26, మార్చి 2017, ఆదివారం

విఘ్నేశ్వర దండకం - భావ వ్యాఖ్య

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః


విఘ్నేశ్వర దండకం - భావ వ్యాఖ్య


శ్రీ మాతా తనయుండవై:
శుభంకరియగు శ్రీ లలితామాత కామేశ్వరుని తలంచి దర్శించిన మాత్రముచే తన శక్తితో శుభకరుడగు గణేశుని కల్పించుకొనినది. అందుచే లలితాసహస్ర నామములందు "కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా" అని చెప్పబడినది. మరియు శ్రీ మాతా యను పదము సర్వలోక విదితము, పూజితము.
సర్వభూతహితప్రదాయున్డవై:
సకల జనులకు గణపతి హితమునే అనగా శుభమునే కలుగజేయును. ప్రతి కార్యమునకు విఘ్నములు కలుగకుండ కాపాడుననే భయము వలన భక్తితో తొలుత ఆయననే పూజించి ఆ పిమ్మట వారివారి ఇష్టదేవతను స్మరింతురు.
బందూక పుష్ప వర్ణ ప్రకాశమానమై:
బందూక పుష్పములనగా ఎర్రని సింధూర వర్ణము కలిగి చెట్టు మొత్తము విరగబూసి పూర్తిగ ఎర్రగ పుష్పములతో అలరారును. గణపతికి పరమ పవిత్ర సూచితమగు ఆ సింధూరవర్ణము మిక్కిలి ప్రీతికరము.
ఈశాన్య దిశాభి ముఖున్డవై ఉషోదయ అరుణ కిరణ రంజితుడవై:
ఈశాన్య దిశాధీశుడు పరమేశ్వరుడు. తన తండ్రిని నిరంతర వీక్షాభిషిక్తుడగు కారణాన ప్రతి ఉదయము అమ్మ అరుణ కిరణములతో ఆది దంపతుల వీక్షణమునకై తూర్పు దిశాభిముకుండై ఆ ఉషఃకాల లేలేత సింధూరవర్ణ కాంతి పుంజములతో నిత్యము శోభకల్గి నిత్య నూతన ఆకర్షితుడై తొలి పూజలందుకును మహా విఘ్నేశ్వరుడు. బ్రహ్మ ముహూర్త సమయానికే తనను సేవించుకొనుటకు ఇష్టపడును.
నిత్య శోభాయమానున్డవై సకల జన కార్య సిద్ధి సాఫల్యము చేయు మహా విఘ్నేశ్వరున్డవై:
అనునిత్యము అన్ని విధముల శుభకార్యములకు ముందుగ గణపతిని శోభాయమానమగు పసుపుతో ప్రతిష్ఠించుకుని, ఆవాహన చేసుకుని, ఎలాంటి విఘ్నము కలుగకుండగ కాపాడు గణపతే శ్రీ మహా విఘ్నేశ్వరుడు.
క్రియా సిద్ధి సత్వే భవతి:
ఇది ఉపనిషద్వాక్యము. అనగా ఎవరైనను ఒక పని (కర్మ) చేయుట ఆ కర్మ ఫలమును అనుభవించుటకొరకే. అట్టి కర్మ ఫలము (క్రియ) త్వరగా సిధ్ధింపజేయు శక్తి ఆ సిధ్ధివినాయకునికే సాధ్యము.
మనకు మహా భారతములో శకుంతలోపాఖ్యానఘట్టములో దుష్యంతుని ఎడబాటు సహించలేక తన భర్తను కలుసుకొను నెపాన, కణ్వాశ్రమమును విడిచివెళ్ళు సమయాన, తన ఇష్ట దేవతను స్మరించుకుని తాను తలపెట్టిన కార్యమునకు అంతరాయము కలుగకుండునట్లు శకుంతల భగవంతుని ప్రార్ధించి కణ్వముని ఆశీస్సులు పొంది తన కార్యమునకు సిధ్ధపడినది. ఆ విఘ్నేశ్వరుని భక్తితో సేవించుటవలననే ఫలితము దక్కించుకొనినది.
అదే విధముగా మనకు శ్రీమద్రామాయణము సుందరకాండములో ఆంజనేయ స్వామి చేత చెప్పబడినట్లు కనపడుతుంది. వానర సమూహ బలముతో సముద్రముపై వారధి (సేతువు) నిర్మించి ఆ పిమ్మట సీతాన్వేషణకు సముద్ర లంఘనచేసి లంకాప్రవేశము చేయవలసివచ్చినపుడు తన ఆరాధ్యదైవమగు శ్రీరాముని, తనకు అప్పజెప్పిన కార్యమునకు తగిన శక్తినిచ్చి తాను నెరవేర్చబూనిన రామకార్యము అనగా సీతాన్వేషణ ప్రక్రియ సత్వరమే సిధ్ధించి ఆ తల్లి ఆశీస్సులంది ఆ సమాచారము శ్రీరామునకు చేర్చు కర్మ ఫలమును సిధ్ధింపజేయుమని ప్రార్ధన చేసిన ఆంజనేయుని కృషి ఫలించి తను చేసిన కర్మ ఫలము వెంటనే సిధ్ధింపజేసుకుని తన స్వామి రాముని మెప్పు పొంది సర్వ జనావళికి ఆదర్శ ప్రాయుడయ్యాడు.
ఓంకార స్వరూపుడవగు నీ భక్తి తత్పరతలో:
మహావిష్ణు నాభి కమలంబునుండి బ్రహ్మదేవుని ఆవిర్భావముకాగా, క్షీరసాగర కెరట తపతపయను శబ్దతరంగముల సవ్వడినాలకించి బ్రహ్మ తపస్సుచేయునంతలో కనుల ఎదుట ఓంకార బీజాక్షర స్వరూపుడుగా, విష్ణాంశ సంభూతుడుగా అభయముద్రతో సాక్ష్యాత్ విఘ్నేశ్వరు రూపముగాంచి ప్రణమిల్ల ఆయన ఆజ్ఙానుసారం ఎలాంటి విఘ్నాలు కలుగకుండగ నిరంతర సృష్టి కొనసాగుతుండుట విశేషము.
అదే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు గణపతిని సాక్ష్యత్కరించజేసుకుని వారు దర్శించిన విఘ్నేశ్వరుని నవవిధములుగా భుజంగస్తోత్రము ఆలపించినపుడు అందు ఒక శ్లోకములో విఘ్నేశ్వరుని ఓంకారస్వరూపునిగా, నిర్మలాకారునిగా, గుణాతీతునిగా, ఆనందస్వరూపునిగా క్రింది విధముగా దర్శించారు:-
"యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీత మానంద మాకార శూన్యమ్
పరంపారమోంకార మామ్నాయ గర్భమ్
వదంతి ప్రగల్భం పురాణం తమీడే!"


అంతటి ఓంకార స్వరూపుడవైనందున నీయందు మిక్కిలి భక్తి అనగా ధర్మాచరణమైన అనురక్తి కలిగియుండు మంచి బుధ్ధిని ప్రసాదించి మనోవాక్కాయకర్మానుగుణంబగు శ్రధ్ధా(లక్ష్మీ కటాక్షము)సక్తులను కలిగించుమని వేడుకొనుట.
మూలాధార చక్రకాధారభూతున్డవై:
మానవ దేహము షట్చక్ర(ఆరు)కమలముల శోభితమై నిరంతర హంస జపముతో, ప్రాణశక్తితో కలిసి ఓంకార ప్రణవము జేయుచు ఒక్కొక్క చక్రము దాటి శిరోమధ్యమందున్న సహస్రారము చేరి బ్రహ్మరంధ్రమునుండి బ్రహ్మైక్యము చెందుచున్నది. ఈ విధముగా శిరస్సునుండి దిగువకు అనగా పృష్ట(గుదము) భాగము వరకు విస్తరించి వున్న వెన్నుపాము నాడీ మండలంతో కలిసి పృష్టమందున్న తొలి చక్రమే మూలాధార చక్రము. ఈ చక్రమునకు ఆధారభూతుడు గణపతియే. ఇచ్చటనే నిరంతర ప్రణవనాదము ప్రారంభమగును.
సర్వజ్ఞుండవై:
సకల జీవరాశి భగవదిశ్చాదేశానుక్రమణికలో సర్వకాల సర్వావస్తలందు అనగా భూత వర్తమాన భవిష్యత్ కాల కార్యాచరణములన్నియూ గమనించి వారి క్రియలను సర్వదా పర్యవేక్షించు మహానుభావుడవు.
సమలోష్టకాశ్మకాన్చనంబగు సద్జ్ఞాన సంపదల్:
దైనందిన జీవనయానములో అనేక వొత్తిడులలో జీవన సమరం చేయునప్పుడు ఆశా పాశములలో మము చిక్కుకోకుండునటుల మంచి బుద్ధికుశలతను ప్రసాదించి, సత్కార్యచింతనను కలిగించి దుష్ప్రలోభములకు లోను గాక, మట్టిని, బంగారమును, సమ భావనగా చూచి నియమగతిన జీవితము గడిపి భగవదనుగ్రహ సంపదతో తృప్తి చెందుట.
స్థిత ప్రజ్ఙత:
కాలక్రమములో ప్రతిజీవికి కష్టనష్టములు కలుగుతూనే వుండును. సంపదలొచ్చినపుడు మిక్కిలి సంబరపడుట, దుఃఖము కలిగిన మిక్కిలి కృంగిపోవుట రెండును మంచిది కాదు. చేప నిరతము నీటిలొనుండినను కుళ్ళిపోవక, అటులనే కుమ్మరి పురుగు కంపములోనున్నప్పటికి తనకు బురద అంటుకోకుండ ఉండునట్లు గడుపవలయు. దేనియందూ అతివ్యామోహము పడక సదా సమతుల్య స్థితిలో నుండుట. ఈ సందేశం మహాభారతంలో అజగరుడు శాంతిపర్వంలో ప్రహ్లాదునికి తెలిపినట్లు కవిబ్రహ్మ తిక్కన విపులీకరించారు.
పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలసాయ:
గణపతి ఎల్లకాలము బాలాస్వరూపుడే. అందుకే ఆయన సదా తలితండ్రుల వద్దయుండి వారితో క్రీడాభిలోలుడై తాను ముదమంది వారిని ఆనందభరితులను చేయును.
అనుమతీయ వేడెదన్:
ఏ పని తలపోసినా అది కర్మాచరణకు వుద్యుక్తులగువేళ ప్రప్రధమముగా ఆ విఘ్ననాధుని అనుజ్ఙపొంది ఆ పని చేయవలె. అందుకు సాక్షిగా మన తెలుగుదేశంలో వరంగల్ జిల్లాలోని 'కురవి' అను గ్రామంలోగల మీసాల వీరభద్రస్వామి-భద్రకాళికాదేవిల ఆలయ ముఖద్వారముననున్న గణపతిని దర్శించి ఆయన అనుమతిమేరకు మాత్రమే తదనంతరము అంతరాయలాన వున్న స్వామిని దర్శించివలయు. అచ్చటవున్న గణపతిని 'అనుజ్ఙ గణపతి' అందురు. ఇది పురాతన దేవాలయము.

సర్వే జనా సుఖినోభవంతు. 

24, జూన్ 2012 తేదీన వున్న శ్రీ విఘ్నేశ్వర దండకమునకు వ్యాఖ్యా పూర్వకముగా తగిన భావయుక్తముగా వ్రాయబడినది.
పోలూరు బాబురావు, నూజివీడు

25, మార్చి 2017, శనివారం

వందే 'మా' తరం

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః


వందే 'మా' తరం

శ్రీ మహాలక్ష్మిని భారతావనిలో 
జ్యేష్టాదేవి ఆవహించినటుల
          అష్టమీ తిథినాడు అష్టలక్ష్ములలో
          ఒకతెయైన ధనలక్ష్మికిలనందు
ఆకశ్మికంగా అష్టకష్టాలు అనుకోని రీతి
ఆరంభమై ప్రజలనెల్లరలను ఒక్కవేటున
          పాలకుల కలంపోటుతో పక్కదారి
          పట్టిన పెద్దనోటును చీకటి మాటున
లెక్కించ వీలులేని నల్లధనానికి వెలుగుజూపు నెపాన
ఏకహస్త ద్విహస్త శతనోట్లను చెలామణిలో
          లేకుండగ రద్దు పరచి కమలపాలకులు
          దేశప్రజలకు ఒక్క కుదుపునిచ్చి కునుకు
లేక ఆలోచనలకు అంతులేక వేటుపడ్డ 
వేయినోటును అప్పటివరకు కళ్ళకు అద్దుకుని
          కడుపుకట్టుకుని కష్టపడి సంపాదించి
          రూపాయిని పాపాయిలా పెంచి శతాలుగా
మార్చి, పదిశతాల నొక్కటిగా చేసి ఆనాడు
గర్వించి, నేడు దానిని అంటరానిదానిలా
          చూచి, హృదయానికి హత్తుకొనకనే హడావుడిగా
          చేతబూని అర్ధరాత్రి 'చిల్లర శ్రీమహాలక్ష్మి'కై
ఏ. టి. యంల చుట్టూ తిరిగి శీతాకాలంలో
శరీరానికి నడివేసవి ముచ్చెమటలు తెచ్చుకుని
          కృషితో నాస్తి దుర్భిక్షమనుకుని వేయిని
          వందలుగా మార్చి, ఆ వందలను హృదినొక్కి
వందవందకు వందనాలర్పించి వందేమాతరమని
స్వాతంత్ర్యపోరాట పటిమనుద్దీపింపజేసిన
          1882వ వత్సరాన బంకిం చంద్ర గీతాన్ని
          1896వ వత్సరాన రవీంద్రుని ముఖతః వెలువడగ - అప్పటి ఆర్ధికస్థితికి వంద రూపాయలే మిన్నగానుండగ తదనంతర
దశాబ్దాలలో వేయినోట్లనచ్చొత్తించి
          ఆర్ధికవేత్తలు వేయేళ్ళు వర్ధిల్లమనిరి!
          అలా ప్రవర్ధమానమగుచు రూపురేఖలు
మారుతూ తన గతాన్ని, గీతాన్ని వరుస
మారిందంటూ ఒక సినీకవి వ్రా'సినారె'!
          నేడదే నిజమై వేయి నోటు వందముందు
          సాగిలపడి దశాంగంగా విడివడి ఈ తరానికీ
'వందే' మాతరం అయి మరల వంద నోట్లకు
తహతహలాడుతూ ధనాగారాలకు
          వరుసలు కట్టి చిల్లర చిక్కులలో చిక్కితే
          చిల్లర శ్రీమహాలక్ష్మి చిర్రుబుర్రులాడుతోంది!
పెద్దలమాట 'చిల్లరశ్రీమహాలక్ష్మి' యని
ఈ తరానికి రుజువు పరచి తన ఉనికి నిల్పింది.
          ఈ నాడు సర్వజనులకు అవసరమయ్యింది.
          "తం వందే సాత్వికం శివం" 

ఇదీ బడుగు జీవి నోట్లకై అగచాట్లు.

ఆ నాడు స్వాతంత్ర సిధ్ధికి వందే మాతరం
 
ఈనాడు ఆర్ధిక సఫలతకు 'వందే' మాతరం 


8-11-16 అష్ఠమి తిథినాడు ఐదువందలు, వెయ్యి నోట్లు ప్రభుత్వం రద్దు పరచిన సంధర్భాన 12-11-16న వ్రాయబడినది.

 పోలూరు బాబురావు, నూజివీడు