4, జులై 2016, సోమవారం

శ్రీ నవదుర్గా స్వరూపాలు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

శ్రీ నవదుర్గా స్వరూపాలు

శ్రీ మాతా శుభకరీ విశ్వశాంతి ప్రదాయినీ
నమస్తేస్తు నారాయణీ నమోన్నమః
దీవించు మా తల్లి శ్రీ కనకదుర్గా
సకల సంపదలనిచ్చు శ్రీ కల్పవల్లీ!

ఆశ్వయుజ మాసానా ప్రతి వత్సరమునా
నవరాత్రి నవదుర్గలను భక్తితో సేవించి
నీ విశిష్టత తెలిసి  నీ నవ నామాలతో
శక్తి కొలది పూజించి నవకాయ పిండి వంట
నైవేద్య మిడుదుమమ్మా! ...
దీవించు మా తల్లి...

ప్రధమముగా నిను హిమవత్పుత్రిగా తలచి 
భక్తులను పూర్ణవాత్సల్యముగా జూచు
చల్లనీ తల్లియగు శైలపుత్రిగా భావించేము!
... దీవించు మా తల్లి... 

విదియ దినాన శివుని భర్తగా పొందుటకు
సకల వేద తపోనిష్ఠనున్న నగరాజకన్యగా
ఏకాగ్రతనొసగు మానసికోల్లాసినిగా నిను తలతుమమ్మా!
... దీవించు మా తల్లి... 

తదియ నాడు సకల ప్రాణి కోటికి సదా
ఉల్లాసము కలిగించు నీ రూపలావణ్యముగల
చంద్రఘంటాదేవిగా నర్చించేము తల్లి! 
... దీవించు మా తల్లి... 

చవితి నాడు త్రివిధ తాపాలు దరిజేరనీక
మాయా స్వరూపిణివై మమ్ములను రక్షించు
జగన్మాతయగు కూష్మాండాదేవిగా నిను చేరి కొలుతు! ... దీవించు మా తల్లి...

పంచమ దినాన సకల స్త్రీ జనములకు సంతాన ప్రాప్తి
నొసగు జగతికే మూలపుటమ్మవై గర్భశుధ్ధి
కలిగించు దివ్యగర్భవగు స్కందమాతగా నిను కొల్చెదము! ... దీవించు మా తల్లి...

షష్ఠమ దినాన సకల జ్ఞాన సిధ్ధినొసగి
అధ్యాత్మికానందమొసగు సకల దేవతల దివ్య తేజమ్ముతో
కతుడనే మునిపుంగవుని పుత్రివగు కాత్యాయనిగా కొలుతు! ... దీవించు మా తల్లి...

సప్తమ దుర్గగా నిరతము కాల ప్రవాహాన కొట్టుమిట్టాడు
జనుల భయాందోళనల రూపు మాపి, ధైర్యమొసగి
యముని నిలువరించిన కాలరాత్రీదేవిగా నిను కొల్చెద! ... దీవించు మా తల్లి...

అష్టమ దుర్గగా శివుడు నల్లనిదానవని నింద సేయ
అలుకబూని విపంచిని భక్తితో తపమాచరించి
శాంతి కారకమగు తెల్లని శరీరమొంది మహాగౌరిగా
 
నిను సేవించు స్త్రీలు దీర్ఘసుమంగళత్వము పొందేరు! ... దీవించు మా తల్లి...

నవమదుర్గగా అణిమాది అష్టసిధ్ధులను ప్రసాదించి
మోక్షదాయినియగు సిధ్ధిధాత్రీదేవిగా నిను కొలుతుమమ్మా! ... దీవించు మా తల్లి...

కరుణా కటాక్షమొసగు నీ చల్లని చూపులే
సదా వాంఛితములై మమ్ములను నిరతంబు
కాపాడు గావుత  ... దీవించు మా తల్లి...

నమస్తే నమస్తే నమోన్నమః 
ఓం శాంతి శాంతి శాంతిః



శ్లోకం

ప్రధమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణీ,
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధాం,
పంచమం స్కందమాతేతి, షష్ఠమం కాత్యాయనీ తథా,
సప్తమం కాలరాత్రిశ్చ , మహా గౌరేతి చాష్టమం,
నవమం సిధ్ధిదాప్రోక్తా, నవదుర్గ ప్రకీర్తితాః 





పోలూరు బాబూరావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి