8, జులై 2016, శుక్రవారం

దివి నుండి భువికి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
దివి నుండి భువికి

నా తల్లి ఆ నాటి మాట నిలుపుకొందుకై
     తల్లి సరస్వతి ఆ బ్రహ్మతో మాట్లాడి
తన ఆత్మ తృప్తికై మరల జన్మభూమికేతెంచి
     నా ఇంటి చుట్టూ తిరుగునెపమున
ఆ కోర్కె తీర్చుకొను క్రమమున
     తన డాక్టరు రాధాకృష్ణ గృహాన
ఒక విశ్వాస తల్లి గర్భాన జన్మంబునొంది
     ఆనందు అరచేత అక్కున చేర్పునొంది
ప్రవీణు ప్రేమచే నా గృహము చేరి
     ఆ తల్లి హేమలత వొడిలోకి వొదిగి
తన జన్మ సార్ధకతను తన మాట సత్యమును నిలుపుకున్న
     నా తల్లికిదే వందనము.
ఆ ప్రకారమేతెంచి నా గృహానజేరి
     నా మనో ప్రాకారమును ఆక్రమించి
నన్ను నా కుటుంబానందకారకమై
     చింటు నామకరణముతో దినదిన ప్రవర్ధమానవై
నేను నా భార్య నీకు అమ్మానాన్నలమై
     నీ మూగభాషకు మా మాట అన్వయముతో
నీవు మాకొసగిన ఆనంద భావన
     మరుద్దామన్నా మరపురాని ఆనందానుభూతి
మరి నిన్ను మరువలేము... మదిలోన నీ జ్ఞాపకం మరచిపోము!

నీ చిన్ని నాల్గు పాదాలే
     ధర్మార్థకామమోక్షాలు కాగా
నీ వెండి కేశ సంపదతో ఓ శాంతికపోతములా
     నీ చెవులు రెండు ఓంకారశ్రీకారములై
నీ ఫాల భాగము ఆ వేంకటేశు నామమై భాసింప
     నీ అరుపు ఆ విష్ణు పాంచజన్యమై తోచగా
ఏమని వర్ణింతు నిన్ను ఆ శ్రావణగౌరిమాత కాక!
     ఆ దివ్యరూపుతో నీ కంటి చూపులో
దేవతను చూచుకొని మేమానందించినాము
     మా ఆనందానికి నీవు పరవశించి
నీ వాలము వూపి నీ సంతసము మాకు తెల్పితివి
     మరినిన్ను మరువలేము మదిలోన నీ గుర్తు మరచిపోము.

చింటుతల్లీ!
     నీ బాల్యదశలో నీవబ్బురముగా నడుస్తూ
అలవోకగా నీ అమ్మ పాదల నడుమ నడువగా
     అయ్యో తొక్కితినంచు నీ అమ్మ బాధపడి
నీ మెడకు నీ గుర్తుకై మువ్వల పట్టెడ పెట్టంగ
     నీ మురిపెమునకు అంతేది? ఇల్లంత కలయతిరిగి
శైలక్కను భయపెట్టి, బుజ్జితో దాగుడుమూతలాడి
     బడిపిల్లలతో దోబూచులాడి
ప్రతి దసరాకు సరదా బంతితో ఆటలాడి అందరి మన్ననలంది
     'అబ్బులాల' అనిపించుకున్నావు
ఇన్ని తెలిసి మేము నినుమరచుటెట్లు?
     మంచిని సమాధి చేసే మనిషికి పూర్ణాయువిచ్చి
మనిషికి తోడు విశ్వాసవతిగా వున్న నీకు అర్ధాయువునిచ్చిన
     ఆ భగవానునేది కోరేది? అనుక్షణము నీ చెలిమి తప్ప!
దినదినము మేమిచ్చు తెల్లని ఆహారము తిని (గుడ్డు, పాలు, అన్నము)
     ఎర్రని రక్తముగా మార్చుకుని నీవు ఆరోగ్యవంతమై
మాకు ఆరోగ్య ప్రదాతవై మా అభివృధ్ధి కాంక్షించి
     నీ చల్లని చూపుతో మము ధన్యులనుజేసి
మా అంతరంగాన నిలిచిపోతివి ఇంకనీ స్మరణతప్ప మాకు దిక్కేది?

షకీలా రాగానే ప్రతిదినము నీవు షోకిలాగా ఎదురేగి తోకవూపి
     నీకు పాలు పోయుట మరచినంతనే
గుర్రుగుర్రుమనుచు మీదికేగి
     నీ పట్టుచూపి పాలు ఒక పట్టుబట్టి
అంతలో అమ్మతో మేడ పైకి
     పోయి విహరిస్తూ తిరిగే నీ జ్ఞాపకాలు
మేము ఎలా మరువగలము?
ఆ నాడు శైలక్క పెళ్ళి చూపులకు బయలుదేరువేళ
     ఎదురొచ్చి టపటప నీ చెవులు విదిల్చి
నీ అంతరంగాన జేజేలు చెప్పితివి తదనంతరము బాజాలు మ్రోగినవి
     అంతట శైలక్క అత్తవారింటికేగ
నీ మూగబాధతో నువ్వు రోదించగ
     ఆ బాధ మేమోర్వలేక
కుమిలి కుమిలి ఏడ్చాము
     నీ అల్లరి పనులు తలచి ఆదమరచిపోయాము
ఒకనాడు శైలక్క తన బుక్కు క్రింద వేస్తే
     ఆ రాత్రంత నిద్రలేక పుటపుటను కాలితో లేపి
అటుఇటుచూచి నోటితో పుటుక్కున చించి
     శైలక్క కోపానికి గురైన వేళ
నీ అమ్మ నిన్ను లాలించి
     బుజ్జగించిన వేళ మేమెట్లు మరతుము?
ఆ మధుర భావాలు, ఆ చిలిపి చేష్టలు...
     శైలక్క ప్రసవమై నిను వొంటరిగా వదిలి
మేమంతా బెజవాడ వెళ్ళు వేళ నీ బాధ ఆనాడు తలవమైతిమి
     మరునాడు నేనొచ్చి నీ ఆకలి దాహములు
చూచి గబగబ అన్నమొండి నీకు తినిపింప
     నీ తృప్తి కళ్ళారచూచి చలించి కన్నీరు కురిసే
అది మరల తలిస్తే మనసంత బరువాయే

ప్రతిరోజు అమ్మతో పూజలో కూర్చుని
     ప్రతిసంవత్సరము వినాయక పూజ నేర్చుకుని
ప్రతిఫలముగా ఆ దేవు దైవత్వము పొంది
     ప్రతి దినము మాకు సిరులిస్తూ
సంకేతముగా నీ చెవులు దులిపి మమ్మాశీర్వదించి
     మా ఇంటి పెద్దదిక్కైనావు
మా అభివృధ్ధికి ఆలవాలమైనావు
     ఆ అభివృధ్ధి పధాన అల పయనించుచుండ
నీ అమ్మ నాన్నలను నాగ జాతి బారి నుండి కాపాడి
     నీవు నాగభైరవి అయ్యావు
నీ అప్రమత్తతతో చూపావు, విశ్వాస విధేయతవయ్యావు
     ఆ తరువాత యింటి నిర్మాణమునకు
ఖాళీ చేయు వేళ
     నీ సమ్మతిని తెల్పి నీ ఆశీస్సుతో పూర్తి చేసి
ఓ శుభలగ్నాన గృహప్రవేశం చేయ
     నీ ఇల్లు చూచుకుని నీవు మురిసిపోయినావు
అంతటి నుండి క్రమము తప్పక ప్రతి దినము డాబాపైకేగి
     నువ్విహరించు చందంబు మరువగలమె?
శైలక్క పిల్లాడు వస్తాడని నీకు పలుమార్లు చెప్పిచెప్పి
     వాడు నా చింటు తల్లియని పలుమార్లు
నిను తాకితాకి వాడానందపడి పలుమార్లు ఈల వేసివేసి
     నువు పాలు త్రాగినపుడెల్ల పులకించి
నిను పెంచుకోవాలని కారు కొని నిను
     ముందు సీట్లో ఉంచుకోవాలని వాడు
కన్న కలనన్ని వమ్ము చేసి అందనంత దూరము
     అపుడే పయనించినావు
ఆ కోర్కె తీర్చకుండగనే అల దివికేగినావు.

ఒకనాడు బుజ్జి పెళ్ళి మాటలు మాలో మేము మాటలాడుకొనుచుండ
     అపుడు నీ చెవులు దులిపి నువు
శ్రీరస్తు సంకేతమిచ్చినావు
     తాంబూల స్వీకారము మస్తుమస్తుగా
శుభము చేసినావు. శుభమ్ భూయాత్తని అనిమిషులు దీవింప
     కల్యాణ క్రమము తిలకించి పులకించినావు
     నీ చల్లని చూపుతో నీ కంటివెలుగుతో
మము చల్లంగ చూచి, మా అంతరంగ భావంబు గ్రహించి,
     మేము తలపెట్టు పనులు గ్రహించి
జయముసల్ప పూనుకున్నావు
     నీ సంకల్ప బలము మాకొసంగినావు
ఆ క్రమమున బయట కాలువవేసి నీ పర్యవేక్షణమున పూర్తి గావించి
     నీ ఇంటికి సకల సౌకర్యములు చేయించుకున్నావు
అటుల పైయింటికి 'చింటూవిహార్' అని పేరు పెట్టించుకున్నావు
     మా ఇంటి చింటుగా అడుగిడి బుజ్జితో దోబూచులాడి
అమ్మచేత ఓలలాడి నాన్న కుర్చీ కింద జోగులాడి
     మా హృదాయల శాస్వత స్థానమేర్పరచుకున్నావు
శైలక్కపై ప్రేమ చూపి బుడ్డినాన్నపై గుర్రు చూపి
     అందంగ తోక వూపు నీ మందగమనము మేము మరువలేము
నాన్నకొరకు ఎదురు చూపు అమ్మ పెట్టు గుడ్డుకై
     ఆకలికి వోర్చి వదిన ప్రేమకై అర్రులు చాపు
కోరిక తీరక మా యింటనే వెలియనెంచితివా!
     'అందగంజి' వై ఆప్యాయత చూపి
'అంబులారణి' వై అలరించినావు
     'చిన్న'గా మా మదిలోన చిరు దీపమైనావు
ఈల వేసి గోల చేస్తేనే పాలారగించినావు
     'స్వీటీ'గా స్వీట్లారగించి ఆరోగ్యముకొరకై
మేము వేసే మందారగించావు
     మా మదిలో నెలవై మా ఇంటి బుజ్జాయివై పారాడి
మమ్మలరించవమ్మా మా చింటు పాపా, నీకు జేజేలు!

నీ వదిన పలకరింపుకై ఆరాటపడి నీవు
     దినదినము ఎదురుచూచి దిగులు చెందావు
అపుడపుడు వేలికొసలతో తాకి నిను పలకరింప
     ఆ స్పర్శకే నీవు ఆనందమొందినావు
నీ వదిన గర్భంబు ధరియించింది మొదలు
     నీ ఆరోగ్యంబు సన్నగిల్లె
అది చూచి బుజ్జి కీడు శంకించి తల్లడిల్లె
     ఎవరితోను చెప్పలేక ఆ బాధ పంచలేక
మనసంతా నిను నింపి నీ ప్రేమ పంచుకుని
     భూతదయకర్ధంబు చెప్పినాడు
వాడి మనోభావంబు గ్రహియించి నీవు
     నీ మూగ వేదనను మరి తెలుపలేక
నీ మరుజన్మ మా ఇంట పొందాలని
     నీ అనారోగ్యంబు మాకు అవగతంబు కానీక
నీలోన నీవే ఆత్మార్పణ చేసికో దలచి
     నీ వదిన కడుపున జన్మింప పూనుకున్నావు

ఒకనాడు నువు కాలు కుంటుచుండంగ
     నిను బుజ్జి ఆసుపత్రికి తీసుకెళ్ళంగ
వైద్యుడు నిను చూచి వైరస్ ఇంజెక్షునిప్పించమనంగ
     వేరు ఆలోచన లేక నీ ఆరోగ్య మెరుగుకై తక్షణమే చేయింప
అది నీకు శాపమై నీ జబ్బు పెరిగి అది శ్వాస సంబంధమై
     నిను బాధించి మరింత పెరిగి నీలో నీవు కృంగిపోయావు
మా ఆశలు అడియాశలు చేసినావు. అప్పటినుండి అన్నమున్ కుడువక
     పాలున్ త్రాగక నాల్గు దినములుగా నీరసించి
నీ కడుపు బిర్రబిగుసుకునివుండ
     ఏమి చేయాలో పాలుపోక ఆ ఆగస్టు 13న
డాక్టరు సలహాతో నీకు మందు ఇవ్వంగ
     అది ప్రమాదకారియై నీవు పడిపోవంగా - వెంటనే
మరల ఇంజెక్షన్ ఇప్పింపగ ఆ రాత్రి ఎలాగో గడచిపోయింది
     ఆ రాత్రి నా వద్దనే పడుకుని నిద్రించినావు
తెల్లవారి మరల నిస్సత్తువై మిక్కిలి కలవరపరచినావు
     ఆ తదుపరి 14వ తేది ఉదయాన
నీకు సెలైన్ ఎక్కించుటకు ప్రయత్నింప
     ఆ సమయాన నీ తనువు చాలించ పూనుకుని
బుజ్జి చేతిలో కనులు తెరచి చూస్తూ, తోక వూపుతు
     చింటూ తల్లి! అని మేమేడ్చుచుండ అంతలోనే
నీవు ప్రాణంబు విడిచినావు
     అదే సమయాన నీ ఆత్మ
నీ వదిన కడుపున ప్రవేశించినావు
     నీ మరుజన్మ మా ఇంటిలో ఎదురు చూస్తాము

నీ మరణ వేదన చూచి భోరుభోరున ఏడ్చి
     నిను సాగనంప తలచి నీకిష్టమైన పదార్ధాలు
నీ వద్ద వుంచి, మా ఇంటి ఇలవేల్పుకు నుదుట కుంకుమ దిద్ది
     రిక్షాలో బుజ్జి వొడిలోన నిను పరుండబెట్టి
అల నైరుతిమూల రేగుంట గట్టు చేర్చి
     ఆ గట్టి మట్టి తవ్వించి నిను భూమాత వొడిన పెట్టి
మా కళ్ళలో నీరెట్టుకుని హృదయాన బరువెట్టుకుని
     ఆ గట్టిమట్టి దోసిటంబట్టి నీ తనువుపై కొట్టించి
ఋణవిముక్తుడ చేయించినావు. అన్నమెట్టిన చేతితో
     మట్టి పెట్టించుకున్నావు,
మా కడుపులో చిచ్చు రగిలించినావు
     స్మశాన వైరాగ్యమే కలిగించినావు
నీవే మా ఇలవేల్పుగాక మరేమి?

(ఆ భగవంతుడు) కుక్కలను సృజియించి భౌభౌ మనిపించి
     భవ బంధాలే ముఖ్యమనిపించి
మా ప్రేమ పంచి ఇచ్చినాము అది త్రెంపుకోలేక
     హృదయవేదన పొందుతున్నాము
కాకులను సృజియించి కావుకావనిపించి
     అనుబంధాలు శాశ్వవతాలు కావుకావని చెప్పించినావు
ఈ రెండు తెలిసి బంధాలు వదలలేక అనుబంధాలు త్రెంచుకోలేక
     డోలాయమానస్థితిలో మమ్ము పడవైచితివి
ప్రశాంత చిత్తమొసగుము తల్లి! నా చింటు తల్లి!



చింటూ మరణ తేది 14-06-2004 తదనంతరం వ్రాయబడినది
పోలూరు బాబురావు, నూజివీడు

గట్టు మీద గణపతి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
గట్టు మీద గణపతి

ఓం గం గణాధిపతయే నమః
ఓం తత్పురుషాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్!

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ
శ్రీ రాజరాజేశ్వరీ బ్రహ్మవిద్యా మహాత్రిపురసుందరీ
శ్రీ లలితా పరాభట్టారికాంబ పరదేవతా 
ఓం నమోన్నమః

మంచిని పంచుట పెంచుట మంచిదని యెంచి
         మహా మహిమాన్వితమగు నీ మహిమలు
పది మందికి తెలియగనెంచి
         నీ కృపా కిరణములు నా మనసున వెలుగు జూపి
నా అనుభవ మహిమలు తెలుపగా అనుమతీయవయ్యా
         అంతయు నీ దయ చేతనే గదయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

ఏ శిల్పి చతురతయో అలనాటి అర్ధ శతాబ్ది వెనుక
         ప్రధమమున ప్రధముడవగు నిను తలచి మలిచి
ప్రతిష్ఠింపకనే యటుల నీటి
         తటాకంబున నిను వదలివేయుట చూచి
కలత చెంది మిక్కిలి కలవరపడి
         ఆ క్షణమే పదుగురి సహాయముతో ఒడ్డుకు చేర్చి
గట్టు మీద ఒక బండ రాయికి ఆనించి
         నీకు ప్రధమ పూజ సల్పి ప్రతిష్ఠించిన ఆ తల్లికిదే కృతజ్ఞతాంజలి.
అటుల ఆ వటవృక్ష ఛాయలో
         ఆమె ప్రతి దినము నీకు పూజ సల్పుకొనుచుండ
ఒకనాడు ఊరి జమీందారు శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు గారు
         ఆ మార్గమున పయనించుచుండ
పూజలందుచున్న గణనాధునింజూచి
         ఒక చిన్న గుడిని నిర్మింపదలంచి
వెంటనే పరివారమును శాసించే.
         అంతట ఆ వినాయకునకు సుప్రతిష్టితంబగు గుడి అమరి
గట్టు మీద గణపతిగా ప్రసిధ్ధమై
         భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుచుండెన్.
అంతటినుండి సిందూరలేపనముతో
         ఆధ్యాత్మిక భావన ముట్టిపడునట్లుండు
నీ ముగ్ధమనోహర రూపు వెలుగొందు వేళ
         ఆ అరుణాద్రి శిఖరాన వుదయించు
అరుణారుణ కాంతి కిరణములు నిను తాకు వేళ
         అర్ధనిమీలిత నేత్రాల ఆ ఈశాన్యాధీసుడగు నీ తండ్రిన్ జూచువేళ
నీ ప్రసన్న వదనము మేము తిలకించు భాగ్యము కలుగ జేసితివిగదయ్యా
         మిక్కిలి ధన్యత చేకూర్చినావు గదయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

చిన్న పెద్ద యనక అందరూ తమ కోర్కె తీర్చుకొను నెపమున
         నీ పై ఒట్టు పెట్టి తమ కోర్కె తీరినంతనే
ఒట్టుకు కట్టుబడియుండక
         ఒట్టు తీసి గట్టు పైనున్న నీపై
భారము వేసి నిను మరచిన వారిని
         సైతము ఆదరించి తమ తప్పు
తెలుసుకొనునట్లుగా చేసి నీ యెదుటే వారిచే
         గుమ్మళ్ళ గుంజీలు తీయించి చిట్టి మొట్టికాయలిప్పించి
ఆది గురువన్నమాట సార్ధకముజేసుకొన్నావు గదయ్య!
         మాట తప్పినవాని సైతము జాలి చూపి
క్షమించి క్షేమేంద్రుడవయ్యావు గదయ్య!
         ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!

ఆ నాడు విఘ్నేశ్వరాధిపత్యమొసగు సమయాన
         నీ తండ్రి నిను పరీక్షింపదలుప
నీ బుద్ధి కుశలతను జూపి
         తల్లిదండ్రులకు ప్రణమిల్లి ముమ్మారు ప్రదక్షిణము గావించి
ముల్లోక నదీస్నాన పుణ్యంబు సాధించి
         అయ్యాధిపత్యమునవలీలగా పొందినావు
నీ మాతాపితృ భక్తిని చాటినావు
         అనంతర కాలములో దేవగణానికొక్క అధిపతి కావలసియుండ
జ్ఞానాధిక్యుడవగు నిను అధిపునిగాజేసికుని
         దేవగణాధ్యక్షునిగా జేయ వినాయకునిగా
సుప్రసిధ్ధమైనావు గదయ్యా!
         మాతపితరుల గౌరవించి తొలి పూజలందేటి
నీవు మాకాదర్శమూర్తివి గదయ్యా!
         ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!

నీ కృపాకటాక్షవీక్షణము కాంక్షించి
         నా శైశవదశలోనే బాలారిష్టాలకునారిల్లుతుండ
నను నీ వద్దకుందెచ్చి ముమ్మారు
         ప్రతిదినము ప్రదక్షిణలు సల్పించి
నీ పాద సిందూరము నా నుదుటయుంచి
         ఆరోగ్యంబుకై నీ ఆశీస్సులంది
అవ్విధంబుగ ప్రతి దినము సలుప
         నీ దర్శన భాగ్యముచే మిక్కిలి వూరట చెందినాను!
తదనంతర బాల్యావస్థలో బడికి వెళ్తూ
         గుడికి వచ్చి నిను దర్శించి మనసార నమస్కరించి
తండ్రీ! రక్షింపుమని నిను కోరినామయ్య!
         కలకాలమటులనే కాపాడుచుండుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

ప్రాతః కాల ప్రతి దినము గణనాధా! బ్రోవరావయ్యా!
         యనుచు తొలిపూజ నీకు సల్పి
దేవతాగణ కటాక్షంబునొంది
         నీ కనుసన్నలలో మేము విద్యగరుపుకొన్నాము
పరీక్ష సమయంలో నీ నామ లిఖితంతో
         మనమునందె నిను ధ్యానింప
భారతములో ఆ నాడు ద్రౌపదికి
         అక్షయవలువలనిచ్చిన అయ్యచ్యుతునివోలె
మాకు అక్షయాక్షరములనలవోక
         నందించి మమ్ము కృతార్ధులంజేయించి
ప్రతివత్సరము మాకు జయముకల్పించినావుగదయ్య!
         'క్రియాసిధ్ధి సత్వేభవతి' యను
ఆర్యోక్తికర్ధంబు చెప్పినావు గదయ్య!
         ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!

అంతప్రతివత్సరము పరీక్ష కృతార్ధతానంతరము
         ఒట్టు పెట్టిన నీ మొక్కు తీర్చుకొనుటకు గాను
మాయమ్మ అలసి, సొలసి, ఆయాసపడుతూ
         అప్పములు, ఉండ్రాళ్ళు నీకు నైవేద్యమిడుటకుగాను
మధురముగా నీకు వండి సిధ్ధపరచి
         మేమందరము భక్తితో నిను దర్శించి
నీ ముడుపు చెల్లించి మమ్మెపుడు
         కాపాడుమని కోరి, నీ ప్రసాదంబు స్వీకరించి
పదుగురికి పంచి నినుదర్శిగొల్చి ధన్యత చెందితిమయ్య!
         అటుల నీ ప్రసాదమనిచెప్పి
ఉండ్రాళ్ళు మా తండ్రికీయబోవ
         తూష్ణీభావముతో ఉండ్రాళ్ళా? గుండ్రాళ్ళా?యని
తీసికొనుట తిరస్కరింప కొద్ది సేపటికే
         తన కడుపు గుండ్రాయిగుండుటంతలచి
కలత చెంది పలు వైద్య పరీక్షలు జరిపింప
         ఫలితములేక పరికించెనంత పది దినములు
బాధ చెంది తన తప్పు తెలిసికొని తనకుతాను మ్రొక్కుకొని
         ఆ వెంట తీర్చుకొని ప్రసాదభక్ష్యమొనర్చి
తన తప్పు బాపికొని తిరిగి ఆరోగ్యవంతుడయ్యె!
         ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!

ఎప్పటివలెనే ఒక ఆదివారము టెంకాయ నైవేద్యమిడుదుమని
         వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణముగావించి
ఆ నారికేళముంగొట్టి అందు జలముతో
         నభిషేకించి కాయ సగపాలుజేసి
నైవేద్యమిడి కొంత నీ చేతనుంచంగ
         వెన్వెంటనే రివ్వున నాపై విసరివైచి
నీ కోపతాపము ప్రదర్శించినావయ్య!
         ఆ వైనమే కాయనాఘ్రాణించి పరికింప
కొంతభాగము కుళ్ళుకనింపింప మిక్కిలి కలత చెంది భయకంపితుడనై
         తప్పు జరిగెనని గ్రహించి నీ మ్రోల సాష్టాంగ పడి
మరల వేరొకటి దెచ్చి నీకర్పించువరకు
         మనసు కుదుట పడలేదాయె!
గాయ పడిన మనసే బోధ పరచునను తత్వంబు
         నాటినుండే నాకవగతమయ్యెనయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

వ్యాస ప్రోక్తంబగు పంచమవేదంబు అతి సుందరంబుగ
         నీచేత లిఖితమై ఉర్విజనులెల్లరకు అందించినావు
నీ హస్తవాసిని చూపినావు.
         'ఇందరకు అభయంబులిచ్చు చేయి'
యని యా శ్రీనివాసుబొగడిన అన్నమయ్య
         మనిషికి చేతి అవసరమెంతో 'చేతులారగ చేసేటి చేకొన్న కర్మానకు'
యను కీర్తనలో చేతి ప్రాముఖ్యము చెప్పినాడు గదయ్య!
         అట్టి నా చేతులతో నీ కటాక్షమున
యెందరికో సహాయ పడునట్లు చేసినావు
         వాటికి మనోబుధ్ధివికాసమునిచ్చి నిపుణతను కూర్చినావుగదయ్య
నేడు నా చేతులకు ఏదో రుగ్మత కలిగి పటుతరము కోల్పోయి
         చేతులెత్తి నీకు జోతలివ్వలేకున్నాను గదయ్య!
తిరిగి నా చేతులకి కొత్త వూపిరులూది
         పూర్వ స్థితినందజేయుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

బంగారు రంగారు పూలచేత నిన్ను అర్చన చేదమంటె
         గరిక పూవులు నాకు చాలుచాలంటివి
పన్నీటి స్నానమాచరింపగజేసి విభూతి పెడుదమన్న
         నారికేళ జలము అభిషేకమే మిన్నయనినుడివినావు
షడ్రసోపేత నైవేద్యనిడుమన్న చాలు మోదకములే గుడముతో చాలునంటివి
         అట్లు అల్ప సేవలకే సంతసంబొంది అనల్ప ఫలితములనొసగే
నీ నిరాడంబరత మాకొసంగి మము కాపాడుమయ్య
         సద్భక్తి చింతనొసగుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

ఒకనాడు బంధువుల పెండ్లికని ఆ రామబంటు గుడికి పోవ
         ఆ రాత్రి తిరిగివచ్చు సమయములో
ఆ ఆంజనేయునకు నారికేళ నైవేద్యము చేదమని తలచి
         అట్లు జరుపకయే పెండ్లి ముగిసిన పిదప
నా కుటుంబముతో తిరిగి వచ్చుచున్నంతలో
         జ్వరముతోనున్న నా కుమారుడొక్కసారిగా
కోతిరూపుగ మారుట చూచి
         అదియు ఆ మారుతిని సేవించకయే
తిరిగివచ్చుచున్నందుకు ప్రతిఫలమేయని గ్రహించి
         అప్పటికే మార్గమధ్యముననున్నవారమై
ఎదురుగావున్న ఆ గణపతి మహరాజ్‌కుందెల్పి
         ఆ రామబంటు శరణువేడి గృహమునకు చనినంత
మా కుమారు రూపు మారి ప్రశాంతముగా నిదురించె!
         మరు ఉదయమే ఆ మొక్కు చెల్లించి
నీ కృపాకటాక్షములతో కాపాడినందుకు
         నీ ముందు మోకరిల్లి నీ ఉనికి గొప్పతనము
తెలిసికుంటిమయ్య, ఓ విఘ్ననాయక!
         అవ్విధంబుగనే నా అనారోగ్య పీడితంబగు
నా చేతులకు తిరిగి బలిమి చేకూర్చి
         భక్తిచెలిమి, జ్ఞానకలిమినొసంగుగావుతయని వేడుకొనుచుంటినయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

ఆ నాటి చవితి పర్వ దినాన నీ తండ్రి శంభు శిరమునున్న
         ఆ చంద్రు నినుచూచి నవ్వెనని శాపమిచ్చి
ఆ నెలరాజు నిగ్గుదేల్చితివిగదయ్య
         ఈ నాటి రారాజు చంద్రుడు నిను మరచి
నీ చెంత యెన్నికల సభ జరుపక నిను దర్శించకనే
         మరలినందున తిరిగి శాపమొసగి
ఎన్నికల అపజయముపాల్జేసినావుగదయ్య!
         నీకినుక నీ ఉనికి తెలుసుకున్నామయ్య
కష్టపడినంత మాత్రాన జయము సమకూరదని తెలిపి
         నీ అనుగ్రహమే సకల సిధ్ధియని నిరూపించితివిగదయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

మా చిన్ననాడు సాలుకొక్కపరి వచ్చు నీ చతుర్ధినాడు
         మేమందరము నీకు పూజ సేయ బాలభక్త బృందమై
భజన సేయునంతలో ఫెళఫెళార్భాటముల
         పెనుగాలి వీచి కుండపోతగా వర్షము కురిసెనంత
వర్షోధృతికి తటాకము త్రుళ్ళిపడి కాలువలు నిండంగ
         జలజలా నీరు పారుచుండ నీ దర్శనార్ధమై
నీ గుడికి వచ్చుటయే ఒక సాహసంబయ్యుండ
         రహదారి దిగుతూ జరజరాజారుచుండ
కాల్వనీటి జోరులో కొట్టుకొని పోకుండ మరల మా దేవుగట్టు పైకెక్కి
         తుళ్ళుతూ తూలుతూ సగము జారి
నిలదొక్కుకుని ఎటులో నీదరికి చేరి
         ఆట పాటలతో నీకు పూజ సల్పితిమి
ఆ రోజులిపుడు తలుప ఆ నాటి ఆటంకములు
         సంసారలంపటములో పడిపోవుటే
అన్నట్లుండు ఆ మిట్టపల్లములు అధిగమించి
         ఆ లంపటపుటాటలనుండి విముక్తులజేసేందుకే
నీవు కల్పించిన అవరోధములేయని తలపోయుచుందుమయ్య
         నీ వేదాంత రహస్యము కడు రమణీయముగదయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

తొలికోడి కొక్కొరొకోయని అరచి
         చేతనావస్థనుండి చైతన్య స్థితికిదెచ్చి
ఆ భగవంతుని కోరికొక్కటి కోరుకోమనుచు
         తొలిపొద్దు నిదుర లేపుచుండంగ
యెల్లప్పుడు చల్లంగ నువు చూచుచుండంగ
         కోరికేటిగల్గు నీ అండదండలుండంగ?
సదా నీ భక్తి తత్పరతతప్ప
         భక్తివిశ్వాసపాత్రుడుగ ఆ కన్నప్పను
కన్నప్పగించి చూచుకొను ఆ కాలహస్తీశ్వరునివోలె
         ఆత్మవిశ్వాసపాత్రులమగు మమ్ము సదా
నీ భక్తి ధ్యాసలోనుండునట్లు మము
         అనిమిషముగాజూచి ఎల్లపుడు కావుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

పూర్వమొకపరి బంధువులతో నీ దర్శనార్ధమై బయలుదేర
         అప్పటికే ప్రొద్దుగ్రుంకినందున నీ దర్శనము వాయిదా వేసి
అవ్విధంబున మనంబున తలంచి
         ముందుగ మారుతిని దర్శించు నెపమున బయలుదేర
నీ గుడి ప్రాంగణమునకు వచ్చుసరికి
         మా ప్రయాణశకటమాగిపోయె!
కదలకుండగ మారాముసేసే
         అంతట మా తప్పిదము తెలిసికొని నిను దర్శించి
నీ క్షమాపణ కోరినంతనె మరల మా ప్రయాణము కొనసాగి
         మారుతికి పూజ సల్పి నీ మహిమ
కొనియాడుచూ గృహమునకరుదెంచినామయ్య
         ఏమని వర్ణింతు నీదు మహిమలు?
సంకల్పించినంతనే సమయానుక్రమముగా
         పనులు చేయకున్న నీకు కలిగెడు కోపమెంతయో మిన్న!
అటుల కోపమొందక మము కాపాడి
         నాకు కలిగిన వ్యాధి తొలగించుమయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
         కరుణించి నను కావుమయ్యా!

మూలాధార శక్తికాధరభూతుండవై,
         సకల జనుల వాక్ప్రాణశక్తికాధారనెలవుండవై,
త్రిగుణాత్మక తాపత్రయాదులనుపశమింపగా చేసి,
         సమలోష్టకాష్మకాంచనంబగు స్థితప్రజ్ఞత నొసంగజేసి,
సాత్వికంబగు సకల భూతదయాస్వాదితంబగు జ్ఞానసిధ్ధి
         ప్రసాదింపుమని నే వేడుకొందునధిపా!


ఓం శాంతి శాంతి శాంతిః
మంగళం శుభమంగళం 



ఇది 2005వ సంవత్సరంలో వ్రాయబడినది
పోలూరు బాబురావు, నూజివీడు

6, జులై 2016, బుధవారం

సత్యస్వరూపమ్

శ్రీరస్తు                                                ఓం                                            శుభమస్తు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
సత్యస్వరూపమ్

ప్రభవాది వత్సర నామక్రమణిలో
       శ్రీ వ్యయనామ సంవత్సరమున
ఆరు దశాబ్ది వత్సరముల క్రితము
       పశ్చిమాన కృష్ణానదీమతల్లి కనుసన్నల
సంస్కృతీసంపన్న సాహితీపురమగు
       గుంటూరులో పుణ్యదంపతులగు
పోలూరు వేంకట సుబ్బారావు, సరస్వతుల
       మేలు కలయికకు గుర్తుగ కార్తీక
శుధ్ధ పౌర్ణమి పర్వదినాన తృతీయ
       గర్భ తనయుడవై తొలి కుటుంబ
మగబిడ్డగా జన్మంబునొంది శుభమ్
       కరమగు 'స'కార నామధేయుడవై
కౌండిన్య గోత్ర పరంపరావిద్భావుడవై
       'త్రి'సకారముల కలగలుపు శోభతో
ఆ సత్యనారాయణుని నామకరణముతో
       దినదిన ప్రవర్ధమానవై శ్రీమన్నారాయణుని
కరుణా కటాక్ష వీక్షణములలో
       అలరారుచూ తల్లిదండ్రుల శిక్షణలో
విద్యాభ్యసనమొనర్చి కుటుంబములో
       తొట్టతొలి పట్టభధ్రుడవని పేర్గాంచితివి

అటుల అమ్మానాన్నల మోహాతిశయమున
       సప్తసోదరసోదరీమణులకు అమ్మనాన్నల
ప్రధమ అంత్యాక్షర కూర్పుతో కలిగిన
       పవిత్ర 'అన్న'యను పద సార్ధకతను
సత్యంబొనర్చి అన్నయను వరము పొంది
       అందరి ఆదారాభిమానాలు పొందినావు

చిన్ననాటి విద్యయంతయు నూజివీడులో
       గడుపు సమయాన గురువు జోస్యులవారి
శిష్యుడుగా పేరొంది, సన్యాసయ్య మాస్టారి
       శిక్షణలో 'షార్టుహాండు' చదువుతో
మిగుల మితభాషివై అల్పాక్షర సంభాషణతో
       అమిత భావ ప్రకటనము చేస్తూ
మనసునందున్న భావము వ్యక్తీరింపక
       పరుల హృదయాంతరంగంబు
గ్రహించు ప్రత్యేకత నీదు కాదే సుమా!

హిందూ కాలేజి విద్యానంతరము చిన్నచిన్న
       ఉద్యోగములు చేసి నిరంతర కృషితో
కెనరా బ్యాంకు ఉద్యోగము సంపాదించి
       యల్లాజోస్యుల వారి సకల సద్గుణ
సుగుణాలవాసి అందాల రాశియగు
       స్వరూపరాణిని వివాహమాడి మరల మరొక
'స'కారమును నీ జీవితంలోకి ఆహ్వానించి
       సకల శుభములకు ద్వారంబు తెరిచినావు!

అనతి కాలమునకే మీ స్నేహవృక్షము పరిమళ
      భరితమై 'మాధవీ'పుష్ప వికసనముకాగ
కడుపుచలువతో మలికాన్పులో
      'ప్రమీలా'విర్భవము కాగా, తదుపరి
సకల సద్గుణవంతుడు, విద్యాపారంగతుడగు
      'దిలీపు'డుద్భవింప, రంగాచార్యాశీర్వచన
ప్రభావముతో అతడు అమెరికా దేశాన స్థిరమొందెను
      
      ఈ జనవరి నెల 21వ తేదీన మీ దంపతులకు
షష్ఠిపూర్తి మహోత్సవము నెరపుట మీదు
      పూర్వజన్మ పుణ్యఫలము గాదె!
మీ అన్యోన్య దాంపత్యము పది కాలాల పాటు
      పచ్చగా, స్వఛ్ఛతగా  అభివృధ్ధినొందు గాక
యని ఆకాంక్షిస్తూ...

నీ సహోదరుడు పోలూరు బాబురావు

'స'కార నామధేయులు:-
సుబ్బారావు-సరస్వతి
సత్యనారయణరావు-స్వరూపరాణి



2006వ సంవత్సరములో మా అన్నగరి షష్ఠిపూర్తి ఉత్సవ సంధర్భమున వ్రాయబడినది

4, జులై 2016, సోమవారం

శ్రీ నవదుర్గా స్వరూపాలు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

శ్రీ నవదుర్గా స్వరూపాలు

శ్రీ మాతా శుభకరీ విశ్వశాంతి ప్రదాయినీ
నమస్తేస్తు నారాయణీ నమోన్నమః
దీవించు మా తల్లి శ్రీ కనకదుర్గా
సకల సంపదలనిచ్చు శ్రీ కల్పవల్లీ!

ఆశ్వయుజ మాసానా ప్రతి వత్సరమునా
నవరాత్రి నవదుర్గలను భక్తితో సేవించి
నీ విశిష్టత తెలిసి  నీ నవ నామాలతో
శక్తి కొలది పూజించి నవకాయ పిండి వంట
నైవేద్య మిడుదుమమ్మా! ...
దీవించు మా తల్లి...

ప్రధమముగా నిను హిమవత్పుత్రిగా తలచి 
భక్తులను పూర్ణవాత్సల్యముగా జూచు
చల్లనీ తల్లియగు శైలపుత్రిగా భావించేము!
... దీవించు మా తల్లి... 

విదియ దినాన శివుని భర్తగా పొందుటకు
సకల వేద తపోనిష్ఠనున్న నగరాజకన్యగా
ఏకాగ్రతనొసగు మానసికోల్లాసినిగా నిను తలతుమమ్మా!
... దీవించు మా తల్లి... 

తదియ నాడు సకల ప్రాణి కోటికి సదా
ఉల్లాసము కలిగించు నీ రూపలావణ్యముగల
చంద్రఘంటాదేవిగా నర్చించేము తల్లి! 
... దీవించు మా తల్లి... 

చవితి నాడు త్రివిధ తాపాలు దరిజేరనీక
మాయా స్వరూపిణివై మమ్ములను రక్షించు
జగన్మాతయగు కూష్మాండాదేవిగా నిను చేరి కొలుతు! ... దీవించు మా తల్లి...

పంచమ దినాన సకల స్త్రీ జనములకు సంతాన ప్రాప్తి
నొసగు జగతికే మూలపుటమ్మవై గర్భశుధ్ధి
కలిగించు దివ్యగర్భవగు స్కందమాతగా నిను కొల్చెదము! ... దీవించు మా తల్లి...

షష్ఠమ దినాన సకల జ్ఞాన సిధ్ధినొసగి
అధ్యాత్మికానందమొసగు సకల దేవతల దివ్య తేజమ్ముతో
కతుడనే మునిపుంగవుని పుత్రివగు కాత్యాయనిగా కొలుతు! ... దీవించు మా తల్లి...

సప్తమ దుర్గగా నిరతము కాల ప్రవాహాన కొట్టుమిట్టాడు
జనుల భయాందోళనల రూపు మాపి, ధైర్యమొసగి
యముని నిలువరించిన కాలరాత్రీదేవిగా నిను కొల్చెద! ... దీవించు మా తల్లి...

అష్టమ దుర్గగా శివుడు నల్లనిదానవని నింద సేయ
అలుకబూని విపంచిని భక్తితో తపమాచరించి
శాంతి కారకమగు తెల్లని శరీరమొంది మహాగౌరిగా
 
నిను సేవించు స్త్రీలు దీర్ఘసుమంగళత్వము పొందేరు! ... దీవించు మా తల్లి...

నవమదుర్గగా అణిమాది అష్టసిధ్ధులను ప్రసాదించి
మోక్షదాయినియగు సిధ్ధిధాత్రీదేవిగా నిను కొలుతుమమ్మా! ... దీవించు మా తల్లి...

కరుణా కటాక్షమొసగు నీ చల్లని చూపులే
సదా వాంఛితములై మమ్ములను నిరతంబు
కాపాడు గావుత  ... దీవించు మా తల్లి...

నమస్తే నమస్తే నమోన్నమః 
ఓం శాంతి శాంతి శాంతిః



శ్లోకం

ప్రధమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణీ,
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధాం,
పంచమం స్కందమాతేతి, షష్ఠమం కాత్యాయనీ తథా,
సప్తమం కాలరాత్రిశ్చ , మహా గౌరేతి చాష్టమం,
నవమం సిధ్ధిదాప్రోక్తా, నవదుర్గ ప్రకీర్తితాః 





పోలూరు బాబూరావు, నూజివీడు

స్మార్ట్ ఫోన్

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

స్మార్ట్ ఫోన్

అందగత్తెలకైనా
అనాకారులకైనా
పనిమనిషికైనా
రిక్షా వానికైనా
ఎలిమెంటరీ పిల్లలనుండి
కాలేజి పిల్లల వరకు
బాలురైన, బాలికలైన
ఆడా మగా తేడా లేకా
ముసలీ ముతక ఎవరైనా
రోజు గడవాలంటే చేత చెంగల్వ లాగా
స్మార్ట్ ఫోను వుండాల్సిందే!
విశ్వ సమాచారం అందరు
విశ్వసనీయంగ తెలుసుకోవాలంటే
ఈ మాయాజాలపు మహిలో
అంతర్జాలం అవసరమే!

ఇక అక్కడ నుండి వేళ్ళ తాకిడితో
ప్రపంచాన్నే చుట్టేస్తారు
అపర వామనుళ్ళలా అంతరిక్షానికి
ఊహల నిచ్చనలే వేస్తారు!

లోలోతు విషయాల అన్వేషణలో
ఆకలి దప్పుల వూసే తెలియక
కాల గమనమే కానరాక
గూగుల్లోకాల విహరిస్తూ
పనిగండానికి ప్రగతినిస్తూ
సోమరితనానికి సోకులద్దేస్తారు!
ఇక ఫేసుబుక్కులలో పలకరింతలు
ఫొటోలు చూసుకుంటూ పులకరింతలు
ముసి ముసి నవ్వులతో ముద్దులతో
గునగున గొనుగుడు సనుగుళ్ళతో
మధ్య మధ్య వాట్సాప్పులు చూసుకుంటూ
ఆ సందట్లో ఎవరైన పలుకరిస్తే
కోపతాపాలతో అసహనం,
అగ్నిపర్వత లావాలా పెల్లుబికి
చిరాకు పరాకులతో పిల్లలకు వడ్డింపులు,
పెద్దలకు అక్షరాలా అక్షింతలు!
ఇక వీరు పంపే విషయాలు
అందరికి తెలియాలంటే కార్బన్ కాపీలు!
కొందరికే అయితే బ్లైండ్ కార్బన్ కాపీ వుంది
ఇన్ని విషయాలు తమకే తెలుసునని
అరచేతిలోనే విశ్వవాణిని
వినిపించగలమని అహము చెంది
అందరితో ఇమడలేక
ఇంత సమా
చార వ్యవస్థ సరిపడక
మానవ మేధ మరింత కుంచించుకుని 
 మానసికోల్లాసము కొదవై
శారీరక వ్యవస్థ పలు విధాల దెబ్బతిని
ప్రపంచీకరణకు
వ్యతిరేకంగా
మానవసంబంధాలు దూర తీరాలౌతున్నాయ్.

మితిమీరి వాడితే అనర్ధం
పరిమితికి లోబడితే ఆనందం
మితి తప్పితే మతి మరపు
పరిమితిలో మతి 'మెరుపు'!


పోలూరు బాబూరావు, నూజివీడు

1, జులై 2016, శుక్రవారం

భలే తాత బాపూజి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

భలే తాత బాపూజీ

huffingtonpost

పోరుబందరులో తాను పుట్టి
పొరుగు దక్షిణాఫ్రికాన చదువబట్టి
పరాయి శ్వేత జాతి వికృత చేష్ట,
పరుష పదజాలమోర్వక తట్టి లేపినట్టి
పౌరుషాగ్ని రగిలి హృదిన బిగబట్టి
స్వదేశాన కాలూని ఆంగ్లేయుల పనిబట్టనెంచి,

సత్యాహింసల మార్గము బట్టి
శాంతిసామరస్య  ఆయుధం చేబట్టి
పోరాట పటిమతో శ్వేతవాసుల తరిమిగొట్ట
పోరు సల్పి భారతీయుల నేకతాట గట్టి
అహింసావాదముతో సమరాన దూకి 

సహచరులెందరినో తన తోడ నడిపి
సాహసముగా తెల్ల దొరల తరిమిగొట్టి
దాస్యశృంఖలాలను పటాపంచలుగ పగులగొట్టి
దేశమాత సిగలో విరజాజులు పూయించినట్టి
మహామహనీయుడా మహాత్మా గాంధి!

ఆ నాటి బ్రిటీషు పాలకుడు విన్‌స్టన్ చర్చిల్‌తో
వివిధ విషయాలు చర్చించి స్వాతంత్ర సిధ్ధి
సాధనకు పరితపించి ఆ పాలకుడు
అర్ధనగ్న ఫకీరని విమర్శ చేయ ఖాతరు చేయక
తానెంచుకున్న మార్గాన పయనించి
స్వాతంత్ర సముపార్జనచేసి
నేడు లండన్‌లో వారి పార్లమెంటు భవన
ప్రాంగణాన వారి పాలకులచెంత విగ్రహముగా
నిలిచినట్టి, జాతి గౌరవాన్ని నిలిపినట్టి
భరత మాత ముద్దు బిడ్డ
మన బోసి నవ్వు తాత, మన జాతి పిత,
ఆయనే మహాత్మా గాంధి! 


లండన్‌లో గాంధి విగ్రహ ప్రతిష్టాపన సంధర్భంగ 14-03-2015న వ్రాయబడినది
పోలూరు బాబూరావు, నూజివీడు

మాతృ దీక్షా దక్షత

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

మాతృ దీక్షా దక్షత

బ్రహ్మాండంలో అండాండాన్నే
సృష్ఠి ంచుకుని పిండానికి రూపు తెచ్చి
తన గర్భాలయాన నవ మాసాలు మోసి
ప్రసవ వేదన భరియించి
అందమైన బిడ్డనిచ్చి
అమ్మగా స్తన్యమిచ్చి
అనురాగ మమకారమిచ్చి
నడిచి నడిపించే దేవత అమ్మ
అందుకోవమ్మ వందనాలు!

ఆకాశమే అమ్మయితే
మెఘమే కొమరుండైతే
గగన వీధుల సంచరించగ
వాయువే నాన్నగా
కొమరుని ముద్దాడ
ఆ పవన వీచికలకు
ఘనాఘనుడు చల్లబడి
అమ్మ చెంత జేరి
ప్రేమానంద భరితుడై
కారుణ్యముప్పొంగ అమృతవర్షితుడై
సకలజన సహృదయుడై
సదా వర్షించి అగ్ని క్షుబిత
అవనిని చల్లబరచి
జన దాహార్తి తీర్చు ప్రకృతి
ఎంత నిస్వార్థయో కదా!

అంతటి ప్రకృతి కాల చక్రమును
సదా భూజనంబు కాపాడి
భోజనంబుకు తగినట్లు
సమకూర్చుకొనవలయు
ఆహా! తల్లి ప్రకృతి ఎంత త్యాగమయీ!
ప్రకృతి చూచి మానవత పరిమళింప
మనుష్య జాతి మమతానురాగ
దీక్ష బూని మరిన్ని నేర్వవలయు
అది ఎట్లన...

కడలి నీటిలో చేప  మొప్పలతో శ్వాసించి
తెప్పై నీళ్ళలో తేలి
తన గుడ్లను తెట్టుగా విసర్జించి
తన దృశ్య దీక్షతో పిల్లలుగా మార్చి
మధుర మీనాక్షి వర చూపుతో
తల్లిగా ముదముపొందు!

కూర్మము కడలిలో సంయోగించి
రప్పై కడలి అంచున రాళ్ళలో చేరి
గుడ్లనిడిన చోట ఇసుక కప్పి
తదేక దీక్షతో మరలిపోవగా
అన్నింటి కధలు కంచికి చేరినట్లు
కోరికలు తీర్చు కామాక్షి కోరకనే
దానికి తల్లిదనమొసగు!
అదియే కమట దీక్షయగు!

అవనిలో తిరుగాడు భ్రమరము
మెత్తటి మట్టితో గూటిని కట్టి
వాడియగు తన తొండపు ముల్లుతో
తన లాలాజలము గూటిలో విడచి
ఝుంకార ధ్వనితో పదే పదే తిరిగి
నాద వినోదిని శ్రీశైల భ్రమరాంబికా
అనుగ్రహాన గూటి ఛేదించుకుని
మరో పిల్ల భ్రమరము బయట పడు!
ఆహా! సృష్టి చిత్రము ఎంత సంభ్రమము!
అదియే భ్రమర (కందిరీగ) దీక్ష, భగవద్రక్ష!

కన్నడ దేశాన ఒక లంక గ్రామాన
కృష్ణవేణీ పరవళ్ళు తొక్కి ప్రవహింప
లంక నీటితో నిండుచుండ
గ్రామ వాసులు ప్రాణ భయాన
నదిలో దూకి ఈది వొడ్డుకు చేరె!
ఆ గ్రామ "ఎల్లవ్వ" అను గిరిజన మహిళ
నిండు గర్భిణిని వదిలి జనులు పారిపోయె
అంతట ఆ స్త్రీ అత్యంత సాహసముతో
నదీమతల్లికి నమస్కరించి నదిలో
దూకి రెండు క్రోసులు ఈది వొడ్డుకు చేరి
అలసి సొలసి మూర్ఛనొంద
అంత వైద్యముతో తేరుకొని
పండంటి బిడ్డకు జన్మనిచ్చి
తన మాతృ వాత్సల్యము చాటుకుని
మాతృత్వానికి మణిపూసగా భాసించె!
ఇంత దీక్షాదక్షతలతో సృష్టి
అంతా జరుగుచుండ మానవత్వము
విడిచి మాత పితరులను అగౌరవ పరచ వలదు.

మాతృ దేవో భవ - పితృ దేవో భవ


అంతర్జాతీయ మతృ దినోత్సవ సందర్భంగ 08-05-2016 న
పోలూరు బాబూరావు, నూజివీడు

7, ఏప్రిల్ 2016, గురువారం

దేశ భక్తి గేయం

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
 
 దేశ భక్తి గేయం
 
జయ జయ జయ హిందు మాత
శుభధాత్రి భరత మాత
జయ మంగళమూర్తి ధరిత్రి
జయమునొసగు సకలజనతకు

ఆసేతు హిమాచలం
అభివృధ్ధి కాంక్షతో
సర్వదా నిను సేవించు
జనగణంబు మెప్పు పొందు!
అస్సమీయులు తైలసంపదతో
దేశానికంతకు వెలుగులీనుచుండ
పంజబీయులొకవంక పంట పండించ
పదుగురకు బాసుమతి బోనాలు పెట్టంగ
గుజరాతీ బెంగాళీలు వస్త్రాలే సమకూర్చి
సర్వజనుల సిగ్గు నివారించుచుండ
కంచి బనారసుల చేలములే నీకర్పించువేళ
నర్మద కృష్ణ గోదారుల పాద్యంబులుందెచ్చి
నీ పాదములు కడిగి పట్టు వస్త్రంబులే భక్తితో నీకర్పింతుమమ్మా! 
తల్లి భారతి నీకిదే వందనమమ్మా!

త్రికోణమితిగా త్రిసంద్రములే
నీటికోటలై సదా దేశ రక్షణచేయ
తెలుగు పౌరుషాగ్ని తేజరిల్లుచుండ
దేశభక్తి తపనలో తేలియాడుచుండ
ద్రవిడోత్కళ కన్నడ మాళవీయులంతా
ధైర్యముగా సహకరింపంగ
ముంబై రూపాయి ముద్దుగా పెరిగి
గంగ యమునల చల్లదనమువోలే
సకల జనుల చల్లంగ చూడు తల్లీ! 

జయ జయ జయ హిందు మాత
శుభధాత్రి భరత మాత
జయ మంగళమూర్తి ధరిత్రి
జయమునొసగు సకలజనతకు
 
We should love India, and let others love India.
 
 పోలూరు బాబూరావు, నూజివీడు

గణేశ షోడశ నామ వైశిష్ట్యమ్

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

గణేశ షోడశ నామ వైశిష్ట్యమ్

ఓం వినాయకాయ - వినాయకాయ!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

సృష్టికి నాందిగా అగ్నిరూపిగా - బ్రహ్మకు దర్శనమిచ్చితివయ్యా!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

కమలాసననునికి ప్రణవ మంత్రము బోధించితివయ్యా!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

ఓంకారములో జగతికి జీవము పోసితివయ్య
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ ప్రసన్న వదనము చూచినంతనే
మా పాప హరణమే జరుగునయా
ఓం సుముఖాయ నమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ ఏకదంతమునే దర్శనమొందిన
మా అహంభావమే తొలగునయా
ఓం ఏకదంతాయనమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ కృష్ణపింగాక్ష రూపుతో నీ దయనే చూచెదమయ్యా
ఓం కపిలాయనాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

ఘీంకారంలో ఓంకారాన్ని తెలిపితివయ్యా
వేద సారమే వినిపించి మా ఆదిగురువు నీవే
య్య
ఓం గజకర్ణికాయ నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

భక్తుల తప్పులు కాచే నెపముతో
బొజ్జ గణపతిగ నీవుంటివయ్య

ఓం లంబోదరాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 


 నీ హాస్య రూపమే దర్శనమొంద చిరు దరహాసమే కలుగునయ
సర్వ దేవ గణాలకు హాస్యాదిపతివి నీవ
య్యా 
ఓం వికటాయనాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

మా కష్ట నష్టాలు తీరుప జేసే విఘ్నాధిపతివి నీవేనయ్య
ఓం విఘ్నరాజాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

సమస్త గణాలకు అధిపతిగా సర్వ శుభములే కలుగనీయవయ
ఓం గణాధిపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

నీ సిందూరమే మంగళకరమగు మహిళలు పాపట ధరియింతురయ
కేతుగ్రహ బంధనాలను ఛేధించుమయ
ఓం ధూమకేతవేనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సకల గుణ పాలవెల్లివై సర్వజన పూజితుడవయ్యావయ్య
ఓం గణాధ్యక్షాయ నమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

శాపగ్రస్తుడైన చవితి చంద్రునిపై
దయ చూపి ఫాలభాగాన ధరియించితివయ్య
సదా చల్లంగా మము కాపాడుమయ్య
ఓంఫాలచంద్రాయన
మః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

మా మనోబుధ్ధి శక్తులకు సిధ్ధి చేకూర్చి
మా క్రియలకు శుధ్ధి కల్పించుమయా
ఓం గజాననాయ నమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

ముదముగా దీవెనలిచ్చే నీ తొండముతో
జ్ఞానసిధ్ధి ప్రసాదించుమ
యా 
ఓం వక్రతుండాయ నమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సర్వ జన వినతులు నీ పెద్ద చెవుల విని
మేళ్ళు చేకూర్చి మమ్మాదరించుమయా
ఓం శూర్పకర్ణాయనమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సదా మాతా పితరుల సేవించు
నీ అడుగు జాడలే మాకాదర్శమయ
ఓం హేరంబాయనమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

కుమారస్వామికి అగ్రజుండవై
సర్వతీర్థ స్నాన పుణ్యఫలమొంది
విఘ్నాధిపతివి అయినావయ
ఓం స్కందపూర్వజాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సకల పుణ్యకార్య తొలివేలుపుగా
హరిద్రాగణపతిగ నీ షోడశనామపూజలే గైకొనుమయ్యా
వినాయకాయ వినయకాయ నమః

ఓం గణేశ్వరాయ నమః ఓం గం గణపతయై నమః
ఓం శాంతి శాంతి శాంతిః 
సర్వే జనా సుఖినోభవంతు సకల శుభ పాప్తిరస్తు!


(ఇతి నమః శివాయ అను పాట బాణీకి కూర్పు)

పోలూరు బాబూరావు, నూజివీడు

స్వఛ్ఛతవైపు చూపు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

స్వఛ్ఛతవైపు చూపు

నీ చూపు నా చూపు
కలగలిపి దేశ దిశ చూపు
శ్రమ చేసి చూపు
అందాల స్వఛ్ఛ చూపు
ఆనందాల జన కంటి చూపు
స్నేహ భావన చూపు
పదుగురకు మంచి చేసి చూపు
పరిశుభ్రత చేసి చూపు
పరివర్తన తెచ్చి చూపు
అంతా కలిసి రోత మాపి చూపు
భరత మాత భావి చూపు

న్యాయానిది గుడ్డి చూపు
సాక్షిది డబ్బు చూపు
కక్షిదారు ఓపిక చూపు
న్యాయవాది నల్ల జేబు చూపు
అందరి చూపు ధర్మ దేవత వైపు
ఆమె చూపు జాలి చూపు
కళ్ళకున్న నల్లగుడ్డ విప్పి చూపు
ధర్మాన్ని నిలిపి చూపు
 
సత్యాహింసలే గాంధి పిలుపు
ఆరోగ్యం శుభ్రత బాపు
చూపు
బాపు లోచనాలు ఆలోచనలకు దారి చూపు
అది స్వఛ్ఛ భారత వైపు చూపు

శుచి-శుభ్రత.....సత్యం-అహింస.....న్యాయం-ధర్మం



పోలూరు బాబూరావు, నూజివీడు
మార్చి 28, 2015

సరస్వతీ స్తుతి



శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

సరస్వతీ స్తుతి
ఓం శ్రీం ః హ్రీం ః సరస్వత్యైనమః
     
     తల్లీ! భారతి సరస్వతీ
     ప్రాణోదేవీ వందనమమ్మా!


          నమో శ్రధ్ధా దేవీ వాజినీవతీ
          శ్రధ్ధనొసగి శుధ్ధ మనసుతో
          మా సంకల్పాలే జయమగుగాక!

      పవిత్ర ధారణ మేధా శక్తిని మాకిచ్చి
      మంచి మాటలతో వాక్శక్తినే సమకూర్చి
      మమ్ముల జాగృతి చేయుము తల్లీ!

          నీ కృపా కటాక్షములు మాపై జూపి
          జ్ఞాన బుధ్ధి మనో శక్తి ప్రసాదించుమమ్మా!
          మా జిహ్వాగ్రాన సదా నిలిచి
          వికసిత వదనయై మము శ్రేయోదాయుల చేయుము తల్లీ!
     
     సకల విద్యలకు మూలాధారవై 
     ప్రాణ శక్తియగు ఆత్మజ్యోతికి కాంతినొసగే 
     సర్వసారస్వత స్వరూపిణిగ కొలిచెదమమ్మా! 
          
          క్షీరనారముల వేరుపరచు హంసవాహనారూఢవై 
          అంతర్లీనవై మా క్రియలలో పాలు పంచుకొని 
          సుఖసంపదల నొసగు గావుతయని  
          నిత్యము నిన్నే తలచెదమమ్మా! 

(ఇతి శ్రీపంచమినాడు 24-01-2015న నూజివీడు శ్రీ జ్ఞానసరస్వతీ దేవికి అంకితం) 

పోలూరు బాబూరావు, నూజివీడు