8, జులై 2016, శుక్రవారం

దివి నుండి భువికి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
దివి నుండి భువికి

నా తల్లి ఆ నాటి మాట నిలుపుకొందుకై
     తల్లి సరస్వతి ఆ బ్రహ్మతో మాట్లాడి
తన ఆత్మ తృప్తికై మరల జన్మభూమికేతెంచి
     నా ఇంటి చుట్టూ తిరుగునెపమున
ఆ కోర్కె తీర్చుకొను క్రమమున
     తన డాక్టరు రాధాకృష్ణ గృహాన
ఒక విశ్వాస తల్లి గర్భాన జన్మంబునొంది
     ఆనందు అరచేత అక్కున చేర్పునొంది
ప్రవీణు ప్రేమచే నా గృహము చేరి
     ఆ తల్లి హేమలత వొడిలోకి వొదిగి
తన జన్మ సార్ధకతను తన మాట సత్యమును నిలుపుకున్న
     నా తల్లికిదే వందనము.
ఆ ప్రకారమేతెంచి నా గృహానజేరి
     నా మనో ప్రాకారమును ఆక్రమించి
నన్ను నా కుటుంబానందకారకమై
     చింటు నామకరణముతో దినదిన ప్రవర్ధమానవై
నేను నా భార్య నీకు అమ్మానాన్నలమై
     నీ మూగభాషకు మా మాట అన్వయముతో
నీవు మాకొసగిన ఆనంద భావన
     మరుద్దామన్నా మరపురాని ఆనందానుభూతి
మరి నిన్ను మరువలేము... మదిలోన నీ జ్ఞాపకం మరచిపోము!

నీ చిన్ని నాల్గు పాదాలే
     ధర్మార్థకామమోక్షాలు కాగా
నీ వెండి కేశ సంపదతో ఓ శాంతికపోతములా
     నీ చెవులు రెండు ఓంకారశ్రీకారములై
నీ ఫాల భాగము ఆ వేంకటేశు నామమై భాసింప
     నీ అరుపు ఆ విష్ణు పాంచజన్యమై తోచగా
ఏమని వర్ణింతు నిన్ను ఆ శ్రావణగౌరిమాత కాక!
     ఆ దివ్యరూపుతో నీ కంటి చూపులో
దేవతను చూచుకొని మేమానందించినాము
     మా ఆనందానికి నీవు పరవశించి
నీ వాలము వూపి నీ సంతసము మాకు తెల్పితివి
     మరినిన్ను మరువలేము మదిలోన నీ గుర్తు మరచిపోము.

చింటుతల్లీ!
     నీ బాల్యదశలో నీవబ్బురముగా నడుస్తూ
అలవోకగా నీ అమ్మ పాదల నడుమ నడువగా
     అయ్యో తొక్కితినంచు నీ అమ్మ బాధపడి
నీ మెడకు నీ గుర్తుకై మువ్వల పట్టెడ పెట్టంగ
     నీ మురిపెమునకు అంతేది? ఇల్లంత కలయతిరిగి
శైలక్కను భయపెట్టి, బుజ్జితో దాగుడుమూతలాడి
     బడిపిల్లలతో దోబూచులాడి
ప్రతి దసరాకు సరదా బంతితో ఆటలాడి అందరి మన్ననలంది
     'అబ్బులాల' అనిపించుకున్నావు
ఇన్ని తెలిసి మేము నినుమరచుటెట్లు?
     మంచిని సమాధి చేసే మనిషికి పూర్ణాయువిచ్చి
మనిషికి తోడు విశ్వాసవతిగా వున్న నీకు అర్ధాయువునిచ్చిన
     ఆ భగవానునేది కోరేది? అనుక్షణము నీ చెలిమి తప్ప!
దినదినము మేమిచ్చు తెల్లని ఆహారము తిని (గుడ్డు, పాలు, అన్నము)
     ఎర్రని రక్తముగా మార్చుకుని నీవు ఆరోగ్యవంతమై
మాకు ఆరోగ్య ప్రదాతవై మా అభివృధ్ధి కాంక్షించి
     నీ చల్లని చూపుతో మము ధన్యులనుజేసి
మా అంతరంగాన నిలిచిపోతివి ఇంకనీ స్మరణతప్ప మాకు దిక్కేది?

షకీలా రాగానే ప్రతిదినము నీవు షోకిలాగా ఎదురేగి తోకవూపి
     నీకు పాలు పోయుట మరచినంతనే
గుర్రుగుర్రుమనుచు మీదికేగి
     నీ పట్టుచూపి పాలు ఒక పట్టుబట్టి
అంతలో అమ్మతో మేడ పైకి
     పోయి విహరిస్తూ తిరిగే నీ జ్ఞాపకాలు
మేము ఎలా మరువగలము?
ఆ నాడు శైలక్క పెళ్ళి చూపులకు బయలుదేరువేళ
     ఎదురొచ్చి టపటప నీ చెవులు విదిల్చి
నీ అంతరంగాన జేజేలు చెప్పితివి తదనంతరము బాజాలు మ్రోగినవి
     అంతట శైలక్క అత్తవారింటికేగ
నీ మూగబాధతో నువ్వు రోదించగ
     ఆ బాధ మేమోర్వలేక
కుమిలి కుమిలి ఏడ్చాము
     నీ అల్లరి పనులు తలచి ఆదమరచిపోయాము
ఒకనాడు శైలక్క తన బుక్కు క్రింద వేస్తే
     ఆ రాత్రంత నిద్రలేక పుటపుటను కాలితో లేపి
అటుఇటుచూచి నోటితో పుటుక్కున చించి
     శైలక్క కోపానికి గురైన వేళ
నీ అమ్మ నిన్ను లాలించి
     బుజ్జగించిన వేళ మేమెట్లు మరతుము?
ఆ మధుర భావాలు, ఆ చిలిపి చేష్టలు...
     శైలక్క ప్రసవమై నిను వొంటరిగా వదిలి
మేమంతా బెజవాడ వెళ్ళు వేళ నీ బాధ ఆనాడు తలవమైతిమి
     మరునాడు నేనొచ్చి నీ ఆకలి దాహములు
చూచి గబగబ అన్నమొండి నీకు తినిపింప
     నీ తృప్తి కళ్ళారచూచి చలించి కన్నీరు కురిసే
అది మరల తలిస్తే మనసంత బరువాయే

ప్రతిరోజు అమ్మతో పూజలో కూర్చుని
     ప్రతిసంవత్సరము వినాయక పూజ నేర్చుకుని
ప్రతిఫలముగా ఆ దేవు దైవత్వము పొంది
     ప్రతి దినము మాకు సిరులిస్తూ
సంకేతముగా నీ చెవులు దులిపి మమ్మాశీర్వదించి
     మా ఇంటి పెద్దదిక్కైనావు
మా అభివృధ్ధికి ఆలవాలమైనావు
     ఆ అభివృధ్ధి పధాన అల పయనించుచుండ
నీ అమ్మ నాన్నలను నాగ జాతి బారి నుండి కాపాడి
     నీవు నాగభైరవి అయ్యావు
నీ అప్రమత్తతతో చూపావు, విశ్వాస విధేయతవయ్యావు
     ఆ తరువాత యింటి నిర్మాణమునకు
ఖాళీ చేయు వేళ
     నీ సమ్మతిని తెల్పి నీ ఆశీస్సుతో పూర్తి చేసి
ఓ శుభలగ్నాన గృహప్రవేశం చేయ
     నీ ఇల్లు చూచుకుని నీవు మురిసిపోయినావు
అంతటి నుండి క్రమము తప్పక ప్రతి దినము డాబాపైకేగి
     నువ్విహరించు చందంబు మరువగలమె?
శైలక్క పిల్లాడు వస్తాడని నీకు పలుమార్లు చెప్పిచెప్పి
     వాడు నా చింటు తల్లియని పలుమార్లు
నిను తాకితాకి వాడానందపడి పలుమార్లు ఈల వేసివేసి
     నువు పాలు త్రాగినపుడెల్ల పులకించి
నిను పెంచుకోవాలని కారు కొని నిను
     ముందు సీట్లో ఉంచుకోవాలని వాడు
కన్న కలనన్ని వమ్ము చేసి అందనంత దూరము
     అపుడే పయనించినావు
ఆ కోర్కె తీర్చకుండగనే అల దివికేగినావు.

ఒకనాడు బుజ్జి పెళ్ళి మాటలు మాలో మేము మాటలాడుకొనుచుండ
     అపుడు నీ చెవులు దులిపి నువు
శ్రీరస్తు సంకేతమిచ్చినావు
     తాంబూల స్వీకారము మస్తుమస్తుగా
శుభము చేసినావు. శుభమ్ భూయాత్తని అనిమిషులు దీవింప
     కల్యాణ క్రమము తిలకించి పులకించినావు
     నీ చల్లని చూపుతో నీ కంటివెలుగుతో
మము చల్లంగ చూచి, మా అంతరంగ భావంబు గ్రహించి,
     మేము తలపెట్టు పనులు గ్రహించి
జయముసల్ప పూనుకున్నావు
     నీ సంకల్ప బలము మాకొసంగినావు
ఆ క్రమమున బయట కాలువవేసి నీ పర్యవేక్షణమున పూర్తి గావించి
     నీ ఇంటికి సకల సౌకర్యములు చేయించుకున్నావు
అటుల పైయింటికి 'చింటూవిహార్' అని పేరు పెట్టించుకున్నావు
     మా ఇంటి చింటుగా అడుగిడి బుజ్జితో దోబూచులాడి
అమ్మచేత ఓలలాడి నాన్న కుర్చీ కింద జోగులాడి
     మా హృదాయల శాస్వత స్థానమేర్పరచుకున్నావు
శైలక్కపై ప్రేమ చూపి బుడ్డినాన్నపై గుర్రు చూపి
     అందంగ తోక వూపు నీ మందగమనము మేము మరువలేము
నాన్నకొరకు ఎదురు చూపు అమ్మ పెట్టు గుడ్డుకై
     ఆకలికి వోర్చి వదిన ప్రేమకై అర్రులు చాపు
కోరిక తీరక మా యింటనే వెలియనెంచితివా!
     'అందగంజి' వై ఆప్యాయత చూపి
'అంబులారణి' వై అలరించినావు
     'చిన్న'గా మా మదిలోన చిరు దీపమైనావు
ఈల వేసి గోల చేస్తేనే పాలారగించినావు
     'స్వీటీ'గా స్వీట్లారగించి ఆరోగ్యముకొరకై
మేము వేసే మందారగించావు
     మా మదిలో నెలవై మా ఇంటి బుజ్జాయివై పారాడి
మమ్మలరించవమ్మా మా చింటు పాపా, నీకు జేజేలు!

నీ వదిన పలకరింపుకై ఆరాటపడి నీవు
     దినదినము ఎదురుచూచి దిగులు చెందావు
అపుడపుడు వేలికొసలతో తాకి నిను పలకరింప
     ఆ స్పర్శకే నీవు ఆనందమొందినావు
నీ వదిన గర్భంబు ధరియించింది మొదలు
     నీ ఆరోగ్యంబు సన్నగిల్లె
అది చూచి బుజ్జి కీడు శంకించి తల్లడిల్లె
     ఎవరితోను చెప్పలేక ఆ బాధ పంచలేక
మనసంతా నిను నింపి నీ ప్రేమ పంచుకుని
     భూతదయకర్ధంబు చెప్పినాడు
వాడి మనోభావంబు గ్రహియించి నీవు
     నీ మూగ వేదనను మరి తెలుపలేక
నీ మరుజన్మ మా ఇంట పొందాలని
     నీ అనారోగ్యంబు మాకు అవగతంబు కానీక
నీలోన నీవే ఆత్మార్పణ చేసికో దలచి
     నీ వదిన కడుపున జన్మింప పూనుకున్నావు

ఒకనాడు నువు కాలు కుంటుచుండంగ
     నిను బుజ్జి ఆసుపత్రికి తీసుకెళ్ళంగ
వైద్యుడు నిను చూచి వైరస్ ఇంజెక్షునిప్పించమనంగ
     వేరు ఆలోచన లేక నీ ఆరోగ్య మెరుగుకై తక్షణమే చేయింప
అది నీకు శాపమై నీ జబ్బు పెరిగి అది శ్వాస సంబంధమై
     నిను బాధించి మరింత పెరిగి నీలో నీవు కృంగిపోయావు
మా ఆశలు అడియాశలు చేసినావు. అప్పటినుండి అన్నమున్ కుడువక
     పాలున్ త్రాగక నాల్గు దినములుగా నీరసించి
నీ కడుపు బిర్రబిగుసుకునివుండ
     ఏమి చేయాలో పాలుపోక ఆ ఆగస్టు 13న
డాక్టరు సలహాతో నీకు మందు ఇవ్వంగ
     అది ప్రమాదకారియై నీవు పడిపోవంగా - వెంటనే
మరల ఇంజెక్షన్ ఇప్పింపగ ఆ రాత్రి ఎలాగో గడచిపోయింది
     ఆ రాత్రి నా వద్దనే పడుకుని నిద్రించినావు
తెల్లవారి మరల నిస్సత్తువై మిక్కిలి కలవరపరచినావు
     ఆ తదుపరి 14వ తేది ఉదయాన
నీకు సెలైన్ ఎక్కించుటకు ప్రయత్నింప
     ఆ సమయాన నీ తనువు చాలించ పూనుకుని
బుజ్జి చేతిలో కనులు తెరచి చూస్తూ, తోక వూపుతు
     చింటూ తల్లి! అని మేమేడ్చుచుండ అంతలోనే
నీవు ప్రాణంబు విడిచినావు
     అదే సమయాన నీ ఆత్మ
నీ వదిన కడుపున ప్రవేశించినావు
     నీ మరుజన్మ మా ఇంటిలో ఎదురు చూస్తాము

నీ మరణ వేదన చూచి భోరుభోరున ఏడ్చి
     నిను సాగనంప తలచి నీకిష్టమైన పదార్ధాలు
నీ వద్ద వుంచి, మా ఇంటి ఇలవేల్పుకు నుదుట కుంకుమ దిద్ది
     రిక్షాలో బుజ్జి వొడిలోన నిను పరుండబెట్టి
అల నైరుతిమూల రేగుంట గట్టు చేర్చి
     ఆ గట్టి మట్టి తవ్వించి నిను భూమాత వొడిన పెట్టి
మా కళ్ళలో నీరెట్టుకుని హృదయాన బరువెట్టుకుని
     ఆ గట్టిమట్టి దోసిటంబట్టి నీ తనువుపై కొట్టించి
ఋణవిముక్తుడ చేయించినావు. అన్నమెట్టిన చేతితో
     మట్టి పెట్టించుకున్నావు,
మా కడుపులో చిచ్చు రగిలించినావు
     స్మశాన వైరాగ్యమే కలిగించినావు
నీవే మా ఇలవేల్పుగాక మరేమి?

(ఆ భగవంతుడు) కుక్కలను సృజియించి భౌభౌ మనిపించి
     భవ బంధాలే ముఖ్యమనిపించి
మా ప్రేమ పంచి ఇచ్చినాము అది త్రెంపుకోలేక
     హృదయవేదన పొందుతున్నాము
కాకులను సృజియించి కావుకావనిపించి
     అనుబంధాలు శాశ్వవతాలు కావుకావని చెప్పించినావు
ఈ రెండు తెలిసి బంధాలు వదలలేక అనుబంధాలు త్రెంచుకోలేక
     డోలాయమానస్థితిలో మమ్ము పడవైచితివి
ప్రశాంత చిత్తమొసగుము తల్లి! నా చింటు తల్లి!



చింటూ మరణ తేది 14-06-2004 తదనంతరం వ్రాయబడినది
పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి