శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః
ఓం శ్రీ మాత్త్రేనమః శ్రీ అపర్ణాయైనమః శ్రీ లలితాంబికాయైనమః
గట్టు మీద గణపతి
ఓం గం గణాధిపతయే నమః
ఓం తత్పురుషాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్!
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ
శ్రీ రాజరాజేశ్వరీ బ్రహ్మవిద్యా మహాత్రిపురసుందరీ
శ్రీ లలితా పరాభట్టారికాంబ పరదేవతా
ఓం నమోన్నమః
మంచిని పంచుట పెంచుట మంచిదని యెంచి
మహా మహిమాన్వితమగు నీ మహిమలు
పది మందికి తెలియగనెంచి
నీ కృపా కిరణములు నా మనసున వెలుగు జూపి
నా అనుభవ మహిమలు తెలుపగా అనుమతీయవయ్యా
అంతయు నీ దయ చేతనే గదయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ఏ శిల్పి చతురతయో అలనాటి అర్ధ శతాబ్ది వెనుక
ప్రధమమున ప్రధముడవగు నిను తలచి మలిచి
ప్రతిష్ఠింపకనే యటుల నీటి
తటాకంబున నిను వదలివేయుట చూచి
కలత చెంది మిక్కిలి కలవరపడి
ఆ క్షణమే పదుగురి సహాయముతో ఒడ్డుకు చేర్చి
గట్టు మీద ఒక బండ రాయికి ఆనించి
నీకు ప్రధమ పూజ సల్పి ప్రతిష్ఠించిన ఆ తల్లికిదే కృతజ్ఞతాంజలి.
అటుల ఆ వటవృక్ష ఛాయలో
ఆమె ప్రతి దినము నీకు పూజ సల్పుకొనుచుండ
ఒకనాడు ఊరి జమీందారు శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు గారు
ఆ మార్గమున పయనించుచుండ
పూజలందుచున్న గణనాధునింజూచి
ఒక చిన్న గుడిని నిర్మింపదలంచి
వెంటనే పరివారమును శాసించే.
అంతట ఆ వినాయకునకు సుప్రతిష్టితంబగు గుడి అమరి
గట్టు మీద గణపతిగా ప్రసిధ్ధమై
భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుచుండెన్.
అంతటినుండి సిందూరలేపనముతో
ఆధ్యాత్మిక భావన ముట్టిపడునట్లుండు
నీ ముగ్ధమనోహర రూపు వెలుగొందు వేళ
ఆ అరుణాద్రి శిఖరాన వుదయించు
అరుణారుణ కాంతి కిరణములు నిను తాకు వేళ
అర్ధనిమీలిత నేత్రాల ఆ ఈశాన్యాధీసుడగు నీ తండ్రిన్ జూచువేళ
నీ ప్రసన్న వదనము మేము తిలకించు భాగ్యము కలుగ జేసితివిగదయ్యా
మిక్కిలి ధన్యత చేకూర్చినావు గదయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
చిన్న పెద్ద యనక అందరూ తమ కోర్కె తీర్చుకొను నెపమున
నీ పై ఒట్టు పెట్టి తమ కోర్కె తీరినంతనే
ఒట్టుకు కట్టుబడియుండక
ఒట్టు తీసి గట్టు పైనున్న నీపై
భారము వేసి నిను మరచిన వారిని
సైతము ఆదరించి తమ తప్పు
తెలుసుకొనునట్లుగా చేసి నీ యెదుటే వారిచే
గుమ్మళ్ళ గుంజీలు తీయించి చిట్టి మొట్టికాయలిప్పించి
ఆది గురువన్నమాట సార్ధకముజేసుకొన్నావు గదయ్య!
మాట తప్పినవాని సైతము జాలి చూపి
క్షమించి క్షేమేంద్రుడవయ్యావు గదయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ఆ నాడు విఘ్నేశ్వరాధిపత్యమొసగు సమయాన
నీ తండ్రి నిను పరీక్షింపదలుప
నీ బుద్ధి కుశలతను జూపి
తల్లిదండ్రులకు ప్రణమిల్లి ముమ్మారు ప్రదక్షిణము గావించి
ముల్లోక నదీస్నాన పుణ్యంబు సాధించి
అయ్యాధిపత్యమునవలీలగా పొందినావు
నీ మాతాపితృ భక్తిని చాటినావు
అనంతర కాలములో దేవగణానికొక్క అధిపతి కావలసియుండ
జ్ఞానాధిక్యుడవగు నిను అధిపునిగాజేసికుని
దేవగణాధ్యక్షునిగా జేయ వినాయకునిగా
సుప్రసిధ్ధమైనావు గదయ్యా!
మాతపితరుల గౌరవించి తొలి పూజలందేటి
నీవు మాకాదర్శమూర్తివి గదయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
నీ కృపాకటాక్షవీక్షణము కాంక్షించి
నా శైశవదశలోనే బాలారిష్టాలకునారిల్లుతుండ
నను నీ వద్దకుందెచ్చి ముమ్మారు
ప్రతిదినము ప్రదక్షిణలు సల్పించి
నీ పాద సిందూరము నా నుదుటయుంచి
ఆరోగ్యంబుకై నీ ఆశీస్సులంది
అవ్విధంబుగ ప్రతి దినము సలుప
నీ దర్శన భాగ్యముచే మిక్కిలి వూరట చెందినాను!
తదనంతర బాల్యావస్థలో బడికి వెళ్తూ
గుడికి వచ్చి నిను దర్శించి మనసార నమస్కరించి
తండ్రీ! రక్షింపుమని నిను కోరినామయ్య!
కలకాలమటులనే కాపాడుచుండుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ప్రాతః కాల ప్రతి దినము గణనాధా! బ్రోవరావయ్యా!
యనుచు తొలిపూజ నీకు సల్పి
దేవతాగణ కటాక్షంబునొంది
నీ కనుసన్నలలో మేము విద్యగరుపుకొన్నాము
పరీక్ష సమయంలో నీ నామ లిఖితంతో
మనమునందె నిను ధ్యానింప
భారతములో ఆ నాడు ద్రౌపదికి
అక్షయవలువలనిచ్చిన అయ్యచ్యుతునివోలె
మాకు అక్షయాక్షరములనలవోక
నందించి మమ్ము కృతార్ధులంజేయించి
ప్రతివత్సరము మాకు జయముకల్పించినావుగదయ్య!
'క్రియాసిధ్ధి సత్వేభవతి' యను
ఆర్యోక్తికర్ధంబు చెప్పినావు గదయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
అంతప్రతివత్సరము పరీక్ష కృతార్ధతానంతరము
ఒట్టు పెట్టిన నీ మొక్కు తీర్చుకొనుటకు గాను
మాయమ్మ అలసి, సొలసి, ఆయాసపడుతూ
అప్పములు, ఉండ్రాళ్ళు నీకు నైవేద్యమిడుటకుగాను
మధురముగా నీకు వండి సిధ్ధపరచి
మేమందరము భక్తితో నిను దర్శించి
నీ ముడుపు చెల్లించి మమ్మెపుడు
కాపాడుమని కోరి, నీ ప్రసాదంబు స్వీకరించి
పదుగురికి పంచి నినుదర్శిగొల్చి ధన్యత చెందితిమయ్య!
అటుల నీ ప్రసాదమనిచెప్పి
ఉండ్రాళ్ళు మా తండ్రికీయబోవ
తూష్ణీభావముతో ఉండ్రాళ్ళా? గుండ్రాళ్ళా?యని
తీసికొనుట తిరస్కరింప కొద్ది సేపటికే
తన కడుపు గుండ్రాయిగుండుటంతలచి
కలత చెంది పలు వైద్య పరీక్షలు జరిపింప
ఫలితములేక పరికించెనంత పది దినములు
బాధ చెంది తన తప్పు తెలిసికొని తనకుతాను మ్రొక్కుకొని
ఆ వెంట తీర్చుకొని ప్రసాదభక్ష్యమొనర్చి
తన తప్పు బాపికొని తిరిగి ఆరోగ్యవంతుడయ్యె!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ఎప్పటివలెనే ఒక ఆదివారము టెంకాయ నైవేద్యమిడుదుమని
వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణముగావించి
ఆ నారికేళముంగొట్టి అందు జలముతో
నభిషేకించి కాయ సగపాలుజేసి
నైవేద్యమిడి కొంత నీ చేతనుంచంగ
వెన్వెంటనే రివ్వున నాపై విసరివైచి
నీ కోపతాపము ప్రదర్శించినావయ్య!
ఆ వైనమే కాయనాఘ్రాణించి పరికింప
కొంతభాగము కుళ్ళుకనింపింప మిక్కిలి కలత చెంది భయకంపితుడనై
తప్పు జరిగెనని గ్రహించి నీ మ్రోల సాష్టాంగ పడి
మరల వేరొకటి దెచ్చి నీకర్పించువరకు
మనసు కుదుట పడలేదాయె!
గాయ పడిన మనసే బోధ పరచునను తత్వంబు
నాటినుండే నాకవగతమయ్యెనయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
వ్యాస ప్రోక్తంబగు పంచమవేదంబు అతి సుందరంబుగ
నీచేత లిఖితమై ఉర్విజనులెల్లరకు అందించినావు
నీ హస్తవాసిని చూపినావు.
'ఇందరకు అభయంబులిచ్చు చేయి'
యని యా శ్రీనివాసుబొగడిన అన్నమయ్య
మనిషికి చేతి అవసరమెంతో 'చేతులారగ చేసేటి చేకొన్న కర్మానకు'
యను కీర్తనలో చేతి ప్రాముఖ్యము చెప్పినాడు గదయ్య!
అట్టి నా చేతులతో నీ కటాక్షమున
యెందరికో సహాయ పడునట్లు చేసినావు
వాటికి మనోబుధ్ధివికాసమునిచ్చి నిపుణతను కూర్చినావుగదయ్య
నేడు నా చేతులకు ఏదో రుగ్మత కలిగి పటుతరము కోల్పోయి
చేతులెత్తి నీకు జోతలివ్వలేకున్నాను గదయ్య!
తిరిగి నా చేతులకి కొత్త వూపిరులూది
పూర్వ స్థితినందజేయుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
బంగారు రంగారు పూలచేత నిన్ను అర్చన చేదమంటె
గరిక పూవులు నాకు చాలుచాలంటివి
పన్నీటి స్నానమాచరింపగజేసి విభూతి పెడుదమన్న
నారికేళ జలము అభిషేకమే మిన్నయనినుడివినావు
షడ్రసోపేత నైవేద్యనిడుమన్న చాలు మోదకములే గుడముతో చాలునంటివి
అట్లు అల్ప సేవలకే సంతసంబొంది అనల్ప ఫలితములనొసగే
నీ నిరాడంబరత మాకొసంగి మము కాపాడుమయ్య
సద్భక్తి చింతనొసగుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ఒకనాడు బంధువుల పెండ్లికని ఆ రామబంటు గుడికి పోవ
ఆ రాత్రి తిరిగివచ్చు సమయములో
ఆ ఆంజనేయునకు నారికేళ నైవేద్యము చేదమని తలచి
అట్లు జరుపకయే పెండ్లి ముగిసిన పిదప
నా కుటుంబముతో తిరిగి వచ్చుచున్నంతలో
జ్వరముతోనున్న నా కుమారుడొక్కసారిగా
కోతిరూపుగ మారుట చూచి
అదియు ఆ మారుతిని సేవించకయే
తిరిగివచ్చుచున్నందుకు ప్రతిఫలమేయని గ్రహించి
అప్పటికే మార్గమధ్యముననున్నవారమై
ఎదురుగావున్న ఆ గణపతి మహరాజ్‌కుందెల్పి
ఆ రామబంటు శరణువేడి గృహమునకు చనినంత
మా కుమారు రూపు మారి ప్రశాంతముగా నిదురించె!
మరు ఉదయమే ఆ మొక్కు చెల్లించి
నీ కృపాకటాక్షములతో కాపాడినందుకు
నీ ముందు మోకరిల్లి నీ ఉనికి గొప్పతనము
తెలిసికుంటిమయ్య, ఓ విఘ్ననాయక!
అవ్విధంబుగనే నా అనారోగ్య పీడితంబగు
నా చేతులకు తిరిగి బలిమి చేకూర్చి
భక్తిచెలిమి, జ్ఞానకలిమినొసంగుగావుతయని వేడుకొనుచుంటినయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
ఆ నాటి చవితి పర్వ దినాన నీ తండ్రి శంభు శిరమునున్న
ఆ చంద్రు నినుచూచి నవ్వెనని శాపమిచ్చి
ఆ నెలరాజు నిగ్గుదేల్చితివిగదయ్య
ఈ నాటి రారాజు చంద్రుడు నిను మరచి
నీ చెంత యెన్నికల సభ జరుపక నిను దర్శించకనే
మరలినందున తిరిగి శాపమొసగి
ఎన్నికల అపజయముపాల్జేసినావుగదయ్య!
నీకినుక నీ ఉనికి తెలుసుకున్నామయ్య
కష్టపడినంత మాత్రాన జయము సమకూరదని తెలిపి
నీ అనుగ్రహమే సకల సిధ్ధియని నిరూపించితివిగదయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
మా చిన్ననాడు సాలుకొక్కపరి వచ్చు నీ చతుర్ధినాడు
మేమందరము నీకు పూజ సేయ బాలభక్త బృందమై
భజన సేయునంతలో ఫెళఫెళార్భాటముల
పెనుగాలి వీచి కుండపోతగా వర్షము కురిసెనంత
వర్షోధృతికి తటాకము త్రుళ్ళిపడి కాలువలు నిండంగ
జలజలా నీరు పారుచుండ నీ దర్శనార్ధమై
నీ గుడికి వచ్చుటయే ఒక సాహసంబయ్యుండ
రహదారి దిగుతూ జరజరాజారుచుండ
కాల్వనీటి జోరులో కొట్టుకొని పోకుండ మరల మా దేవుగట్టు పైకెక్కి
తుళ్ళుతూ తూలుతూ సగము జారి
నిలదొక్కుకుని ఎటులో నీదరికి చేరి
ఆట పాటలతో నీకు పూజ సల్పితిమి
ఆ రోజులిపుడు తలుప ఆ నాటి ఆటంకములు
సంసారలంపటములో పడిపోవుటే
అన్నట్లుండు ఆ మిట్టపల్లములు అధిగమించి
ఆ లంపటపుటాటలనుండి విముక్తులజేసేందుకే
నీవు కల్పించిన అవరోధములేయని తలపోయుచుందుమయ్య
నీ వేదాంత రహస్యము కడు రమణీయముగదయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
తొలికోడి కొక్కొరొకోయని అరచి
చేతనావస్థనుండి చైతన్య స్థితికిదెచ్చి
ఆ భగవంతుని కోరికొక్కటి కోరుకోమనుచు
తొలిపొద్దు నిదుర లేపుచుండంగ
యెల్లప్పుడు చల్లంగ నువు చూచుచుండంగ
కోరికేటిగల్గు నీ అండదండలుండంగ?
సదా నీ భక్తి తత్పరతతప్ప
భక్తివిశ్వాసపాత్రుడుగ ఆ కన్నప్పను
కన్నప్పగించి చూచుకొను ఆ కాలహస్తీశ్వరునివోలె
ఆత్మవిశ్వాసపాత్రులమగు మమ్ము సదా
నీ భక్తి ధ్యాసలోనుండునట్లు మము
అనిమిషముగాజూచి ఎల్లపుడు కావుమయ్య!
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
పూర్వమొకపరి బంధువులతో నీ దర్శనార్ధమై బయలుదేర
అప్పటికే ప్రొద్దుగ్రుంకినందున నీ దర్శనము వాయిదా వేసి
అవ్విధంబున మనంబున తలంచి
ముందుగ మారుతిని దర్శించు నెపమున బయలుదేర
నీ గుడి ప్రాంగణమునకు వచ్చుసరికి
మా ప్రయాణశకటమాగిపోయె!
కదలకుండగ మారాముసేసే
అంతట మా తప్పిదము తెలిసికొని నిను దర్శించి
నీ క్షమాపణ కోరినంతనె మరల మా ప్రయాణము కొనసాగి
మారుతికి పూజ సల్పి నీ మహిమ
కొనియాడుచూ గృహమునకరుదెంచినామయ్య
ఏమని వర్ణింతు నీదు మహిమలు?
సంకల్పించినంతనే సమయానుక్రమముగా
పనులు చేయకున్న నీకు కలిగెడు కోపమెంతయో మిన్న!
అటుల కోపమొందక మము కాపాడి
నాకు కలిగిన వ్యాధి తొలగించుమయ్య
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
కరుణించి నను కావుమయ్యా!
మూలాధార శక్తికాధరభూతుండవై,
సకల జనుల వాక్ప్రాణశక్తికాధారనెలవుండవై,
త్రిగుణాత్మక తాపత్రయాదులనుపశమింపగా చేసి,
సమలోష్టకాష్మకాంచనంబగు స్థితప్రజ్ఞత నొసంగజేసి,
సాత్వికంబగు సకల భూతదయాస్వాదితంబగు జ్ఞానసిధ్ధి
ప్రసాదింపుమని నే వేడుకొందునధిపా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి