దక్షిణ దేవి అను సుశీల నామముతో కృష్ణావతారంలో రాధాదేవి చెలికత్తెగా ఉండి కృష్ణుని వరించెను . దానికి రాధ ఇష్టపడక గోలోకము నుండి బహిష్కరించ గా కృష్ణ ఎడబాటును సహించలేక బ్రహ్మ గూర్చి తపమాచరించగా బ్రహ్మ సాక్షాత్కరించి విష్ణు అనుమతితో లక్ష్మీదేవి యందు ప్రవేశించెను . తదనంతరం ఆమెను దక్షిణాదేవిగా సృష్టించి బ్రహ్మకు అప్పగించగా ఆమెను యజ్ఞరూపంలో నుండు మనగా అగ్నిదేవుడు మోహించి భార్యగా స్వీకరించగా వారికి ఫలమను పుత్రుడు జన్మించెను . అప్పటినుండి యజ్ఞము పూర్తి అయిన పిదప బ్రాహ్మణులకు తప్పక దక్షిణ ఇచ్చి సత్కరించి యగకర్త యాగ ఫలం పొందవలెను . ఆ దక్షిణాదేవియే ఈ దక్షిణ రూపము .

o దక్షిణారాధ్యా    :-    ఉదారస్వభావులు అయిన అమ్మను ఆరాధించవలెను అన్న భగవత్తత్వం మనసు నందుంచుకొని ఆమె గుణముల స్వరూపము ఆకళింపు చేసుకొని  ఆశ్రయము పొందవచ్చును . అట్టి వారు ధీరులుగా ఉండి వారిచే ఆరాధింపబడుతుంది .

       అమ్మ ఆరాధన అర్హత పొందాలంటే సమర్ధుడైన గురువును ఎంపిక చేసుకున్న చో ఆ గురువును ఆ శిష్య సమర్ధత ,అర్హతల ననుసరించి మంత్రోపదేశము చేయగా ఆ సాధకుడు  దక్షిణుడు . అలాంటి కొద్దిమంది దక్షిణారాద్యుల వారిచే సేవిoపబడు తల్లి .

           మరొక విచారణలో అమ్మ వారి పూజా విధానం మార్గములలో వామాచార దక్షిణాచార పద్ధతులలో బ్రహ్మజ్ఞానము తో కూడి ఉన్న దక్షిణాచార విధాన పూజ అమ్మకు ఇష్టము గావున దక్షిణాదులచే ఆరాధింపబడుతుంది .

        మరొక భావన లో విచారించిన యజ్ఞమునకు సంబంధించి యజ్ఞుడు గా శివుడు కాగా ఆ యజ్ఞమునకు శివుని భార్య గా అమ్మవారు బలం చేకూర్చి దక్షిణా దేవి గా యుండి పూర్ణాహుతి అనంతరం విప్ర దక్షిణ గా మారి యజ్ఞకర్త కు ఫలము ప్రసాదించును .

      దక్షిణారాధ్యా అనగా అమ్మవారి ఆరాధన చేయుటకు అర్హులైన దక్షత కలిగిన ఆరాధకులు మనో నిశ్చయ భక్తి దీక్షాపరులు అయిన వారి ఉపాసనలు స్వీకరించును . అయితే ఆ దక్షిణా పరులను కూడా వారియందు జాలిపడి వారిని కనికరించును .

o దరస్మేర ముఖాంబుజా  :-   వికసిత పద్మము వలె నుండు అమ్మవారి ముఖము చిరునవ్వుతో ( మందహాసము )  మిక్కిలి ప్రసన్న భావనగా యుండును . అందుచే అమ్మవారు ఎల్లప్పుడూ ప్రసన్న ఆనంద జ్ఞాన స్వరూపిణిగా ఉండును .

              తమిళ్ మూక కవి అమ్మవారిని అనేక విధాలుగా వర్ణిస్తూ దేవ భాషలో మూకపంచశతి అను గ్రంథమున ఒక భాగముగా మందస్మిత శతకము అను పేర కేవలం అమ్మవారి చిరునవ్వు పైనే 100 శ్లోకముల రచనతో స్తుతించెను .

o కౌళినీ   :-   అనగా సమూహము . ఆజ్ఞా చక్రము నుండి  సహస్రారము వరకు సూర్య అగ్ని చంద్ర స్థానములు కలిసి ఉన్నందున కౌళినీ అందురు .

o కేవలా   :-   ప్రపంచమంతయు తానే వ్యాపించి ఉండి సర్వ కార్యములను ఒక్కతియే నిర్వహించుచున్న తల్లి . సర్వ జ్ఞాన స్వరూపిణి .

o అనర్ఘ్యా   :-   అనగా కొలతకు అందని తల్లి . మూల్యము లెక్క కట్టలేని అమ్మవారు . 

o కైవల్య పదదాయినీ   :-   సవ్య అపసవ్య మార్గములలో ఈ మార్గము ననుసరించి అమ్మవారి ఆశ్రయము కొరకు ఆరాధించువారు అయినప్పటికీ వారి వారి పూర్వజన్మ కర్మానుసారం ఎవరైతే లౌకిక విషయ సంపర్కం లేక చిదానంద స్వరూపిణి అయిన అమ్మను మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో ఉపాసించిన వారికి కైవల్యo ప్రాప్తిoపచేయు తల్లి . 

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |

మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||

o స్తోత్రప్రియా   :-   అమ్మవారికి సంబంధించిన వేద జ్ఞానంతో కూడిన అన్ని స్తోత్రము లందును ప్రియత్వం కలిగిన తల్లి . అవి అన్నీయు శబ్ద రూపములైన ప్రతీత మంత్ర  గీతా స్వరూపములు . మన ఋషులు ఈ స్తోత్రము ల యందు ఆరు విధములైన రహస్య అర్థములు ఉండునట్లు రూపొందించారు . ప్రతి స్తోత్రము నందు ఆ స్తోత్రము నందుగల 1 నామ వైభవం 2 అందుగల ఆశీస్సులు 3 సిద్ధాంతం 4 పరాక్రమం 5 విభూతి 6 ప్రార్ధన . ఈ అన్ని విషయముల యందు ఆ దేవతా తత్వము ఆకళింపు చేసుకుని లోతైన అర్ధ విచారణ ద్వారా అమ్మ ఆశ్రయం పొందవచ్చును . స్తోత్రములు అనగా పొగడ్తలతో కూడిన లయాత్మక సంగీతం తో ఉన్న వేద ప్రతిపాదిత సాహిత్య విలువలు కలిగిన వాటి యందు అమ్మకు మక్కువ ఎక్కువ . వేద విజ్ఞాన తత్వంతో మేళవించి చేసిన స్తోత్ర  కారక కవులను మాత్రమే మహాకవుల అందురు . మనకు అనేక స్తోత్రములు ఇచ్చిన శంకరభగవత్పాదులు ,కాళిదాసు ,పోతన , కవిత్రయ కవులు మున్నగువారు .

o స్తుతిమతీ   :-   సామగాన ప్రియమైన అమ్మవారికి వేదోపనిషత్తుల యందు అనేక మంత్ర రాజములు స్తుతి సూక్తములు కలిగి ఉండి సంగీత రాగ రూపము లో ఉండి అవి ఆలపించిన వారియెడల అమ్మవారు మిక్కిలి వాత్సల్యం చూపును . ఋగ్వేదము నందు అమ్మ వైభవమంత్రములు ఎక్కువగా కలవు . ప్రతి స్తుతి , స్తోత్రములో శబ్దాక్షర రూపంలో అమ్మవారు వర్ణ రూపిణిగా ఉన్నది . ఆ స్తుత్యర్ధము బాగా విచారణ చేయుటయే జ్ఞానము .

o శ్రుతిసంస్తుత వైభవా   :-   ఎవరికి వారు అమ్మవారిని ఉద్దేశించి స్తుతుల రచనలు చేసిన అమ్మవారిని ఆకర్షించ లేవు . అమ్మవారి ఆశ్రయము పొందవలెనన్న అమ్మను కొనియాడుతూ వేదములలో ఉన్న ఆ విధమైన పద వైభవం కలిగిన రచనలను ఆస్వాదించును .

o మనస్వినీ   :-   దక్షిణ దక్షిణా రాధ్యా అయిన అమ్మవారు ప్రశస్తనీయ ఉత్కృష్టమైన మనసు కలది . నిరంతర తపోనిష్ఠతో కన్నులు మూసి ధ్యానించు శివుని మనస్సునందు ప్రేరణ రగిలించి చైతన్య పరచి సృష్టికి నాంది అవుతున్న తల్లి . ఆ విధముగా అమ్మవారు వ్యర్ధము కాని సంకల్పశక్తి కలది . అమ్మవారు పరాధీనత కాక స్వతంత్రంగానే ప్రపంచ శ్రేయస్సుకు తగు నిర్ణయములు చేయును .

o మానవతీ   :-   అమ్మవారు ఉదాత్త స్వభావ గుణము కలిగి సకల దేవతలు మునులు మానవుల నుండి అఖండ గౌరవమును పొందు తల్లి . మానము అనగా కొలత అని అర్థము . వ్యాపిత అయిన ఆ అమ్మ ఏ ప్రమాణ రూపమునకూ అందక ఇంత అను సమానత్వ పోలిక లేనిది .

o మహేశీ   :-    ఈశ్వరునికే ఈశ్వరురాలైన తల్లి గా ఉండి దేవతా లోకముల అన్నింటికంటే పైన ఉండునది . శివునకు అమ్మకు తేడా లేక అభిన్నురాలై ఆయన మహేశ్వరుడు అయితే అమ్మ మహేశ్వరి అయినది .

o మంగళాకృతిః   :-   మహాత్ముల అందరి  చేత పూజింపబడు తల్లి  . సర్వ గుణ సంపత్కరాణి అయిన తల్లి గావున అన్ని శుభకార్యముల  యందు ఆరాధన పొందును .

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ|

ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ || 173 ||


o విశ్వమాతా   :-   ఈ విశాల విశ్వం అంతటినీ అమ్మవారు సృష్టించి అందున్న మనందరనూ  తల్లియై కాపాడుతున్నది .

o జగద్ధాత్రీ   :-   అమ్మవారు కేవల భావస్ఫురణ శక్తితో ఈ జగత్తు నందు సమస్త మానవాళిని తన కన్నబిడ్డలవలె ఆదరిస్తూ అందరికీ జీవనో పాయం కలుగజేస్తూ జగత్పోషణ భారమంతా తానే వహించు చున్నది .

o విశాలాక్షీ   :-  ఈశ్వరీ తత్వ రూపిణిగా నున్న అమ్మవారు  విశ్వవ్యాపితయై తన విశాల మైన వీక్షణ దృష్టితో సమస్త జీవులను పరికించు చున్నది . అదే విధముగా సర్వ మానవులను సోదర భావంతో సర్వజీవుల యందు కారుణ్య స్వభావము కలిగి విశాల దృక్పథం గల వారిని అమ్మ ఆదరించును .

o విరాగిణీ   :-   అంతటి విశాలాక్షి అయిన అమ్మవారు ప్రజలందరకూ ఎంతో సహాయపడుతూ ఉన్నప్పటికీ ఎవరి యందు ప్రత్యేకత చూపించక వైరాగ్య భావనతో విరాగిణీ గా యుండి ఏమియు పట్టనట్లుగా ఉండును .

        అటులనే ఎవరి చూపు విశాలత్వభావన  సంతరించుకొ నునో వారిని విశాలుడు అందురు . అట్టివారు సవ్య అపసవ్య మార్గములలో అమ్మవారిని  ఆరాధిస్తూ అమ్మ అనుగ్రహంతో వివేకవంతులైన జ్ఞానము సంపాదించుకొని ఈ చరాచర జగత్తు నందు ఏదీ శాశ్వతం కాదని తాత్విక చింతనతో విరాగద్వారణి నవాలంబించుచూ జీవితాన వైరాగ్య పతాకము ప్రతిష్టించుకొనువారు కైవల్య ప్రాప్తి పొందుతారు . స్వార్ధ రహితముగా ఉన్న వాళ్లకు మాత్రమే వైరాగ్య భావన కలుగును .సరాగులు ఎక్కువ  లౌకిక విషయములందు మునిగి యుండి నిత్యము భయకంపితులై ఉందురు . అందుకే మందస్మిత అయిన అమ్మవారిని పూజించి నప్పుడు ఆ పూజాఫలము గా జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం అని ప్రసాదించమని వేడుకుంటున్నాము .

o ప్రగల్భా  :-   అమ్మవారు వైభవోపేతమైన పరాక్రమ స్వరూపిణి గావున రాక్షస సంహార విషయములయందు ఆమె ప్రదర్శించిన ప్రతిభ అద్వితీయమై నందున అమ్మవారు తనకుతానే సాటి లేని గొప్పతనము కలిగిన ప్రగల్భా అయినది .

o పరమోదారా   :-   అన్నపూర్ణ స్వరూపిణి అయిన విశాలాక్షి అమ్మవారు మిక్కిలి కారుణ్యంతో తమ ప్రజలందరకు అన్నము ( అనగా ఐశ్వర్యం ) లభించూడచూడAఆనట్లు చేయు తల్లి . అనగా పరమ దాతృత్వ గుణం ఉన్న ఉదారస్వభావులురాలు .

o పరామోదా   :-  అమ్మవారు తన భక్తుల కోరికలు ఆమోదిస్తూ వారిని ఆనంద పరిచి తాను ఆనందమును పొందు తల్లి .

o మనోమయీ    :-   మనశ్శక్తి స్వరూపిణిగా నున్న అమ్మవారు శివుని యందు స్పందన శక్తి రగిల్చి సృష్టికి కారణమవుతున్నది . పంచ మహా కోశము లైన అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశం లలో మధ్య దయిన శరీరంలో ముఖ్యమైన మనోమయ కోశం నందు అమ్మవారు యుండి మిగిలిన వాటికి శక్తినిచ్చి శరీరము నడుపుతున్నది . అమ్మవారు శిరస్సు నందు సహస్రారము లో చిన్మయుడైన శివుని జేరి చిదాకాశ మున చిత్ స్వరూపిణిగా భాసిల్లును .


వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |

పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||

o వ్యోమకేశీ. :-  ఆకాశమునకే అతీతుడైన అనంత విశ్వస్వరూపుడగు శివుని శిరస్సు అంతరిక్షములో విచ్చుకున్న జటలతో , గంగాజలంతో నున్న ఆ పరమేశ్వరుని  వ్యోమ కేశుడు అందురు . అమ్మవారు ఆ పరమశివుని పత్ని గావున వ్యోమకేశీ అయినది . అమ్మ హృదయాకాశంలో నుండు ఆకాశ స్వరూపిణి .

o విమానస్థా.  :-  దేవాలయ గాలి గోపురం శిఖర స్థానమును విమానం అందురు . ఆ శిఖరాగ్రం దర్శించినంత మాత్రాన సకల పాపహరణ మగునని విశ్వాసము .

శ్రీ చక్రము నందు బిందు స్వరూపిణిగా నున్న అమ్మవారిని విమానస్థా అందురు . అత్యంత ఎత్తయిన  స్థానములో ఏ కొలతకు అందని ఆ పరబ్రహ్మ శక్తి అమ్మవారు . అదే విధముగా వేద ఉపనిషత్తుల పురాణములలో విశిష్ట మంత్రములతో కీర్తిని అందుకుంటున్న తల్లిని విమానస్థా అందురు .

o వజ్రిణీ   :- వజ్రము తో సమమగు తల్లి . ఈ నామ మననము బలము చేకూర్చును . అధిష్టాన దేవత అయిన అమ్మవారు దేవతలందరకు శాసనకర్త గా ఉండి ఇంద్రాణి రూపంలో శివుడే ఇంద్రుడు గా ఉండుట వలన ఇంద్రుని ఆయుధము వజ్రము కావున అది ఇంద్రాణి రూపంలో తన హస్తమునందు వజ్రాయుధమును ధరించి దేవతలందరకూ భయము కలుగునట్లు చేసి పరిపాలన సాగించుచున్నది . అందువలన అమ్మవారిని వజ్రిణీ అని అందురు .

        వజ్రము  అనగా దండము అని అర్థము దేవతల సైన్యాధికారి గా సుబ్రహ్మణ్యస్వామిని దండాయుధపాణి అందురు . అదే విధముగా జ్ఞానులైన సన్యాసుల వద్ద కూడా దండము ఉండును . అది కేవలము ఇతరులను దండించుటకు కాక తన జ్ఞానమునకు చిహ్నముగా ఉపయోగించుకొనును . శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మంత్రములు వేదోపనిషత్తులలో అనేకములు కలవు .ఆ మంత్రములను వజ్రములు అందురు .



o వామకేశ్వరీ   : -   వామకుడు అనగా సృష్టి చేయువాడు అని అర్థము . అమ్మవారి చైతన్యము వలన సృష్టి ప్రారంభించమని  బ్రహ్మదేవుని ఆజ్ఞాపించగా ఆయన ఆ పని నిమిత్తము కొంతమంది దేవతలను సహాయకులుగా ఏర్పాటు చేసుకొనును . ఆ సహాయకులను వామకులు  అందురు  .ఆ విధముగా వామకుల నియామకం అమ్మ వారి అనుజ్ఞతోనే జరిగినది కావున ఆ సందర్భంలో అమ్మ వామకేశ్వరీ అయినది .

o పంచయజ్ఞప్రియా   :-   పంచయజ్ఞములు అనగా దేవయజ్ఞం , ఋషి యజ్ఞము , పితృయజ్ఞము , మనుష్య యజ్ఞము , భూత యజ్ఞము . ఈ ఐదు యజ్ఞములు ఈ ప్రపంచమునందు ప్రతి వారు తప్పక చేయవలెను . దేవ పితృ యజ్ఞములు ముఖ్యము కావున వారికి తగిన విధముగా పూజించవలెను . యజ్ఞము అనగా జ్ఞాన ప్రదాతలు కావున వారిని గౌరవించవలెను . మనుష్య జంతు యజ్ఞము నందు సమభావనతో చుచుచూ వారికి అన్న పానీయములు సమకూర్చ వలెను . ఈ విధముగా పంచయజ్ఞములు చేయువారిని అమ్మవారు వారి యందు ప్రియత్వం కలిగియుండును .

o పంచప్రేత మంచాధిశాయినీ  :-    ఎవరైతే పంచయజ్ఞములు చేయకుందురో అట్టి వారిని జడత్వము కలిగిన మానవులందురు . ఇలాంటి వారు ప్రేతములతో సమానము . సృష్టి చేయుటకు పూర్వము నిష్క్రియుడుగా ఉన్న శివునకు చైతన్యం రగిలించి అమ్మవారు సృష్టికి ఆజ్ఞాపించును .

 మరో భావన లో పంచ ప్రేతములనగా బ్రహ్మ , విష్ణు ,మహేశ్వరులు ,రుద్రుడు ,సదాశివుడు వీరు ఐదుగురు అమ్మవారు ఆసనముగా కూర్చున్న మంచమునకు మొదటి నలుగురూ నాలుగు కోళ్ళుగా ఉండి ఆపైన సదాశివుడు పరుండి యుండి ఆ పైన అమ్మవారు అధిష్టించి ఉండును .


పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |

శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||


o పంచమీ   :- పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ప్రకృతి శక్తులను తన అదీనమoదే ఉంచు కొని సృష్టి స్థితి లయ కారకుడైన సదాశివుని పంచముడు అని  అందురు . అమ్మవారు ఆయన సతీమణి అయినందున ఆమెను పంచమి అందురు .

       మరొక భావనలో పంచ మాతృకలలో  ఐదవదయిన వారాహి దేవిని పంచమి దేవి అందురు ఈమె సకల జగత్తు నందున జీవులకు ఆపన్నదాయియై అందరికీ అన్నమును సమ కూర్చుచున్నది .భూమి యందు వ్యవసాయమునకు కావలసిన నాగలి ,రోకలి రెండు చేతులు యందు ధరించి ఉండును .ఈ స్వరూపము కూడా అమ్మవారి పంచ తత్వ స్వరూపములో ఒకటి కావున ఆ తల్లిని మానసికంగా , భావనాత్మకముగా ఆరాధించి సకల సంపదలు పొందవచ్చును .

o పంచభూతేశీ   :-  పంచభూతములు అయిన ఆకాశం , వాయువు ,అగ్ని  ,జల , భూ తత్వములకు అధినేత్రి కావున వాటిని తన చైతన్యముతో నియంత్రించు ఈశ్వరి స్వరూపిణి కావున ఆమె పంచభూతీశి అయినది .

o పంచ సంఖ్యోపచారిణీ :-   ఈ ప్రపంచమంతయు 25 ప్రకృతి శక్తులు అయిన కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ , ప్రాణెంద్రియా మొదలగు శక్తుల అన్నింటికీ ఆధారభూతమైన అమ్మవారు జగత్తు నందు విస్తరించి ఉండుటచేత ప్రతి ఒక్కరూ షోడశోపచారపూజలు తగిన మంత్రములతో చేతులతో నిత్య పూజలు గావించి అమ్మవారిని ఆరాధించవలెను .

      మన చేతి వేళ్ళ యందు నే ప్రకృతి శక్తులు  ఉండును .చిటికెన వేలు యందు భూ తత్వమునకు , తరువాతి వేలు ఆకాశ తత్వమునకు , మధ్యవేలు వాయు తత్వమునకు , చూపుడు వేలు అగ్ని తత్వము  ,అంగుష్ఠ ము జలతత్వ మునకు సంబంధించినదై భూతత్వ మునకు  లం  బీజాక్షర మంత్రం తో శ్రీలలితాదేవ్యైనమః అను మంత్రముతో గంధమును సమర్పించవలెను . అలాగే ఆకాశ తత్వమునకు సంబంధించి హo బీజాక్షర మంత్రం తో అమ్మకు పుష్పములు సమర్పించవలెను . వాయు తత్వమునకు సంబంధించి యం బీజాక్షర మంత్రం తో అమ్మ గురించి ధూపము సమర్పించవలెను . అగ్ని తత్వమైన రo బీజాక్షర మంత్రము జపించి దీపం వెలిగించవలెను . వo బీజ మంత్రము తో అమృత స్వరూపమైన జలమును గాని మధుర పదార్థమును గాని నైవేద్యముగా అమ్మవారికి సమర్పించవలెను . ఈ విధముగా ఎవరికి వారు స్వయంకృషితో సాధన చేసి ఆరవ తత్వ శక్తి అయిన మనసునందు అమ్మను నిలుపుకొని ఆ మనస్సు శిరోభాగమున సహస్రారము నందు అమ్మ పాదపద్మములకు సమర్పించుకుని మోక్షము పొంద వచ్చును .

      ఆధ్యాత్మిక చింతన కలిగిన మానవులు మంచి గురువును ఎన్నుకొని కరన్యాసః విద్యా బీజ మంత్రములు ఉపదేశము పొంది సుగంధ పరిమళ భరితమైన భూతత్వం నకు నాందిగా గంధమును సమర్పిస్తూ అమ్మవారికి ఆ తత్వం తో కూడిన మానవ శరీరం అర్పిస్తూ గంధముతో పరికల్పన చేయవలెను . సూర్యోదయ సూర్యాస్తమయ రూపములతో వికసిత గుణము కలిగిన అదే గుణము అహంకార రూపములో ఉన్న నేను తత్వమను వికసిత పుష్పములను అమ్మకు సమర్పించవలెను . అదే విధముగా సమస్త జీవ వాయువులతో ఉన్న భక్తుడు వాయు రూపం లో  ధూపము ద్వారా అర్పింపవలెను . దీపము అగ్ని తత్వము కావున భక్తులు దీపము వెలిగించి తన ఆత్మ జ్యోతిని అమ్మకు సమర్పణ భావనతో సాధన కృషిలో లీనమై అమ్మ వారి పాద పద్మముల చెంత ఉంచి ఆరాధించవలెను . ఈ విధముగా సర్వము శక్తి శాసన కర్త అయిన అమ్మకు భక్తుని కుండలినీ శక్తిని వ్యవస్థ యందు అమృతత్వము ను నైవేద్యముగా నోసగి మోక్షము పొందవలెను .

o శాశ్వతీ  :-  ప్రపంచ తత్వము నందు ఎవరు శాశ్వతులు కాజాలరు . అమ్మవారికి లయము అనునది లేదు .ఆమె శాశ్వతురాలు .

o శాశ్వతైశ్వర్యా  :-  అమ్మవారి సంపదలకు కొరత అంటూ ఉండదు . ఆమె సమస్త ఐశ్వర్యములు కలిగి ఉండును .ఎవరైతే భక్తులు అమ్మను ఆరాధింతురో  అలాంటి వారికి సకల ఐశ్వర్య ప్రదాయిని గా ఉండి వారికి ఏ కొరత లేకుండా నిత్య సంతృప్తిగా ఉండునట్లు    చేయును .

o శర్మదా   :-   అమ్మవారి సర్వ మంత్రములను జపిస్తూ జీవనము గడుపు వారిని శర్మ అందురు 

. అలాంటివారికి ఆ సంకల్పశక్తి కల్పించిన అమ్మవారిని శర్మదా అందురు . ఐహిక  విషయముల యందు ఆసక్తి లేక నిరంతర జ్ఞానసముపార్జన  చింతనతో  క్లేశములకూ వెరవక ఉండు  వారు ఆనంద స్వరూపులు .

o శంభుమోహినీ  :-  అమ్మవారు మోహిని రూపంలో  ఉన్న శంభుని వరించి సృష్టికార్యమునకు ఆయనను ఉద్యుక్తుడను చేయుటకు ఆయనలో చైతన్యం రగిలించి జరిపించును . పూర్వము మన్మధుడు తన పుష్ప బాణములతో శివుని పార్వతిని కామించునట్లు కామ కళారూపంలో పుష్ప బాణములు సంధించాడు . శివుడు కోపోద్రిక్తుడై మన్మధుని నశింపజేసే . ఆ విధముగా అమ్మ వారు తిరిగి అతని బతికించి నీ విద్య అంతయు మానవులపై చూపమని హిత బోధ చేసెను .

        మోహినీ అవతారములు మూడు విధములు కలవు 1 విష్ణువు సముద్రమథన సమయములో ఎత్తిన జగన్మోహిని అవతారాము . 2 భస్మాసురుని సంహార సమయములో ఎత్తిన మోహినీ అవతారము 3 శంభు మోహినీ .

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ |

లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా || 176 ||

o ధరా   :- మానవ జీవులు నివసించు భూమి  .

o ధరసుతా  :-  ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు త్రేతాయుగ కాలమున భూమి నుండి జన్మించిన సీతా మహాలక్ష్మి . ఈమె లలితా త్రిపుర సుందరికి అభిన్నురాలు కాదు . రామాయణం సుందరకాండ మoదు కొన్ని అమ్మవారి మంత్రములు గలవు . మరో భావన లో 2 నామములు ఏకీకృతముగా భావించిన భూమి నుండి జన్మించిన పర్వత రాజపుత్రిక పార్వతి అని అర్థము .

o ధన్యా  :-   పరిపూర్ణురాలైన అమ్మవారు పొందుటకు ఏమియు లేనిది . ఆమె పూర్తి ధన్యత కలిగిన ధన్యురాలు .

              ఎవరైనా సాధనాకృతము గా ఒక పని చేసి తృప్తికరంగా నెరవేర్చి తత్ఫలితం చేకూర్చుకున్న వారిని ధన్యులు అందురు . అయితే మనము  పని చేసే కౌశలము పొందేటట్లు చేసేది , ఆ దక్షత కలుగజేయునది అమ్మయే . అమ్మవారు ఎవరికి ఎప్పుడు ఏమి వలయునో వారి అవసరాలు లభ్యత ననుసరించి పొందునట్లు చేయును .

          మరొక భావన లో పరిశీలించిన మానవులు ఆడంబరముగా పూజ చేయుటకు ఇష్ట పడుదురేగాని ఏకాంతముగా మానసిక ఆరాధన సలుపరు . అంత్యకాలమందు కూడా అమ్మ నామ స్మరణ ధ్యానించిన కొన్ని చింతల నుండి విముక్తి కలుగును . మానవులు 1 అర్త చింత.       2 రౌద్ర చింత  3 ధన్య చింత 4 శుక్ల చింత అను నాలుగు విధాల చింతలతో జీవనయానం చేయుదురు . అంత్యకాలంలో అమ్మని తలవని రజోగుణ సంసార లంపటులు మరు జన్మలో నాలుగు కాళ్లు కలిగిన తిర్యక్ జంతువుల వలె జన్మింతురు . అటులనే తమోగుణ రూపులు రెండవ విధములో విరోధ జంతువులు గాను , సత్వగుణ సాత్వికులు దేవతా చింతన కలిగి ఆధ్యాత్మిక విషయాసక్తి గల వారు తిరిగి మనుష్య జన్మ పొందెదరు . ఇక శుక్ల చింత కలవారు ఐహిక విషయములతో సంబంధము లేక నిరంతర తపోనిష్ఠతో ఉండు యోగుల వంటివారు .అంత్య మందు సంపూర్ణ జ్ఞాన తత్వ సాధకు లై జీవన్ముక్తులగుదురు . ఆ విధముగా వారు ధన్యులగుదురు .

o ధర్మిణీ   :-  అమ్మవారు అందరియందు సమ ధర్మము పాటించే వేదధర్మ స్వరూపిణి . అమ్మ తన సహచర దేవతలకు ధర్మము బోధించును .

      మానవులలో వేద ప్రమాణ ధార్మికత లోపించిన వారిలో స్పందన కలిగించి ధర్మ వర్తనకు ఆసక్తి కలిగించి ధర్మమునకు ఉపక్రమింపజేయును . అందుచేత ధర్మిణీ అయినది .

o ధర్మవర్ధినీ  :-   ఎవరైతే ధర్మానుసారం గా జీవిస్తూ అత్యాశ అవినీతి పనులకు పాల్పడక ధర్మదీక్ష తో సాగుదురో అట్టివారి ధర్మములను వర్ధిల్లు నట్లు చేయును .

o లోకాతీతా   :-   ఈ నామము నుండి శ్రీ లలితా అమ్మవారి స్వరూప స్వభావములను గూర్చి వివరించును . అమ్మవారు లోకానికి అతీతమైన లావణ్య స్వరూపిణి . లోకాలు లోకులు లోక పాలకులు అన్నియు ఈ ప్రపంచంలో కాల ప్రభావానికి నాశము చెందును . అమ్మ వారు ఏ వికారములు లేక లోకాతీతయై కాలానికి లొంగనిది .

o గుణాతీతా   :-  అమ్మవారిని మానవమాత్రులకు ఉండే గుణములతో పోల్చలేము . అమ్మవారు సత్వ రజ : తమోగుణము లకు అతీతముగా తురీయగుణస్వరూపిణిగా ఉండును .

o సర్వాతీతా   :-   ప్రపంచమంతటను చైతన్యస్వరూపిణిగా తానే వ్యాపించి ఉన్నప్పటికీ ప్రాపంచిక విషయాసక్తి లేక లోకాలకు గుణాలకు అతీతురాలుగా ఉండి సర్వాతీత అయినది .

o శమాత్మికా   :-  అనగా కష్టాలకు లోనైన వారి ఇబ్బందులు తొలగించి వారికి ఉపశమనం కలిగించు శాంత స్వరూపిణి .

       ఎవరైతే కష్టాల నుండి ఉపశమనం పొందుతారో వారు మానసికంగా ఒక విధమైన అద్వైత భావనలో నుండి శివాత్మికులగుదురు . అందుచేత అమ్మవారు శాంతి స్వరూపిణిగా ఉండి ప్రపంచ ఉపశమన శక్తిగా కీర్తింప బడుచున్నది .

  మరొక భావములో శ్రీ చక్ర పరంగా పరిశీలించిన బిందు స్వరూపము ఆవల ఉన్న ఎనిమిది చక్రములు లోకములు గా భావన చేసిన అందు మొదటి మూడు గుణాలకు చెందిన వై తురీయ బిందు స్థానము శాంత స్వరూపం గా నున్న మణి ద్వీప వాసిని అమ్మ నిలయమే శివపురి .

      ఉదాహరణకు సముద్రములో అనేక కెరటములు ఉద్భవించినప్పటికీ అవి అన్నియు కొంతసేపటికి లయమైపోయి ఏకత్వ రూపముగా  నున్న సముద్రము లయము కాకుండా ఎట్లుండునో ఆ విధముగా అమ్మ శాశ్వతురాలు . కెరటాలు అనేకత్వ మై ద్వైతము గా నుండి ఏకత్వము గా నున్న సముద్రము వలె ఏక రూపిణిగా ప్రపంచ నిర్వహణ చేస్తున్న సచ్చిదానంద స్వరూపిణి .

      మరొక భావన లో అన్ని విధముల ఉపాసనలు ధ్వంసము  అయినప్పుడు అనగా లయమైనప్పుడు కలుగు నిర్వేద వైరాగ్య బావనే జ్ఞానము . ఆ జ్ఞానమునే శమము అందురు .

      నిర్గుణ స్వరూప ఉపాసన చేస్తూ సాధన ద్వారా సగుణోపాసనకు మార వచ్చును . నిర్గుణోపాసన గేయ బ్రహ్మం అయితే సగుణోపాసన ఉపాస్య బ్రహ్మమై నిరంతర ధ్యానంతో లలితా త్రిపుర సుందరీ దేవి ఆశ్రయము పొందవచ్చును .




బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ |

సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ || 177 ||

                    అమ్మవారిని నిర్గుణ ఉపాసన ద్వారా వేదాంత తత్వము ఆకళింపు చేసుకొని సగుణ మూర్తిగా అమ్మను మనస్సులో ధ్యానించి ఆమె దయా ప్రాప్తి పొందాలి . వశిన్యాది వాగ్దేవతలు సగుణ రూపిణిగా ఇప్పుడు వర్ణిస్తున్నారు .

o బంధూక కుసుమ ప్రఖ్యా   :-  అమ్మవారు ఎర్రని రూపంలో మంకెన పువ్వు వలె ఉషోదయ అరుణ కిరణ కాంతి వలె ప్రకాశమానమై యుండును . ఈ తల్లిని ధ్యాన శ్లోకంలో                  అరుణాం కరుణా తరంగితాక్షీం అని ధ్యానిస్తా ము కదా !

           మరొక భావన లో బిందు స్వరూపిణి అయిన అమ్మవారు సర్వసిద్ధి ప్రథచక్ర మైన శ్రీ చక్రము నందు త్రికోణ మధ్యమున ఉండును . ఆ స్థానము అరుణ కిరణ రంజిత మై ఉండును .

o బాలా, లీలావినోదినీ   :-  సర్వ సిద్ధి ప్రద శ్రీ చక్ర అధిదేవత అయిన లలితా అమ్మవారు ప్రపంచ సృష్టి కి కారణం కాగా ప్రపంచ మానవాళికి ప్రాణాలను ఇచ్చి వారికి తగిన బలం చేకూర్చి ఈ సర్వలోకాలను పట్టి నిలిపే శక్తి బాల అమ్మవారిదే .

                  కొందరు ఉపాసకులు బాల అమ్మవారిని పరిపూర్ణ ఉపాసనా దేవిగా ఉపాసింతురు . బాలాదేవి పూర్ణ జ్ఞాన స్వరూపిణి . ఆ దేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆమె జీవన్ముక్త్యాస్థ యగును . అమ్మవారు ఈ లోకములో జరుగు విషయములను ఒక క్రీడ గా భావించి ఆ ఆట యందు నిమగ్నమై అది అంతయు పరమేశ్వర కృతమగు కల్పిత లీలగా దర్శించి వినో దించు తల్లి . ఈమె నిత్యకళ్యాణ గుణ లీలా స్వరూపిణి .

o సుమంగళీ  :- అమ్మవారు సర్వమంగళ స్వరూపిణి . మంగళము అనగా శుభములు అని అర్థము . అయితే మనము నిర్వహించు శుభకార్యములన్నియు మంగళకరము కాకపోవచ్చును . కేవలము శాస్త్ర విహితమైన శుభకార్యములు మాత్రమే మంగళకరమగును . అజ్ఞానము వలన అశాస్త్రీయంగా శుభకార్యం జరిగిన అమ్మ ఆదరణ లేక అమంగళం అగును . ఆలోచన , ఆచరణ , ఆదరణ  ఈ మూడు విషయములందు మంచి బుద్ధి కలిగి మంగళకర పనులు చేసి ధర్మ బద్దులై ఉండాలి .

o సుఖకరీ   :-   ధర్మాచరణ తో కూడిన మంచి వారికి ఎల్లప్పుడూ సుఖములు కలుగు చేయు తల్లి .

o సువేషాడ్యా  :-  ఒక ముత్తైదువకు బాహ్యముగా కనపడ వలసిన బొట్టు కాటుక చెవులకు  తాటంకములు , ముక్కెర , మంగళ సూత్రములు 5 కలిగిన స్త్రీ స్వరూపమును మంగళగా భర్తతో ఉన్న వారిని సువేషాడ్యా అందురు . అమ్మవారు జీవత్ స్పటిక వలె నిరంతర శివ సాయుద్యమున ఉండి మంగళ గౌరీ మాత గా దివ్యమంగళత్వము ఉట్టి పడినట్లు ఉండును .

 సువాసినీ   :-  సుమంగళి సువేషాడ్యా అయిన అమ్మవారు చక్కని వునికి కలదై మిక్కిలి గౌరవనీయు రా లైన రూపసి గా నిత్య సువాసిని అయినది .

           ముత్తయిదువ లైన సువాసిని స్త్రీలు భారతీయ సాంప్రదాయం ప్రకారం సాటి ముత్తయిదువ స్త్రీలలో అమ్మవారిని ప్రతిపాదించు కొని వారికి పసుపు కుంకుమ చీరసారే లనిచ్చి సత్కరింతురు .

సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా |

బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా || 178 ||

o సువాసిన్యర్చనప్రీతా.  :- సువాసిని అయిన అమ్మవారు నిత్య ఆరాధకులు అయిన సువాసిను ల  చేత అర్చనలు అందుకొని ప్రీతి చందు శుభ స్వరూపిణీ .

       ముత్తయిదువలు అయిన స్త్రీలు అమ్మవారిని సూర్యుని రూపంలో కలశం ముందు ఆవాహన గానూ  , శ్రీ చక్ర పూజ ద్వారా జ్యోతి యందు ప్రతిక్షేపిoచుకుని ఆరాధింతురు . ఈ విధమైన భావనతో పూజించినప్పటికీ ఏకాగ్రత కలిగిన భక్తి ప్రధానము .

o శుద్ధ మానసా  :- అమ్మవారు రాగద్వేషాలు లేని శుద్ధ మనసు కలిగి ఉండును .

o బిందు తర్పణ సంతుష్టా   :-  శ్రీ చక్ర ఉపాసన చేయు భక్తులు సూక్ష్మ రూపము గా ఉన్న అమ్మవారిని బిందువు నందు ఆపాదించుకుని శుద్ధ పంచామృత జల బిందువులను అర్పణ గా  చల్లుదురు . అట్లు చేయుట అమ్మవారికి సంతోషము కలిగి తృప్తి చెందును . అయితే అమ్మకు చేయు ఈ పురస్కారనమస్కార సమయములో ఎలాంటి కల్మషములు లేకుండా నుండవలెను .

         మరొక భావములో యోగ పుంగవులు అయిన జ్ఞానులను బిందువులు అదురు . వారు నిరంతరం సూక్ష్మ జ్ఞాన తత్వ స్వరూపిణిగా ఉన్న అమ్మను ఆరాధిస్తూ ఆత్మ ద్వారా జీవన్ముక్తు లైన జ్ఞానులనిన సంతుష్టాoతరంగ యగును .

o పూర్వజా   :-   అమృత స్వరూపిణి అయిన అమ్మవారు సృష్టికి పూర్వమే యుండి ఎన్నో ప్రపంచ లయములను చూచినది .

o త్రిపురాంబికా  :-  త్రికోణ చక్ర మధ్యగా నున్న బిందు స్వరూపముగా నున్న తల్లీ శ్రీ  లలితా మహా  త్రిపుర సుందరి దేవి . త్రికోణ చక్రములోనున్న అమ్మవారిని త్రిపుర అందురు .భక్తులందరూ అమ్మకు కన్న బిడ్డలే కావున  ఆమె త్రిపురాంబిక .

            ఇచ్ఛా జ్ఞాన క్రియా కారణ శక్తుల గు తొమ్మిది మంది త్రిపురలు వివిధ త్రికోణ ఆవరణలలో ఉందురు  . త్రిపుర ము లైన సూక్ష్మ స్థూల కారణ రూపిణిగా జీవుల అందరియందు ఉండి నడిపించు తల్లి ని త్రిపుర అందురు .ఆమె అందరికీ తల్లి కావున త్రిపురాంబికా అయినది . మూడు పురముల యందు సంచరించు జీవులను త్రిపురులు అందురు .





దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ |

జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ || 179 ||

o దశముద్రా సమారాధ్యా   :-    అమ్మవారిని శ్రీ చక్ర రూపేణా ఆరాధించుకున్న భక్తులు వివిధ రకాల చేతి ముద్రల ద్వారా ఆరాధింతురు . అవి చిన్ముద్ర ,నమస్కార ముద్ర ,అభయ ముద్ర మొదలగునవి .

         ముద్ర అనగా సంజ్ఞ రూపముగా వివిధ భంగిమలలో వ్యక్తపరచిన ఎదుటివారు వాటి అర్థము గ్రహించి ఆనందింతురు . అదే విధముగా గురువుల ద్వారా మాత్రమే ముద్రా మంత్రములను అభ్యసించి ఆ ముద్రల ద్వారా అమ్మవారిని ఆరాధించిన అమ్మ సంతృప్తి చెందును .

         మరో భావన గా పరిశీలించిన గురు కటాక్షము లేని సామాన్యులు రెండు చేతులు జోడించి నమస్కార ముద్ర తో ఆరాధించ వచ్చును . ఒక చేతితో నమస్కరించుట కూడని పని . ఏలన కుడిచేయి శివ స్థానము కాగా ఎడమ చేయి శక్తి స్థానము శివ శక్తులను ఏకం చేయుటయే పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారిని నమస్కార ముద్ర తో ఆరాధన చేయుటలోని ఆంతర్యము .

         అయితే మన చేతి వేళ్ళ యందు వివిధ దేవతల స్థానములు కలవు . మొత్తము రెండు చేతులు కలిపినప్పుడు 10 వేలి ముద్రలు కావున ఆ ముద్రలతో నమస్కరింతుము .  గనుక దశ ముద్ర సమారాధ్య అయినది . శివ శక్తులు ఏక స్వరూపు లై ప్రపంచమంతయు వ్యాపించి ఉన్నందున శివుని అర్చన చేయు నమక మంత్రము నందు నాలుగు దిక్కులకు తిరిగి నమస్కరించి ఆకాశం వంక చూస్తూ నమస్కరించిన మొత్తం పంచదశ ముద్ర లగును .ఈ విధముగా నమస్కరించుటను అచ్చ తెలుగులో ఐదు పది చేతలని పూర్వీకులనెడి వారు .

o త్రిపురా శ్రీ   :- ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ చక్రం లోనున్న  సర్వార్ధసాధకి చక్రము నందున్న తల్లిని త్రిపుర శ్రీ అందురు .

o వశంకరీ   :-  అమ్మవారు సృష్టించిన ఈ ప్రపంచమంతయు తానే వ్యాపించి ఉండి తన అధీనంలో వశం చేసుకున్న తల్లి . అమ్మవారి భక్తులు నిర్వేదంతో తనలోనే ఉన్న అమ్మని గ్రహించలేక తమంతతాము అమ్మ కరుణ కటాక్షము లకు లొంగన వారిని వశం చేసుకొను తల్లి . అమ్మ త్యాగమూర్తి .

o జ్ఞానముద్రా    :- దశ ముద్ర సమారాధ్య అయిన అమ్మవారిని శ్రీ  చక్రము నందు ఆరాధించు భక్తులు వివిధ రకాలైన ముద్రల ద్వారా బీజాక్షర మంత్రముల తో ఉపాసన చేయుదురు .

      జ్ఞాన ముద్ర అనగా మన కుడి చేతి వేళ్ళ లో అంగుష్ఠము అనగా బొటనవేలు నిలువుగా ఉంచి తర్జని అనగా చూపుడు వేలును అంగుష్ఠ కణుపు వద్దకు మడిచి చూపునది జ్ఞాన ముద్ర లేక చిన్ముద్ర లేక బ్రహ్మముద్ర అందురు . ఈ ప్రపంచంలో మానవ గమనము పంచ విధములైన తత్వ స్వభావములు అయిన అస్తి ,బాసి ,ప్రియమ్ నామరూపము లతో కూడి ఉండును . మన అంగుష్ఠము నాలుగు వేళ్ళ తో కలిపి ఉండక విడిగా నుండి పరబ్రహ్మ స్వరూపము గా నుండి తర్జనీ వేలును మడిచి నప్పుడు జీవుడు పరబ్రహ్మమును చేరునను  ఏకత్వ భావనయే  ఈ ముద్ర రహస్యము . ఆ ముద్ర వేసినప్పుడు మిగతా మూడు వ్రేళ్ళు విడిగా యుండును గాని ఈ జీవుడు ప్రాపంచిక విషయాసక్తి లేక బ్రహ్మ ఐక్యము చెంది చిన్మయానందము పొందు వైరాగ్య భావనయే జ్ఞానము . ఈ బ్రహ్మముద్రతత్వం అంతయు దక్షిణామూర్తి తత్వమే .

o జ్ఞానగమ్యా   :-   ఎవరైతే జ్ఞానముద్ర తత్త్వమును గ్రహించి జ్ఞానులగుదురో వారికి గమ్యము అనగా మోక్షప్రాప్తి కలుగజేయు తల్లి .

       జ్ఞానానంద స్వరూపిణి అయిన అమ్మవారు ప్రపంచమంతా వ్యాపించి గమించి కాలగమనం నిర్దేశించు చున్నది . అమ్మవారు మాతృ మానమేయా స్వరూపిణి . అనగా కొలతకు అందని తల్లి .

o జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ    :-   జ్ఞానం అనగా జ్ఞానానంద స్వరూపిణి అయిన అమ్మ తత్వము . అనగా జీవబ్రహ్మైక్య తత్వము తెలుసుకొనుటయే . జ్ఞానము అమ్మ ప్రకాశవంతమైన చైతన్యము వల్లనే లభించుచున్నది . ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు అని మనకు తెలిసింది అంటే ఆయన నుండి ప్రసారమైన వెలుగు వలననే ఎట్లు గ్రహిస్తున్నామో అదే విధముగా అమ్మ చైతన్య ప్రకాశ శక్తి జ్ఞానము కాగా ఆ తెలియచెప్పే తెలివి జ్ఞేయము . అనగా చైతన్యము వలన కలిగిన జ్ఞానము ఆమెయే . అది తెలిపే తెలివి ఆమెయే . అందువలన అమ్మవారు జ్ఞానజ్ఞే య స్వరూపిణి  .

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా |

అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ || 180 ||

o యోనిముద్రా   :-  శ్రీచక్ర ఆరాధన లోని దశ ముద్రల లోని బిందు దగ్గరగా నున్న త్రికోణమునే యోని ముద్ర అందురు . ప్రకృతి యందు పరబ్రహ్మ స్వరూపుడైన ఈశ్వరునకు అమ్మ కలిగించిన స్పందన శక్తియే ప్రకృతికి కారణమైనందున ఆ కారణ శక్తి వలననే ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులకు మూలకారణమే యోని అయినది . శ్రీ విద్య యందు తొమ్మిదవ ముద్రను యోని ముద్ర అందురు .

o త్రిఖండేశీ   :-   శ్రీ చక్ర ఆరాధకులు 9 ఆవరణములలో నున్న దేవతా స్వరూపములను ఆరాధనలో ప్రతి మూడు ఆవరణలను వివిధ మంత్రములతో ఉపాసింతురు .

            ప్రపంచము నందు అన్నియు త్రయములు గానే ఉన్నవి . స్త్రీ లోకములు త్రిగుణములు , త్రిశక్తులు , త్రికూటములు అయిన కామరాజు కూటము ,వాగ్భవ కూటము ,శక్తి కూటము అను మూడింటి యందు తానే ఉండినది .

o త్రిగుణాంబా   :-  త్రిగుణములకు అమ్మవారు గుణాతీతగా యుండిననూ  ఆయా గుణ రూపులకు తల్లి వంటిది . సృష్టి స్థితి లయములు కలిగిన ఈ ప్రపంచ గుణములకు సంబంధము లేక సనాతనము గానున్న తల్లి .

o త్రికోణగా   :-    శ్రీ చక్రము నందు త్రికోణము లో బిందు స్వరూపిణిగా నున్న చిన్మయానంద స్వరూపిణి  .సూర్య ,చంద్ర ,అగ్ని మండలములతో కూడిన  త్రికోణము లో మధ్య బిందు స్థానమునందున్న తల్లి . ఆ బిందు స్థానమును దశ ముద్ర అందురు .

o అనఘా   :-   అమ్మవారు దోషరహితమైనది . ఏ పాపములు అంటనిది . దత్తాత్రేయఅనఘాదేవి వ్రతములు ఆచరించు వారి పాపములను పోగొట్టు తల్లి .

o అద్భుత చారిత్రా  :-   అమ్మవారు తన నామరూప కళా వైభవము లతో ప్రపంచమంతా చరిస్తూ తన లీలలను వ్యక్తపరుస్తూ ప్రపంచ పాలన నిర్వహిస్తూ ఆశ్చర్యకరమైన చరిత్ర కలదిగా యుండి తన భక్తుల దోషములను హరించునది .

o వాంఛితార్థ ప్రదాయినీ   :- ఈ అమ్మవారు చతుర్వర్గ ఫల ప్రదాయిని . కరుణార్ద్ర స్వభావురాలైన అమ్మవారు తన భక్తులందరి కోరికలు తీర్చు తల్లి .

అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ |

అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా || 181 ||

o అభ్యాసాతి శయజ్ఞాతా   :-     పరతత్వ రూపిణి అయిన అమ్మవారి వైభవము తెలుసు కొనాలంటే అమ్మ నామ రూప ఉపాసన యందు తదేక దృష్టితో నిరంతర అభ్యాసము హృదయాస్పదముగా ఉపాసించిన ఒకింత వైరాగ్య తత్వము అలవడి జ్ఞానవృద్ధి జరుగును .

              మూక కవి తన పంచశతి లో చెప్పినట్లు నిర్గుణ ఉపాసన సాధన ద్వారానే చిరతర సుచరిత మైన అమ్మ జ్ఞాన తత్వము తెలుసుకొనవచ్చును . ఏలనన సూర్యుని ప్రకాశము తత్వము వెలుగు వలననే ఎట్లు  గ్రహింపు కలుగుతుందో అమ్మవారి నిరంతర అనుచిoత ద్వారా వ్యక్తమగు  మాయా తత్వము మోక్షము లభించు వరకూ ఉపాసించ వలసినదే .

o షడధ్వాతీత రూపిణీ     :-   అమ్మవారి శ్రీచక్ర ఆరాధన యందు బిందు స్థానము చేరుటకు శ్రీ చక్రము నందు ఆరుమార్గములు ఉండును .

       అమ్మ తత్వము తెలియవలెనన్న నామ రూపములు బట్టి మాత్రమే తెలియ నగును .ఈ ప్రపంచంలో దృశ్య ప్రపంచం ,శబ్ద ప్రపంచము అని రెండు విధములు మాత్రమే యుండును . కావున అవ్యక్తమైన పరమేశ్వర తత్వం అనుభవంలోకి రావాలన్నా మంత్ర స్వరూపిణి అయిన అమ్మను వాగర్థము ల వలన మాత్రమే తెలుసుకొన దగును . వాక్కు , అర్థము అనగా యంత్రము మంత్రార్ధము ఈ రెండు శివశక్తి స్వరూపములు .ఈ రెండు ఏకమైతేనే పరతత్వ స్వరూపమైన  శివశక్త్యైక్య రూపము తెలియును . ఉదాహరణకు మనకలక్ష్యం , గమ్యం చేరుట అనగా మోక్షము పొందుట ఎలాగో తుమ్మెదకు పుష్పము లోని మకరందము గ్రోలుట యే  లక్ష్యము కావున అప్పటివరకూ ఝుంకార శబ్దం తో పువ్వు పువ్వు చుట్టూ తిరిగిన తుమ్మెద మకరందం అనుభవం  పొందగానే ధ్వనిఆపి  లక్ష్యము నెరవేర్చుకున్నది .

        ఇప్పుడు  వాక్య అర్థము అనగా రెండు భాగములు . ఒకటి వాక్కు .రెండు అర్థము .ఈ అర్ధము మూడు విధాలుగా ఉండును అది వర్ణము , పదము ,మంత్రము లేక వాక్యము . వర్ణము అనగా అక్షరములు . ఆ అక్షరముల కూర్పు పదము లై ఆ పదములే భావ యుక్తమై మంత్రములై అమ్మవారిని స్తుతించి పరతత్వ సాధనతో ఉపాసనా మార్గం ద్వారా కృతకృత్యులు అగుదురు .

     ఇక వాక్యార్థ ముందున్న రెండవ భాగమైన అర్థము మరో మూడు విధాలైన తత్వ రూపములలో ఉండును . 1 కళాత్వ తత్వము 2 ప్రకృతి తత్వము 3 భువన తత్వము.

1 కళాత్వ తత్వము అనగా చిత్కళాతత్వము . చిత్కళాచైతన్య రూపములో నున్న పరమేశ్వరుడు లేక  పరమేశ్వరి ప్రపంచమంతా వ్యాపించి ఉండి వివిధ కళారూపాలతో ఎట్లు ఉందురో అదే విధముగా ప్రకృతిలోని పంచభూత శక్తుల యందు తామె ఉండి ఆకాశ శక్తిగా శాంత్యాతీతరూపంలోనూ ,వాయు శక్తిగా శాంతి రూపము గానూ ,అగ్ని తత్వ శక్తిగా విద్యా రూపముగానూ , జల తత్వముగా ప్రతిష్టా రూపముగా , భూతత్వం గా నిర్దిష్ట రూపం గానూ ఉండి  భక్తులకు అమ్మవారు పరమార్ధ తత్వ చింతన కలిగించుచున్నది .

2 ప్రకృతి తత్వము - ప్రకృతి యందు  పంచతత్వ శక్తులు , జీవుల యందు వివిధ శక్తి తత్వములు కలిసి మొత్తము 24 తత్వములతో ప్రపంచము ఏర్పడి ఉన్నది 

3 భువన తత్వము – మొత్తము ఊర్ధ్వ అధో లోకము లైన పద్నాలుగు లోకములను పాలించు అమ్మవారు సర్వలోక పూజిత యై ఆరాధించ బడుతున్నది . ఈ విధముగా చిత్ శక్తిస్వరూపిణిగా వున్న అమ్మవారు ప్రకృతి శక్తులతో మమేకమైనప్పటికీ ఆ ప్రభావములకు లోనుకాక అనంత ఆకాశమున శాంత్యాతీతగా  షడద్వాతీతగా నుండు  సచ్చిదానంద స్వరూపిణి .

o అవ్యాజ కరుణామూర్తి    :-   అమ్మవారు పరమ కరుణ స్వభావురాలు . ఆమె ప్రపంచ ప్రజలందరి యందు ఒకే విధముగా నెపము లేని కరుణామూర్తి గానుండును . పరమేశ్వర ప్రపంచ శక్తియే కరుణ .

o రజ్ఞానధ్వాంత దీపికా    :-     అమ్మవారు తన భక్తుల యందు మిక్కుటమైన అను కంపమను దయ కలిగి అజ్ఞానాంధకారంలో ఉన్నవారిని తన వెలుగులతో చైతన్యపరచి  స్వాంతన కలిగించును .

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా |

శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ || 182 ||

o ఆబాలగోప విదితా   :-  చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరి చే పొగడ బడి ఆరాధింపబడు తల్లి . ఆబాలగోపాలం అను పదం మనం మన వాడుక భాషలో బృందావన వాసి అయిన శ్రీకృష్ణుని వివరించు కృష్ణతత్త్వము నందు వాడుదుము . అమ్మ తత్వమునకు విష్ణు తత్వమునకు మార్పు లేదు గనుక అలా చెప్పిరి .

        మరొక భావన లో విశ్లేషించిన గోప అనగా రక్షకశక్తి అని  ,ఇంద్రియములని , వేదములనీ , పరమేశ్వరుడని అనేక అర్ధములు కలవు  . అయితే మనలో ప్రాణశక్తి గా అమ్మయే ఉండి సకల ఇంద్రియ శక్తుల యందు దేవతా శక్తులు ఉండుట చేత మన ప్రాణ రక్షణకు చైతన్య శక్తిగా అమ్మ యుండి  నేను అను అహం రూపిణిగా తానే యుండి నడిపించు చున్నది . సర్వ జీవుల యందూ తానే యుండి మార్గదర్శకురాలై ఆరాధింపబడుచున్నది .

       మరొక భావములో చూచిన బృందవన విహారి అయిన రాధా దేవిని ఆబాలగోపవిదిత అందురు . ఈమె ప్రేమాస్పదరూపిణి . కృష్ణ భక్తి తత్పరురాలు . రాధాదేవి గోపరాజు అయిన

 వృషభానుని కుమార్తె .

o సర్వానుల్లంఘ్య శాసనా   :-   అమ్మవారు ప్రపంచమంతటికీ శాసనకర్తగా ఉండి తాను ప్రసాదించిన జ్ఞానముతో అందరూ ఆమె శాసనము నకు లొంగి యుండి దిక్కరించుటకు వీలు కాకుండా చేయు తల్లి .

o శ్రీ చక్రరాజనిలయా   :-  శ్రీచక్రము అనగా తిరుగుతున్న విశ్వ చక్రము . ఈ సమస్త విశ్వము నందు సృష్టి స్థితి లయములనెడి చక్రము కాలచక్రము తో నిరంతరము తిరుగుతూనే ఉండును . సమస్త లోకములందు తానుండి పట్టి నడిపించు తల్లి .

       శ్రీ అనగా లలిత, భవాని , ఉమా . శ్రీ చక్రము నందు బిందువు రూపంలో మహా చైతన్య రూపిణిగా నున్నశివశక్త్యైక్య రూపిణీ  . శ్రీచక్రము వివిధ చక్రములలో కెల్లా గొప్పది కావున అందు నివసించు తల్లి .

o శ్రీమత్త్రిపుర సుందరీ  :-   శ్రీo అనగా అమ్మవారి బీజాక్షర మంత్రము . త్రిపురములనగా మూడు లోకములను , ఆస్తి ,భాసి ,ప్రియం అను మూడు తత్వ శరీరములను ఆనందింపజేయు తల్లి .

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా |

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః || 183 ||

o శ్రీ శివా   :-   స్త్రీ వాచక నామం శ్రీ శివ అనగా శుభములు చేకూర్చు మంగళకరమగు తల్లి                శ్రీ రాజరాజేశ్వరీ దేవి . ఈమె శ్రీచక్రము లోని 8 ఆవరణలను లోకములుగా భావిస్తే తొమ్మిదవ ఆవరణ బిందుచక్ర నిలయగా నుండును .

o శివశక్త్యైక్య రూపిణీ  :-  శ్రీ చక్రము నందు బిందు స్వరూపముగా శివ స్థానము అనుకుంటే వెలుపల నున్న త్రికోణ చక్రము అమ్మవారి స్థానము . ఈ రెండింటి సమన్వయం రూపమే శివశక్త్యాత్మక ఐక్య స్వరూపము . శ్రీచక్రమే విశ్వవ్యాప్తమైన ప్రపంచము .

o లలితాంబికా :- లలిత అనగా అనేక పర్యాయ పదం అర్థ గుణములు కలిగిన అమ్మవారు . ఆ పదములివి  . సుందరి ,  లాలిత్య  , శోభ , లాలన , విలాసం ,గాంబీర్యం ,ధైర్యము ,ఆనందం మున్నగునవి .

     లలితా అమ్మవారు జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుని తన చైతన్య ఆనంద శక్తితో నిరంతరము ఆనందింప జేస్తూ ఆయన మనసు రంజింప జేయును .

కావున శ్రీచక్రము నందున్న బిందు త్రికోణ చక్ర తత్వము లను తెలిసి శివ , శక్తి స్వరూప ఆరాధన మనసా వాచా కర్మణా ఆనందముగా ఆరాధిస్తూ అమ్మవారి కరుణకు పాత్రులగుదురు గాక అని ఆకాంక్షలు .

        ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణ ఉత్తరాఖండ శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద శ్రీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్ర భావ అర్ధ విశ్లేషణం సంపూర్ణమ్ .

      ఈ పూర్తి విశ్లేషణ గ్రంథమును నూజివీడు పట్టణ శివారు లందు వేంచేసిన శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి శతసహస్ర వందనము లతో వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ వసంత పంచమి పర్వదినాన అనగా 29.01.2020న సభక్తి పూర్వకముగా అంకితముగా సమర్పించుకొను చున్నాను  .

ఇట్లు

భవదీయుడు

పోలూరు బాబురావు

నూజివీడు

9059591284

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 



ఈ దిగువ తెలిపిన వివిధ దేవతా ప్రార్ధన మంత్రములు లలితా సహస్రనామ స్తోత్రము ప్రారంభమునకు ముందు చదువు కొనవలెను అని మనవి 

                        ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

                               ఓం ఐo హ్రీo శ్రీo 

శ్రీ మాత్రే నమః.    శ్రీ అపర్ణయై నమః   శ్రీలలితాంబికాయైనమః

          

                              శ్రీ గణపతి మంత్రం

                     శుక్లాంబరధరంవిష్ణుం,శశివర్ణంచతుర్భుజం

                    ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే

ఓం తత్పురుషాయ విద్మహే

 వక్రతుండాయ ధీమహీ

 తన్నో దంతి ప్రచోదయాత్

ఓం గం గణపతయై నమః

ఓం గం సిద్ధి గణపతయే సిద్దిo దేహి సిద్ది స్వాహ

 ఓం శ్రీం  హ్రీo క్రీo గం శ్రీలక్ష్మీ గణపతయై నమః

                         శ్రీ రాజరాజేశ్వరీ దేవి మంత్రం

                    ( ప్రాయశ్చిత్త మంత్రం )

 ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ 

      శ్రీ రాజరాజేశ్వరీ బ్రహ్మవిద్యా మహాత్రిపురసుందరీ

      శ్రీ లాలితాపరాబట్టారికాంబా పరదేవతా నమో నమః


               





               శివమంత్రం

         శివ ద్విపంచాక్షరీ మంత్రం

ఓం నమో శ్రీ నీలకంఠాయ నమశ్శివాయః

ఓం నమః శంభవే చ మయో భవే చ

     నమః శంకరాయ చ మయస్కరాయ చ

                    నమః శివాయ చ శివతరాయ చ ఓం

                                       శ్రీ సరస్వతీమంత్రం

            ఓం ప్రాణోదేవీ సరస్వతి

                 వాజేభివాజినీవతీ

                 ధీ నామావిత్య్రవతు ఓం

జ్ఞానం దేహి స్మృతిoవిద్యాo శక్తిo శిష్యప్రబోధినిమ్

గ్రంథ కర్త్రుత్వ శక్తిoచ సుశిష్యo సుప్రతిష్ఠితం







            

                                        శ్రీ నారాయణ మంత్రం

     ఓం నారాయణాయ విద్మహే

          వాసుదేవాయ ధీమహి

          తన్నో విష్ణుః ప్రచోదయాత్

ఓం సహనావవతు 

ఓం శాంతి : శాంతి :శాంతి :

                                      శ్రీ మహాలక్ష్మి మంత్రం

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై

శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై


                                  గురుస్తుతి మంత్రం

                          ఓం శ్రీ గురుభ్యోనమః

గురు బ్రహ్మ గురు విష్ణు : గురుదేవో మహేశ్వరః

గురు సాక్ష్యాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 

శ్రీలలితా ధ్యాన శ్లోకం 


అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |

అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ || 

                                       


                                    శ్రీ మాత్రే నమః 

                                  కృతజ్ఞతాశీస్సులు

                           

శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దయ వలన నాచే శ్రీ లలితా సహస్రనామ భావార్ధ విశ్లేషణగా వ్రాయబడిన ఈ వ్రాతప్రతిని అత్యంత భక్తి శ్రద్ధలతో దోష రహితముగా  చరవాణి లో  అనురాగ స్ఫూర్తితో కంఠ శబ్ద నాదముతో మిక్కిలి ఉదారస్వభావుడగు నా కుమారుడు చిరంజీవి వెంకట నాగ ప్రవీణ్ కుమార్ వివిధ భాగములుగా ధ్వని ముద్రణ చేసి వాటిని అంతర్జాల సమాచారము గా చదువరులకు సౌలభ్యం కలిగించిన అతనికి నా హృదయపూర్వక అభినందన కృతజ్ఞత ఆశీర్వాదములు  అర్పిస్తూ అమ్మవారి కరుణాకటాక్ష ములకు పాత్రుడై నా ఆర్యాద్విశతి గ్రంథము కూడా త్వరలో ముద్రించి భక్తులకు వాట్సాప్ ద్వారా పంపగలనని విశ్వసిస్తున్నాను .

 కృతికర్త

పోలూరు బాబురావు