24, జూన్ 2012, ఆదివారం

శంకర స్తోత్రపటిమ


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః 


ఆర్ష సంస్కృతి అభ్యుదయ పధాన పయనించు వేళ
ఆశ్చర్యకరముగా శంకరుని దయతో కాలడి గ్రామాన
పుణ్య దంపతులకు పుత్రోదయము కల్గి శంకరాచార్య 
నామధేయముతో హైందవ మతోధ్ధరణము చేయ బూని
పిన్నవయసుననే సన్యాసమంది బ్రహ్మచారిగా జీవనక్రియ
ఆచరించు ప్రక్రియలో ఒకనాడు భిక్షాటనకేగి
ఆ యెలనాగ గృహమున్గిట నిలిచి భిక్ష యడుగ
కడుపేదయగు ఆ గృహిణి మరి మరి వెదకి
ఉసిరికాయనొకదానిన్దెచ్చి పాత్రయన్దుంచ 
కుమారశంకరుడదిగాంచి కరుణనుప్పొంగంగ 
ఆ తల్లి పేదరికము బాపుటకై జగజ్జనని 
శ్రీ మహాలక్ష్మినిన్ తలచి
"ఓం శ్రీం హ్రీం క్లీం ఐమ్ సోం శ్రీ మహాలక్ష్మీ నమః"
యని తలచి, కనకధారా స్తోత్రంబు పఠనముచేయ 
మరుక్షణమే ఆ గృహాన కనకవర్షంబు కురిసె.
ఇవ్విధంబుగా సకల దేవతా స్తోత్రంబులున్ కూర్చి
ఆది శంకరులు స్తోత్ర రాజముగా కనకధారా
స్తోత్రమును వర్ణించి, ఎవరు పారాయణమొనర్తురో వారికి
వారున్న రంగాన ధనమేగాక నానావిధాభివృధ్ధి చెందురనియెన్


ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా



పోలూరు బాబురావు, నూజివీడు

బంధు ధర్మాలు


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః 


అజ్ఞానపు మేలి ముసుగు
తొలగనిదే మనిషికి
విజ్ఞాన బీజమంకురించి
తరుశాఖల ఫలాలనిచ్చి
సుజ్ఞానవంతునిగా మలచి
జీవనచక్ర వాహినిలో
అజ్ఞానాంధకార లంపటము వీడి
శాంతి సౌఖ్యముల పొందవలెనేని 
ప్రాజ్ఞుడై విషయాసక్తుల
మోజులో దాగిన మనసును
ప్రజ్ఞతో నదుపుజేసి నిక్కంబగు
సత్యాన్వేషిగా కృషి సల్పవలె.
సంసార జలధిలో తాపత్రయాదులతో 
సంకరమగు జీవన స్థితి గతులలో ఓలలాడి 
సమ్పూరతమగు బాల కౌమార యవ్వన వృద్ధాప్యంబుల
దాటి మరణమాసన్నమగు వేళ
మంచిగ మనమున నారాయణుని తలపక 
ముందర జరిగినదంతయు తన ప్రజ్ఞయని
అందరి కష్ట సుఖములు నరక స్వర్గములని

భ్రమించి బంధు జనులె తన ఆత్మీయులని
జీవనంబు గడిపెడువానికి మోక్షంబెలాగు లభించునయా!
బంధు ధర్మాలు సదా పాటించవలెనయా!
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా

తల్లి: సత్యం, సత్యస్వరూపం;   తండ్రి: జ్ఞానం;   భార్య: శాంతి; 
సోదరుడు: ధర్మం;   పుత్రుడు: ఓర్పు;   స్నేహితుడు: దయ, మంచి హృదయం. 


పోలూరు బాబురావు, నూజివీడు

శ్రీ విఘ్నేశ్వర దండకం


ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః
ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః



శ్రీ విఘ్నేశ్వర దండకం


శ్రీ మాత్త్రేనమః                                                          శ్రీ అపర్ణాయైనమః
శ్రీ లలితాంబికాయైనమః 

ఓం శ్రీమాతాతనయున్డవై   సర్వభూతహితప్రదాయున్డవై నూజివీటి గట్టు మీద గణపతిగా సుప్రసిద్ధుండవై  బందూక పుష్ప వర్ణ ప్రకాశమానమై   ఈశాన్య దిశాభి ముఖున్డవై   ఉషోదయ అరుణ కిరణ రంజితుడవై   నిత్య శోభాయమానున్డవై   సకల జన కార్య సిద్ధి సాఫల్యము చేయు మహా విఘ్నేశ్వరున్డవై    క్రియా సిద్ధి సత్వే భవతి యని మ్రొక్కిన వారికిన్, అభయంబునిచ్చి  ఒజ్జయైయుండి మనమునందే వశించి, నిరతము సద్బుద్ధినిచ్చి, దుష్ట శక్తులన్ హరించి, యెల్ల వేళలన్ మా యుల్లంబందుండి మాకు గల్గు భయాందోళనలు రూపు మాపి, శారీరక మానసిక రోగంబులన్ మాపి, నిత్య ఆయురారోగ్య ఐశ్వర్యదాయులంజేసి,   ఓంకార స్వరూపుడవగు నీ భక్తి తత్పరతలో మమ్మోలలాడించి మూలాధార చక్రకాధారభూతున్డవై  సర్వజ్ఞుండవై  సమలోష్టకాశ్మకాన్చనంబగు సద్జ్ఞాన సంపదల్మాకొసంగి, మమ్ము స్థిత ప్రజ్ఞులన్ గావించి సదా మీ భక్తి చింతనను కలిగించుమయ్య యని ఓ పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలసాయవగు నినున్ నుతి చేయ అనుమతీయ వేడెదన్.


నమస్తే: నమస్తే: నమః
ఓం గం గణపతయై నమః 


ఓం గం సిద్ధి గణపతయే సిద్ధిందేహీ సిద్ధి స్వాహా

ఓం శ్రీం గం సంకట విఘ్నేశ్వరాయ నమః స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం గం శ్రీ లక్ష్మీ గణపతయై నమః

ఈ దండకమునకు భావ వ్యాఖ్య ఇచ్చట లభించును విఘ్నేశ్వర దండకం - భావ వ్యాఖ్య
పోలూరు బాబురావు, నూజివీడు

19, జూన్ 2012, మంగళవారం

స్వధర్మము

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


యుగమునకొక తీరున మానవ మనుగడ యుండగ
కలియుగ మానవ యునికిని విష్ణు పురాణంబందు
ఆ పరాశర, మైత్రేయ సంభాషణమే విశద పరచి
కలియుగ మానవ జీవన పయనము ఎటుల యుండునో తెల్పిరి

కలియుగమున మానవులు మాయా పీడితులై నిర్గుణ
పరమాత్మను తలచు వ్యవధి లేక ప్రాపంచిక విషయాసక్తుల
మునిగి, అవినీతి, అసూయ, ఈర్ష్యలకు లోనై,
"ధనమూల మిదంజగత్" యని భ్రమపడి
నీతి సూత్రములనెల్ల పాటింపక
అధర్మవర్తనులై మెలగుదురనియె.

ద్వాపర యుగాంతమున ఆ శ్రీహరి వైకుంఠము జేర
పరీక్షితుడను రాజు పాండవ పరిపాలకుడాయె.
ఆతడు ధర్మ పరిపాలనము జేయుచుండ
ఒక నాడు వేటకై బోవ, ఆంగీరస మహాముని
తపస్సులో నుండంగ, తన దాహము తీర్చుమని
యడుగంగ ఆతండు మిన్నకుండె!
రాజు కోపోద్రిక్తుడై ఒక చచ్చిన పాము నాతని మెడలో వేసి చనియె.
అంత మునికుమారుడు చూచి ఏడు దినములలో
రాజు మరణము కలుగునని శపియింప ఆ విషయము
తెలియక ఎవరి ధర్మంబు వారు పాటించినట్లైనదని
ముని తన కుమారునకు తెల్పి రాజు ధర్మ పరుడని తెల్పె.

తప్పు చేసిన వాడు తన తప్పు గ్రహించి ఒప్పు చేయుటకు
ఒప్పుకొనుటయే సర్వ ధర్మములోకెల్ల మిన్నయను ధర్మంబునే
ఋషీశ్వరులు ఆశ్రయించిరను విషయము తెలియవలయు.
ఇది పరమ గురుడు చెప్పిన మాట వినుకోరా పామరుడా!


పోలూరు బాబురావు, నూజివీడు

స్థిత ప్రజ్ఞత

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఆశల కుహరము జొచ్చితివేని
మోసులు తప్పవు ఎన్నటికేని!
ఆశల మోసులు విడవలెనంటే,
ఆశల ఊసులు తలుపక వుంటే,
ఆశయ సిద్ధియే జీవనవృద్ధియగు!

ఆత్మనిగ్రహంబడవలెనన్న
తాత్విక చింతనతో భక్తిపూర్వక
తత్త్వ జిజ్ఞాసతో భగవాను
నాత్మవిశ్వాసముతో పూజింపవలె!

మాయా జనితంబగు ఇంద్రియ వాంఛలలోబడి,
సర్వంబదియేయని యెంచి సర్వేశ్వరున్ మరచి,
ఆత్మ పరమాత్మలు వేర్వేరని తలచి,
కల్గిన సుఖ ప్రాప్తి భగవదను
గ్రహమని మునిగి తేలుట తగదనెన్!

అటుల గాక ఎవ్వరేని విషయాసక్తులనొదిలి
కర్మంబులాచరించి, తామరాకుయందోయంబు బొట్టు వలె
అంటీముట్టని నిస్వార్ధపరులు
స్థితప్రజ్ఞులందురు సుమీ!

     ద్వాపర యుగమున ద్వారకనేలిన కృష్ణా ముకుంద రాయ
     కలియుగ ద్వారక తిరుమల వెలసిన వేంకట రాయ
     వెతలకు కలతతో తధ్యము నీపై గద్యము రాయ
     నెలతతో కూడి మెరుపుగ మమ్మాదుకొన మేమంత పరాయ?


పోలూరు బాబురావు, నూజివీడు

ధృవ తార

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


సర్వ శక్తి స్వరూపుడగు నారాయణుని పూజింపలేని చేతులేల?
సర్వ విజ్ఞానవంతుడగు శ్రీహరిని మనమందు తలుపలేని మనసు యేల?
సర్వ చైతన్య వ్యాపకుడగు విష్ణు చర్యలు కానరాని కన్నులేల?
సర్వోన్నతుడగు ఆ పురుషోత్తముని భక్తితో ఆకట్టుకోని ఆత్మ ఏల?

భక్తవత్సలుడగు ఆ పరమాత్మ వాత్సల్యమెరుగలేనన్న
భక్తవరేణ్యులగు ముని పుంగవుల బోధలెల్ల వినవలె
భక్త సులభుడగు నారాయణ తత్త్వమెల్ల తెలిసి
భక్తి పాశముతో మనమున శ్రీహరిని బందీగ చేసుకొనవలయు.

అట్టి భక్తాగ్రేసరులలో ప్రధమునిగా ధృవుని తెలిసి
పట్టుదలతో భక్తి పెంపు చేసుకుని మన్ననలందవలె!
బాల్య దశ యందే ఐదేళ్ళ వయసు నాడు
అమూల్య కోరికతో తన తండ్రి అంకంబునందు
శయనింప తండ్రి దరికేగ యాతండు
నెయ్యముగ గారవింపక చెయ్యని త్రోసిరాజనియె.
ధృవుడు కినుక వహించి
ధృడచిత్తముతో తన మనమందు
నిలుపుకున్నట్టి గరుడ వాహనారూఢుండగు మహా విష్ణు
పూజ సల్ప కానలకున్ జని ఘోర తపమాచరింప
కాలమే ఆగి దేవ గణాన కలకలము చెలరేగ
స్వయంభువుయగు విష్ణువే ధృవుని కడకేగి తన
పాంచజన్యమును తాకించి తపము చాలింప జేయించి
తనదు కోరిక తెలుపుమనిన, యంత ధృవుండు తనదు
అసలు కోరిక మరచి తానెన్నటికి సద్భక్తిపరునిగా
తన ధ్యాన చింతనతో వుండు వరమీయమని కోర,
ఆతని నిహలోక బంధములనుండి తప్పించి
నక్షత్ర మండలంబందు ధృవతారగా వెలుగొందునట్లు చేసి
భక్త సులభుడుగా విష్ణువు కీర్తి పొందినాడు.

పోలూరు బాబురావు, నూజివీడు

శుశ్రూష

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


ఆది మధ్యాంత రహితుడగు ఆ సర్వేశ్వరుండు
ఆది గురువై వేద విజ్ఞానమంతయు తెలిసి
     అదియు గురు ముఖతః తెలియగానెంచి
     కంసాది రాక్షస సంహార తదనంతరంబు
ఉగ్రసేనుని మధుర పట్టాభిషిక్తునింజేసి
తన అన్న బలరామునితో కూడి సాందీప ముని
     యొద్దకుంజనియె జ్ఞానాభిలాషియై.

అవ్విధంబుగ బలరామకృష్ణులు గురు సాందీపునియొద్ద విద్య గరపి
అరువదినాల్గువిధంబులగు కళలందు ఆరితేరి గురు మెప్పునొంది
     అద్వితీయంబగు కీర్తిబడసి గురుదక్షిణగా తమ కోరికేమిటని
     ఆ ద్విజుని ప్రశ్నింప, యాతన్డు సముద్ర స్నానమాచరించుటకేగిన
తనయు నీట మునిగి చనిపోయె గాన, ఎటులైన తన కుమారుని
సజీవునిగ జేసి తనకప్పగింపుమని కోరె!

అంత సర్వవ్యాపియగు ఆ పరమేశ్వరుండు తన మామ 
సముద్రుని తన గురు పుత్రునీయమని కోర,
     పాంచజన్యుడను రాక్షసుండు సముద్ర శంఖువై ఆ బాలునిన్ చేరదీసె
     నని విన్నవించె. నంత ఆ కృష్ణుండొక్కపరి సముద్రమున దూకి
ఆ రాక్షసున్ బరి మార్చి ఆ శంఖువునే పాంచజన్యమను
పేర తన ఆయుధంబుగ చేసికొనియె.

కృష్ణుడావిధంబుగ శంఖంబునొంది అది పూరించినపుడెల్ల
దేవతలకెల్లరకు శక్తి పెరిగి, దనుజులెల్లరు
     శక్తి హీనులై అసుర జాతి అంతమయ్యె!
     అంత సోదర ద్వయంబు యమపురికేగి
తమ గురు పుత్రు నాత్మ తమకొసగుమని యా యముని వేడ
యాతండటులనే యొసంగ ఆ గురు పుత్రుని వెంట గొనిపోయి
     తమ గురు సాందీపునకప్పగించి గురు ఆశీస్సులందె.

తమ గురు చెంతనున్నంత వరకు కృష్ణుండు ఏనాడు
     తాను భగవానునంశయని విన్నవించకపోయె. 

అదియె శిష్య శుశ్రూషయని తలచి గురునాధిక్యతను గౌరవించె.

పోలూరు బాబురావు, నూజివీడు