31, జులై 2014, గురువారం

హేమజ్యోతి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

హేమజ్యోతి


ఎక్కడో మహబలేశ్వరాన పుట్టి 
కొండ కోనలనెల్ల పలుకరించి తట్టి 
జన వాహినిని నిదుర లేపి తను సాయమై 
వ్యవసాయంబు చేయించి పరుగులిడి 
అలసి సొలసి సేద దీర్చుకొను నెపాన 
కనకదుర్గమ్మ వొడి చేరి విజయవాటికన 
ఆగి దాహార్తులకు దాహంబు దీర్చు 
తపనతో ప్రాణప్రదమైన జీవనాడియగు 
షుషుమ్న రూపాన కాలువై హేలాపురీ 
ప్రదేశాన కాలూని తులసివన సస్యశ్యామలము జేసి 
ఆ వన సహచరుడగు శ్రీవత్స సత్యవీరరాఘవుని 
నాశీర్వదించి దంపతుల గావించి ప్రతిఫలాపేక్ష లేని 
గొల్లపూడి కుటుంబ పరంపరాభివృధ్ధి 
గావించు నెపాన నీ జలధార జీవధారయై 
నిస్వార్ధసేవితయగు కృష్ణవేణమ్మకివే
మా నమనుస్సుమాంజలులు!

అట్టి తులసిసత్యవీరరాఘవుల స్నేహలత 
చిహ్నానికి ప్రతిఫలంబుగా ద్వితీయపట్టిగా 
హేమప్రకాశ శోభిత శరీరచ్ఛాయతో జన్మంబున్నొంది 
శరీరాకృతికి తగిన నామమగు హేమలత 
యను నామకరణముతో తల్లిదండ్రుల
నానందడోలికల నూగించి బాల్యదశ 
నంతటిని పవిత్ర కృష్ణా నదీ తీర నాగాయలంక 
పట్టణాన పూరించి తన ద్వితీయ సోదరుడగు 
శ్రీకేశవుండు వదిన సీతారాముల ప్రాపకములో 
న్యాయవాదిగానుండు నూజివీడు 
పట్టణాన స్థిరనివాసము పొంది పాఠశాల 
విద్యనభ్యసించి తను కన్న కల నెరవేర్చుతపనతో 
తనకత్యంత ప్రీతిపాత్రమగు మాతృభాషా 
పండితయై పదుగురికి వాగ్దేవి 
తనకొసంగిన అమృతతుల్యమగు వాక్సుద్ధి 
ప్రదాతగా ఒక గురువుగా రాణించు 
కాంక్షతో తెలుగు పట్టా సాధించి 
తదుపరి దైవానుగ్రహాన మొట్టమొదటి 
ప్రభుత్వోద్యోగియై తాబుట్టినింటి మెట్టిన 
పోలూరు వారి కుటుంబ ఆశాజ్యోతియై 
నియమబద్ధ నిరంతర శ్రమ జీవియై 
భర్త మాటనే తన భావనగా 
సహధర్మచారిణియను పదానికి న్యాయంబొనర్చి 
అనంత వొడిదుడుకుల జీవనగమ్యములో 
కష్టాలకడలినీది, సుఖాలనొడిచేరి 
అలసి సొలసిన ఆకృతితో అలుపెరగని 
తన అకుంఠిత దీక్షకివే మా నమోవాకాలు!

మాతృధర్మ నిర్వహణలో ఇరువురు బిడ్డలకు 
తల్లివై  అటు ఉద్యోగ ఇటు కుటుంబ 
బాధ్యతల విస్మరించక నిరంతర చిరునగవుతో 
తను పనిచేసిన పాఠశాలల అధికారుల 
మెప్పు పొందుటయేగాక విద్యార్ధుల ఆదరణ 
పొంది వారి మనసులతో మమేకమై 
మన టీచరుగారనే భావన కలిగించి 
దాపరికములేని హృదయపూర్వక ఆదర 
ఆప్యాయతా పలకరింపులతో వివిధ ఆట పాటలతో 
పిల్లల మనసు చూరగొన్న మహోపాధ్యాయిని యామె! 
గోవుకన్న మిన్నయగు సాత్వికత కూడగట్టుకుని 
జన్మభూమికున్న వోర్పునంతటిని సంతరించుకుని 
నిరంతరమా రెండింటి నాదర్శమగా జేసికొని 
హేలాపురిని తన సంతకములో "గొహేల"
యని ఇముడ్చుకుని కుటుంబము కాంతివంతం 
చేయు చిరు దివ్వెవై తను నిక్కముగ మా హేమజ్యోతియై 
అలరారుచు తన భావిజీవితము 
నిరంతర శోభాయమానముగా 
విలసిల్లు గావుతాయని వాక్కులతల్లి 
యగు శారదామాతను మనసా ప్రార్ధిస్తున్నాము. 


భక్తి శ్రద్ధలతో 

కుమార్తె: శేష శైలజ                                                      కుమారుడు: వెంకట నాగ ప్రవీణ్ కుమార్
అల్లుడు: శేషగిరి రావు, యు.ఎ.ఇ                                       కోడలు: లక్ష్మీ కాత్యాయని
మనవడు: అశ్వని కుమార్                                               మనుమరాలు: జోతికా మనస్విని

ఈ అభినందన కవిత నా సహచరి శ్రీమతి గొల్లపూడి హేమలత ఉద్యోగ విరమణానంతరము 2007 సంవత్సరములో వ్రాయబడినది.

పోలూరు బాబూరావు, నూజివీడు

30, జులై 2014, బుధవారం

వృక్ష విలాపం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

వృక్ష విలాపం


1)  ఒక శరదృతు శీతవేళ చిరుగాలి తాకిడిలో
     నేనొక చిన్ని మొక్కగ తల్లి వేరుతో
     కులుకుతుండంగ అప్పుడప్పుడే
     నా పిల్లవేరు నాటుకొనుచుండ
     ఒక బంగారు లత నాపై మనసు పొంది
     తన పెరటిలో నాటుకొన తలచినంత
     నే గ్రహించి వ్యధ చెందు సమయాన
     ఆ వెండి వెన్నెల జిలుగు రాత్రి
     గుబులుతో నున్న నను నా తల్లి చూసి
     నన్నూరడింప ప్రయత్నంబూని
     నంతలో ఆ రాత్రి భళ్ళున తెల్లారి
     అరుణ కాంతులతో ఆదిత్యు పైపైకి రాగ
     నా వియోగ బాధ ఆ ప్రత్యక్ష దేవునికి
     తెల్పుకొనునంతలో ఆ యెలనాగ
     నన్ను పెకలింపు కొననెంచి తవ్వుగోలతో
     గాతంబు సేసి నా తల్లి వేరుతో
     నను వేఱు చేసె! నే గోల చేసి ఘొల్లు మనగ
     ఒకపరి తన మృదుకరముతో వూరడించి 
     ఉదాట్టున నను లాగి, వేరు చేసెనే జాలిలేక
     ఆహా! ఈ పడతి ఎంత పగ బట్టినాదో 
     నా బ్రతుకు పైన - అకటా!

2)  అంతట యామె తన గృహాన గొంపోయి 
     పెరటిలో చిన్న కలుగు చేసి
     నన్నందుయుంచి చుట్టూ కుదురు చేసి 
     కాసిన్ని నీరు చిలికించి నా సేదదీర్చి 
     ప్రతిదినమటుల నను ప్రత్యేకముగ జూసి 
     బియ్యంపు కుడితితో బలము కూర్చి 
     నేనెదుగుతూ వ్రేళ్లూని నిలదొక్కుకుని 
     మారాకు తొడిగి చుట్టు పక్కల జూచినంత 
     నాటి కవి కరుణశ్రీ జాలిగొన్న సన్నజాజి తీగ కాంచినంత 
     నే కొండంత ధైర్యమ్మునొంది నను దెచ్చిన తల్లి 
     నాల్గు కాలాలు నను గాచుకొందునని మురిసిపోతి!
     అప్పటి నుండి మా యిరువురకు చెలిమి కుదిరి 
     తన పూల ఘమఘమల నేనాస్వాదింప
     నా చిగు రెమ్మల ఘుమఘుమలు నేనందివ్వ 
     అంతలోనే శిశిరమ్ము వచ్చి నా చిగుళ్ళు 
     లేత బంగారు వర్ణంబూని ఈనెలూడి 
     నేల రాలుచున్న వైనంజూచి కలవరము చెంది 
     పది దినములటులే ఉపవాసముండి 
     వసంత ఋతు రాకతో మరల చిగిర్చి లేలేత పచ్చదనము
     ప్రోది చేసుకుని నిండార కంచి పట్టుచీర గట్టిన 
     వసంత లక్ష్మీ వోలె గుబురుటాకులతో 
     నిస్వార్ధ సేవకై వేచి వొదిగి వున్నానాయింటిలో. 

3)  సాత్వికత మూర్తీభవించిన ఆ యింతి 
     మేడ మెట్లపై జిగిబిగి పొదలతో 
     అల్లుకున్న తీగలో సన్నజాజులు కొనగోట 
     త్రుంచి కూర్చి చక్కటి సుమాహారముగ జేసి 
     తన దేవతామందిరాన అమ్మనలంకరింప
     ఆహా! ఎంత ధన్యమైనదో నా చెలియ జన్మ!
     అని తలచినంతనే యామె నా కడకు వచ్చి 
     చివాలున కొమ్మ వంచి కొన్ని రెబ్బలను త్రుంచి 
     తన వంటకములలో నను జేర్చి అమ్మ నివేదనకు 
     అంతా సిద్ధపరచి నైవేద్యమిడగా 
     ఆహా! నా జన్మ కూడా ధన్యత జెంది 
     నా దేవదేవికి చక్కటి సమాహారముగా 
     సమకూరితిగదా! యని సంతసించ 
     అదేమి శాపమో! పళ్ళెరములో వడ్డించగానే 
     నను చూడగానే మునివేళ్ళతో వెతికి 
     తీసి పారవేతురకటా! ఆవగింజంత 
     మాత్రంబు చేయనైతినని వ్యధ చెందుచుంటి 
     ఏమిటో!ఈ మనుజుల తత్వంబు తెలియకుంటి!
     నిస్వార్ధ పరుల సేవలకు గుర్తింపు కరువాయెనయ్యో!
     అందుకే నేమో నేను వెర్రి కరివేపనై - వేపకు  మారుపేరైతి!!
     అటుల విలాపము చెంద విశ్వపతి కరుణించి 
     పవిత్ర మనుజ రక్షణతో శాప విమోచన 
     కల్గునని "వృక్షో రక్షతి రక్షితః" యని సూక్తినుడివే!!


"Mustard in a dinner plate" అనే proverb ఆధారంగా పై భావన చేయబడింది. 

Responses are welcome and appreciated. 



పోలూరు బాబురావు, నూజివీడు

2, ఏప్రిల్ 2014, బుధవారం

గుండె గొంతుకలో ... అభిసారిక




మగువకు కురులే అందం
ప్రియునికి జత జడ బంధం
వాలు కనుల సఖి చూపులో
వీలుకల కాంతుని అనుబంధం







ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

ఆకాశపు గొడుగులో
అరుణుడు అగ్ని చూపుతో
గొడుగులో వగలాడికి
సెగరేగి గుబులౌతోంది!


సూర్య తాపానికి
నువు ఛత్త్రం ధరిస్తే
ప్రియ పరితాపంతో
ఆతడు ఛత్త్రపతౌతే!


పగలంతా సూర్యుడు
గస్తీ తిరుగుతూంటే
బస్తీ వగలాడీ వడిగా
ఛత్త్రం చేబట్టి వస్తోంది





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

  

వేసవి వేడిమికి
ఆరుబైట సేద దీర
ఆకశాన కారు మబ్బు
వరుణ తారగా వర్షించే

ప్రియ వియోగ తపనకు
మేఘుడే కరుణించి
తన ప్రియ మేఘమాలను
వర్షింపజేసి చల్లబరిచె!

ఆకాశ దర్పణంలో
అతివ ప్రతిబింబం...
మేఘనాదుని చేరి
వర్షించి చల్లబరిచె!





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




వరుని తలపులే
ప్రేమ మంత్రమై
కోరికలు తీర్చే
ముంజేతి మంత్ర దండమైంది...


మనసున మెరిసిన బంధం
చేజిక్కి మంత్ర దండమై
కోరినవెన్నో
దక్కుతున్నాయన్నీ







ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



మది తలచి మైమరచి
నిదురించి కలగంటే
నీదు మధురిమ గానం
నాదు ఫలిత ఊహాగానం

నిదురించిన మనసుకు
కలలంటే ఇష్టం
ప్రియ గాన మధురిమలో
ఊహల చెట్టా పట్టాల్







ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

1, ఏప్రిల్ 2014, మంగళవారం

గుండె గొంతుకలో ... అభిసారిక

ప్రేమతో పట్టిన హారతి
ప్రియుని మది తాకి
ధూప దర్శనంతో
ధన్యత చెందాను


మయుని మరిపించే
మాయా దీపంతో
ప్రియుని వశము పొంది
ధూపంలో దర్శించింది!


దూరమైన ప్రేమికుని
అల్లౌద్దీన్ దీపంతో
ధూమంలో దర్శించా




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



వ్రేలి ఉంగరం
ప్రేమకు సాక్ష్యం
ప్రతి కిరణంలో
ప్రియుని ప్రత్యక్షం

ప్రియుడు తొడిగిన
ఉంగరం పెళ్ళికి మార్గం
ప్రతిఫలించిన కిరణంలో
మగువకు దర్శనం






ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక

నా కంటి వెలుగులో
నిను చూసుకుంటా...
ఆ వెలుగుజాడలో
నను తలచుకోరా...

ఒంటిగ నున్న చెలికి
మనసున మెదిలిన చిత్రం
కంటికి చేరి
ప్రియుడై వెలుగొందె!

మనసులోని కాంతి చిత్రం
చెలి కంటి కిరణమై
వెలుగు బుగ్గగ మారి
ప్రియుని చిత్తరువైంది!



ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



చెరగని పచ్చ బొట్టులో
మరుని అనంత మూర్తి
చెదరని చిరునవ్వుతో
నా ప్రియ భుజ కీర్తి

తల తడియారబెట్టి
భుజాన పచ్చ బొట్టెట్టి
ప్రియుని తాళి బొట్టుకు
చిరునవ్వు చిక్కబట్టుకున్న...

ప్రియుని పచ్చ బొట్టుతో
ప్రేమ పంచుకొన్నట్టు
తాళి బొట్టు కొరకు
చిరునవ్వు దాచుకొన్నట్టు




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



అద్దం అబద్ధం ఆడదు
నీ బింబానికి ప్రతిబింబం
నిజంగా తానేనని
చెప్పకనే చెబుతోంది...


చక్కని కనులే
చెక్కిలికందం
చిక్కిన చెలి అద్దంలో
చుక్క ప్రతిబింబం







ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




పిడికెటంత ప్రియ హృదయం
చిటికకే చేజిక్కితే
అనంత ఆనందం
అంబరాన సంబరం

నీ రూపమే హృది వలచి
నీ జపమే మది తలచి
కనుగొంటిని అంబరాన
అందుకోవా సంబరానికి





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక





ముంగురులను తప్పించి
ముద్దాడిన ప్రియుని
సమాచారమందించే
రాయబారి సీతాకోక చిలక






ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



తొలకరి చినుకుతో
నేల పరవశింపగ
మలి చినుకులో ప్రియుని
జాలి చూపుతో మైమరచాను!

చినుకులో నువ్వున్నావని
నను మరువలేదని
చినుకు తాకినంతనే
పులకితనై పరవశించాను!



ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక



నువ్వే నాలో కలవని
నా శ్వాసలో దాగి
నిశ్వాస నురగలో
విశ్వాస బుడగవయ్యావు!


ప్రతి శ్వాసలో నీ ధ్యాసే
నాలోనే వున్నావని
ప్రతి నురగ బుడగలో
వెతగగా కన్పించావంతలో!


నాలో నీవున్నావని
నీవూ నేను మనమేనని
నేడే నా శ్వాస ఊసులో
తెలిసిందిలే...




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

31, మార్చి 2014, సోమవారం

గుండె గొంతుకలో ... అభిసారిక





పట్టుబట్టి విల్లెక్కుబెట్టి
మట్టు బెట్టాలి అవినీతి నరకుణ్ణి
అపర సత్య భామలా!




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




గోళ్ళూడగొట్టి
కొనుగోళ్ళు చేశావు!
బిల్లు చూపెట్టి
నా నడ్డి విరిచావు!!




 ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




మనసొకరికిచ్చి
మనువొకరికిచ్చి
మమతమరొకరికిచ్చి
హృదయాలతో ఆటలాడుకోకు!

ప్రేమకు వేళాయె
పెళ్ళికి సులువాయె
కలిసిన మనసులాయె
ఇరు హృదయాల బంతులాట!





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




పల్లవించిన ప్రేమ...
ఫలించినది ఈవేళ
ఎగురవేస్తా ప్రేమ బావుట
హృదయాకాశంలో...

మిడి మిడి వయసు...
మిడిసిపడింది మనసు
ఎగసింది ఎద...

ఎగిరింది హృదయ బావుట!




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక




మనసైన మధుమతికి
సై! అన్న పెద్దల అనుమతి
అందుకున్నా నీ బహుమతి
ఆపై శతమానం భవతి
...




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు
 

గుండె గొంతుకలో ... అభిసారిక

 
ప్రేమ అగ్గి రగిలింది
తనువు తహ తహలాడింది
అగ్నిలో ప్రియుని దర్శించి
తాను పునీత అయ్యింది!

గుండె గొంతుకలో ... అభిసారిక

 


వచ్చిన వారికి నెంబరిస్తే
నచ్చానని అందరూ చెప్తే
నే మెచ్చిన
వానికే సైయ్యని
తతిమావారిని తూచ్!  అంటా





ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు

గుండె గొంతుకలో ... అభిసారిక





ఆకు ఆకులో పరాకుగా
ప్రియుని దర్శించి
చేజిక్కించుకుందుకు చేసే
ప్రయత్నానికి బహు పరాక్!




ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు