31, జులై 2014, గురువారం

హేమజ్యోతి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

హేమజ్యోతి


ఎక్కడో మహబలేశ్వరాన పుట్టి 
కొండ కోనలనెల్ల పలుకరించి తట్టి 
జన వాహినిని నిదుర లేపి తను సాయమై 
వ్యవసాయంబు చేయించి పరుగులిడి 
అలసి సొలసి సేద దీర్చుకొను నెపాన 
కనకదుర్గమ్మ వొడి చేరి విజయవాటికన 
ఆగి దాహార్తులకు దాహంబు దీర్చు 
తపనతో ప్రాణప్రదమైన జీవనాడియగు 
షుషుమ్న రూపాన కాలువై హేలాపురీ 
ప్రదేశాన కాలూని తులసివన సస్యశ్యామలము జేసి 
ఆ వన సహచరుడగు శ్రీవత్స సత్యవీరరాఘవుని 
నాశీర్వదించి దంపతుల గావించి ప్రతిఫలాపేక్ష లేని 
గొల్లపూడి కుటుంబ పరంపరాభివృధ్ధి 
గావించు నెపాన నీ జలధార జీవధారయై 
నిస్వార్ధసేవితయగు కృష్ణవేణమ్మకివే
మా నమనుస్సుమాంజలులు!

అట్టి తులసిసత్యవీరరాఘవుల స్నేహలత 
చిహ్నానికి ప్రతిఫలంబుగా ద్వితీయపట్టిగా 
హేమప్రకాశ శోభిత శరీరచ్ఛాయతో జన్మంబున్నొంది 
శరీరాకృతికి తగిన నామమగు హేమలత 
యను నామకరణముతో తల్లిదండ్రుల
నానందడోలికల నూగించి బాల్యదశ 
నంతటిని పవిత్ర కృష్ణా నదీ తీర నాగాయలంక 
పట్టణాన పూరించి తన ద్వితీయ సోదరుడగు 
శ్రీకేశవుండు వదిన సీతారాముల ప్రాపకములో 
న్యాయవాదిగానుండు నూజివీడు 
పట్టణాన స్థిరనివాసము పొంది పాఠశాల 
విద్యనభ్యసించి తను కన్న కల నెరవేర్చుతపనతో 
తనకత్యంత ప్రీతిపాత్రమగు మాతృభాషా 
పండితయై పదుగురికి వాగ్దేవి 
తనకొసంగిన అమృతతుల్యమగు వాక్సుద్ధి 
ప్రదాతగా ఒక గురువుగా రాణించు 
కాంక్షతో తెలుగు పట్టా సాధించి 
తదుపరి దైవానుగ్రహాన మొట్టమొదటి 
ప్రభుత్వోద్యోగియై తాబుట్టినింటి మెట్టిన 
పోలూరు వారి కుటుంబ ఆశాజ్యోతియై 
నియమబద్ధ నిరంతర శ్రమ జీవియై 
భర్త మాటనే తన భావనగా 
సహధర్మచారిణియను పదానికి న్యాయంబొనర్చి 
అనంత వొడిదుడుకుల జీవనగమ్యములో 
కష్టాలకడలినీది, సుఖాలనొడిచేరి 
అలసి సొలసిన ఆకృతితో అలుపెరగని 
తన అకుంఠిత దీక్షకివే మా నమోవాకాలు!

మాతృధర్మ నిర్వహణలో ఇరువురు బిడ్డలకు 
తల్లివై  అటు ఉద్యోగ ఇటు కుటుంబ 
బాధ్యతల విస్మరించక నిరంతర చిరునగవుతో 
తను పనిచేసిన పాఠశాలల అధికారుల 
మెప్పు పొందుటయేగాక విద్యార్ధుల ఆదరణ 
పొంది వారి మనసులతో మమేకమై 
మన టీచరుగారనే భావన కలిగించి 
దాపరికములేని హృదయపూర్వక ఆదర 
ఆప్యాయతా పలకరింపులతో వివిధ ఆట పాటలతో 
పిల్లల మనసు చూరగొన్న మహోపాధ్యాయిని యామె! 
గోవుకన్న మిన్నయగు సాత్వికత కూడగట్టుకుని 
జన్మభూమికున్న వోర్పునంతటిని సంతరించుకుని 
నిరంతరమా రెండింటి నాదర్శమగా జేసికొని 
హేలాపురిని తన సంతకములో "గొహేల"
యని ఇముడ్చుకుని కుటుంబము కాంతివంతం 
చేయు చిరు దివ్వెవై తను నిక్కముగ మా హేమజ్యోతియై 
అలరారుచు తన భావిజీవితము 
నిరంతర శోభాయమానముగా 
విలసిల్లు గావుతాయని వాక్కులతల్లి 
యగు శారదామాతను మనసా ప్రార్ధిస్తున్నాము. 


భక్తి శ్రద్ధలతో 

కుమార్తె: శేష శైలజ                                                      కుమారుడు: వెంకట నాగ ప్రవీణ్ కుమార్
అల్లుడు: శేషగిరి రావు, యు.ఎ.ఇ                                       కోడలు: లక్ష్మీ కాత్యాయని
మనవడు: అశ్వని కుమార్                                               మనుమరాలు: జోతికా మనస్విని

ఈ అభినందన కవిత నా సహచరి శ్రీమతి గొల్లపూడి హేమలత ఉద్యోగ విరమణానంతరము 2007 సంవత్సరములో వ్రాయబడినది.

పోలూరు బాబూరావు, నూజివీడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి