25, మార్చి 2017, శనివారం

వందే 'మా' తరం

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః


వందే 'మా' తరం

శ్రీ మహాలక్ష్మిని భారతావనిలో 
జ్యేష్టాదేవి ఆవహించినటుల
          అష్టమీ తిథినాడు అష్టలక్ష్ములలో
          ఒకతెయైన ధనలక్ష్మికిలనందు
ఆకశ్మికంగా అష్టకష్టాలు అనుకోని రీతి
ఆరంభమై ప్రజలనెల్లరలను ఒక్కవేటున
          పాలకుల కలంపోటుతో పక్కదారి
          పట్టిన పెద్దనోటును చీకటి మాటున
లెక్కించ వీలులేని నల్లధనానికి వెలుగుజూపు నెపాన
ఏకహస్త ద్విహస్త శతనోట్లను చెలామణిలో
          లేకుండగ రద్దు పరచి కమలపాలకులు
          దేశప్రజలకు ఒక్క కుదుపునిచ్చి కునుకు
లేక ఆలోచనలకు అంతులేక వేటుపడ్డ 
వేయినోటును అప్పటివరకు కళ్ళకు అద్దుకుని
          కడుపుకట్టుకుని కష్టపడి సంపాదించి
          రూపాయిని పాపాయిలా పెంచి శతాలుగా
మార్చి, పదిశతాల నొక్కటిగా చేసి ఆనాడు
గర్వించి, నేడు దానిని అంటరానిదానిలా
          చూచి, హృదయానికి హత్తుకొనకనే హడావుడిగా
          చేతబూని అర్ధరాత్రి 'చిల్లర శ్రీమహాలక్ష్మి'కై
ఏ. టి. యంల చుట్టూ తిరిగి శీతాకాలంలో
శరీరానికి నడివేసవి ముచ్చెమటలు తెచ్చుకుని
          కృషితో నాస్తి దుర్భిక్షమనుకుని వేయిని
          వందలుగా మార్చి, ఆ వందలను హృదినొక్కి
వందవందకు వందనాలర్పించి వందేమాతరమని
స్వాతంత్ర్యపోరాట పటిమనుద్దీపింపజేసిన
          1882వ వత్సరాన బంకిం చంద్ర గీతాన్ని
          1896వ వత్సరాన రవీంద్రుని ముఖతః వెలువడగ - అప్పటి ఆర్ధికస్థితికి వంద రూపాయలే మిన్నగానుండగ తదనంతర
దశాబ్దాలలో వేయినోట్లనచ్చొత్తించి
          ఆర్ధికవేత్తలు వేయేళ్ళు వర్ధిల్లమనిరి!
          అలా ప్రవర్ధమానమగుచు రూపురేఖలు
మారుతూ తన గతాన్ని, గీతాన్ని వరుస
మారిందంటూ ఒక సినీకవి వ్రా'సినారె'!
          నేడదే నిజమై వేయి నోటు వందముందు
          సాగిలపడి దశాంగంగా విడివడి ఈ తరానికీ
'వందే' మాతరం అయి మరల వంద నోట్లకు
తహతహలాడుతూ ధనాగారాలకు
          వరుసలు కట్టి చిల్లర చిక్కులలో చిక్కితే
          చిల్లర శ్రీమహాలక్ష్మి చిర్రుబుర్రులాడుతోంది!
పెద్దలమాట 'చిల్లరశ్రీమహాలక్ష్మి' యని
ఈ తరానికి రుజువు పరచి తన ఉనికి నిల్పింది.
          ఈ నాడు సర్వజనులకు అవసరమయ్యింది.
          "తం వందే సాత్వికం శివం" 

ఇదీ బడుగు జీవి నోట్లకై అగచాట్లు.

ఆ నాడు స్వాతంత్ర సిధ్ధికి వందే మాతరం
 
ఈనాడు ఆర్ధిక సఫలతకు 'వందే' మాతరం 


8-11-16 అష్ఠమి తిథినాడు ఐదువందలు, వెయ్యి నోట్లు ప్రభుత్వం రద్దు పరచిన సంధర్భాన 12-11-16న వ్రాయబడినది.

 పోలూరు బాబురావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి