7, ఏప్రిల్ 2016, గురువారం

దేశ భక్తి గేయం

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః
 
 దేశ భక్తి గేయం
 
జయ జయ జయ హిందు మాత
శుభధాత్రి భరత మాత
జయ మంగళమూర్తి ధరిత్రి
జయమునొసగు సకలజనతకు

ఆసేతు హిమాచలం
అభివృధ్ధి కాంక్షతో
సర్వదా నిను సేవించు
జనగణంబు మెప్పు పొందు!
అస్సమీయులు తైలసంపదతో
దేశానికంతకు వెలుగులీనుచుండ
పంజబీయులొకవంక పంట పండించ
పదుగురకు బాసుమతి బోనాలు పెట్టంగ
గుజరాతీ బెంగాళీలు వస్త్రాలే సమకూర్చి
సర్వజనుల సిగ్గు నివారించుచుండ
కంచి బనారసుల చేలములే నీకర్పించువేళ
నర్మద కృష్ణ గోదారుల పాద్యంబులుందెచ్చి
నీ పాదములు కడిగి పట్టు వస్త్రంబులే భక్తితో నీకర్పింతుమమ్మా! 
తల్లి భారతి నీకిదే వందనమమ్మా!

త్రికోణమితిగా త్రిసంద్రములే
నీటికోటలై సదా దేశ రక్షణచేయ
తెలుగు పౌరుషాగ్ని తేజరిల్లుచుండ
దేశభక్తి తపనలో తేలియాడుచుండ
ద్రవిడోత్కళ కన్నడ మాళవీయులంతా
ధైర్యముగా సహకరింపంగ
ముంబై రూపాయి ముద్దుగా పెరిగి
గంగ యమునల చల్లదనమువోలే
సకల జనుల చల్లంగ చూడు తల్లీ! 

జయ జయ జయ హిందు మాత
శుభధాత్రి భరత మాత
జయ మంగళమూర్తి ధరిత్రి
జయమునొసగు సకలజనతకు
 
We should love India, and let others love India.
 
 పోలూరు బాబూరావు, నూజివీడు

గణేశ షోడశ నామ వైశిష్ట్యమ్

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

గణేశ షోడశ నామ వైశిష్ట్యమ్

ఓం వినాయకాయ - వినాయకాయ!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

సృష్టికి నాందిగా అగ్నిరూపిగా - బ్రహ్మకు దర్శనమిచ్చితివయ్యా!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

కమలాసననునికి ప్రణవ మంత్రము బోధించితివయ్యా!
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

ఓంకారములో జగతికి జీవము పోసితివయ్య
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ ప్రసన్న వదనము చూచినంతనే
మా పాప హరణమే జరుగునయా
ఓం సుముఖాయ నమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ ఏకదంతమునే దర్శనమొందిన
మా అహంభావమే తొలగునయా
ఓం ఏకదంతాయనమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

నీ కృష్ణపింగాక్ష రూపుతో నీ దయనే చూచెదమయ్యా
ఓం కపిలాయనాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

ఘీంకారంలో ఓంకారాన్ని తెలిపితివయ్యా
వేద సారమే వినిపించి మా ఆదిగురువు నీవే
య్య
ఓం గజకర్ణికాయ నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

భక్తుల తప్పులు కాచే నెపముతో
బొజ్జ గణపతిగ నీవుంటివయ్య

ఓం లంబోదరాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 


 నీ హాస్య రూపమే దర్శనమొంద చిరు దరహాసమే కలుగునయ
సర్వ దేవ గణాలకు హాస్యాదిపతివి నీవ
య్యా 
ఓం వికటాయనాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

మా కష్ట నష్టాలు తీరుప జేసే విఘ్నాధిపతివి నీవేనయ్య
ఓం విఘ్నరాజాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

సమస్త గణాలకు అధిపతిగా సర్వ శుభములే కలుగనీయవయ
ఓం గణాధిపతయై నమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

నీ సిందూరమే మంగళకరమగు మహిళలు పాపట ధరియింతురయ
కేతుగ్రహ బంధనాలను ఛేధించుమయ
ఓం ధూమకేతవేనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సకల గుణ పాలవెల్లివై సర్వజన పూజితుడవయ్యావయ్య
ఓం గణాధ్యక్షాయ నమః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

శాపగ్రస్తుడైన చవితి చంద్రునిపై
దయ చూపి ఫాలభాగాన ధరియించితివయ్య
సదా చల్లంగా మము కాపాడుమయ్య
ఓంఫాలచంద్రాయన
మః  ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః

మా మనోబుధ్ధి శక్తులకు సిధ్ధి చేకూర్చి
మా క్రియలకు శుధ్ధి కల్పించుమయా
ఓం గజాననాయ నమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

ముదముగా దీవెనలిచ్చే నీ తొండముతో
జ్ఞానసిధ్ధి ప్రసాదించుమ
యా 
ఓం వక్రతుండాయ నమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సర్వ జన వినతులు నీ పెద్ద చెవుల విని
మేళ్ళు చేకూర్చి మమ్మాదరించుమయా
ఓం శూర్పకర్ణాయనమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సదా మాతా పితరుల సేవించు
నీ అడుగు జాడలే మాకాదర్శమయ
ఓం హేరంబాయనమః   ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

కుమారస్వామికి అగ్రజుండవై
సర్వతీర్థ స్నాన పుణ్యఫలమొంది
విఘ్నాధిపతివి అయినావయ
ఓం స్కందపూర్వజాయనమః ఓం గణేశ్వరాయ నమః
ఓం గం గణపతయై నమః ఓం గణేశ్వరాయ నమః 

సకల పుణ్యకార్య తొలివేలుపుగా
హరిద్రాగణపతిగ నీ షోడశనామపూజలే గైకొనుమయ్యా
వినాయకాయ వినయకాయ నమః

ఓం గణేశ్వరాయ నమః ఓం గం గణపతయై నమః
ఓం శాంతి శాంతి శాంతిః 
సర్వే జనా సుఖినోభవంతు సకల శుభ పాప్తిరస్తు!


(ఇతి నమః శివాయ అను పాట బాణీకి కూర్పు)

పోలూరు బాబూరావు, నూజివీడు

స్వఛ్ఛతవైపు చూపు

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

స్వఛ్ఛతవైపు చూపు

నీ చూపు నా చూపు
కలగలిపి దేశ దిశ చూపు
శ్రమ చేసి చూపు
అందాల స్వఛ్ఛ చూపు
ఆనందాల జన కంటి చూపు
స్నేహ భావన చూపు
పదుగురకు మంచి చేసి చూపు
పరిశుభ్రత చేసి చూపు
పరివర్తన తెచ్చి చూపు
అంతా కలిసి రోత మాపి చూపు
భరత మాత భావి చూపు

న్యాయానిది గుడ్డి చూపు
సాక్షిది డబ్బు చూపు
కక్షిదారు ఓపిక చూపు
న్యాయవాది నల్ల జేబు చూపు
అందరి చూపు ధర్మ దేవత వైపు
ఆమె చూపు జాలి చూపు
కళ్ళకున్న నల్లగుడ్డ విప్పి చూపు
ధర్మాన్ని నిలిపి చూపు
 
సత్యాహింసలే గాంధి పిలుపు
ఆరోగ్యం శుభ్రత బాపు
చూపు
బాపు లోచనాలు ఆలోచనలకు దారి చూపు
అది స్వఛ్ఛ భారత వైపు చూపు

శుచి-శుభ్రత.....సత్యం-అహింస.....న్యాయం-ధర్మం



పోలూరు బాబూరావు, నూజివీడు
మార్చి 28, 2015

సరస్వతీ స్తుతి



శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

సరస్వతీ స్తుతి
ఓం శ్రీం ః హ్రీం ః సరస్వత్యైనమః
     
     తల్లీ! భారతి సరస్వతీ
     ప్రాణోదేవీ వందనమమ్మా!


          నమో శ్రధ్ధా దేవీ వాజినీవతీ
          శ్రధ్ధనొసగి శుధ్ధ మనసుతో
          మా సంకల్పాలే జయమగుగాక!

      పవిత్ర ధారణ మేధా శక్తిని మాకిచ్చి
      మంచి మాటలతో వాక్శక్తినే సమకూర్చి
      మమ్ముల జాగృతి చేయుము తల్లీ!

          నీ కృపా కటాక్షములు మాపై జూపి
          జ్ఞాన బుధ్ధి మనో శక్తి ప్రసాదించుమమ్మా!
          మా జిహ్వాగ్రాన సదా నిలిచి
          వికసిత వదనయై మము శ్రేయోదాయుల చేయుము తల్లీ!
     
     సకల విద్యలకు మూలాధారవై 
     ప్రాణ శక్తియగు ఆత్మజ్యోతికి కాంతినొసగే 
     సర్వసారస్వత స్వరూపిణిగ కొలిచెదమమ్మా! 
          
          క్షీరనారముల వేరుపరచు హంసవాహనారూఢవై 
          అంతర్లీనవై మా క్రియలలో పాలు పంచుకొని 
          సుఖసంపదల నొసగు గావుతయని  
          నిత్యము నిన్నే తలచెదమమ్మా! 

(ఇతి శ్రీపంచమినాడు 24-01-2015న నూజివీడు శ్రీ జ్ఞానసరస్వతీ దేవికి అంకితం) 

పోలూరు బాబూరావు, నూజివీడు

31, జులై 2014, గురువారం

హేమజ్యోతి

శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ రాజరాజేశ్వరీదేవి నమః

ఓం శ్రీ మాత్త్రేనమః                               శ్రీ అపర్ణాయైనమః                         శ్రీ లలితాంబికాయైనమః

హేమజ్యోతి


ఎక్కడో మహబలేశ్వరాన పుట్టి 
కొండ కోనలనెల్ల పలుకరించి తట్టి 
జన వాహినిని నిదుర లేపి తను సాయమై 
వ్యవసాయంబు చేయించి పరుగులిడి 
అలసి సొలసి సేద దీర్చుకొను నెపాన 
కనకదుర్గమ్మ వొడి చేరి విజయవాటికన 
ఆగి దాహార్తులకు దాహంబు దీర్చు 
తపనతో ప్రాణప్రదమైన జీవనాడియగు 
షుషుమ్న రూపాన కాలువై హేలాపురీ 
ప్రదేశాన కాలూని తులసివన సస్యశ్యామలము జేసి 
ఆ వన సహచరుడగు శ్రీవత్స సత్యవీరరాఘవుని 
నాశీర్వదించి దంపతుల గావించి ప్రతిఫలాపేక్ష లేని 
గొల్లపూడి కుటుంబ పరంపరాభివృధ్ధి 
గావించు నెపాన నీ జలధార జీవధారయై 
నిస్వార్ధసేవితయగు కృష్ణవేణమ్మకివే
మా నమనుస్సుమాంజలులు!

అట్టి తులసిసత్యవీరరాఘవుల స్నేహలత 
చిహ్నానికి ప్రతిఫలంబుగా ద్వితీయపట్టిగా 
హేమప్రకాశ శోభిత శరీరచ్ఛాయతో జన్మంబున్నొంది 
శరీరాకృతికి తగిన నామమగు హేమలత 
యను నామకరణముతో తల్లిదండ్రుల
నానందడోలికల నూగించి బాల్యదశ 
నంతటిని పవిత్ర కృష్ణా నదీ తీర నాగాయలంక 
పట్టణాన పూరించి తన ద్వితీయ సోదరుడగు 
శ్రీకేశవుండు వదిన సీతారాముల ప్రాపకములో 
న్యాయవాదిగానుండు నూజివీడు 
పట్టణాన స్థిరనివాసము పొంది పాఠశాల 
విద్యనభ్యసించి తను కన్న కల నెరవేర్చుతపనతో 
తనకత్యంత ప్రీతిపాత్రమగు మాతృభాషా 
పండితయై పదుగురికి వాగ్దేవి 
తనకొసంగిన అమృతతుల్యమగు వాక్సుద్ధి 
ప్రదాతగా ఒక గురువుగా రాణించు 
కాంక్షతో తెలుగు పట్టా సాధించి 
తదుపరి దైవానుగ్రహాన మొట్టమొదటి 
ప్రభుత్వోద్యోగియై తాబుట్టినింటి మెట్టిన 
పోలూరు వారి కుటుంబ ఆశాజ్యోతియై 
నియమబద్ధ నిరంతర శ్రమ జీవియై 
భర్త మాటనే తన భావనగా 
సహధర్మచారిణియను పదానికి న్యాయంబొనర్చి 
అనంత వొడిదుడుకుల జీవనగమ్యములో 
కష్టాలకడలినీది, సుఖాలనొడిచేరి 
అలసి సొలసిన ఆకృతితో అలుపెరగని 
తన అకుంఠిత దీక్షకివే మా నమోవాకాలు!

మాతృధర్మ నిర్వహణలో ఇరువురు బిడ్డలకు 
తల్లివై  అటు ఉద్యోగ ఇటు కుటుంబ 
బాధ్యతల విస్మరించక నిరంతర చిరునగవుతో 
తను పనిచేసిన పాఠశాలల అధికారుల 
మెప్పు పొందుటయేగాక విద్యార్ధుల ఆదరణ 
పొంది వారి మనసులతో మమేకమై 
మన టీచరుగారనే భావన కలిగించి 
దాపరికములేని హృదయపూర్వక ఆదర 
ఆప్యాయతా పలకరింపులతో వివిధ ఆట పాటలతో 
పిల్లల మనసు చూరగొన్న మహోపాధ్యాయిని యామె! 
గోవుకన్న మిన్నయగు సాత్వికత కూడగట్టుకుని 
జన్మభూమికున్న వోర్పునంతటిని సంతరించుకుని 
నిరంతరమా రెండింటి నాదర్శమగా జేసికొని 
హేలాపురిని తన సంతకములో "గొహేల"
యని ఇముడ్చుకుని కుటుంబము కాంతివంతం 
చేయు చిరు దివ్వెవై తను నిక్కముగ మా హేమజ్యోతియై 
అలరారుచు తన భావిజీవితము 
నిరంతర శోభాయమానముగా 
విలసిల్లు గావుతాయని వాక్కులతల్లి 
యగు శారదామాతను మనసా ప్రార్ధిస్తున్నాము. 


భక్తి శ్రద్ధలతో 

కుమార్తె: శేష శైలజ                                                      కుమారుడు: వెంకట నాగ ప్రవీణ్ కుమార్
అల్లుడు: శేషగిరి రావు, యు.ఎ.ఇ                                       కోడలు: లక్ష్మీ కాత్యాయని
మనవడు: అశ్వని కుమార్                                               మనుమరాలు: జోతికా మనస్విని

ఈ అభినందన కవిత నా సహచరి శ్రీమతి గొల్లపూడి హేమలత ఉద్యోగ విరమణానంతరము 2007 సంవత్సరములో వ్రాయబడినది.

పోలూరు బాబూరావు, నూజివీడు

30, జులై 2014, బుధవారం

వృక్ష విలాపం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

వృక్ష విలాపం


1)  ఒక శరదృతు శీతవేళ చిరుగాలి తాకిడిలో
     నేనొక చిన్ని మొక్కగ తల్లి వేరుతో
     కులుకుతుండంగ అప్పుడప్పుడే
     నా పిల్లవేరు నాటుకొనుచుండ
     ఒక బంగారు లత నాపై మనసు పొంది
     తన పెరటిలో నాటుకొన తలచినంత
     నే గ్రహించి వ్యధ చెందు సమయాన
     ఆ వెండి వెన్నెల జిలుగు రాత్రి
     గుబులుతో నున్న నను నా తల్లి చూసి
     నన్నూరడింప ప్రయత్నంబూని
     నంతలో ఆ రాత్రి భళ్ళున తెల్లారి
     అరుణ కాంతులతో ఆదిత్యు పైపైకి రాగ
     నా వియోగ బాధ ఆ ప్రత్యక్ష దేవునికి
     తెల్పుకొనునంతలో ఆ యెలనాగ
     నన్ను పెకలింపు కొననెంచి తవ్వుగోలతో
     గాతంబు సేసి నా తల్లి వేరుతో
     నను వేఱు చేసె! నే గోల చేసి ఘొల్లు మనగ
     ఒకపరి తన మృదుకరముతో వూరడించి 
     ఉదాట్టున నను లాగి, వేరు చేసెనే జాలిలేక
     ఆహా! ఈ పడతి ఎంత పగ బట్టినాదో 
     నా బ్రతుకు పైన - అకటా!

2)  అంతట యామె తన గృహాన గొంపోయి 
     పెరటిలో చిన్న కలుగు చేసి
     నన్నందుయుంచి చుట్టూ కుదురు చేసి 
     కాసిన్ని నీరు చిలికించి నా సేదదీర్చి 
     ప్రతిదినమటుల నను ప్రత్యేకముగ జూసి 
     బియ్యంపు కుడితితో బలము కూర్చి 
     నేనెదుగుతూ వ్రేళ్లూని నిలదొక్కుకుని 
     మారాకు తొడిగి చుట్టు పక్కల జూచినంత 
     నాటి కవి కరుణశ్రీ జాలిగొన్న సన్నజాజి తీగ కాంచినంత 
     నే కొండంత ధైర్యమ్మునొంది నను దెచ్చిన తల్లి 
     నాల్గు కాలాలు నను గాచుకొందునని మురిసిపోతి!
     అప్పటి నుండి మా యిరువురకు చెలిమి కుదిరి 
     తన పూల ఘమఘమల నేనాస్వాదింప
     నా చిగు రెమ్మల ఘుమఘుమలు నేనందివ్వ 
     అంతలోనే శిశిరమ్ము వచ్చి నా చిగుళ్ళు 
     లేత బంగారు వర్ణంబూని ఈనెలూడి 
     నేల రాలుచున్న వైనంజూచి కలవరము చెంది 
     పది దినములటులే ఉపవాసముండి 
     వసంత ఋతు రాకతో మరల చిగిర్చి లేలేత పచ్చదనము
     ప్రోది చేసుకుని నిండార కంచి పట్టుచీర గట్టిన 
     వసంత లక్ష్మీ వోలె గుబురుటాకులతో 
     నిస్వార్ధ సేవకై వేచి వొదిగి వున్నానాయింటిలో. 

3)  సాత్వికత మూర్తీభవించిన ఆ యింతి 
     మేడ మెట్లపై జిగిబిగి పొదలతో 
     అల్లుకున్న తీగలో సన్నజాజులు కొనగోట 
     త్రుంచి కూర్చి చక్కటి సుమాహారముగ జేసి 
     తన దేవతామందిరాన అమ్మనలంకరింప
     ఆహా! ఎంత ధన్యమైనదో నా చెలియ జన్మ!
     అని తలచినంతనే యామె నా కడకు వచ్చి 
     చివాలున కొమ్మ వంచి కొన్ని రెబ్బలను త్రుంచి 
     తన వంటకములలో నను జేర్చి అమ్మ నివేదనకు 
     అంతా సిద్ధపరచి నైవేద్యమిడగా 
     ఆహా! నా జన్మ కూడా ధన్యత జెంది 
     నా దేవదేవికి చక్కటి సమాహారముగా 
     సమకూరితిగదా! యని సంతసించ 
     అదేమి శాపమో! పళ్ళెరములో వడ్డించగానే 
     నను చూడగానే మునివేళ్ళతో వెతికి 
     తీసి పారవేతురకటా! ఆవగింజంత 
     మాత్రంబు చేయనైతినని వ్యధ చెందుచుంటి 
     ఏమిటో!ఈ మనుజుల తత్వంబు తెలియకుంటి!
     నిస్వార్ధ పరుల సేవలకు గుర్తింపు కరువాయెనయ్యో!
     అందుకే నేమో నేను వెర్రి కరివేపనై - వేపకు  మారుపేరైతి!!
     అటుల విలాపము చెంద విశ్వపతి కరుణించి 
     పవిత్ర మనుజ రక్షణతో శాప విమోచన 
     కల్గునని "వృక్షో రక్షతి రక్షితః" యని సూక్తినుడివే!!


"Mustard in a dinner plate" అనే proverb ఆధారంగా పై భావన చేయబడింది. 

Responses are welcome and appreciated. 



పోలూరు బాబురావు, నూజివీడు

2, ఏప్రిల్ 2014, బుధవారం

గుండె గొంతుకలో ... అభిసారిక




మగువకు కురులే అందం
ప్రియునికి జత జడ బంధం
వాలు కనుల సఖి చూపులో
వీలుకల కాంతుని అనుబంధం







ఈనాడు పత్రికలో 'గుండె గొంతుకలో' శీర్షికకు
పోలూరు బాబురావు, నూజివీడు