24, జూన్ 2012, ఆదివారం

శంకర స్తోత్రపటిమ


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః 


ఆర్ష సంస్కృతి అభ్యుదయ పధాన పయనించు వేళ
ఆశ్చర్యకరముగా శంకరుని దయతో కాలడి గ్రామాన
పుణ్య దంపతులకు పుత్రోదయము కల్గి శంకరాచార్య 
నామధేయముతో హైందవ మతోధ్ధరణము చేయ బూని
పిన్నవయసుననే సన్యాసమంది బ్రహ్మచారిగా జీవనక్రియ
ఆచరించు ప్రక్రియలో ఒకనాడు భిక్షాటనకేగి
ఆ యెలనాగ గృహమున్గిట నిలిచి భిక్ష యడుగ
కడుపేదయగు ఆ గృహిణి మరి మరి వెదకి
ఉసిరికాయనొకదానిన్దెచ్చి పాత్రయన్దుంచ 
కుమారశంకరుడదిగాంచి కరుణనుప్పొంగంగ 
ఆ తల్లి పేదరికము బాపుటకై జగజ్జనని 
శ్రీ మహాలక్ష్మినిన్ తలచి
"ఓం శ్రీం హ్రీం క్లీం ఐమ్ సోం శ్రీ మహాలక్ష్మీ నమః"
యని తలచి, కనకధారా స్తోత్రంబు పఠనముచేయ 
మరుక్షణమే ఆ గృహాన కనకవర్షంబు కురిసె.
ఇవ్విధంబుగా సకల దేవతా స్తోత్రంబులున్ కూర్చి
ఆది శంకరులు స్తోత్ర రాజముగా కనకధారా
స్తోత్రమును వర్ణించి, ఎవరు పారాయణమొనర్తురో వారికి
వారున్న రంగాన ధనమేగాక నానావిధాభివృధ్ధి చెందురనియెన్


ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా



పోలూరు బాబురావు, నూజివీడు

బంధు ధర్మాలు


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః 


అజ్ఞానపు మేలి ముసుగు
తొలగనిదే మనిషికి
విజ్ఞాన బీజమంకురించి
తరుశాఖల ఫలాలనిచ్చి
సుజ్ఞానవంతునిగా మలచి
జీవనచక్ర వాహినిలో
అజ్ఞానాంధకార లంపటము వీడి
శాంతి సౌఖ్యముల పొందవలెనేని 
ప్రాజ్ఞుడై విషయాసక్తుల
మోజులో దాగిన మనసును
ప్రజ్ఞతో నదుపుజేసి నిక్కంబగు
సత్యాన్వేషిగా కృషి సల్పవలె.
సంసార జలధిలో తాపత్రయాదులతో 
సంకరమగు జీవన స్థితి గతులలో ఓలలాడి 
సమ్పూరతమగు బాల కౌమార యవ్వన వృద్ధాప్యంబుల
దాటి మరణమాసన్నమగు వేళ
మంచిగ మనమున నారాయణుని తలపక 
ముందర జరిగినదంతయు తన ప్రజ్ఞయని
అందరి కష్ట సుఖములు నరక స్వర్గములని

భ్రమించి బంధు జనులె తన ఆత్మీయులని
జీవనంబు గడిపెడువానికి మోక్షంబెలాగు లభించునయా!
బంధు ధర్మాలు సదా పాటించవలెనయా!
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా

తల్లి: సత్యం, సత్యస్వరూపం;   తండ్రి: జ్ఞానం;   భార్య: శాంతి; 
సోదరుడు: ధర్మం;   పుత్రుడు: ఓర్పు;   స్నేహితుడు: దయ, మంచి హృదయం. 


పోలూరు బాబురావు, నూజివీడు

శ్రీ విఘ్నేశ్వర దండకం


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః
ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః



శ్రీ విఘ్నేశ్వర దండకం


శ్రీ మాత్త్రేనమః                                                          శ్రీ అపర్ణాయైనమః
శ్రీ లలితాంబికాయైనమః 

ఓం శ్రీమాతాతనయున్డవై   సర్వభూతహితప్రదాయున్డవై నూజివీటి గట్టు మీద గణపతిగా సుప్రసిద్ధుండవై  బందూక పుష్ప వర్ణ ప్రకాశమానమై   ఈశాన్య దిశాభి ముఖున్డవై   ఉషోదయ అరుణ కిరణ రంజితుడవై   నిత్య శోభాయమానున్డవై   సకల జన కార్య సిద్ధి సాఫల్యము చేయు మహా విఘ్నేశ్వరున్డవై    క్రియా సిద్ధి సత్వే భవతి యని మ్రొక్కిన వారికిన్, అభయంబునిచ్చి  ఒజ్జయైయుండి మనమునందే వశించి, నిరతము సద్బుద్ధినిచ్చి, దుష్ట శక్తులన్ హరించి, యెల్ల వేళలన్ మా యుల్లంబందుండి మాకు గల్గు భయాందోళలు రూపు మాపి, శారీరక మానసిక రోగంబులన్ మాపి, నిత్య ఆయురారోగ్య ఐశ్వర్యదాయులంజేసి,   ఓంకార స్వరూపుడవగు నీ భక్తి తత్పరతలో మమ్మోలలాడించి మూలాధార చక్రకాధారభూతున్డవై  సర్వజ్ఞుండవై  సమలోష్టకాశ్మకాన్చనంబగు సద్జ్ఞాన సంపదల్మాకొసంగి, మమ్ము స్థిత ప్రజ్ఞులన్ గావించి సదా మీ భక్తి చింతనను కలిగించుమయ్య యని ఓ పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలసాయవగు నినున్ నుతి చేయ అనుమతీయ వేడెదన్.


నమస్తే: నమస్తే: నమః
ఓం గం గణపతయై నమః 


ఓం గం సిద్ధి గణపతయే సిద్ధిందేహీ సిద్ధి స్వాహా

ఓం శ్రీం గం సంకట విఘ్నేశ్వరాయ నమః స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం గం శ్రీ లక్ష్మీ గణపతయై నమః

ఈ దండకమునకు భావ వ్యాఖ్య ఇచ్చట లభించును విఘ్నేశ్వర దండకం - భావ వ్యాఖ్య
పోలూరు బాబురావు, నూజివీడు

19, జూన్ 2012, మంగళవారం

స్వధర్మము

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


యుగమునకొక తీరున మానవ మనుగడ యుండగ
కలియుగ మానవ యునికిని విష్ణు పురాణంబందు
ఆ పరాశర, మైత్రేయ సంభాషణమే విశద పరచి
కలియుగ మానవ జీవన పయనము ఎటుల యుండునో తెల్పిరి

కలియుగమున మానవులు మాయా పీడితులై నిర్గుణ
పరమాత్మను తలచు వ్యవధి లేక ప్రాపంచిక విషయాసక్తుల
మునిగి, అవినీతి, అసూయ, ఈర్ష్యలకు లోనై,
"ధనమూల మిదంజగత్" యని భ్రమపడి
నీతి సూత్రములనెల్ల పాటింపక
అధర్మవర్తనులై మెలగుదురనియె.

ద్వాపర యుగాంతమున ఆ శ్రీహరి వైకుంఠము జేర
పరీక్షితుడను రాజు పాండవ పరిపాలకుడాయె.
ఆతడు ధర్మ పరిపాలనము జేయుచుండ
ఒక నాడు వేటకై బోవ, ఆంగీరస మహాముని
తపస్సులో నుండంగ, తన దాహము తీర్చుమని
యడుగంగ ఆతండు మిన్నకుండె!
రాజు కోపోద్రిక్తుడై ఒక చచ్చిన పాము నాతని మెడలో వేసి చనియె.
అంత మునికుమారుడు చూచి ఏడు దినములలో
రాజు మరణము కలుగునని శపియింప ఆ విషయము
తెలియక ఎవరి ధర్మంబు వారు పాటించినట్లైనదని
ముని తన కుమారునకు తెల్పి రాజు ధర్మ పరుడని తెల్పె.

తప్పు చేసిన వాడు తన తప్పు గ్రహించి ఒప్పు చేయుటకు
ఒప్పుకొనుటయే సర్వ ధర్మములోకెల్ల మిన్నయను ధర్మంబునే
ఋషీశ్వరులు ఆశ్రయించిరను విషయము తెలియవలయు.
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా!


పోలూరు బాబురావు, నూజివీడు

స్థిత ప్రజ్ఞత

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఆశల కుహరము జొచ్చితివేని
మోసులు తప్పవు ఎన్నటికేని!
ఆశల మోసులు విడవలెనంటే,
ఆశల ఊసులు తలుపక వుంటే,
ఆశయ సిద్ధియే జీవనవృద్ధియగు!

ఆత్మనిగ్రహంబడవలెనన్న
తాత్విక చింతనతో భక్తిపూర్వక
తత్త్వ జిజ్ఞాసతో భగవాను
నాత్మవిశ్వాసముతో పూజింపవలె!

మాయా జనితంబగు ఇంద్రియ వాంఛలలోబడి,
సర్వంబదియేయని యెంచి సర్వేశ్వరున్ మరచి,
ఆత్మ పరమాత్మలు వేర్వేరని తలచి,
కల్గిన సుఖ ప్రాప్తి భగవదను
గ్రహమని మునిగి తేలుట తగదనెన్!

అటుల గాక ఎవ్వరేని విషయాసక్తులనొదిలి
కర్మంబులాచరించి, తామరాకుయందోయంబు బొట్టు వలె
అంటీముట్టని నిస్వార్ధపరులు
స్థితప్రజ్ఞులందురు సుమీ!

     ద్వాపర యుగమున ద్వారకనేలిన కృష్ణా ముకుంద రాయ
     కలియుగ ద్వారక తిరుమల వెలసిన వేంకట రాయ
     వెతలకు కలతతో తధ్యము నీపై గద్యము రాయ
     నెలతతో కూడి మెరుపుగ మమ్మాదుకొన మేమంత పరాయ?


పోలూరు బాబురావు, నూజివీడు

ధృవ తార

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


సర్వ శక్తి స్వరూపుడగు నారాయణుని పూజింపలేని చేతులేల?
సర్వ విజ్ఞానవంతుడగు శ్రీహరిని మనమందు తలుపలేని మనసు యేల?
సర్వ చైతన్య వ్యాపకుడగు విష్ణు చర్యలు కానరాని కన్నులేల?
సర్వోన్నతుడగు ఆ పురుషోత్తముని భక్తితో ఆకట్టుకోని ఆత్మ ఏల?

భక్తవత్సలుడగు ఆ పరమాత్మ వాత్సల్యమెరుగలేనన్న
భక్తవరేణ్యులగు ముని పుంగవుల బోధలెల్ల వినవలె
భక్త సులభుడగు నారాయణ తత్త్వమెల్ల తెలిసి
భక్తి పాశముతో మనమున శ్రీహరిని బందీగ చేసుకొనవలయు.

అట్టి భక్తాగ్రేసరులలో ప్రధమునిగా ధృవుని తెలిసి
పట్టుదలతో భక్తి పెంపు చేసుకుని మన్ననలందవలె!
బాల్య దశ యందే ఐదేళ్ళ వయసు నాడు
అమూల్య కోరికతో తన తండ్రి అంకంబునందు
శయనింప తండ్రి దరికేగ యాతండు
నెయ్యముగ గారవింపక చెయ్యని త్రోసిరాజనియె.
ధృవుడు కినుక వహించి
ధృడచిత్తముతో తన మనమందు
నిలుపుకున్నట్టి గరుడ వాహనారూఢుండగు మహా విష్ణు
పూజ సల్ప కానలకున్ జని ఘోర తపమాచరింప
కాలమే ఆగి దేవ గణాన కలకలము చెలరేగ
స్వయంభువుయగు విష్ణువే ధృవుని కడకేగి తన
పాంచజన్యమును తాకించి తపము చాలింప జేయించి
తనదు కోరిక తెలుపుమనిన, యంత ధృవుండు తనదు
అసలు కోరిక మరచి తానెన్నటికి సద్భక్తిపరునిగా
తన ధ్యాన చింతనతో వుండు వరమీయమని కోర,
తని నిహలోక బంధములనుండి తప్పించి
నక్షత్ర మండలంబందు ధృవతారగా వెలుగొందునట్లు చేసి
భక్త సులభుడుగా విష్ణువు కీర్తి పొందినాడు.

పోలూరు బాబురావు, నూజివీడు

శుశ్రూష

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఆది మధ్యాంత రహితుడగు ఆ సర్వేశ్వరుండు
ఆది గురువై వేద విజ్ఞానమంతయు తెలిసి
     అదియు గురు ముఖతః తెలియగానెంచి
     కంసాది రాక్షస సంహార తదనంతరంబు
ఉగ్రసేనుని మధుర పట్టాభిషిక్తునింజేసి
తన అన్న బలరామునితో కూడి సాందీప ముని
     యొద్దకుంజనియె జ్ఞానాభిలాషియై.

అవ్విధంబుగ బలరామకృష్ణులు గురు సాందీపునియొద్ద విద్య గరపి
అరువదినాల్గువిధంబులగు కళలందు ఆరితేరి గురు మెప్పునొంది
     అద్వితీయంబగు కీర్తిబడసి గురుదక్షిణగా తమ కోరికేమిటని
     ఆ ద్విజుని ప్రశ్నింప, యాతన్డు సముద్ర స్నానమాచరించుటకేగిన
తనయు నీట మునిగి చనిపోయె గాన, ఎటులైన తన కుమారుని
సజీవునిగ జేసి తనకప్పగింపుమని కోరె!

అంత సర్వవ్యాపియగు ఆ పరమేశ్వరుండు తన మామ 
సముద్రుని తన గురు పుత్రునీయమని కోర,
     పాంచజన్యుడను రాక్షసుండు సముద్ర శంఖువై ఆ బాలునిన్ చేరదీసె
     నని విన్నవించె. నంత ఆ కృష్ణుండొక్కపరి సముద్రమున దూకి
ఆ రాక్షసున్ బరి మార్చి ఆ శంఖువునే పాంచజన్యమను
పేర తన ఆయుధంబుగ చేసికొనియె.

కృష్ణుడావిధంబుగ శంఖంబునొంది అది పూరించినపుడెల్ల
దేవతలకెల్లరకు శక్తి పెరిగి, దనుజులెల్లరు
     శక్తి హీనులై అసుర జాతి అంతమయ్యె!
     అంత సోదర ద్వయంబు యమపురికేగి
తమ గురు పుత్రు నాత్మ తమకొసగుమని యా యముని వేడ
యాతండటులనే యొసంగ ఆ గురు పుత్రుని వెంట గొనిపోయి
     తమ గురు సాందీపునకప్పగించి గురు ఆశీస్సులందె.

తమ గురు చెంతనున్నంత వరకు కృష్ణుండు ఏనాడు
     తాను భగవానునంశయని విన్నవించకపోయె. 

అదియె శిష్య శుశ్రూషయని తలచి గురునాధిక్యతను గౌరవించె.

పోలూరు బాబురావు, నూజివీడు

18, జూన్ 2012, సోమవారం

పుండరీక భక్తి

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

తమ ప్రేమ గెలుచుకొమ్మనుచు బిడ్డలను శిక్షించు తలిదండ్రులు గలరె?
అటులనే ఆ భగవాను సదా అన్వేషకులగు తన భక్తులను దరికి చేర్చుకోడా?
వ్యాస దశకమను వేదాంత గ్రంధాన ఆత్మ పరమాత్మ అనుబంధంబు ఆ కృష్ణునెజామనివలె వర్ణించె.
తన భక్తులనుద్ధరింపబూని దివి నుండి భువికి దిగి
మానవాతీత కష్టాలకోర్చి గోకులాన్ని కాపాడి ఆ యశోద తల్లికి
విశ్వరూప సందర్శనము చెయగలేదె?
శాంతి కాముకతతో కురుక్షేత్ర యుద్ధ నివారణకు రాయబార దౌత్యంబు చేయలేదె?
తదనంతరమర్జునునకు రధ సారథిగా మారి యాతనికిం గీతాబోధ చేయగలేదె?
అటుల మానవాత్మతో మనసు పెంచుకుని
పరమాత్మ తనకు తానె ఎల్లప్పుడు మనతోనుండుట సత్యంబుగాదె?
కపటము లేని ప్రేమ భక్తి తత్పరుని
లంపటములనుండి తప్పింప జూచి ఆధ్యాత్మికానంద భావనలలో తేల్చి
తన భక్తులకనుక్షణము రక్ష
కూర్చి
భక్తిపరులేదొసంగిన అదియె స్వీకరించి
భక్త సులభునిగా పేర్గాంచిన ఆ ఆదిదేవు మహిమ తెలియలేరె?
ఆనాడు తలిదండ్రుల ఆనతితో భక్తి పారవశ్యమున
ఆ కృష్ణునిన్ భజన సేయ తలిదండ్రుల పాదాల
నొత్తుచు ఆ పుండరీకుండు తని పనిలో నిండియుండ
ఆ శ్రీహరి యాతని భక్తికి మెచ్చి అట నిల్చుండ
అది చూచి తన వారి నిద్రకు భంగము కల్గునని యెంచి
ఆ భగవానునికాసీనమీయక ఒక ఇటుక రాయినచట చూపి
నిలువమనియె ఆ పుండరీకుండు
అంతటా హరి పుండరీకుని పితృ భక్తి శ్రద్ధలను మెచ్చుకుని
ఏదేని వరము కోరుకొమ్మనగా, ఇపుడు వున్న యటులె
ఎల్లప్పుడుండుమని కోరినంత ఆ స్వామి అటులనే
కటాక్షించి నేటికిన్ పాండురంగడను పేర
అశేష ప్రజా భక్త దర్శనంబొసంగుచూ
మహారాష్ట్రమందున్న పంధారేపూర్ నందు వెలసె
అవ్విధంబుగ ఆ ఆది దేవుడు భక్త సులభుండని
దైవభక్తి కన్న మాతాపితృ భక్తి ముఖ్యమని చాటినాడు.
ఇది పరమ గురుడు చెప్పిన మాట తెలుసుకోరా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

ఆరుద్ర దర్శనమ్

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


సృష్టి స్థితి లయ కారణంబగు వేద మూర్తులు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే త్రిమూర్తులై
    మానవులకు పరమేశ్వర చింతనా తత్వమెరిగింప
    కలియుగ ఒడి మాయా వూయల వూగిసలనధిగమింప
వేద విజ్ఞాన గని నుండి భగవన్నామ సంకీర్తనచే
మాయా ప్రలోభంబుల లోను గాకుండుటకు
     శివ పురాణంబుద్భవించె భక్త జన రామణీయకంబై!
     ఒక నాడు బ్రహ్మ వి
ష్ణులు కూడి యుండ
చండ ప్రచండ భాను మండల దేదీప్యకాంతి విరాజిల్లు
తుది మొదలు లేని అద్భుత ప్రకాశవంతమగు
    జ్యోతిస్స్వరూపంబుతో ఆరుద్ర దర్శనమను పేర
    విశ్వ దర్శనంబొసగె నా విశ్వేశ్వరుండు!
అగ్ని స్తంభంబగు నా జ్యోతి అరుణాచలంబై
పరబ్రహ్మంబు బిందు రూపమై
    ఆ పరమశివుడు లింగ రూపుడై భక్త సులభుండయ్యె!

ప్రణవ స్వరూపుడగు ఓంకారేశ్వరున్ గొలువ
పంచాక్షరీ మంత్రంబె ప్రామాణికంబయ్యె
    పంచముఖ స్వరూపుండగు ఆ పరమ శివుడు
    ఆదిమధ్యాంత రూపుడై ఆత్మ రూపంబులకు
తిరోదన, అనుగ్రహంబులనొనర్చి మానవాళికి
మోక్ష ప్రదాతయని శివపురాణ వైశిష్ట్యము తెలిపిరార్యులు.
   ఇది పరమ గురుడు చెప్పిన మాట తెలుసుకోరా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

13, జూన్ 2012, బుధవారం

సాంబుని కథ

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై
ఇష్టుల సత్యాగరిష్టత పెంపునకై
నిష్టతో యుగయుగమున
దృష్టముగ జన్మంబొందుచుందుననియెన్
హరి తద్గీతోపదేశంబునన్ .
అటుల మానవాభ్యుదయ పథమే కాంక్షించి
ఎటులైన నవోదయ చైతన్యము కలిగించి
పటుతరముగా తా సత్యప్రమాణములమేరకు
కటువుగ తానాచరించి అనుభవించి
కష్టము గానక మానవ శ్రేణిలో మిళితంబయ్యెన్
మానవ మాత్రునిగా మహినేలి మన్ననలంది
భగవానుడాకృష్ణుడు తానవతారము చాలింప
తన సంకల్ప బలమున  తన వంశీకులగు యాదవులు
మునిపుంగవులగు కణ్వ, గాది, నారదాదులు
పిండారకమను పవిత్ర స్థలమందుండగ 
జాంబవతి కృష్ణుల సుతుడగు సాంబునికి స్త్రీ వేషంబు ధరింప జేసి
మునుల  ముంగిలికేగి ఆ స్త్రీ వేష ధారికేబిడ్డ ప్రసవము కలుగునని
యడుగంగ మునులా విషయము దివ్యదృష్టిన్
గమనించి సాంబునకు ముసలంబు పుట్టునని
అదియె యదువంశ నాశనంబొనరించునని శపియించె.
అటుల ముసలంబుట్టగ దానింగొనిపోయి
సంద్రమునందొక బండపై అరిగింప
దాని అణువుల ప్రభావముతో రెల్లు మొక్కలు మొలిచి
యాదవులందరు వాటితో కొట్లాడి మరణంబొంది
తుదకు ముసలపు సన్నటి ముక్కను సంద్రమునందు విడువ
అదియు అలల తాకిడికి వొడ్డుకు చేరి వేటగానికి అది కనిపించగ
అంబుగ తన విల్లుకు వాడి అలసిన కృష్ణుండు సేద తీరు సమయాన
పొదలలో పక్షియని భావించి గురి చూచి స్వామి బొటన వేలు చీల్చె
అంత పరమాత్ముతన అవతారమును చాలించె
అవ్విధంబుగ అవతార మూర్తియై అష్ట కష్టములననుభవించి
మానవాళితో మమేకమై మహిమాన్వితుడయ్యెన్


పోలూరు బాబురావు, నూజివీడు

నిర్ణయ బలిమి

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఎప్పటికెయ్యది ప్రస్తుత సమస్యకు అప్పటికా తుది నిర్ణయంబు
తప్పక గైకొనవలె స్వయముగా చెప్పెడు ఇతరుల సూచన 
తప్పని తలపక తప్పదు సుమీ!
ఆడిన మాట తప్పని బలి చక్రవర్తి అడగ వచ్చిన వాడు 
రాక్షసాంతకుడగు శ్రీహరియని తెలిసి
కడగి మనోధైర్యంబుతో అడగకనే ఇచ్చు ధాతృత్వ వంశజుండైవుండి
   కడకు తుది నిర్ణయము ప్రకటించి
అడగవచ్చిన వటువు విష్ణువేనని తెలిపిన
   గురుడు శుక్రాచార్యు మాట తప్పుట చెడుయని తలచి
మాట వినక తన ధన ప్రాణంబుల్ వీడి
లక్షింపక త్రివిక్రమునకు మూడడుగులు దానమిచ్చి ధన్యత చెందెన్
వామనుడు వాంచితంబగు భిక్ష పొందినంతనె దానవ రాజుకున్
తన నిజ రూపమెరిగింప వేగమేనొక పాదంబుతో సత్యలోకమె కొలువ
వేరొక పాదముతో కర్మభూమి ధరణిపై మోపి మూడవ అడుగుకు స్థలమేదని అడుగగ తన జ్ఞాన పీఠమే తగినదని తలవంచెనా బలి
అంతట పాద ఘట్టనతో అతనిని పాతాళంబు జేర్చి
మూడడుగుల ముల్లోకముల్ గొల్చె నా త్రివిక్రము పరాక్రమున్
మానవ నిర్ణయంబులెప్పుడును ఆధ్యాత్మిక బలిమి కలిగి యుండవలె
ఇది పరమ గురుడు చెప్పిన మాట తెలుసుకోర పామరుడా


పోలూరు బాబురావు, నూజివీడు

11, జూన్ 2012, సోమవారం

కర్మాచరణ

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


నిరాశా నిస్పృహలకు తావు లేని ధర్మాచరణమె ముఖ్యమని
అట్టి కర్మంబునందు స్వలాభాపేక్షలేక 
కర్మాచరణమె ధ్యేయముగానెంచి కాలానుగుణ కర్మంబొనర్చి
కర్మానుగుణంబై ప్రతిఫలాపేక్షలేక కర్మంబొనరించుటయె
ఉత్తమ లక్షణంబని ఆ పరమాత్మ కర్మయోగంబునందర్జునునకు ఉపదేశించె

ప్రతిఫలాపేక్షలేని  కర్మంబాచరించు వ్యక్తి
మంచి చెడుల నిర్ణయము సులభముగ పొంది
సకల భోగ భాగ్యాలనుభవింతురని తెల్పె!
కర్మాచారణకా కృష్ణున్డు తానె మాదిరినని
ముజ్జగములేలి భూతభవిష్యద్వర్తమానాలెల్ల తెలిసి
రధ సారథియై హయములనదిలించు క్రియకు
ఉద్యుక్తుడగుట కర్మయందు ధర్మంబు స్థాపించవలెనను
తపన చేతనే కదా!

అందుచే కర్మచేయుటయందే గాని కర్మ సిద్ధిపై బుద్ధి పోనీకుమనియె!

పనియందు పటిమజూపి పనియె తన పరమావధని యెంచి
పని పరమధర్మమని పని యందు పరమాత్ముజూడవలయు
ఇది పరమగురుడు చెప్పిన మాట తెలుసుకో
రా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

ప్రకృతి తత్త్వం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

జగస్థిత విశ్వంభరుడే శ్రీ మహా విష్ణువై
ముజ్జగములేలు మూల విరాట్టుడై
తన ఊర్ధ్వ భాగ శక్తియందు ఆధ్యాత్మిక శక్తులన్ నిల్పి
తన అధో భాగ శక్తియందు ప్రకృతి శక్తియుక్తులన్ నిల్పి
జగమంతయొక మణిపూస మాలికాహారముగ చేసి
జగమంత తానెయై సర్వవ్యాపి 'నే'నని
గీతయందర్జనునికిన్ దెలిపె

అటుల జనించిన ప్రకృతి శక్తులు త్రివిధములై
సత్త్వరజఃతమోగుణములుగా పరిడవిల్లి
భిన్నత్వమై మానవాళియందావిర్భవించి
ప్రతియొకండును వేరువేరై కన్పట్టుచుండె
జగమంత విస్తరించిన ఈ త్రిగుణాత్మకములే
ఆ శ్రీహరి కల్పితంబగు మాయామేయ స్వరూపమని
జగపతి అర్జునునకున్ దెలిపి అట్టి మాయకున్లోబడక
సదా భగవన్నాముచ్చరించువారలె
పరమపద పీఠంబు చేరుదురనియె

సత్త్వగుణాన్వితుడగు విభీషణుడు
సోదర చేష్టలు వారింప కోప కారణంబై
ఆ శ్రీరాముప్రాపకంబు జేరె
రావణుండు రాజస ప్రతీకకాగ
కుంభకర్ణుండు తామస గుణాకర్షితుడయ్యె
భగవా నునికి తెలియవలెనన్న
మానవాళి మనోబుద్ధి వికాసతత్త్వంబు తెలియవలయు
ఇది పరమగురుడు చెప్పిన మాట తెలుసుకోరా పామరుడా!

పోలూరు బాబురావు, నూజివీడు

త్రిగుణాతీతుడు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః


కోరుకున్నంతనే కొండంత అండగావున్న
గురువాయూరప్పను తన గురువుగానెంచి
భారతంబందున్న భాగవత పురాణమును
నారాయణీయంబను రమణీయ కావ్యంబుగా
తీర్చిదిద్దుటలో తనకు సహకరించ వేడి
ఆ నారాయణ భక్తి తత్త్వ ప్రాధాన్యతనెరిగి
గురు అనుమతితో అచ్యుతచరిత లిఖించి
నారాయణ భట్టాద్రి భక్త కవివరేణ్యుడాయె!

సృష్టి రహస్యమెరుక పరచు సందర్భాన
పుష్టికరమగు నాద బ్రహ్మ తత్త్వంబు తెలిపి
దృష్టినంతయు ఓంకార నాదంబుపై నిలిపి
సృష్టికాద్యులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులె
త్రిగుణాత్మకతీతులుగా త్రిమూర్తులను
త్రివిధములగు లోకపాలకులుగా కీర్తించెన్
ముజ్జగములకు మూలాధారంబు త్రిగుణతత్త్వమేయని
రజసత్త్వతమో గుణములే మూలమని యెంచి
త్రిసంజ్ఞలగు అ, ఉ, మ లతో కూడిన ఓంకార శబ్దంబు
త్రిమూర్త్యంశ యని తలంచి వేదత్రయంబగు
ఋగ్యజుస్సామవేదములె ఆ ఆదిదేవుని కీర్తింప
అట్టి నిర్గుణ తత్త్వ పరమాత్మ జాగృత్స్వప్నసుషుప్తావస్తలనబడు
త్రివిధావస్తలకతీతునిగా భావించి
భూతభవిష్యద్వర్తమాన కాలాతీతునిగా యెంచి
మూడడుగులతో ముల్లోకములగొల్చి భూ మాతన్ పవిత్రుగావించిన
ఆ త్రివిక్రమ రూపమున్దర్శించినాడు

పోలూరు బాబురావు, నూజివీడు

తత్త్వం

మనసు భావమెరిగి మాటను నోటికందిస్తే
నోరు తారుమారు చేసి మాటాడితే
ముందుగా చేతికేగా పనులు దక్కు!
కుడి చేయి మంచి పనులు చేయగ తొందర
ఎడమ చేయి పాచి పనులకే ముందర
కుడి ఎడమలేదైన పొరపాటు లేదందురే
రెండు చేతుల ఆర్జించు కొందరకు ఏది ఏ చేయో ఏమి తెలుసు?
తెలిసినవాడొక్కడే ఆ వ్రాత తాత
చేతి ముద్రకు ముందే నొసటి వ్రాత వ్రాసినాడు
ముద్ర తత్త్వమిదియని సాముద్రికుడు చెప్తే
వాడి ముద్దకోసమదియని సరి పెట్టుకోవాలి మరి!

పోలూరు బాబురావు, నూజివీడు

హస్త వాసి

చేతి పనులే కొందరికి చేయ బుద్ధి
చేతి వ్రాతయే ఎందరికో చేత ముద్ద
చేతి వాటమే ఆ దొంగకి దేహ శుద్ధి
చేతి లాఠీయె ఆ పోలీసు కార్య సిద్ధి
చేతి వ్యాధి తగ్గుటయే నాదు మనస్సిద్ధి
చేయూతయే ఇందరకు ఈశ్వర తత్త్వ సిద్ధి
చేతి కర్ర బాపూజి అహింసతో స్వాతంత్ర్య సిద్ధి

పోలూరు బాబురావు, నూజివీడు

ఆత్మ ఘోష

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ  నమః
 
హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి
కష్టాల కొలిమిలో కడవరకు కాలినాను
మెరుగుపడినంతనె సమ్మెటకు ఒరిగినాను
అంతలోనే హారమై సుమాలు కంఠాన అమరినాయి
పలువురి మన్ననలే మిన్ను ముట్టాయి
హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి
ఏడేడు జన్మలకు ఒక్కటిగా నున్చుమని
నిత్య పూజలు చేసి లక్ష్మీ తులసినే కోరాను
కోరినవి రాక కూడుకున్నవే యిచ్చి  నిధిగానున్చి
నింగి నిశీధిలో వెడలిపోయి మరునాటి
పసిడి కాంతులలో ఉషస్సుతో  కలగలిసినాను

హేమనై వచ్చాను భువనానికి
ప్రేమినై వెళ్ళాను గగనానికి

బంగారానికి అన్వయంగ:

ప్రపంచంలో అత్యంత విలువైన, అందాన్నినుమడింపచేయు మిక్కిలి ప్రజాభీష్టము అయిన లోహము బంగారము. అట్టి లోహము కలిగియున్నవాడు సూర్యభగవానుడు . అందుననే ఆయనను హిరణ్యగర్భుడు అంటారు. హిరణ్యమనగా పసిడి.ఆ ఆదిత్య శక్తి వలననే బంగారము (హేమము) దివి నుండి భువికి వచ్చింది. భూవాసులన్దరకూ హేమాకర్షితమై ప్రేమి అయినది. అంతటి ప్రేమమయి యైనప్పటికి, దాని కష్టాలు దానికున్నాయి. సహజంగా ముడి లోహము మానవులు ముడువరు కదా! అందుకై అగ్నిపూజ్యము జేసి కొలిమిలో కాల్చి మెరుగు పడి పైడిఛాయ వచ్చినంతనే సమ్మెట దెబ్బల నోర్చుకొని సాగపడి అచేతన స్థితిలోనున్న తరుణాన వారి వారి కనుగుణ కంఠమాలలుగా ధరియించి, పలువురి మన్నన(మెప్పు)లు పొంది కీర్తి నొందుతున్నది. నిత్య తులసి మాత పూజ చేసే రుక్మిణి దేవి జన్మజన్మలకు శ్రీ కృష్ణుని పొందునే కోరినప్పుడు, సత్యా దేవి బంగారంతో తులతూచి స్వంతం చేసుకోలేక కడకు తులసిచేత కీర్తినొంది  పుణ్య స్త్రీలై ఆభరణభూషితులై అవతార పరిసమాప్తినాడు అగ్ని పునీతులై పసిడి కాంతులలో ప్రక్షాళితమై ఉషః కాంతిలో కలిసి హేమము నిష్క్రమించింది.

పోలూరు బాబురావు, నూజివీడు

10, జూన్ 2012, ఆదివారం

నాగరికత

నాగరికత బట్ట కట్టింది ఆనాడు
బజారుకెళ్ళి విడిచింది ఈనాడు
అన్ని వయస్కులకు ఆ వోణీ అడ్డు నిలిచింది
ఈనాటి మగువకు చిన్న గాలికే చున్నీ చెలరేగింది
ఆనాటి నాతి ఎద లోన అందాల సూత్రాలు
ఈనాటి మహిళల సూత్రాల నర్తనలు దొంగలకు ఆత్రాలు
భర్త పేరు చెప్పుటకు సిగ్గు పడి వారు వారంటే
నిస్సిగ్గుగా భర్త పేరుతో పిలిచి వాడు వాడంటుంటే
కట్టుబాటు లేక గుట్టు బట్టబయలాయే
ఇంతి గుట్టు వంటికి చెడుపాయె
తల్లులు పిల్లలకు భూత పురాణాలు చెప్పి
ఊయలలూపి లాలింపగ
నాగరీక తల్లులీనాడు సినీ బూతు పురాణాలే చెప్పి
ఊహల జంపాలలూపుతుండె!
నాటి నాగరికత నట్టింట బుట్టింది
నేటి నాజూకు నియతి లేక వీధి బట్టింది

పోలూరు బాబురావు, నూజివీడు

త్రిలింగ భాష

భారతీ దేవి చేతి పుస్తక పుట శృతులనుండి
జాలువారి వేద భూములనుండి భారతాన
పలు భాషలు ఉద్భవింప అందు దేవ
భాషయగు సంస్కృతమే మిన్న కాగ
కాలగమనాన అన్నియు కనుమరుగగు చందాన
నేడది యల్ప సంఖ్యాక భాషయై దైవ భాషయయ్యే!
కాలానుగుణముగా ఉత్తర దక్షిణ హద్దులలో
ఆర్య, ద్రవిడ సంప్రదాయులు వేర్వేరు భాషల నేర్చి
వారి వారి అవసరాలకనుగుణముగ మార్చి
పలు విధ ప్రాంతేయ భాషా యజ్ఞానికి ఆజ్యమ్ముపోసి
ఆయా భాషల పాండిత్య పటిమ జూపి మేటి యైరి
అట్టి అత్యంత ప్రాచీన భాషయగు తెలుగు మాట్లాడ
క్రీస్తుకు మునుపె బుద్ధుని కాలములో
ఎందరో ప్రబుద్ధులు తెనుగు భాష పోషించే!
అటుల అమరావతి కుడ్యముపై 'నాగబు'
మూలమై తన ప్రాచీనతను చాటుచుండ
అమ్మయను పదము ఆంధ్రుల సొంతమై అలరారుచుండ,
జన్మభూమియందు పుట్టి గిట్టు వాడు
అమ్మయని అనక వేరోకగా పలుకునే!
అందుగల తెలుగుతనము మరుతుమే!
జాతి ప్రాచీనతను మార్తుమే!
ద్విసహస్రవత్సరపూర్వపాలకులగు శాతవాహనులు
తొట్టతొలి ఆంద్ర రాజులేగా!
వారి కాలాన్న వృద్ధి చేసిన ఆంధ్ర భాష
తదుపరి కాలాల వారు కవిత్వ భాషగా చేయలేదే!
దక్షిణాదిన పల్లవ రాజులు తేట తెలుగు తీపి తెలుపలేదే!
కన్నడిగుడైనను రాయలు తెలుగు కవితా గోష్టులు చేయలేదే!
దేశ భాషలందు పద్య కవిత్వావధానము తెలుగు భాషకే కలదని
సావధానముగ ఆలోచనము చేయవలయు.
అట్టి తెలుగు భాషను ప్రభుత్వ రాజ భాషగ చేయవలయు.
మనుజ జన్మంబెత్తిన ప్రతివారు మధురిమలు వొలుకు
తెలుగు భాష మాటలాడవలయు.
మాతృ భాషను మృత భాషగా చేయవలదు.
మూడు ప్రాంతాల వారి మువ్వన్నెల ముచ్చటైన
మన తెలుగు భాష అట్టి మాతృ భాషను పోషించి
మన సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లరు పాటించవలయు.
అటుల అమ్మయను పదము పుట్టిన నాడే తెలుగుబుట్టె.
అమ్మ ప్రాచీనతాతనము లెక్కించ ఎవరి తరము?
తల్లి నాలుక అందరకు తలలో నాలుకై మెలగాలి.
భిన్న భాషతో తలో నాలుకగా విడివడరాదు.

పోలూరు బాబురావు, నూజివీడు

నేటి భారతం

స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం
నిరంకుశ రాజకీయుల కుతంత్రం
ఆనాడేనాడో ఆంగ్ల ప్రభుత నెదిరించి
అహింసయే పరమావధిగా ఆ నాటి మన గాంధి
పలు మార్లు చర్చిల్తో  చర్చలే జరిపి
భారతావని స్వాతంత్ర జ్యోతి వెలిగించి
భావి ఫలాలే చవి చూడక ఆత్మార్పనమొంది
అమరుడై మహాత్ముడైనాడు.
రాచరికపు రాజవ్యవస్థ వద్దనుకుని
మాంత్రికులను మించిన మంత్రివర్య పాలనతో
నేటి భారతావని అలమటిస్తున్న తీరిది!

 పోలూరు బాబురావు, నూజివీడు

నాకరము

నా కరమునకు ఏదో హానికరముకలిగి
కనికరములేక ఓ పరికరముగా మారె
నికరముగా నినునే కొలువ మిక్కుటమగు
నీ కనికరముతో నాకరము బాగగునని
కడు భక్తికరముగా నీ సేవ జేయదలచి
ఇంధనకరమగు జ్ఞానసిద్ధి పొందుకు వేడెదన్!

పోలూరు బాబురావు, నూజివీడు

కాల సాక్షి

ఎక్కడో అమెరికాలో పుట్టి
ఆనాడేనాడో భారతము మెట్టి
అటనుండి కృష్ణా తీరముంజేరి
పంతొమ్మిదివందల నాల్గులో
నాల్గు రూకలతో ఓ తల్లి నన్ను కొని
తన మనుమని జన్మ కానుకగా
పురుషోత్తమునకిచ్చి కాలలేమి
కొరత తీర్పంగ చేసారు నన్ను ఆజన్మ ఖైదీగా
అప్పటి నుండి ఆ యింటనే వుండి
అనుక్షణము కంటికి రెప్పగా
పోలూరి వారి కుటుంబం చూస్తూ
నాల్గు దశాబ్దాలు నాటి పెద్దయగు
బాపిరాజుకు మరి యిరువురు కుమార్లుతో
అన్యోన్య ఆత్మీయతకనువుగా
నూజివీడునందు నివసించుచూ
ఎల్లవేళలా ఆ కుటుంబ బాగోగులు చూస్తూ
ఒక్కొక్కపరి అందరూ పస్తులున్డుట
కూడా నేనురుగుదును. ఎటులనో కూడి
కూటికిన్ గుడ్డకున్ లోటు లేక
గడుస్తున్న ఒక దినము పెద్దాయన
తన జాతకము తానెరిగి నను జూచి
కాల నిర్ణయము జేసి, నేచూస్తుండగానే
అచేతనుడై పరుండి తన మువ్వురు
కుమారులు తనకు ఉత్తర క్రియలు
జరుపరేమోనని తలచి, బ్రతికుండగనే
యదార్ధ కర్మ జరిపించుకోవాలని తలచి
జీవధార కట్టించుకుని జీవ విముక్తిని
పొంది, మరణంబునొంది పవిత్రుడాయె.
ముగ్గురన్నదమ్ములలో మొదటివాడు
బ్రహ్మచారి కాగ మిగిలిన యిరువురు
శుభులై, సంసార జీవనులై పుత్రపుత్రికాదులతో
ఆ ఇల్లు కళకళలాడుచుండంగ
ప్రతి సంవత్సరమొక బారసాలయో
వివాహమో జరుగుచూ మూడు పూవులు
ఆరు కాయలన్నట్లు జరుగుచుండే.
ఇంటి మధ్య గోడకు నేనుండి అందరకు
సమయంబందిన్చుదాననై యింటి వారికే
కాక  పేటవాసులకు కూడా టైము
తెలిపెడుదాననై ఘంటానినాదంబు
కూడ అలుపెరగక సల్పినాను.
శాస్త్రులు టైము చూచుటకు వస్తే
పిల్లలందరూ తలుపు మూసి నను దాచి
నన్ను చూడ నిచ్చేడి వారు కాదు.
నాకు దృష్టి తగులుతుందని కాబోలు!
అతుల అభిమానించిన ఆ పిల్లలను
వాకిట ఆటలాడుకొనుచుంటే
కనులారంగ చూచుకొనేదానను.
అప్పుడప్పుడు నాకింత 'కీ' యిచ్చి
నన్ను పని చేయించి నా చేయూత
పొందేటి ఆ కుటుంబ స్నేహమునేనెలా
మరువగలను.
అచ్చొచ్చినదాననని ఒక చోటనే యుంచి
గోడ కచ్చోట అచ్చు పడునట్లుగా
యుంచి అందరూ ఆప్యాయతగా చూచినారు.
అటుల కాలచక్ర బంధముతో
శుభాశుభ మిశ్రమాల పరిభ్రమణంలో
ఎన్నెన్ని  సంఘటనలో చూచినాను.
కలతలు, కక్షలు, కార్పణ్యాలతో
కొన్ని ఘటనలతో కలత చెంది,
నాకు స్తానభ్రంశము కలుగు సమయాన
నా హృదయ స్పందనమాగి మూగబోయి
పాత గూడు మారి కొత్త గూటికి చేరి
నను కాన్కగా పొందిన యజమాని
దత్తుకు చేరి వారింటి కష్ట సుఖాలలో
మమేకమై జీవన ప్రక్రియ సాగుతుండ
తొంభై దశకములో పగలంత నాకు
తోడుగా 'చింటు'తో కాలక్షేపము చేయ
నేగంట కొట్టినప్పుడెల్ల అది వులికిపడగా
నా నోరు నొక్కుకుని నే మ్రోగుటాపినాను.
అటుల పదునాల్గు వత్సరములు గడువ
ఒక స్వాతంత్ర దినముందు రోజు
'చింటు తల్లి' ఉదయాన నే చూస్తుండ
కనుమూసి కనుమరుగై కంట తడి
నింపి కానరాని దూరతీరాలకేగి
నా శతవర్షసంవత్సరాన నాకు
క్షోభ  కల్గించి తాననంత కాలవాహినిలో
చిరాయువయ్యింది.
నాకెప్పటికో మోక్ష ప్రాప్తి. నేనెరుగ
నీకాలమహిమ.

పోలూరు బాబురావు, నూజివీడు

దయ

దేవకీ నందన నిను కనుగొననందున లేడని అందున
ఎందున బడితే అందున వుండే నిను నేనెందుకు లేడందును?
ఎందెందు చూచినా అందందు ఉండునని అర్జునునితో అనలేదా?
హృదయపు తలుపున ప్రేమే తడితే, రాదా దయ?
ఆదర భావన ప్రేమకు లేక దయ చేయదయా.
అందరి ఈర్ష్య, అసూయ తత్వం దయ చేయకనే దయ కలుగదయా.
సోదర భావమే జీవన జగతిలో దయ చుట్టంబై వస్తుందయా.
పొందుతో పెరిగి మనసుతో కలిసి దయమహోదయంబగునయా.

పోలూరు బాబురావు, నూజివీడు

చంద్ర విలాసం

ఆది నుండి ఆదిత్యు వీక్షణాన భూవాసులకు
దినకరుడై దినరాజుగా పూజింపబడుచుండ
ఆ నాడేనాడో దేవ రాక్షస గణములెల్ల
అమృత సముపార్జనకై క్షీరాబ్ధి చిలుకుటకు
ఆ మందర నగముతో మధన సమయాన
ఆది యందు అమ్మ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించగా
అమ్మ తోబుట్టువుగా అంద చందాల చంద్రునిగా
ఆవిర్భవించి గగన మండలాన రేరాజుగ మారి
అవనిజనులకందరకు చందమామ అయ్యాడు
అటుల భూమితో దగ్గరగా సూర్య ప్రదక్షణ
అనవరతము చేయుచూ అష్ట గ్రహ కూటమిలో చేరి
సూర్య కిరణ ప్రభావితుడై వివిధ కళలతో
మాసానికొక మారు పూర్ణ చంద్రునిగ మారి నెలరాజుగా
గగనాన పయనించి వుర్విజనులకు శీతల
కాంతి పుంజములు పంచి ఆనంద ఖేలనలకు
నాందియై, తండ్రి సాగరుజూచినంత
అమితోత్సాహభరితుడై ఆలింగనముజేయ
తన దీర్ఘ బాహు కెరటాల బందీగా చేయుటకు
ఉవ్వెత్తు తరంగ హోరుతో భూమండలము
కబళించి 'త్సునామి'ల ననాయాసంబుగా సృష్టించి
భూజనులు విభ్రమమునొంద క్షణకాలమందె
పచ్చటి ప్రకృతిని విలయాగ్ని కీలలతో
బడబాగ్ని పుట్టించి వొడ్డునున్న దుడ్డుబిడ్డ
లెల్లరను విగత జీవులుగాజేసి ఘోరకలిసల్పే
జగన్నియంతలవలె తండ్రి తనయుల దుష్కృత్యంబులు మాపి
తొలిసంధ్య వెలుగులు చూచు జపానుకిట్టి ఆపద
సంభవించుట గర్హనీయమైనదై అందరకు
వొజ్జయైన ఆ విఘ్నరాజుకు తనశిరమునందున్న
చంద్రుని మందలించి మమ్మందరను కాపాడి
నాటి కంసమామ వంటి చందమామ తుంటరి
తనముమాపుమని చరణ శరణ పూజితులు కావలె!
తిరిగి మానసిక ఉత్తేజితులు కావలె!

"విచిత్ర స్పురద్రత్న మాలా కిరీటం
కిరీటోజ్వలచ్చంద్ర రేఖా విభుషణం
విభూషైక భూషం భవధ్వంసహేతుం
గణాధీశ మీశాన సూనుం తమీడే!"

(ఇతి శంకరాచార్య విరచిత గణేశ భుజంగ స్తోత్రం)


పోలూరు బాబురావు, నూజివీడు

8, జూన్ 2012, శుక్రవారం

అంతర్ముఖం (కుశల ప్రశ్నలు)

ఆరు పదులు వయసు దాటి షితో షికారుకేగి
ఆరు బయట హుషారుగా నడుస్తున్న వేళ
అదిగో మా చిన్న నాటి వీధి బడి చూపి ముందుకేగ
ఆగాగుమంటూ ఒక గద్గదస్వరమే పిలువ
ఎవరోనని దగ్గరకేగి పరికించి పలుకరింప
పాడుబడ్డ వీధి బడి బావురుమని ఏడ్చి నిట్టూర్పుతో
నిలబడ్డ నన్ను చూచి పాత జ్ఞాపకాలే గురుతురాగ
చిన్ననాటి తలపులతో నాకానాటి పంతులేసిన
గోడకుర్చి శిక్షకు తానాలంబనమైనందుకు
వ్యధ చెంది కూలిన ఆ బడి గోడే కుశలమడిగి తెలుసుకొంది

విచలితుడై ముందుకేగ...

నేరేడు పండొకటి నా నెత్తి పై బడ
కనులెత్తి జూడ పాత జ్ఞాపకాలు గురుతురాగ
ఆ నాటి సెలవులలో నెలవులే వీడి
కలివిడిగా అందరము కొమ్మలే దులిపి
క్రింద పడిన నల్లని వేడి వేడి నేరేడులన్ని
ఊదుకుంటూ ఆత్రుతగా నోటికందించు
విషయమే గుర్తు రాగ నా కుశలమడిగి తెలుసుకొంది

ఆ వృక్ష రాజమునకు ఎంత ప్రేమో నాపై అని అనుకుంటూ ముందుకేగ...

మండు వేసవి సైతము నిరంతర ఊట
జలముతో మెండుగ నీరందించు
ఊరి బావి పరిశీలనకు ఉత్సుకతతో నేజూడ
పుష్కలముగ నీరుండి పులకించసాగ
పాత జ్ఞపకాలె మనసుపులుముకోగ
మడి బట్ట కట్టి బిందె భుజాన్నెట్టి వడివడిగ
హడావిడిగా వంటకై నీరు చేది
తెచ్చేటి మా తల్లి సేవలన్ని తలచి
అహర్నిశలు నీటికై పెదనాన్న తపన తలచి
విలపించు మనసుతో బావి గిలకల
బావురు చప్పుళ్ళ దాహార్తి కేకలల్లో
బొంగురు గొంతుకతో ఒక గిలక
నను జూచి పేరుపేర అందరి కుశలమడిగి
తెలుసుకొని చాన్నాళ్ళ తన బాధ వెళ్ళగక్కింది!
ఆహా! ప్రకృతి ఎంత కరుణామయమై నిరతము రసమయమగు
జీవనము గడిపేటి మా బోంట్ల మంచి చెడుల విచారించు
సృష్టి చిత్రమిదియెనేమొ!

అటుల ఆలోచనము చేసి నడుచుచున్నంతలో...

ఓ ఆడ మనిషిని చూచి పాత జ్ఞాపకాలే గురుతురాగ
మా అమ్మ మనసులో కదలాడ, వరుస గర్భాలతో
ఆరోగ్యమె క్షీణించి చివరి మూడు సంతుకు
క్షీర లభ్యతె లేని కారణాన గో క్షీరము కొరకు
ఇల్లిల్లు తిరిగి సేకరించి దెచ్చి పిల్లలకు పట్టివ్వ
అవియు సరిపడక మేక పాలు వాడుక చేయ సాగ
పరాయి పిల్లలనికూడ చూడక తన పిల్లలను
మరిపించి తన యజమాని పిల్లలకు తన స్తన్యమందించి
మా అమ్మనె మురిపించి ప్రాణ శక్తినందించి
జీవ శక్తినిచ్చి త్యాగనిరతి చూపినట్టి ఆ మనిషే
నన్ను జూచి కుశలమడిగి తెలుసుకొని
మురిసిపోయి ముందుకేగె

ప్రకృతి పంచ భూత శక్తులతో
మంత్ర తంత్ర యంత్రములతో
శిల్పి చెక్కిన గండశిలకే ప్రాణ ప్రతిష్ఠ చేసి
కొండ మీద గుడి కట్టి, గుండె నిండ మనిషి
నిల్పుకొని మనసార పూజించి ధన్యత చెంద
నిరతము విద్యా వినయ వివేకముల
నొసగి జ్ఞానవంతులుగా తీర్చి దిద్ది శ్రమయే
తమ పరమావధిగ జీవ శక్తినిచ్చి
నిరతము మనలను సేవించు ప్రకృతి
శక్తులగు బడి-బావి-బానిస వంటివి
శ్రమయేవ జయతియని తెలియవలయు
అట్టి శక్తులను విస్మరింపవలదు ఎన్నటికి
మానవతను చూపి నవ యువతకు దారి చూపు
ఎప్పటికీ ఇంకెప్పటికీ!

పోలూరు బాబురావు, నూజివీడు